రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

8, అక్టోబర్ 2015, గురువారం

సాంకేతికం- ఆర్ట్

ఆనంద్ సాయి
      కళా దర్శకుల క్రియేటివిటీ సెట్స్ వేయడం దగ్గరే ముగిసినప్పుడు షూటింగుల్లో వాళ్లకి పనుండేది కాదు. రచయితల్లాగే కళా దర్శకుల్నీ షూటింగ్ స్పాట్ లో పరదేశీలు గా చూసేవాళ్ళు. హాలీవుడ్ లోనూ ఇంతే. షూటింగుల్లో  ఆ సినిమా రచయిత కన్పిస్తే - ‘ వీడిక్కడికి ఎందుకొచ్చినట్టు?’ అన్నట్టు చూస్తారనీ రెండు ఆస్కార్ల రచయిత విలియం గోల్డ్ మాన్ రాశారు. తన సినిమా ప్రివ్యూకే వెళ్ళినా ద్వారపాలకుడు  రానియ్యలేదని సరదాగా పుస్తకం రాశారు ( అడ్వెంచర్స్ ఇన్ స్క్రీన్ ట్రేడ్). టాలీవుడ్ కి సంబంధించిన ఒక ప్రముఖ కళాదర్శకుడు ఆఫ్ ది రికార్డ్ గా చెప్పిన ప్రకారం-  షూటింగుల్లో దర్శకుడికీ కెమెరామాన్ కీ మధ్య కళాదర్శకుడు డిస్టర్బెన్స్!  నిర్మాతకి అనవసర ఖర్చు!!

          ధోరణి ఇప్పుడు మారింది. కనీసం భారీ వ్యయాలతో నిర్మిస్తున్న సినిమాలకి సంబంధించి! ఇప్పుడంతా డిజైనర్ లుక్ ప్రపంచం. కొత్తతరం దర్శకులు సినిమా ఆద్యంతం, ప్రత్యంగుళం ప్రొడక్షన్ ని స్టయిలిష్ గా డిజైన్ చేసేందుకు కళాదర్శకుల్ని కూడా కలుపుకుని పోతున్నారు. దీంతో దృశ్యాల్లో కన్పించే అన్ని సెట్ ప్రాపర్టీస్ మీదా  కళా దర్శకుడికి అధికారం వచ్చేసింది. దీని పర్యవసానం ఎలా వుందంటే,  హిందీ సినిమాల్లో కన్పించే డిజైనర్ ఫర్నీచర్, డోర్ కర్టెన్లు, ఆఖరికి టీపాయ్ మీది యాష్ ట్రేలూ సైతం చూసి ముచ్చట పడి, అలాటివి తమ ఇళ్ళల్లో తయారు చేయించుకుంటున్నారు ప్రేక్షకులు. ఇంతగా ప్రభావితం చేస్తోంది నేటి కళా దర్శకత్వం ప్రజల్ని. సరీగ్గా ఇలాటి మంచి ట్రెండ్లో టైం చూసుకుని ఎంటరయ్యారు ఆనంద్ సాయి. ఎంటరై పూర్తి ఇన్వాల్వ్ మెంట్ తో అద్భుతాలు చేస్తున్నారు ఆర్ట్ డైరెక్షన్ లో.

          ‘ఎక్కడా నా టచ్ ని మిస్ కానివ్వను, నాకు సంతృప్తి నివ్వంది ఏ  సినిమాకీ పని చెయ్యను. సంఖ్య కాదు నాకు ముఖ్యం, నాణ్యత’  అని తన వర్క్ కల్చర్ చెప్పుకొచ్చారు.

          అనుభవజ్ఞుడైన దర్శకుడికీ, కెమెరా మన్లకీ భిన్నంగా,  ఫ్రేముల్లో మీరింకేం విశేషం చూసి నిర్ణయిస్తారన్న ప్రశ్నకి, రసాత్మకతని చూస్తానన్నారు.

          సంగీత నాట్యాలు, సాహిత్య చిత్రలేఖనల్లాగే, వాస్తుకళ కూడా ప్రాచీన శాస్త్రాల మీద ఆధారపడింది. మరి అత్యవసరమైన ఈ మూలాలతో కూడిన భారతీయతని ఒక కళా దర్శకుడిగా మీరెంత వరకు సంతరించుకున్నారన్న మరో ప్రశ్నకి,  తన తండ్రి జీన్సే సహజంగా తనకి సంక్రమించాయన్నారు. 

