రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

4, జులై 2016, సోమవారం

కామెడీ సంగతులు- 3

   హాలీవుడ్ లో ఒక పూర్తి స్థాయి కామెడీ స్క్రిప్టు రాయాలంటే  మొదటి పేజీలోనే నవ్వించగల్గాలి. మొదటి పేజీలో నవ్వించ లేదంటే స్క్రిప్టులు  చదివే స్టూడియో ఎగ్జిక్యూటివ్ దాన్ని పక్కన పెట్టేసే ప్రమాదముంది. మొదటి పేజీలోనే  నవ్వించడమంటే ఇంకా నిద్ర లేవని హీరో మీద బామ్మగారు  బిందెడు నీళ్ళు తెచ్చి గుమ్మరించడంలాంటి అరిగిపోయిన సీను కాదు. ఎప్పటికప్పటి అభిరుచులకి తగ్గట్టు తాజాగా  క్రేజీగా బుర్ర తిరిగిపోయే సరికొత్త కామిక్ ఐడియాతో వుండాలి. తెలుగులో ఇంత  అవసరం రావడంలేదు, మొదటి పేజీ నిబంధన అంటూ ఏదీ లేదు కాబట్టి. ఐతే కామెడీ అనగానే కథలు చాలా ఆషామాషీగా రాసేయడం మాత్రం జరుగుతోంది. జోకులతో నవ్వించడమే కామెడీ అన్నట్టు సాగుతోంది. కథలేని వంద జోకులకన్నా, జోకుల్లేని కథ వున్న సినిమాలు వందరెట్లు బెటర్ అన్పించుకుంటాయి.
        కామెడీ జానర్ కీ, ఇతర జానర్లకీ స్ట్రక్చర్ లో తేడా ఏమీ వుండదు. ఏ జానర్ లో  కథ కైనా స్ట్రక్చర్ ఒకటే.  అదే బిగినింగ్, మిడిల్, ఎండ్ విభాగాలు; వాటిలో వాటి తాలూకు బిజినెస్ లు, ప్లాట్ పాయింట్లు అన్నీ ఒకటే. కాకపోతే ఇవి కామెడీకి హాస్య రూపంలోకి బదిలీ అవుతాయి.  ఈ హాస్య రూపం రివర్స్ మెకానిజం వల్ల  ఏర్పడుతుంది. ఇతర కథల్లో హీరో ఫలానాది జరగాలని ప్రయత్నిస్తూంటాడు, కామెడీల్లో హీరో ఫలానాది జరక్కూడదని చెడగొడు తూంటాడు. జరిగితే తన పరువే పోవచ్చు, లేదా  నల్గురు కలిసి తనని తన్న వచ్చు. అవన్నీ  హీరోకి జరిగి తీరాలని విలన్ తెగ కౌంటర్ పథకా లేస్తూంటాడు. దొంగ పెళ్లి చేసుకున్న హీరో అది బయట పడకుండా ప్రయత్నించడం, మర్డర్ చేశాననుకుని ఫీలవుతున్న హీరో ఎక్కడ పోలీసులకి దొరికిపోతానో అని భయపడి చావడం, స్వయంవరం లో హీరోయిన్ని సొంతం చేసుకుందామని వెళ్ళిన హీరోకి అక్కడ తన గుట్టు తెలిసిన విలన్ ఎదురు పడ్డం...లాంటి ఇరకాటాలే కామెడీ కథల రివర్స్ మెకానిజపు పరికరాలు. 

