రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

20, జూన్ 2022, సోమవారం

1176 : సందేహాలు- సమాధానాలు

 

Q :  నేను కథ రాస్తూంటే సీన్లే వస్తాయి. కథ రాధు. రకరకాల సీన్లు మెదులుతుంటాయి. అవి రాసి వాటిని కథలా పేర్చాలనుకుంటాను. ఇది కరెక్టేనా. ఇలా చేస్తే స్ట్రక్చర్ లో వస్తుందా?
—రత్నాకర్, రైటర్

A :    మనం రచయితో కాదో తెలియని రోజుల్లో వివిధ సినిమాలు చూస్తూంటే కల్పనా శక్తి పురులు విప్పుకుని రకరకాల సీన్లు సృష్టిస్తుంది. ఈ సీన్లు కొన్నే వుంటాయి ఐదో ఆరో. పదేపదే ఈ ఐదారు సీన్లే వెండి తెర మీద వూహించుకుంటూ ఎంజాయ్ చేస్తూంటాం. ఇంతకి మించి సీన్లు ముందుకు కదలవు, కథగా ఏర్పడవు. అయినా గొప్ప రచయిత అయిపోయినట్టు కలల్లో తేలిపోతాం. రాయడం మాత్రం రాదు, రాయడానికి ప్రయత్నించం. ఆ ఐదారు సీన్లు మాత్రం మనతో వుండి పోతాయి. ఈ మొత్తామంతా పగటి కలలు అనొచ్చు. పగటి కలలు తియ్యగా వుంటాయి. ఆ తియ్యదనాన్ని ఆ ఐదారు సీన్లు సరఫరా చేస్తాయి.

        ఒక దశ వస్తుంది. పగటి కలలు వెగటు అన్పించే దశ. ఈ దశలో రెండు జరుగుతాయి : పగటి కలల్లోంచి బయటి కొచ్చి వేరే పనీపాటలు చూసుకోవడం,  పగటి కలల్ని నిజం చేయాలన్న పట్టుదలతో రచయితని బయటికి తీసి సానబట్టడం.

        మీరు రెండోది చేస్తూంటే మొదటి దశ తాలూకు సీన్లే మిమ్మల్ని అలా వెంటాడుతున్నట్టు. కాబట్టి ఆ పగటి కలల దశలోని సీన్లని నిర్ధాక్షిణ్యంగా తుడిచి వేసుకుంటే తప్ప ముందుకు పోలేరు. సినిమా కథంటే సీన్లు ఆలోచించడం కాదు. ముందు కథ ఆలోచించడం. కథకి ముందు ఐడియా ఆలోచించడం. స్ట్రక్చర్ అనే చట్రం వుంది కదాని, ఆ చట్రంలో సీన్లు పడేస్తూ పోతే ఆ చట్రం దానికదే కథ తయారు చేసుకోవడానికి అదేం పిండి మర కాదు. మహా అంటే ఒక కథ అనుకున్నాక దాని తాలూకు మూడు మూల స్థంభాల దగ్గర మూడు సీన్లని మాత్రం ముందు ఆలోచించగలం : ప్లాట్ పాయింట్ వన్-ఇంటర్వెల్-ప్లాట్ పాయింట్ టూ. కాబట్టి ముందు కథ ఆలోచించి దాంతో సీన్లు (కథనం) సృష్టించండి. షార్ట్ కట్స్ పనికి రావు. కథ లేకుండా కథనమెలా వస్తుంది?

Q :   ఈ మధ్య విడుదలైన నాలుగు పెద్ద సినిమాల రిజల్ట్ తో తెలుగు సినిమాల భవిష్యత్తు ప్రశ్నార్ధకంగా మారిందని, మేల్కొనక తప్పదని  ఒక ప్రముఖ వెబ్సైట్ వారు రాశారు. మీరేమంటారు?
—ఆర్, దర్శకుడు

A :    హాలీవుడ్ లో విడుదలవుతున్న సినిమాలు ఎనభై శాతం సైన్స్ ఫిక్షన్- ఫాంటసీ సినిమాలే. అవే భారీ కలెక్షన్స్ ని రాబడుతున్నాయి. ఆ టైటిల్స్ చూస్తే ఏది ఏ సినిమానో  గుర్తుపట్టడం కష్టం. ఇంత కలగాపులగంగా వస్తున్న సైన్స్ ఫిక్షన్ - ఫాంటసీలనే ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు విరగబడి చూడడానికి కారణముంది. కోవిడ్ లాక్ డౌన్స్ దరిమిలా ప్రజల మానసికార్ధిక స్థితిగతులు దెబ్బతిన్నాయి. దీన్నుంచి కాస్తయినా ఊరట పొందాలంటే అలాంటి ఊరడించే భిన్న ప్రపంచాల విహారం కావాలి. ఆ భిన్న ప్రపంచాల విహారాన్ని సైన్స్ ఫిక్షన్ - ఫాంటసీ సినిమాలు అందిస్తాయి. ఈ పనే హాలీవుడ్ చేస్తోంది.      

