రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

19, ఏప్రిల్ 2018, గురువారం

638 ; స్ట్రక్చర్


        స్ట్రక్చర్ ఎనిమిదవ భాగం సైడ్ బార్ లో పోస్ట్ చేశాం, ఇమేజి  మీద క్లిక్ చేసి పిడిఎఫ్  పొందవచ్చు. ‘తెలుగు సినిమా స్క్రీన్ ప్లే స్ట్రక్చర్’  అథ్యాయాలు రాయడం పూర్తి చేసి చాలా కాలం అయింది. పుస్తకం వేసే ప్రశ్న వొకటి అప్పుడప్పుడు ఎదురవుతోంది. దీనికింకా టైము పడుతుంది. మరికొన్ని అనుబంధ అథ్యాయాలు చేర్చాల్సి వుంది. ఇది ఈ సంవత్సరంలో పూర్తయ్యే సూచనలు కన్పించడం లేదు. ఎవరైనా స్క్రీన్ ప్లే చేసుకోవడానికి అందుబాటులో స్ట్రక్చర్ అథ్యాయాలు మాత్రమే పూర్తయ్యాయి. అవే మీకిప్పుడు పిడిఎఫ్ ప్రతుల రూపంలో అందుతున్నాయి. చాలామంది కోరిక మేరకు ఇలా అందించడం జరుగుతోంది. స్ట్రక్చర్ అథ్యాయాలకి యాక్టివ్ – పాసివ్, మిడిల్ మటాష్, సెకండాఫ్ సిండ్రోం, ఎండ్ సస్పెన్స్, కథ –గాథ వంటి నానా రుగ్మతల బాగోతాలు కూడా అనుబంధంగా చేరిస్తే పుస్తకం సింగిల్ విండో స్కీము లాగా,  అన్నీ ఒకేచోట లభించు దస్త్రమవుతుంది. ఒకప్పుడు ఒక్కో రుగ్మత మీద ఒక్కో పుస్తకమనుకున్నాం. అంత వ్యాపారీ కరణ అవసరం లేదనిపించింది.

           
లోగా పుస్తకం వచ్చే వరకూ ఎదురు చూడకుండా ఎవరి పని వారు చేసుకుంటున్నారు. గత సంవత్సరం ‘అమ్మమ్మగారిల్లు’ దర్శకుడు సుందర్ సూర్య ఆఫీసుకి పిలిపించుకుని ఒక సర్ప్రైజ్  చేశారు. ‘తెలుగు సినిమా స్క్రీన్ ప్లే స్ట్రక్చర్’ వ్యాసాలన్నీ డౌన్లోడ్ చేసుకుని స్పైరల్ బైండ్ చేశారు. ఆ కాపీ చూపించి ఈ వ్యాసకర్త గర్వపడేలా చేశారు. ఇలా మరికొందరి ప్రయత్నాలు దృష్టికొచ్చాయి. గతనెల తాజాగా పరిచయమైన రాకేష్ అనే అసోషియేట్, బ్యాగులో దాచుకుని తెచ్చుకుని పుస్తకం చేతిలో పెట్టారు. ఈయన ఒకడుగు ముందుకేసి, డౌన్ లోడ్ చేసుకున్న పేజీలని ఏకంగా బుక్ లాగా తయారు చేయించుకున్నారు. పైన కనిపించే ఇమేజి అదే. ఇవన్నీ చూస్తూంటే, ఇప్పుడు స్ట్రక్చర్ వ్యాసాల్నిజాతీయం కూడా చేస్తూంటే (ఎప్పటికప్పుడు రాస్తున్నప్పుడే జాతీయమైపోయాయి), ఇంకా పుస్తకం వేయడం అవసరమా అనే బ్రిలియంట్ ఐడియా వస్తోంది.

          ‘స్ట్రక్చర్ ఎనిమిదవ భాగం’  కాస్త కష్టమైనదే. కథంటే మిడిలే కాబట్టి,  దాని సన్నాహాలు మొదలెట్టడానికి కొంత నేపధ్యం తెలుసుకోవడం అవసరం. ఈ నేపధ్యం హిట్టయిన సినిమాల్లో వుంటున్నదే. దీని వెనుక సైన్స్ ఏమిటో తెలుసుకోబోతే మాత్రం క్లిష్టంగానే అనిపిస్తుంది. దీన్ని సాధ్యమైనంత సరళీకరించి చెప్పడానికే  ప్రయత్నించాం.   నిజానికి 2016 లో స్ట్రక్చర్ లో ఈ మిడిల్ మీద వ్యాసాలు రాయబోయినప్పుడు ప్రతిష్టంభన ఏర్పడింది. మూడు నాలుగు నెలలు రాయకుండా ఒక అన్వేషణలో పడాల్సి వచ్చింది. ఈ అన్వేషణ ఫలిస్తేనే  రాయగల్గే పరిస్థితి. లేకపోతే  మొత్తంగానే ‘తెలుగు సినిమా స్క్రీన్ ప్లే స్ట్రక్చర్’ వ్యాసాలని అర్ధాంతరంగా ఆపేయాల్సిన వాతావరణం. 

