రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

24, జనవరి 2022, సోమవారం

1122 : ఇరానియన్ మూవీ రివ్యూ!

 రచన-  దర్శకత్వం : అస్ఘర్ ఫర్హదీ
తారాగణం : అమీర్ జదీదీ, సహర్ గుల్దస్త్, మోహ్సేన్ తనబందే, సరీనా ఫర్హదీ తదితరులు
ఛాయాగ్రహణం : అలీ ఘాజీ, కూర్పు : హయదే సఫియారీ
బ్యానర్ : మెమెంటో ఫిలిమ్స్
నిర్మాతలు : అలెగ్జాండర్ మలెట్ గై, అస్ఘర్ ఫర్హదీ
పంపిణీ : అమెజాన్ స్టూడియోస్
విడుదల : జనవరి 21, 2022,  అమెజాన్ ప్రైమ్ వీడియో
***

    క వ్యాపారం కోసం రహీమ్ సుల్తానీ (అమీర్ జదీదీ) ఫైనాన్సర్ దగ్గర అప్పు తీసుకుంటాడు. ఆ అప్పు తీర్చాలంటూ ఫైనాన్సర్ బెదిరింపులకి దిగేసరికి, బహ్రామ్ (రచయిత, నటుడు మోహ్సేన్ తనబందే) అనే బంధువు రహీమ్ ని ఆదుకుని అప్పు మొత్తం 150,000 ఇరానీ రియాళ్ళు తను కట్టేస్తాడు. ఇప్పుడు బహ్రామ్ కి బాకీపడిన రహీమ్ ఇది కూడా తీర్చక పోయేసరికి, బహ్రామ్ కేసుపెట్టి రహీంని జైలుకి పంపించేస్తాడు.

    కొంత కాలం తర్వాత రహీమ్ పెరోల్ మీద విడుదలై వస్తాడు. అతను పెళ్ళయి విడాకులు తీసుకున్నాడు. పదేళ్ళ కొడుకు వున్నాడు. అక్కా బావలున్నారు. కొడుకుతో వాళ్ళ దగ్గరే వుంటాడు. బావ హొసేన్ (అలీరెజా జహందీదే) కి చెప్పి బహ్రామ్ తో రాజీ కుదర్చమంటాడు. కొంత కొంత అప్పు తీర్చేస్తానని, జైలు శిక్ష రద్దు చేయించమనీ కోరతాడు. ఈ రాజీ ప్రయత్నానికి బహ్రామ్ ఒప్పుకోక మొత్తం అప్పు తీర్చి తీరాల్సిందేనంటాడు. అతడికి జెరాక్స్ సెంటర్ నడుపుతున్న కూతురు ఫాతిమా (దర్శకుడి కుమార్తె సెరీనా ఫర్హదీ) వుంటుంది. ఆ కూతురి కట్నానికి దాచిన డబ్బు అది. ఆ డబ్బు మొత్తం ఒకేసారి కావాలంటాడు.

    రహీమ్ కి రహస్యంగా కలుస్తున్న గర్ల్ ఫ్రెండ్ ఫర్కొందే (సహర్ గుల్దస్త్) వుంటుంది. ఆమెని పెళ్ళి చేసుకోవాలంటే తన జైలు శిక్ష రద్దు అవాలి. ఆమెని కలవడానికెళ్తే ఆమె ఒక బ్యాగు దొరికిందని చూపిస్తుంది. అందులో 17 బంగారు నాణేలుంటాయి. వాటిని అమ్మి అప్పు తీర్చేద్దామని ప్రయత్నిస్తే, వాటి మీద వచ్చే డబ్బు అప్పు తీర్చడానికి చాలదని తెలుస్తుంది.  

అబద్ధాల కోటలో హీరో

  దీంతో ఒక ఆలోచన చేస్తాడు. ఈ బంగారంతో తన నిజాయితీ నిరూపించుకుంటూ వార్తలకెక్కితే తను హీరో అవుతాడనీ, అన్ని సమస్యలూ ఒక్క దెబ్బతో పరిష్కారమై పోతాయనీ భావిస్తాడు. దీంతో వూరంతా తనకి దొరికిన బ్యాగు గురించి పోస్టర్లు వేసి, అక్క ఫోన్ నెంబర్ ఇస్తాడు. ఆ బ్యాగు పోగొట్టుకున్న నాజ్నీన్ అనే కష్టాల్లో వున్న యువతి ఆ ఫోన్ నెంబర్ కి కాల్ చేసి వచ్చి, రహీమ్ అక్క దగ్గర్నుంచి బ్యాగు తీసికెళ్ళి పోతుంది.

