రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

31, ఆగస్టు 2021, మంగళవారం

1054 : రివ్యూ

రచన - దర్శకత్వం: కరుణ కుమార్  
తారాగణం: సుధీర్ బాబు, ఆనంది, నరేష్, రఘు బాబు, పావెల్ నవగీతన్, అజయ్, హర్షవర్ధన్, సప్తగిరి, సత్యం రాజేష్ తదితరులు
కథ : నాగేంద్ర కాశీ, సంగీతం: మణిశర్మ , ఛాయాగ్రహణం : షందత్ సైనుద్దీన్
బ్యానర్ : 70 ఎంఎం ఎంటర్ ప్రైజెస్,
నిర్మాతలు: విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి
విడుదల : ఆగస్టు 28, 2021

***
      మొత్తానికి సుధీర్ బాబు డీ గ్లామరైజుడు పాత్రతో వచ్చాడు. బడుగు జీవి నటనకి ఒప్పుకున్నాడు. సిక్స్ ప్యాక్ బడుగు జీవి. సల్మాన్ ఖాన్ లా అనవసరంగా షర్టు విప్పే అవసరం హీరో లెవరికీ రాదు, సిక్స్ ప్యాక్ వుంటేనే చూపించాలి కాబట్టి షర్టు విప్పే అవసరం వస్తుంది. కమెడియన్- హీరో సునీల్ కీ తప్పలేదు. బాడీ సిక్స్ ప్యాక్ వుంటే సరిపోతుందా, చేసే సినిమా ప్యాకేజీ సరిగ్గా వుండక్కర్లేదా అనేది సుధీర్ బాబుతో ప్రశ్న. టైటిల్ ప్రకారం సోడా వాటర్ అన్నిసార్లు తాగినా అది హీరోయిన్ ని మెప్పించడం కోసమే, ప్రేక్షకుల్ని మెప్పించడానికి? అలాగే పలాస అనే రియలిస్టిక్ తీసిన దర్శకుడు కరుణ కుమార్ తిరిగి అదే కుల సమస్యతో కమర్షియల్ టైటిల్, హంగూ ఆర్భాటాలతో ఈసారి వచ్చాడు. ఈ రియలిస్టిక్ లో రియలిస్టిక్ ఎంత? దేని గురించి ఈసారి కథ? ఇవి చూద్దాం...
కథ

      అమలాపురంలో సూరిబాబు (సుధీర్ బాబు) ఎలక్ట్రీషియన్. అక్కడే సంజీవరావు (నరేష్) శ్రీదేవి సోడా సెంటర్ నడుపుతూంటాడు. శ్రీదేవి (ఆనంది) అతడి కూతురు. ఒక ఉత్సవంలో ఈమెని చూసి ప్రేమిస్తాడు సూరిబాబు. ఆమే ప్రేమిస్తుంది. అతడి కులం చూసి అడ్డుపడతాడు తండ్రి. ఈ తండ్రి కులస్థుడు కాశీ (పావెల్ నవగీతన్) వుంటాడు. ఇతను పడవల పోటీల్లో సూరిబాబుతో గొడవపడి అనుచరుడి చేత సూరిబాబు తండ్రిని అవమానిస్తాడు. ఈ గొడవలో సూరిబాబు అనుచరుణ్ణి పొడిచేస్తాడు. దీంతో సూరిబాబు- శ్రీదేవి పారిపోయి పెళ్ళి చేసుకుందామనే ప్రయత్నం విఫలమై సూరిబాబు జైలుకి పోతాడు. ఇప్పుడీ ప్రేమ ఏమైందనేది మిగతా కథ.

ఎలావుంది కథ

      పలాస లాంటి రియలిస్టిక్ జానర్ తీసిన దర్శకుడు కరుణ కుమార్ నుంచి అదే కుల సమస్యతో ఈసారి కాంప్రమైజ్ అయిన మూస ఫార్ములా ప్రేమ వచ్చింది. ట్రాజడీతో ముగిసే మరో ఆనర్ కిల్లింగ్ కాన్సెప్టు. కుల సమస్యతో మామూలు ప్రేమ సినిమాలే కాలాన్ని బట్టి మారకుండా కూర్చున్నాయి మారుతున్న నూనూగు మీసాల తరాల ముందు ఏమిటో అర్ధం గాకుండా. దీనికి ఆనర్ కిల్లింగ్ జోడింపు ఈ మధ్య ట్రెండ్ గా మారింది. కులం గెలిచి ప్రేమ ఓడిపోయే అవే అభ్యుదయ వ్యతిరేక భావజాలాలతో. కులాంతరం చేసుకోకండ్రోయ్ ఛస్తారు - అని మెసేజిలిస్తున్నట్టు ఆధిపత్య భావజాల ముక్తాయింపులతో. కులాలుండ కూడదంటూనే ఈ రకమైన కథలతో. ఇక కుల సమస్య ఎప్పుడు పోవాలి? డబ్బు ముందు కులం అప్రధానమై సంబంధాలు కలుపుకుంటున్న వైనాలు ఇంకా సినిమా కథలకి పనికిరావు కాబోలు.       

        ఈ కథతో జానర్ కల్తీ ఇంకో సమస్య. రియలిస్టిక్ కథకి రొటీన్ అరిగిపోయిన, లేదా కాలం చెల్లిన ఫార్ములా టెంప్లెట్ ప్రేమ జోడింపు. సుధీర్ బాబు లాంటి కమర్షియల్ హీరోతో సినిమా కాబట్టి రియలిస్టిక్ కథ రూపురేఖలు మారిపోవడం. రియలిస్టిక్ కథలతో ఇలా కాంప్రమైజ్ అవడంకన్నా కమర్షియల్ దర్శకులుగా మారిపోవడమే బెటర్. రియలిస్టిక్ కథల మార్కెట్ అంతర్జాతీయం. దర్శకులు రియలిస్టిక్ సినిమాల్ని ప్రాంతీయ సినిమాలుగా భావిస్తే తప్ప తెలుగు రియలిస్టిక్స్ తో జాతీయ- అంతర్జాతీయ దృష్టి నాకర్షించలేరు.

        దేశంలో వివిధ ప్రాంతీయ భాషల యువ దర్శకులు చేస్తున్నదిదే. పడ్డాయి అనే తుళు సినిమాతో అభయ సింహా ఇదే చేశాడు. రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. ఇతను షేక్స్ పియర్ మాక్బెత్ ని మత్స్యకారుల రస్టిక్ కథగా, పచ్చిగా, కళాత్మకంగా తీసి జాతీయ అవార్డులు పొందాడు. ఇంకా కమర్షియల్సే మెయిన్ స్ట్రీమ్ కాదు, కోవిడ్ పుణ్యాన రియలిస్టిక్స్ కూడా ఇప్పుడు మెయిన్ స్ట్రీమే. ఎగబడి చూస్తున్నారు ప్రేక్షకులు. కాబట్టి మూసఫార్ములా పోకడలు పక్కనబెట్టి, భయపడకుండా వాస్తవికతని ప్రతిబింబించే పక్కా పవర్ఫుల్ రియలిస్టిక్స్ తో తమ ప్రత్యేకతేదో చాటుకోవడమే చేయాలి.

