రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Monday, February 4, 2019

735 : సిడ్ ఫీల్డ్ ఇంటర్వ్యూ


        స్క్రీన్ ప్లేల మౌలిక నిర్మాణమేమిటని అడిగితే, ‘అందులో త్రీ యాక్ట్స్ వుంటాయి, ఇంకా...’ అంటూ ప్రారంభిస్తారు సినిమా రచయితలు. యాక్స్ట్ వారీగా కథల్ని విడగొట్టే విశ్లేషణా ప్రక్రియ షేక్స్ పియర్ కంటే చాలా కాలం ముందు నుంచీ వుంది. కానీ దానిని ఆధునిక సినిమా స్క్రీన్ ప్లేలకి సులభతరం చేసి వాడుకలోకి తెచ్చిన ఘనత సిడ్ ఫీల్డ్ కే దక్కుతుంది. స్క్రీన్ ప్లే స్ట్రక్చర్ కి మోడల్ పారడైంని రూపొందించి ప్రపంచవ్యాప్తంగా వర్క్ షాపులు నిర్వహిస్తూ, కొత్త తరం సినిమా రచయితలకి శిక్షణనిచ్చిన ఆయన మూవీ స్ట్రక్చర్ టెక్నిక్ కి గాడ్ ఫాదర్ గా పేర్గాంచారు. ఈ క్రమంలో ఆయన రాసిన పుస్తకాలు - స్క్రీన్ ప్లే (1979) , ది స్క్రీన్ రైటర్స్ వర్క్ బుక్ (1988), ది స్క్రీన్ రైటర్స్ ప్రాబ్లం సాల్వర్ (1998) - మొదలైనవి 395 కళాశాలల్లో, విశ్వవిద్యాలయాల్లో బోధనాంశాలు కావడమే గాక, 19 భాషల్లో అనువాదమయ్యాయి. ఇంకా,  ఫోర్ స్క్రీన్ ప్లేస్ - స్టడీస్ ఇన్ ది అమెరికన్ స్క్రీన్ ప్లే (1994), గోయింగ్ టు ది మూవీస్ ( 2001), ది డెఫెనెటివ్ గైడ్ టు స్క్రీన్ రైటింగ్ (2003), సెల్లింగ్ ఏ స్క్రీన్ ప్లే (2005)  అనే మరో  నాలుగు పుస్తకాలూ రాశారు. 

         
జేమ్స్ ఎల్ బ్రూక్స్, లూయిస్ మడోంకీ, టోనీ కెయ్, రోనాల్డ్ జొఫ్ వంటి దర్శకులతో పని చేశారు. అన్నా హేమిల్టన్, జాన్ సింగిల్టన్, రాండీ మేయమ్ సింగర్, మైకేల్ కేన్, కెవిన్ విలియమ్సన్ మొదలైన హాలీవుడ్ రచయితలు ఆయన విద్యార్ధులు. ట్వెంటీయత్ సెంచురీ ఫాక్స్, డిస్నీ స్టూడియోస్, యూనివర్సల్ స్టూడియోస్, ట్రిస్టార్ పిక్చర్స్ నిర్మాణ సంస్థలకి స్పెషల్ స్క్రిప్ట్స్ కన్సల్టంట్ గా వున్నారు. ఈ నేపధ్యంలో స్క్రీన్ ప్లే  స్ట్రక్చర్ గురించి ఆయన చెప్పిన కొన్ని ముఖ్యాంశాలు ఈ కింది ఇంటర్వ్యూలో తెల్సుకుందాం...

          Q: మీ పారాడైం మోడల్ కాలక్రమంలో ఎలా పరిణామం చెందుతూ వచ్చింది?
         
A:  నిజమైన పరిణామం ప్లాట్ పాయింట్ వన్, మిడ్ పాయింట్, ప్లాట్ పాయింట్ టూ లని ప్రతిపాదించిన తర్వాతే జరిగింది. వీటికి పించ్ 1, పించ్ 2 లని కలిపాను. ఇది జరిగి చాలా చాలా సంవత్సరాలైంది. కానీ నిజానికి నేను తెలుసుకున్న దేమిటంటే, పారాడైంని నవీకరించాలనుకున్నప్పుడల్లా దాని రూపం మాత్రం చెక్కుచెదరని శాశ్వతతత్వంతో కూడి వుంటుందనేది. పారడైం అనేది ఒక రూపమే అయినా, అది ఫార్ములా మాత్రం కాదు మార్పు చెందుతూ వుండడానికి. ఆ రూపంలో బిగినింగ్, మిడిల్, ఎండ్ కథన విభాగాలు వుండకుండానూ పోవు. కొంతకాలం క్రితం నా స్ట్రక్చర్ (పారడైం) మోడల్ కి నేనిస్తున్న ప్రాముఖ్యాన్ని కాస్త తగ్గించుకోవాలని నిర్ణయించాను. ఒక టీచింగ్ క్లాసులో పారడైం గురించి బోధిస్తున్నప్పుడు, ఒక స్టూడెంట్ లేచి, ‘ఇదంతా నాకు తెల్సు, చాలా పాతబడ్డ విషయం’ అని అసంతృప్తి వ్యక్తం చేశాడు. అప్పుడు గ్రహించాను. పారడైం అనేది మూవీ కల్చర్ నరనరాన జీర్ణించుకు పోయాక, నేనింకా దీని గురించి బోధించాల్సిందేమీ లేదని. దీనికంత ప్రాముఖ్యాన్నివ్వ కూడదనీ. ఇక క్యారెక్టర్ ఎలిమెంట్స్ వైపు దృష్టి సారించాలనీ. స్ట్రక్చర్ మారేది కాదు, టైం అండ్ స్ట్రక్చర్ పై నేనిక పనిచేయాలి. 

