రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

11, అక్టోబర్ 2017, బుధవారం

529- డార్క్ మూవీస్ స్క్రీన్ ప్లే సంగతులు

      పీడకల డార్క్ మూవీస్ ఎలిమెంట్స్ లో ఒకటని చెప్పుకున్నాం. పీడకల లేనిదే డార్క్ మూవీ పూర్తి కాదు. డార్క్ మూవీస్ కథలు, పాత్రలు అంటేనే మనసు లోపలి చీకటి కోణాల  వెలికితీత కాబట్టి, పీడకలల్ని భాగం చేశారు. డార్క్ మూవీస్ అంత నేరుగా ప్రేక్షకుల అంతరంగాల్ని కెలికే సినిమాలుండవు. డార్క్ మూవీస్ జానర్ ప్రధాన లక్ష్యమే నైతికతని ప్రశ్నించడం, అనైతికాన్ని ఖండించడం. ఈపని మూలాల్లోకి వెళ్లి - అంటే -  అంతరంగాల్లోకి వెళ్లి అక్కడ శస్త్రచికిత్స  చేస్తేగానీ పూర్తిగాదు. కనుక ఈ చికిత్సలో పీడకలలు భాగమయ్యాయి. అంతేగానీ ఏదో థ్రిల్ కోసం వుండాలన్నట్టు కాదు.  పీడకలలు రెండు రకాలు – ఏదో  కీడు తలపెడితే దాని గురించి వెంటాడే పీడకలలు, ఓ కీడుని ముందస్తుగా  హెచ్చరిస్తూ వచ్చే  పీడకలలు.  ఏ రకం పీడకలైనా  ఉద్దేశం ఒకటే – నిజం తెలుసుకుని సంస్కరించుకోమని చెప్పడమే. పీడకలల్లో భయపెట్టే అంశాలు నిజానికి నిజాలే.  అవి ప్రశ్నిస్తున్న, హెచ్చరిస్తున్న నిజాలని గుర్తించకుండా పెడ కేకలు పెడుతూ లేచిపోయి, కాసిని నీళ్ళు తాగేసి  కమ్మగా బజ్జుంటాం. 

            పీడకలల్ని అంతరంగం, అంటే సబ్ కాన్షస్ మైండ్ ఉత్పత్తి చేస్తుంది. దీనికి హెచ్చుతగ్గుల్ని సమం చేయడమే పని. లేకపోతే  సృష్టి బ్యాలెన్సు తప్పుతుంది. సృష్టిలో  మనతో సహా సమస్తం పదార్ధమే కాబట్టి,  పదార్ధమంటే శక్తి తరంగాల గుచ్ఛమే కాబట్టి, ఈ శక్తి తరంగాలు నిత్యం బ్యాలెన్స్ చేసుకుంటూ సృష్టిని కాపాడుతూంటాయి. ఈ అవగాహన నుంచే క్వాంటమ్  ఫిజిక్స్ పుట్టింది, స్పిరిచ్యు వాలిటీకి దగ్గరయ్యింది.  ఇలా హెచ్చు తగ్గుల్ని సమం చేయడానికే సృష్టి స్ట్రగుల్ చేస్తూంటుంది. ఒక తప్పువల్ల శక్తి తరంగాల తూకం ఆ వైపు మొగ్గితే, ఆ శక్తి తరంగాల్ని ఒప్పు వైపుకి మార్చి రెండిటిని బ్యాలెన్స్ చేస్తూంటేనే   ఈ సృష్టి నడిచేది. దీన్నే లా ఆఫ్ కాంపెన్సేషన్ (నష్టపరిహారం) అన్నాడు ఎమర్సన్. ఒకడు అవినీతి చేసి ప్రజాధనం కూడబెట్టి బ్యాలెన్సు చెడగొడితే, కేసుల రూపంలో మళ్ళీ ఆ ప్రజాధనాన్ని ప్రజలకి చేర్చి సమం చేయడం శక్తితరంగాల బ్యాలెన్సు కోసం సృష్టి చేసుకునే పని అన్నమాట. చేసింది తప్పయితే ఆ పాపపరిహారం చెల్లించుకోమనే లోక కల్యాణార్ధం పీడకలల రూపంలో చెప్తుంది అంతరంగం...

