రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Tuesday, September 15, 2015

సాంకేతికం- పబ్లిసిటీ

సినిమా పబ్లిసిటీలో కీలక ఘట్టం లోగో విడుదల. తమ అభిమాన హీరో కొత్త సినిమా లోగో ఏ విధంగా వుంటుందో నన్న ఉత్కంఠతో ఊపిరి బిగబట్టి ఎదురు చూస్తూంటారు ఫ్యాన్స్. విడుదలైన లోగోని చూసి చర్చోప చర్చలు కూడా జరుపు కుంటారు. టైటిల్ ఆదిరిందా ఎగిరి గంతెయ్యడమే. సినిమా హిట్ అని అప్పుడే ప్రచారంకూడా చేసుకుంటారు. టైటిల్ డిజైన్ డల్ గా ఉందా- ఈసురోమని నీరసపడి పోవడమే.
       పబ్లిసిటీ ఆర్టిస్టు పని ముందుగా లోగోని హిట్ చేయాలన్న తీవ్ర కసరత్తుతో ప్రారంభమవుతుందని చెప్పారు సుప్రసిద్ధ పబ్లిసిటీ డిజైనర్ ధని ఏలే. దీనికోసం నిద్రాహారాలు మాని కృషి చేస్తామన్నారు. ఇదేదో కంప్యూటర్ లోంచి ఊడిపడే ఇన్ స్టెంట్ అద్భుతం కాదన్నారు. సాఫ్ట్ వేర్స్ లో వుండే పరిమిత ఫాంట్స్ టైటిల్ డిజైనింగ్ కి పనికొచ్చేవి కావనీ,  బ్రష్ పట్టుకుని స్వ హస్తాలతో చిత్రించాల్సిందే ననీ అన్నారు.  బ్రష్  పట్టుకోవడం తెలీని ఫోటో షాప్ పబ్లిసిటీ ఆర్టిస్టులు కూడా వుంటారనీ, వాళ్ళు బయట లోగోలు వేయించుకో వచ్చునేమోగానీ, ఫోటో షాప్ తో వాటికి  న్యాయం చేయడం కష్టమే అవుతుందన్నారు. ఎందుకంటే, ఫోటో షాప్ లో నటీనటుల అప్పీయరెన్సుల్ని  మెరుగులు దిద్దాలన్నా, ఆర్టిస్టుకి ఆత్మ తెలియాలి. అది బ్రష్ తో బొమ్మలేసిన అనుభవంతోనే తెలుస్తుందని చెప్పుకొచ్చారు. ఇదీ ధని అనుభవ సారం ( 1997-98 ప్రాంతాల హైదరాబాద్ శాంతి శిఖర అపార్ట్ మెంట్స్  గ్రౌండ్ ఫ్లోర్ లో కేవలం బ్రష్, స్ప్రే గన్ ఈ రెండే పట్టుకుని పోస్టర్స్ డిజైన్ చేస్తూ కన్పించేవారు ధని- చాలా ఫ్రెండ్లీ మనిషి). 


            ఇప్పుడు రంగంలో వున్న చాలా కొద్ది మంది పబ్లిసిటీ ఆర్టిస్టుల్లో ధని ఏలే ఒకరు. ఈయన అన్న- గ్రేట్ ఆర్టిస్టు లక్ష్మణ్ ఏలే గురించి తెలీని వాళ్ళు లేరు. ఇంటర్ చదువుతున్నప్పుడే ధని పాకెట్ మనీ కోసం దుకాణాలకి సైన్ బోర్డులు రాసే పని చేపట్టారు. నల్లగొండ జిల్లా కదిరేని గూడెం నుంచి హైదరాబాద్ వచ్చి ‘తారా యాడ్స్’ లో కొన్నాళ్ళు పనిచేసి, ‘సితార’ సినిమా వార పత్రికలో లే అవుట్ ఆర్టిస్టుగా చేరారు. అప్పుడే సినిమాలకి పోస్టర్స్ వేయాలన్న ఆలోచన వచ్చింది. ఆ ఉద్యోగం కూడా వదిలేసి సొంత స్టూడియో పెట్టుకున్నారు. చిన్న చిన్న సినిమాలతో చాలా స్ట్రగుల్ చేసి, ఆఖరికి పూరీ జగన్నాథ్ తీస్తున్న, పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘బద్రి’ తో భారీ సినిమా అవకాశాన్ని దక్కించుకున్నారు. అక్కడ్నించీ ఇక జైత్ర యాత్రే. ‘బుజ్జి గాడు మేడ్ ఇన్ చెన్నై’ వరకూ పూరీ సినిమాలన్నిటికీ పబ్లిసిటీ సమకూరుస్తూ  వస్తున్నారు. అందరు అగ్ర హీరోల, దర్శకుల సినిమాలకి కూడా సేవలందించారు. ఇప్పటి దాకా 150 సినిమాలకి పబ్లిసిటీ డిజైనింగ్ చేశారు. వీటిలో ‘పోకిరి’, ‘ఖలేజా’, ‘సింహ’, ‘గగనం’, ఈ నాలుగు సినిమాల లోగోలు,  వీటి పబ్లిసిటీ డిజైన్లూ  తనకి బాగా పేరు తెచ్చాయన్నారు.
          ‘ పబ్లిసిటీ ఆర్టిస్టు పని సినిమా విడుదలకి మెటీరియల్ రూపొందించడంతోనే అయిపోలేదు..ఆ తర్వాత కూడా కొత్త కొత్త పోస్టర్స్ తో సినిమాని ప్రమోట్ చేస్తూ రెండవ వారం, మూడవ వారం, అర్ధ శత దినోత్సవం, శత దినోత్సవం...ఇలా కొనసాగైతూనే ఉంటుంది’ అన్నారు.


