ఆనంద్ సాయి |
కళా దర్శకుల క్రియేటివిటీ సెట్స్ వేయడం దగ్గరే ముగిసినప్పుడు
షూటింగుల్లో వాళ్లకి పనుండేది కాదు. రచయితల్లాగే కళా దర్శకుల్నీ షూటింగ్ స్పాట్ లో
పరదేశీలు గా చూసేవాళ్ళు. హాలీవుడ్ లోనూ ఇంతే. షూటింగుల్లో ఆ సినిమా రచయిత కన్పిస్తే - ‘ వీడిక్కడికి ఎందుకొచ్చినట్టు?’
అన్నట్టు చూస్తారనీ రెండు ఆస్కార్ల రచయిత విలియం గోల్డ్ మాన్ రాశారు. తన సినిమా ప్రివ్యూకే
వెళ్ళినా ద్వారపాలకుడు రానియ్యలేదని
సరదాగా పుస్తకం రాశారు ( అడ్వెంచర్స్ ఇన్ స్క్రీన్ ట్రేడ్). టాలీవుడ్ కి
సంబంధించిన ఒక ప్రముఖ కళాదర్శకుడు ఆఫ్ ది రికార్డ్ గా చెప్పిన ప్రకారం- షూటింగుల్లో దర్శకుడికీ కెమెరామాన్ కీ మధ్య కళాదర్శకుడు
డిస్టర్బెన్స్! నిర్మాతకి అనవసర ఖర్చు!!
‘ఎక్కడా నా టచ్ ని మిస్ కానివ్వను, నాకు సంతృప్తి నివ్వంది ఏ సినిమాకీ పని చెయ్యను. సంఖ్య కాదు నాకు ముఖ్యం, నాణ్యత’ అని తన వర్క్ కల్చర్ చెప్పుకొచ్చారు.
అనుభవజ్ఞుడైన దర్శకుడికీ, కెమెరా మన్లకీ భిన్నంగా, ఫ్రేముల్లో మీరింకేం విశేషం చూసి నిర్ణయిస్తారన్న ప్రశ్నకి, రసాత్మకతని చూస్తానన్నారు.
సంగీత నాట్యాలు, సాహిత్య చిత్రలేఖనల్లాగే, వాస్తుకళ కూడా ప్రాచీన శాస్త్రాల మీద ఆధారపడింది. మరి అత్యవసరమైన ఈ మూలాలతో కూడిన భారతీయతని ఒక కళా దర్శకుడిగా మీరెంత వరకు సంతరించుకున్నారన్న మరో ప్రశ్నకి, తన తండ్రి జీన్సే సహజంగా తనకి సంక్రమించాయన్నారు.
విఖ్యాత కళా దర్శకుడు బి. చలం (
700 సినిమాలు) తనయుడైన ఆనంద్ సాయి అప్పటి విధానాలు తనకి సరిపడక తండ్రి అడుగు
జాడల్లో నడవలేదు. ఇంటీరియర్ డెకొరేషన్ కోర్సు చేసుకుని చెన్నై లోనే ఆ బిజినెస్
పెట్టుకున్నారు. కానీ సినిమాలు ఆయన్ని వదల్లేదు. ఒకసారి ఆ పెట్టిన బిజినెస్ లో అయన సృజనాత్మకతకి
మెచ్చి, పవన్ కళ్యాణ్ ‘తొలిప్రేమ’ కి పనిచేయమని
కోరారు. అంతే, ఇక తన విధానాలు అమల్లో పెట్టే టైం వచ్చేసిందని ఫీల్డులోకి ఎంటరై
పోయారు ఆనంద్.
‘ గ్రాఫిక్స్ ని అలా ఉంచితే, డిజిటల్ ఇంటర్మీడియేట్ ( డీ ఐ) సంగతేమిటి? మీరొక సెట్ వేశాక, కెమెరామాన్ తన తరహా లైటింగ్ తో చిత్రీ కరిస్తాడు. ఆ చిత్రీకరణల మీద మళ్ళీ డీఐ కలరిస్టు వచ్చేసి ఆ లైటింగ్ నీ, మీరు వాడిన సెట్ కలర్స్ నీ కూడా దిద్దుతాడు. అప్పుడు మీ ఒరిజినాలిటీ ఎక్కడుంటుంది? మీ మీద కెమెరామాన్, కెమెరామాన్ మీద కలరిస్టూ చేయి చేసుకుంటూ పోతే, అంతిమ రూపం కలరిస్టుదే అవుతుంది కదా?’ అన్న సందేహానికి, ఇలాటి సమస్యలు వస్తాయనే డీఐ మీద మంచి అవగాహన ఉన్న కెమెరామన్లతో పనిచేస్తున్నట్టు చెప్పుకొచ్చారు ఆనంద్.