         విఖ్యాత కళా దర్శకుడు బి. చలం ( 700 సినిమాలు) తనయుడైన ఆనంద్ సాయి అప్పటి విధానాలు తనకి సరిపడక తండ్రి అడుగు జాడల్లో నడవలేదు. ఇంటీరియర్ డెకొరేషన్ కోర్సు చేసుకుని చెన్నై లోనే ఆ బిజినెస్ పెట్టుకున్నారు. కానీ సినిమాలు ఆయన్ని వదల్లేదు.  ఒకసారి ఆ పెట్టిన బిజినెస్ లో అయన సృజనాత్మకతకి మెచ్చి, పవన్ కళ్యాణ్  ‘తొలిప్రేమ’ కి పనిచేయమని కోరారు. అంతే, ఇక తన విధానాలు అమల్లో పెట్టే టైం వచ్చేసిందని ఫీల్డులోకి ఎంటరై పోయారు ఆనంద్.

           రావడం రావడం ఏకంగా తాజ్ మహల్ నే సృష్టించారు. అది చూసి వారెవ్వా అనుకుంది ఫీల్డు. కానీ అవార్డుల కమిటీ ఆ తాజ్ మహల్  గ్రాఫిక్స్ అని భ్రమసి నంది అవార్డు లేదు పొమ్మంది. గ్రాఫిక్స్ ని అంతగా ఇష్టపడని తను, ఇప్పుడు చాలా మంది అనుసరిస్తున్న 50 శాతం సెట్,  50 గ్రాఫిక్స్ అనే విధానానికి పూర్తి వ్యతిరేకం. కళా దర్శకులు వేసే సెట్స్ కి మ్యాచయ్యే ప్రమాణాలతో కూడిన హై ఎండ్ కంప్యూటర్ గ్రాఫిక్స్ ఇంకా మన దేశానికి రాలేదన్నది తన అభిప్రాయం. కనుక ఎంత పెద్ద సెట్ అయినా పూర్తిగా ఫిజుకల్ గా నిర్మించే తీర్తారు తను. అసలు గ్రాఫిక్స్ కే ఖర్చు ఎక్కువన్నది తన నమ్మకం.

          ‘ గ్రాఫిక్స్ ని అలా ఉంచితే, డిజిటల్ ఇంటర్మీడియేట్ ( డీ ఐ) సంగతేమిటి? మీరొక సెట్ వేశాక, కెమెరామాన్ తన తరహా లైటింగ్ తో చిత్రీ కరిస్తాడు. ఆ చిత్రీకరణల మీద మళ్ళీ డీఐ  కలరిస్టు వచ్చేసి  ఆ లైటింగ్ నీ,  మీరు వాడిన సెట్ కలర్స్ నీ కూడా దిద్దుతాడు. అప్పుడు మీ ఒరిజినాలిటీ  ఎక్కడుంటుంది? మీ మీద కెమెరామాన్, కెమెరామాన్ మీద కలరిస్టూ చేయి చేసుకుంటూ పోతే, అంతిమ రూపం కలరిస్టుదే అవుతుంది కదా?’ అన్న సందేహానికి,  ఇలాటి సమస్యలు వస్తాయనే డీఐ మీద మంచి అవగాహన ఉన్న కెమెరామన్లతో పనిచేస్తున్నట్టు చెప్పుకొచ్చారు ఆనంద్.

           తిరిగి ఆయన ప్రొఫైల్ కొస్తే, ఈ పన్నెండేళ్ళలో  60 సినిమాలకి పని చేశారు. అన్నీ బిగ్ స్టార్స్ తో బిగ్ డైరెక్టర్ల  సినిమాలే. ఒక్క 2010 లోనే చూసుకుంటే, ‘అదుర్స్’,  ‘కొమరం పులి’, ‘ఖలేజా’, ‘బృందావనం’, ‘ఆరెంజ్’  అనే ఐదు బిగ్ సినిమాలకి కళా దర్శకత్వం వహించారు. ప్రస్తుతం ఎన్టీఆర్ ‘శక్తి’ కి, అల్లు అర్జున్ ‘బద్రీ నాథ్’ కీ పని చేస్తున్నారు. ‘శక్తి’ కి వేసిన పాతాళ  భైరవి సెట్ తన కళా ప్రతిభకి పరాకాష్ఠ. ఇందులో ముట్టుకుంటే స్థంభాలు వెలుగుతాయి, పట్టుకుంటే కత్తులు ప్రకాశిస్తాయి. ఇంతవరకూ ఎక్కడా వెయ్యని 40 అడుగుల ఎత్తు, 120 అడుగుల పొడవు, 170 అడుగుల వెడల్పూ గల మెగాసెట్ అది. అలాగే ‘బద్రీనాథ్’ కి కులూమనాలీ లో భారీ దేవాలయం సెట్ వేశారు.

