రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Sunday, May 13, 2018

646 : సంచిక డాట్ కాం ఆర్టికల్



             కేవలం ఇరవై  లక్షల జనాభా గల భాషకి ఏకంగా ఒక సినిమా పరిశ్రమే వెలసిందంటే అది  భాష పట్ల వున్న ఆత్మాభిమానంతెలంగాణా రాష్ట్రానికి ఒక ప్రామాణిక భాషకంటే జిల్లాకో భాష వుందిఅందుకే తెలంగాణా సినిమా తీయాలంటే  జిల్లా వాళ్ళు  జిల్లా భాషని  ప్రవేశ పెట్టాలనుకుంటారుదీంతో ఇతర జిల్లాల వాళ్లకి  భాష అర్ధంగాకుండా పోతోందికానీ కర్ణాటకలో తుళు భాష ఇలా కాదుఅక్కడ రెండున్నర జిల్లాల్లో తుళు భాష ఒకటే, యాస ఒకటే. అందువల్ల జనాభా కేవలం ఇరవై లక్షలున్నా,  సినిమా పరిశ్రమ ఏర్పాటు చేసుకుని దానికి ‘టులువుడ్’  అని పేరు పెట్టుకోవడానికీ, దానికి తూర్పు రేఖలు పొడవడానికీ దండిగా కలిసి వచ్చింది. 

          ప్పుడు ఇరవై లక్షల జనభా వుంది, మరి 1971 లో? పది లక్షలు కూడా వుండి వుండదు. కర్ణాటక అంతటా కన్నడ సినిమాలు ఆడతాయి. కన్నడతో పోల్చుకుంటే తుళు అతి  అల్పసంఖ్యాక ఉప ప్రాంతీయ భాష. ఐనా అప్పట్లోనే మొదటి తుళు భాషా చలన చిత్రానికి శ్రీకారం చుట్టారు. దాంతో తుళు సినిమా చరిత్రకీ పుట తెరిచారు.  అలా ‘ఎన్న తంగడి’ (నా చెల్లెలు) టైటిల్ తో దర్శకుడు ఎస్ ఆర్ రాజన్ తనే నిర్మాతగా నిర్మించిన మొదటి తుళు సినిమాగా చరిత్రలో నమోదయింది. ఆనంద్ శంకర్, హేమలత నటించారు. 35 వేల బడ్జెట్ తో తీసి రెండు వారాలు ఆడిస్తే ఇరవై వేలే వచ్చాయి.    

         టులువుడ్ కి కర్ణాటకలో దక్షిణ కన్నడ, ఉడిపి జిల్లాలూ, సరిహద్దు కేరళ రాష్ట్రం కాసర గోడ్ జిల్లాలో కొంత భాగమూ మార్కెట్  ఏరియాగా వున్నాయి. దేశంలో ఇంత  చిన్న సినిమా పరిశ్రమ లేదు. 1971 తర్వాత ’78 వరకూ ఏడాదికి ఒకటి రెండు చొప్పున మరో తొమ్మిది సినిమాలు తీస్తూ పోయారు. తొలి దశాబ్దంలో చేసిన ఈ తొమ్మిది ప్రయత్నాలూ  లాభసాటిగా లేకపోవడంతో,  ఇక పదిహేనేళ్ళ పాటూ ఎవరూ తుళు సినిమాల జోలికి పోలేదు. 1993 లో డాక్టర్ రిచర్డ్ కాస్టెలినో రంగప్రవేశం చేసి టులువుడ్ కి కొత్త ఊపిరి పోశాడు. ఆయన తీసిన ‘బంగర్ పట్లర్’ (బంగారు హృదయం గల పటేల్) జాతీయ, అంతర్జాతీయ అవార్డులందుకుంది. 


        దీంతో ఇదే సంవత్సరం మరో రెండు తుళు సినిమాలు  వెలువడ్డాయి. మళ్ళీ ఈ రెండూ చరిత్ర కెక్కాయి. దర్శకుడు రిచర్డ్ కాస్టెలినోనే  రెండో ప్రయత్నంగా ‘సెప్టెంబర్ 8’ అని ప్రయోగాత్మకం తీశాడు. పూర్తి చిత్రీకరణ అంతా 24 గంటల్లో ముగించి ప్రపంచ రికార్డు సాధించాడు. ఇదే సంవత్సరం దర్శకుడు పీఎన్ రామచంద్ర భూస్వామ్య వ్యవస్థ అంతం పై  ‘శుద్ధ’ అనే వాస్తవిక సినిమా తీశాడు. దీనికి అంతర్జాతీయ అవార్డు వచ్చింది. 
         
         అయినా కొత్త ఊపిరి పోసుకున్న టులువుడ్ నుంచి 1993 - 2011 మధ్య   18 ఏళ్ల కాలంలో మరో 36 సినిమాలు మాత్రమే వచ్చాయి. అదే 2011 – 2017 మధ్య ఐదేళ్ళ కాలంలో చూసుకుంటే, 21 సినిమాలు నిర్మాణమయ్యాయి. దీనికి కారణం 2011 లో తీసిన ‘ఓరియదొరి అసల్’ అనే కామెడీ సూపర్ హిట్ కావడం. కె. విజయకుమార్ రాసిన ఒక నాటకం ఆధారంగా హెచ్ ఎస్ రాజశేఖర్ దర్శకత్వంలో విడుదలైన ఈ కామెడీ తుళులో అన్ని రికార్డులూ బద్దలు కొట్టింది. 

