రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Saturday, March 29, 2014

రివ్యూ..
బాలయ్య వేసవి బ్యాంగ్ !

** నందమూరి బాలకృష్ణ, సోనల్ చౌహాన్, రాధికా ఆప్టే, జగపతిబాబు, బ్రహ్మానందం, సుమన్, జయప్రకాష్ రెడ్డి, రావురమేష్, చలపతిరావు, ఎల్బీ శ్రీరాం, సుహాసిని, కల్యాణి, హంసానందిని తదితరులు..
సంగీతం : దేవీశ్రీ ప్రసాద్,  ఛాయాగ్రహణం : సి. రాంప్రసాద్   కూర్పు : కోటగిరి వెంకటేశ్వర రావు  కళ : ఏఎస్ ప్రకాష్   యాక్షన్ : రాం- లక్ష్మణ్, కణల్ కన్నన్  మాటలు : ఎం. రత్నం
బ్యానర్ : వారాహి చలన చిత్రం- 14 రీల్స్ ఎంటర్ టైన్మెంట్
నిర్మాతలు : రాం ఆచంట, గోపి ఆచంట, అనిల్ సుంకర
రచన- దర్శకత్వం : బోయపాటి శీను
విడుదల : 28 మార్చి 2014     సెన్సార్ : ‘A’

***
వేసవికీ, ‘నందమూరి బాలకృష్ణ- బోయపాటి శీను’ ల కాంబినేషన్ కీ ఏదో బలమైన బాక్సాఫీసు బంధం ఉన్నట్టుంది. సరిగ్గా నాల్గేళ్ళ క్రితం 2010 వేసవిలో ఈ ఇద్దరి కాంబినేషన్ లో ‘సింహా’ ఎంత బలమైన హిట్ గా నిల్చిందో, అందుకేమాత్రం తీసిపోని విజయ ఢంకా మోగిస్తూ ఇప్పుడు ‘లెజెండ్’ వచ్చింది. మధ్యలో బోయపాటికి  ‘దమ్ము’తో శృంగభంగమైతే- ఈ సారి ఆ వైఫల్య కారణాన్ని హీరో మీదనుంచి విలన్ మీదికి తోస్తూ తప్పించుకో జూశాడు. దీంతో ‘లెజెండ్’ దంతా ఏకపక్ష గోడు అయ్యింది!

అసలే ఎన్నికల సమయంలో విడుదలౌతున్న ఈ సినిమా- బాలకృష్ణ ఇంటి పార్టీ కి ప్రచారంచేసిపెట్టే అస్త్రంగా రాబోతోందన్న ఊహాగానాల్ని పటాపంచలుచేస్తూ, ఫక్తు ఫ్యాక్షన్ మార్కు మరో ఫార్ములాగా మాత్రమే ఫ్యాన్స్ కోసం ‘సర్వాంగ సుందరంగా’ ముస్తాబయింది.


అడుగడుగునా భగభగ మండిపోతూ బాలకృష్ణ తన భుజాలమీద  ఒన్ మాన్ షోగా అవలీలగా మోసుకొచ్చి బాక్సాఫీసు ముంగిట పడేసిన ఈ హై వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ ఒక్కటి రుజువు చేసింది- బిగ్ స్టార్స్ కి ఇంతకంటే గత్యంతరం లేదు. గతం వైపే చూపు తప్ప వర్తమాన భవిష్యత్ కాలాల కొత్తదనంతో సంబంధం వుండదు. ఒక పాత  ఫ్యాక్షన్ ఫార్ములాలోంచి, రూపం మార్చి ఇంకో ఫ్యాక్షన్ ఫార్ములాని లాగే అనివార్య విన్యాసమే శ్రీరామరక్ష అయితే ఇందుకు తప్పుబట్టాల్సిందేమీ వుండదు. 


బాలకృష్ణ లోని శక్తివంతమైన నటుణ్ణి ఎలా బయటికి తీసి హిట్ కొట్టాలో  తెలుసుకోవాలంటే కేరాఫ్ అడ్రసుగా మారిన బోయపాటిని స్టడీ చేయాల్సిందే. ఇక బాలకృష్ణ ఉన్నంత కాలం బోయపాటీ, బోయపాటి ఉన్నంత కాలం బాలకృష్ణా ఉభయకుశలోపరిగా వుంటారనుకోవచ్చు వేసవికో ఫ్యాక్షన్ రీసైక్లింగ్ చేసుకుంటూ!

