రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

5, జనవరి 2022, బుధవారం

1112 : ఆర్టికల్

    2020, 2021 లలో ఒక మాయదారి మహమ్మారి మిగిల్చిన బాధాకర అనుభవాల్ని మర్చిపోయి కొత్త ఆశలు చిగురింప జేసుకుని సినిమా రంగం 2022 లోకి అడుగు పెడుతూంటే, ఇప్పుడూ వదలడం లేదు మరింకో రూపంలో విరుచుకు పడుతున్న పేచీకోరు మహమ్మారి. ఒమిక్రాన్ గా కోరలు చాచి పరిహాస మాడుతూంటే భారీ బడ్జెట్లతో తీసిన బాలీవుడ్ నిర్మాతలు సైతం వణికి పోతున్నారు. రోజు రోజుకూ ఒమిక్రాన్ కేసులు విపరీతంగా పెరిగి పోతూండడంతో, రాష్ట్రం తర్వాత రాష్ట్రం థియేటర్ల మూత, లేదా సీటింగ్ సామర్ధ్యంలో కోత అంటూ నిర్ణయాలు తీసుకోవడం సినిమాల విడుదలలకి గండంగా మారింది. హిందీ సినిమాలు, లేదా సౌత్ నుంచి వెళ్ళే పానిండియా సినిమాలూ విడుదల చేయాలంటే దేశవ్యాప్తంగా, కొన్ని బయటి దేశాల్లో, థియేటర్లు బార్లా తెరిచి వుండాలి. కానీ దేశం లోపలా, బయట ఓవర్సీస్ లోపలా కొత్త కోవిడ్ వేరియెంట్ ఒమిక్రాన్ నేను ముందు! అంటూ పోటీపడి ఎక్కడపడితే అక్కడ విడుదలవుతూంటే, సినిమాలెలా విడుదలవుతాయి? ఒకప్పుడు షోలే’, దిల్ వాలే దుల్హానియా లేజాయేంగే ఐదేళ్ళు పైబడి ఆడాయి. కోవిడ్ కూడా అన్నేళ్లు ఆడాలని చూస్తోందేమో రూపాలు మార్చుకుని...

        డిసెంబర్ నుంచే దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య పెరుగుతూ వచ్చింది.  తీవ్రఅనారోగ్యంతో ఆసుపత్రిలో చేరే కేసులు, మరణాల సంఖ్యా చాలా తక్కువగా వున్నా, కేసుల ఆకస్మిక పెరుగుదలతో ఆరోగ్య సంరక్షణా వ్యవస్థ మరోసారి అతలాకుతలమవుతుందన్న భయాందోళనలతో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకుంటున్నాయి.  దేశ రాజధాని ఢిల్లీలో ప్రభుత్వం ముందే థియేటర్లని మూయించేసింది. బాలీవుడ్ కి గుండె కాయైన ముంబాయిలో రాత్రి కర్ఫ్యూ విధించేశారు. బెంగళూరు, చెన్నైలలో థియేటర్లలో యాభై శాతం మేరకే సీటింగ్ సామర్ధ్యాన్ని అనుమతిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఇంకా ఈ పరిస్థితి లేదు. తెలుగు రాష్ట్రాల్లో ఈ పరిస్థితి లేకపోయినా, పానిండియాలు కాబట్టి ప్రేక్షకుల గుమ్మం దాకా వచ్చిన  ఆర్ ఆర్ ఆర్’, రాధే శ్యామ్ విడుదలలు ఆగిపోయాయి.

        ఈ రెండు సినిమాల్ని కూడా కలుపుకుని బాలీవుడ్ లో ఇంకో రెండు హిందీ సినిమాలని లెక్కేస్తున్నారు : పృథ్వీరాజ్’, జెర్సీ’. షాహీద్ కపూర్ - మృణాళ్ ఠాకూర్ లు నటించిన జెర్సీ డిసెంబర్ 31 న విడుదల కావాల్సింది. నిరవధికంగా వాయిదా పడింది.  అక్షయ్ కుమార్- మానుషీ  చిల్లర్ నటించిన పృథ్వీరాజ్ జనవరి 21 న విడుదల కావాల్సింది. నిరవధికంగా వాయిదా పడింది. మధ్య యుగాల యోధుడు, సామ్రాట్ పృథ్వీరాజ్ చౌహాన్ బయోపిక్ గా తెరకెక్కిన ఈ బిగ్ బడ్జెట్ చారిత్రాత్మకం సూర్యవంశీ వెతల్ని గుర్తుకు తెస్తోంది. ఇది కూడా అక్షయ్ కుమార్ నటించిన బిగ్ బడ్జెట్టే. 2020 మార్చిలో కోవిడ్ మొదటి రౌండు నుంచీ, 2021 రెండో రౌండునీ దాటుకుని, నాల్గు సార్లు వాయిదా పడి - ఏడాదిన్నర తర్వాత ఖర్మ అనుకుంటూ గత నవంబర్లో విడుదలైంది. అయినా ప్రేక్షకులు ఆసక్తి కోల్పోలేదు. పెద్ద హిట్ చేశారు. ఇదే ఎన్నిసార్లు విడుదలలు వాయిదాలు పడ్డా పృథ్వీరాజ్’, జెర్సీ’, ఆర్ ఆర్ ఆర్’, రాధేశ్యామ్ లకూ వర్తిస్తుంది.

        ఈ పరిస్థితులన్నీ దృష్టిలో పెట్టుకుని  మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఎంఏఐ) ప్రభుత్వాని కొక అర్జీ పెట్టుకుంది. గత రెండు కోవిడ్ ల తర్వాత మళ్ళీ థియేటర్లు తెరవడానికి అనుమతించాక, మెరుగైన వెంటిలేషన్ సిస్టమ్‌లు, మెరుగైన పరిశుభ్రత, ఇతర భద్రతా ప్రోటోకాల్‌ల అమలు ద్వారా ప్రేక్షకులకి, థియేటర్లలోని సిబ్బందికీ సురక్షిత వాతావరణాన్ని థియేటర్ల యాజమాన్యాలు కల్పించాయి. ఎక్కడా ఒక్క సినిమా థియేటర్ నుంచి కూడా ప్రేక్షకులకి కోవిడ్ సంక్రమించిన ఉదంతాలు లేవు. అందుకని సినిమా హాళ్ళని మూసేసే బదులు, మహారాష్ట్ర సహా కొన్ని ఇతర రాష్ట్రాల్లో, సినిమా థియేటర్లలోకి ప్రవేశం కల్పించడానికి డబుల్ టీకా సర్టిఫికేట్ తప్పనిసరి చేయాలని కోరింది... ఈ సూచన సబబుగా వుంది. వేల కోట్ల రూపాయలు ధారబోసి డబుల్ టీకాలు వేసి ప్రజల ప్రాణ రక్షణతో సరిపెడితే కాదుగా? ఆర్ధిక రంగ పరిభ్రమణానికి కూడా టీకాలు తోడ్పడకపోతే వేలకోట్ల రూపాయలు అనుత్పాదక వ్యయమే అవుతుంది- రేపొక వేళ వేస్తే బూస్టర్ డోసు సహా.

—సికిందర్