        కామెడీ అంటే గందరగోళాలు సృషించే వాళ్ళకీ, ఆ గందరగోళాల  బాధితులకీ మధ్య జరిగే సంఘర్షణ. అయితే ఈ గందరగోళాలకి  మూలం అర్ధంవంతంగా, నమ్మశక్యంగా వుండాలి. ఉదాహరణకి గతవారం విడుదలైన ‘రోజులు మారాయి’ లో కథా మూలం-  హీరోయిన్లు పెళ్లి చేసుకుంటే వాళ్ళ భర్తలు  మూడ్రోజుల్లో చనిపోతారని బాబా చెప్పడం, అది నమ్మి  తమ వెంట పడుతున్న హీరోలని వదిలించుకోవడానికి హీరోయిన్లు వాళ్ళని పెళ్లి చేసుకోవడం. అంటే హీరోలని చంపెయ్యడమే అన్న మాట. ఇది కన్విన్సింగ్ గా అన్పించదు.  ఈ కథా మూలం ఆధారంగా కామెడీని ఎంజాయ్ చేయడం కష్టం. 
      ఇందుకే  కామెడీకి సెటప్ వాస్తవికంగా వుండాలి, దాని పర్యవసానంగా పుట్టే   హాస్య ప్రహసనాలు మాత్రం  వాస్తవికంగా, లాజికల్ గా వుండ నవసరం లేదు. ఎంత మైండ్ లెస్ కామెడీగా నైనా ఉండొచ్చు ( హిందీ ‘గోల్ మాల్’ సిరీస్ సినిమాలు). కామెడీ కథ పుట్టడానికి మూలమైన సంఘర్షణ, సంఘటన లేదా ఓ కోరిక వాస్తవికంగా, లాజికల్ గా వున్నప్పుడే దాన్ని ఆధారంగా చేసుకుని ఎంత అసంబద్ధ కామెడీ నైనా చేసి ఒప్పించ వచ్చు. సెటైర్స్ ఇలాగే  పుడతాయి. ఒక పాకెట్ సిగరెట్ల కోసం ఐదుమైళ్ళు కారేసుకుని తండ్రి వెళ్ళడం చూసిన కొడుకు, వాటర్ బాటిల్ కోసం అదే కారేసుకుని వంద మైళ్ళు వెళ్లి రెండ్రోజుల తర్వాత రావడం అబ్సర్డ్ కామెడీ. తండ్రి చేసింది దుబారా కింద కన్విన్సింగ్ గానే అన్పించుకుంటుంది, ఈ సాకుతో కొడుకు చేసింది చాలా అతి. ఇదీ  అబ్సర్డ్ కామెడీ. ఇంకా కొడుకు ఆ కారునే కుదువ బెట్టి వాటర్ బాటిల్ కొనుక్కుని బస్సెక్కి కూడా రావచ్చు. ఇంకెలాటి పిచ్చి పనులైనా చెయ్యవచ్చు, లిమిట్ లేదు. ఎందుకంటే తండ్రి దుబారా అనే మూలం కన్విన్సింగ్ గా వుంటుంది కాబట్టి. ‘అహ నా పెళ్ళంట’ లో పిసినారి కోట శ్రీనివాస రావు ఎదురుగా కోడిని వేలాడదీసుకుని, దాన్ని చూస్తూ చికెన్ కలుపుకుని తింటున్నట్టు ఫీలవుతూ అన్నం తినడం అబ్సర్డ్ కామెడీ. ఎదురుగా కోడి ఉనికి, దాన్ని తింటారనే వాస్తవమూ  లేకపోతే  ఈ కామెడీ పండదు. 

        కామెడీ  పర్ఫెక్షన్ ని కోరుకోదు. పర్ఫెక్షన్ అనేది భ్రాంతి అనుకుంటుంది. కాబట్టి ఒక కామెడీ హీరో చాలా జోకర్ పనులు చేసి చిటికెలో  అద్భుతాలు సాధిస్తాడు. ఈ మాత్రం దానికి  గొప్ప మేధావియే కానక్కర్లేదని చురక అంటిస్తాడు. చార్లీ చాప్లిన్ తర్వాత అలాటి  సైలెంట్ మూవీ కామిక్ సిరీస్ తో పాపులరైన లారెల్ అండ్ హార్డీలు ఈ కోవకి చెందుతారు. 