       వ్యక్తిగతంగా తెలుపు నలుపు సినిమాలిష్టం. ఎలాంటి గ్రాఫిక్స్, టెక్నాలజీ, రిఫరెన్సులూ కూడా లేని ఆ రోజుల్లో తన తండ్రీ,  ఏకే శేఖరూ కలిసీ వేసిన ‘చంద్ర లేఖ’  (1948) సినిమాలోని సెట్స్ ఈనాటికీ మర్చిపోలేనన్నారు. అలాగే ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ కి తన తండ్రి వేసిన మానస సరోవరం సెట్ ఒక పాఠమయిందని చెప్పారు.

          తన శైలి గురించి చెప్తూ, తక్కువ ఛాయలో కలర్స్, వేసింది సెట్ లా కాకుండా నిజ నిర్మాణంలా ఉంటూ,  కాస్త ఎత్తు ఎక్కువున్న సెట్స్ కన్పిస్తే,  అది ఆనంద్ సాయి బ్రాండ్ గా గుర్తు పట్ట వచ్చన్నారు. ‘ఖలేజా’  లో రాజస్థాన్ గ్రామం సెట్, నిజంగా గ్రామంలానే అన్పించడాన్ని మనం చూశాం. ఇకపోతే  ప్రాచీన కట్టడాల్ని పరిశీలించడానికి తరచూ విదేశీ యాత్రలు చేస్తారు ఆనంద్. కంప్యూటర్  మీద తను పని చెయ్యరు. చేత్తోనే డ్రాయింగ్స్ వేస్తారు. అదీ దర్శకుల ముందు కూర్చుని. డ్రాయింగ్స్ వేయలేని కళాదర్శకులు కూడా ఫీల్డులో కొనసాగ వచ్చనీ, అయితే అది ఎంతో కాలం సాగదనీ హెచ్చరించారు.

          కథని స్టార్స్ డామినేట్ చేయకూడదని అనుకుంటాం మనం. స్టార్స్ ని సెట్స్ డామినేట్ చేయకూడదని అంటారు టాప్ ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి.


-సికిందర్
(ఫిబ్రవరి 2011, ఆంధ్రజ్యోతి-‘సినిమాటెక్’ శీర్షిక)  


సాంకేతికం- ఎడిటింగ్

జి.జి. కృష్ణారావు

 శ్రీ రామరాజ్యంతో బాపూ రమణల రామాయణ అబ్సెషన్ తిరిగి వెండితెర మీద జ్వాజల్యమాన 
మవుతున్నప్పుడు మొట్ట మొదటిసారిగా 
ఆ క్యాంపులోకి  అడుగుపెడుతున్న కె. విశ్వనాథ్ స్కూలు ఎడిటర్ జి.జి. కృష్ణారావు...


                                    
                                 తానిప్పుడు శివాలయం నుంచి రామాలయంలోకి బదిలీ అయ్యారు. తన కెరీర్ లో కూడా ఇదే తొలి పౌరాణికమయ్యింది. ఆనాడు ఆదుర్తి సుబ్బారావుతో మొదలై,  దాసరి నారాయణరావుతో కొనసాగి, విశ్వనాథ్  దగ్గర  సెటిలైన తను నూరు సినిమాల ఓల్డ్ మాస్టర్. మూడు నందుల గ్రహీత. ప్రతిష్టాత్మక ‘శంకరాభరణం’ ఎడిటర్ కూడా.

