రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

30, ఏప్రిల్ 2017, ఆదివారం


     డార్క్  మూవీస్ లో ప్రధానంగా నాల్గు  రకాల పాత్రలుంటాయి : పోలీస్ హీరో - లేదా నిందితుడైన హీరో, హీరోయిన్, వాంప్, విలన్ అనేవి. ముందుగా పోలీస్ హీరో  పాత్రని పరిశీలిస్తే, ఒకప్పుడు ఫిలిం నోయర్ సినిమాల్లో హీరో వచ్చేసి ప్రైవేట్ డిటెక్టివ్ గా వుండేవాడు. నియో నోయర్ ప్రారంభమయ్యాక ప్రైవేట్ డిటెక్టివ్ స్థానంలోకి పోలీసు అధికారి వచ్చాడు. తెలుగు సినిమాల్లో కొమ్మూరి డిటెక్టివ్ పాత్ర యుగంధర్ గా నాగభూషణం, అసిస్టెంట్ రాజుగా కృష్ణ లతో 1971లో  ‘పట్టుకుంటే లక్ష’ తీస్తే, ఆతర్వాత 1986 లో  వేరే డిటెక్టివ్ పాత్రలతో చిరంజీవితో జంధ్యాల ‘చంటబ్బాయ్’, 1992 లో  మోహన్ బాబు తో వంశీ ‘డిటెక్టివ్ నారద’ తీశారు. ఈ రెండూ హస్యపాత్రలే. హిందీలో రాజ్ కపూర్- రాజేంద్ర కుమార్ లతో తీసిన ‘దో జాసూస్’ (1975) లో  జంట డిటెక్టివ్ ల పాత్రలూ హస్యపాత్రలే. సీరియస్ డిటెక్టివ్  పాత్ర హిందీలో కూడా అరుదే. కానీ సత్యజిత్ రే బెంగాలీలో జనజీవనస్రవంతిలో భాగం చేసి పెట్టారు తను తీసిన డిటెక్టివ్ సినిమాల్ని. డిటెక్టివ్ ఫెలూదా పాత్ర సృష్టికర్తా- సినిమా దర్శకుడూ  తనే కావడం చేత డిటెక్టివ్ ఫెలూదా పాత్రతో అన్నేసి సినిమాలు తీయడం ఆయనకే సాధ్యమైంది. ఫెలూదా పాత్రతో ఆయన డిటెక్టివ్ సాహిత్యం రాసి ఇంటింటికీ దాన్ని అభిమాన పాత్ర చేసిన ఫలితంగానే సినిమాలతో ఆయనకిది సాధ్యపడింది. ఇప్పటికీ ఈ పాత్రతో టీవీ సిరీస్ తీస్తున్నారు.

         కానీ  డిటెక్టివ్ పాత్రలకి తెలుగులో ఎప్పుడూ ఆదరణ లేదు. అది సినిమాటిక్ పాత్ర కాలేకపోయింది. కారణం, డిటెక్టివ్ సాహిత్యం ఇతర సాహిత్య ప్రక్రియల్లాగా ప్రధాన స్రవంతిలోకి చేరకపోవడం. ఓ డిటెక్టివ్ నవలతో సినిమా తీస్తే, వాటి కుండే ఓ వర్గం  సాహిత్యాలాభిషులు వరకూ మాత్రమే ఆ సినిమా చూస్తే  ఏం లాభం? అమెరికాలో డిటెక్టివ్ సాహిత్యానికి అనంతమైన పాఠకలోకం వుంది. అందుకని హాలీవుడ్ లో నోయర్ సినిమాలు విరివిగా వచ్చాయి. డిటెక్టివ్ పాత్ర అక్కడ సినిమాటిక్ అయింది. తెలుగులో డిటెక్టివ్ సాహిత్యమే అంతరిస్తున్నాక మధుబాబు యాక్షన్ హీరో షాడో ప్రవేశించాడు. ఇది వార పత్రికల్లో సీరియల్స్ రూపంలో ఇంటింటికీ తెలిసిన పాత్రే అయ్యింది. అయినా వెండి తెర రూపం ధరించకపోవడానికి కారణం రచయిత మధుబాబు ఒప్పుకోకపోవడమే. ఆ పాత్ర పాఠకుల వూహల్లో వుండిపోవాలేతప్ప, దానికో రూపమివ్వకూడదని ఆయన నిర్ణయించుకున్నారు. ఇది వేరే విషయం, ఇది డార్క్ మూవీ పాత్ర కాదు- యాక్షన్ జానర్ పాత్ర. 

       తెలుగులో డిటెక్టివ్ పాత్ర సినిమా ప్రేక్షకులందరికీ  తెలియకపోయినా,  సీఐడీ పాత్రని గుర్తు పట్టి అందరూ  అభిమానించే వాళ్ళు ఒకప్పుడు. సీఐడీ అంటే పోలీసు విభాగపు ఉద్యోగియే కాబట్టి సినిమాటిక్ గా ఆ పాత్రని స్వీకరించారు ప్రేక్షకులు.  1965 లో  ఈ పాత్రతో ఎన్టీ ఆర్ నటించిన ‘సీఐడీ’ హిట్టయ్యింది. సీఐడీ అంటే క్రైం ఇన్వెస్టిగేషన్ డిపార్ట్ మెంట్ అధికారి అని అర్ధం. కొన్ని కుటుంబ సినిమాల్లో కూడా అప్పుడప్పుడు ఒక సీఐడీ పాత్ర వుండేది. రానురానూ ఈ సీఐడీ పాత్రని చులకనగా చిత్రీకరిస్తూ, హాస్య నటులకి కూడా ఈ పాత్రని అప్పగిస్తూ  తెరమరుగు చేశారు.  సీఐడీ పాత్ర కూడా చనిపోయింది. 