    ఇది టీవీ ఛానెల్ కి తెలిసి రహీమ్ ని ఇంటర్వ్యూ చేసి ప్రసారం చేస్తారు. అప్పు కేసులో జైల్లో శిక్ష అనుభవిస్తున్న ఖైదీ రహీమ్, అంత బంగారం దొరికినా దురాశ పడక, ఆ బంగారంతో అప్పు తీర్చేసి జైల్లోంచి బయటపడే ఆలోచన కూడా చేయకుండా, పరోపకార భావంతో బ్యాగు సొంతదారుకి అప్పగించేసి, హీరోలా ప్రవర్తించాడని వూరూ వాడా అవుతుంది. జైలు అధికారి కూడా రహీమ్ నిజాయితీని మెచ్చుకుంటూ ప్రకటన విడుదల చేస్తాడు.

    ఇదంతా చూసి బహ్రామ్ మండిపడతాడు. ఈ వెధవ హీరో అవడమేమిటి? సోషల్ మీడియాలో కూడా రహీమ్ కొస్తున్న మద్దతు చూసి, ఇప్పుడు కూడా బాకీ విషయంలో సడలింపుల ప్రశ్నే లేదంటాడు. ఇంతలో ఒక ఛారిటీ సంస్థ హీరో అయిన రహీమ్ ని సన్మానిస్తుంది. ఆ సన్మాన సభలో రహీమ్ కొడుకు చేత పథకం ప్రకారం మాట్లాడించి సానుభూతి పొందాలని చూస్తాడు. అప్పు తీర్చడానికి తన తండ్రి పడుతున్న కష్టాలు ఆ పిల్లవాడి నోటి నుంచి విన్న సభికులంతా కదిలిపోయి విరాళాలు కురిపించేస్తారు.

సాలెగూట్లో సుల్తానీ

    ఇక రహీమ్ ప్రభుత్వోద్యోగం కోసం దరఖాస్తు చేసుకుంటాడు. కానీ అధికారి ఈ బ్యాగు వ్యవహారం నిజమేనా అని ప్రశ్నించడం మొదలెడతాడు. బ్యాగు తనకే దొరికిందనీ, దాన్ని ఆ బ్యాగు సొంతదారైన యువతికి అప్పజెప్పామనీ అంటాడు రహీమ్. ఆమె ఫోన్ నంబర్ ఇమ్మంటాడు అధికారి. ఆమె టాక్సీ డ్రైవర్ ఫోన్నుంచే మాట్లాడిందనీ, అందుకని ఆమె ఫోన్ నంబర్ తెలీదనీ అంటాడు  రహీమ్. ఆమె ఎవరో ముందుకొచ్చి వాంగ్మూలం ఇస్తే తప్ప రహీమ్ ఉద్యోగ దరఖాస్తుని పరిశీలించలేమని స్పష్టం చేసేస్తాడు అధికారి.

    రహీమ్ విరాళాలు సేకరించిన ఛారిటీ సంస్థకి వెళ్తే, సంస్థ నిర్వాహకురాలు రద్మెహర్ (రచయిత్రి, నటి, దర్శకురాలు ఫరిష్టే సదర్) మొత్తం రహీమ్ వ్యహారాన్ని అనుమానించి, ఆ సేకరించిన విరాళం మరణ శిక్ష పడ్డ ఓ ఖైదీ విడుదలకి బ్లడ్ మనీ గా చెల్లించేశామని చెప్పేస్తుంది. ఇక్కడ రహీమ్ ఇంకో ఫోజు కొడతాడు- ఆ సభలో కొడుకు చేత తను అలా మాట్లాడించింది నిజానికి ఆ ఖైదీ కోసం అలా విరాళాలు వసూలవ్వాలనే అంటూ - మళ్ళీ ఈ క్రెడిట్ కూడా కొట్టేసి మరింత హీరోనై పోవాలనుకుంటాడు.

