రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Saturday, July 22, 2017

486 : డార్క్ మూవీస్ స్క్రీన్ ప్లే సంగతులు -8





ప్పుడైనా  ప్లాట్ పాయింట్ వన్ ని బట్టే మిడిల్లో కథ వుంటుంది. మిడిల్లో వేరే కథ పుట్టుకురాదు. కొన్ని తెలుగు సినిమాల్లో పుట్టుకొస్తుంది. ఫస్టాఫ్ కథ సెకండాఫ్ లో వుండదు. సెకండాఫ్ లో వేరే కథ మొదలవుతుంది.  బ్రహ్మోత్సవం, షేర్, బ్రూస్ లీ, కాటమరాయుడు, డిక్టేటర్ మొదలైన  స్టార్ సినిమాలు ఇలా తీస్తూనే వుంటారు. జ్యోతిలక్ష్మి కూడా ఇలాటిదే. ఇంటర్వెల్ వరకూ ఒక సినిమా, ఇంటర్వెల్ తర్వాత ఇంకో సినిమా.  స్క్రీన్ ప్లే  సగానికి ఫ్రాక్చర్ అయిన సంగతే పట్టదు. ఫ్రాక్చరై సెకండాఫ్ సిండ్రోమ్ లో, ఆ పైన అట్టర్ ఫ్లాప్ సుడిగుండంలో పడుతున్నామని అసలే పట్టదు. పైన చెప్పుకున్నవి కొన్ని ఉదాహరణలు మాత్రమే. వెనక్కిపోతే ఇంకా వున్నాయి. ఇది రెండు వేర్వేరు ముక్కల్ని అతికించి సక్సెస్ ని ఆశించే కళా తాపీ మేస్త్రీయం. వేర్వేరు ముక్కలు కాకుండా, చూపిస్తున్న ఒకే రూపాన్ని ఫ్రాక్చర్ అవకుండా, ప్లాట్ పాయింట్ వన్ దగ్గర్నుంచీ ఇంకో రూపంలో చూపించవచ్చా? తప్పకుండా వచ్చు. ‘బ్లడ్ సింపుల్’  చూస్తే బాగా వచ్చు. 

            ‘బ్లడ్ సింపుల్’ ప్లాట్ వన్ దగ్గర డిటెక్టివ్ విస్సర్ కి ఏర్పాటైన గోల్  ప్రకారమే మిడిల్లో కథ నడుస్తోందని అన్పిస్తోందా? విస్సర్ మార్టీకి ఫోన్ చేసి వాళ్ళిద్దర్నీ చంపేశానని చెప్పడం చూస్తే  అలాగే అన్పిస్తుంది. మార్టీ కిచ్చిన మాట ప్రకారం డబ్బుకోసం వాళ్ళని చంపడమే విస్సర్ గోల్. ఐతే అసలు విస్సర్ గోల్ ఇదే కాకపోతే?  అప్పుడేమవుతుంది?  చెప్పిన గోల్ తో సంబంధంలేని కథ మొదలవుతుందా? ఇంతవరకూ ఇంటర్వెల్ తర్వాతే వేరే అతుకుడు కథలు మొదలవుతున్నాయని పైన చెప్పుకున్నాం. ఇంటర్వెల్ లోపే ప్లాట్ పాయింట్ వన్ దగ్గరే,  ఆశించిన దానికి భిన్నంగా కథ మొదలవడం ఇప్పుడు చూడబోతున్నాం  ‘బ్లడ్ సింపుల్’ లో. ఇలా అయితే ఇంటర్వెల్ దాకా ఎందుకు,  ప్లాట్ పాయింట్ వన్ దగ్గరే ఫ్రాక్చర్ అవుతుందా స్క్రీన్ ప్లే? చూద్దాం!