          ఇక ఎస్సై వచ్చాడు. ఈ  ఎస్సై పాత్రకి  నోయర్ సినిమాలో- లేదా డార్క్ మూవీస్ లో  స్వతంత్రంగా ఎలాటి స్థానమూ లేదు, వుండడానికీ  వీల్లేదు. నోయర్ మూవీస్ లో  కథలు  ఓ  దొంగతనం లేదా ఓ మోసం లాంటి చిన్న చిన్న నేరాల చుట్టూ వుండవు. హత్య వంటి పెద్ద నేరాల గురించే వుంటాయి.  యాక్షన్ జానర్ లో ఈ హత్య కేసుల్లో స్వయంగా దర్యాప్తు చేసే ఎస్సై పాత్ర మనకి కన్పిస్తూంటాడు. ఇది లాజిక్ వుండని యాక్షన్ సినిమాలకే  సరిపోతుంది.

          డార్క్ మూవీస్ కి వాస్తవికత కావాలి. పోలీసు వ్యవస్థ, దాని పనితీరు ఎలా వుంటాయో వున్నదున్నట్టూ చూపించాలి, ఎలాటి దాటి వేతలూ పనికిరావు. అంటే హత్య కేసుని  ఎస్సై పాత్ర దర్యాపు చేస్తున్నట్టు చూపించినా,  అతడి  పై అధికారి సర్కిల్ ఇన్స్ పెక్టర్ (సీఐ) పర్యవేక్షణలో చేస్తున్నట్టు చూపించాల్సిందే. హత్య కేసులు సి ఐ పరిధిలో వుంటాయి. ఈయన్నే ఇన్స్ పెక్టర్ అని కూడా అంటారు. అయితే ఇన్స్ పెక్టర్ పాత్రని హీరో కిస్తే పెద్ద వయసు పాత్ర అనే ఫీలింగ్ వస్తుందన్న సంశయంతో  హీరోని యంగ్ ఎస్సైగానే చూపిస్తూ వస్తున్నారు. ఇది డార్క్ మూవీ జానర్ మర్యాదని దెబ్బ తీసేపని. యాక్షన్ మూవీ కైతే తీసుకోవచ్చు.

         16- డి లో నేరుగా  హత్యకేసు దర్యాప్తు చేస్తూ ఇన్స్ పెక్టర్ పాత్రలో సీనియర్ నటుడు రెహమాన్ కన్పిస్తాడు. అలాగే కహానీ -2 లో హత్య కేసుని దర్యాప్తు చేస్తూ సీనియర్ నటుడు ఖరజ్ ముఖర్జీ ఇన్స్ పెక్టర్ గా వుంటాడు, అతడి నేతృత్వంలో యంగ్ నటుడు అర్జున్ రాం పాల్ ఎస్సైగా వుంటాడు. అంటే ఒక సీనియర్ నటుడికి ఇన్స్ పెక్టర్ పాత్రనిచ్చి అతనే హీరోగా  నేరుగా హత్య కేసు దర్యాప్తు చేస్తున్నట్టు చూపించడం ఒక పధ్ధతి; యంగ్ నటుణ్ణి ఎస్సైగా చూపిస్తూ అతను ఇన్స్ పెక్టర్ నేతృత్వంలో కార్య క్షేత్రంలో దూకినట్టు హీరోగా చూపించడం రెండో పధ్ధతి. ఈ రెండూ కాక ఇంకో పద్దతి లేదు. వుంటే అది జానర్ మర్యాద తప్పడమే. 

          జానర్ మర్యాద తప్పితే సినిమా ఎక్కడ తేడా కొడుతోందో ప్రేక్షకులకి మాటల్లో చెప్పగలిగే పాండిత్యం లేకపోయినా, వాళ్ళ అంతరంగానికి తెలుస్తూంటుంది. అంతరంగాన్ని మభ్యపెట్టి ఎవ్వరూ తప్పించుకోలేరు. కాబట్టి జానర్ మర్యాద విషయంలో అడ్డగోలుతనం పనికిరాదు. అది ఒక్కో కోటి రూపాయలని లెక్కెట్టి ఆ అడ్డగోలుతనపు  హోమానికి ప్రీతిపాత్రం చేయడమే. దర్యాప్తు అధికారులుగా అట్టహాసంగా బిల్డప్పు లిస్తూ ఎసిపి, డిసిపి పాత్రల్ని చూపించడం కూడా వాస్తవిక డార్క్ మూవీ జానర్ లక్షణం కానే కాదు. అది లాజిక్ అవరంలేని యాక్షన్ జానర్ లక్షణం. వీడు లాజిక్ వుండని రొడ్డకొట్టుడు యాక్షన్ జానరేదో చూపిస్తున్నాడులే అని అర్ధం జేసుకుని, వెండి తెరమీద సినిమాని దాని ఖర్మానికి వదిలేసి, రెస్టు పుచ్చుకోవడానికి    వెళ్ళిపోతుంది ప్రేక్షకుల అంతరంగం కాబట్టి బాధ వుండదు. ఒకసారి వాస్తవికత అంటూ హింట్ ఇచ్చి వాస్తవికతకి ఎగనామం పెడుతూ పోతే మాత్రం అంతరంగం మేల్కొని వుండి పొడుస్తూ వుంటుంది ప్రేక్షకుల్ని. ఇదీ జానర్ మర్యాద  సైకో ఎనాలిసిస్. 

