రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Wednesday, June 3, 2020

950 : రివ్యూ!


      నూట యాభై ఏళ్ల క్రితం కేరళలోని పాలక్కడ్ లో ఒక అమ్మవారి జాతరలో భాగంగా కుమ్మట్టి కాళి అనే పౌరాణిక ప్రదర్శన పుట్టింది. పాలక్కడ్ తో బాటు, త్రిసూర్, మలబార్ లలో ఓనం పండగప్పుడు ఈ జాతర జరుగుతుంది. ఈ పౌరాణికం శివుడికీ అర్జునుడికీ మధ్య సన్నివేశం... మారువేషంలో  వున్నశివుడి పాశుపతాస్త్రం కోసం అర్జునుడి పోరాటం... అది మనస్సు నుంచి, నేత్రాల నుంచి, వాక్కు నుంచీ వెలువడే అత్యంత విధ్వంసకర అస్త్రం. దాన్ని సమవుజ్జీ కాని శత్రువుపై ప్రయోగించరాదు, అలాగే యోగ్యులు కాని యోధులు వాడరాదు. ‘అయ్యప్పనుం కోషియం’ ప్రారంభ దృశ్యంగా ఈ ప్రదర్శన జరుగుతోంది...పాశుపతాస్త్రం అర్జునుడి వశమైంది శివుడి ఔదార్యంతో చివరికి. 

       
గో కూడా భయంకర పాశుపతాస్త్రం. ఇగోలతో ఇద్దరు వ్యక్తుల మధ్య వైషమ్యాలు ఎవరికీ గెలుపు నివ్వవు, ఓటమినీ ఇవ్వవు. నిరంతర విధ్వంసంతో ఇద్దరూ అంతమైపోవడమే. అతను బలమైన రాజకీయ సంబంధాలున్న మాజీ ఆర్మీ హవల్దార్. ఇతను సామాన్య పోలీస్ ఎస్సై. సామాన్యుడితో ఇగో ఏమిటని బలవంతుండు అనుకోవడం లేదు. బలవంతుడితో ఇగో ఎందుకని సామాన్యుడూ అనుకోవడం లేదు. ఇద్దరూ బాహాబాహీకి దిగారు, ఒక ముగింపులేని పోరాటానికి తెరలేపారు. 



        అతను ఊటీలో సినిమా షూటింగు జరుపుకుంటున్న మిత్రుడైన ఒక దర్శకుడు అడిగితే, పూటుగా తాగి, పెట్టె నిండా మద్యం బాటిళ్ళు కార్లో పెట్టుకుని బయల్దేరాడు. మద్యనిషేధం అమల్లో వున్న అట్టప్పడి రిజర్వ్ ఫారెస్ట్ ఏరియాలో పోలీస్- ఎక్సైజ్ జాయింట్ ఆపరేషన్లో దొరికిపోయాడు. దొరికిపోవడమే గాక నానా గలభా చేసి ఎక్సైజ్ అధికారిని కొట్టాడు. అతణ్ణి అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కి తరలించాడు ఎస్సై అయ్యప్పన్ నాయర్. పేరడిగితే కోషీ జాన్ అని చెప్పాడు. ఫోన్ చెక్ చేస్తే సీఎం పినరయి విజయన్, మాజీ సీఎం ఊమెన్ చాండీలతోబాటు, ఇంకొందరు నాయకులు, జర్నలిస్టుల ఫోన్ నెంబర్లూ వున్నాయి. కంగారుపడి పై అధికారికి ఫోన్ చేసి చెప్పాడు అయ్యప్పన్. అతణ్ణి డీసెంట్ గా ట్రీట్ చేసి, కేసు బుక్ చేసి కోర్టుకి హాజరు పర్చమన్నాడు పై అధికారి. ఇక తన అరెస్టు, కోర్టు, జైలూ తప్పవని గ్రహించిన కోషీ, తెలివిగా నాటకమాడేడు. తనకి మద్యం కావాలనీ, మద్యం లేకపోతే హెల్త్ ప్రాబ్లమనీ చెప్పి నమ్మించి, సీజ్ చేసిన లిక్కర్ లోంచి కొంత పోయించుకుని తాగాడు. ఇదంతా ఫోన్ లో రికార్డు చేశాడు. ఉదయం కోర్టుకీ, అట్నుంచి అటే జైలుకీ వెళ్ళాక, బెయిలు మీద విడుదలై వచ్చి, ఫోన్లో రికార్డు చేసిన వీడియోని ఛానెల్లో బట్టబయలు చేశాడు. 