        కామిక్  హీరో పాసివ్ గా వుండడు, చాలా కమర్షియల్ గా యాక్టివ్ గా వుంటాడు. కథని తనే నడిపిస్తాడు. అతడికీ ప్లాట్ పాయింట్ వన్ దగ్గర గోల్ ఏర్పడుతుంది, అతడికీ ఆ గోల్ కోసం సంఘర్షణ  వుంటుంది. అతనూ ఆ గోల్ ని సాధించి తెరిపిన పడతాడు.  

       
కామెడీ జానర్ లో కి అనేక సబ్ జానర్స్ వున్నాయి. అన్నీ ప్రయత్నించ వచ్చు, లేదా ఏదో ఒకదాన్ని స్పెషలైజ్ చేస్తూ కొనసాగవచ్చు. ప్రధానంగా కామెడీలో రోమాంటిక్ కామెడీ (అహ నా పెళ్ళంట), కామెడీ డ్రామా(బృందావనం), యాక్షన్ కామెడీ (కృష్ణ) , కామిక్ థ్రిల్లర్ (స్వామి రారా), హార్రర్ కామెడీ (ప్రేమ కథా చిత్రం), ఫాంటసికల్ కామెడీ (సోగ్గాడే చిన్ని నాయనా), బ్లూ కామెడీ (ఈరోజుల్లో),  స్పూఫ్ ( సుడిగాడు), ఫార్స్  (రోజులు మారాయి),  బ్లాక్ కామెడీ (మనకి లేదు), సెటైర్ ( మనకి లేదు), పేరడీ ( మనకి లేదు), రాజకీయ కామెడీ (మనకి లేదు)...ఇలా 35 వరకూ వున్నాయి. 

        ఏది తీసుకున్నా స్ట్రక్చర్ ఒకటే.  బిగినింగ్ లో పాత్రల పరిచయం, కథా నేపధ్యం ఏర్పాటు, సమస్యకి దారి తీసే పరిస్థితుల కల్పన, సమస్య ఏర్పాటు (ప్లాట్ పాయింట్-1). దీంతో బిగినింగ్ విభాగం ముగియడం అనేవి వుంటాయి. 

          ప్లాట్ పాయింట్ -1 అంటే అసలు కథా ప్రారంభమనీ, హీరోకి ఒక గోల్ ఏర్పడ్డ మనీ తెలిసిందే. ‘అహ నా పెళ్ళంట’ లో పిసినారి కోట కూతుర్ని పెళ్లి చేసుకోవాలంటే, తను కూడా పీనాసిలా మారాలని ( నటించాలని) రాజేంద్ర ప్రసాద్ నిర్ణయించుకోవడం గోల్, అసలు కథా ప్రారంభం. 

        ఈ గోల్ లో కోరిక, పణం, పరిణామాల హెచ్చరిక, ఎమోషన్ అనే నాల్గు ఎలిమెంట్స్ వుంటాయని తెలిసిందే. ఉన్నప్పుడే కథ బలంగా వుంటుంది. ‘ఆహ నా పెళ్ళంట’ లో పరమ పిసినారి కోట శ్రీనివాసరావు కూతురు రజనీని రాజేంద్ర ప్రసాద్ చేసుకోవడం కోటీశ్వరుడైన రాజేంద్ర ప్రసాద్ తండ్రి నూతన్ ప్రసాద్ కిష్ట ముండదు. తను కోటీశ్వరుడి  కొడుకని చెప్పుకోకుండా కోటని ఒప్పించి అతడి కూతుర్ని చేసుకోగల్గితే ఓకే అని షరతు పెడతాడు. ఇందుకో  గడువు విధిస్తాడు. ఈ గడువులోగా ఇది జరక్కపోతే తను చూసిన సంబంధం చేసుకోవాలంటాడు.  