      డార్క్ మూవీస్ లో హీరోని సినిమాటిక్ గా, ఈ జానర్ కి తగ్గట్టుగా  ఎస్సై పాత్రగా చూపించాలంటే ఒకటే మార్గం : అతను ఇన్స్ పెక్టర్ కింద పనిచేస్తున్నట్టు చూపించడమే. ఎందుకంటే అసలు దర్యాప్తు అధికారి ఇన్స్ పెక్టరే. ఈయన్ని ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ (ఐఓ) అంటారు. కోర్టులో సాక్ష్యమిచ్చేది ఐఓ గా ఈయనే తప్ప, ఎస్సై కాదు. ఇన్స్ పెక్టర్ నే హీరోగా చూపించాలంటే సీనియర్ నటుడు వినా మార్గాంతరం లేదు, యంగ్ హీరోని ఇన్స్ పెక్టర్ అంటే బావుండదు కాబట్టి.   ఎసిపి, ఏఎస్పీ లవంటి ఐపీఎస్ పోస్టులు డైరెక్టు పోస్టులు. ఐపీఎస్ చదివిన యంగ్ హీరో పాత్ర నేరుగా ఈ పోస్టుల్లోకి వెళ్ళవచ్చు. కానీ ఇన్స్ పెక్టర్ అవాలంటే ఎలాటి కోర్సులూ,  డైరెక్టు పోస్టింగులూ వుండవు. ఎస్సైగా పనిచేసి సీనియారిటీ ప్రకారం ఇన్స్ పెక్టర్ గా ప్రమోషన్ పొందాల్సిందే. 

          ఈ ఇన్స్ పెక్టర్ తర్వాత డీఎస్పీ గా ప్రమోట్ అవచ్చు. పోలీసు వ్యవస్థ రెండు విధాలుగా వుంటుంది : జిల్లా పోలీసు వ్యవస్థ, నగర కమీషనరేట్ వ్యవస్థ. జిల్లాకి ఎస్పీ ఉన్నతాధికారిగా వుంటాడు. ఈయనకింద ఏఎస్పీలు, డివిజన్ కొకరు చొప్పున డీఎస్పీలు, డీఎస్పీల కింద సర్కిల్ కొకరు చొప్పున ఇన్స్ పెక్టర్లు, ఇన్స్ పెక్టర్ల కింద వాళ్ళ సర్కిల్స్  లో పోలీస్ స్టేషన్ కొకరు చొప్పున ఎస్సైలూ వుంటారు.

          నగర కమీషనరేట్ వ్యవస్థలో కమీషనర్, ఆయన కింద  డిసిపిలు, డిసిపిల కింద ఎసిపిలు, ఎసిపిల కింద సర్కిల్ కొకరు చొప్పున  ఇన్స్ స్పెక్టర్లు, ఇన్స్ పెక్టర్ల కింద  వాళ్ళ సర్కిల్స్ లో పోలీస్ స్టేషన్స్ లో ఒకరి కంటే ఎక్కువమంది ఎస్సైలూ వుంటారు.

          ఫార్ములా యాక్షన్ మూవీస్ లో ఎలా చూపిస్తారంటే నగరంలో ఎస్పీ ధూంధాం చేస్తూంటాడు. నగరంలో ఎస్పీ పోస్టే వుండదని ఇంగితం చెప్తున్నా అలాగే చూపిస్తారు. కానీ డార్క్ మూవీ కథ నగరంలో జరిగితే కమీషనరేట్ వ్యవస్థని, జిల్లాల్లో ఎక్కడైనా కథ జరిగితే ఎస్పీ వ్యవస్థనీ ఖచ్చితంగా వేర్వేరుగా చూపించాల్సిందే. 

          డార్క్ మూవీస్ లో  హీరోకి ఎస్సై పాత్ర తర్వాత,  సినిమాటిక్ గా పనికొచ్చే మరికొన్ని పాత్రలున్నాయి : క్రైం రిపోర్టర్, క్రిమినల్ లాయర్, క్రైం నవలా రచయిత అన్నవి. హిందీ ‘మనోరమ- సిక్స్ ఫీట్ అండర్’ లో  హీరో అభయ్  డియోల్ పాత్ర డిటెక్టివ్ నవలా రచయిత పాత్రే.   నానా పాట్లు పడి  పోలీసులకి సమాంతరంగా హత్య కేసు పరిశోధిస్తూంటాడు. ఇక క్రైం రిపోర్టక్ కీ లాజికల్ గా హత్య కేసుల్ని పరిశోధించే అనుమతి  వుంటుంది. అలాగే క్రిమినల్ లాయర్ పాత్ర కూడా పాపులరే. దీనికోసం 1960 లోరాజేంద్ర కుమార్ తో బీఆర్ చోప్రా తీసిన ఖానూన్ (చట్టం) అనే బిగి సడలని క్లాసిక్ హిట్ చూడాల్సిందే. ఇంకా క్రిమినల్ లాయర్ పాత్రకోసం ఎర్ల్ స్టాన్లీ గార్డెనర్ సృష్టించిన నవలా పాత్ర పెర్రీ మేసన్ తో వచ్చిన హాలీవుడ్ సినిమాలూ, టీవీ సిరీస్ లూ యూట్యూబ్ లో విరివిగా దొరుకుతాయి, అవి చూడవచ్చు. 

          డార్క్ మూవీ హీరోగా ఎస్సైకి ప్రత్యాన్మాయంగా క్రైం రిపోర్టర్, క్రైం రైటర్, క్రిమినల్ లాయర్ మొదలైన పాత్రలు మాత్రమే సినిమాటిక్ న్యాయాన్ని చేకూరుస్తాయని గ్రహించాలి. ఎప్పట్నించో  నగరాల్లో ప్రైవేట్ డిటెక్టివ్ ఏజెన్సీలున్నాయి. ఇవి ప్రజల దృష్టికి అంతగా రావడంలేదు. సినిమా ప్రేక్షకులు కూడా వీటిని సినిమాటిక్ గా తీసుకోవడంలేదు. 2014 లో విడుదలైన తమిళ డబ్బింగ్  ‘భద్రమ్’ లో హీరో అశోక్ సెల్వన్ ది ఒక డిటెక్టివ్ ఏజెన్సీలో పనిచేసే ప్రైవేట్ డిటెక్టివ్ పాత్ర. ఇది సినిమాటిక్ గా వర్కౌట్ కాలేదు. డిటెక్టివ్ ఏజెన్సీలు హత్యకేసుల జోలికి వెళ్ళే అనుమతి లేదు. వాటికి  చీటింగ్, ఫ్రాడ్, బ్యాక్ గ్రౌండ్ చెక్, మిస్సింగ్ కేసులు, కార్పోరేట్ గూఢచర్యం. ఇన్సూరెన్స్ మోసాలు, ఆస్తి వివాదాలు  వంటి పరిధుల్లోనే లైసెన్సులు వుంటాయి. ప్రైవేట్ వ్యక్తులు, కంపెనీలు వీటి సేవలు పొందుతారు తప్ప,  పోలీసులు వీటి సహాయం తీసుకోరు. ఈ డిటెక్టివ్ ఏజెన్సీలు సినిమా ప్రేక్షకుల కరుణా కటాక్షాలకి దూరంగానే వుండిపోతున్నాయి. డిటెక్టివ్ అన్న పదమే ఇప్పటికీ తలకెక్కడం లేదు మెజారిటీ సంఖ్యలో జనాలకి. సినిమా ఫీల్డులోనూ చాలామందికి డిటెక్టివ్ ఎవరో తెలీదు. 