          ఈ రంగంలో చోటు చేసుకుంటున్న పరిణామాల గురించి చెబుతూ, తొలితరం ప్రసిద్ధ కళాకారుడైన ఈశ్వర్ తో తనకి పరిచయముందన్నారు. ఆ రోజుల్లో బ్లాక్ మేకింగ్ ఉండేదనీ, ఫోటోలని కత్తిరించి, అతికించి, జెరాక్స్ తీసి, ఇండియన్ ఇంకుతో టైటిల్స్ వేసి, పోస్టర్లు రూపొందించేవారనీ, తర్వాత కలర్ పోస్టర్స్ వచ్చాక, బ్రష్ తో బ్యాక్ గ్రౌండ్ వేసేవారనీ వివరించారు. ఇక బ్రష్ తర్వాత స్ప్రే గన్ వచ్చింది. దీని తర్వాత సాఫ్ట్ వేర్లూ, ఫోటో షాపూ వచ్చినట్టు చెప్పారు.
          ఇలా డిజిటలీకరణ చెందాక బాగా ఖర్చు తగ్గిందన్నారు ధని. పైగా చిటికెలో కలర్ కరెక్షన్స్ చేయడంగానీ, ఆప్షన్స్ చూపించడం గానీ సాధ్యమవుతోందన్నారు. పోతే, ఒక సినిమాకి పబ్లిసిటీకి దేన్ని రిఫరెన్స్ పాయింటుగా తీసుకుంటారన్న ప్రశ్నకి, ఆ సినిమా కాన్సెప్ట్ ని తీసుకుంటామని చెప్పారు. కాన్సెప్ట్ ని దృషిలో పెట్టుకునే లోగో రూపకల్పనా, పోస్టర్స్ డిజైనింగూ చేస్తామన్నారు. బాలీవుడ్ లో అయితే సినిమా రషెస్ చూపించి పూర్తి అవగాహన కల్పిస్తారనీ, ఇక్కడా పధ్ధతి లేదనీ అన్నారు. ఇంకా బాలీవుడ్ లో సినిమా సినిమా స్టిల్స్ తో సంబంధం లేకుండా ఫోటో షూట్స్  చేసి పబ్లిసిటీకి వాడుకుంటున్నారన్నారు.  ఈ పధ్ధతి తెలుగులో ‘సొంతం’ అనే సినిమాతో ప్రారంభమైన సంగతి  గుర్తు చేస్తే, అసలలా షూటింగ్ పూర్తయిన తర్వాత ఫోటో షూట్స్ చేసి పబ్లిసిటీకి వాడుకోవడం ప్రేక్షకుల్ని తప్పు దోవ పట్టించడమే నన్నారు.

        ఇంటర్నెట్ నుంచి విదేశీ సినిమాల పోస్టర్ డిజైన్స్ ని కాపీ కొట్టే ధోరణి గురించి చెబుతూ, దానివల్ల చౌకబారు డిజైన్లు మాత్రమే తయారవుతాయన్నారు. ఇంటర్నెట్ ని విరివిగా ఉపయోగించుకునే వాళ్లకి ఈ కాపీ వ్యవహారాలు ఇట్టే తెలిసిపోతాయన్నారు.
          రికార్డు స్థాయిలో ఏడు సార్లు భరతముని ఉత్తమ పబ్లిసిటీ ఆర్టిస్టు అవార్డులని అందుకున్న ధని ఏలే, తాజాసినిమా ‘బ్రమ్మిగాడి లవ్ స్టోరీ’ ఇటీవలే విడుదలైంది. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ తో బోయపాటి శీను తీస్తున్న ‘దమ్ము’, విజయేంద్ర ప్రసాద్  దర్శకత్వం వహిస్తున్న ‘రాజన్న’, రవితేజ నటిస్తున్న ‘నిప్పు’  శ్రీకాంత్ నటిస్తున్న ఇంకో సినిమా, మొదలైన వాటికి పబ్లిసిటీ సమకూరుస్తూ బిజీగా వున్నారు తను.
సికిందర్
( జులై 2011, ఆంధ్రజ్యోతి-‘సినిమా టెక్’ శీర్షిక)