        పదిహేనవ నిమిషంలోనే ఏర్పాటయ్యే ఈ ప్లాట్ పాయింట్ -1 నుంచి బయల్దేరే  రాజేంద్ర ప్రసాద్ కి- 1. గడువు లోగా గోల్ సాధించుకోవాలన్న కోరిక, 2. తండ్రి షరతుతో రిస్కు వున్నా తన ప్రేమనే పణంగా పెట్టడం, 3. తను పిసినారిలా నటిస్తే అది కోట కి తెలిసిపోగల పరిణామాల హెచ్చరిక, 4. తండ్రి పెట్టిన  షరతు వల్ల  పుట్టిన ఎమోషన్ అనే నాల్గు గోల్ ఎలిమెంట్సూ వున్నాయి. 

        ఈ ప్లాట్ పాయింట్ -1  సీన్ ని ఇంకా గమనిస్తే ఇది సీరియస్ గా వుండదు. తండ్రీ కొడుకుల సవాళ్ళు కామెడీగానే వుంటాయి. ఇదే ఒక ప్రేమ కథనో, ఫ్యామిలీ కథనో అయివుంటే ఈ సీను కామెడీగా ఉండకపోవచ్చు. తండ్రీ కొడుకులు సీరియస్ గా ఘర్షణ పడొచ్చు ఆ కథల జానర్ మర్యాద ప్రకారం. కామెడీకి కామెడీగానే ఈ సీను  వుండడం జానర్ మర్యాద. రసభంగం కలిగించని  రస పోషణ అంటారు దీన్ని. 

        మరొకటేమిటంటే, తండ్రీ కొడుకులు ఇంత కామెడీగా సవాళ్లు విసురుకున్నా దీని బ్యాక్ డ్రాప్ కామెడీగా కాక సీరియస్ గానే  వుంటుంది. గోల్ ని సాధించుకోవాలన్న కోరికలో సీరియస్ నెస్, ప్రేమని పణంగా పెట్టడంలో వున్నసీరియస్ నెస్, పిసినారిలా నటిస్తే అది కోట కి తెలిసిపోగల పరిణామాల హెచ్చరిక లో సీరియస్ నెస్, తండ్రి పెట్టిన  షరతు వల్ల  పుట్టిన ఎమోషన్ లోనూ  సీరియస్ నెస్...ఇలా ఈ సీరియస్ బ్యాక్ డ్రాప్ లో కథనం మాత్రం కామెడీ గానే నడవడం! ఇంత సీరియస్ బ్యాక్ డ్రాప్ లో హీరో పాల్పడే చేష్టలు కామెడీగానే వుండడం! 

     ఈ డైమెన్షన్, ఈ ద్వంద్వాలు,  ఈ కాంట్రాస్ట్, ఈ అదృష్టం ఇంకే జానర్ కథలతోనూ సాధ్యపడదు కామెడీతో తప్ప. ఇతర జానర్ల కథల్లో ఈ బ్యాక్ డ్రాపూ సీరియస్ గానే వుంటుంది, గోల్ కోసం హీరో ప్రయత్నాలూ సీరియస్ గానే వుంటాయని గమనిస్తూంటాం. ఈ తేడా తెలుసుకుని కామెడీ స్ట్రక్చర్ చేసుకోవాలి. 

        ఇంకొకటేమిటంటే,  రోమాంటిక్ కామెడీల్లో ప్రత్యర్ధులు రెండు రకాలుగా వుంటారు : వుంటే హీరో హీరోయిన్లే పరస్పరం ప్రత్యర్ధులుగా వుండడం, లేదా ఇంకోటేదో పాత్ర ( ‘అహ నా పెళ్ళంట’ లో కోట) హీరో హీరోయిన్లు ఇద్దరికీ కలిపి విలన్ గా వుండడం. ఇతర జానర్ల కథల్లో- కామెడీ లో ఇతర సబ్ జానర్లలో సైతం-  హీరో హీరోయిన్లు ప్రత్యర్ధులుగా వుండడం అరుదు. 