          ఇక నగర పోలీసు వ్యవస్థలో క్రైం బ్రాంచ్ అని వుంటుంది. ఈ క్రైం బ్రాంచ్ లో డిటెక్టివ్ ఇన్స్ పెక్టర్లు వుంటారు. అయినా డిటెక్టివ్ ఇన్స్ పెక్టర్ పాత్రకి సినిమాల్లో ఛాన్సు లేదు. ఎవరో గ్రహాంతర వాసిలా అన్పిస్తాడు. సినిమాల్లో కేవలం ఇన్స్ పెక్టర్ అనే వాడుంటేనే అర్ధంజేసుకో గల్గుతారు ప్రేక్షకులు.  తెలుగు డిటెక్టివ్ నవలల్లో క్రైం బ్రాంచే తప్ప పోలీస్ స్టేషన్లు వుండేవి కావు. ఈ క్రైం బ్రాంచుల్లో పనిచేసే డిటెక్టివ్ ఇన్స్ పెక్టర్ పాత్రలు కొన్ని పాపులరయ్యాయి-  ఈ డిటెక్టివ్ ఇన్స్ పెక్టర్ పాత్రలు పాఠకుల అభిమాన డిటెక్టివ్ పాత్రలకి సహాయంగా వుండేవి లాజిక్ లేకుండా. 

          ఇదంతా హీరోని  నేర పరిశోధకుడుగా చూపించడం గురించి. ఇక నిందితుడిగా చూపించే డార్క్ మూవీస్  కథలుంటాయి. హత్య కేసు మీదపడి  దాంట్లోంచి బయటపడేందుకు చేసే ప్రయత్నాలు. ఇక్కడ హీరో సామాన్యుడై  వుంటాడు. అయితే  ‘ఖైదీ’ లో చిరంజీవి లాంటి యాక్షన్ హీరో అయివుండడు. డార్క్ మూవీస్ పాత్రలూ కథలూ మేధస్సునే ప్రస్ఫుటింప జేస్తాయి. మేధస్సుతోనే సమస్యా పరిష్కారమనేది వుంటుంది. కాబట్టి ఈ నిందితుడైన సామాన్యుడైన హీరో పోలీసుల్ని కొట్టి పారిపోవడం, బిగ్ యాక్షన్ ఎపిసోడ్స్ కి తెర తీయడం వంటివి వుండవు. ఇలాటి హాలీవుడ్ నోయర్ హీరో పాత్రలు నైరాశ్యంతో వుంటాయి, లోకం మీద కసితో వుంటాయి, తిరుగుబాటు మనస్తత్వంతో వుంటాయి, తన విలువలే ప్రామాణికమన్న ధోరణిలో వుంటాయి. దీనికి ఉదాహరణగా  తెలుగు సినిమాలు చూపడం కష్టం. తెలుగులో నోయర్ సినిమాల జాడ లేదు గనుక. హాలీవుడ్ లో  'టాక్సీ డ్రైవర్',  'చైనా టౌన్' లాంటి ప్రసిద్ధ నోయర్ సినిమాలున్నాయి అవి చూడొచ్చు.

          బాధిత, లేదా నిందితుడైన హీరో తను నిర్దోషి అని నిరూపించుకోవడానికి ఏదైనా క్లూ పట్టుకుంటాడు. క్లూ కోసమే ప్రయత్నిస్తూంటాడు. ఆ క్లూ అతడికి దొరక్కుండా విలన్ లేదా, పోలీసులు అడ్డు పడుతూంటారు. హీరో చుట్టూ వంచించే, వేధించే, మోసగించే, నమ్మక ద్రోహం చేసే పాత్రలే వుంటాయి. చివరికి న్యాయమే గెలిచినా నోయర్ మూవీస్ ఎలిమెంట్స్ ఇవే- వంచన, వేధింపులు, మోసం, నమ్మక ద్రోహం...


(రేపు- ‘నోయర్ హీరోయిన్ నోట్సు’)
-సికిందర్


28, ఏప్రిల్ 2017, శుక్రవారం

షార్ట్ రివ్యూ!


స్క్రీన్  ప్లే దర్శకత్వం : రాజ మౌళి

 తారాగణం: ప్రభాస్, రానా, అనూష్కా, తమన్నా, రమ్యకృష్ణ, సత్యరాజ్, నాజర్, సుబ్బరాజు తదితరులు
కథ
: వి.విజయేంద్రప్రసాద్సంగీతంఎం.ఎం.కీరవాణి, చాయాగ్రహణం : కె.కె.సెంథిల్కుమార్
బ్యానర్ :  ఆర్కా మీడియా వర్క్స్
సమర్పణ: కె.రాఘవేంద్రరావు
నిర్మాతలు: శోభు యార్లగడ్డ, ప్రసాద్దేవినేని
***
       రెండేళ్లుగా ఎదురు చూస్తున్న బాహుబలి రెండో బాగం రానేవచ్చింది. కట్టప్ప ఎందుకు చంపాడన్న ప్రశ్నకి సమాధానం చెబుతూ విచ్చేసింది. మొదటి భాగం కంటే రెండో భాగానికే టికెట్ల దగ్గర ప్రేక్షకులు బాహుబలులవ్వాల్సిన అత్యవసర పరిస్థితిని కల్పిస్తూ – టికెట్టు దొరికిన వాడే బాహుబలి అన్పించేలా చేస్తూ- టికెట్టు దొరకని వాణ్ణి కట్టప్ప క్వశ్చన్ కి ఓపిక పట్టుతప్ప, ఎవర్నుంచీ తెలుసుకోకంటూ  మెత్తగా వార్నింగ్ కూడా ఇస్తూ ‘బాహుబలి- 2’ చెప్పిన సంగతులేమిటంటే...


