రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Sunday, February 21, 2021

1015 : స్క్రీన్ ప్లే సంగతులు

 



          Q : ఎంతసేపూ  కథలేనా, గాథలు కూడా అద్భుతంగా చెప్పొచ్చు అన్న విషయం మీరు రాస్తున్న దేర్ విల్ బి బ్లడ్ అనే సినిమా విశ్లేషణ ద్వారా అర్థం అయ్యింది. కానీ మన తెలుగు సినిమాలకు గాథలు పనికి రావు అని మీరు ఎప్పుడో చెప్పారు. కానీ ఇక్కడ బాధాకరమైన విషయం ఏమిటంటే, మన తెలుగులో వచ్చే సినిమాలన్నీ గాథలే. ఇప్పుడు కొత్తగా మీరు విశ్లేషిస్తున్న దేర్ విల్ బి బ్లడ్ సినిమా లాగా తెలుగుకి గాథలు చేయొచ్చా? ఒకవేళ చేస్తే పెద్ద హీరోల కోసం చేసుకోవచ్చా? లేదా మీడియం లేదా చిన్న హీరోల కోసం కూడా చేసుకోవచ్చా? మన దగ్గర వచ్చే సినిమాలన్నీ గాథలే కానీ ఇలా కళాత్మకంగా, రస సిద్ధితో ఎమోషన్స్ హైలైట్ చేస్తూ, మీరే చెప్పినట్టు భారీ యాక్షన్ కి సింపుల్ స్టోరీ లాగా తెలుగు కోసం గాథలు చేసుకోవచ్చా? కొంచెం వివరించగలరు.

వి. రాజేష్, అసోషియేట్

       A :  ముందుగా, తెలుగులో వచ్చేవన్నీ గాథలు కూడా కావు. కథకీ గాథకీ తేడా తెలియక, లేదా ఏం చేస్తున్నారో తెలుసుకోకుండా, కథ అనుకుంటూ తీసేస్తే అవి ఎటూ గాకుండా అవుతున్నాయి. గాథకి ఆలోచింపజేసే విషయం, పాత్ర చిత్రణలు, నటనలు, సంభాషణలు, టెక్నికల్ హంగామా లేని క్వాలిటీ చిత్రీకరణ, ఫిలాసఫీ ఇవీ అవసరం. గాథ తీయాలంటే మూసఫార్ములా ప్రపంచంలోంచి పూర్తిగా వేరే ఉన్నత ప్రపంచంలోకి వెళ్లిపోవాలి. దీనికి స్టార్స్ ఒప్పుకుంటేనే సాధ్యమవుతుంది. మీడియం లేదా చిన్న హీరోల మీద ఉదాత్త గాథలు ప్రేక్షకులు ఒప్పుకుంటారో లేదో తెలియదు. అవి ఆర్ట్ సినిమాలుగా అన్పించవచ్చు.

        'దేర్ విల్ బి బ్లడ్' విడుదలైన సంవత్సరంలోనే కొయెన్ బ్రదర్స్ 'నో కంట్రీ ఫర్ ఓల్డ్ మెన్' యాక్షన్ మూవీ విడుదలైంది. ఇది యాక్షన్ జానర్లో గాథ. 'దేర్ విల్ బి బ్లడ్' పీరియెడ్ గాథ. దీనికంటే కొయెన్ బ్రదర్స్ కి రెండు ఆస్కార్ అవార్డులు ఎక్కువ వచ్చాయి - ఉత్తమ చలన చిత్రం, ఉత్తమ దర్శకత్వం సహా. వాళ్ళు గాథ తో యాక్షన్ తీసినా ఎందుకు గొప్ప సినిమాలవుతున్నాయో ఆలోచించాలి. ఇద్దరు స్టార్స్ లో ఒక స్టార్ గాథలో చనిపోవడానికి ఒప్పుకుంటాడా, ఒప్పుకోకపోతే ఇద్దరూ కలిసి విలన్ ని చంపెయ్యాలా అని రాజీపడి పోతే, 'నో కంట్రీ ఫర్ ఓల్డ్ మెన్' లాంటిది తెలుగులో రాదు. గాథ అంటే ఫార్ములా కాదు, ఫిలాసఫీ. 'నో కంట్రీ ఫర్ ఓల్డ్ మెన్' సెకండాఫ్ లో ఉన్నట్టుండి విలనే హీరోని చంపేస్తాడు. షాక్ తిని గగ్గోలు పెట్టే  ప్రేక్షకులకి, ఇది హీరో కథ కాదనీ, మొదట్లో కన్పించే ఇంకో హీరో పాయింటాఫ్ వ్యూలో గాథ అని చివర్లో చెప్పి, ఆడియెన్స్ ని సంతృప్తి పరుస్తారు కోయెన్ బ్రదర్స్.
      
     Q : మీరు మాకు ఇస్తున్న విలువైన సమాచారాని కి చాలా చాలా థాంక్స్. అయితే నాదొక్క చిన్న సందేహం. రామ్ చరణ్ నటించిన 'ఆరెంజ్'  సినిమా కి స్టోరీలైన్ చాలా బలంగా వున్నా సినిమా మాత్రం సరిగ్గా ఆడలేదు. దానికి సరైన అపోజిట్ ఫోర్సు లేకపోవడమో, లేక స్క్రీన్ ప్లే సరిగ్గా లేకపోవడమో కారణమని నేను భావిస్తున్నాను. అయితే, అంత మంచి స్టోరీ లైన్ ని ఎలా డెవలప్ చేసుకుని వుంటే సినిమా నిలబడేది, స్క్రీన్ ప్లే సంగతులు సహా తెలియజేయండి.