          మిడిల్ - 1 వన్ లైన్ ఆర్డర్ తరువాయి చూస్తే-
         
19.  విస్సర్ మార్టీ దగ్గరికెళ్ళి మర్డర్ ఫోటో చూపించి డబ్బు తీసుకుని, మార్టీని షూట్ చేయడం
          20.  రే బార్ కొచ్చి మార్టీ శవాన్నీ, రివాల్వర్నీ చూసి ఈ హత్య ఎబ్బీ చేసిందనుకోవడం
          21. కారులో శవంతో రే బార్ లోంచి బయట పడడం
          22.  హైవే మీద ప్రయాణంలో మార్టీ ఇంకా బతికే వున్నాడని  రే తెలుసుకుని పారిపోవడం
          23.  మార్టీ ని అలాగే లాక్కెళ్ళి సజీవ సమాధి చేయడం

19.  విస్సర్ మార్టీ దగ్గరికెళ్ళి మర్డర్ ఫోటో చూపించి డబ్బు తీసుకుని, మార్టీని షూట్ చేయడం 
        ఎబ్బీ, రే లని చంపేశాడు గనుక  డబ్బు తీసుకోవడానికి మార్టీ దగ్గరికి బార్ మూసేశాక వస్తాడు  రాత్రి పూట విస్సర్. వచ్చి రెండు చేపల్ని టేబుల్ మీద పడేసి కూర్చుని సిగరెట్ వెల్గించుకుని, లైటర్ ని టేబుల్ మీద పెడతాడు. టేబుల్ మీద మార్టీ వైపు ఇంకో రెండు చేపలు పడి వుంటాయి. డబ్బులు అడుగుతాడు విస్సర్. ముందు నువ్వేదో చూపించాలేమో? – అంటాడు మార్టీ. విస్సర్ కవరందిస్తాడు. అందులోంచి చిన్నగా ఫోటో బయటికి లాగుతూ చూస్తాడు మార్టీ. బెడ్ మీద ముందు రే కన్పిస్తాడు. ఇంకా ఫోటో లాగుతూంటే పక్కన ఎబ్బీ వుంటుంది. కప్పుకున్న దుప్పటి మీద మూడు బుల్లెట్ రంధ్రాలు కన్పిస్తూంటాయి. రక్తం వుంటుంది. ఇదంతా చూసి- చచ్చినట్టేనా?-  -అంటాడు. అంతే కదా మరి- అని విస్సర్ సమాధానం.  

            క్లోజ్  షాట్ లో టేబుల్ మీదున్న చేపల్ని పెన్సిల్ పట్టుకుని మార్టీ ముందుకు తోస్తాడు విస్సర్. శవాల్ని ఏం చేశావంటాడు మార్టీ.  చేయాల్సింది చేశా, నువ్వెంత తక్కువ తెలుసుకుంటే అంత మంచిదంటాడు విస్సర్. ఒక్కసారి మార్టీ వొంట్లో అలజడి ప్రారంభమవుతుంది. ఏదో  అనీజీగా వుందని, కవర్లో ఫోటో పెట్టుకుని, దాంతో లేచి బాత్రూం వైపు వెళ్తాడు మార్టీ. 

          క్లోజ్ షాట్ లో కొస్తాడు విస్సర్. మార్టీ వెళ్తూంటే గమనిస్తాడు. ఆ ఫోటో తనక్కావాలని చెప్తాడు. మాట్లాడకుండా బాత్రూం లో కెళ్ళి పోతాడు మార్టీ. డోర్ పూర్తిగా వేసుకోడు. సందులోంచి లోపలి లైటు తెల్లటి కాంతి ప్రసరిస్తూంటుంది.

          విస్సర్ తలతిప్పి సేఫ్ వైపు చూస్తూంటాడు. నుదుటి మీద చిరు చెమటలు పడుతూంటాయి.  హేట్ తో గాలి వూపుకుంటాడు. ఆఫ్ స్క్రీన్ లో బాత్రూం లోంచి నీళ్ళ శబ్దం వస్తుంది. అటు చూస్తాడు. బాత్రూం పక్కన నోటీసు వుంటుంది : Employees must wash hands – అని. వెంటనే చేతిలోని సిగరెట్ పీకని టేబుల్ మీదున్న దున్నపోతు మినియేచర్ మీద నలిపేస్తాడు. 

          లాంగ్ షాట్ తీసుకుంటే,  మార్టీ తిరిగి ఆఫీసులోకి ఎంటరవుతాడు. ఔను, డబ్బివ్వాలి కదూ- అంటాడు.  విస్సర్ డల్ గా టేబుల్ మీదికి చూస్తాడు. మార్టీతో  అంటాడు -  నేనొకటి అడగాలనుకుంటున్నా మార్టీ. నేను చాలా చాలా కేర్ ఫుల్ గా వుంటున్నా, నువ్వూ  అంతే కేర్ ఫుల్ గా వున్నావనుకుంటా...