                              ‘షాట్స్ స్పీక్స్..’ అని విశ్వనాథ్ గురించి చెప్పడం ప్రారంభించారు. ‘ఆయన షాట్సే కథ చెప్తాయి. ఎడిటింగ్ లో ఆయన స్మూత్ నెస్ ని కోరుకుంటారు. ‘శంకరాభరణం’ ఎడిటింగ్ విషయంలో ప్రత్యేకంగా నేను కష్ట పడిందేమీ లేదు. అన్ని సినిమాలకి లాగే దానికీ చేశాను. అప్పట్లో ఎడిటింగ్ కి నంది అవార్డు లేదు గానీ వుంటే తప్పకుండా నాకొచ్చేది ‘శంకరాభరణం’ కి..’ అని  చెప్పుకొచ్చారు. 


                              తర్వాత ‘సాగర సంగమం’, ‘శృతిలయలు’, ‘శుభసంకల్పం’ అనే మూడు విశ్వనాథ్ సినిమాలతోనే ఆలోటు కూడా తీరిపోయింది మూడు నందు లందు కోవడంతో!

                              స్మూత్ ఎడిటింగ్ ని పదేపదే ప్రస్తావించారాయన. కానీ ఇప్పుడు అలాంటి ఎడిటింగ్ కి కాలం తీరిందని మనకి తెలుసు. అలాంటప్పుడు ఈ రోజుల్లో ఒక ‘సింహా’ లాంటి భారీ యాక్షన్ సినిమాకి ఎడిటింగ్ చేయాల్సి వస్తే తన పరిస్థితేంటి?-  అనడిగితే- 

                               ‘ఆ ఏముందిలెద్దూ..ఆ రోజుల్లో దాసరి తీసిన చాలా సినిమాల్లో యాక్షన్ సీన్స్ కి ఏ ఆప్టికల్సూ వాడకుండా, అయినా ఎఫెక్టు తగ్గకుండా ఎడిటింగ్ చేశానుగా..’ అని  తేలిగ్గా నవ్వేశారు. 

                              ఈ నవ్వు తర్వాత  నిస్పృహ ...ఇవ్వాళ ఎడిటర్లు మనసు చంపుకుని పని చేస్తున్నారనేది ఒక వాస్తవం. దీన్ని ప్రస్తావిస్తే, ఆయన ఏకీభవిస్తూ- ‘వాట్ డైరెక్టర్స్ వాంట్ ఈజ్ అవర్ అట్ మోస్ట్ ప్రయారిటీ’ అన్నారు. ‘దర్శకులు ప్రేక్షకుల్ని ఆకట్టుకునేందుకు రకరకాల పద్ధతులు అవలంబిస్తారు విజువల్ గా..ప్రేక్షకులు కూడా ఎడిటింగ్ తీరుతెన్నుల్ని గమనిస్తున్నారు. జెర్కీ కట్స్ తో, వీలైనన్ని ఎక్కువ ఎఫెక్ట్సు వేస్తే ఎడిటింగ్ ఫస్టుగా చేశాడ్రోయ్ అనుకుంటున్నారు..పైకి మేం దర్శకుల, ప్రేక్షకుల టేస్టుకి ఓటేసినా, లోలోప బాధపడుతూనే వుంటాం.. అదసలు ఎడిటింగే కాదనుకుంటాం- ఏం చేస్తాం?’ అన్నారు నిస్పృహగా. 

                          ‘ఒకప్పుడు హీరో కొడితే కింద పడిపోయే వాడు విలన్..అది బావుందనుకున్నారు. తర్వాత గాల్లోకి లేచి కాస్సేపు అలా నిల్చిపోవడం మొదలెట్టాడు. ఇదీ బావుందనుకున్నారు. దీని తర్వాతేంటి? ఒక ‘రోబో’ ని  వదిలి  ప్రేక్షకుల్ని ఆకలి గొన్న పులుల్ని చేశారు. దీని తర్వాతేంటి? ఇలా ఎక్కడిదాకా పోతారు? ఎక్కడో ఒక చోట కుప్పకూలాల్సిందే. ప్రేక్షకులకి ఎంత ఎక్కువగా టెక్నాలజీ అలవాటు చేస్తే అంత ఎక్కువ కోరుకుంటారు. అందుకని సినిమాల్ని మంచి కథావస్తువుతో, మనస్సుకి హత్తుకునేలా విలువల్ని పెంపొందించేలా తీస్తే ఏ గొడవా వుండదు ’ అని వివరించారు.