          Q:  మీ టెక్నిక్స్ ని ఉపయోగించుకుని ఏ కోవకి చెందిన రచయితలు - జానర్ పరంగా గానీ, కేటగిరీల పరంగా గానీ - ప్రయోజనం పొందుతున్నారంటారు? మిమ్మల్ని అధ్యయనం చేసిన రచయితల్లో ఒక కామన్ త్రెడ్ గా మీ టెక్నిక్స్ వ్యక్తమవుతున్నాయంటారా? 
          A:  ఇన్నేళ్ళుగా ఎందరో నా స్టూడెంట్స్ బేసిక్ స్వరూపాన్నే, అంటే పారడైంనే ఉపయోగిస్తూ వస్తున్నారు. స్క్రీన్ ప్లే టీచర్లు రాబర్ట్ మెక్ కీ, జాన్ ట్రుబీ, క్రిస్టఫర్ వోల్గర్ లు వాళ్ళదైన బలంతో వాళ్ళున్నారు. నేను కథా నిర్మాణం, సృజనాత్మకత - వీటికి ప్రాధాన్యమిచ్చాను. నా స్టూడెంట్స్  అసాధారణ విజయాలు సాధించారు. జేమ్స్ కెమెరాన్ ఒకసారి నాతో అన్నారు - నా ‘స్క్రీన్ ప్లే’  పుస్తకం చదివేవరకూ తను స్క్రీన్ ప్లేలు రాయగలనని అనుకోలేదట. దాంతో ‘టైటానిక్’, ‘టెర్మినేటర్’ లు రాశానన్నారు. నిజమే, ఎదురుగా 120 ఖాళీ పేజీలుంటే ఆ పేజీ లెలా నింపాలన్న సమస్య పెద్దదే. అర్ధం జేసుకోగలం. ఆ రోజుల్లో ఇప్పుడున్నన్ని  థియరీలు లేవు. మెక్ కీలూ, ట్రుబీలూ కూడా లేరు. వీళ్ళు నా తర్వాత వచ్చారు. కాలక్రమంలో తామేం చేయగలమో వాళ్ళు తెల్సుకుని వాళ్ళ విధానాలు ప్రచారం చేశారు. 

         
Q:  నేటి రచయితలు కామన్ గా చేసే తప్పులేమిటి? వాటినెలా నివారించాలి?
         
A:  డైలాగులతో కథ నడపడం చేస్తున్నారు. ఇమేజెస్ తో, పాత్రల బిహేవియర్స్ తో కథ చెప్పడం లేదు. ఇందుకే నేను ‘సీ బిస్కట్’ ని చాలా ఇష్ట పడతాను. ఇందులో బిహేవియరే ఎక్కువుంటుంది. డైలాగులు స్టోరీలైన్ కి ఇంసిడెంటల్ గా మాత్రమే వుంటాయి. ఇంకొక తప్పేమిటంటే, చాలా ఎక్కువ చెప్పేయాలనుకోవడం. డైలాగులు ఎక్కువ వాడేసి కథ చెప్పడమే కాదు, ఒకే కథలో ఎన్నెన్నో విషయాలు చెప్పడం కూడా చేస్తున్నారు. వాటికవే సంఘటనలు, పాత్రలూ డెప్త్ తో, డైమెన్షన్ తో కథని వెల్లడించాల్సి వుంటుందని తెలుసుకోవాలి. పాత్రల మీద కంటే కథనం మీద ఎక్కువ దృష్టి పెట్టకూడదు. నేను అది వివరించాలి, అది వివరించాలీ కదా అంటూంటారు. సినిమాల్లో ఏదీ వివరించక్కర్లేదు. 