        బిగినింగ్ విభాగం ప్లాట్ పాయింట్ -1 తో ఇలా ముగిశాక, మిడిల్ ప్రారంభమవుతుంది. కామెడీల్లో మిడిల్ అంటే కూడా సంఘర్షణే. రాజేంద్ర ప్రసాద్ కోట ఇంట్లో దిగి పిసినారి చేష్టలు చేయడం గోల్ కోసం చేసే సంఘర్షణే. కోట కంటే వెయ్యి రెట్లు ఎక్కువ పిసినారిగా నటిస్తాడు. మిడిల్ బిజినెస్ లో క్యారక్టర్ ఆర్క్ పెరుగుతూ పోవాలి. గోల్ కోసం  అడుగడుగునా హీరో తీసుకునే రిస్క్ మీద ఈ ఆర్క్ ఆధారపడి వుంటుంది. ఎంత రిస్క్ తీసుకుంటే అంత ఆర్క్ పెరుగుతుంది. అంతేగాక హీరో పాత్ర ప్రయాణంలో ఎత్తు పల్లాలు కూడా వుంటాయి. ఇక్కడ హీరోయిన్ కి వేరే పెళ్లి సంబంధం చూడ్డం ఇలాంటిదే. అన్ని అవరోధాలూ అధిగమించి చివరికి కోటని ప్రసన్నం చేసుకుంటే, రాజేంద్ర ప్రసాద్  డబ్బున్న వాడు కాదని మెలిక పెడతాడు కోట. దీంతో మొదటి కొస్తుంది. ఇలా దారులన్నీ మూసుకు పోవడం మిడిల్ బిజినెస్ కి ముగింపని తెలిసిందే. ఇది ప్లాట్ పాయింట్-2. ఇక ఇక్కడ్నుంచీ ఎండ్ ప్రారంభం. మళ్ళీ హీరో కొత్త పరిష్కార మార్గం వెతుక్కుని మొదలవ్వాలి. అలాగే చేస్తాడు రాజేంద్ర ప్రసాద్.  కోటకి బుద్ధి చెప్పడానికి మూడు డబ్బున్నసంబంధాలు తెచ్చి గందర గోళం క్రియేట్ చేసి తన కథ సుఖాంతం చేసుకుంటాడు. 

        ఏ కామెడీ జానర్ కైనా ఇదే స్ట్రక్చర్ వుంటుంది. మిగతా జానర్లకి లాగే ఇక్కడా ప్లాట్ పాయింట్ -1 ప్రాణం. పైన వివరించుకున్నట్టు ఈ ప్లాట్ పాయింట్ -1 తో వచ్చే బ్యాక్ డ్రాప్ ఎంత సీరియస్ గా వుంటే అంత బలంగా కామెడీ వర్కౌట్ అవుతుంది. లేని పక్షంలో ఒట్టి జోకులతో కాలం గడపాల్సి వస్తుంది.  ఫాంటసికల్ కామెడీ ‘సోగ్గాడే చిన్ని నాయనా’ లో  చిన్న నాగార్జున- లావణ్యలు విడాకుల కోసం రావడం సీరియస్ బ్యాక్ డ్రాప్. ‘స్వామిరారా’ అనే కామిక్ థ్రిల్లర్ లో వినాయక విగ్రహ అపహరణ అనే బ్యాక్ డ్రాప్ కూడా సీరియస్ ఐనదే. ‘బృందావనం’ అనే ఫ్యామిలీ కామెడీలో రాజేంద్ర ప్రసాద్ తాతా నానమ్మ లైన గుమ్మడి, అంజలీదేవిల భవంతిని రమ్యకృష్ణ  తండ్రి సత్యనారాయణ చీట్ చేసి కొట్టేయడం కూడా సీరియస్ బ్యాక్ డ్రాపే. ‘సుడిగాడు’ లో అల్లరి నరేష్ పుట్టినప్పుడు జయప్రకాష్  రెడ్డి కొడుకు మీద మూత్రం పోస్తే  అతను చనిపోయి అల్లరి నరేష్ మీద జయప్రకాశ్ రెడ్డికి పగ రగలడమూ సీరియస్ బ్యాక్ డ్రాపే...కామెడీకి బాగా వర్కౌటయ్యే ఈ సీరియస్ బ్యాక్ డ్రా పుల విషయంలో గుర్తు పెట్టుకోవాల్సింది ఒక్కటే : ఇక్కడ ఏర్పడే ప్లాట్ పాయింట్ -1 మాత్రం సీరియస్ గా ఉండకూడదు. పాత్రలు కామెడీ గానే ప్రవర్తించాలి- పైన ‘అహ నా పెళ్ళంట’ లో  పేర్కొన్న తండ్రీ కొడుకుల సవాళ్ళ లాగా!