    అయితే తను కడుతున్న అబద్ధాల మేడ కూలిపోతోందని కూడా గమనించకుండా, ఇంకో పథకం వేస్తాడు. బ్యాగు సొంతదారు ఈమేనంటూ తన గర్ల్ ఫ్రెండ్ ని తీసికెళ్ళి అధికారికి చూపించేస్తాడు. దీంతో పూర్తిగా తన అబద్ధాల - పథకాల సాలెగూడులో తనే పీకల దాకా చిక్కుకు పోతాడు రహీమ్ సుల్తానీ ...

ఎలా వుంది కథ

లోపలి మనిషితో ఈ కథ... మనకి ఒక్కటే పరిశుభ్రమైన రంగు వుందనీ, అది తెల్లటి తెలుపు అనీ, దాని మీద ఒక్క మరక కూడా పడే ప్రసక్తే లేదనీ ఫీలవుతూ, ఎంతో నీతిగా జీవిస్తున్నామనుకుని మనతో మనం జాగ్రత్తగా వుంటూ, అవతలి వాళ్ళకి పరమ సత్యవంతుల్లా కన్పించే ప్రయత్నం చేస్తూంటాం. రోడ్డు మీద పడి నాల్గు రూపాయలు కన్పించగానే ఆ నిష్ఠా పరాయణత్వమంతా- నైష్ఠిక ప్రవృత్తి అంతా ఏమవుతుందో, ఎంత ముష్ఠిదో తేలిపోతుంది. రోడ్డు మీద రూపాయలు కన్పించగానే ఎవరైనా చూస్తున్నారా లేదా అని చూస్తాం. ఎందుకు చూస్తాం? ఎవరూ చూడకపోతే జేబులో వేసుకోవచ్చని, చూస్తే ఈ డబ్బెవరిదీ అని హీరోలా అరవ్వచ్చనీ!

    ఇదే రహీమ్ సుల్తానీ లోపలి క్యారక్టర్. అతను దొరికిన బంగారాన్ని గర్ల్ ఫ్రెండ్ చూపించగానే గబుక్కున ఏం ఫీలయ్యాడో అదే అతడి క్యారక్టరైనా, ఇంకెవరి క్యారక్టరైనా. ఆ దొరికిన బంగారం అమ్ముకుని అప్పుల్లోంచి బయట పడొచ్చని ఫీలవ్వడం ఫీలవ్వడం  అబద్ధాల మీద అబద్ధాలు చెప్పించి పతనం అంచుకి చేర్చింది. అదే తగినంత బంగారం దొరికి వుంటే నిస్సందేహంగా అది అమ్ముకుని అప్పుల్లోంచి బయటపడే వాడు. తగినంత బంగారం దొరక్కపోయేసరికి - నిజాయితీ పరుడన్పించుకుంటూ ఇంకో విధంగా లాభపడాలన్న దుర్బుద్ధితో నాటకాన్ని రచించి హీరో అయ్యాడు.

    ఇక్కడ్నించే దేన్ని ఆధారంగా చేసుకుని పథకం ప్రకారం హీరో అన్పించుకున్నాడో ఆ బంగారం సొంతదారు దగ్గరికే వచ్చి ఆగుతుంది పరిస్థితి. ఆమెని వెతికి తీసుకొస్తే అంతా బాగానే  జరిగేది. అయితే ఖర్మ కొద్దీ ఏం జరిగిందంటే, పోస్టర్ల మీద ఫోన్ నంబర్ చూసి, టాక్సీ అతడి ఫోన్ తీసుకుని రహీమ్ అక్కకి ఫోన్ చేసి వచ్చి కలిసిన నాజ్నిన్, తన బాధంతా చెప్పుకుంటుంది. భర్త పని చేయడు. తనే తివాచీలు కుట్టి కూడబెట్టిన డబ్బుతో కొనుక్కున్న బంగారమది. అది దొరికినందుకు సంతోషంగా వుందని చెప్పి బ్యాగు తీసుకుని వెళ్ళిపోతుంది. రహీమ్ అక్క ఆమె వివరాలేమీ తీసుకోలేదు. అదీ సంగతి.

