రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

27, అక్టోబర్ 2019, ఆదివారం

887 :


          ది దీపావళి మాట కాదుగానీ,  హాలీవుడ్ నిర్మాత, రచయిత స్కాట్ మైయర్స్ ఒకే సారి మూడు స్క్రిప్టులు రాయడమెలా అనే దాని గురించి చెబుతూ, ముందుగా మూడు స్టోరీ ఐడియాలు నిర్ణయించుకోమంటాడు. అప్పుడు మొదటి దాన్ని ఫస్ట్ డ్రాఫ్ట్ వరకూ  రాసెయ్యమంటాడు. ఇది చేస్తున్నప్పుడు రెండో దానికి సన్నాహాలు చేసుకోమంటాడు. ఈ రెండూ చేస్తున్నప్పుడు మూడో దానికి రీసెర్చి చేసుకోమంటాడు. కానీ మన వైపు ఏం జరుగుతుందంటే, ముందుగా రచయితలకి ఈ పనే లేదు. వాళ్ళ చాప్టర్ ముగిసింది కాబట్టి. కథ రాసుకున్న వాడు షంషేర్ గా దర్శకుడై పోవడమే వుంది కాబట్టి. కాబట్టి రాసుకునే దర్శకుల గురించే ఇది... దర్శకులు చాలా వరకూ మూడు కథలు ప్రారంభించుకోవడమంటూ జరగదు. ఒకదాంతోనే పూర్తయ్యే వరకూ గడిపి, అది పూర్తయ్యాకే రెండోది ప్రారంభించే పద్ధతిలో వుంటారు. దీంతో సమస్య లేదు, అది వాళ్ళిష్టం. పోర్ట్ ఫోలియోలో రెండు మూడు స్క్రిప్టులుండాలనుకునే వాళ్ళు మాత్రం -  ఒక ప్లానింగ్ లేకుండా అది కొంత ఇది కొంతా మూడు నాల్గు కథలు ఏకకాలంలో రాసేస్తూ ఏదీ పూర్తి చేయలేకపోతారు. కారణం అన్నిటికీ  లైనార్డర్ వేసేస్తూ అన్నిటికీ  ట్రీట్ మెంట్ చేయడమే. అలా ఏకకాలంలో ఒక కథలోంచి ఇంకో కథలోకి మారలేక  పూర్తి చేయడంలో  విఫలమై పోతారు. ఓ మూడు ఐడియాలు అనుకుని, మొదటి దానికి సినాప్సిక్ రాసేసి లైనార్డర్ వేసేశాక, రెండోదానికి  సినాప్సిస్ మొదలెట్టుకుని మొదటి దానికి ట్రీట్ మెంట్ చేసుకుంటూ, రెండోదానికి లైనార్డర్ ప్రారంభించాక, ఇక మూడో ఐడియాకి సినాప్సిస్ మొదలెట్టుకుంటే, ఒకదాని వెనుక ఒకటి  వెళ్ళే మెట్రో ట్రైన్స్ లాగా, వాటి టైమింగ్స్ తో అవి విడివిడిగా పరుగులు దీసేందుకు అవకాశముంటుంది. ఒకదాన్నొకటి గుద్దుకుని పట్టాలు తప్పే ప్రమాదముండదు. మల్టీ టాస్కింగ్ ఈల వేసి ఒకేసారి పరుగు ప్రారంభించే రేసు కాదు, తగిన టైము ఇస్తూ ఒకదాని వెనుక ఇంకొకటి పంపే ట్రెక్కింగ్.

         
కాలంలో ఇంకా కొందరు రైటర్స్ ని చూస్తే జాలేస్తుంది. ఎందుకు కథలు రాస్తూ సలహాలడుగుతారో  అర్ధంగాదు. రైటర్ కథలిచ్చే రోజులుపోయి రెండు దశాబ్దాలు గడిచిపోయాయి. ఈ విషయమే పట్టకుండా ఒకటే రాసేస్తూంటారు. అది సినిమాగా వెండితెర మీద కాకరపువ్వొత్తిలా మెరుపులు మెరిపిస్తుందను కుంటారు. తమ జీవితమే దీపావళి అవుతుందని అమాయకంగా నమ్ముతూంటారు. రైటరనే అమాయకుడు మిగిలితే దర్శకులకి వాళ్ళ కథలకి రాసి పెట్టేందుకే మిగిలాడు. అదీ అందరి దగ్గరా కాదు. అరుదుగా ఎప్పుడో ఓ దర్శకుడెవరైనా హీరోల దగ్గర తన కథతో విఫలమవుతూ వున్నప్పుడు మాత్రం, కథకోసం ఎవరైనా రైటర్ ని అడిగే సందర్భం వస్తే రావచ్చు. అంతేతప్ప, రైటర్స్ నుంచి కథ లాశిస్తూ దర్శకులెవరూ తలుపులు బార్లా తెర్చిపెట్టి  కూర్చోలేదు. ఇది తెలుసుకుంటే కథలనే వ్యర్ధాలు ఉత్పత్తి చేస్తూ బుర్ర పాడు చేసుకోకుండా వుండ గల్గుతారు.