          దీంతో మద్యం కేసులో అరెస్టయిన నిందితుడికి మద్యం పోసిన ఇంకో నిందితుడిగా మారి, సస్పెండ్ అయిపోయాడు ఎస్సై అయ్యప్పన్ నాయర్, లేడీ కానిస్టేబుల్ సహా. ఇక కోషీ - అయ్యప్పన్ ల రగడ, రచ్చ, కచ్చ మొదలైపోయాయి. తనని సస్పెండ్ చేయించినందుకు కోషీ ముందే కోషీ అనుచరుణ్ణి విపరీతంగా కొట్టాడు అయ్యప్పన్. దీంతో కోషీ తండ్రి కురియన్ జాన్ కోషీకి అంగరక్షకులుగా కొందరు వృత్తి నేరస్థుల్ని పంపాడు. కురియన్ జాన్ కూడా బలమైన రాజకీయ సంబంధాలున్న మాజీ ఆర్మీ హవల్దార్. అతను విపరీతంగా ఇగోకి పోయి అయ్యప్పన్ భార్య అరెస్టుకి పావులు కదిపాడు. అయ్యప్పన్ ఆదివాసీ మావోయిస్టు కార్యకర్త అయిన కణ్ణమ్మని పెళ్లి చేసుకున్నాడు. అయ్యప్పన్ అంతు చూడాలని కోషీ అట్టప్పడిలోనే లాడ్జిలో మకాం వేశాడు. అయ్యప్పన్ జేసీబీ పెట్టి కోషి కార్యాలయాన్ని కూల్చేశాడు. కోషి తను కూడా జేసీబీ పెట్టి అయ్యప్పన్ ఇంటిని కూల్చేశాడు. కోషీ ఇల్లు కూల్చేస్తే కోషీ కారుని పేల్చేశాడు అయ్యప్పన్. ఇలా దాడికి ప్రతి దాడి చేసుకుంటూ పోలీసుల్ని పరుగులు పెట్టించారు. తన వ్యవహారంలో తండ్రి అనవసరంగా జోక్యం చేసుకుని ఇబ్బందిలో పడేస్తున్నాడని, అతణ్ణి అరెస్ట్ చేయించేశాడు కోషీ. 

         ఇలా మరెన్నో సంఘటనలు జరిగి, ఇక ఫైనల్ గా చావో రేవో  తేల్చుకోవా లనుకున్నారు.  సరిహద్దు దాటి తమిళనాడులో కొట్టుకునే కార్యక్రమం పెట్టుకుంటే, కేరళ పోలీసులు అడ్డు రారనుకున్నారు. అలా తమిళనాడు మార్కెట్ లో కొట్టుకోసాగారు. తమిళ పోలీసులతోబాటు కేరళ పోలీసులు కూడా వచ్చేసి  అయ్యప్పన్ కోషీని చంపకుండా ఆపబోయారు. అయ్యప్పన్ ఆగేటట్టు లేడు. అయ్యప్పన్ మీద సస్పెన్షన్ ఎత్తేశారని సీఐ చెప్పడంతో, అయ్యప్పన్ శాంతించి కోషీని వదిలేశాడు. ఇక కోషీ సొంతూరు కట్టపణకే ట్రాన్స్ ఫర్ చేయించుకుని, కొత్త ఎస్సైగా కోషీని పరిచయం చేసుకుని, కరచాలనం చేశాడు అయ్యప్పన్.

