రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

25, డిసెంబర్ 2022, ఆదివారం

1275 : సండే స్పెషల్ రివ్యూ!


 

క్రిస్మస్ హాలీడే సినిమాలు ప్రేక్షకుల్ని వూపిరి సలపనీయకుండా చేస్తూంటాయి. ఇవి ఏడాదికి ఒకసారే వస్తూంటాయి కాబట్టి ఇవి చూడడంలో తలమునకలై వుంటారు అమెరికన్లు. మన దేశంలో క్రిస్మస్ కి విడుదలయ్యే సినిమాలు బాలీవుడ్ నుంచి అయితే 83 అనే స్పోర్ట్స్ సినిమా విడుదలవుతుంది. టాలీవుడ్ నుంచైతే శ్యామ్ సింఘ రాయ్ అనే కమర్షియల్ విడుదలవుతుంది. ఈ సంవత్సరం బాలీవుడ్ నుంచి సర్కస్’, టాలీవుడ్ నుంచి ధమాకా’, 18 పేజెస్ వంటి రెగ్యులర్ సినిమాలే విడుదలయ్యాయి. వీటికి క్రిస్మస్ తో ఏ సంబంధమూ వుండదు.

        తెలుగులో ఒకప్పుడు టీవీల్లో కరుణామయుడు లేదా రాజాధిరాజు క్రైస్తవ భక్తి సినిమాలు  ప్రసారమయ్యేవి. హాలీవుడ్ క్రిస్మస్ సినిమాలు చూసే అలవాటు క్రైస్తవులు ఎక్కువ వుండే కేరళ, గోవా వంటి రాష్ట్రాల్లో, ఈశాన్య రాష్ట్రాల్లో కూడా లేదు. హాలీవుడ్ క్రిస్మస్ సినిమాలంటే క్రైస్తవ భక్తి సినిమాలు కాదు. క్రిస్మస్ తాత కొన్ని సినిమాల్లో కన్పిస్తాడేమో గానీ, ఏసుక్రీస్తు అస్సలు కన్పించడు. హాలీవుడ్ క్రిస్మస్ సినిమాలంటే క్రిస్మస్ పండగ రోజుల్లో జరిగే ప్యూర్ ఫ్యామిలీ, రోమాంటిక్ కామెడీలు. పూర్తి స్థాయిలో నవ్వించడమే వీటి పని. క్రిస్మస్ సంవత్సరానికి ఒకసారి మాత్రమే వస్తుంది కాబట్టి ఈ సినిమాలకి అంత డిమాండ్ వుంటుంది. ఇవి నవ్వించడమే గాకుండా, క్రిస్మస్ జ్ఞాపకాల్ని నెమరేసుకునేలా చేస్తాయి, ఇతరులతో మానవీయంగా వ్యవహరించేలా చేస్తాయి. క్రిస్మస్ రోజుల్లో టీవీ ఛానెల్స్, ఓటీటీ ప్లాట్ ఫామ్స్  క్రిస్మస్ సినిమాల్ని కుమ్ముతాయి. ఈసారి కొంచెం తేడాగా మర్డర్ మిస్టరీ కూడా తీశారు.

హూ కిల్డ్ శాంటా?’ అని క్రిస్మస్ తాత హత్య గురించి హాస్య ప్రహసనం తీశారు. పిల్లలకి బహుమతులు పంచే క్రిస్మస్ తాతని చంపే మతి మాలిన వాడెవడు? వీడిగురించి తెలుసుకోవాలంటే నెట్ ఫ్లిక్స్ లో చూడాలి. అయితే నెట్ ఫ్లిక్స్ దీన్ని మన దేశ భాషల్లో విడుదల చేయలేదు. సబ్ టైటిల్స్ తో ఇంగ్లీషులో వుంది. ఇదెలా నవ్విస్తుందో పరిశీలిద్దాం...

అనుమానితులు కొందరే- అధికారులెందరో!

