రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Friday, January 10, 2020

907


      దివంగత రివ్యూ రైటర్ రోజర్ ఎబర్ట్ స్కాండినేవియా సినిమాల గురించి రాస్తూ, హాలీవుడ్ భారీ బడ్జెట్ సినిమాల ముందు తమ స్థానిక మార్కెట్ నిలుపుకోవాలంటే, తమకున్న బడ్జెట్ పరిమితుల రీత్యా, కథని నమ్ముకుని కథాబలమున్న లోబడ్జెట్ థ్రిల్లర్స్ తీసే కొత్త పంథాననుసరిస్తున్నారని పేర్కొన్నాడు. కథా బలమున్న ఈ లోబడ్జెట్ స్కాండినేవియా థ్రిల్లర్స్ గత కొన్నేళ్లుగా ప్రపంచ దృష్టి నాకర్షిస్తున్నాయి. 2005 లో విడుదలైన ‘అంబులెన్స్’ ఒక చక్కటి ఉదాహరణ. మనం వీటిలోంచి కథలు కాపీ కొట్టాలని కాక, తక్కువ బడ్జెట్ లో విజయవంతమైన రైటింగ్, మేకింగ్ ఎలా వుంటాయో పరిశీలించే దృష్ట్యా వీటిని చూడాలి. ‘అంబులెన్స్’ అనే ఈ థ్రిల్లర్స్ కి మూడే రూల్స్ పాటించారు : 1. పూర్తిగా కథ అంబులెన్స్ అనే ఒకే లొకేషన్ లో జరగాలి, 2. ఆ కథ 80 నిమిషాల రియల్ టైంలో జరగాలి, 3. నాల్గే క్యారక్టర్లు వుండాలి.

      ఇక ఈ కథ చూస్తే సింపుల్ గా వుంటూనే బలంగా వుంటుంది. ఇద్దరు అన్నదమ్ముల కథ. మృత్యు ముఖంలో వున్న వాళ్ళ తల్లి వైద్యానికి అత్యవసరంగా డబ్బు కావాలి. ఆ డబ్బుకోసం దోపిడీ చేస్తారు. ఆ దోపిడీ డబ్బుతో కారులో తప్పించుకునే లోగా పోలీసులు వచ్చేస్తారు. పోలీసులనుంచి తప్పించుకుని పారిపోతూ అంబులెన్స్ ఎక్కేస్తారు. డ్రైవర్ని తోసేసి దూసుకుపోతారు. పోలీసు కారు వెంటాడుతుంది. అంబులెన్స్ లోనే గుండె పేషంటు వుంటాడు. ఇతడ్ని అర్జెంటుగా ఆస్పత్రికి తీసికెళ్ళక పోతే చనిపోతాడని గొడవ పడుతుంది నర్సు. దీంతో అన్నదమ్ముల మధ్య విభేదాలు వస్తాయి. పేషంట్ ని ఆస్పత్రికి తీసికెళ్తే తాము పోలీసులకి దొరికిపోయి అవతల తల్లి మరణిస్తుంది. పేషంట్ ని ఆస్పత్రికి తీసికెళ్ళకుండా పోలీసుల నుంచి తప్పించుకుని పారిపోతే అవతల తల్లిని బతికించుకోవచ్చు, ఇవతల పేషంట్ చస్తాడు. ఈ తగాదాలో అన్నమీద తమ్ముడు తిరగబడతాడు. ముందు తల్లిని రక్షించుకుని, పేషంట్ ని చంపిన నేరం మీదేసుకోవడానికి సిద్ధపడతాడు. ఇప్పుడేం జరుగుతుందనేది    ఫాస్ట్ యాక్షన్ థ్రిల్లర్ మిగతా కథ!
***