ఎలావుంది కథ
      కోషీ పాత్ర పోషించిన నటుడు, నిర్మాత, దర్శకుడు, పంపిణీ దారుడు, గాయకుడూ అయిన - నూరు సినిమాలూ నటించిన- పృథ్వీరాజ్ సుకుమారన్ కి, అయ్యప్పన్ పాత్ర నటించిన శతాధిక చిత్రాల నటుడు బిజూ మీనన్ కీ మలయాళంలో విపరీతమైన ఫాలోయింగ్ వుంది. ఏ ఒక్కర్ని తక్కువ చేసి చూపించినా ఆ అభిమానులతో సమస్య లొస్తాయి. అందుకని ఎవరి గెలుపూ, ఎవరి ఓటమీ లేని, ఇదమిత్థమైన ఒక ముగింపూ లేని కథగా ఇది తెరకెక్కింది. దీంతో నటులుగా వాళ్ళ ఇమేజులకి న్యాయం జరిగిందేమో గానీ, కథకి న్యాయం జరగలేదు. కథ ప్రకారం వాళ్ళ ఇగోలతో వాళ్ళే తేల్చుకోకుండా, మధ్యలో పై అధికారుల జోక్యంతో శాంతించడం పాత్రౌచిత్యాల్ని దెబ్బ తీసింది. అసలు వీళ్ళిద్దరి మధ్య గొడవల్ని పై అధికారులూ నాయకులూ కల్పించుకుని ఎప్పుడో ఆపి వుండొచ్చు. సహజంగా ఇదే జరుగుతుంది. మొదట్నుంచీ జరిగేవన్నీ జరగనిచ్చి, చిట్టచివరికి మధ్యలో దూరి కథని ఆపారు అధికారులు. కథ ఆగింది కానీ ముగియలేదు. పాపులర్ నటుల ఇమేజుల్ని కాపాడేందుకు కథతో ఇలా చేయాల్సి వచ్చింది దర్శకుడికి. 


        దీన్ని బాలకృష్ణ - రానా, లేదా రవితేజ - రానా లతో తెలుగులో రీమేక్ గురించి వార్తలొస్తున్నాయి. సీనియర్ బాలకృష్ణకీ, జూనియర్ అయిన రానాకీ, కోషీ - బిజూ మీనన్ లకి లాగా సమాన ఇమేజులు, ఫ్యాన్ బేస్ లు లేవు. అలాగే సీనియర్ రవితేజకీ, జూనియర్ అయిన రానాకీ సమాన ఇమేజులు, ఫ్యాన్ బేస్ లూ లేవు. ఈ కథని వీళ్ళ కాంబినేషన్స్ లో తీస్తే ముగింపుతో ఇబ్బంది పడాల్సిన అవసరముండదు. మలయాళంలో లాగా కాకుండా సీనియర్ కే విజయాన్ని చేకూర్చి కథ ముగించెయ్యొచ్చు. కాకుండా మలయాళంలో లాగా అక్కడి పరిస్థితుల్ని బట్టి కథతో రాజీ పడినట్టు, ఎవరి విజయమూ ఎవరి ఓటమీ లేకుండా సీనియర్ జూనియర్లని కలిపి తీస్తే ఎబ్బెట్టుగా వుండొచ్చు. మలయాళంలో అది ఇమేజులు నిర్ణయించిన కథ. ఇలా ఇమేజులు నిర్ణయించిన కథే చేయాలనుకుంటే బాలకృష్ణ - రవితేజ సీనియర్ లిద్దరి కాంబినేషన్ని ఆలోచించాలి.   
     
        టిమ్ అలెన్ నటించిన ‘జో సమ్ బడీ’ (2001) లో బలహీనుడైన టిమ్ ని, బలవంతుడైన పాట్రిక్ వర్బర్టర్, కూతురి ముందే కొడతాడు. దీంతో చాలా అవమానపడి, ఇగో పెంచుకుని, బలవంతుడైన పాట్రిక్ ని, తన కూతురి ముందే ఎలాగైనా కొట్టాలని కష్టపడి బలవంతుడుగా మారతాడు టిమ్. ఇక పాట్రిక్ ని పబ్లిక్ గా కొడతానని ప్రకటించి, ప్రేక్షకుల మధ్య బరిలోకి దూకుతాడు. కానీ పాట్రిక్ ని కొట్ట లేకపోతాడు. కారణం? కొడితే తన ఇగో మాత్రమే సంతృప్తి పడుతుంది. కానీ ఇప్పుడు కొట్టగల్గీ తనని కొట్టిన పాట్రిక్ ని కొట్టకుండా క్షమించేస్తే, మనిషిగా తను ఇంకో మెట్టు పైనుంటాడు. తన ఇగో మెచ్యూర్డ్ ఇగోగా ఎదుగుతుంది... ఇగోని మెచ్యూర్డ్ ఇగోగా మార్చి చూపేదే కదా మంచి కథ. ఈ నిర్ణయంతో ఈ కథ ముగింపులో టిమ్ అందరి దృష్టిలో ఉన్నతుడిగా ప్రకాశిస్తాడు. 