           
డార్క్ మూవీస్ లో సందర్భాన్ని  బట్టి రెండిట్లో ఏదైనా ఓ రకం పీడకల వుంటుంది. ప్రస్తుత ‘బ్లడ్ సింపుల్’ లో ఏముందో చూద్దాం. నిన్నటి 32 వ సీనులో ఎబ్బీ బార్ కెళ్ళి మార్టీ చనిపోయాడన్న కొత్త నిజం తెలుసుకుంది. ఈ నిజం పీడకల రూపంలో ఎలా వచ్చిందో, ఏం చెప్తోందో చూద్దాం...

33. ఎబ్బీకి మార్టీ తో పీడకల రావడం 
           ఫేడిన్ :
           అదే లాంగ్ షాట్ - ఎబ్బీ బెడ్ మీద వుంటుంది. ఆమె కళ్ళు తెరచి క్షణం కదలకుండా అలా వుంటుంది. దగ్గుతుంది. బెడ్ మీంచి లేచి  చీకటి ఫ్లాట్ లో నడుచుకుంటూ బాత్రూం కెళ్తుంది. డోర్ వేసుకుంటుంది.

            సింక్ దగ్గర అద్దంలో తనని తాను చూసుకుంటుంది. బయటి  అపార్ట్ మెంట్ గోడమీద కొడుతున్నట్టు చప్పుడవుతూంటే చెవులు రిక్కిస్తుంది.  మొహం మీద నీళ్ళు జల్లుకుంటుంది. 

            ఆఫ్ స్క్రీన్ లో ఎక్కడ్నించో అద్దం పగిలిన చప్పుడవుతుంది. క్షణకాలం ఆ శబ్దం ప్రతిధ్వనిస్తుంది. నిశ్శబ్దం. బాత్రూం డోర్ వైపు చూస్తుంది. ఫ్లాట్ డోర్ లాక్ మీద గీస్తున్న శబ్దం. ఆకస్మాత్తుగా  లాక్ వూడిపోయి  డోర్ తెర్చుకున్న చప్పుడు.

            క్లోజ్ షాట్ లో ఎబ్బీ – కలవరపడుతుంది. టాప్ కట్టేసి కొయ్యబారిపోయి నించుంటుంది. మొహం మీది  నీటి  బిందువులు  జారుతూంటాయి. అడుగులు విన్పిస్తాయి. గాజు పెంకులు చిట్లుతున్న చప్పుడు. ‘రే?’ – అని అంటుంది.  

            సమాధానం వుండదు. అవతల గదిలో బెడ్ స్ప్రింగుల చప్పుడు. ఇక బాత్రూం డోర్ తీసుకుని బయటి కొచ్చేస్తుంది.  

            బాత్రూం లైటు తెర్చి వున్న తలుపులోంచి అవతల గదిలో ఫ్లోర్ మీద పడుతూంటుంది. ఆ వెలుతురులో  పగిలిన అద్దం పెంకులు కన్పిస్తూంటాయి.  అక్కడున్న బెడ్ మీద చీకట్లో ఎవరో కూర్చుని వుంటాడు. అతను తల పైకెత్తి చూస్తాడు.    

            అతను మార్టీ.
            బిగుసుకుపోతుంది ఎబ్బీ.
            ‘డోర్ లాక్ చేయాల్సింది లవర్ బాయ్...’ అంటాడు.  

            నెర్వస్ గా చూస్తుందతడి కేసి. ముఖం మీది  నీటి బిందువులు ఇంకా జారుతూనే వుంటాయి – ‘ఐ లవ్ యూ’ అంటాడు  మార్టీ. 