        కథకి కథా ప్రయోజనమనే దొకటుంటుంది. ఈ కథతో ఏం చెప్పదల్చారు? కులం తప్పి ప్రేమిస్తే చావు తప్పదనేనా? ప్రేమికులారా మీరింకేం చేయలేరనేనా? అయితే ఇది కథా ప్రయోజనం ఆలోచించని కథ.

నటనలు- సాంకేతికాలు

     సుధీర్ బాబు కింది కుల పాత్రలో తన ఇమేజితో అసహజత్వం కనబడనీయకుండా మమేకమై నటించాడు. కొన్ని కీలక దృశ్యాల్లో కమర్షియల్ హీరోగా ఇమేజి కూడా చూసుకోవాలి కాబట్టి ఆ బిహేవియర్ లో హీరోయిజం ప్రదర్శించాడు. రోమాన్స్ లో రెగ్యులర్ లవర్ బాయ్ నటనే. ఐటెం సాంగ్ లో మాస్ హీరో అయ్యాడు. సంఘర్షణలో, ప్రేమలో విషాదంలో రియలిస్టిక్ పాత్రకి దిగివచ్చాడు. అన్నిటి కంటే ఏడ్పు దృశ్యాల్లో బాగా రాణించాడు. కమర్షియల్ సినిమాలు చేసే తనకి తనలోని నటుణ్ణి పరీక్షించుకునే అవకాశాన్ని ఈ సినిమా ఇచ్చిందని చెప్పొచ్చు.    

        సిక్స్ ప్యాక్ హీరోగా పడవల పోటీల్లో ఎక్స్ ఫోజ్ అయి, ఆ తర్వాత ప్రతీ ఫైట్ సీన్లో యాక్షన్ హీరో టైపులో విజృంభణ కొనసాగించాడు. ఇక్కడొక ప్రశ్న వస్తుంది : అంత సిక్స్ ప్యాక్ హీరో అయినప్పుడు హీరోయిన్ ని కాపాడుకో లేడా? ధైర్యంగా నిలబడి పెళ్ళి చేసుకోకుండా, హీరోయిన్ ని లేపుకు పోయి పెళ్ళి చేసుకోవడ మేమిటి? అలాంటప్పుడు సిక్స్ ప్యాక్ దేనికి సిద్ధం చేసుకున్నాడు? బడుగుజీవి పాత్రకి సిక్స్ ప్యాక్ అవసరమా? ఈ కాన్సెప్ట్ కి ఏది అవసరం- కమర్షియల్ పాత్రా, రియలిస్టిక్ పాత్రా? ఇది తేల్చుకోక పోవడంతో ఈ సమస్య. గ్లోబల్ జంబో ప్యాక్ రాంబో తో ఈ కథ తీస్తే ఎలా వుంటుందో అలా వుంది. దీనికి పరిష్కారం? పడవల పోటీల్లో అలా షర్టు విప్పి సిక్స్ ప్యాక్ సంపద చూపించకుండా వుంటే సరిపోతుంది.

        హీరోయిన్ ఆనంది ఎప్పటిలానే ఛార్మింగ్. కాలేజీ కెళ్తూ సోడా షాపులో తండ్రికి సహకరించే శ్రీదేవి పాత్రలో మొదట గ్లామరస్ గా, బలంగా వుంటూ ఆసక్తి రేపే నటనే  కనబరుస్తుంది. కానీ ప్రేమలో సమస్యలో పడ్డాకే తద్విరుద్ధంగా బలహీనురాలిగా మారిపోతుంది పాత్ర. ఇలా బలహీనమవడానికి తండ్రి ఏదైనా ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేసి వుంటే జస్టిఫికేషన్ వుండేది. అలాంటిదేమీ లేకుండా యూటర్న్ తీసుకోవడం  సహేతుక పాత్ర చిత్రణ అన్పించుకోదు.

        తండ్రి ఆమెని బందీగా వుంచి ఒక సంబంధం చూసి ఓ పెళ్ళి చూపులయ్యాక, వచ్చి హీరోని కలుసుకుంటుంది. హీరో తానెంత ప్రేమిస్తున్నాడో నిరూపించుకున్నాక, నా ప్రేమని ఎలా చూపించనూ - అని వెంటనే లైంగికంగా నిరూపించుకుంటుంది. ఆ తర్వాత అతడితో పారిపోతుంది. తండ్రి పట్టుకొచ్చి ఇంకో సంబంధం చూసి పెళ్ళి చేసేస్తాడు. ఇదంతా గజిబిజిగా వుంటుంది. వేరే పెళ్ళి చేస్తూంటే- నాకు హీరోతో ఏ టూ జెడ్ అన్నీ అయిపోయాయని చెప్పేస్తే ఆ పెళ్ళి తప్ప వచ్చు. చెప్పాల్సిన సమయంలో ఈ మాట చెప్పకుండా, చెప్పకూడని సమయంలో చెప్పకూడని మాట అనేస్తుంది. శోభనం రాత్రి ఆ భర్తని గాయపర్చి గొడవ చస్తుంది. కులపెద్ద సహా అందరి ముందూ సీన్ క్రియేట్ చేసి, తన చావు తను తెచ్చుకునే మాటలనేస్తుంది- మొగుడు చేత కాని వాడని చెబుతూ వూరంతా పడుకుంటానంటుంది. ఇప్పుడర్ధమయ్యే వుంటుంది ఈ ఆనర్ కిల్లింగ్ కాన్సెప్ట్ కూడా ఎంత డొల్లగా వుందో.

    నాకు హీరోతో ఏ టూ జెడ్ అన్నీ అయిపోయాక ఇలా పెళ్ళి చేశారు చూడండీ- అని చెప్పుకుంటే ఒక అర్ధం, సానుభూతి. వూరంతా పడుకుంటానంటే ఏ కులస్థులు, ఏ కుల పెద్ద వూరుకుంటారు. ఇప్పుడు తన ఆనర్ కిల్లింగ్ కి కారణ మెవరు, తనే! తను పేలిన మాటలే. కుల పెద్దనో, తండ్రినో దూషించాల్సిన అవసరమే లేదు. ప్రేమించిన వాణ్ణి పెళ్ళి చేసుకుంటానంటే చంపడం తప్పే కావచ్చు, వూరంతా పడుకుంటానంటే పెద్దల్ని తప్పుబట్టడానికేమీ వుండదు, చట్టం దానిపని అది చేసుకుపోవడం తప్ప. చట్టంలో ఆనర్ కిల్లింగ్ కి నిర్వచనమే లేదు. అదో హత్య, అంతే. అలా మాటలు పేలి సమర్ధించుకునే అవకాశం పెద్దల కిచ్చేసింది తను.