    ఇక ఆమె దొరక్కపోవడంతో తన గర్ల్ ఫ్రెండ్ నే ఆ యువతిగా ప్రవేశపెట్టి పతనానికి శరవేగంగా బాట వేసుకున్నాడు...ఈ క్రమంలో ఇంకో తప్పుకి పాల్పడతాడు. అప్పిచ్చిన బహ్రామ్ తోనే ఘర్షణ పెట్టుకుని కొడతాడు. అది వీడియో తీసేస్తుంది బహ్రామ్ కూతురు ఫాతిమా. ఆ వీడియో సోషల్ మీడియాలో పెట్టేసిందంటే తనకొచ్చిన మంచి పేరంతా పోతుంది!

    చివరికెలా ముగిసింది? రహీమ్ కథ సుఖాంతమా, దుఖాంతమా? అప్పు తీర్చాడా? పెరోల్ గడువులోగా ఏం జరిగింది? తిరిగి జైలుకేనా, ఇంటికా? సింపుల్ కథ. ఇంత కథలా అన్పించని సింపుల్ కథ ఇలా తీస్తే తెలుగులో బావుంటుందా? కానీ నిజజీవితం ఇలాగే వుంటుంది. దీంట్లో కామెడీ గానూ తీయొచ్చు. తీస్తే కొత్తదనమేం వుండదు. ఈ తరహా కథా కథనాలని, మేకింగ్ నీ తెలుగులో చూస్తారా, తిప్పికొడతారా చెప్పడం కష్టం. సాహసించి ఎవరైనా ఇలాటి ప్రయత్నం చేస్తే తెలుగు సినిమా క్వాలిటీ మరో మలుపు తిరుగుతుంది. ఈ అమెజాన్ విడుదల ప్రస్తుతం అమెరికాలో  స్ట్రీమింగ్ అవుతోంది. ఇండియాలో  స్ట్రీమింగ్ అయినప్పుడు డబ్బింగ్ చేస్తే తెలుగు ప్రేక్షకుల స్పందనేమిటో తెలుస్తుంది.

నటనలు సాంకేతికాలు

రహీమ్ సుల్తానీగా అమీర్ జదీదీ చాలా ఎక్సెలెంట్ గా వుంటాడు. అతడిది స్మైలింగ్ ఫేస్. మనసులో ఆలోచనలని బయటపడనివ్వని స్మైలింగ్ ఫేస్. క్యారక్టర్ కి ఈ స్మైలింగ్ ఫేస్ లక్షణం కల్పించడం అద్భుత ఆలోచనే. అందరితో ఆత్మీయంగా వుంటాడు, ఎవరి ముందూ బయటపడడు. అలాటి వాడు గర్ల్ ఫ్రెండ్ విషయంలో బయటపడాల్సిన పరిస్థితి వస్తుంది. గర్ల్ ఫ్రెండ్ ని రహస్యంగా వుంచిన తను ఆమెనే బంగారం సొంతదారుగా అబద్ధపు నాటకంలో ముందుకు తీసుకురావాల్సిన పరిస్థితి ఎదురవుతుంది.

    గర్ల్ ఫ్రెండ్ గా సహర్ గుల్దస్త్ కూడా నీటుగా కన్పిస్తుంది. రోమాన్స్ వుండదు. రోమాన్స్ కి చోటులేదు. హీరో సమస్యతో సతమతమయ్యే పాత్రగా వుంటుంది. ఇంకో చెప్పుకోదగ్గ నటుడు బహ్రామ్ గా నటించిన మోహ్సేన్ తనబందే. కూతురి కట్నం కోసం దాచుకున్న డబ్బు తీసుకుని చెలగాట మాడుతున్న హీరోని జైలుకి పంపడం మినహా ఇంకేం ఆలోచించని, గొడవపడని హూందాతనం గుర్తుండి పోయేలా నటించాడు. ఇక ఛారిటీ సంస్థ నిర్వహకురాలిగా సీనియర్ నటి ఫరిష్టే సదర్ ది కూడా గుర్తుండిపోయే నటన. అందరి నటనలూ అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన నటనలే. ఈ స్కిల్స్ వేరు. తెలుగులో తీయాలంటే ఈ స్థాయి స్కిల్స్ కూడా అవసరం.