            పెదాల చివర్నుంచి స్మైలిస్తాడు – ‘స్టుపిడిటీలా వుంది కదూ ఐ లవ్ యూ అంటూంటే?’ అంటాడు. ఒకడుగు వెనక్కేసి నించుంటుంది – తనూ ‘ఐ లవ్ యూ’ అనే స్తుంది. ఆ మాట భయంవల్ల వచ్చిందంటాడు తల అడ్డంగా వూపుతూ.

            లేచి నిలబడతాడు. కాలికింద గాజు చిట్లుతుంది. కోటు మధ్య బటన్ తీసి, చెయ్యి పెడతాడు – ‘నీ వెపనేదో మర్చిపోయొచ్చినట్టున్నావ్’ అంటూ ఏదో తీసి ఆమె మీదికి విసురుతాడు. 

 .          క్లోజ్ షాట్ లో ఎబ్బీ చేతులు. ఆ వస్తువుని పట్టుకుంటుంది.  అది కాంపాక్ట్.
            ఎబ్బీ క్లోజ్ షాట్.
            చేతుల్లోకి చూస్తున్నదల్లా తలెత్తి అతణ్ణి చూస్తుంది.
            ‘వాడు నిన్ను కూడా చంపేస్తాడు’ అంటాడు మార్టీ. 
            నోటికి చేయి అడ్డం పెట్టుకుని వంగిపోయి, రక్తవాంతి చేసుకుంటాడు.
               అదిరిపడి లేచి కూర్చుంటుంది ఎబ్బీ.
            మొహం చెమట్లు పట్టేస్తుంది. చుట్టూ చూస్తుంది.

            ఎబ్బీ పాయింటాఫ్ వ్యూ – కిటికీ లోంచి వెన్నెల పడుతూంటుంది ఫ్లోర్ మీద. కిటికీ లోంచి రోడ్డవతలి బిల్డింగ్ ముందుభాగం కన్పిస్తూంటుంది.  చీకటిగా, నిశ్శబ్దంగా వుంటుంది.

***
     ఇదీ పీడకల        
      వెనక సీన్లో బార్ లో ఆమె రక్తం మరకల్ని చూసి వెనక్కి అలా పడిపోతూంటే ఫేడవుట్  అయి ప్రస్తుత సీన్లో ఫేడిన్ అయినప్పుడు - బెడ్ మీద వుంటుంది ఎబ్బీ నిద్రలో.  ఈ ఫేడవుట్ – ఫేడిన్ లతో ఒక సీన్లోంచి ఇంకో సీన్లోకి స్మూత్ ట్రాన్సి షన్. ఇక్కడొక సందేహం వస్తుంది. బార్లో మార్టీ రక్తం మరకల్ని చూస్తే, వెంటనే వెళ్లి రే ని ప్రశ్నించకుండా ఇంటికొచ్చి ఎలా నిద్ర పోయిందని. వెనుక 29 వ సీన్లో- మార్టీని ఆమె షూట్ చేసిందన్న అనుమానంతో వున్న రే,  ఆమెని ఈసడించుకుని వెళ్ళిపోతాడు. ఎబ్బీ కేమీ అర్ధంగాక ఆ తర్వాత 31 వ సీన్లో బార్ కెళ్ళి చూస్తే మార్టీ చనిపోయాడని తెలుస్తుంది.  ఈ పని చేసింది తను కాదని ఎలా నిరూపిస్తుంది? అందుకని వచ్చి పడుకుంది. పడుకున్నప్పుడు వచ్చిన ఈ పీడకలలో మార్టీ మీద ఎటాక్ మిస్టరీ వీడిపోయింది.

            ఇదెలాగో చూద్దాం. ఈ పీడకల రానున్న ప్రమాదాన్ని హెచ్చరిస్తోంది. కలలో మార్టీ కన్పించి హెచ్చరించాడు. మార్టీకి – అతడి ఆత్మకి – ఇప్పటికీ భార్య ఎబ్బీ  మీద పగలేదు. అతడిది లవ్ హేట్ రిలేషన్ షిప్ లా వుంది. ఇప్పుడూ ఆమె క్షేమమే కోరుకున్నాడు. అతడి పగ అంతా రే మీదనే. 