        తండ్రి పాత్రలో నరేష్ టాప్ నటన కన్పిస్తుంది. క్లయిమాక్స్ దృశ్యాల్లో మానసిక సంఘర్షణ ప్రదర్శించిన తీరు నిజంగా ప్రశంసనీయం. కృత్రిమ డ్రామా కాకుండా ఆర్ట్ సినిమా తరహా వాస్తవిక నటనతో తానున్న పరిస్థితికి అద్దం పట్టాడు. విలన్ గా నటించిన పావెల్ నవగీతన్ మాత్రం చాలా మైనస్ ఈ కథకి. ఇంత బలహీన విలన్ సిక్స్ ప్యాక్ సుధీర్ బాబుకి కుదర్లేదు. సుధీర్ బాబు తండ్రిగా రఘుబాబు నేపథ్యంలో వుంటాడు. సెకండాఫ్ లో కనిపించడు. ఫస్టాఫ్ లో విలన్ అనుచరుడు అవమానించే సంఘటన అట్రాసిటీ కేసు కిందికొస్తుంది. ఇదేమీ ఈ రియలిస్టిక్ కథకి పట్టలేదు, ఫార్ములా కథ కింద సర్దేసినట్టున్నారు. సుధీర్ బాబు పక్క కమెడియన్ గా సత్యం రాజేష్, అతిధి పాత్రలో కమెడియన్ సప్తగిరి కన్పిస్తారు.

        విజువల్స్ బావున్నాయి షాందత్ సైనుద్దీన్ ఛాయాగ్రహణంలో. పడవల పోటీ దృశ్యాలు, కొన్ని ప్రకృతి దృశ్యాలూ బాగా తీశాడు. ఈ పడవలు మోటార్ బోట్లు. ఇలా కాకుండా కేరళలో ఓనం పండక్కి జరిగే వాళ్ళం కలి పడవల పోటీల్లో తెడ్డేసి పాల్గొంటారు. ఇందులో యాక్షన్, థ్రిల్ ఎక్కువుంటాయి. ఇక మణిశర్మ సంగీతంలో పాటలు ఓ మాదిరిగా వున్నాయి.

చివరికేమిటి

     ఇది క్లయిమాక్స్ వరకూ ఫ్లాష్ బ్యాక్ లో నడిచే నాన్ లీనియర్ కథ. హత్యకేసులో హీరో జైలుకొచ్చే దృశ్యాలతో ప్రారంభమై ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తుంది. ఎలక్ట్రీషియన్ గా పరిచయం, హీరోయిన్ తో ప్రేమ, విలన్ తో వైరం, హత్యా యత్నం కేసులో అరెస్టు వగైరా ఫస్టాఫ్ కథ. గంటా ఇరవై నిమిషాల సుదీర్ఘ సమయం. ఇంత సమయమంతా ప్లాట్ పాయింట్ వన్ కి రావడానికే. ఇంటర్వెల్ సీనుకి ప్లాట్ పాయింట్ వన్. అతను జైలు కెళ్తూ వుండడం, ఆమె ఏడుస్తూ వెంటపడడం.

        ఇంతసేపూ లవ్ ట్రాక్ ప్రతీ ప్రేమ ఫార్ములా సినిమాలో చూసే టెంప్లెట్ తరహాలోనే రిపీటవుతుంది. అతను తొలిచూపులో ప్రేమలో పడడం, ఆమె వెంటపడడం, ఆమె బెట్టు చేయడం, తర్వాత ఎందుకో తెలియకుండా ఫ్రేమలో పడిపోవడం లాంటి చూసి చూసి వున్న ఫార్ములా రొటీన్. ఈ సీన్లకి చేసిన నిర్మాణ వ్యయం నిర్మించిందే నిర్మించడమవడంతో సేలబిలిటీ లేక వృధా అయినట్టే అనుకోవాలి.

        ఈ ఫస్టాఫ్ లో ఆనర్ కిల్లింగ్ కథకి అవసరమైన ఎమోషనల్ హుక్ కూడా లేదు. స్టేక్ (పణం), తీసుకుంటున్న రిస్కు వంటివి కూడా లేవు. ఇది కులాంతర కథ అన్న భావం ఎక్కడా పుట్టదు. ఈ భావం పుట్టనప్పుడు ఆడియెన్స్ కి ఎమోషనల్ హుక్, హీరో హీరోయిన్ల పాత్రలు స్టేక్, రిస్కు ఫీలయ్యే అవకాశం కూడా వుండదు. కోడి రామకృష్ణ తీసిన అదిగో అల్లదిగో లో - మీ కొడుకు శివానంద శాస్త్రి అగ్రహారంలో బ్రహ్మణ్యంపై తిరగబడి హరిజన ప్రవేశం కల్పించాడు. వర్ణసంకరానికి పుట్టిన పిల్లతో ప్రేమలో పడ్డాడుఅనే డైరెక్టు డైలాగులు వుంటాయి.  ‘ఆ కులహీనురాలికి తాళి కట్టావో, ఈ యజ్ఞోపవీతంతో వురేసుకుంటా! అని పరిస్థితి తీవ్రతని తెలిపే డైలాగులు కథానుసారం వుంటాయి. ఏ తరహా కథ డ్రామా రగిలించడానికి ఆ తరహా డైలాగుల్ని కలిగి వుంటుంది.  ప్రస్తుత ఫార్ములా రియలిస్టిక్ కథకుడెందుకో ఉన్నదున్నట్టు చెప్పడానికి మొహమాటపడ్డాడు. దీంతో బలమైన డ్రామా లేకుండా పోయింది.

        సెకండాఫ్ హీరో జైలునుంచి పారిపోయి రావడం, హీరోయిన్ తో సిటీకి పారిపోవడం, పెళ్ళి చేసుకోవడం, పోలీసులు వచ్చి మళ్ళీ పట్టుకోవడం, తండ్రి తీసికెళ్ళి హీరోయిన్ పెళ్ళి చేసేయడం, ఇంకా తర్వాత ట్రాజిక్ క్లయిమాక్స్ వగైరా. హీరో జైలు కెళ్ళడం రావడం రిపీటవుతూ వుంటాయి. జైల్లోంచి పారిపోతే పట్టుకుపోయి జైల్లో వేస్తారు, వేశాక బెయిల్ మీద వదిలేస్తారు. పారిపోయిన ఖైదీకి బెయిల్ ఇస్తారా. ఫార్ములా కథనం కాబట్టి లాజిక్ చూడకూడదేమో.

        ఇంకోటేమిటంటే ఈ సెకండాఫ్ లో వేరే హిందూ ముస్లిం పెళ్ళి, పాట సహా అనవసరంగా చూపించడం. బడ్జెట్ వేస్ట్. ఈ సామరస్యం ఎవరికి చూపించడానికి? ప్రేక్షకులకా? ప్రేక్షకులకి అవసరం లేదు. హీరో హీరోయిన్లకా? వాళ్ళు సామరస్యంతోనే వున్నారు. ఈ పెళ్ళికి హీరోయిన్ తండ్రిని పిలిపించి వుంటే సార్ధకమయ్యేది బడ్జెట్ కూడా. కథ ఇందులో వుంది, డ్రామా ఇక్కడుంది. 