          ఆఫ్ కోర్స్ – అంటాడు మార్టీ. నన్ను హైర్  చేసినట్టు ఎవరికీ తెలీదుగా?  –విస్సర్ మళ్ళీ అడిగితే సమాధానం చెప్పడు మార్టీ. 

          హై యాంగిల్ తీసుకుంటే, ఓపెన్ చేసిన సేఫ్ ముందు కూర్చుని వుంటాడు మార్టీ. చేతిలో కవర్ వుంటుంది. విస్సర్ కి సేఫ్ కన్పించకుండా అతడి వైపు వీపు అడ్డు పెట్టి, కవర్ లోని ఫోటోని సేఫ్ లోకి జారవిడుస్తాడు. డబ్బు తీస్తాడు...

          అప్పుడు విస్సర్ ప్రశ్నకి జవాబిస్తాడు- ఈ విషయం ఎవరికీ తెలియనివ్వలేదని. సేఫ్ మూసి లాక్ చేసేస్తాడు.  మనది అక్రమ రోమాన్సు, ఒకర్నొకరు నమ్మాలంటాడు. టేబుల్ దగ్గరికి వచ్చి కూర్చుంటూ  కవరూ డబ్బూ విస్సర్ ముందు పడేసి- ‘కష్టంలో, సుఖంలో’ – అని మాట పూర్తి చేస్తాడు. అలాగనకు, నీ పెళ్ళిళ్ళు  అంత గొప్పగా వర్కౌట్ కాలేదంటాడు విస్సర్. అని, చెయ్యి ప్యాంటుకి తుడుచుకుంటాడు. ఈ ఖర్చుని ఎక్కౌంట్ లో ఎలా చూపిస్తావని  అడుగుతాడు. ఏం చేయాలో చేశా, ఎంత తక్కువ నువ్వు తెలుసుకుంటే అంత మంచిదంటాడు మార్టీ,  విస్సర్ మాటల్ని విస్సర్  కే అప్పజెపుతూ. చిరునవ్వుతో చూస్తాడు విస్సర్. డబ్బందుకుంటూ, చాలా రిస్కు తీసుకున్నానంటాడు. లెక్కెట్టుకో మంటాడు విస్సర్. లేదు, నిన్ను నమ్ముతా – అంటాడు విస్సర్, కోటు జేబులోకి చెయ్యి పెడుతూ.  చెయ్యి బయటికి తీస్తాడు. రివాల్వర్ వుంటుంది. మార్టీకి గురిపెట్టి ట్రిగ్గర్ లాగుతాడు. మార్టీ నిశ్చేష్టుడై చూస్తాడు. షర్టు మీద రక్తం ధార కడుతూంటుంది... 


       రివాల్వర్ పేలుడు తర్వాత ఫ్యాను శబ్దం మాత్రమే వినిపిస్తూ వుంటుంది. క్లోజ్ షాట్స్ లో పరస్పరం చూసుకుంటూంటారు. వైడ్  షాట్ లో ఇద్దరి పరిస్థితి : తలవాల్చేసి మార్టీ, అలాగే రివాల్వర్ గురి పెట్టి విస్సర్. క్లోజ్ కొస్తే, విస్సర్ అలాగే గురి పెట్టి హేట్ తో గాలి విసురుకుంటూంటాడు. అలాగే చూస్తూంటాడు. టేబుల్ మీద జాపుకున్న మార్టీ కాలు జారిపోతుంది. గాలి విసురుకోవడం ఆపేస్తాడు మార్టీ. కర్చీఫ్ తో రివాల్వర్ పట్టుకున్న అతడి చెయ్యి క్లోజ్ షాట్ లో  కిందికి  వస్తుంది. రివాల్వర్ని  కింద పెట్టి కాలితో తన్నేస్తాడు. డబ్బూ కవరూ తీసి జేబులో పెట్టుకుంటాడు. విస్సర్ కేసి చూసి-  ఇప్పుడెవరు స్టుపిడ్-  అనేసి వెళ్ళిపోతాడు. టేబుల్ మీద టిల్ట్ డౌన్ చేస్తూంటే, నాల్గు చేపలు, మార్టీ శవం, చేపల ముందు లైటర్...

          టాప్ యాంగిల్ తీసుకుంటే,  మార్టీ కుర్చీలో పడున్న స్థితి, పైన నెమ్మదిగా తిరుగుతూ ఫ్యాను రెక్కలు. అవతల డోర్ వేసేసినట్టు పెద్ద చప్పుడు.