            ఈ పీడకల సీనుని ఎలా రూపొందించారో చూస్తే, పూర్తిగా సబ్ కాన్షస్ మైండ్ రికార్డింగ్ లా వుంటుంది. ఇలా వుండాలి కూడా. ఎన్నో నిజాలతో చాలా సంక్లిష్టంగా వుంటుంది. కలలో ఆమె లేచింది. బాత్రూం కెళ్ళింది. చిత్రీకరణలో వివరంగా వున్న ఈ బాత్రూం సీను చూస్తే, ఆమె సింక్ దగ్గర అద్దం  ముందు నిలబడి తనని తానూ చూసుకుంటుంది. ఫ్రేములో సింక్ కన్పించదు. ఫ్రేము లోంచి ఆమె తల కిందికి వెళ్తుంది. తిరిగి పైకెత్తితే మొహం మీద నీళ్ళుంటాయి.  ఇంకో రెండు సార్లు ఫ్రేము లోంచి ఆమె తల కిందికీ పైకీ అవుతుంది. ఇలా వంగడం, మొహం మీద నీళ్ళు జల్లుకుని లేవడం లోని అంతరార్ధమేమిటో వెంటనే మనకి బోధపడదు.

            ఇక మన మైండ్ గమనించినా గమనించకున్నా, సబ్ కాన్ష మైండ్ సీసీ కెమెరాలా  ప్రతీదీ గమనించి రికార్డు చేసుకుంటుంది. దాని దృష్టి నుంచి ఏదీ తప్పిపోదు. అది సర్వాంతర్యామి. సృష్టి అంతటా వ్యాపించి వుంటుంది. ఎబ్బీ బార్ కెళ్ళినప్పుడు బయట ఆఫ్ స్క్రీన్ లో ఏదో  చప్పుడవడాన్ని  ఆమె గమనించలేదు. కానీ సబ్ కాన్షస్ మైండ్ పట్టించుకుని రికార్డు చేసింది. ఆ చప్పుడు బార్  లోపలున్న విస్సర్ యాక్టివిటీ అని మనకి తర్వాత తెలుస్తుంది. తర్వాత ఆమె లోపలి కెళ్ళి నప్పుడు, బ్యాక్ ఆఫీసు డోర్ అద్దం పగిలిపోయి వుండడం, ఆ అద్దం పెంకులు నేలంతా పడుండడం చూస్తుంది. అలాగే వెనుక డోర్ లాక్ పగలగొట్టినట్టుగా కూడా గ్రహిస్తుంది. కానీ ఈ పని విస్సర్ చేశాడనీ, అతను  బాత్రూం లోనే దాక్కుని వున్నాడనీ ఆమెకి తెలీదు. 

            తర్వాత సేఫ్ దగ్గర సుత్తిని చూశాక, సేఫ్ డయల్ డ్యామేజీ అయి వుండడం చూశాక – ఇది రే పనే  అన్నట్టుగా ఆమెకి అర్ధమయ్యింది- మళ్ళీ డబ్బుకోసం రే వచ్చి ఈ ప్రయత్నం చేశాడని. మార్టీ చెయిర్ కింద రక్తపు మరకలు  చూశాక  సీక్వెన్స్ అర్ధమయ్యింది- డబ్బు కోసం మళ్ళీ వచ్చిన రే, మార్టీ తో గొడవ పడి చంపి, డబ్బున్న సేఫ్ తెరవడానికి విఫల యత్నం చేశాడని. ఇక్కడ ఆమె గ్రహించని విషయాలు రెండు- జస్ట్ ఆమె బార్లోకి వస్తున్నప్పుడు వెలువడుతున్న చప్పుడే  విస్సర్ సేఫ్ ని పగులగొడుతున్న చప్పుడని,  విస్సర్ బాత్రూం లో దాక్కున్నాడనీ.  బార్ బయట ఆమె చప్పుళ్ళు పట్టించుకుని వుంటే, రహస్యంగా బార్ లోకెళ్ళి,  విస్సర్ గారి వ్యవహారం అప్పుడే  చూసేసేది!

