రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Monday, September 14, 2020

976 : సందేహాలు - సమాధానాలు


Q :  నాని నటించిన వి సినిమా రివ్యూలో స్టార్ సినిమాలకి హై కాన్సెప్ట్ కథ వుండాలని రాశారు. అన్ని స్టార్ సినిమా కథలు హై కాన్సెప్ట్ అయి వుండాలా? అసలు హై కాన్సెప్ట్ అనే మాట టాలీవుడ్ లో నేను వినలేదు.
దర్శకుడు  
A : హాలీవుడ్ లో వినే వుంటారు. అక్కడ స్టార్ సినిమాలకి హై కాన్సెప్ట్స్ నే ఆలోచిస్తారు. అంతేగానీ పదుల కోట్ల స్టార్ సినిమాలకి రెండు కోట్ల చిన్న హీరోల సినిమా కథలు  ఆలోచించరు. వి లో నాని చేసిన పొరపాటు తన స్టార్ ఇమేజికి చాలని చిన్న హీరో సినిమా కథని - అంటే లో – కాన్సెప్ట్ ని ఓకే చేసుకోవడమే. నానియే నటించిన గ్యాంగ్ లీడర్ లో ఆల్రెడీ ఈ పొరపాటు చేశాడు. అది చిన్న హీరో చేసుకోవాల్సిన లో- కాన్సెప్ట్ సినిమా. ఇదే దర్శకుడు విక్రమ్ కుమార్ తీసిన మనం హై కాన్సెప్ట్ స్టార్ సినిమా. భారీ బడ్జెట్ తో తీసినంత మాత్రాన స్టార్ సినిమా అయిపోదు. విషయం హై కాన్సెప్ట్ అయి వుండాలి. ఇంకా వివరాలు కావాలంటే ఈ లింకు క్లిక్ చేయగలరు - స్టార్ మూవీస్ అంటే...

Q :  వి లో నెలకొన్న ఎండ్ సస్పెన్స్, మిడిల్ మాటాష్ స్క్రీన్ ప్లే సమస్యల్ని రివ్యూలో వివరిస్తారనుకున్నాము.
కెవిపి, అసోసియేట్
A : వి స్క్రీన్ ప్లే సంగతులు రాయలేదు కాబట్టి సమస్యల విషయం అలా వుండిపోయింది. ఇంకోటేమిటంటే, వి ఒక జానర్లో కూడా లేదు. ఎప్పుడే జానర్లోకి వెళ్ళిపోయి రసాస్వాదనని దెబ్బతీస్తుందో మనమే కాచుకోవాలి. దీని స్క్రీన్ ప్లే సంగతులు రాయాలంటే కొన్ని రోజులు పట్టేలా వుంది.

        (మరో మూడు ఫోన్లు వచ్చాయి. ఆ సందేహాలకి సమాధానాలు బ్లాగులో చూడమన్నాం. 1. బుచ్చి నాయుడు కండ్రిగ లాటి ప్రేమ సినిమాలు  ఓటీటీలో సక్సెస్ అవుతాయా, ఓటీటీ ని దృష్టిలో పెట్టుకుని చిన్న సినిమాలు ఎలా తీయాలి? -  బుచ్చి నాయుడు కండ్రిగ లాటి ప్రేమ సినిమాలు ఓటీటీలో కాదుకదా థియేటర్లలో కూడా ఒక్క రోజు ఆడవు. అది కాలం చెల్లిన ప్రేమ సినిమా. పైగా పీరియడ్ బ్యాక్ డ్రాప్. ఇంకా చూసి చూసి వున్న అవే టెంప్లెట్ సీన్లు. పాయింటు వచ్చేసి ప్రేమకి కులం అడ్డు. ఈ కులాల కథలేమిటి పిచ్చి కాకపోతే. ఓటీటీ ప్లాట్ ఫామ్స్ బోల్డ్, వయోలెంట్, అర్బన్ సబ్జెక్టుల్ని ఫిక్స్ చేసుకున్నాయి. అవి కూడా కొత్త వాళ్ళతో తీస్తే సమస్యే. ఒక ప్రధాన కార్పొరేట్ ఓటీటీ ప్లాట్ ఫామ్ పోస్ట్ ప్రొడక్షన్ వివరాలడుగుతోంది. దాన్నిబట్టి నిర్ణయించే రేట్లు దారుణంగా వున్నాయి. థియేటర్లలో విడుదల చేస్తే ఒక రేటు, చేయకపోతే ఇంకో రేటు. ఏదైనా క్షవరమే. ఇప్పటికే తీసిన సినిమాలు ఓటీటీకి ఇచ్చుకున్నా ఇవ్వకపోయినా, కొత్తగా ప్లాన్ చేసే సినిమాలు ఇంకో ఆరు నెలలకైనా కోవిడ్ తోకముడ్చుకోవచ్చని నమ్మి థియేటర్లని దృష్టి లో పెట్టుకుని మొదలు పెట్టుకుంటే మంచిది. అప్పుడైనా కండ్రిగలు, కడగండ్లు తీసి విడుదల చేస్తే ప్రేక్షకులు క్షమించరు. కోవిడ్ తర్వాత కొత్త శకంలోకి అడుగుపెట్టబోతున్నాం. 

        2. ఒక్క ముక్కలో అసలు కథంటే ఏమిటి
? - ఒక్క ముక్కలో కథంటే ప్రశ్న, ఆ ప్రశ్నకి తగ్గ సమాధానం. ప్రశ్న పుడితేనే ఆ ప్రశ్నతో పాత్ర సంఘర్షించి, తగిన సమాధానం కనుగొంటుంది. ఆ సమాధానం పాత ఫార్ములా సమాధానమై వుండకూడదు, వర్తమాన పరిస్థితులకి వర్తించేదై వుండాలి. ఇది స్క్రీన్ ప్లేలో ప్లాట్ పాయింట్ వన్ (ప్రశ్న), ప్లాట్ పాయింట్ టూ (సమాధానం) లకి వివరణ. 

        3. మలయాళం సినిమాలని చూసిన లొకేషన్లలోనే మళ్ళీ మళ్ళీ చూడక తప్పదా
? - నిజమే, మలయాళ రూరల్ సినిమాలు అవే లోకషన్లతో కనబడుతున్నాయి. అవే కొండలు, అవే లోయలు, అవే ఇళ్ళు. వరసబెట్టి తెలుగు సినిమాలు అరకు లోయలో తీస్తే ఎలా వుంటాయో అలా వుంటున్నాయి. పైత్యం బాగా ముదిరింది. వీటికి రివ్యూలు రాస్తునప్పుడు అద్భుతమైన కొండ కోనలు, లోయలూ పచ్చదమంటూ పదేపదే రాయడం కూడా పైత్యమే. రాయబోయే కిలోమీటర్స్ అండ్ కిలోమీటర్స్ రివ్యూ కూడా ఇలాగే 
తయారైంది). 

సికిందర్