***
      ఈ సీనులో చాలా సంకేతాలూ నిగూఢార్ధాలూ ప్లానింగూ వున్నాయి. ఇవన్నీ  స్క్రిప్టులో రాయలేదు. చిత్రీకరణలో వున్నాయి. కావాలని సృష్టించినట్టు వుండవు. అంతర్వాహినిగా సీన్లో కలిసిపోయి వుంటాయి. ముందుగా  అంధకారంలో మూసివున్న భవనాల దృశ్యం వుంటుంది. నడి రోడ్డు మీద దున్నపోతు విగ్రహం వుంటుంది. దాని పక్కన ఆకుపచ్చ సీరియల్ బల్బులు వెలుగుతూంటాయి...చూస్తూంటే ఈ  దృశ్యం సైకలాజికల్ గా మనకి ఇబ్బంది పెట్టేలా వుంటుంది. చీకట్లో నిర్మానుష్యంగా వున్న కూడలి, మూసి వున్న వ్యాపార కేంద్రాలు, దున్నపోతు విగ్రహం. దానికి వెలుగుతూ ఆకుపచ్చ బల్బులు. చాలా మిస్టీరియస్ వాతావరణం. 

          ‘బ్యాక్ టు ది ఫ్యూచర్’ లో  కాల యంత్రంగా తయారుచేసిన  కారుకి డిజైన్ చేసిన పుర్రెలు, లింగం, అగ్ని వంటి సింబాలిజమ్స్ ని జేమ్స్ బానెట్ తన పుస్తకంలో శివుడి గుర్తులుగా విశ్లేషించి,  వాటి అర్ధం చెబుతాడు. అలాగే హిందూ పురాణాల్లోని  సింబాలిజంని  వాడుకున్నారు కోయెన్ బ్రదర్స్. ఈ దున్నపోతు విగ్రహం యముడి వాహనం. దీనికి ఆకు  పచ్చ లైట్లువెలుగుతున్నాయంటే యముడి నుంచి ఆహ్వానం వస్తున్నట్టే. ఎవరికి? మార్టీకే! అన్ని ఆకుపచ్చ లైట్లెందుకు- మార్టీని సూచిస్తూ ఒక్కటుంటే చాలదా? యముడు మార్టీ ఒక్కడికే కాదు, మరెందరికో టోకున ఆహ్వానాలు పంపుతూ నిత్యం బిజీగా వుంటాడు, అందుకని అన్ని లైట్లు. ‘బ్యాక్ టు ది ఫ్యూచర్’ లో  కాల యంత్రం కారుకి చాలా పుర్రెలుంటాయి. అన్ని పుర్రెలు అన్ని పునర్జన్మలకి గుర్తులని బానెట్ రాశాడు. 

          ఇక విస్సర్ మూసి వున్న బార్లోకి వచ్చి టేబుల్ మీద రెండు చేపల్ని పడేస్తాడు. ఈ చేపలు చనిపోయిన ఎబ్బీ, రేలే. మార్టీ పక్కన కూడా ఇంకో రెండు చేపలుంటాయి. ఇవి తను ఫిషింగ్ టూర్ కెళ్ళి నట్టు సాక్ష్యానికి. కానీ మొత్తంగా ఈ నాల్గు చచ్చిన చేపల్ని చూస్తే ఎబ్బీ, రే, మార్టీ, విస్సర్-  నల్గురి కుళ్ళిన మానసిక స్థితిగతులకీ  నిదర్శనాలని గుర్తు చేస్తూంటాయి.

          విస్సర్ సిగరెట్ వెల్గించుకుని, లైటర్ ని టేబుల్ మీద పెట్టడం క్లోజ్ షాట్ లో రిజిస్టర్ చేస్తారు. లైటర్ తో, సిగరెట్ కేస్ తో మొదట్నుంచీ చూపిస్తున్న విస్సర్ సైకలాజికల్ ట్రాక్ ఇక పక్వానికి వచ్చిందని తెలుస్తూంటుంది. 

         అతను పెన్సిల్ పట్టుకుని చేపల్ని మార్టీ వైపు తోయడంలోని బాడీ లాంగ్వేజ్ ని మార్టీ పసిగట్ట లేదు. పసిగట్టి వుంటే విస్సర్ ప్లాన్ మార్చుకున్నాడని అర్ధమయ్యేది. పెన్సిల్ అనేది ప్లాన్ మార్చుకోవడానికి డ్రీమ్స్ లో సింబాలిజం. ఆ చేపల్ని పెన్సిలుతో అలా తోస్తున్నాడంటే- నీ ప్లాను నాకక్కర్లేదు, వేరే ప్లానేసుకున్నా- అని చెప్పడమన్నమాట.