        ప్లాట్ పాయింట్ టూ తర్వాత విలన్ రివీల్ చేసే పాయింటు మాత్రం తేరుకునేలా చేస్తుంది. ఇదంతా మొదట్నుంచీ హీరోకి విలన్ పన్నిన వలేనని రివీలవడం ఒక్కటే ఈ కథలో క్రియేటివిటీ ఏదైనా వుంటే దానికి తార్కాణం. ఎండ్ సస్పెన్స్ ని ఎండ్ సస్పెన్స్ కథనం చూస్తున్నట్టు అన్పించకుండా ప్లే చేసే ట్రిక్. ప్లాట్ పాయింట్ టూ వచ్చేసి కేసు విషయంలో విలన్ తనని ఇంకా బలంగా ఇరికించినట్టు హీరో తెలుసుకోవడం. ట్రాజిక్ క్లయిమాక్స్ మాత్రం పైన చెప్పుకున్న హీరోయిన్ పేలిన తెలివి లేని మాటల ఫలితమే. ఇదేం ఒప్పించేదిగా వుండదు కాన్సెప్ట్ కి.

“Everything that's realistic has some sort of  ugliness in it.
Even a flower is ugly when it wilts, a bird when it seeks its prey,
the ocean when it becomes violent.
Sharon Tate

సికిందర్

 

 

29, ఆగస్టు 2021, ఆదివారం

1053 : రివ్యూ

రచన- దర్శకత్వం : హసిత్ గోలి 
తారాగణం: శ్రీవిష్ణు, మేఘా ఆకాష్, సునయన, రవి బాబు, శ్రీకాంత్ అయ్యంగార్, అజయ్ ఘోష్, కాదంబరి కిరణ్, గంగవ్వ తదితరులు
సంగీతం: వివేక్ సాగర్, ఛాయాగ్రహణం : వేద రామన్ శంకరన్
బ్యానర్స్ :  అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ
నిర్మాత: అభిషేక్ అగర్వాల్, టి.జి. విశ్వప్రసాద్ 
విడుదల : 19 ఆగస్టు 2021
***
      రెండేళ్ళ క్రితం బ్రోచేవారెవరురా అనే హిట్ తర్వాత తిప్పరా మీసం’, గాలి సంపత్ లాంటి రెండు ఫ్లాప్స్ లో నటించి తిరిగి ఇప్పుడు రాజరాజ చోర తో గాడిలో పడినట్టు వార్తలు సృష్టిస్తున్న శ్రీవిష్ణుకిది నిజానికి నటనలో  ప్రతిభని సానబట్టుకునే అవకాశం, పాత్ర అలాటిది కాబట్టి.  చోరకళ  వున్న పాత్రకి ప్రేక్షకుల హృదయాల్ని దోచుకునే నటన కూడా తోడ్పడాలి.  దీన్నెంత వరకు సాధించాడు? అలాగే కె. విశ్వనాథ్, జంధ్యాల వంటి దర్శకుల స్కూలుకి చెందినట్టు చెప్పుకున్న కొత్త దర్శకుడు హసిత్, సాహిత్య సంగీత సాంప్రదాయాల సమ్మేళనంగా తొలి ప్రయత్నాన్ని ప్రేక్షకుల ముందుంచాడు. దీంతో ఎంత వరకు మెప్పించగల్గాడు? ఈ విషయాలు పరిశీలిద్దాం.

కథ


   భాస్కర్ (శ్రీవిష్ణు) జెరాక్స్ షాపులో పనిచేస్తూంటాడు. ప్రేమిస్తున్న సంజన (మేఘా ఆకాష్) కి సాఫ్ట్ వేర్ ఇంజనీర్ నని చెప్పుకుంటాడు. ఆమె కూడా సాఫ్ట్ వేర్ ఇంజనీర్. ఆమెతో ఖర్చులకి జీతం చాలక దొంగతనాలు చేస్తూంటాడు. మరో వైపు భార్య విద్య (సునయన), ఓ కొడుకూ వుంటారు. కొడుకి చదువుకి, భార్య లా చదువుకీ, ఇంకా ఇతర ఇంటి ఖర్చులకీ దొంగతనాల మీదే ఆధారపడతాడు.

        ఒక పోలీస్ ఇన్స్ పెక్టర్ విలియం రెడ్డి (రవి బాబు) వుంటాడు. ఇతడికో ఫ్రెండ్ వుంటాడు. ఆ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ తో తను వ్యవహారం నడిపిస్తూ వుంటాడు. సిటీలో దొంగతనాలు పెరిగిపోతున్నాయని పై నుంచి వొత్తిడి వుంటుంది. ఒక మోటారు షెడ్డులో నివసించే (అంజమ్మ) గంగవ్వ వుంటుంది. ఇక్కడే సాఫ్ట్ వేర్ ఇంజనీరుగా డ్రెస్ మార్చుకుని పోతూంటాడు భాస్కర్. ఇతడి దొంగతనాల గురించి తెలిసిన ఆమె, కిరీటం పెట్టుకుని రాజు వేషంలో వెళ్తే దొంగతనంలో బాగా కలిసి వస్తుందని చెప్తుంది.

        ఈలోగా సంజనకి భాస్కర్ పెళ్ళయిన వాడని తెలిసి పోతుంది. దీంతో భార్య చనిపోయిందని అబద్ధం చెప్పి తప్పించుకుంటాడు. ఓ రాత్రి కిరీటం పెట్టుకుని రాజులా వేషం వేసుకుని భారీగా దొంగతనం చేసుకుని వస్తూ, ఇన్స్ పెక్టర్ విలియం రెడ్డికి దొరికిపోతాడు. అదే చోట విలియం రెడ్డి కూడా ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ కోసం వెళ్ళి  ఫ్రెండ్ కి దొరికిపోతాడు.

        ఇప్పుడు తప్పుచేసి ఫ్రెండ్ కి దొరికిపోయిన విలియం రెడ్డి, దొంగతనమనే ఇంకో తప్పు చేసి దొరికిపోయిన భాస్కర్ ని పట్టుకునే సాహసం చేశాడా? తన గుట్టు కాపాడుకోవాలంటే భాస్కర్ గుట్టు కూడా కాపాడాల్సి వచ్చిందా? ఇది తెలిసిపోయిన భాస్కర్ భార్య విద్య ఏం చేసింది? భాస్కర్ పెళ్ళయిన వాడని తెలుసుకున్న సంజన ఇప్పుడేం చేసింది? ఇదీ మిగతా కథ.

ఎలా వుంది కథ
   కామెడీ అన్నారు గానీ ఇది ఫిలాసఫికల్ గా చెప్పాలనుకున్న నీతి కథ. పాత సినిమాల్లో దొంగ మంచివాడుగా మారే ఎన్నోసార్లు చూసేసిన రొటీన్ నీతి కథే. నీతి తప్పిన ఇతర పాత్రలు కూడా కర్మ సిద్ధాంతం ప్రకారం ఫలితం అనుభవించే సెంటిమెంటల్, ఎమోషనల్ డ్రామాల కథ. దీనికి వాల్మీకి కథ ఆధారమని కూడా ప్రచారమైంది.