దమ్ము రాజేష్, అసిస్టెంట్

     A : రామ్ చరణ్ పాత్ర ప్రాబ్లమేమిటంటే, తను ఎవర్నయినా ప్రేమిస్తే కొంత కాలానికి ఆ ప్రేమ డైల్యూట్ అయిపోవడం. ఇంతకంటే దీనికి మనుగడ లేదని వాదించడం. ఇలా ఎంతో మందిని ప్రేమించి వదిలేశాడు. అందుకని హీరోయిన్ ని కూడా ఇలాగే ప్రేమించమంటాడు. సమస్య ఎక్కడొచ్చిందంటే, ప్రేమ డైల్యూట్ అవడానికి అసలు కారమేమిటో కనుక్కోవడానికి ఇద్దరూ ప్రయత్నించక పోవడం దగ్గర వచ్చింది. పరిష్కారం చూడక పోట్లాటలతోనే సరిపెట్టుకున్నారు. ఇద్దరూ పాసివ్ క్యారక్టర్లే. రామ్ చరణ్ పాత్రకి అసలు తనేం కోరుకుంటున్నాడో కన్ఫ్యూజన్ కూడా ఎక్కువే. దీనికి కారణమంతా కథకుడే.

        ప్రేమ ఎందుకు డైల్యూట్ అవుతోంది? డైల్యూట్ అవుతున్నది ప్రేమేనా, ఇంకేదైనానా? అసలు ప్రేమంటే ఏమిటి? అది వుందా అసలు? సంతానంతో కన్నవాళ్ల ప్రేమ తప్ప ఇంకో  ప్రేమనేది లేదు, అవసరాలే వున్నాయి. ఇది సృష్టి చేసిన ఏర్పాటు. Love is only a dirty trick played on us to achieve continuation of  the species- అని సోమర్సెట్ మామ్ కూడా ఎప్పుడో అన్నాడు.  సృష్టిని కొనసాగించడానికి పునరుత్పత్తి కోసం కావచ్చు, లేదా ఇంకేవైనా అవసరాలు తీర్చుకోవడం కోసం కావచ్చు- ఇలా కలిసి దీన్ని ప్రేమనుకోవడం దగ్గరే వస్తోంది సమస్య. స్త్రీపురుషుల మద్య అవసరాలే వున్నాయి తప్ప, ప్రేమనేది లేదు. ప్రేమ వీళ్ళు కనే సంతానంతో పుడుతుంది. సంతానంతో కన్నవాళ్ల ప్రేమ తప్ప ఇంకో ప్రేమనేది లేదు.

        సమస్య ప్రేమతో రాదు, ఇద్దరి మద్య వుండేది ప్రేమ కాదు కాబట్టి. ఇద్దర్నీ కలిపింది అవసరాలు కాబట్టి, ఆ అవసరాలతో సమస్య వచ్చినప్పుడు మొదలవుతాయి సమస్యలు. అవసరాల కోసం కలిసి, వాటి కారణంగానే విడిపోయాక, మరో చోట వెతుక్కునేది ప్రేమ కాదు, మళ్ళీ అవసరాలే. కానీ ఏ అవసరాలు తీర్చుకుందామని, ఎదుటి వ్యక్తిలో ఏది ఆకర్షించి, ఏం బాసలు చేసి కలిశారో, ఆ మూలకారణానికి వాళ్ళు కట్టుబడి వుండకపోతే, ఇంకెక్కడా కట్టుబడి వుండలేరు. గాలి వాటం జీవితమైపోతుంది. ఇదే రామ్ చరణ్ పాత్ర  జీవితం, సమస్య.

        మూలకారణం పట్ల విధేయత, దాన్ని వృద్ధి చేసుకుని పరస్పరం ఫలాలు పొందే సహిష్ణుత, సంబంధాన్ని శాశ్వతం చేస్తుంది. అప్పుడా సంబంధానికి కావాలనుకుంటే ప్రేమ, ప్రేమ కావ్యం, ప్రేమ పురాణం, లెజండరీ లవ్, బాక్సాఫీసు లవ్, ఇంకేదైనా బంపర్ పేరు పెట్టుకుని తృప్తి పడితే పడచ్చు. మూలకారణం పట్ల జీవితకాల విధేయత లేని సంబంధానికి ప్రేమనుకోవడం పెద్ద జోక్ అవుతుంది.

        ఆరెంజ్ స్క్రీన్ ప్లే సంగతులు ఇప్పుడవసరం లేదు. అప్పట్లో రివ్యూ రాశాం. పాత్ర కరెక్ట్ గా వుంటే స్క్రీన్ ప్లే కరెక్ట్ గా వుంటుంది. స్క్రీన్ ప్లేకి రచయిత కథకుడో, దర్శకుడో కాదు - పాత్రే. స్క్రీన్ ప్లే అంటే కాన్షస్ మైండ్ + సబ్ కాన్షస్ మైండ్ + ఇగో. ఈ మూడిటి  ధర్మాలతో పాత్ర వుంటే స్క్రీన్ ప్లే సరీగ్గా వుంటుంది. మేకర్ గా సినిమాల్నిఈ దృష్టితో చూస్తే తప్పొప్పులు తెలిసి పోతాయి. ప్రతీ దానికీ స్క్రీన్ ప్లే సంగతుల పాఠాలు అవసరం లేదు.

 సికిందర్