        కోవిడ్ తదనంతర కాలంలో తెలుగులో కూడా ది ప్రిన్సెస్ బ్రైడ్ లాంటి ఫాంటసీ ప్రేమ కథలు తీయక తప్పదని అప్పట్లో ఇదే బ్లాగులో రాశాం. మార్కెట్ యాస్పెక్ట్ అంటే ఇదే. ప్రేక్షకుల వర్తమాన మానసిక స్థితిని పసిగట్టి తదనుగుణమైన సినిమాలు అందించడం. ఇది జరగలేదు. కోవిడ్ తర్వాత కూడా తెలుగులో మళ్ళీ అవే పాత మసాలా సినిమాలే వస్తున్నాయి. మార్కెట్ ఒకటైతే మార్కెటింగ్ ఇంకోటి చేస్తున్నారు. ఇక ఫలితాలు ఇలా కాక ఎలా వుంటాయి.

        సినిమా అనేది మదర్ టెక్నాలజీ. ఫోటోగ్రఫీ తప్ప మిగతా విజువల్ మీడియాలు సినిమా నుంచే పుట్టాయి. ఇవే విజువల్ మీడియాలు ఇవ్వాళ సినిమాలకి కలుపు మొక్కలుగా మారాయి. సినిమాలకున్న విశాలమైన వెండితెర మరే విజువల్ మీడియాకీ లేదు. ఆ వెండితెర మీద సినిమాలు అనితరసాధ్యమైన కళా ప్రదర్శన చేస్తే తప్ప ఈ కలుపు మొక్కల్ని తట్టుకుని మనలేవు సార్.

Q :  నాకు ఎప్పుడూ ఒక భయం వెంటాడుతుంది. రాసిన స్క్రిప్టు సినిమాగా వర్కౌట్ అవుతుందని ఎలా నమ్మాలి? ఫ్లాప్ అయితే నా చాప్టర్ అక్కడితో క్లోజ్ అయిపోతుందిగా? ఈ సమస్యని ఎలా జయించాలి?
—వి. రాజేందర్, అసోషియేట్

A :    అందుకే స్టోరీ రైటింగ్ చేయొద్దు, స్టోరీ మేకింగ్ చేయాలనేది. ఈ మధ్య ఒక కొత్త హీరోతో మిలాఖత్ అయింది. అతను ఒక నిర్మాతని పట్టుకుని సినిమా తీయించుకున్నాడు. తీయించే ముందు వివిధ మార్కెట్స్ ని దృష్టిలో పెట్టుకున్నాడు. ఇందులో ముంబాయి మార్కెట్ ముఖ్యమైనది. ముంబాయి హిందీ డబ్బింగ్ మార్కెట్  ఎలా వుంటుందంటే, సినిమాలో ఎన్ని ఫైట్స్ పెడితే అంత ఎమౌంట్ వస్తుంది. ఈ హీరో సినిమాలో 14 ఫైట్స్ పెట్టారు. హిందీ మార్కెట్ కి రెండున్నర కోట్లకి అమ్ముడు పోయింది. సినిమా బడ్జెట్ మూడు కోట్లే. తమిళ, మలయాళం డబ్బింగ్ రైట్స్ కూడా అమ్మేశారు. ఇదీ పరిస్థితి. స్టోరీ మేకింగ్ తో మ్యాజిక్.

        ఒక ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ -నిర్మాత వున్నారు. ఆయన మాటలు వింటే భయపడి చస్తాం. అనుభవంలోంచి చెప్పే నిజాలు భయపెట్టిస్తాయి. ఆయన మాటల సారాంశం ఏమిటంటే థియేట్రికల్ రిలీజ్ చేస్తే నిర్మాత చేతికేమీ రాదు. ఎందుకు రాదనేదానికి లెక్కలున్నాయి. ఇతరత్రా రైట్స్ నుంచి డబ్బులు తెచ్చుకోవడమే. ఇదీ సినిమాల పరిస్థితి.   కనుక సక్సెస్ ని దృష్టిలో పెట్టుకుని స్క్రిప్టులో ఎంత క్రియేటివిటీ చొరబెట్టీ లాభం లేదు. ఆ సాఫ్ట్ వేర్ కి వివిధ మార్కెట్స్ లెక్కలకి సంబంధించిన హార్డ్ వేర్ ని కూడా జత కలిపి కథ చేసుకోవాలి. అంటే స్టోరీ మేకింగ్ చేయాలి. పైన చెప్పినట్టు కలుపు మొక్కల వల్ల థియేటర్స్ లో సినిమాలకి ఈ పరిస్థితి.

—సికిందర్