            ఇప్పుడు కలలో సీను ప్రారంభం తిరిగి ఆమెకి బార్ అనుభవాన్నే ఇస్తోంది సబ్ కాన్ష మైండ్. నిజాలు గుర్తించమని. బయట గోడ మీద బాదుతున్న చప్పుడు, బార్ బయట తను  పట్టించుకోని చప్పుడే. ఇప్పుడు చెవులు రిక్కించి వింటోంది. డోర్ లాక్ చప్పుడవడం, అద్దం పగిలి ముక్కలవడం – ఇదంతా బార్ సీన్నే తలపిస్తోంది. బార్ సీన్లో అదంతా రే నిర్వాకమని అర్ధం జేసుకున్న నేపధ్యంలో ఇప్పుడు, బెడ్ స్ప్రింగుల చప్పుడు కూడా విన్పించడంతో,   అతనే వచ్చాడనుకుని  ‘రే?’ అని అనేసింది పైకే. 

            కానీ ఆమె భయపడలేదు కలలో కూడా. మార్టీ ని రే చంపాడని ఆమెకి తోచినా, అతను తనకీ ప్రమాదం తలపెడతాడన్న భయం ఆమెకి లేదు. తనకోసమే ఇదంతా చేస్తున్నాడన్న భరోసా వుంది.

            అలా నిర్భయంగా ఆమె బాత్రూం డోర్ తీసి చూసినప్పుడు – ఇక్కడ   రివర్స్ లో వుంటుంది దృశ్యం. వెనుక సీన్లో  బార్ కెళ్ళి ఆమె లైటేసినప్పుడు ఆ వెలుగు బాత్రూం లో దాగిన విస్సర్ మీద పడిందని గమనించాం. ఇప్పుడు  బాత్రూం లోంచి లైటు వెలుగు అవతల గదిలో పడుతోంది. అంటే లైటు కాంతి అనేది విస్సర్ ఉనికికి సింబాలిజం అనుకుంటే,  ఈ సింబాలిజం ఇప్పుడు బాత్రూం లోంచి బయటికొచ్చేసి ఆమెకి చూపిస్తోంది - ఏమిటి?  ఇక్కడ ముందు గదిలో పడున్న అద్దం ముక్కల్ని.  కింద పడున్న అద్దం ముక్కల మేరకే  వెలుగు ఇక్కడ పడుతోంది. ఈ అద్దం  ముక్కలు కూడా విస్సర్ కి   సింబాలిజమే. బార్ లో అతనే వెనుక డోర్ అద్దం పగులగొట్టి లోపలికొచ్చాడు. ఇందుకే ఇప్పుడు బాత్రూం లోంచి లైటు వెలుగు,  అద్దం  ముక్కలూ ఇలా కనెక్ట్ అయ్యాయి. 

            దీనర్ధం తర్వాత మేల్కొన్నాక ఆమె ఆలోచించినా తట్టకపోవచ్చు. ఎందుకంటే ఆమె జీవితంలో విస్సర్ ఉనికేలేదు. అతణ్ణి వూహించలేదు.

            ఇక అద్దం పెంకుల కావల బెడ్ మీద కూర్చున్న మార్టీ కాళ్ళు రివీలవుతాయి. ఆ కాళ్ళకి హంటర్ బూట్లు అలాగే వుంటాయి, ఇంకా వేటాడే మూడ్ లోనే వున్నట్టు సూచిస్తూ. ఎబ్బీ సబ్ కాన్షస్ ఉత్పత్తి చేసి ఆమెకి చూపిస్తున్న స్వప్నావస్థలో  విస్సర్ బార్ లోకి జొరబడిన తీరునే మార్టీ మీద పెట్టి ఇక్కడ ఫ్లాట్ లో చూపిస్తోంది. విస్సర్ బార్ లో ఎలా జొరబడ్డాడో, ఇక్కడ మార్టీ అలాగే జొరబడ్డాడు.