        కోషీ, అయ్యప్పన్ ల సమస్య సమాన ఇగోలు. ఎవరూ తగ్గి ఒకర్ని క్షమించేసి, కథ ముగించేసే పరిస్థితి లేదు. నటుల ఇమేజుల సమస్య వుంది. లేదా ఇద్దరూ గెలవలేమని కామన్ సెన్సు తో సంఘర్షణని విరమించాలంటే కూడా అందుకూ సమాన ఇగోలు ఒప్పుకోవు. పాశుపతాస్త్ర మన్నాక వినాశమే తప్ప శాంతి, సంధి వుండవు. అంటే రణంలో ఇద్దరూ మరణించాలి. ఇందుకూ ఇమేజులు ఒప్పుకోవు. మరెలా అంటే, ఇంతే. సమవుజ్జీల కథని ఎక్కడో ఒక చోట ఆపెయ్యాలి, ముగించడం సాధ్యం కాదు. ఇలా ఇది ఆలోచించడానికి ఒప్పుకోని ఎమోషనల్ ప్రేక్షకుల వల్ల హిట్టయ్యిందనుకోవాలి.

ఎవరెలా చేశారు
      ఈ సినిమాకి ఎవరు హీరో, ఎవరు విలన్ అంటే, ఇద్దరూ హీరోలే, ఇద్దరూ విలన్లే. ఒకరు హీరోగా, ఒకరు విలన్ గా లేరు. ఇద్దరూ ఇగో అనే ఇన్ స్టింక్ట్ కి రెండు ముఖాలే. ఇద్దరూ ఇక్కడ ఇగోలతో బ్యాడ్ పనులే చేస్తున్నారు కాబట్టి ఇద్దరూ విలన్లే. యాంటీ క్యారక్టర్లే. అయితే ఇగోని ప్లే చేయడానికి కోషీకున్నంత క్యారక్టర్ బేస్ అయ్యప్పన్ కి లేదు. కోషీ పాత్రలో సుకుమారన్ చాలా కూల్ గా, సెటిల్డ్ గా వుంటాడు. మనసులో ఏమాలోచిస్తున్నాడో అంతుపట్టకుండా వుంటాడు. ఆలోచనలు రేకెత్తించే ముఖభావాలతో, శరీర భాషతో ఇంప్రెస్ చేస్తాడు. తను కేసులో ఇరుక్కుంటున్నానని గ్రహించి, మాయోపాయంగా అయ్యప్పన్ చేతే మద్యం పోయించుకుని తాగి, అతణ్ణి ఇరికించే ఎత్తుగడతో సుకుమారన్ కోషీ పాత్ర ఇగోకి అర్ధముంది. అది ఆ పాత్ర అవసరం కూడా. పోలీసు అయివుండీ కోషి ఎత్తుగడకి పడిపోయిన అయ్యప్పన్ తన ఫూలిష్ నెస్ కి సిగ్గుపడకుండా, కోషీ మీద పగ పెంచుకునే ఇగోకి మాత్రం జస్టిఫికేషన్ లేదు. అది స్వయంకృతాపరాధం. తను చేసుకున్న కర్మ. అనుభవించాల్సిందే. సవరించుకోవాల్సిన తన అసమర్ధతని అలాగే వదిలేసి, పగతో రగిలిపోవడం పాత్ర డొల్ల తనాన్నిపట్టిస్తుంది. 