        Q:  స్ట్రక్చర్ కీ, రచనా స్వేచ్ఛకీ పడదు కదా? మీరెలా బ్యాలెన్స్ చేస్తారు? కొందరు కార్డ్స్ మీద సీన్లు రాసి ప్రతీదీ స్ట్రక్చర్ లో వుండేట్టు సరి చూసుకుంటారు. మరికొందరు మామూలుగా కూర్చుని వాళ్లకి ఆసక్తి కలించిన సంఘటనల్ని పాత్రలకి కల్పించి రాసుకుంటూ పోతారు. మీరేమంటారు? 
          A:  రాయడం మొదలెట్టిన తర్వాత యాక్ట్ వన్, యాక్ట్ టూ, యాక్ట్ త్రీలలో ఆ సీన్లని  కూర్చాల్సి వచ్చినప్పుడు కొన్ని సీన్లు పడవు. వాటి స్థానంలో కొత్త సీన్లు వాటికవే పుట్టుకొస్తాయి. కాబట్టి స్ట్రక్చర్ నేపధ్యం లేకుండా క్రియేటివిటీ కుదరడం సాధ్యం కాదు. రచయితలకి స్ట్రక్చరే విముక్తి కల్గిస్తుంది. స్ట్రక్చర్ లేని క్రియేటివిటీ అనేది బందికానా. ఎటు వెళ్ళాలో తెలిసినప్పుడు అటు వెళ్ళే ప్రయాణాన్ని రూపొందించుకోవచ్చు. లారా ఎస్క్వైవల్ రాసిన ‘లైక్ వాటర్ ఫర్ చాకొలేట్’ నే తీసుకుందాం. తను ఆ నవలైతే రాసింది గానీ స్క్రీన్ ప్లేకి స్ట్రక్చర్ తెలియలేదు. స్ట్రక్చర్ అంటే ఆమెకి మహా భయం. మేము దాన్ని స్ట్రక్చర్ చేశాక, స్ట్రక్చర్ తో స్క్రీన్ ప్లే ఎంత సులభమై పోతుందో ఆవిడ సడెన్ గా గుర్తించింది.

         
Q:  సీన్లు అనుకోవడం వేరు, రాయడం పూర్తిగా వేరు. ఒక సీన్ని అప్రోచ్ అవాలంటే రైటర్ డజను మార్గాలు ఆలోచించాలా? ఆలోచించి తనకి బాగా నచ్చిన దాన్ని ప్రెజెంట్ చేయాలా? లేక ఆ డజను సీన్లూ రాసేసుకుని ఏది కరెక్టో చూసుకోవడం మంచిదంటారా?
         
A:  సీన్ల ఉద్దేశం కథని ముందుకు నడిపించడమో, లేదా పాత్ర గురించి కొత్త విషయాన్నివెల్లడించడమో అయివుంటుంది. ఈ రెండిట్లో ఏ ప్రయోజనం కోసం సీన్ని ఉద్దేశిస్తే ఆ ప్రకారం రూపకల్పన చేసుకోవాలి. 

         
Q:  కొత్తగా వచ్చే రచయితలు ముందు ఆత్మ పరిశీలన చేసుకుని తమకి చేతనయ్యే జానర్ లో కృషి చేయాలంటారా? ఆ జానర్ లో ఐదారు స్క్రీన్ ప్లేలు రాస్తూపోయి రాయడంలో పట్టు సాధించాలంటారా? లేక ఇప్పుడో కామెడీ రాసి తర్వాత డ్రామా రాయవచ్చంటారా?
         
A: రాసుకోవచ్చు. నేను వెస్టర్న్ తో రాయడం మొదలెట్టాను. తర్వాత సమకాలీన డ్రామా రాశాను. ఆ తర్వాత కామెడీ రాశాను. మళ్ళీ వెనక్కెళ్ళి వెస్టర్న్ రాశాను. యాక్షన్ / అడ్వెంచర్ రాసేప్పుడు నేనేక్కువ కంఫర్ట్ ఫీలయ్యాను. 

         
Q:  కామెడీకి నవ్వించడమే ప్రధాన లక్ష్యమైతే, ఇతర డ్రమెటిక్ జానర్లకి లేని మౌలికమైన ప్రత్యేకత ఏదైనా కామెడీ కాన్సెప్ట్ కి వుందంటారా?
         
A:  కామెడీ, ట్రాజడీ, ఫార్స్, మెలోడ్రామా ఇవి డ్రమెటిక్ జానర్లు. కామెడీ విలక్షణ జానర్. కామెడీకి మూలసూత్రం పాత్రలకి పరస్పర వ్యతిరేకమైన పరిస్థితిని సృష్టించి హ్యుమర్ మీద ఫోకస్ పెట్టడం. ‘గుడ్ బై గర్ల్’ మంచి ఉదాహరణ. ఇందులో ఒక ఫ్లాట్ లో ఇద్దరుంటారు. ఒకరు దాని ఓనర్, ఇంకొకరు ఖాళీచేసి వెళ్లి పోని వ్యక్తి. ఇందులోంచే కామెడీ పుడుతుంది. 