        2010 లోనే వాల్మీకి గురించి దుష్ప్రచారం చేయకూడదని హైకోర్టు తీర్పు వుంది.  పంజాబ్ - హర్యానా హైకోర్టు ఆదేశాల మేరకు వాల్మీకి జీవితాన్ని పరిశోధించిన పంజాబ్ - హర్యానా యూనివర్సిటీ, వాల్మీకి దొంగ అని నిరూపించే ఆధారాలేవీ దొరకలేదని తేల్చింది. దీంతో వాల్మీకిని అలా చిత్రిస్తూ నాటికలు, టీవీ సీరియల్స్, సినిమాలు వంటివి రూపొందించడం నేరమని, చట్ట ప్రకారం చర్యలు తీసుకోవచ్చనీ హైకోర్టు తీర్పిచ్చింది. అయినా 2019 లో వరుణ్ తేజ్ నటించిన తెలుగు సినిమాకి వాల్మీకి టైటిల్ పెడితే ఆందోళనలు చెలరేగి,  చివరికి గద్దలకొండ గణేష్  గా పేరు మార్చాల్సి వచ్చింది. అయినా కూడా ప్రస్తుత సినిమాకి వాల్మీ కథ ఆధారమని మీడియాలో వచ్చేసింది...

        శ్రీవిష్ణు నటించిన ఈ తాజా కథ ఇటీవల తమిళంలో విడుదలైన జీవి కథని గుర్తుకు తెస్తుంది. ఇది కూడా కర్మ సిద్ధాంతంతో  విధి విలాసపు కథే. కాకపోతే ఆ కుటుంబ కథని చాదస్తాలకి పోకుండా, రియలిస్టిక్ జానర్ లో బిగిసడలని సస్పెన్స్ థ్రిల్లర్ కథగా తీశాడు. ఇందులో కూడా హీరో దొంగే. హీరో చేసే ఒక దొంగతనమనే ప్రధాన కథని, ఇంకో కుటుంబంలో ఇంకో కాలంలో జరిగిన దొంగతనంతో ముడిపెట్టి, సారూప్యతా సిద్ధాంతం అనే దాంతో అర్ధవంతంగా తీశాడు.

        ఇందులో హీరో పాత్ర పాసివ్ గా వుండదు, యాక్టివ్ గా వుంటుంది. ప్రస్తుత కథ పాసివ్ పాత్రతో వున్న నీతి కథ. కథ అనేకంటే సరిగ్గా తీయని గాథ అనొచ్చు. ఈమధ్య కథ అనుకుంటూ గాథలు తీసుకుంటూ ఎక్కడికో వెళ్ళిపోతున్నారు. కథ- గాథ తేడాల గురించి ఎవరికున్న నాలెడ్జి వాళ్ళది. కథా కథనాలకి కొత్త దర్శకుడు కొత్త కాబట్టి ఇది తన అవగాన మేరకు చేసుకున్న రచన, దర్శకత్వం. దీనికి తన సాహిత్య సంగీతాభి లాషల్ని, ప్రవచనాలతో కథని వివరించే కామెంటరీని జోడించి నేటివిటీని ప్రదర్శించే ప్రయత్నం చేశాడు.

        తెలుగు పట్ల మక్కువతో ఇంటర్వెల్లో సృజనాత్మకత కోసం ప్రయత్నించాడు. ఇంటర్వెల్లో విలియం రెడ్డి ఫ్రెండ్ కి దొరికిపోయినందుకు విలాపం అని, ఇదే సీనులో భాస్కర్ దొంగగా దొరికి పోయినందుకు విఘాతం అనీ, ఈ రెంటినీ కలిపి విరామం అనీ  అక్షరాలేశాడు.

        ఇలా చేయడం వల్ల పంచ్, బ్యాంగ్ లాంటివి మిస్సయి పేలవంగా మారింది. నవ్వుతూంటే నవ్వుతోందనీ, ఏడుస్తూంటే ఏడుస్తున్నాడనీ క్యాప్షన్స్ వేసి చెప్తే ఎలా వుంటుందో అలా వుందిది. ఏం జరిగిందో తెలిసి పోతున్నాక ఇంకా బ్లాక్ బోర్డు మీద రాసి పాఠం చెప్పనవసరం లేదు.

        ఇలా విజువల్ మీడియాకి ఎప్పుడు స్క్రీన్ మీద రాసి చెప్తే ఎఫెక్ట్ వుంటుందంటే, పూరీ జగన్నాథ్ బుజ్జిగాడు చూడొచ్చు. ఇందులో ఇంటర్వెల్ యాక్షన్ సీను ముగింపు చూస్తే- ఈ భావోద్వేగ సన్నివేశంలో ప్రభాస్ తో మోహన్ బాబు లవ్ యూ సాలా అని భుజం తట్టినప్పుడు, ఇదే మాట  Love You Saala’ అని ఇంగ్లీషులో లెటర్స్  వేసినప్పుడు, ఇంటర్వెల్ కి హుషారైన పంచ్, బ్యాంగూ పడ్డాయి. ఇదీ తేడా.

        ఇక దర్శకుడి అభిమాన దర్శకులైన జంధ్యాల, కె విశ్వనాధ్ సినిమాలు చైతన్యంతో వుంటాయి. పాత్ర చిత్రణల మీద పట్టు వుంటుంది. గుర్తుండి పోయే పాత్ర చిత్రణలుంటాయి. వీటి గురించి అనుభవం గడించాల్సిన అవసరముంది దర్శకుడికి.

నటనలు -సాంకేతికాలు

   ఒక చోరుడుగా శ్రీవిష్ణు పాత్రతో బాటు, నటనా ఇంప్రూవ్ అవడానికి అవకాశముంది. అయితే ఇది హాస్య పాత్రనా, సీరియస్ పాత్రనా స్పష్టత లేనట్టు అటు ఇటు కాని పాత్రగా  తయారయ్యింది. కామిక్ సెన్స్, హుషారు, స్పీడు, డైనమిక్స్ వంటి కథాంగాలకి కథనం  దూరంగా వుండడంతో, ఫిలాసఫికల్ మూడ్లోకి వెళ్లిపోవడంతో, శ్రీవిష్ణు చోరుడు పాసివ్ పాత్ర కూడా అయ్యాడు. మధ్య తరగతి కుటుంబ సమస్య డామినేటింగ్ గా, దీనికి తగ్గట్టు భార్యగా నటించిన సునయన పాత్ర సీరియస్ పాత్ర కూడా కావడంతో, వినోదాత్మక విలువలు ఇందులో కనపడవు.

        కథ ఏ జానర్ లో వుంటే ఆ ఫ్రేములోనే నటనలుంటాయి. అయినా కూడా పోనుపోనూ సెకండాఫ్ లో, హడావిడిగా ముగించిన ముగింపులో, శ్రీవిష్ణు స్కిల్స్ ని మరింత మెరుగుపర్చుకుని వుంటే ఈ బరువైన కథకొక వెయిట్ వుండేదేమో. అన్ని సినిమాల్లో ఒకేలాటి పొడిపొడి సాఫ్ట్ నటనతో సరిపెట్టుకోవడం ఏమంత మేలు చేయదేమో.

        సంఘర్షించడానికి, నటించడానికీ ఎక్కువ స్కోపున్న, వ్యక్తిత్వమున్న పాత్ర సునయనది. ఇందులో సఫలమైంది. అయితే పాత్ర వ్యక్తిత్వం ఒక దగ్గర దెబ్బతిని పోయింది. ఈ కథలో తప్పుచేసిన పాత్రలు ఏదోక విధంగా నిష్కృతి చేసుకుంటాయి, లేదా ఫలితం అనుభవిస్తాయి. భర్త తనకి తెలియకుండా చేసిన దొంగతనాల డబ్బుతో లా చదువుతున్న తను, తెలిశాక అలాటి చదువు పట్ల నైతికతని ఫీలవకుండా, అతడితోనే ఒక ఏర్పాటుతో వుంటూ, మళ్ళీ అతను దొంగతనాలు చేస్తే, అప్పుడు బై చెప్పి కొడుకుతో వెళ్ళిపోయి- రెండేళ్ళ తర్వాత లాయర్ గా సెటిలై వుంటుంది!