             ‘డోర్ లాక్ చేయాల్సింది లవర్ బాయ్’ అంటాడు మార్టీ వ్యంగంగా-  ఆమెని రే తన రక్షణలో వుంచుకోవడంలేదన్న భావంతో. అంటే రే ని ఫూలిష్ గా నమ్ముతున్నావని ఉద్దేశం. అప్పుడు – ‘ఐ లవ్ యూ’  అంటాడు. అతనెప్పుడూ ఆమెని ప్రేమిస్తూనే వున్నాడు. శిక్షించాలనే ఆలోచన అతడికి వచ్చే ప్రసక్తి లేదు. అతడితో ఆమె సేఫ్టీ ఫీలవ్వొచ్చు.  ఆమెకూడా ఐలవ్ యూ అనేసేసరికి,  అది భయంవల్ల అంటాడు. 

            ఇప్పుడు లేచినిలబడి కోటు మధ్య బటన్ తీస్తాడు. చేయి కోటు లోపల పెట్టి కాంపాక్ట్  తీసి ఆమె మీదికి విసురుతాడు. విసురుతూ ‘
నీ వెపనేదో మర్చిపోయొచ్చి
నట్టున్నావ్’ అంటాడు. 

            ఏమిటి దీనర్ధం? సబ్ కాన్షస్ పూర్తిగా సింబాలిజాలతోనే పని కానిచ్చేస్తుంది. కలల్ని చూపించేస్తుంది. ఈ కాంపాక్ట్ సింబాలిజం ఏమిటి? దాన్నెందుకు తీసి ఆమె మీదికి విసిరాడు? కోటు లోపల్నుంచి దాన్ని తీయడానికి మధ్య బటనే ఎందుకు తీశాడు? దాన్ని ఆమె వెపన్ అని ఎందుకన్నాడు?

            ఫస్టాఫ్ బిగినింగ్ లో ఎస్టాబ్లిష్ చేసిన ఆమె స్వభావం లోకెళ్తే,  ఆమె భర్తతో విసిగి బయట షికార్లు తిరుగుతూ సాంత్వన పొందుతోంది. కొత్త కొత్త హేండ్ బ్యాగులు కొనే అబ్సెషన్ ఇందులోంచే వచ్చింది. ఆ తిరుగుళ్ళతో ఎక్కడో తగిలిన  రేని ఆకర్షించి అతడితో ఎఫైర్ పెట్టుకుంది. ఆమె ఎఫైర్ పెట్టుకోవచ్చు, కానీ భర్త వుండగా కాదు. భర్తతో తెగతెంపులు చేసుకుని ఎవరితోనైనా ఎఫైర్ పెట్టుకోవచ్చు. లేకపోతే  చిక్కులొస్తాయి. శాంతి భద్రతల సమస్య తలెత్తుతుంది. సృష్టి సమతూకం దెబ్బ తింటుంది. అల్లకల్లోలం మొదలవుతుంది. ఆమె భర్తకి విడాకులివ్వలేదు, రేతో తిరుగుతోంది. 

            మార్టీని ఎలాగైతే ఆకర్షించి పెళ్లి చేసుకుని వుంటుందో,  అలాగే రేని కూడా ఆకర్షించి ఎఫైర్ పెట్టుకుంది. ఆకర్షణ ఆమె అస్త్రం. ఆ అస్త్రానికి ప్రతిరూపం ఈ కాంపాక్ట్. కాంపాక్ట్ అంటే మేకప్ అద్దుకునే పౌడరు.  దీన్నే 
నీ వెపనేదో మర్చిపోయొచ్చినట్టున్నావ్’ అని తీసి ఆమె మీదికి విసిరాడు. ఇప్పుడు దీని అవసరం ఆమెకుందన్న ఉద్దేశంతో. రే నిన్ను కూడా చంపేస్తాడూ, ఇక నువ్వు ఇంకొకణ్ణి పట్టే ఆకర్షణ మొదలెట్టూ అనే అర్ధంలో!

