రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

5, డిసెంబర్ 2019, గురువారం

896 : సందేహాలు - సమాధానాలు


Q : నాది ఒక ప్రశ్న. సైరా నరసింహా రెడ్డిసినిమా చూసిన వాళ్ళందరూ మేకింగ్ బావుంది, సీన్స్ బావున్నాయి కానీ 'కనెక్ట్' కాలేకపోయాం అంటున్నారు. మూవీతో, లేదా హీరో తో ఆడియన్ ఎప్పుడు కనెక్ట్ అవుతాడు? ఒక పాత్రని ఆడియన్ కి కనెక్ట్ చెయ్యాలంటే సీన్స్, క్యారెక్టరైజేషన్ ఎలా వుండాలి? ఎందుకు కొన్ని సినిమాల్లో హీరో పాత్రలకు త్వరగా కనెక్ట్ అవుతాం? వివరించగలరు.
ఎపి, AD
A:  సైరా’ ఆడియెన్స్ కనెక్ట్ గురించి ‘సైరా’ స్క్రీన్ ప్లే సంగతుల్లో చాలా వివరంగా ఇచ్చాం, మళ్ళీ ఒకసారి చూడగలరు. మీరు పాత్రతో కథ పుట్టిస్తారా, లేక కథతో పాత్ర పుట్టిస్తారా? ఏ కథా రచనకైనా ఇది మూల సూత్రం. చాలా మంది కథతో పాత్ర పుట్టిస్తారు. ఇదే అన్ని సమస్యలకీ మూలం. పాత్రని బట్టి కథ వుంటుందా, లేక కథని బట్టి పాత్ర వుంటుందా? ఎవరు కలం పట్టుకున్నా ఈ ప్రశ్న వేసుకోవడం ముఖ్యం. చాలా మంది కథనిబట్టి పాత్రని నడిపిస్తారు. ఇదే సమస్త సినిమా కష్టాలకీ మూలం. మీరు పాత్రతో ఎమోషన్ ఫీలవుతారా, లేక కథతో ఫీలవుతారా? కాగితాలు ముందేసుక్కూర్చున్న ప్రతీ కవి కుమారుడు లేదా కవి కుమారీ ఆలోచించాల్సిన విషయం. చాలా మంది కథతో పాత్రని తెగ ఫీలైపోబోతారు. ఇదే అన్నిబాక్సాఫీసు విలాపాలకీ మూలం.

        కథ ట్రాష్. రైటర్ రాసే కథ వొట్టి ట్రాష్. కథ పట్టుకుని కథ అల్లేవాడు కుక్క తోకట్టుకుని గోదారీదిన వాడితో సమానం. వాడి చేతిలో సినిమా కుక్కతో పాటే బంగాళాఖాతంలో హతం. రైటర్ రాసే కథ వొట్టి ట్రాష్. ఆ కథని నమ్ముకుంటే సృజనాత్మక ఆత్మహత్యే. కథతో పాత్ర పుట్టదు, పాత్రతోనే  కథ పుడుతుంది. పాత్ర అనుభవమే కథ పుట్టుకకి కారణం. పాత్ర లేకుండా అనుభవం ఆలోచిస్తారా? ఆలోచించలేరు కదా? అందుకని పాత్రతోనే అనుభవం, ఆ అనుభవంతోనే కథ. పాత్ర వివిధ పరిస్థితుల్లో ఏమనుభవిస్తోందో, ఆ అనుభవాల్లోంచి ఏం నిర్ణయాలు తీసుకుని ముందుకు పోతోందో, లేక వెనకడుగేస్తోందో తెలిపేదే కథ. ఆ అనుభవాల్లోంచి అది తీసుకునే నిర్ణయాలతో పుట్టేదే ఫీల్, ఎమోషన్, ఆడియెన్స్ కనెక్ట్  ఏదనుకుంటే అది. పాత్ర ఏమనుభవిస్తోందో తెలుసుకుంటూ పోతూంటే తీసుకునే ఆయా నిర్ణయాలని బట్టి అలాగలా కథ దానికదే పుట్టేసుకుంటూ పోతుంది. పనిగట్టుకుని పుట్టించాల్సిన పనుండదు.