        ఈమె నైతికతని ప్రశ్నించుకుని అలాటి చదువుకి మొదటే ఛీ కొట్టి వుంటే, ఇది శ్రీవిష్ణు పాత్ర పరివర్తన చెందడానికి బలమైన ఫ్యామిలీ డ్రామాని క్రియేట్ చేసేది. ఇక తన తప్పు వల్ల భార్య భవిష్యత్తు బలి కాకూడదన్న రియలైజేషన్ ఏర్పడి, ఆమె చేత చదువు పూర్తి చేయించే ఏకైక లక్ష్యం కోసం మంచివాడుగా మారే, ఏ త్యాగమైనా చేసే పాత్ర ప్రయాణంతో, నిజమైన ఫ్యామిలీ మాన్ గా హృదయాల్ని దోచుకునే వాడు. శ్రీవిష్ణు ఈ మంచి అవకాశాన్ని కోల్పోయాడు.

       దొంగగా దొరికిపోయిన శ్రీవిష్ణుని విడిపించుకోవడానికి సునయన పోలీస్ స్టేషన్ కొచ్చినప్పుడు,  ఇన్స్ పెక్టర్ పాత్ర రవి బాబుతో, అతనే ఇరుక్కోగల లా పాయింట్లు మాట్లాడి గెలవడం గొప్ప అన్పించుకునే సన్నివేశ సృష్టి కాబోదు. పోవమ్మా, దొంగ డబ్బుతో లా చదువుతూ నాకే నీతులు చెప్తున్నావా అని రవిబాబు అంటే, ఆమె మొహం ఎక్కడ పెట్టుకుంటుంది.

    కథ లాజిక్ వదిలేసినా చెల్లుతుందేమో గానీ, పాత్ర చిత్రణల్లో లాజిక్కులు లేకపోతే కథే ఖతమవుతుంది. ఇక శ్రీవిష్ణుని ప్రేమించే పాత్రలో సంజనగా మేఘా ఆకాష్ వుంటుంది. ఈమె పాత్రకి ఇంటెర్వెల్లో ఒక ట్విస్టు వుంటుంది. ఇంతవరకూ సాఫ్ట్ రోమాన్స్ నటనే వుంటుంది. సెకండాఫ్ లో సైడ్ అయిపోతుంది. భార్య చనిపోయిందని శ్రీవిష్ణు అబద్ధం చెప్పాడని తెలుసుకున్నప్పుడు ఆమె పాత్ర ముగిసిపోతుంది. ఈ అబద్ధం చెప్పాడని తెలుసుకునే మలుపు మాత్రం చేసిన కథనంతో డైల్యూట్ అయిపోయింది. దీంతో అది మలుపు కాకుండా పోయింది. శ్రీవిష్ణు అబద్ధం చెప్పాడని ఆమె తెలుసుకున్న ఇంకో నిజం ఇలా ఫ్లాష్ బ్యాక్ గా వేయడంతో థ్రిల్లింగ్ గా లేక చప్పగా తేలిపోయింది.  
     
        దేర్ విల్ బి బ్లడ్ (2007) ఆస్కార్ గాథ స్క్రీన్ ప్లే సంగతులులో ఇలా జరక్కుండా ఏ జాగ్రత్త తీసుకున్నాడో గమనించాం. ఇందులో ఇంటర్వెల్ ఎపిసోడ్ లో రెండు ప్రమాదాలు జరుగుతాయి. ఒకదాని తర్వాతొకటి రెండు ప్రమాదాలూ చూపిస్తే రిపిటీషన్ తో దెబ్బతింటాయని ఈ జాగ్రత్త తీసుకున్నాడు దర్శకుడు పి.టి. ఆండర్సన్ :  మొదటి ప్రమాదాన్ని మైనర్ ప్రమాదంగా చేసి, లైవ్ యాక్షన్లో చూపించకుండా, మాటలతో వివరించే వెర్బల్ సీనుగా  వేశాడు. దీంతో బాటు ప్రమాదం తాలూకు కొన్ని విజువల్స్ వేశాడు. ఇలా మొదటి ప్రమాదం గురించి కేవలం చెప్పించడంతో, ఆ వెంటనే ఇంటర్వెల్లో జరిగే మేజర్ ప్రమాదాన్ని రియల్ టైమ్ లో లైవ్ యాక్షన్లో చూపించడం వల్ల, ఇది రిపిటీషన్ బారిన పడని ఇంటర్వెల్ ఇంపాక్ట్ గా నిలబడగల్గింది. మేఘా ఆకాష్ విషయంలో కూడా ఇలా ఇంపాక్ట్ వుండాలంటే రియల్ టైమ్ లో లైవ్ యాక్షన్లో చూపించాలి తప్ప, చల్లారిపోయిన అభిప్రాయం కల్గించే ఫ్లాష్ బ్యాకుగా కాదు.

        ప్రవచన కారుడుగా తనికెళ్ళ భరణి కన్పిస్తాడు. ఇక ఇన్స్ పెక్టర్ రవిబాబుతో బాటు డాక్టర్ కమ్ రియల్ ఎస్టేట్ శ్రీకాంత్ అయ్యంగార్, జెరాక్స్ షాప్ ఓనర్ అజయ్ ఘోష్, హెడ్ కానిస్టేబుల్ కాదంబరి కిరణ్, గంగవ్వ పాత్రలకి ఒక్కో కథనిచ్చాడు దర్శకుడు. కర్మ ఫలాలు కాన్సెప్ట్ కాబట్టి ఈ కథలు. పోతే సాంకేతికంగా ఏ సినిమా అయినా ఇలా అప్డేట్ అవుతూనే వుంటుంది. ఎప్పటికప్పుడు అప్డేట్ అయ్యేది సాంకేతికులు మాత్రమే. ఏమాత్రం అప్డేట్స్ అంటకుండా జాగ్రత్తలు తీసుకుని, మాస్కులు వేసుకుని, శానిటైజ్ చేసుకుంటూ, అరకిలోమీటరు దూరం పాటించేది కథకులే. కోవిడైజుడు కథకులు. ఇక సంగీతానికి సెమీ క్లాసిక్ టచ్ ఇచ్చే ప్రయత్నం చేశాడు.