విశాఖ తీరాన ఫ్యాక్షన్ ఘరానా!
కర్నూలు నుంచి ఫ్యాక్షన్ తొడగొట్టి విశాఖపట్నంలో మకాం వేసే చిత్రణ అదేదో వర్తమాన రాజకీయ ముఖచిత్రంలా అన్పిస్తే అదిక్కడితో అంతమౌతుంది. మిగతా కథాకమామిషు అంతా పాతఫ్యాక్షన్ కాల్పనికమే. కర్నూలునుంచి పెళ్లి సంబంధానికి వైజాగ్ వచ్చి వెళ్తూ ఫ్యాక్షనిస్టు జితేంద్ర (జగపతిబాబు) పక్కూళ్ళో అనుకోకుండా ఓ రోడ్డుప్రమాదం చేసి అక్కడి పెద్ద మనిషి  (సుమన్) ముందు పంచాయితీకి హాజరవుతాడు. ఆ పెద్దమనిషి బాధితుడికి నష్టపరిహారమూ క్షమాపణా డిమాండ్ చేస్తాడు. మాట వినని జితేంద్ర కి లెంపకాయకూడా కొడతాడు. 

దీంతో ఈ వైజాగ్ లోనే మకాం వేసి ఆ పెద్దమనిషి కుటుంబాన్ని తుదముట్టిస్తానని ప్రతిన బూనుతాడు జితేంద్ర.
దరిమిలా ఆ పెద్దమనిషినీ, అతడి భార్య (సుహాసిని)నీ మట్టుబెట్టేస్తాడు జితేంద్ర. దీనికి రియాక్టయిన పెద్దమనిషి పెద్దకొడుకు జయదేవ్ (బాలకృష్ణ-1) జితేంద్ర తండ్రిని హతమార్చేస్తాడు. ఈ హత్యలు చూసి చలించిన నాయనమ్మ పెద్దమనవణ్ణి కుటుంబ బహిష్కారం గావించి, చిన్న మనవడు కృష్ణ (బాలకృష్ణ-2) ని లండన్ పంపించివేస్తుంది.
ఈ పూర్వకథ లోంచి వర్తమానానికొస్తే, కృష్ణ దుబాయిలో ప్రత్యక్షమౌతాడు. అక్కడ  స్నేహ (సోనల్ చౌహాన్) అనే మోడర్న్ గర్ల్ ని ప్రేమించి నానమ్మ కి పెళ్లి ప్రతిపాదన పంపుతాడు. పెళ్లి శత్రువు పొంచివున్న వైజాగ్ లో వద్దనీ, మేమంతా దుబాయ్ కేవచ్చి చేస్తామనీ నానమ్మ అంటుంది. కానీ కృష్ణ వెంటవుండే మాణిక్యం (బ్రహ్మానందం) ప్రోద్బలంతో వైజాగ్ కే చేరతాడు కృష్ణ స్నేహతో.
చేరగానే ఒక అన్యాయాన్ని ఎదుర్కొని జితేంద్ర ముఠా ని తంతాడు. దీంతో జితేంద్ర లో పాత  పగ మేల్కొని కృష్ణ పెళ్లి బృందం మీద దాడి చేస్తాడు. కృష్ణ సహా బృందమంతా ఇక హతమౌతారన్న క్షణాన అజ్ఞాతంగా వున్న జయదేవ్ ప్రచండంగా ఏతెంచి శత్రుసంహారం  గావిస్తాడు. జితేంద్ర తప్పించుకుంటాడు...ఇప్పుడు అజ్ఞాతంలో వున్న జయదేవ్ కథతో ఫ్లాష్ బ్యాక్ ప్రారంభమౌతుంది...

ఇక కుటుంబాన్ని జితేంద్ర బారినుంచి కాపాడే ఏకైక దిక్కుగా జయదేవ్ ఉంటాడు. ఓ పక్క బామ్మ ఛీత్కారాల్ని భరిస్తూ, మరదలి ప్రేమతో సతమతమౌతూ ఏకాకి జీవితం గడుపుతున్న అతను ఎన్ని అవమానాలు, అవాంతరాలూ ఎదురైనా కుటుంబ క్షేమాన్నే కాంక్షిస్తూ ఉద్యమిస్తూంటాడు...

బాలయ్య బాలయ్యా రాసుకుంటే...
ఇద్దరు బాలయ్యల బలాబలాల జుగల్బందీ ఇది. ఇందులో రెండో బాలయ్యది ప్రథమార్ధంలో ముగిసిపోయే రోమాంటిక్ పాత్రైతే, మొదటి బాలయ్యది ద్వితీయార్ధం పగ్గాలందుకునే  యాక్షన్ పాత్ర. ఈ యాక్షన్ బాలయ్య పాత్రే కథకి బలాన్నీ అర్ధాన్నీ చేకూరుస్తుంది. ఈ పాత్రలో బాలకృష్ణ నటనని ప్రేక్షకులు కళ్ళప్పగించి వీక్షిస్తారు. ఎందుకంటే ఇది వయసుకుకి తగ్గట్టున్న సీరియస్ పాత్ర. అదే ప్రథమార్ధమంతా రోమాంటిక్ బాలయ్యని ఆ వయసులో చూడలేక ఒకటే గగ్గోలు పెడతారు ప్రేక్షకులు. మొదటి పాటకి డాన్సులూ డ్రెస్సులూ అయితే మరీ ఎబ్బెట్టుగా కూడా వుంటాయి.