        పాత్రతో కథ పుడుతూ ఆ కథని పాత్ర నడిపిస్తూంటే అది యాక్టివ్ పాత్ర. కథెప్పుడూ రైటర్ ది కాదు. పాత్ర పుట్టించి పాత్ర నడిపే కథకి రైటర్ గా తన పేరు ఫ్రీగా వేసుకోవచ్చు. అంతవరకే హక్కు. అంతకి మించి కథలో చేయి పెట్టడానికి లేదు. ఒక కథ నెలలు గడుస్తూన్నా తెమలక పోవడానికి కారణ మేమిటి? పాత్ర నడపాల్సిన కథలో తాము చేయిపెట్టి అష్టవంకర్లు తిప్పడమే. తమ ఆలోచనలు, అభిప్రాయాలు, భావాలు, ఫీలింగులు, ఎమోషన్లు కథలోకి తీసుకురావాలని విఫల యత్నాలు చేయడమే. అప్పుడా కథ పాత్రదవదు. రైటర్ దవుతుంది. అప్పుడా పాత్ర యాక్టివ్ పాత్రవదు. పాసివ్ పాత్రవుతుంది. యాక్టివ్ పాత్రెప్పుడూ తన నిర్ణయాలు తాను తీసుకుంటూ కొనసాగుతూ వ్యక్తిత్వ వికాసాన్ని ప్రకటిస్తుంది. పాసివ్ పాత్ర  రైటర్ ఆపాదించిన నిర్ణయాలతో వ్యక్తిత్వ వినాశాన్ని కొనితెచ్చుకుని కథని బలహీనం చేస్తుంది, లేదా విఫలం చేస్తుంది.

        కథ పట్టుకుని కథ ఆలోచించే రైటర్ లాజికల్ మైండ్ ని దూరం పెట్టేస్తాడు. ఎమోషనల్ మైండ్ తోనే రాస్తాడు. కథలో ఫీల్ కోసం తెగ ఫీలైపోతూ తనలోకంలో తానుండి పోతాడు. ప్రేక్షక లోకంలోకి రాడు. కానీ ఫీల్ అనేది రిలేటివ్ పదం. అది లాజిక్ మీద ఆధారపడకపోతే చాదస్తమైపోతుంది. లాజికల్ మైండ్ తో ఎమోషనల్ మైండ్ పనిచెయ్యక పోతే సగం బుర్ర పాత్ర, సగం బుర్ర కథా పుడతాయి. ఇది ‘రాజావారు రాణిగారు’ లో కూడా చూడొచ్చు.
 

        ఫైనల్ గా ఆడియెన్స్ కనెక్ట్ కి ఫార్ములా : ఒక యాక్టివ్ పాత్ర, అది లాజికల్ మైండ్ తో తన నిర్ణయాలు తను తీసుకుంటూ, అంచెలంచెలుగా కథ పుట్టిస్తూపోవడం, ఇంతే.

Q : ‘అర్జున్ సురవరం’ లో ఫస్టాఫ్ నిఖిల్ నకిలీ డిగ్రీ సర్టిఫికేట్ల కేసులో ఇరుక్కున్న తర్వాత సెకండాఫ్ లో ఆ స్కాంని బయట పెట్టి విలన్ని పట్టుకునే కథగా వుంది. కానీ సెకండాఫ్ బాగాలేదు. ఏమీ థ్రిల్ అనిపించలేదు. సెకండాఫ్ లో జరిగిన లోపాలేమిటో  వివరిస్తే మాకు హెల్ప్ అవుతుంది.
టి. రాజు, Asso
A:  ఆ సినిమా చూడలేదు. వీకీ పీడియాలో తమిళ వోరిజినల్ కథ చదివాం. రివ్యూలు కూడా చూశాం. తమిళంలోనే సెకండాఫ్ బాగాలేదని రివ్యూలిచ్చాక తెలుగులో ఎందుకు రీమేక్ చేశారో తెలీదు. స్కాంని బయట పెట్టి విలన్ని పట్టుకునే కథల్లో ఇంకా నావెల్టీ ఎక్కడుంది? అరిగిపోయిన టెంప్లెట్. ఆ మధ్య హిందీలో ‘వై చీట్ ఇండియా’ అని వచ్చింది. ఇందులో హీరో డబ్బున్న విద్యార్థుల దగ్గర డబ్బులు తీసుకుని, తెలివైన పేద విద్యార్ధులకి కొంత డబ్బిచ్చి ఎంసెట్ పరీక్షలు రాయించి, డబ్బున్న విద్యార్ధుల్ని పాస్ చేయిస్తూంటాడు. ఈ కథ సెకండాఫ్ లో ఏమవుతుందంటే, అదే హీరో మాస్ కాపీయింగ్ చేయించే కథగా మారిపోతుంది. రెండూ వేర్వేరు కథలు. ఫ్లాపయింది. రెండు కథల్లో కూడా చీటింగ్ మాఫియా అయిన హీరోని పట్టుకోవడమే థీమ్. హీరోని పట్టుకుంటే మనకేంటి, పట్టుకోకపోతే మనకేంటి?