కథ
          మొదటి భాగం కొనసాగింపు కథ ఈ రెండో భాగంలో ఇలా వుంటుంది : మొదటి భాగంలో కాలకేయుడి మీద యుద్ధాన్ని గెలిచిన నేపధ్యంలో అమరేంద్ర బాహుబలి (ప్రభాస్) ని మహారాజుగా ప్రకటిస్తుంది రాజమాత శివగామి(  రమ్య కృష్ణ).  ది భల్లాల దేవుడు (రానా) కి, అతడి తండ్రి బిజ్జలదేవుడు ( నాజర్) కీ నచ్చదు. పట్టాభిషేకానికి ముందు దేశాన్ని చూసి రమ్మని అమరేంద్రని పంపిస్తుంది శివగామి. అమరేంద్ర మామ కట్టప్ప (సత్యరాజ్) తో బయల్దేరి వెళ్తాడు. వీళ్ళ పర్యటనలో భాగంగా కుంతల రాజ్యానికి చేరుకుంటారు. అక్కడ యువరాణి దేవసేన (అనూష్కా) ని చూసి ప్రేమిస్తాడు అమరేంద్ర. దేవసేన చిత్రపటం చూసిన భల్లాలదేవుడు ఆమెతో పెళ్లి జరిపించమని శివగామిని కోరతాడు. దేవసేనని తీసుకురావాల్సిందిగా కబురంపుతుంది శివగామి. అమరేంద్ర ఆమెని తీసుకుని వస్తాడు. తీరా దేవసేనకి భల్లాల దేవుడితో శివగామి సంబంధం ఖాయం చేసేసరికి, మహారాజు పదవిని వదులుకుని సైన్యాధ్యక్షుడిగా వుంటాడు దేవసేనని పెళ్లి చేసుకున్న అమరేంద్ర. అయినా భాల్లాలదేవుడు అమరేంద్ర మీద పగదీర్చుకునే కుట్రలే చేస్తూ, శివగామి అతణ్ణి వెలివేసేలా చేస్తాడు.  

          ఇప్పుడు రాజ్యం వదులుకుని దేవసేనతో సామాన్య ప్రజల్లోకి వెళ్ళిపోయిన  అమరేంద్ర ఇకపైన ఏం చేశాడు? అతడి మీద ఇంకేమేం కుట్రలు జరిగాయి? కట్టప్ప అతణ్ణి ఎందుకు చంపాల్సివచ్చింది? అన్నవి ప్రశ్నలు. ఇవన్నీ తెలుసుకుని తన తండ్రి అమరేంద్ర బాహుబలి మరణానికి కారకుడైన పెదనాన్న భల్లాలదేవుడి మీద మహేంద్ర బాహుబలి ( ప్రభాస్) ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడనేది మిగతా కథ.

ఎలావుంది కథ
          ఈ రెండో భాగం కథ మొదటి భాగానికి ఫ్లాష్ బ్యాక్ తో బాటు ఉపసంహారం. మొదటి భాగంలో చూపించిందంతా ఉపోద్ఘాతం. కథ ఈ రెండో భాగంలోనే ప్రారంభమవుతుంది. ఇందులో ఫ్లాష్ బ్యాక్ దాదాపు రెండుగంటలా 10 నిమిషాలు నడుస్తుంది. ఈ ఫ్లాష్ బ్యాక్ లో సాంతం  అంతఃపురపు కుట్రలే వుంటాయి. షేక్స్ పియర్ తరహా  ‘యూటూ బ్రూటస్?’  వెన్ను పోట్లూ వుంటాయి. మొదటి భాగం కథలేక వినోదాత్మకంగా వుంటే, ఈ రెండో భాగం రీలీఫ్ నివ్వనంత సంఘర్షణాత్మకంగా వుంటుంది కథతో. 

ఎవరెలా చేశారు
          మొదటి భాగంలో కథ లేక, అందువల్ల పాత్రకి లక్ష్యం ఏర్పాటు కాక వుండిపోయిన ప్రభాస్ పోషించిన మహేంద్ర బాహుబలి పాత్ర, తిరిగి ఈ రెండో భాగంలో ఫ్లాష్ బ్యాక్ పూర్తయిన తర్వాతే క్లయిమాక్స్ యుద్ధ దృశ్యాల్లో తెరపైకి వస్తుంది.  తండ్రి పాత్ర ఫ్లాష్ బ్యాక్ లో  ప్రధానంగా వుంటుంది. కుట్రలకి బలయ్యే ఈ పాత్రలో ప్రభాస్ బాగానే భావోద్వేగాలు కనబర్చినా,  మేకప్ ఆ భావోద్వేగాలకి సపోర్టు చేయలేదు. చెమట బిందువులు కూడా చిందని ముఖారవిందంతో సాఫీగా వుండిపోయాడు. పోరాట దృశ్యాల్లోనూ అంతే. కొన్ని వీరత్వం ఉట్టి పడే సింగిల్ లైన్ డైలాగులతో ప్రేక్షకుల్ని ఉర్రూత లూగిస్తాడు. 