           Q:  ఏ కాన్సెప్ట్ నైనా కామెడీ లేదా డ్రామాగా రాయవచ్చంటారా? 
          A:  రాయవచ్చు. దేన్నయినా ఏమైనా చేయవచ్చు. పాయింటాఫ్ వ్యూని ట్విస్ట్ చేయగల్గితే దేన్నైనా ఇంకోలా మార్చేయ వచ్చు. 

         
Q:  కామిక్ క్యారెక్టర్స్ కి ఎక్కువ క్యారెక్టర్ ఆర్క్ ఇచ్చి, ఎక్కువ వ్యక్తిత్వ మార్పుకి లోనుజేస్తే, ఇంకెక్కువ ఐడెంటిటీ క్యారెక్టర్ కి ఏర్పడి సానుభూతి పొందే క్యారెక్టర్ గా మారిపోతుందంటారా? అప్పుడు నవ్వించే లక్ష్యానికి చెరుపు చేసినట్టవుతుందంటారా? అసలు కామిక్ క్యారెక్టర్స్ కి ఏదైనా విలక్షణీయత వుంటుందంటారా?
         
A:  ముందు కామిక్ క్యారెక్టర్స్ ఎప్పుడూ అవి  చేస్తున్నదే కరెక్ట్ అనుకోవాలి. అదే సమయంలో వాటికవి ఫన్నీ అని అనుకోకూడదు. అవి ఫన్నీగా కన్పించాలని ప్రయత్నిస్తున్నట్టు ఎప్పుడూ అన్పించకూడదు. అవేం సాధించాలనుకుంటున్నాయో దానికి పూర్తిగా  అంకితమైపోయి, చేసుకుంటూ పోవాలి. 

         
Q:  సిస్టం దగ్గరి కొద్దాం. రాసే టాలెంట్ వున్న రచయిత హాలీవుడ్ సిస్టంకి లోబడి రాస్తేనే గుర్తింపు పొందుతాడా, లేకపోతే సిస్టంకి భిన్నంగా చేసినా కూడా దృష్టిలో పడతాడంటారా?
         
A:  సిస్టంకి లోబడిన కథాకథనాలే చేయాల్సి వుంటుంది. ఎంతో ప్రేమించి రాసిన దాంట్లో చాలా వదులుకోవడానికి కూడా సిద్ధపడాల్సివుంటుంది. రచయిత రాసిందంతా తిరగ రాస్తారిక్కడ. రచయిత ఏమనుకుని మొదలెట్టాడో ఆ కథ వుండక పోవచ్చు. ఇదీ ఇక్కడి సిస్టం. 

         
Q: మనసు వర్సెస్ మార్కెట్ కొద్దాం. రచయిత తన మనసు చెప్పిందాన్ని రాసుకుపోవడం మంచిదంటారా మార్కెట్ తో నిమిత్తం లేకుండా? రాస్తున్నప్పుడు మార్కెట్ ట్రెండ్స్ ని పట్టించుకోనవసరం లేదంటారా?
         
A:  ఒక్క మనసుని నమ్ముకునే స్క్రీన్ ప్లేలు రాయగలం. మార్కెట్ ని వూహించగలిగే మార్గాలు లేవు. ఒక గుర్రాల సినిమా హిట్టయింది కాబట్టి అలాటిదే రాస్తే, అది పూర్తయి అమ్ముడుబోయేటప్పటికి, అమ్ముడుబోయి నిర్మించేటప్పటికి రెండేళ్ళు గడిచిపోతాయి. అప్పుడు గుర్రాల్ని ఎవరు కేర్ చేస్తారు? 

         
Q:  కొత్తగా వచ్చే రచయిత ఎంత దృష్టి రాయడం మీద, ఎంత దృష్టి మార్కెట్ మీద పెట్టాలంటారు?
         
A:  రాయడం పూర్తయ్యే వరకూ దేన్నీ మార్కెట్ చేయలేరు. ముందు రాయడం మీదే దృష్టి పెట్టాలి. ఆ తర్వాతే మార్కెటింగ్. క్రియేటివ్ గా వుంటూ ప్రేక్షకులకి ఏది పట్టేస్తుందో దాన్ని పట్టుకోగల్గే నేర్పు కలిగి వుండాలి. ఒక రచయిత నాకు స్క్రిప్టు పంపాడు. దాన్ని నాకెందుకు పంపాడో అర్ధంగాదు. మొదటి పది పేజీల్లో అతను ప్రొఫెషనలో కాదో చెప్పేయగలను.

లేవిస్ వార్డ్స్
(స్క్రీన్ రైటర్, ఫ్రీ లాన్స్ జర్నలిస్ట్)