          ఇంత చిన్న మార్కెట్ కోటి రూపాయలతో తీయడమే ఎక్కువైతే,  రెండు కోట్లు కలెక్షన్లు రావడం కళ్ళు తిరిగినంత పని. దీంతో తుళు మార్కెట్ రెండు కోట్లు విలువైనదని అర్ధమైపోయింది. ఇక డబ్బుసంచులు పట్టుకుని రంగంలోకి దిగేవాళ్ళు వరస కట్టారు. 


          ఈ చారిత్రక మలుపులో గమనించాల్సిందేమిటంటే, దేశంలో అన్ని ప్రాంతీయ సినిమాల చారిత్రక మలుపులూ ఇలాగే వున్నాయి. వాస్తవిక సినిమాలని భూస్థాపితం చేసి కమర్షియల్ సినిమాలు నెత్తిన పెట్టుకోవడం. ఆ కమర్షియల్ సినిమాల్ని కాస్తా  వూర మాస్ సినిమాలుగా దిగజార్చి బరువు దించేసుకోవడం. 



     2011 లో ‘ఓరియదొరి అసల్’ (ఒకరిని మించి వొకరు) అనే కామెడీ సూపర్ హిట్ కావడంతో ఇక ఇలాటి కామెడీల కమర్షియల్స్ ఊపందుకున్నాయి. ప్రేక్షకులు కళకళ లాడుతున్నారు. పరిశ్రమ తళతళ లాడుతోంది. సినిమాలు వెలవెల బోతున్నాయి. క్వాలిటీ అనే మాటే లేదు. 

          2014 లో ‘చాలు పోలిల్లు’ అనే కామెడీ అరకోటితో తీస్తే మూడు కోట్లు వచ్చాయి. మంగళూరులో  పివిఆర్ మల్టిప్లెక్స్ లో 500 రోజుల పాటూ ఆడుతూనే పోయింది. 2015 లో ‘చండి కోరి’  రెండున్నర కోట్లు వసూలు చేసింది. 2015 లోనే ‘దండ్’ (సైన్యం) విజయం ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, ఇజ్రాయెల్ లలో ప్రదర్శనల దాకా వెళ్ళింది. 


          ఈ ట్రెండ్ లో మార్కెట్ బెంగళూరు, ముంబాయి, దుబాయిలకి కూడా విస్తరించింది. గత ఐదేళ్ళల్లో విడుదలైన 21 సినిమాలతో తుళు సినిమాల రూపు రేఖలే మారిపోయాయి. కేవలం కామెడీని సక్సెస్ ఫార్ములాగా పట్టుకుని అదే పనిగా ఇప్పుడూ అవే తీస్తున్నారు. విషయం కంటే స్టయిల్ కే ప్రాధాన్యమిస్తున్నారు. కామెడీలతో బాటు అప్పుడప్పుడు థ్రిల్లర్లు తీస్తున్నారు. ఇప్పుడు 2018 లో 15 సినిమాలు విడుదలకి సిద్ధమవుతున్నాయి. మరో పదిహేను సినిమాలు ప్రారంభం కాబోతున్నాయి. ఇంకో 50 సినిమాల టైటిల్స్ రిజిస్టర్ అయ్యాయి. ఈ పెరుగుట విరుగుటకే నని ఒక భయం ఓ పక్క వెన్నాడుతోంది. మార్కెట్ ని మించి ఉత్పత్తి జరుగుతోందేమోనన్న సంకోచాలు మొదలయ్యాయి. 



       మరోవైపు అన్ని ప్రాంతీయ సినిమాలు  ఎదుర్కొన్నట్టే ఇతర భాషల సినిమాలతో పోటీని  కూడా తుళు సినిమా లెదుర్కొంటన్నాయి. మంగళూరు, ఉడిపి పట్టణాల్లో  కన్నడ, హిందీ, మలయాళ, ఆంగ్ల సినిమాలు కూడా ఆడతాయి. వీటి మధ్య థియేటర్లు పొంది విడుదల చేసుకోవడం కష్టంగా మారుతోంది తుళు సినిమాల సంఖ్య పెరిగిపోవడం వల్ల. ఈ ట్రెండ్ ప్రారంభమైన మొదట్లో తుళు సినిమాలు తక్కువ విడుదలయ్యేవి. అవి 100, 50 రోజులు ఆడేవి. రానురానూ రోజుల సంఖ్యా తగ్గిపోతోంది. నిర్మిస్తున్న వాటిలో విజయాల శాతం తగ్గిపోతోంది. బెంగుళూరు నుంచి శాండల్ వుడ్ (కన్నడ) నిర్మాతలు సైతం ఈ వైపు కన్నేసి వచ్చేస్తున్నారు.  రెండు జిల్లాల ఇరుకు పెట్టెలో ప్రతీ ఒక్కరూ ఎక్కాలని ప్రయత్నిస్తున్నారు. బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి కూడా తుళు సినిమా నిర్మాణ ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది. 

          తుళు సినిమాకి తూర్పు రేఖలు తూర్పు రేఖల్లాగే విలసిల్లాలంటే ఈ వలసలు బెడదగా తయారవుతున్నాయి. రెండు జిల్లాల మార్కెట్ మీద ఇక కార్పొరేట్స్ కన్ను ఇంకా పడలేదు. అది కూడా జరిగితే టులువుడ్ కి పడమటి చీకట్లు ముసురుకుంటాయేమో తెలీదు.


సికిందర్