          అనూష్కా కూడా బాధాకరమైన సన్నివేశాల్లో, లేదా పోరాట దృశ్యాల్లో సాఫీ మొహంతోనే కనిపిస్తుంది. సరైన ఒరిజినాలిటీ ఉట్టిపడే ఫేస్ ఎవరిదంటే యుద్ధ సన్నివేశాల్లో కన్పించే తమన్నాదే. ఆ ఫేస్ తో ఆమె సరీగ్గా యుద్ధనారిలానే వుంటుంది రఫ్ గా. ఆమె కన్పించేది కూడా క్లయిమాక్స్ యుద్ధంలో ఆ నాల్గు షాట్స్ లోనే. 

          రమ్యకృష్ణది కూడా ఒడిదుడుకు లనుభవించే పాత్ర. రాజమాత దర్పం ఆమెకే సరి. మాయల్లో పడి మోసపోయి ప్రాణత్యాగంతో పునీతమయ్యే దాకా   ఆమెదొక ట్రాక్ లో  వుండే పాత్ర. ఇక విలన్ గా రానా ది పూర్తిగా యాక్షన్ ఓరియెంటెడ్ పాత్ర. బాగా చేశాడు. 

          ఇతర పాత్రల్లో సత్యరాజ్, నాజర్, సుబ్బరాజులు ఫర్వాలేదు.
          సంగీతపరంగా పాటలకంటే నేపధ్య సంగీతం కీరవాణి బాణీల్లో పకడ్బందీగా వుంది. నిజం చెప్పుకోవాలంటే కథలో డ్రామాకన్నా, పోరాటాలకన్నా ఈ నేపధ్యసంగీతమే కూర్చోబెడుతుంది. సెంథిల్ కుమార్ ఛాయాగ్రహణం ఆయన శైలిలో టెక్నికల్ గా బాగానే వున్నా, మొదటి భాగంలో వున్నట్టు పోయెటిక్ గా లేదు. ఛాయాగ్రహణ పరంగా గుర్తుండిపోయే అద్భుతాలేమీ లేవు. అలాగే పోరాటాలకీ, విజువల్ ఎఫెక్ట్స్ కీ మొదటి భాగానికే మార్కులు వేయాల్సి వస్తుంది.

చివరికేమిటి
          రాజుల కథ అనగానే వాళ్ళల్లో  వాళ్ళు చేసుకునే కుట్రలు  చూపించడమే  ఆనవాయితీ గా వస్తోందింకా. బాహుబలి అయినా, శాతకర్ణి అయినా, రుద్రమదేవి అయినా ఈ కథల్లో సామాన్య ప్రజలకే మాత్రం చోటుండదు. పెద్ద పెద్ద కోటల్లో అట్టహాసంగా సంపదని ప్రదర్శించుకుంటూ రాజులుంటే, ఒంటిమీద గుడ్డలు సరిగా లేని బీదా బిక్కీ జనం వాళ్ల ముందు సామూహికంగా కీర్తి గానాలు చేస్తూంటారు. ఈ దృశ్యాలే  చూడ్డానికి ఇబ్బందిగా వుంటాయి. ఈ రాజులు, వీళ్ళ రాజ్యాలూ ఎంత మానవీయంగా వున్నాయో పట్టిస్తూంటాయి. ఇవి ఫ్యూడలిస్టిక్ చిత్రణలే తప్ప, సోషలిజం కాదు. కానీ కమర్షియల్ సినిమా అంటే సోషలిజమే. మాస్ ప్రేక్షకులు కూడా చూడకపోతే సినిమాలుండవు. మరి మీ బతుకు లింతే అన్నట్టు రాజుల సినిమాల్లో సామాన్యుల్ని చూపిస్తే, ఆ  కథల్లో ప్రేక్షకులెలా ఇన్వాల్వ్ అవుతారన్నది ప్రశ్న. రాజులు వాళ్ళలో వాళ్ళు ఏం చేసుకుంటే మాకెందుకు, మా గురించేమిటన్నది సామాన్య ప్రేక్షకుడికి తట్టే ప్రశ్న. 

          ఇలా  బాహుబలి లాంటి భారీ పాత్ర సమాజంకోసం ఏం చేశాడంటే ఏమీ లేదు. కానీ హై కాన్సెప్ట్ సినిమాల్లో లెజండరీ పాత్ర ప్రజల కోసమే త్యాగాలు చేస్తాయితప్ప, బాహుబలిలాగా ఇంట్లో ఇష్టంలేని పెళ్లి చేసుకుని కుట్రలకి బలికావు. ప్రేమకథలు చూపించవు. 

          బాహుబలిలో  ఇబ్బంది పెట్టే  బిగ్గెస్ట్ క్వశ్చన్ ఏమిటంటే,  ప్రజలకోసం అతనేం చేశాడు?
          ఇక ఫస్టాఫ్ లో  అనూష్కాతో ప్రభాస్ ప్రేమ ట్రాకు ఇంకా అద్భుతంగా ఉండాల్సింది. ఆమె బావగా ఫార్ములా పాత్రలో సుబ్బరాజుతో సిల్లీ కామెడీ చేయించారు. సెకండాఫ్ పది నిమిషాలు గడిచేవరకూ ఎమోషనల్ కనెక్ట్ వుండదు- ప్రభాస్ అనూష్కాతో రాజ్యం వదిలి వెళ్ళిపోయే సన్నివేశం దగ్గర్నుంచే కథకి బలం కన్పిస్తుంది. ఇక కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడన్న మిలియన్ డిస్కుల ప్రశ్నకి సమాధానం చెప్పిన తీరు ఫ్లాష్ బ్యాక్ మోడ్ లో  చెప్పివుంటే షాకింగ్ గా వుండేది. ఎందుకంటే, ఈ ప్రశ్నకి సమాధానం షాక్ వేల్యూ ని ఎలివేట్ చేయాలి. ఎందుకు చంపాల్సి  వస్తోందో ముందే సీన్లు  చూపించేసి, అప్పుడు చంపి బాహుబలికి చెప్పడం వల్ల బాఅది షాకేమో గానీ ప్రేక్షకులకి కాదు. ప్రేక్షకులు ఏంతో  ఎదురు చూస్తున్న సమాధానాన్ని నీరు గార్చినట్టయ్యింది. 

          దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి పూర్తి చేసిన ఈ రెండోభాగం ద్వితీయార్ధంలో బలం పుంజుకున్నా, చిత్రీకరణలో మొదటి భాగానికి సాటి రాదు. మొదటి భాగంలో విషయం లేకపోయినా విజువల్స్, పోరాట దృశ్యాలు  అద్భుతంగా వచ్చాయి. తమన్నా- ప్రభాస్ ల డ్యూయెట్ ఒక్కటి చాలు మొదటి భాగం గొప్పతనానికి. అలాగే ఈ రెండో  భాగంలో అవే పాత్రలు కంటిన్యూ అవడం వల్ల కూడా ఒక ఉత్సాహం కలగదు. కనీసం ఇద్దరు ప్రముఖ నటుల్ని కొత్తగా ప్రవేశ పెట్టాల్సింది. మొదటి భాగం క్లయిమాక్స్ లో  కాలకేయుడు వచ్చిన లాంటి థ్రిల్  ఫీలింగ్ రెండో భాగంలో కంటిన్యూ అయిన ఆర్టిస్టులతో అంతగా అన్పించదు. కనీసం ఇద్దరు కొత్త ఆర్టిస్టులని సర్ప్రైజ్ ఎంట్రీ గా ఇచ్చి వుంటే మొనాటనీ వుండేది కాదు.



-సికిందర్
http://www.cinemabazaar.in




24, ఏప్రిల్ 2017, సోమవారం

     డార్క్ మూవీస్ జానర్ కి 1930 లలో బ్లాక్ అండ్ వైట్ఫిలిం నోయర్సినిమాలు బీజం వేశాయని చెప్పుకున్నాం. వీటి డీఎన్ఏ హార్డ్ కోర్ డిటెక్టివ్ నవలలేనని కూడా చెప్పుకున్నాం. 1930 లలో అమెరికాలో ఆర్ధిక మాంద్యం రేపిన కల్లోల నేపధ్యంలో ఈ రకమైన నేరపూరిత కథలతో ఫిలిం నోయర్ అనే జానర్ ప్రారంభమయిందని కూడా గుర్తు చేసుకున్నాం. సమాజంతో- ఆ సమాజంలో వుండే ప్రేక్షకులతో  ముడిపెట్టకుండా హాలీవుడ్ కూడా మనం అనుకరిస్తున్న కమర్షియల్  సినిమాలు తీయలేదని  తెలుసుకున్నాం. ఆ విధంగా ఇప్పుడు మన దేశంలో ఆర్ధిక రంగ పురోభివృద్ధి నేపధ్యంలో  పెరిగిపోతున్న నేర మనస్తత్వాల్ని బయట పెట్టే  డార్క్ మూవీస్ జానర్ వైపు తెలుగు మేకర్లు కన్నెత్తి చూడ్డం లేదనికూడా విచారపడ్డాం. ఇంకే సీరియస్ సినిమాకీ లేని  ప్రేక్షకుల్నికూర్చోబెట్టగలిగే శక్తి ఒక్క డార్క్ మూవీస్ కే  వుందని సోదాహరణంగా అర్ధం జేసుకున్నాం.  ఈ పని తెలుగులోకి వచ్చేసి తమిళ, మలయాళ డబ్బింగులు పూర్తి చేస్తున్నాయని కూడా చెప్పుకున్నాం. తెలుగు మేకర్లు మాత్రం ఇంకా వారం వారం అవే ప్రేమపురాణాలు, అవే దెయ్యాల అరుపులూ  చూపిస్తూ  కాలక్షేపం చేస్తున్నారని కూడా బాధపడ్డాం. ఇప్పుడొక వేళ తమిళులు తీస్తే నేను తీయలేనా అని తెలుగు మేకర్ ఎవరైనా డార్క్ మూవీకి సమకట్టి ప్రేమలూ దెయ్యాల ముచ్చట్లకి తెర దించే ప్రయత్నం చేశాడే అనుకుందాం- అప్పుడతను ఏం తీయవచ్చు? బ్రహ్మాండంగా  డార్క్ మూవీ తీస్తున్నాననుకుని భీకర యాక్షన్ మూవీ తీసి పడేస్తే?  రోమాంటిక్ కామెడీలు తీస్తున్నాననుకుంటూ రోమాంటిక్ డ్రామాలు తీసి దెబ్బతిన్న రక్తమే కదా? అలాగే ఇదీ!

          ఇందుకే డార్క్ మూవీ జానర్ మర్యాదలేంటో  తెలుసుకోవాల్సిన అగత్యం ఏర్పడుతోంది. తీసే సినిమాల కోసం స్క్రీన్ ప్లే సూత్రాలు అక్కర్లేదనుకున్నా అభ్యంతరం లేదు-  ఎవరికెలా తోస్తే అలా తీసి ఫ్లాప్ చేసుకోవచ్చు - కనీసం జానర్ తేడాలేమిటో కూడా తెలీక సినిమాలు తీయడానికి సాహసించడం మాత్రం తెలివితక్కువ తనమే. ఇడ్లీ, వడ రెండిటి తయారీ విధానం ఒకటి కాదు. ఇడ్లీ పిండిని  సలసల కాగే నూనెలో వేసి వడ తయారు చేయరు. యాక్షన్ మూవీ నూనెలో డార్క్ మూవీ కథ వేస్తే కూడా మిగిలేది మసే. ఆ మసి డార్క్ గానే వుంటుంది. అప్పుడది మసైన డార్క్ మూవీ అయి థియేటర్ల దగ్గర ప్రేక్షకులకి మసి పూసి పంపుతుంది. తమిళ, మలయాళ డార్క్ మూవీసేమో  అత్తరు పూస్తూ ఆనందింప జేస్తూంటాయి. 