          ఇద్దరి మధ్య ఒక డీల్ జరిగి, ఆ డీల్ లో కోషీ మోసం చేస్తే అయ్యప్పన్ కి అన్యాయం జరిగిందనుకోవచ్చు. బాధితుడని సానుభూతి కలగవచ్చు. అప్పుడతడి ఇగోకీ పగకీ అర్ధముండొచ్చు. కోషీ అడిగిందే తడవుగా నట్టనడి పోలీస్ స్టేషన్ లో, సీజ్ చేసిన లిక్కర్నే సీలు విప్పి కోషికి పోస్తూ, అతడి కెమెరా రికార్డింగు కే దొరికిపోతే ఇంకెక్కడి బాధితుడు, ఇంకెక్కడి సానుభూతి. కనీసం అతణ్ణి కోర్టుకి రిమాండ్ చేస్తున్నప్పుడైనా, ఫోన్ ని సీజ్ చేసి రికార్డులో చూపించాలి కదా? ఇవేమీ చేయకుండా చేతులారా ఇరుక్కుని కోషీ మీద చెలరేగి పోవడంలో అర్ధం లేదు. ఇలా చేసి తన మీద కోషీ ఎప్పుడో గెలిచేశాడు. తను చేస్తున్నది న్యాయమైన కోషీ టాలెంటుతో కూడిన అతడి గెలుపుని, టాలెంటు లేని తను అక్రమంగా లాక్కోవాలనుకోవడమే. కోషీ కున్నంత క్యారక్టర్ బేస్ తనకి లేకపోవడం ఇందుకే. 

       అయితే కోషీ కూడా ‘నువ్వు మందు పోయడం నీ తెలివితక్కువతనం, నేను నమ్మక ద్రోహమే చేస్తానని తెలుసుకోకపోవడం నీ మూర్ఖత్వం.  నీ తెలివి తక్కువతనానికీ, మూర్ఖత్వానికీ నన్ను బాధ్యుడ్ని చెయ్యకు. నిన్ను కరెక్ట్ చేసుకో, వెళ్ళు’ అని అనాలి. కానీ ఈ పాయింటు గ్రహించి అనడు. ఇక చివరికి అయ్యప్పన్ సస్పెన్షన్ ఎత్తేశారనగానే కోషీతో పగా ప్రతీకారం మర్చిపోయి ఆనందభరితు డవడం పాత్రని మరీ దిగజార్చింది. తనకి ఉద్యోగం తిరిగొస్తే, ఉద్యోగం పోగొట్టిన కోషీతో ఇగో వుండదా? మరి సస్పెన్షన్ ఎత్తి వేయించుకునే ప్రయత్నాలేవో చేసుకోక ఎందుకు కోషీ వెంట పడ్డాడు? 


        ఈ పాత్రలో బిజూ మీనన్ ది ఆవేశపూరిత నటన. పాత్రచిత్రణ లోపాలతో నిమిత్తం లేకుండా నటనలకి ఆవార్డులూ వచ్చేస్తాయి. లోపాలతో బిజూ మీనన్, బలమైన మోటివ్ తో సుకుమారన్ ల మధ్య ప్రత్యర్ధులుగా కెమిస్ట్రీ మాత్రం చెప్పుకోదగ్గదే. వీళ్ళిద్దరి భార్యల పాత్రల్లో నటించిన అన్న రాజన్, గౌరీ నందాల పాత్రలు బలహీనమైనవి. సుకుమారన్ అన్న రాజన్ ని కొట్టే సీను అభ్యంతరకరంగా వుంటుంది. పలుకుబడిగల కుటుంబంలో భార్య పరిస్థితి ఇలా వుంటే, సామాన్య కుటుంబంలో ఆదివాసీ భార్యగా వామ పక్ష మూలాలుండీ గౌరీదీ ప్రాబల్యం లేని పాత్ర. 
          

         ఇక లేడీ కానిస్టేబుల్ పాత్ర. కోషీకి మద్యం పోయడంలో సహకరించి సస్పెండ్ అయిన లేడీ కానిస్టేబుల్ కూడా కోషీని ఏహ్యభావంతో నీచంగా చూడడం దేనికి? అతనేం తప్పు చేశాడు. అతడికి కులుకుతూ ఆనందంగా, చట్టవ్యతిరేకంగా మందు పోసి, నీచానికి పాల్పడింది తనే కదా?  సుకుమారన్ తండ్రిగా అతిక్రియాశీలత్వంతో సమస్యని జటిలం చేసే పాత్రలో సీనియర్ నటుడు రంజిత్ కన్పిస్తాడు. ఇంకా పోలీసు పాత్రలూ, అనుచరుల పాత్రలూ చాలా వున్నాయి.   