జయదేవ్ పాత్రకిచ్చిన గెటప్, డ్రెస్ సెన్స్, డైలాగులు, అంతర్గత-బహిర్గత సంఘర్షణల సమాహారంతో సమగ్ర పాత్రచిత్రణా ఈ సినిమాకి ప్రత్యేకాకర్షణలు. ద్వితీయార్ధంలో కామెడీ లేదనే విమర్శ అసంగతమైనది. బోయపాటి ఒక సీరియస్ ఆర్గ్యుమెంట్ తో ఆలోచనాత్మకంగా ప్రవేశించిన జయదేవ్ పాత్ర కోసం గాక, కామెడీ వైపు నిలబడి వుంటే మొత్తం అభాసయ్యేది.

జయదేవ్ పాత్రలో బాలకృష్ణ ని చూస్తే సమీప భవిష్యత్ లో ఏ యంగ్ స్టారూ ఆయన్ని బీట్ చేయలేడని రాసిచ్చేయొచ్చు. అసలు ఈ పాత్రే యంగ్ స్టార్స్ కి దుస్సాధ్యమైనది. యంగ్ స్టార్సే కాదు- తన సమకాలీనులు సైతం హిట్టివ్వలేని తరుణాన బాలకృష్ణ  ఇంకో విజయం సాధించాడు.
ఇక జగపతిబాబు ఈ సినిమాకి రెండో దన్ను. వయసుమళ్ళిన విలన్ గా అవతారమెత్తి తనలో ఇన్నాళ్ళూ బయల్పడని అసలుసిసలు నటుణ్ణి దృశ్యమానం చేశాడు. మోహంలో, కళ్ళల్లో ఆ కరుడుగట్టిన విలనీ ఎక్స్ ప్రెషన్స్ తెలుగు తెరకి ఇక హిందీ దుష్టనాయక అవసరాన్ని వేలెట్టి ప్రశ్నిస్తున్నట్టున్నాయి.

హీరోయిన్లిద్దర్లో సోనల్ చౌహాన్ అందాల ఆరబోతకి, రాధికా ఆప్టే సెంటిమెంట్ల పంటకీ ఉపయోగపడ్డారు. ఇతర తారాగణమంతా  ప్యాడింగ్ అవసరాలు తీరిస్తే, బ్రహ్మానందం కాసేపు వెర్బల్ కామెడీ చేసి తప్పుకున్నాడు.

సాంకేతికాలు సోసో...
అత్యధిక బడ్జెట్ కేటాయించి ఎంత కనువిందు చేసినా వీనులవిందు చేయలేకపోవడం ఒక లోటు. దేవీశ్రీప్రసాద్ సంగీతంలో పాటలు ఒక్కటీ క్యాచీగా లేవు. థియేటర్ లోంచి  బయటికొస్తే గుర్తుండవు. కానీ బ్యాక్ గ్రౌండ్ సంగీతం మాత్రం చెవులు పగిలే స్థాయిలో సమకూర్చాడు. ఈ హోరులో డీ టీ ఎస్ అనే శబ్దగ్రాహక కళ కకావికలమై పోయింది. ఇక అగ్రస్థాయి ఛాయాగ్రాహకుడు రాంప్రసాద్ కేమేరాపనితనం ఎంత ఉన్నతంగా వుందో, దాంతో పోటీపడుతూ ఏఎస్ ప్రకాష్ కళా దర్శకత్వం అంత ద్విగుణీ కృతమైంది. పోతే, యాక్షన్ కోరియోగ్రఫీలో రాం-లక్ష్మణ్, కణల్ కన్నన్ లు లాజిక్ ని తీసి అవతలపెట్టి గాలిలో చేసిన విన్యాసాలు ఇలాటి బిగ్ స్టార్ కమర్షియల్స్ కే నప్పుతాయని ఇంకోసారి రుజువుచేశాయి. కోటగిరి కూర్పు దర్శకుడు ఉద్దేశించిన కథన వేగాన్ని అందుకున్నట్టే వుంది.

ఎం. రత్నం రాసిన సంభాషణలు ఫ్యాన్స్ కి మంచి హుషారు. దర్శకుడుగా బోయపాటి శీను కమర్షియల్ గా బాలకృష్ణ ని ఆకాశాని కెత్తేస్తూ ప్రెజెంట్ చేయడంలో మరోసారి  సక్సెస్సయ్యాడు.