            పాత్రల స్థితిగతుల్లోకి ఎంత లోతుగా వెళ్లి ఆలోచిస్తే ఇలాటి  రక్తమాంసాలున్న చిత్రణలొస్తాయి! బ్యూటిఫుల్ క్రియేషన్.
            ఇక కోటు మధ్య  బటన్ తీయడ మేమిటి?  పై బటన్ కి – కింది బటన్ కీ  మధ్య బటనే తీసి కాంపాక్ట్ తీయడమేమిటి? అంటే, మొదటి బటన్ అనే నీకూ, రెండో బటన్ అనే  నాకూ మధ్య వుండేడ్చిన  ఈ కాంపాక్ట్ అనే ఆకర్షణ  తీసుకో - తీసుకుని ఫో- అనడమన్న మాట.

            ఇది సీను ముగింపు. సీను ముగింపుకీ ప్రారంభానికీ ఎలా లంకె వేశారో చూద్దామా?  బాత్రూం లో ఆమె మొహం మీద నీళ్ళు జల్లుకునే అంతు చిక్కని చర్యకి ఈ ముగింపులో సమాధాన ముంది. మూడు సార్లు వంగి వంగి మొహం మీద నీళ్ళు కొట్టుకుంది. మొహం కడుక్కోవడమంటే ముస్తాబవడమే కదా?  ఒకసారి మార్టీ కోసం అయింది, రెండోసారి రే కోసం అయింది, మూడోసారికీ రెడీ అయిపోతోంది... ఎవరి కోసం?  ఇది భావి జీవితం...ఈ చర్యకి సీను ముగింపులో కాంపాక్ట్ ఆమె మీదికి విసిరి ముక్తాయింపు నిచ్చాడు మార్టీ.  రే నిన్ను కూడా చంపేస్తాడూ, ఇదిగో మేకప్ చేసుకో,  ఇంకొకణ్ణి పట్టుకో - అనే అర్ధంలో. 

            ఆమె సింక్ దగ్గర మామూలుగా నిలబడే మొహం కడుక్కోవచ్చు. ఫ్రేములోంచి వంగిపోయి వంగిపోయి నీళ్ళు జల్లుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఆమె మానసిక స్థితి అది. మగాళ్ళకి సాగిలపడే తత్త్వం.  బిగినింగ్ విభాగంలో రే తో  పొరపొచ్చా లొచ్చి నప్పుడు,   అతడికి లొంగిపోతూ చూసిన చూపు – టిల్ట్ డౌన్ యాంగిల్లో యజమాని కేసి బానిస చూసే చూపుతో -  ఆమె ఎంత బలహీనురాలో ఎస్టాబ్లిష్ అయింది. అదే ఇప్పుడు సింక్ దగ్గర బయటపడుతోంది. యథా మానసిక స్థితి, తథా బాడీ లాంగ్వేజీ.

            వాడు నిన్నుకూడా చంపేస్తాడని మార్టీ హెచ్చరించడమంటే, తనని చంపాడనేగా  అర్ధం. ఇలా పీడకల మొత్తం ఆమెకి స్పష్టం చేసేసింది – ఆ మెకిక రే వుండబోడన్న నిజం సహా. విస్సర్ గురించి మాత్రం ఆమె అర్ధం జేసుకోలేని హింట్స్ ఇచ్చింది. మార్టీ భళ్ళున రక్త వాంతి చేసుకోవడంతో ఆమెకి మెలకువ వచ్చేస్తుంది. 

            గదిలో చుట్టూ చూస్తే మామూలుగా వుంటుంది. కిటికీ లోంచి వెన్నెల పడుతూంటుంది. కిటికీ అవతల భవనం చీకట్లో నిశ్శబ్దంగా వుంటుంది. ఈభవనం చూపించి ముగిస్తారు సీనుని. చీకటి భవనాలు, సముద్రాలు, లోయలూ వంటి వాటిని సబ్ కాన్షస్ మైండ్ కి ప్రతీకలుగా చూపిస్తారు హాలీవుడ్ సినిమాల్లో.


(సశేషం)
-సికిందర్