    విజువల్స్ ఎక్కువగా అద్దాల గదుల్లో ఆఫీసుల్లో ఇళ్ళల్లో షాపుల్లో పారదర్శకంగా చాలా ప్లెజంట్ గా వుంటాయి. ఈ అద్దాల బ్యాక్ డ్రాప్ సింబాలిజం కావచ్చేమో. ఒక అబద్ధాల ప్రహసనం నడుస్తున్న నేపథ్యంలో, మనుషులనే వాళ్ళు అద్దాల్లా పారదర్శకంగా వుడాలని గుర్తు చేయాలనేమో. ప్రారంభంలో హీరో జైల్నుంచీ ఇంటికొస్తూ మధ్యలో బావగారు పనిచేస్తున్న కొండపైకి ఎక్కుతాడు. ఇది కూడా సింబాలిజమే కావచ్చు. అబద్ధాల మెట్లు కట్టుకుని పైకి ఎక్కేయ బోతాడనీ...

    ఇంకోటేమిటంటే బ్యాక్ గ్రౌండ్ స్కోరు వుండదు. ఓ రెండు మూడు డిమాండ్ చేసిన దృశ్యాల్లో మంద్రంగా తప్ప ఎక్కడా సంగీతమే వుండదు. తెలుగులో మేకర్స్ ఈ ఛాలెంజిని స్వీకరించే ధైర్యం చేస్తారా?

చివరికేమిటి

హీరో పాత్రది పూర్తిగా జైల్లోంచి బయటపడాలన్న స్వార్ధమే అనలేం. ఒక విధంగా బహ్రామ్ కి తోడ్పడాలనే. బంధువైన బహ్రామ్ కూతురి కట్నం డబ్బులు తను వాడేశాడు. అది తిరిగిచ్చేసి పెళ్ళి జరిగేలా చూసే నైతిక బాధ్యత ఫీలవ్వకుండా లేడు. అందుకు వేసింది మాత్రం తప్పటడుగులే. అయితే ఒక లాజిక్ ఈ కథ మొత్తాన్నీ సిల్లీ అన్పించేలా చేసేస్తుంది. హీరో ఆ బంగారాన్ని అమ్మాలని చూసి, సరిపోక రెండో ఆలోచనగా పోలీసులకి అప్పగించేస్తే ఈ గొడవంతా వుండదు. న్యాయ మార్గంలో అన్ని రివార్డులూ, విరాళాలూ పొందేవాడు. కథని  ఇలా చేస్తే కథ వుండదని దర్శకుడు ఇలా లాజిక్ ని బలి పెట్టుండొచ్చు.

    ఈ కథలో విడివిడిగా ప్రధాన పాత్రప్రత్యర్ధి పాత్రలనే సూత్రాన్ని కూడా పక్కన పెట్టాడు దర్శకుడు. ఈ కథ రహీమ్ కీ, బహ్రామ్ కీ మధ్య నడిచే కథ. అయినా బహ్రామ్ ప్రత్యర్థి కాడు. అతను మంచి వాడే. రహీమే హీరోనై పోవాలనుకుని విలనై పోయాడు. తన చర్యలతో తానే హీరో, తానే విలనైనప్పుడు ఇంకా వేరే విలనెందుకు కథకి? మన శత్రువులం మనమే, బయట శత్రువులెవరూ లేరు. ఇది లోపలి మనిషి కథ. మన లోపలి మనిషితో మనం జాగ్రత్తగా వుండకపోతే మంగళగిరి జాతరవుతుంది బతుకు.

    దర్శకుడు అస్ఘర్ ఫర్హదీ 2011 లో ఏ సపరేషన్’, 2016 లో ది సేల్స్ మాన్ తీసి రెండిటికీ ఆస్కార్ అవార్డులు పొందాడు. ఇప్పుడు ఏ హీరో వివిధ  అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో 24 ఉత్తమ చలన చిత్ర అవార్డులు పొందింది. అంతేగాక  2021 ఆస్కార్ అవార్డులకి ఇరాన్ నుంచి ఎంట్రీగా వెళ్ళింది...

—సికిందర్