       ఫోటో చూశాక మార్టీ రియాక్షన్- అనీజీగా ఫీలవడం పొంచివున్న మృత్యువు రేపుతున్న అలజడి కావచ్చు. అతను  బాత్రూంలోకి ఫోటో వున్న కవరు పట్టుకుని వెళ్తాడు. టేబుల్ మీదే పెట్టవచ్చుగా? ఆ ఫోటో తన కవసరం. రేపు విస్సర్ అడ్డం తిరక్కుండా ఆయుధంగా ఉపయోగప
డుతుంది కాబట్టి దాన్ని కొట్టేసే ఆలోచనతో వున్నాడు. బాత్రూం లోకి వెళ్ళినప్పుడు పూర్తిగా వెయ్యని తలుపు సందు లోంచి తెల్లని లైటు కాంతి ప్రసరిస్తూంటుందని స్క్రిప్టులో రాశారు. మొదట దున్నపోతు, తర్వాత ఒంట్లో అనీజీ, ఇప్పుడు తెల్లని కాంతి- మూడూ మృత్యుసంకేతాలే. దైవసన్నిధికి చేరుకుంటున్నందుకు ఆ ధవళ కాంతి. బాత్రూంకి డ్రీమ్ మీనింగ్ బాధల నుంచి విముక్తి పొందే ప్రపంచం. దైవలోకం. వొంట్లో ముంచుకొస్తున్న మృత్యువుతో దైవలోకం లాంటి బాత్రూం లోకి ప్రవేశించాడు, అక్కడ ధవళ కాంతి ప్రసరించింది. నిజజీవితంలో మన చుట్టూ మనకి వర్తించే ఇలాటి చర్యలెన్నో జరిగిపోతూనే వుంటాయి. గ్రహించలేనంత బిజీగా వుంటాం. మనకి తెలీయకుండా  కర్మ ఫలాలు ట్రాప్ చేస్తూనే వుంటాయి. దీన్ని సింక్రో డెస్టినీ అన్నాడు డాక్టర్ దీపక్ చోప్రా. 

          ఎందుకిదంతా అంటే,  సినిమా కథకుడికి స్పిరిచ్యువాలిటీతో కూడా పరిచయం వుండాలి. అప్పుడు కథలు ఆత్మిక దాహం తీరుస్తూ హత్తుకుంటాయి. ‘రైడర్స్ ఆఫ్ ది లాస్ట్ ఆర్క్’ గానీ, ‘మాట్రిక్స్’ గానీ, ఇంకా మరెన్నో హాలీవుడ్స్ ఇలాటివే. ‘బ్లడ్ సింపుల్’ కూడా ఇలాగే కన్పిస్తోంది.

          ఇప్పుడు బాత్రూం పక్కన విస్సర్- Employees must wash hands- అని నోటీసు చూసి,  ఇక నీకూ నాకూ చెల్లురా బాబూ అన్న అర్ధంలో సిగరెట్ పీకని నలిపేసి చేతులు దులుపుకుంటాడు. ఇప్పుడొక విశేషం గమనించాలి. అతను సిగరెట్ పీక నలిపేసేది దున్నపోతు మినియేచర్ బాటమ్  మీదే. ఆఖరికి దున్నపోతు మార్టీ టేబుల్ మీదే వుందన్నమాట. సీక్వెన్స్ చూద్దాం- మొదట బయట దున్నపోతు విగ్రహం, తర్వాత మార్టీ ఒంట్లో ఇబ్బంది, బాత్రూంలో దైవలోకం, అక్కడ ధవళ కాంతి, ఇప్పుడు యమలోక ప్రయాణానికి టేబుల్ మీద దున్నపోతు మినియేచర్ సిద్ధం! దాని బాటమ్  మీద విస్సర్ సిగరెట్ నలిపేశాడంటే, ఆ నుసిలాగా మసైపోయి వెళ్ళిపోతాడన్న మాట మార్టీ! 