                              ఒకప్పుడు ఫీల్ తో చేసిన ఎడిటింగ్ ఇప్పుడు మెకానికల్ గా మారిందన్నారు.
మూవీయోలా రోజుల్లో ఆ యంత్రంలో రీలు రన్ అవుతూంటే, సరైన షాటు కన్పించిందా- ‘ఇదిరా షాటూ!’ అని చేతులు చాచి ఉద్వేగంగా పట్టుకునే వాళ్ళమన్నారు. ఇప్పుడు ఎవిడ్ లో యాంత్రికంగా క్లిక్ చేసి సరిపుచ్చు కుంటు న్నామన్నారు.

                              దర్శకుడు ఎంతయినా ఫిలింని  ఎక్స్ పోజ్ చేయవచ్చు, కానీ ఒక దృశ్యంలో ఫీల్ ఎంత ఉండాలో తెలిసి ఎడిట్ చేసిన వాడే గొప్ప ఎడిటరని అన్నారాయన. ఒక్కో కథకీ ఒక్కో వేగంతో నడక (పేస్) ఉంటుందనీ, ఆ నడకని  కూడా దృష్టిలో పెట్టుకుని ఎడిటింగ్ చేయాల్సి ఉంటుందనీ అన్నారు. 


                              ఇప్పుడు సమ్మె కారణంగా ‘శ్రీరామ రాజ్యం’ ఎడిటింగ్ పనులు ఇంకా మొదలు కాలేదు. తగు మోతాదులో సీజీ వర్క్స్ ని కూడా కలిగివుండే ఈ సినిమా విషయంలో తనకి కంగారేమీ లేదని ధీమా వ్యక్తం చేశారు. గుడివాడ ఏఎన్నార్ కళాశాలలో బీఎస్సీ పూర్తి చేసిన కృష్ణా రావు, మిలటరీలో చేరబోయి ఎలాగో పూనా ఫిలిం ఇనిస్టిట్యూట్ లో ఎడిటింగ్ కోర్సులో పడ్డారు. 1961-62 లలో అప్పుడప్పుడే ఆ ఇనిస్టిట్యూట్ ప్రారంభమయింది. అప్పుడు అక్కడికి వచ్చిన  సుప్రసిద్ధ దర్శకుడు ఆదుర్తి  సుబ్బారావు కృష్ణారావుని చూసి- ‘యూ కమ్ అండ్ మీట్ మీ ఇన్ మెడ్రాస్’  అన్నారు.

                            అప్పుడు ‘మూగమనసులు’ ఎడిటింగ్ పనులు పూర్తి కావచ్చి,  ‘గౌరమ్మా  నీ మొగుడెవరమ్మా’ పాట దగ్గరుంది.. ఎడిటర్ టి. కృష్ణ కి అసిస్టెంట్ గా ఆ సినిమాకి పని చేసి, తర్వాత  ఆదుర్తే తీసిన ‘తేనేమనసులు’ కీ అసిస్టెంట్ గానే చేశారు. ఆతర్వాత ఆదుర్తి బాంబే  తీసికెళ్ళి తను తీస్తున్న ‘జ్వార్ భాటా’ (దాగుడుమూతలు) ఎడిటింగ్ బాధ్యతలప్పగించారు. అదే ఎడిటర్ గా కృష్ణారావు తొలి సినిమా. వడ్డే శోభానాద్రీశ్వర రావు తీసిన ‘పాడవోయి భారతీయుడా’ ఎడిటర్ గా తెలుగులో తన మొదటి సినిమా. 

                        మిలిటరీలో చేరిపోయే అవకాశం ఎలాగో తప్పినా, ఆ తర్వాత ఎడిటర్ గా ఢిల్లీ వెళ్లినప్పుడు అప్పుడున్న టీవీ కేంద్రంలో చేరిపోయారు. కానీ ఇలా నెలనెలా జీతం తీసుకుంటూ కాంప్రమైజ్ అయిపోవడమేనా, ఏమైనా రిస్కు చేసి నీ టాలెంటుని ఇంకా సువిశాలం చేసుకునేదేమైనా ఉందా? - అన్న టాక్ వచ్చి, అదృష్టంకొద్దీ ఆదుర్తి, దాసరి, విశ్వనాథ్ ల తర్వాత..ఇప్పుడు బాపూకి దక్కారాయన!


-సికిందర్ 
(జనవరి 2011, ఆంధ్రజ్యోతి- ‘సినిమాటెక్’ శీర్షిక)