        మీరనే సినిమాలో హీరోని ఇరికించిన విలన్ ని పట్టుకున్నంత మాత్రాన మనకేంటి? హీరో దోషి అయితే ఎవరిక్కావాలి, నిర్దోషి అయితే ఎవరిక్కావాలి? ఈ కథలు పాతబడి పోయాయి. వీటికి  రివర్సల్ కావాలి. ఇరుక్కున్న హీరో ఇరుక్కోలేదనీ, బుద్ధిపూర్వకంగానే నకిలీ సర్టిఫికెట్లు కొన్నాడనీ రివర్సల్ చేస్తే కొత్త కథవుతుంది. ఇలా నకిలీ సర్టి ఫికెట్లు కొంటున్న వాళ్ళు అనేకం  వుంటున్నారు. దీని విష పరిణామాలు చూపిస్తే కథ కొత్త తావులకి విస్తరిస్తుంది. కొత్త విషయాలు చెప్తుంది. కథ వెనుక కథ చెప్తుంది. అంటే నకిలీ సర్టిఫికేట్లు కొనేవాళ్ళ నైతిక, సామాజిక స్థితి ఏ గతి పడుతుందో చెప్తుంది. ప్రాక్టికల్ కథవుతుంది. గతవారమే ఉత్తరప్రదేశ్ లో వేల మంది టీచర్లు నకిలీ సర్టి ఫికేట్లతో పనిచేస్తున్నారని బయటపడింది. ఇప్పుడు వీళ్ళ గతేమిటి? డ్రమెటిక్ క్వశ్చన్ ఇక్కడ నేరం చుట్టూ వుండాలి. నేరస్థుడ్ని పట్టుకునే దొంగా పోలీసాటతో కాదు.

        అనిల్ కపూర్ నటించిన ‘మేరీ జంగ్’ (శోభన్ బాబుతో ‘విజృంభణ’) లో ఇంజెక్షన్ మార్పిడి హత్య కుట్రలో లేడీ డాక్టర్ ఇరుక్కుంటే, లాయరైన అనిల్ కపూర్ పని కుట్ర దారుడ్ని పట్టుకోవడం కాదు. ఆమె పేషంట్ కిచ్చిన ఇంజెక్షన్ విషపూరితం కాదని నిరూపించి ఆమెని కేసులోంచి బయటపడెయ్యడం. కుట్రదారుడ్ని పట్టుకోవడమే కథయితే పస వుండేది కాదు. సెకండాఫ్ కూడా అదే కథయి బోరు కొట్టేది. అందుకని విషపూరితం కాదని కోర్టులో నిరూపించడానికి ఆ విషపూరిత ఇంజెక్షన్ని తాగేస్తాడు. ఇదీ రివర్సల్. అంటే ప్లాట్ పాయింట్ వన్ దగ్గరికి తెచ్చి కథని విరిచెయ్యడం. కొత్తదారి పట్టించడం. దీంతో ఏమవుతుందంటే సెకండాఫ్ కథ విరక్కుండా వుంటుంది. విరిచేదేదో ఫస్టాఫ్ లోనే ప్లాట్ పాయింట్ వన్ దగ్గర ఒకటి అనుకుంటే ఇంకోటి జరిగేట్టు విరిచిస్తే, సెకండాఫ్ తో గొడవే వుండదు. అంటే సెకండాఫ్ సిండ్రోమ్ లో పడి సినిమా బే ఆఫ్ బెంగాల్ అవదు.

        తర్వాత ఇదే కోర్టు కేసు తదనంతర పరిణామాల్లో కుట్రదారుడు బయట పడతాడు. వాడెవడో కాదు, అనిల్ కపూర్ పాత్ర తల్లిని దూరం చేసిన వెధవే. ఇప్పుడు వాడి అంతు చూస్తాడు. ఇది గోల్ రివర్సల్. ఒక గోల్ తో బయల్దేరిన పాత్రకి అందులోంచి ఇంకో గోల్ ఎదురవడం. సాధారణంగా మొదటి గోల్ ఫిజికల్ గోల్ గా పూర్తవుతుంది. పూర్తయిన ఈ ఫిజికల్ గోల్ లోంచి ఎమోషనల్ గోల్ పుట్టుకొస్తుంది. మొదట డాక్టరమ్మని కాపాడడం అనిల్ కపూర్ ఔటర్ (ఫిజికల్) గోల్ గా వుండింది.  తర్వాత అదే గోల్ లోంచి తెలిసిపోయిన విలన్ అంతు చూడ్డం తల్లి కథతో ఇన్నర్ (ఎమోషనల్) గోల్ అయింది. స్టార్ వార్స్, కెప్టెన్ అమెరికా వంటి వాటిలో కూడా గోల్ రివర్సల్స్ చూడొచ్చు.

సికిందర్