రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Saturday, March 13, 2021

1023 : మూవీ నోట్స్


         రైతులు బాగు పడాలన్నా, సినిమాలు బాగు పడాలన్నా మార్కెట్ దృష్టే ప్రధానం. మార్కెట్ ని ఏ దృష్టితో చూస్తున్నారన్నది ముఖ్యం. ఇందులోంచి ఆవిర్భవించిందే సినిమాలకి సంబంధించి మార్కెట్ యాస్పెక్ట్ అన్నఆలోచన. మార్కెట్ యాస్పెక్ట్ కి తగ్గ క్రియేటివ్ యాస్పెక్ట్ అన్న కార్యాచరణ. శ్రీకారం సినిమా కాన్సెప్ట్ అయిన వ్యవసాయానికి ఏది మార్కెట్ యాస్పెక్ట్ అవుతుంది? స్టాలిన్ తెచ్చిన సమిష్టి వ్యవసాయం విఫలమైంది. లెనిన్ తెచ్చిన పంటల మీద ప్రభుత్వానికి అధిక బాగం విధానం కూడా విఫలమైంది. ఈ రెండు సార్లూ రైతులు తిరగబడ్డారు.        తెలంగాణా రైతాంగ పోరాటంలో దొరల చేతుల్లోంచి లాక్కున్న భూములు దొరల చేతుల్లోకే వెళ్ళాయి. ఇప్పుడు ప్రభుత్వం నయాదొరల (కార్పొరేట్) చేతుల్లో వ్యవసాయ రంగాన్నిపెట్టే కొత్త చట్టాలు తెచ్చింది. దీని మీద తిరగబడుతున్నారు రైతులు. ఇలాంటప్పుడు  శ్రీకారం  హీరో ఇంకా రైతులతో ఉమ్మడి వ్యవసాయం చేయిస్తానంటాడు దొరలాగా. రైతులతో ఉమ్మడి వ్యవసాయం చేయించడం, ఇది చూపించి వ్యవసాయం లోకి రావాలని యువతకి సందేశమివ్వడం, ఎలా సినిమాకి మార్కెట్ యాస్పెక్ట్ అవుతుంది?   

        మ్మడి కుటుంబ వ్యవస్థే అసాధ్యమైనప్పుడు అందరూ కలిసి వుండే ఉమ్మడి కుటుంబాలు ఇంకా కావాలనే సినిమాలు వస్తున్నాయి అవగాహన లేకుండా. ఇప్పుడు ఉమ్మడి వ్యవసాయం సినిమా వచ్చింది. దెబ్బతిన్న రైతుల్నీ వాళ్ళ భూముల్నీ ఒక చోట చేర్చి, హీరో రైతులకి నెలజీతాలివ్వడం, హీరో సహా అందరూ కలిసి పంటలు పండించుకోవడం, ఆ పంటల్ని అమ్మి హీరో ఆదాయాన్ని పంచడం. ఇదీ కథ. హీరో యాజమాన్యంలో ఉమ్మడి వ్యవసాయం.

        ఈ కథలో అసలు రైతులెందుకు వ్యవసాయం వదిలేశారు. విత్తనాలు, ఎరువులు, ఇంకేవో బరువులు వంటి టెంప్లెట్ సినిమా కారణాలు చెప్పారు. హీరో ఇది నమ్మి టెంప్లెట్ గా కొత్త వ్యవసాయ పద్ధతులు, కొత్త పంటలు ప్రవేశపెట్టాడు. దీంతో టెంప్లెట్ గా విజయం సాధించాడు. పంటలు ఎలా పండించాలో రైతులకి తెలియకనా. వాళ్ళ చేత చెప్పించిన టెంప్లెట్ కారణాలకంటే పెద్ద సమస్య మార్కెట్ సమస్య. హీరో ఎంత గొప్పగా ఆధునిక పద్ధతులనే టెంప్లెట్ తో పరిశోధనలు చేసి ఉమ్మడి వ్యవసాయం చేయించినా, మార్కెట్లో సగానికి సగం ధరలకే అమ్మాలి. అప్పుడు మిగిలేది గుండు సున్నా.

        కనీస మద్దతు ధరల కంటే హీనంగా ధరలు నిర్ణయిస్తున్నాయి మార్కెట్ శక్తులు. ఇక్కడే రైతు దివాలా తీస్తున్నాడు. హిమాచల్ ప్రదేశ్ లో ఏడు రూపాయలకి, పది రూపాయలకి కిలో యాపిల్ పళ్ళు కొని, 150 రూయాయకి వినియోగదార్లయిన మనకి అమ్ముతున్నాయి కంపెనీలు. రైతులే కాదు, వినియోగ దార్లయిన మనమూ దోపిడీకి గురవుతున్నాం. మనం నిశ్శబ్దంగా వుంటున్నాం, రైతులు ఆందోళన బాట పట్టారు. వరి ధాన్యం కూడా ఇలాగే కొనుగోలు చేసి, కేజీ ఇరవై రూపాయలకి తయారైన బియ్యాన్ని, విదేశాల్లో 150 కి అమ్ముతున్నారు.

