రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

4, మే 2014, ఆదివారం

రివ్యూ..


పండని  ప్రయోగ కళలు 
రచన- దర్శకత్వం : ప్రవీణ్ సత్తారు
తారాగణం : కృష్ణుడు, కిషోర్, కృష్ణేశ్వర్ రావు, నరేష్, ఆమని, లక్ష్మి మంచు, రిచా పనాయ్, శామినీ అగర్వాల్ తదితరులు
సంగీతం : మిక్కీ జె. మేయర్,   ఛయాగ్రహణం : ఆర్. సురేష్
బ్యానర్ : ఎ వర్కింగ్ డ్రీమ్ ప్రొడక్షన్స్      నిర్మాత : చాణక్య బూనేటి  
విడుదల :  ఏప్రెల్  25, 2014       సెన్సార్ : U/A
***
తెలుగులో ప్రయోగాత్మక సినిమాల్ని ఆదరించరనే ఘాటు విమర్శల్ని అలా వుంచి, అసలా ప్రయోగాత్మక సినిమాల తీరుతెన్నులెలా వుంటున్నాయో చూస్తే మాత్రం చింతించాల్సిందే. ఈమధ్యే చూసుకుంటే ‘బంగారు కోడిపెట్ట’ నుంచీ ‘కమలతో నా ప్రయాణం’ దాకా, ‘లడ్డు బాబు’ నుంచీ ‘చందమామ కథలు’ దాకా, వాటి ప్రచారాల్లో చేస్తున్న ఆర్భాటమంతా తీరా ఆ ప్రయోగాల సృజనాత్మకతల్లో లోపించి సెలవు తీసుకోవాల్సివస్తోంది. ఆదరించడం లేదని హాహాకారాలు చేసేముందు, అసలు  తమ సరుకెలా వుందో  సరిచూసుకుంటే  అటూ ఇటూ బ్యాలెన్స్ అయి బయటపడతారు.
ఓకే కథతో సినిమా తీస్తే ప్రేక్షకులకి నచ్చుతుందో లేదో, అందుకని ఏదో ఒక కథ నచ్చి హిట్టవక పోతుందా అన్న ఆశాభావంతో  మూడు కథల బంగారంగా   ‘బంగారు కోడిపెట్ట’ తీశానని చెప్పుకున్న సదరు దర్శకుడి బడాయి కూడా బాక్సాఫీసు ముందు ఎందుకు బలాదూరయ్యిందో తెల్సిందే.

ఇప్పుడు తాజాగా అందరికంటే భిన్నంగా ఆలోచించి, భిన్నంగా  సినిమాలు తీస్తున్న దర్శకుడు ప్రవీణ్ సత్తారు చేసిన ‘చందమామ కథలు’  ప్రయోగంలో ఎనిమిది కథలున్నాయి. ఒక కథ పూర్తయి ఇంకో కథ ప్రారంభమయ్యే ఆంథాలజీ లాగాక, సమాంతర ఖండికలుగా వచ్చి పోతూంటాయి. 2007లో అనురాగ్ బసు హిందీలో తీసిన బహుళ కథా చలన చిత్రం ‘లైఫ్ ఇన్ ఏ మెట్రో’’, దీనికి ముందు 2003 లో రాంగోపాల్ వర్మ నిర్మాణంలో ప్రవాళ్ రమణ్  దర్శకత్వం వహించిన ఆరు కథల ‘డర్నా మనా హై’, 2007లో రామ్ గోపాల్ వర్మతో కలుపుకుని ఏడుగురు దర్శకుల ‘డర్నా జరూరీ హై’ అనే ఏడు కథల ఆంథాలజీ వచ్చాయి. ఈ మూడూ విజయాలు సాధించాయి.  దక్షణాదిన చూసుకుంటే, 2009లో మలయాళంలో పదకొండు మంది దర్శకుల పదకొండు కథల ‘కేరళ కేఫ్’ వచ్చింది. ఇదీ హిట్టయ్యింది.

మరి చందమామ కథల  సంగతేంటి?

సుఖ దుఃఖాలు సగం సగం!

సారధి (కిషోర్) అనే కథా రచయిత తన కూతురి వ్యాధి చికిత్సకి అవసరపడ్డ డబ్బుల్ని ఏం రాసి సంపాదించాలా అని ఆ లోచిస్తున్నప్పుడు తట్టేవే అతను చూసిన  జీవితాల ఈ  క్రింది తిప్పలు..

1. బాగా లావెక్కిన సాఫ్ట్ వేర్ ఉద్యోగి వెంకటేశ్వర్రావ్ (కృష్ణుడు) కి ముప్ఫై దగ్గర పడుతున్నా పెళ్లి కావడం లేదని బెంగపడి, పెళ్ళికోసం విఫల యత్నాలు చేస్తూంటాడు.

2. ఒకప్పుడు మోడల్ గా వెలిగిన లీసా స్మిత్ (మంచు లక్ష్మి) ఇప్పుడు అవకాశాల్లేక, సహజీవనం చేస్తున్న డబ్బున్న వాడు కూడా వేరొకామెని చూసుకోవడంతో, మిడిల్ క్లాస్ ఫ్లాట్ లో అద్దెకుంటూ తాగుడూ సిగరెట్లు మరిగి టెన్షన్ తో గడుపుతూంటుంది.