పోలీస్ డిటెక్టివ్ టెర్రీ సియాటిల్ కి క్రిస్మస్ అంటే పరమ బోరు. ఇంటి దగ్గరే పిజ్జా తింటూ యాక్షన్ సినిమాలు చూస్తూ బద్ధకంగా గడపాలను కుంటాడు. ఈ క్రిస్మస్ కి పిజ్జా ఆరగిస్తూ ఎక్కడిదో పాత వీడియో కేసెట్ వేసుకుని డై హార్డ్ మూవీని రాజసంగా  ఆస్వాదిస్తూంటే, మాజీ భార్య రోండా నుంచి ఫోన్ వస్తుంది. నగర మేయర్ పామర్ సిటీ హాల్లో ఓ కార్యాక్రమం ఏర్పాటు చేసిందని రోండా అంటుంది. ఆ కార్యక్రమంలో అనాధ పిల్లలకి క్రిస్మస్ తాత శాంటా బహుమతులు పంచుతాడని చెప్తుంది. అతడికి సెక్యూరిటీ అవసరమని, మేయర్ పామర్ కొత్త ట్రైనీగా చేరిన జేసన్ ని సెక్యూరిటీగా పంపుతోందనీ సమాచారమిస్తుంది.
        
అయితే తెల్లారే కార్యక్రమం వుండగా రాత్రే శాంటా శవ రూపంలో వుంటాడు. సిటీ హాల్లోనే  క్యాండీ కేన్ గుండెల్లో గుచ్చుకుని కింద పడుంటాడు. తామంతా వుండగా లైట్లు ఆరిపోయి చీకటైందనీ, లైట్లు వచ్చేసరికి శాంటా వేషం వేసిన బ్లేజ్ ఇలా వున్నాడనీ అక్కడున్న వాళ్ళు అంటారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీస్ డిటెక్టివ్ టెర్రీ, అనాధ పిల్లలకి బహుమతులు పంచడం ఏ వెధవకి నచ్చలేదని అడుగుతాడు. గుండెల్లో గుచ్చుకున్న క్యాండీ  కేన్ చీకి వున్నట్టు కన్పిస్తోందనీ, చంపిన వాడు క్యాండీ కేన్ ని చీకి, రుచి నాస్వాదించి మరీ పొడిచి చంపి వుంటాడనీ అంటారు. శాంటాకి సెక్యూరిటీగా వచ్చిన  కొత్త ట్రైనీ జేసన్ ఏమీ తెలియని అమాయకుడిలా వుంటాడు.       
        
మేయర్ పామర్ వచ్చేసి తెల్లారేకల్లా హంతకుడ్ని పట్టుకోకపోతే వచ్చే ఎన్నికల్లో తన పదవి వూడుతుందని, తెల్లారి అనాధ పిల్లలకి బహుమతులిచ్చే కార్యక్రమం కూడా యధావిధిగా జరగాలనీ ఆదేశిస్తుంది. మాయా అనే ఇంకో ట్రైనీని పిలిపించి టెర్రీ కప్పగిస్తుంది. టెర్రీ యుద్ధ ప్రాతిపదికన దర్యాప్తు ప్రారంభిస్తాడు. అనుమానితులు ఈ హత్యని సీరియస్ గా తీసుకోకుండా శవం మీద జోకు లేసుకుంటూ వుంటారు. శవమైన శాంటా వేషం వేసిన బ్లేజ్ కీ, అనుమానితుల్లో ఒకడైన స్పోర్ట్స్ న్యూస్ యాంకర్ జిమ్ కీ కొన్ని స్పర్ధ లున్నాయి. టెర్రీ ప్రశ్నిస్తే, తను బ్లేజ్ కి 9 మిలియన్ డాలర్లు బాకీ పడిన మాట నిజమేననీ, అయితే తన ఎక్కౌంట్లో గానీ, లాకర్లో గానీ డాలరు కూడా లేదనీ అంటాడు. నువ్వు నగ్నంగా మారితే నీ ఎక్కౌంటు, లాకరు డాలరు కూడా లేక నగ్నంగా వున్నాయని నమ్ముతానంతాడు టెర్రీ. వెంటనే జిమ్ బట్టలూడ దీసుకుంటాడు.
        