చివరికేమిటి

    గుళ్ళో శివరాత్రి పవిత్ర ప్రవచనాలతో ప్రారంభమై, గుళ్ళోనే  ఉగాది పవిత్ర ప్రవచనాలతో ముగిసే ఈ గాథ- దొంగతనాలే గాకుండా రంకుతనాల్ని కూడా చూపించింది. సుమారు గంటా ఇరవై నిమిషాలు కథలోకి వెళ్ళడానికే టైము పట్టింది. పైన చెప్పుకున్న ఇంటర్వెల్ సీనుకి గానీ బిగినింగ్ విభాగం ముగియదు. 23 వ నిమిషంలో హీరోకి భార్య వుందన్న విషయం బయటపడుతుంది. ఇది ప్లాట్ పాయింట్ వన్ కాదు. ప్లాట్ పాయింట్ వన్ ఇంటర్వెల్లోనే - శ్రీవిష్ణు, రవిబాబు పరస్పరం దొరికిపోవడంతో.
        ఈ గంటా ఇరవై నిమిషాలూ కథనంలో డైనమిక్స్ లేక, దాంతో స్పీడూ లేక మందకొడిగా సాగుతుంది. ఇంటర్వెల్ తర్వాత సెకండాఫ్ గంట సేపు పూర్తిగా శ్రీవిష్ణు-సునయనల సీరియస్ కుటుంబ డ్రామాగా మారిపోతుంది. శ్రీవిష్ణు పూర్తిగా పాసివ్ అయిపోతాడిక్కడ. ఫస్టాఫ్ లో గోల్ లేనట్టే సెకండాఫ్ లోనూ గోల్ వుండదు. కథకుడు ఎలా కథనం చేస్తే అలా పోతాడు. కానీ కథనానికి బేసిక్ సూత్రమేమిటంటే, పాత్ర ఎలా కథనం సృష్టిస్తూంటే కథకుడు అలా పోవడం. ఎందుకంటే కథాకథనాలనేవి కథకుడివి అయివుండవు. పాత్రకి చెందిన ఆస్తి అది. పాత్ర డొమైన్. పాత్ర డొమైన్ లో కథకుడికేం పని?

     కేవలం ఐడియానే కథకుడు సృష్టించగలడు. దాంతో కథా కథనాల్ని సృష్టించుకుని, నడుపుకునే పని పాత్రదే. అందుకే కథ నడుపుకునే వాడు కాబట్టి కథా నాయకుడన్నారు. ఫస్టాఫ్ నుంచీ ఇది జరిగి వుంటే శ్రీవిష్ణు గోల్ వున్న యాక్టివ్ పాత్రగా వుంటూ, కథనం చైతన్యంతో వుండేది. గాథల్లో సైతం ట్రాజడీ అయినా సరే పాత్రకి గోల్ వుంటుంది. కొత్త దర్శకుడి స్క్రిప్టులో ఇలాటి చాలా స్క్రిప్టింగ్ టూల్స్ మిస్సయ్యాయి.

“If you give people tools, and they use their natural abilities and their
curiosity, they will develop things in ways that will surprise you very much
beyond what you might have expected.”― Bill Gates

సికిందర్


18, ఆగస్టు 2021, బుధవారం

tonight!


         సార్పట్టా కోచ్ పశుపతికి, ఇడియప్పని ఎట్టి పరిస్థితిలో ఓడించాలన్న గోల్ ఏర్పడడంతో బిగినింగ్ విభాగం బిజినెస్ ముగుస్తుంది. ఈ సన్నివేశాన్ని గమనించిన ఆర్య ముఖభావాల్ని బట్టి అతనీ సమస్యని పట్టించుకున్నాడని అర్ధమై, ఇక ఏం చేస్తాడన్న సస్పెన్స్ పుడుతుంది. ఇప్పుడు ప్రారంభమయ్యే మిడిల్ -1 విభాగంలో, కొంత స్క్రీన్ టైమ్ గడిచాక, ఇడియప్ప గ్రూప్ చేతిలో రంగయ్య అవమానపడే  ఘట్టం వస్తుంది. మిడిల్ -1 అంటే సమస్యతో సంఘర్షణా ప్రకరణ కాబట్టి, ఈ అవమానపడ్డ ఘట్టం ఆర్య పాత్ర యాక్టివేట్ అవడానికి ట్రిగ్గర్ పాయింటులా పనిచేస్తుంది.  ఇలా సార్పట్టా ప్రతిష్ట నిలబెట్టడానికి తాను రంగంలోకి దిగే నిర్ణయంతో అలజడి రేపుతాడు ఆర్య ఇంటా బయటా.  ఈ రెండు వైపుల నుంచీ కొంత ప్రతిఘటన ఎదుర్కొన్న తర్వాత శిక్షణ పొందడం ప్రారంభిస్తాడు. శిక్షణ పొందాక మొదటి ఈవెంట్ లో డాన్సింగ్ రోజ్ ని ఓడిస్తాడు. రెండో ఈవెంట్ లో వేట పులి తో తలపడినప్పుడు ఇంటర్వెల్ వస్తుంది. ఇలా మిడిల్ -1 విభాగం ప్రధాన కథ ముగుస్తుంది.

        క్కడ్నించే మొదలవుతుంది కథనంతో సమస్య. ఇంతవరకూ ప్రధాన పాత్రగా, కథానాయకుడుగా, ఆలస్యంగానైనా ఆర్య తన కథ తాను నడుపుకుంటూ వస్తున్న వాడల్లా, యాక్టివ్ పాత్రగా వుంటున్న వాడల్లా, కథకుడు తన చేతి నుంచి కథ లాక్కోవడంతో, ఇక కథకుడే కథ నడుపుకోవడంతో, యాక్టివ్ పాత్ర ఆర్య కుదేలైపోయి పాసివ్ పాత్రగా మారిపోతాడు...ఈ ఇంటర్వెల్ తర్వాత మిడిల్ -2 నుంచీ.

        ఇలా పాత్ర తెగిపోవడమే కాదు, కథ కూడా తెగిపోయి సెకండాఫ్ సిండ్రోమ్ అనే సుడిగుండంలో పడుతుంది సినిమా ఇక్కడ్నించీ. ఇంటర్వెల్ ఈవెంట్ లో వేటపులి ఇక ఓడిపోతాడనగా, ఇడియప్ప గ్రూపు దాడి చేసి అలజడి సృష్టిస్తారు. బాక్సింగ్ జరక్కుండా చూస్తారు. ఆర్యని కొట్టి పడేసి బట్టలు చించేసి పోతారు. విజయం చేజారి ఆర్య కుప్పకూలుతాడు. యాక్షన్ రియాక్షన్ల మిడిల్ -1 సంఘర్షణలో ప్రత్యర్ధుల చేతిలో హీరో అనేవాడు ఓటమి చెందడమనే పాత్రోచిత చాపం (క్యారక్టర్ ఆర్క్) ఇలా భావోద్వేగాల్ని బాగా రెచ్చగొడుతున్న క్రియేషనే అనిపిస్తుంది మొదట ఇంటర్వెల్ మలుపు చూస్తే.

       అయితే ఇదే పాయింటు  పట్టుకుని ఇంటర్వెల్ తర్వాత ఇమ్మీడియేట్ గా మిడిల్ -2 కథనముండాల్సింది పోయి, ఇంటర్వెల్లో ఆర్యకి జరిగిన ఇంత అవమానాన్నే మర్చిపోయి, కథని హైజాక్ చేసిన కథకుడు తీరుబడిగా జైలు కథలు, తాగుబోతు కథలూ చూపిస్తూ ఆర్యకి రెండో శత్రువుగా మారిపోయాడు. ఇంటర్వెల్లో ఇడియప్ప మేళం బాక్సింగ్ ని భగ్నం చేసిన దానికంటే, ఇప్పుడు కథకుడు చేస్తున్న కథా వధ చాలా వ్యధ.