3. ఓల్డ్ సిటీలో సూపర్ మార్కెట్ నడిపే అష్రఫ్ ( అభిజిత్)ని  హసీనా (రిచా పనాయ్) ప్రేమలోకి దింపి, పెద్దలతో సంబంధం మాట్లాడమని ఒత్తిడి చేస్తూంటే ఇరకాటంలో పడతాడు అష్రఫ్.

4. ఇంటర్ రెండో సంవత్సరం చదివే రఘు ( నాగ శౌర్య) క్లాస్ మేట్ అయిన రాజకీయనాయకుడి కూతురు రేణు (శామిలీ  అగర్వాల్) ని కాదనలేని పరిస్థితుల్లో ఇరికించి, పెళ్ళిచేసుకుని,  జీవితంలో సెటిలై పోవాలని పథకా లేస్తూంటాడు.


5. ఇంకో పనీపాటా లేని రఘు (కృష్ణ చైతన్య)  వూళ్ళో నానమ్మ (పావలా శ్యామల) నిఘాలో వున్న ముగ్గురు మనవరాళ్ళలో గౌరీ ( అమితా రావ్) అనే అమ్మాయిమీద మీద కన్నేసి,  ముగ్గులోకి దింపాలని కాని పనులు చేస్తూంటాడు.

6.  భార్యకి విడాకులిచ్చి వచ్చిన ఎన్నారై మోహన్ (నరేష్) అనుకోకుండా మాజీ ప్రేమికురాలు సరిత (ఆమని) ని విధవరాలిగా చూసి, కొడుకులూ కోడళ్ళూ వున్నామెతో తిరిగి స్నేహం పెంచుకునే ప్రయత్నాల్లో ఉంటాడు.

7. ఓ బిచ్చగాడు (కృష్ణేశ్వర్ రావు) పన్నెండు లక్షలు విలువజేసే ఒకింటికి ఎలాగైనా యజమాని కావాలన్న కలలతో బిచ్చ మెత్తుకుంటూ భారీ యెత్తున డబ్బు పోగేస్తూంటాడు.

8. ఈ కథ రచయితదే.. సగంసగం కథలు రాసుకెళ్ళి ఐదు లక్షలు అర్జెంటుగా అడ్వాన్సు ఇమ్మని అడిగితే, కథలు పూర్తి చేసుకు రమ్మంటాడు ప్రచురణకర్త (సూర్య)...


ఇదీ విషయం. ఇక్కడ్నించీ తన సమస్య మళ్ళీ మొదటికొచ్చి,  సగం సగం కథల్ని పూర్తి చేసే శక్తియుక్తుల్ని కూడదీసుకుని  కష్టిష్తాడు సారధి...ఓ పక్క కూతురి ఆపరేషన్ దగ్గర పడుతూంటుంది. పూర్తి చేయాల్సిన ఏడు కథల్లోనూ సంఘర్షణ లున్నాయి. వాటిలో సగం సుఖాంతాలు, సగం దుఖాంతాలూ వున్నాయి...తీరా పూర్తిచేసి ప్రచురణకర్త దగ్గరికి తీసికెళ్తే తన కథే దుఖాంతమయ్యింది ! ఇప్పుడేం చేయాలి ? ఆపరేషన్ కి డబ్బు ఎలా?

గతనెల ‘రౌడీ’ లో మోహన్ బాబు పెద్దకొడుకుగా నటించిన కిషోర్ ఈసారి కాఫీ షాపుల్లో కూర్చుని ఇంగ్లీషులో  రాసే లాప్ టాప్  రచయితగానూ సరిపోయాడు. అయితే పాత్ర వ్యక్తిత్వమే చివరికి చట్టు బండలయ్యింది. రాసిన కథలూ కథల్లా వుండవు..తనచేతుల్లోనే తన అదృష్టముంది. వేరే ప్రచురణకర్త ని నమ్ముకుని భంగ పడాల్సిన అవసరమే  లేదు....ఇదెలా జరగొచ్చో తర్వాత  ‘స్క్రీన్ ప్లే సంగతులు’ లో చూద్దాం.


ఇతర పాత్రలు పోషించిన జ్యూనియర్ /సీనియర్ నటీనటు లందరూ బాగా నటించారు.  బిచ్చగాడి పాత్రలో కృష్ణేశ్వర్ రావు మాత్రం గుర్తుండి పోతాడు. సినిమాకి యూత్ అప్పీల్ నిచ్చిన మంచు లక్ష్మి మోడరన్ పాత్ర ఆమె మాత్రమే  చేయగలదేమో.

టెక్నికల్ గా, మిక్కీ జె మేయర్ కూర్చిన సంగీతపరంగా,  సినిమా ఉన్నత స్థాయిలోనే వుంది. దర్శకుడుగా ఎన్నారైగా వచ్చిన ప్రవీణ్ సత్తారు ఇంకొంచెం మెరుగయ్యాడు. రచయితగా బాగా మెరుగులు దిద్దుకుంటేనే కమర్షియల్ సక్సెస్ సాధించ గల్గేది!

స్క్రీన్ ప్లే సంగతులు

contd..