        ఫేస్ బుక్ లో ఒక వీడియో పెట్టారు అమెరికాలో ఒక తెలుగు వ్యక్తి. అందులో వ్యవ సాయ క్షేత్రంలోనే రైతు వినియోగదారులకి కూరగాయలు అమ్ముతున్న దృశ్యాలు వివరించారు. అలాటి వ్యవసాయ క్షేత్రాలున్నాయి. రైతులు అన్ని కూరగాయలూ, ఆకు కూరలూ, అల్లం వెల్లుల్లి సహా పళ్ళూ ఒకే చోట పండిస్తారు. రైతులు తమకి కావాల్సినవి నేరుగా చెట్ల నుంచి కోసుకుని డబ్బు చెల్లిస్తారు. ఇలా వినియోగదారులకి తక్కువ ధరలకి లభించడమే గాక, రైతులకి ఎన్నో మార్కెటింగ్ ఖర్చులూ తప్పుతున్నాయి. ఇంకో తలుగు వ్యక్తి అమెరికాలో సంతల గురించి వీడియో పెట్టారు. మనకి హైదరాబాద్ లో వివిధ చోట్ల వారం వారం తోపుడు బళ్ళ మీద సంతల్లాగా అక్కడా వున్నాయి.

        మన దేశంలో మొత్తం వ్యవసాయరంగం మీద ఆధార్పడ్డ మూడువేల వివిధ పరిశ్రమలు ఏటా ఇరవై లక్షల కోట్లు ఆర్జిస్తున్నాయి. కానీ 85 శాతం మంది రైతులు వాళ్ళకి వ్యవసాయోత్పత్తు లందించి, నెలసరి ఆదాయం బొటాబొటీగా ఆరువేల రూపాయలు చేతిలో మిగిలి దీనంగా బ్రతుకులీ డుస్తున్నారు. ఇవి ప్రభుత్వం దగ్గరున్న గణాంకాలే. రైతు అన్నదాత అనే భుజకీర్తులు అవసరం లేదు, రైతు కంపేనీలకి లక్షల కోట్ల ఆదాయ ప్రదాతగా కరిగిపోతున్న కొవ్వొత్తి. ఇది గుర్తించాలి. ప్రభుత్వాలు కంపెనీల్ని నియంత్రించవు. వాటికి కంపెనీల నుంచి వచ్చే వివిధ పన్నులు, పార్టీ ఫండ్స్ కావాలి. ఇలా ప్రభుత్వాలూ కంపెనీలూ రైతుల మీద స్వారీ చేస్తూ తమ పంట పండించుకుంటున్నాయి.

        ఈ వాస్తవాలు తెలుసుకోకుండా, హీరో ఉమ్మడి వ్యవసాయంతో ఉద్ధరిస్తాననడం అపరిపక్వతే అవుతుంది. ఒక స్టార్ సినిమాకి ఇంత అల్లి బిల్లి కథ వుండకూడదు. అసలు వ్యవసాయం వదిలేసిన రైతులతోనే ఉమ్మడి వ్యవసాయం చేయించి, వ్యవసాయంలోకి యువత రావాలని ఎలా సందేశ మిస్తారు. ఈ సినిమా టార్గెట్ ఆడియెన్స్ రైతులే అన్నట్టుంది. వాళ్ళ టెంప్లెట్ కష్టాలూ కన్నీళ్ళూ ఉమ్మడి వ్యవసాయాలూ ఇవే చూపించారు. ఇంతా చేసి ఎవరూ ఉమ్మడి వ్యవసాయంతో బాగుపడినట్టు చూపించలేదు. మొదట్లో వున్న గెటప్స్ తోనే చివర్లో వున్నారు. ఆర్ధిక ఉన్నతి  లేదు. హీరో దొరతనం అలాగే వుంది. అసలు కరోనా కాలంలో రైతుల కడగండ్లు అంటూ చూపించడమేమిటి. కరోనా కాలంలోనే ఇతర పరిశ్రమలూ వ్యాపారాలూ కుప్ప కూలిపోగా, వ్యవసాయరంగ
మొక్కటే జీడీపీ తో దేశాన్ని ఆదుకుంది. సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ లాగా సినిమాలో కూడా ఫేక్ న్యూస్ వుంటే ఎలా?

        సినిమాలో ఇచ్చిన సందేశంతో ఈ స్టార్ మూవీ టార్గెట్ ఆడియెన్స్ యూత్ అవ్వాలి. అప్పుడు యూత్ ని ఆకర్షించే కథా కథనాలే యూత్ అప్పీల్ తో వుండాలి. ఇదీ ఈ సినిమాకి మార్కెట్ యాస్పెక్ట్. ఇప్పుడు చూపించాల్సింది రైతులతో ఉమ్మడి వ్యవసాయం కాదు. ఎక్కడెక్కడున్న ఆ రైతుల కొడుకుల్నీ, కూతుళ్లనీ రప్పించి, వాళ్ళ వాళ్ళ వ్యవసాయాల్ని ఇప్పుడంటే ఇప్పుడే వాళ్ళ చేతే చేయించడం. కష్టాలూ కన్నీళ్ళతో కాదు.  డైనమిక్ గా, వైబ్రెంట్ గా. జాయ్ రైడ్ గా. వాళ్ళ అమాయకత్వం, పిచ్చి పనులూ సహా ఎంటర్ టైనర్ గా. హీరో కేవలం మోటివేటర్ గా. దొర కాదు, ఖజానా గుప్పెట్లో పెట్టుకున్న యజమాని కాదు. ఇక మార్కెట్ శక్తులతో యూత్ డీల్ చేసే రూటేవేరు. మెడలు వంచి ముకుతాడేస్తారు. మార్కెట్ యార్డుని ఫార్మర్ ఖిల్లా చేస్తారు.      

        పోతే, స్క్రీన్ ప్లే పరంగా ఈ సినిమాకి స్ట్రక్చర్ అనేది ఏమాత్రం లేదు. కాన్ఫ్లిక్టే లేదు. కాన్ఫ్లిక్ట్ లేకుండా కథెలా అవుతుంది. డాక్యుమెంటరీ అవుతుంది. అయింది.

సికిందర్