బ్లేజ్ అసిస్టెంట్ మియా ని ప్రశ్నిస్తాడు టెర్రీ. తనని బ్లేజ్ వేధింపులకి గురిచేసే వాడని అంటుంది మియా. అయితే తను చంప లేదంటుంది. డోనాని ప్రశ్నిస్తాడు టెర్రీ. ఈమె  రెస్టారెంట్ ఓనర్. బ్లేజ్ తో రెస్టారెంట్ అమ్మకం డీల్ కుదరలేదనీ, బ్లేజ్ వెళ్ళిపోయి తన  రెస్టారెంట్ ఎదుటే కొత్త రెస్టారెంట్ తెరిచే పనుల్లో వున్నాడనీ, అయితే అతడి హత్యతో తనకే సంబంధం లేదనీ అంటుంది డోనా.
        
మరి ఎవరు చంపారు? కొత్త ట్రైనీ మాయా ఏదో హడావిడి చేస్తుంది. ఇంకో ట్రైనీ జేసన్ గందరగోళంలో వుంటాడు. చచ్చి పడున్న బ్లేజ్ అప్పుడప్పుడు కళ్ళు తెరిచి జరుగుతున్నది చూసి నవ్వుతూంటాడు. తెల్లారబోతోంది, టైం లేదు. టెర్రీ దర్యాప్తు తీవ్రతరం చేస్తాడు. ఇక లాభం లేదని ఇంకో కొత్త ట్రైనీ డేవిడ్సన్ ని దింపుతుంది మేయర్. ఇతనొచ్చి ఒక ఝలక్ ఇవ్వడంతో మొత్తం మిస్టరీ వీడిపోతుంది. ఏమిటా ఝలక్? ఎలా ఇచ్చాడు? ఎందుకిచ్చాడుఇవి తెరమీద చూడాల్సిందే.

మైండ్ లెస్ కామెడీ

ఏ మాత్రం లాజిక్ లేని మైండ్ లెస్ కామెడీ ఇది. శవం కళ్ళు తెర్చి నవ్వడం సహా. మర్డర్ మిస్టరీని దాని సహజ ధోరణిలో తీస్తే అది క్రిస్మస్ మూవీ అవదు. మర్డర్ ని కూడా కామెడీ తో ఎంటర్ టైన్ చేయాల్సిందే. అయితే ఈ ఆబ్సర్డ్ కామెడీ మరీ ఎక్కువైతే వెగటు పుట్టిస్తుంది. అందుకని గంట నిడివితోనే ఈ మూవీ వుంటుంది. ముగింపు ఒక సర్ప్రైజ్.         

ఇందులో నటీనటులందరూ టీవీ నుంచి వచ్చిన వాళ్ళే. దర్శకురాలు లారా మర్ఫీ నల్గురు రచయితలతో కలిసి ఇంకో ప్రయోగం చేసింది. ట్రైనీలుగా నటించిన ఇద్దరు నటులకి కథ చెప్పకుండా, సీను పేపర్లు ఇవ్వకుండా, నటిస్తున్న ఇతర నటీనటులతో సీనుని అర్ధం జేసుకుని నటించమంది. అందుకే ట్రైనీ మాయా ఏదో హడావిడీ చేస్తూ కన్పిస్తుంది, ట్రైనీ జేసన్ గందరగోళంగా వుంటాడు. ఇలా ఇదో కామెడీ క్రియేటయ్యింది. ఈ ప్రక్రియని ఇంప్రోవైజ్డ్ యాక్టింగ్ అంటారనీ, ఇది పురాతన కాలం నుంచీ నాటకాల్లో వుందనీ, తర్వాత టీవీ షోలలో ప్రవేశించిందనీ సెలవిచ్చారు. ఇలా హూకిల్డ్ శాంటా ప్రయోగాత్మక క్రిస్మస్ కామెడీ అయింది. మర్డర్ విల్లీ మర్డర్ మిస్టరీస్ సిరీస్ లో ఇది రెండోది.

—సికిందర్