        రంగయ్యని అవమానించినందుకే బాక్సింగ్ కి దిగిన ఆర్య, తన బట్టలు చించి నగ్నంగా చేసిన అవమానాన్ని ఎలా మర్చిపోతాడో తెలీదు. రెండోది, తాము పాల్గొంటున్న ఈవెంట్ మీద దాడి చేసిన ఇడియప్ప గ్రూపు ఆ దాడితో తమ మరణ శాసనం తాము రాసుకున్నట్టే అవుతుంది. ఈ తప్పుకి బాక్సింగ్ క్రీడనుంచి ఇక బహిష్కృతులై పోవాలి. ఇక ఇడియప్ప పరంపర గిరంపర లేకుండా,  విజయం సార్పట్టాకే కట్టబెట్టేయాలి ఇంటర్వెల్లో. దీన్ని ఇడియప్ప దళం ఒప్పుకోకపోతే సెకండాఫ్ కథ వుంటుంది, లేకపోతే ఇక్కడితో కథ ముగిసిపోయినట్టే.

        కనుక ఎంతో బలంగా అనిపిస్తున్న ఇంటర్వెల్ సీను నిజానికి ఇంత బేలగా వుంది. సరే, దీని తర్వాత ఆర్య అన్నీ మర్చిపోయి సంసారం చేసుకుంటూ వుంటాడు. ఇక ఎమర్జెన్సీ ప్రకటించాక కోచ్ రంగయ్య జైలుకి పోతాడు. ఒక హోటల్లో భోజనం చేస్తున్న ఆర్యని ఇడియప్ప బాస్ గెలుక్కోవడంతో పోరాటం జరిగి పొడిచేస్తాడు ఆర్య. ఆ హత్యా యత్నం కేసు మీద ఇతను కూడా జైలుకి పోతాడు. జైలు నించి వచ్చాక దొంగసారా వ్యాపారంలోకి దిగుతాడు. తాగుడికి బానిసవుతాడు. ఇంట్లో భార్యతో గొడవ. ఇలా మొదలెట్టిన ప్రధాన కథని, పాత్రల లక్ష్యాల్నీ వదిలేసి కథని ఓ బారెడు మద్యపానం సన్నివేశాల మీదికి మళ్ళించాడు కథకుడు ఏవో సందేశాలివ్వాలని.

        తమిళనాడులో 1937 నుంచి 71 వరకూ చాలా సుదీర్ఘ కాలం మద్యనిషేధం అమల్లో వుంది. కరుణానిధి ముఖ్యమంత్రి అయ్యాక 1971 లో ఎత్తేశాడు. ఎత్తేశాక ’75-‘76 ఎమర్జెన్సీ కాలంలో మూకుమ్మడి కల్తీ సారా మరణాలు సంభవించడంతో మళ్ళీ మద్యనిషేధం విధించాడు. 1981 లో ఎమ్జీఆర్ రెండోసారి అధికారంలోకి వచ్చాక మళ్ళీ ఎత్తేశారు. ఈ క్రోనాలజీలో హీరో ఆర్య కరుణానిధి కాలంలో దొంగసారా వ్యాపారంలోకి దిగుతాడు. ఇలా కథతో సంబంధం లేని ఎమర్జెన్సీని చూపించినట్టే, దొంగసారా వ్యాపారాన్నీ చూపిస్తూ మిడిల్ -2 అంతా కాలక్షేపం చేశాడు.

        రంగయ్య జైలు నుంచి విడుదలై వచ్చాకాగానీ తిరిగి కథని అందుకోడు కథకుడు. నాల్గేళ్ళ తర్వాత విడుదలవుతాడు రంగయ్య. రికార్డుల ప్రకారం ఎమర్జెన్సీ వున్నదే 22 నెలలు. 1975 లో ఎమర్జెన్సీ విధించాక, ’76 లో కరుణానిధి ప్రభుత్వం రద్దయ్యింది. 77 లో ఎమర్జెన్సీని ఎత్తేశాక రాజకీయ ఖైదీలందరూ విడుదలైపోయి ఎన్నికలు జరిగాయి. అంటే ’76 లో రంగయ్య జైలు కెళ్తే ’77 లో విడుదలైపోవాలి. నాల్గేళ్ళ తర్వాత విడుదలయ్యాడంటే కథకుడు ఆలో... చించేసిన కథ కోసం వేచి వుండి, లేదా కాల్షీటు కోసం పొంచి వుండి విడుదలయ్యాడన్న మాట. చరిత్రతో క్రోనాలజీ కూడా ఇలా వుంది.    

        ఇప్పుడు ఎండ్ విభాగం కథలోకొస్తే, ఎప్పుడో నాల్గేళ్ళ క్రిందటి పగలూ ప్రతీకారాలు గుర్తొచ్చి తిరిగి సార్పట్టా- ఇడియప్పల బాక్సింగులు. ఇప్పుడు పాసివ్ పాత్రగా వున్న ఆర్య పగ రగిలించుకుని దిగాలంటే తాగుడు వల్ల తగిన షేపులో లేడు. బాక్సింగ్ మర్చిపోయాడు. మళ్ళీ ట్రైనింగ్. అంటే మిడిల్ -1 లో చూపించిన కథనమే రిపీట్ అవుతుంది. బాక్సింగ్ లో మళ్ళీ శిక్షణ, వేట పులితో బాక్సింగ్, వాణ్ణి ఓడించడం వగైరా రిపిటీషన్ తో బలహీన క్లయిమాక్స్.  

     ఇలా సినిమా మొత్తం మీద చూస్తే కనిపించేది గాథే తప్ప కథ కాదు. గాథల్లోనే లక్ష్యంలేని, కథకుడు నడిపించే పాసివ్ హీరో పాత్ర వుంటుంది. కథనం కూడా పాత్ర- లక్ష్యం- సంఘర్షణ - విజయం అనే స్ట్రక్చర్ లేకుండా వుంటుంది. అయితే గాథల్ని కూడా అర్ధవంతమైన కథనంతో తీయవచ్చు. ఒక వేళ  గాథ చేయాలనుకుని ఆ సంబంధమైన రూల్స్ పాటిస్తే.

        ఒక వంద అత్యుత్తమ నవలల్లో 1927 లో వర్జీనియా వుల్ఫ్ రాసిన టు ది లైట్ హౌస్ అన్న నవల వుంది. నవలా రచనా నియమాల్ని బేఖాతరు చేసిన డేరింగ్ రచనగా ఇది పేరుబడింది. ఇందులో దాదాపు కథ అనేదే వుండదు. ఉండీ లేనట్టు సంభాషణాలుంటాయి. ఉన్న కాస్త కథ కూడా ఒక పాత్ర దృక్కోణంలో వుండదు. అయినా ఇది మానవ సంబంధాల గురించి లయబద్ధంగా సాగిపోయే – తదేక ధ్యానం లోకి తీసికెళ్ళ గల ఉత్కంఠ భరిత కథనంగా వుంటుంది. ఇది గాథ. ఇలాటివి పరిశీలిస్తే గాథ ఎలా తీయాలో తెలుస్తుంది.


సికిందర్