స్క్రీన్ ప్లే సంగతులు
గతంలో ఫ్యాక్షన్ సినిమాలు వెల్లువెత్తిన కాలంలో వేషం కట్టిన ‘ఇంటర్వెల్ తర్వాత ఫ్లాష్ బ్యాక్’ అనే ఓకే తరహా మూస స్క్రీన్ ప్లే తనాన్నే ‘లెజెండ్’ లో కూడా  చూడొచ్చు. నడుస్తున్న ప్రస్తుత కథ ఆగిపోయి, గతం తాలూకు ఫ్లాష్ బ్యాక్ కథ సుదీర్ఘంగా  క్లైమాక్స్ వరకూ సాగడం వల్ల – ఇంటర్వెల్ దగ్గర ఆగిపోయిన ప్రధాన కథ- అంటే  ప్రస్తుత కథ తాలూకు టెన్షన్ గ్రాఫ్ కూడా పతనమై చప్పబడిపోతుంది సినిమా. అంతేగాక ఇప్పుడు రెండో పాత్ర కథ కూడా మొదట్నించీ చూడాల్సి వస్తుంది. ఇలా మొదటిపాత్ర కథ ఫస్టాఫ్ లో, రెండో పాత్ర కథ సెకండాఫ్ లోనూ చూడ్డంతోనే సరిపోయి- క్లైమాక్స్ లో పిసరంత అసలు కథ చూస్తాం. అదీ తెలిసిపోయే కథగానే వుంటుంది. ఏమంటే దుష్టసంహారం గావించడమే హీరోకి మిగిలివుండే పిసరంత అసలు కథ.

ఎలాటి స్క్రీన్ ప్లే స్ట్రక్చర్ కీ, రొటీన్ మూస కథకీ అతీతంగా వ్యక్తిపూజ ఇమేజులతో  అలరారే స్టార్స్  మాత్రమే తమ భుజాలమీద ఇలాటి లోపభూయిష్ట రచనతో కూడిన సినిమాల్ని ఒన్ మాన్ షోగా లాక్కురాగలరు. కాకపోతే ఆ పాత్ర చిత్రణ ‘దమ్ము’ లో ఎన్టీఆర్ లా వుండకూడదు. వుంటే  అట్టర్ ఫ్లాపవుతుంది.  ‘దమ్ము’లో ఎన్టీఆర్ ది పసలేని పాసివ్ పాత్ర. విలన్ మత్రమే యాక్టివ్ క్యారక్టర్. హీరో ఎంతసేపూ రియాక్టివ్ గా తిరగబడుతూ అయ్యోపాపం అన్పించుకునే స్థితిలో దయనీయంగా ఉంటాడు. పైగా యుద్ధం కూడా చేయనంటాడు.

‘లెజెండ్’ లో హీరో ఒక లక్ష్యం కోసం నిత్యం రగిలిపోయే యాక్టివ్ పాత్రకావడం వల్ల –స్టార్ ఇమేజి కూడా తోడయ్యి బలహీన స్క్రీన్ ప్లే గండాన్ని దాటేసింది. అయితే దర్శకుడు ఎటుతిరిగీ పాసివ్ పాత్రల పట్ల మమకారం చంపుకోనట్టుంది. ‘దమ్ము’లో హీరో పాసివ్ గానూ, విలన్ ని యాక్టివ్ గానూ చూపించినట్టు- ‘లెజెండ్’ లో దీన్ని తిరగేసి విలన్ ని పాసివ్ చేసి, హీరోని యాక్టివ్ చేశాడు. దీంతో విలన్ గా వేసిన జగపతిబాబు పాత్ర రియాక్టివ్ గా పెడబొబ్బలు పెడుతూ చతికిలబడే బలహీనుడిగా మారిపోయింది. బలమైన విలన్ లేకపోవడంతో ఏకపక్షంగా హీరో గొడవే ఎంతసేపూ చూడాల్సిన మొనాటనీకి దారితీసిందీ సినిమా!

మానవాతీత  శక్తుల మెగా ఇమేజుడికి ఎదురెవరూ ఉండరని ఉద్దేశమేమో!

లాజిక్ కూడా బలాదూరవుతుంది. అన్నేళ్ళూ హీరో అజ్ఞాతంలో ఉండాల్సిన అవసరమేమిటి? ఎప్పుడో విలన్ కథ ముగించేసి వుండొచ్చు కదా? తన పగ కోసం కర్నూలు విలన్ వైజాగ్ వచ్చి పాగా వేస్తే , వైజాగ్ ని ఏలే వంశంలోని హీరో సీనులోంచి మాయమవడమేమిటి? ఇలాటి లాజిక్ ని పూర్వపక్షంజేసే అంశాలెన్నో అడుగడుగునా కన్పిస్తాయి.

-సికిందర్