        కామెడీ కథనం డైనమిక్స్ ప్రధానంగా సాగుతుంది. జూలో కంచె  దూకి పులితో సేల్ఫీ దిగి వచ్చిన అఖిలేష్ విజయగర్వంతో యూరినల్స్ కి వెళ్తే అక్కడ పులి వుండడం రివర్స్ మెకానిజంతో ఏర్పడే డైనమిక్స్. నవ్వొచ్చే విధంగా, ప్రేక్షకుల ఊహకందకుండా, ఆనందం విషాదంగా మారడం, విషాదం ఆనందంగా మారడమనే పంచ్ కామెడీ కథనానికి ప్రాణం. డైనమిక్స్ ఎప్పుడూ పాత్రల కదలికలతో, యాక్షన్ ప్రధానంగా వుంటే మంచిది. పాత్రలు కదలకుండా వున్న చోటే వుండి  డైలాగులతో కామెడీ నడపడం  అన్ని సీన్లకీ పనికి రాదు. ఇలాటి వెర్బల్ కామెడీ వల్ల  నడక మందగిస్తుంది. విజువల్ కామెడీ తో పరుగులు పెడుతుంది కథనం. సినిమా విజువల్ మీడియా అనేది గుర్తుంచుకోవాలి. సినిమా విజువల్ మీడియా  అని గుర్తు పెట్టుకుంటే చాలా సినిమాలు బాగు పడతాయి- ‘ఒక మనసు’ లాంటివి రావు. 

        ఇక కామెడీని ద్వంద్వార్ధాలతో నడపాలా వద్దా అనేది  రచయిత ఇష్టం. కానీ కామెడీ పేరుతో  సమాజంలో ఏ వొక వర్గాన్నీ కించపర్చకుండా వుంటే మంచిది.  అలాగే కామెడీ-హేళన – ఈ రెండిటి పట్ల అప్రమత్తంగా వుండకపోతే ఆత్మరక్షణలో పడక తప్పదు. రాస్తున్న కామెడీ హేళన చేసే విధంగా ఉందేమో సరిచూసుకోవాలి. లేకపోతే తనని రేపైన మహిళ తో పోల్చుకున్న సల్మాన్ ఖాన్ లాంటి పరిస్థితి ఎదురవుతుంది. లేదా లతా మంగేష్కర్ నీ, సచిన్ టెండూల్కర్ నీ పాత్రలుగా చేసి ఘోరమైన సెటైర్లు వేసిన తన్మయ్  భట్ లాంటి చిక్కుల్లో పడక తప్పదు. ఇలాటివి డార్క్ హ్యూమర్ కింద చెల్లిపోవు. ‘అ ఆ’ లో కత్తితో మణికట్టు కోసుకుని ఆత్మహత్యా యత్నం చేసిన సమంతా ని డాక్టర్ ట్రీట్ చేశాక, ‘మీ కిచెన్ లోకి వాడిగా వుండే వేరే కత్తులు కొనండి’  అని కామెడీ ఏదో చేస్తే అదీ  డార్క్ హ్యూమర్ అన్పించుకుంటుంది.
(సమాప్తం)


-సికిందర్