          స్ట్రక్చర్ అంటే బిగినింగ్ మిడిల్ ఎండ్ బిజినెస్సుల్ని చెప్పేసి వూరుకోవచ్చు.  కానీ పరిస్థితుల్ని చూస్తూ కూడా ఇలా చేయలేం. పరిస్థితి ఏమిటంటే, ఒక కథ ఒకరు అనుకున్నాక, దాని మీద చర్చల్లో కొందరి చేతులు పడతాయి. అప్పుడు కథ అనుకున్న దానికన్నా బెటర్ గా వస్తే మంచిదే. అలా జరగడం లేదు. పది శాతం లోపే విజయాలుంటున్నాయి. కథకుడు ఒకవేళ బెటర్ గా రాసుకున్నా చర్చల్లో దిగజారిపోతున్నాయి. ఇదీ సమస్య. 

          బెటర్ గా రాసుకున్న కథ చర్చల్లో దిగజారినా ఏ మేరకు దిగజారనీయ వచ్చు? పూర్తిగా దిగజారిపోకుండా ఎలా ఆపవచ్చు? 2007  లో జేమ్స్ బానెట్  పుస్తకంలో దీనికి సమాధానం దొరికింది. కథని గొప్ప కథల్లో వుండే లాగా, కాన్షస్ – సబ్ కాన్షస్ మైండ్స్ ఇంటర్ ప్లే దృష్టితో చూసి కథకుడు రాసుకుంటే, చర్చల్లో ఆ గొప్ప కథ ఒక మంచి కథ స్థాయికి మాత్రమే దిగజారవచ్చనీ, అంతకంటే దిగజార్చడం ఎవ్వరికీ సాధ్యం కాదనీ అవగాహన కుదిరింది. దీని మీద అప్పట్లో ఒక వ్యాసం రాశాం. దాన్ని ముందు పెట్టుకుని ఆలోచిస్తూంటే, ఈ కాన్షస్ – సబ్ కాన్షస్ మైండ్స్ ఇంటర్ ప్లేని బాగానే  నిర్వహించవచ్చు. అంత మాత్రానా ఆ ప్లే భద్రంగా వుంటుందని నమ్మక మేమిటి? 

          దీంతో ఈ వ్యాసకర్తకి పూర్వానుభవముంది.  ఈ వ్యాసకర్త చూద్దామని స్క్రిప్టు అంతా జేమ్స్ బానెట్  స్టయిల్లో గొప్ప కథగా రాసిస్తే, ఆ దర్శకుడు అందులో వున్న కాన్షస్ మైండ్ ని మాత్రమే పెట్టుకుని స్క్రిప్టు మార్చేశాడు. సబ్ కాన్షస్ మైండ్ ని అక్కడ పని చేసిన ఇంకో రచయిత ఎత్తుకెళ్ళి ఇంకో సినిమాకి అమ్మేశాడు. బొత్తిగా భయభక్తులనేవి లేకుండా పోయాయి. 

          విచిత్రమేమిటంటే, ఎత్తుకెళ్ళిన ‘సబ్ కాన్షస్’ ముక్క తో తీసిన కామెడీ హిట్టయింది. ఇటు ‘కాన్షస్’ ముక్క తో తీసిన కామెడీ అట్టర్ ఫ్లాపయ్యింది.

          ఇక లాభం లేదని,  కాన్షస్ - సబ్ కాన్షస్ రెంటికీ కలిపి తాళి కట్టించేస్తే ఒక చోట పడుంటాయని, ఎవరో కన్ను కొడితే జంప్ అవకుండా ఒకే సినిమా ఆఫీసులో కలిసి కాపురం చేసుకుంటాయని, ఒక ఆలోచన చేశాం. కాన్షస్ - సబ్ కాన్షస్ లకి కలిపి ఒక లాక్ వేయాలి. ఏమిటా లాక్? ఎలా ఎక్కడ వేయాలి? ఇది తెలుసుకోవడానికే నెలలు పట్టింది. పట్టుబట్టి హిట్టయిన తెలుగు హిందీ హాలీవుడ్ సినిమాలు చూస్తూంటే మెల్లమెల్లగా అర్ధమైంది. ఆల్రెడీ ఈ లాక్స్ వుంటున్నాయి కొన్ని హిట్టయిన సినిమాల్లో. అవి తెలియకుండా పడిపోతున్నాయి. అందుకే ఆ కథలు అంతకన్నా దిగజారలేదు. ఆ లాక్స్  ఎలా పడ్డాయి, పడ్డ లాక్స్  కథ దిగజారిపోకుండా ఎలా పనిచేశాయి - తెలుసుకోవడం  ఇక సులభమైపోయింది.

          కథకుడు గొప్ప కథల నిర్మాణంతో తన కథని నిర్మించుకుని లాక్ వేసేస్తే, ఆ గొప్ప కథ చర్చల్లో ఎంత దిగజారినా,  ఓ మంచి కథ స్థాయిలో ఆగిపోతుందే తప్ప, చెడ్డ కథగా పతనమవడం ఎట్టి పరిస్థితిలో జరగదు. తను వేసిన లాక్ అంత పని చేస్తుందన్న మాట. ఇదెవరికో వ్యతిరేకంగా కథకులకి నేర్పుతున్న కుట్ర కాదు. ఉమ్మడిగా సినిమాల బాగుకి పనికొచ్చే ముక్క మాత్రమే. 

          ఎనిమిదవ భాగం విషయం సంక్లిష్ట మైనా,  సాధ్యమైనంత సులభ శైలిలో చెప్పడానికి ప్రయత్నించాం, చదవండి.  


సికిందర్