         
తుపాకీ రాముడు తప్ప తెలుగు సినిమాల్లేక తమిళ సినిమాలు జంట రాష్ట్రాల్లో దీపావళి జరుపుకుంటున్నాయి. విజయ్ ‘విజిల్’, కార్తీ ‘ఖైదీ’ యాక్షన్ సినిమాలు రెండూ ఈ వారం విడుదలయ్యాయి. విజిల్ స్పోర్ట్స్ డ్రామా అయితే, ఖైదీ పోలీస్ ఆపరేషన్. రెండూ మాస్ యాక్షన్ సినిమాలే. విజిల్ 180 కోట్లు, ఖైదీ  25 కోట్ల బడ్జెట్స్ తో తీశారు. రెండూ విజయాలే సాధించినా ఖైదీ ఎక్కువ లాభదాయకంగా వుండొచ్చు దాని తక్కువ బడ్జెట్ దృష్ట్యా. ఇక తెలుగులో ఈ రెండిటి విడుదల కోసం ‘సైరా’ థియేటర్స్ ని బాగా కుదించాల్సి వచ్చింది. సైరా కి క్లోజింగ్ కలెక్షన్స్ గతవారం ప్రకటించేశారు రెండు రాష్ట్రాల్లో 93 కోట్ల షేర్ తో. హిందీలో 8 కోట్లే లైఫ్ టైం బాక్సాఫీసు వచ్చింది. అక్టోబర్ రెండున విడుదలై, దీపావళి లోగా  నాల్గు వారాలకే క్లోజ్ అయింది. కంటెంట్ పరంగా రిపీట్ ఆడియెన్స్ ఎలిమెంట్స్ లోపమే దీనికి కారణం. మళ్ళీ పానిండియా మూవీ అంటూ వందలాది కోట్లతో ఇంకేదైనా తలపెడితే, ఆ స్క్రీన్ ప్లే ఉద్గ్రంథంలో రిపీట్ ఆడియెన్స్ ఎలిమెంట్సా పాడా అని తీసి అవతల పడేస్తే, తెలుగు ప్రేక్షకుడు పానిండియా మూవీని వైట్ ఎలిఫెంట్ చేస్తాడు మనోభావాలు దెబ్బతినిపోయి. ఒకటికి రెండు సార్లు చూడాలన్పించినప్పుడే అది బడ్జెట్ ని లాగేసే పానిండియా మూవీ.

        ఆరుగురు బాలీవుడ్ రైటర్లు తీరి కూర్చుని ఈ వారం ‘హౌస్ నిల్’’ చేసేశారు తమ విశిష్ట టాలెంట్స్ తో  ‘హౌస్ ఫుల్ -4’ అనే మల్టీ స్టారర్ ని. ఆరుగురు రైటర్స్ లో ఒకరు దర్శకుడే. దర్శకుడుగా మారిన రచయిత ఫర్హాద్ సాంజీ. మల్టీ స్టారర్ సినిమాకి రైటర్స్ కూడా మల్టీ స్టారర్ గా గుమికూడారు. అంతా కలిసి కనీసం కథలో కంటిన్యూటీ కూడా లేని అతుకుల బొంత సీన్లు సృష్టించి, హౌస్ ఫుల్ -4  ని గునపాలతో పొడిచి బాక్సాఫీసు ముందు కూల్చేశారు. బామియాన్ బుద్ధ విగ్రహాల్ని కూల్చిన తాలిబన్లు గుర్తుకొస్తున్నారు. తాలిబన్లు చదువు సంధ్యలకి వ్యతిరేకం. కథా పరిజ్ఞానాన్ని వ్యతిరేకించే సినిమా రచయితలూ తాలిబన్లే బఫూన్స్ లా.  
         