          కళా దర్శకత్వమంటే ఇది కాదా? ఇలాకాకుండా కథ, పాత్రలు ప్రతిఫలించకుండా,  తోచిన వస్తువులతో అట్టహాసంగా అలంకరణలు చేస్తే సరిపోతుందా? ఇక్కడ కోయెన్ బ్రదర్స్ ఈ వస్తువుల్ని,  ఫీలింగ్స్ నీ ఎక్కడెక్కడ, ఎప్పుడెప్పుడు రివీల్ చేయాలో వరసక్రమంలో అప్పుడే చేస్తూ రావడం గమనించాలి. విస్సర్ వచ్చి టేబుల్ మీద చేపలు పడెయ్యగానే టేబుల్ మీదే వున్న దున్నపోతు మినియేచర్నీ రివీల్ చేయలేదు. ఇంకే షాట్ లోనూ దాన్ని చూపించలేదు. ఎప్పుడు దేంతో కలిపి చూపిస్తే ఎఫెక్టివ్ గా వుంటుందో, ఉలిక్కిపడతామో ఆ టైమింగ్ ని దృష్టిలో పెట్టుకుని అప్పుడే రివీల్ చేశారు. సీక్వెన్స్ లో మార్టీకి ది ఎండ్ అన్నప్పుడే దాన్ని రివీల్ చేశారు. దీన్ని సిగరెట్ నుసితో కలిపి చూపించడంతో ఇంకింత తీవ్రత పెంచుకుంది. సిగరెట్ నలిపెయ్యడానికి దారి తీసిన పరిస్థితి బాత్రూం పక్క నోటీసు. దీనికీ మీనింగుంది, సిగరెట్ నలిపెయ్యడానికీ మీనింగుంది, నుసికీ మీనింగుంది, మినియే చర్ కి మహా మీనింగుంది...

          ఇక-  నన్ను హైర్  చేసుకున్నట్టు ఎవరికీ చెప్పలేదు కదా - అని విస్సర్ అడగడంలో అంతరార్ధం, తను మార్టీని చంపబోతున్నాడు గనుక,  సాక్షుల గురించి ఆరా తీయడమే. మార్టీ సేఫ్ దగ్గర కూర్చున్నప్పుడు హై యాంగిల్లో మార్టీ వెనకాల టాప్ లో,  రెడ్ కలర్ లైటు కాంతి పర్చుకుని వుంటుంది. దాంట్లో  నల్లటి గడుల్లాగా నీడలువుంటాయి. ఆ రెడ్ కలర్ రక్తపాతంతో చావు వుంటుందని చెప్పడం, నల్లటి గడులు అతడి పరలోక ప్రయాణం అంత సాఫీగా వుండదనీ, ఎగుడుదిగుడుగా, లేదా ఎత్తుపల్లాలుగా  కష్టాలతో కూడుకుని వుం టుందనీ  సూచించడం. దీనికి మ్యాచింగ్ సింబాలిజాన్ని  ముందు ముందు వచ్చే  సీను లో ఫిజికల్ గా – యాక్షన్ లో చూపించుకొస్తారు. 

        మార్టీ సేఫ్ లో ఫోటో జారవిడిచిన విషయం విస్సర్ కి తెలీదు. దీనికి ఇంకెవరైనా సాక్షులున్నారా అనే అర్ధంలో అడిగాడు గానీ, మార్టీయే ఫ్రెష్ గా సేఫ్ లో సాక్ష్యం ఏర్పాటు చేశాడని తెలుసుకోలేదు. ఇక రివాల్వర్ తీసి షూట్ చేయడంతో కన్ఫ్యూజన్ ఏర్పడుతుంది. ఈ బుల్లెట్ ఎక్కడిది? తను కొట్టేసిన ఎబ్బీ రివాల్వర్ లో మూడు బుల్లెట్స్  వున్నాయి. ఫోటోలో హత్యా దృశ్యం ప్రకారం ఆ మూడు బుల్లెట్లూ అక్కడే పేల్చాడు. మరి ఈ బుల్లెట్ ఎక్కడిది?

          అసలు మార్టీని ఎందుకు చంపాడు? ఎబ్బీ, రే, మార్టీ- ముగ్గుర్నీ చంపి ఏం చేస్తాడు? ఉన్న నాల్గు పాత్రల్లో మూడూ పోయాక ఇప్పుడేమిటి? కొత్త పాత్రలొస్తాయా? అసలేమిటి విస్సర్ మార్చుకున్న ప్లాను?

(సశేషం)
-సికిందర్