చివరికేమిటి
     కృత్రిమత్వం, ఫార్ములా, మూస అనేవాటికి దూరంగా కేరళ గ్రామీణ నేటివిటీ కోసం కృషి చేశాడు దర్శకుడు సాచీ. ఈ హాట్ కథకి కూల్ కలర్స్ వాడి నేత్రానందం కల్గించాడు. పాటలు లేవు. నేపథ్య సంగీతం మాత్రం ట్రైబల్ ట్యూన్స్ కుదరక కుదేలయింది. మాటలు సింథటిక్, డిజైనర్, మూస, పంచ్, టెంప్లెట్ ధోరణుల నుంచి రిలీఫ్ గా, మనుషులు మాట్లాడుకున్నట్టు వున్నాయి. ఫైట్లు మనుషులు పోరాడుకున్నట్టున్నాయి. దాదాపు మూడు గంటల నిడివే ఈ స్వల్ప కథకి, అత్యల్ప కాన్ఫ్లిక్ట్ కీ బాగా ఎక్కువ. ఒక దశ కొచ్చేటప్పటికి చిన్న విషయానికి ఇంత సాగదీయడం అనవసర మన్పిస్తుంది. నాయకులూ ఉన్నతాధికార్లూ ఇద్దర్నీ కూర్చోబెట్టి క్లాసు తీసుకుంటే, ఎప్పుడో ముగిసిపోయే గొడవ. కథకి పాశుపతాస్త్రంతో పోలిక వర్కౌట్ కాని పరిస్థితి ఇంకో పక్క. ఇంతకి ముందు చెప్పుకున్నట్టు ఎమోషనల్ ప్రేక్షకులతో బాటు, ఇద్దరు నటుల ఫ్యాన్స్ తో దీనికింత టాక్ వచ్చి వుంటుంది.  


సికిందర్

        సైడ్ లైట్స్ : 1939 లో ‘పాశుపతాస్త్రం’ అనే సినిమా తీశారు. దర్శకుడు కచ్చర్ల కోట రంగారావు. షూటింగ్ విశాఖ పట్టణం లోని ఆంద్ర సినీ టోన్ స్టూడియోలో జరిగింది. షూటింగ్ చివరి దశలో వుంది. స్టూడియో పార్టనర్స్ కి ఏవో ఇగో లొచ్చి ఒక పార్టనర్ షూటింగు జరుగుతూండగానే తన వాటా కింద ఇచ్చిన లైట్లూ ఇతర పరికరాలూ లాక్కెళ్ళి పోయాడు. స్టూడియో మూతబడింది. సినిమా ఎలాగో పూర్తయ్యింది. కానీ ‘పాశుపతాస్త్రం’ షూటింగు జరుగుతూండగానే ఇగోలనే పాశుపతాస్త్రాలు పైకి తీసి ‘కేరళ కుమ్మట్టి కాళి’ ఆడిన పార్టనర్స్ ఏం సాధించారు. ‘పాశుపతాస్త్రం’ సినిమాకేం కాలేదు, స్టూడియోనే ఇవ్వాళ వైజాగ్ కి సినిమా లైట్ హౌస్ కాకుండా, ఎవరికీ గుర్తుకూడా లేకుండా పోయింది.

       
స్ట్రక్చరాస్యులకో  చిన్న పరీక్ష : పైన మూడో పేరా నుంచీ 5 వ పేరా వరకూ ఇచ్చిన కథా సంగ్రహంలో ప్లాట్ పాయింట్ వన్, ప్లాట్ పాయింట్ టూ ఎక్కడున్నాయో గుర్తించగలరా? గుర్తిస్తే మాకు రాసి పంపి మీ స్ట్రక్చరాస్యతని నిరూపించుకోండి.