వీణకు శృతి లేదు ఎందరికో హృదయం లేదు... అని వీణ పాటలాగా ఎందరికో ఈ బ్లాగు సైడ్ బార్లో గ్యాడ్జెట్లు కంటి కానడం లేదు. కాస్త తలతిప్పి కుడి పక్క ఎప్పుడూ చూడరేమో. కుడి పక్క గ్యాడ్జెట్లో ఒకటి  ‘సంచిక ఆర్టికల్’ అని ఏడాది పైగా దర్శన మిస్తోంది. అక్కడ క్లిక్ చేస్తే ‘సంచిక డాట్ కాం’ పేజీ తెర్చుకుని ప్రాంతీయ సినిమాల మీద ఆర్టికల్ కనబడుతుంది. ప్రాతీయ సినిమాల మీద ఆర్టికల్స్ వస్తున్నట్టు ఎందరో పాషాణ హృదయులకి తెలియదు. అలావుంది ఒక వెబ్సైట్ ని సర్ఫింగ్ చేసే నాలెడ్జి. ఇంకేం నేర్చుకుంటారు. ప్రాంతీయ సినిమాల్లోంచి నేర్చుకోవాల్సింది చాలా వుంది. రెగ్యులర్ గా వచ్చే తెలుగు సినిమాల రివ్యూల నుంచీ, స్క్రీన్ ప్లే సంగతుల నుంచీ నేర్చుకునేదేమీ వుండదు. వస్తున్న తెలుగు సినిమాల్లో పదేపదే అవే తప్పులు తప్ప, నేర్చుకోవాల్సిన కొత్త సంగతి ఒక్కటీ వుండదు. అలాగే తీసే అవే నస సినిమాలు, అలాగే రాసే అవే నస రివ్యూలు, అవే నసపెట్టే స్క్రీన్ ప్లే సంగతులూ. తప్పులు రాయడమే రోజువారీ పనిగా మారింది. ఇక ఇవి రాయాలంటేనే విసుగెత్తే పరిస్థితి వచ్చింది. కానీ వివిధ ప్రాంతీయ సినిమాలని చూస్తూంటే వున్నదంతా ఇక్కడే కదా అన్పించక మానదు. పాత మిత్రుడు కస్తూరి మురళీ కృష్ణ తమ ‘సంచిక డాట్ కాం’ కోసం రాయాలన్నప్పుడు, ఏం రాయాలా అని ఆలోచిస్తే, ఎందుకో ప్రాంతీయ సినిమాల గురించి రాయాలన్పించింది. అలా మొదలైంది మొదటి శీర్షిక ‘ప్రాంతీయ సినిమా’. దేశంలో వున్న 18 ప్రాంతీయ భాషా సినిమా రంగాల పుట్టుపూర్వోత్తరాల గురించి వారం వారం రాయడం. ఇది పూర్తయ్యాక  మళ్ళీ రాయాల్సిందేనని కస్తూరి అడిగితే ‘ప్రాంతీయ దర్శనం’ అని రెండో శీర్షిక మొదలైంది. దీనికింద ఒక్కో ప్రాంతీయ భాష నుంచి ఆ నాటి మొదటి సినిమా, ఈ నాటి కొత్త సినిమా అని రెండు సినిమాలు చొప్పున 36 వారాలు ప్రాంతీయ సినిమాల తీరు తెన్నుల్ని రాసి ముగిస్తే, ఇంకా రాయాలని కస్తూరి పట్టుబడితే మూడో శీర్షిక ‘లోకల్ క్లాసిక్స్’ అని కస్తూరి పెట్టిన టైటిల్ తో గత వారం ప్రారంభమయింది. దీని కింద ఒక్కో ప్రాంతీయ భాషా క్లాసిక్ ని, కథా పరంగా కూలంకషంగా విశ్లేషించడం మొదలైంది. నేర్చుకోవడానికిది చాలా ఇంపార్టెంట్ శీర్షిక. కథా పరంగానే కాదు, సాంకేతికంగానూ అర్ధవంతమైన సమాచారం వీటి పరిశీలనలో లభిస్తుంది. ఈవారం, గత వారం, వచ్చే వారం కూడా సత్యజిత్ రే ‘నాయక్ ‘ గురించి రాయడం ఎంతో ప్రయోజనకరమైన అనుభవం.
సికిందర్  
     

బ్లాగుని ఆదరిస్తున్న పాఠకులందరికీ...