తిరిగి ఆయన ప్రొఫైల్ కొస్తే, ఈ పన్నెండేళ్ళలో 60 సినిమాలకి పని చేశారు. అన్నీ బిగ్ స్టార్స్ తో బిగ్ డైరెక్టర్ల సినిమాలే. ఒక్క 2010 లోనే చూసుకుంటే, ‘అదుర్స్’, ‘కొమరం పులి’, ‘ఖలేజా’, ‘బృందావనం’, ‘ఆరెంజ్’ అనే ఐదు బిగ్ సినిమాలకి కళా దర్శకత్వం వహించారు. ప్రస్తుతం ఎన్టీఆర్ ‘శక్తి’ కి, అల్లు అర్జున్ ‘బద్రీ నాథ్’ కీ పని చేస్తున్నారు. ‘శక్తి’ కి వేసిన పాతాళ భైరవి సెట్ తన కళా ప్రతిభకి పరాకాష్ఠ. ఇందులో ముట్టుకుంటే స్థంభాలు వెలుగుతాయి, పట్టుకుంటే కత్తులు ప్రకాశిస్తాయి. ఇంతవరకూ ఎక్కడా వెయ్యని 40 అడుగుల ఎత్తు, 120 అడుగుల పొడవు, 170 అడుగుల వెడల్పూ గల మెగాసెట్ అది. అలాగే ‘బద్రీనాథ్’ కి కులూమనాలీ లో భారీ దేవాలయం సెట్ వేశారు.
వ్యక్తిగతంగా తెలుపు నలుపు సినిమాలిష్టం. ఎలాంటి
గ్రాఫిక్స్, టెక్నాలజీ, రిఫరెన్సులూ కూడా లేని ఆ రోజుల్లో తన తండ్రీ, ఏకే శేఖరూ కలిసీ వేసిన ‘చంద్ర లేఖ’ (1948) సినిమాలోని సెట్స్ ఈనాటికీ
మర్చిపోలేనన్నారు. అలాగే ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ కి తన తండ్రి వేసిన మానస
సరోవరం సెట్ ఒక పాఠమయిందని చెప్పారు.
తన శైలి గురించి చెప్తూ, తక్కువ ఛాయలో కలర్స్, వేసింది సెట్ లా కాకుండా నిజ నిర్మాణంలా ఉంటూ, కాస్త ఎత్తు ఎక్కువున్న సెట్స్ కన్పిస్తే, అది ఆనంద్ సాయి బ్రాండ్ గా గుర్తు పట్ట వచ్చన్నారు. ‘ఖలేజా’ లో రాజస్థాన్ గ్రామం సెట్, నిజంగా గ్రామంలానే అన్పించడాన్ని మనం చూశాం. ఇకపోతే ప్రాచీన కట్టడాల్ని పరిశీలించడానికి తరచూ విదేశీ యాత్రలు చేస్తారు ఆనంద్. కంప్యూటర్ మీద తను పని చెయ్యరు. చేత్తోనే డ్రాయింగ్స్ వేస్తారు. అదీ దర్శకుల ముందు కూర్చుని. డ్రాయింగ్స్ వేయలేని కళాదర్శకులు కూడా ఫీల్డులో కొనసాగ వచ్చనీ, అయితే అది ఎంతో కాలం సాగదనీ హెచ్చరించారు.
కథని స్టార్స్ డామినేట్ చేయకూడదని అనుకుంటాం మనం. స్టార్స్ ని సెట్స్ డామినేట్ చేయకూడదని అంటారు టాప్ ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి.
-సికిందర్
(ఫిబ్రవరి 2011, ఆంధ్రజ్యోతి-‘సినిమాటెక్’ శీర్షిక)
(ఫిబ్రవరి 2011, ఆంధ్రజ్యోతి-‘సినిమాటెక్’ శీర్షిక)