       యాక్షన్ మూవీస్ తో,  సస్పెన్స్ థ్రిల్లర్స్ తో పూర్తిగా విభేదిస్తుంది డార్క్ మూవీ జానర్.  1930 ల నుంచీ 50 ల వరకూ తెలుపు నలుపు సినిమాల కాలంలో వచ్చిన ఫిలిం నోయర్ సినిమాల్ని క్లాసిక్ నోయర్ అంటారు. అది వాటికి  స్వర్ణయుగం. కలర్ ఫిలిం తో 1960 లనుంచి ఇదే క్లాసిక్ నోయర్ నియో నోయర్ గా ఆధునికీకరణ చెంది, ఇప్పటి దాకా ఇదే  కొనసాగుతోంది. మనకు దక్షిణ భాషల్లో ‘నోయర్’ సినిమాలు పెద్దగా లేవు. తమిళంలో మొదటి పక్కా నియో నోయర్ సినిమాగా ‘అరణ్యకాండం’ 2011లో చరిత్ర కెక్కింది. దీనికి ఐదు కోట్లు పెడితే ఏడు  కోట్లు వచ్చాయి. దీని దర్శకుడు త్యాగరాజన్ కుమార రాజాకి ఉత్తమ కొత్త దర్శకుడుగా జాతీయ అవార్డు కూడా లభించింది. ఉత్తమ ఎడిటింగ్ కి కూడా దీనికి జాతీయ అవార్డు లభించింది. తెలుగులో యాక్షన్ – సస్పెన్స్ థ్రిల్లర్స్ తప్ప నోయర్ సినిమాల జాడ ఇప్పటికీ లేదు.  

          అయితే 1971 లో కృష్ణ- గుమ్మడిలు నటించిన ‘నేనూ మనిషినే’ వుంది బ్లాక్ అండ్ వైట్ లో. దీని దర్శకుడు జివిఆర్ శేషగిరిరావు. దీంట్లో  కనీసం ‘కథాపరంగా’ నోయర్ సినిమా లక్షణాలన్నీ కన్పిస్తాయి (నోయర్ సినిమాలకి   కథాపరమైన హంగులు, చిత్రీకరణ పరమైన హంగులు అని రెండుంటాయి) గుమ్మడి పాత్ర, వస్త్రధారణ, ధూమపానం మొదలైనవి క్లాసిక్ నోయర్ సినిమాల రీతుల్ని పట్టిస్తాయి. జడ్జి పాత్రలో ఆయన హత్య చేయడం, పోలీసు అధికారి పాత్రలో కృష్ణ నేరపరిశోధన చేయడం- ఆ నేర పరిశోధనలో అప్పట్లోనే తుపాకీ గుళ్ళ బాలస్టిక్స్  శాస్త్రాన్ని చర్చించడం వగైరా వుంటాయి. 

          ఇది 1971 లో  తమిళంలో మేజర్ సౌందర రాజన్- రవిచంద్రన్ లతో వచ్చిన  ‘జస్టిస్ విశ్వనాథన్’ కి రీమేక్. ‘జస్టిస్ విశ్వనాథన్’ 1980 లో రజనీకాంత్ తో ‘పొల్లదవన్’ గా మళ్ళీ రీమేక్ అయింది. 1976 లో  కన్నడలో రాజ్ కుమార్ తో ‘ప్రేమద కణికే’ గా రీమేక్ అయింది. వీటన్నిటికీ మూలాధారం 1969 లో అశోక్ కుమార్- జీతేంద్రలతో హిందీలో వచ్చిన ‘దో భాయ్’ అని సలీమ్-  జావేద్ లు రచన చేసిన సినిమా. అయితే హిందీలో దీనికంటే ముందు 1951 లో సాక్షాత్తూ గురుదత్ ‘బాజీ’ (గేమ్) అనే నోయర్ మూవీ దేవానంద్ తో తీశారు. దీనికి అమెరికన్ నోయర్ మూవీ ‘గిల్డా’  స్ఫూర్తి. 

          ఇక ఈ శతాబ్దం లోనే తీసుకుంటే హిందీలో షైతాన్, మనోరమ-  సిక్స్ ఫీట్ అండర్, జానీ గద్దార్, పాంచ్, కహానీ, కహానీ -2, పింక్  వంటి అనేక డార్క్ మూవీస్ వచ్చాయి. తమిళంలో జిగర్తండా, 16-డి, నగరం, మెట్రో మొదలైనవి వచ్చాయి. మలయాళంలో ‘దృశ్యం’ వచ్చింది. హాలీవుడ్ నుంచి క్రిమ్సన్  రివర్స్, మోమెంటో, కిస్ కిస్ బ్యాంగ్ బ్యాంగ్, గాన్ బేబీ గాన్...వంటివి ఎన్నో వచ్చాయి. తెలుగులో రాలేదు. ‘కీచక’ నోయర్ మూవీ అన్నారు గానీ, అదలా వుండదు. 

          నోయర్ మూవీ లేదా డార్క్ మూవీ అంటే మనిషిలోని, లేదా సమాజంలోని నేరపూరితమైన చీకటి కోణాల్ని వెలుగులోకి తెచ్చేది. దీని కథాంశం పోలీస్ ప్రోసీజురల్ (నేరపరిశోధన) అయివుండాలి, లేదా గ్యాంగ్ స్టర్ కథైనా అయివుండాలి. ఈ రెండు ప్రక్తియలు తప్ప ఇంకో  కథా ప్రపంచంలో డార్క్ మూవీస్ ని స్థాపించే సాంప్రదాయం లేదు. మనం వచ్చిందే పండగ అనుకుని జిగర్తండా, 16-డి, నగరం, మెట్రో మొదలైన వాటిని డార్క్ మూవీస్ గా కీర్తిస్తున్నాం గానీ ఇవి పూర్తిగా డార్క్ మూవీస్ నిర్వచనానికి సరిపోవు. రచన మాత్రమే డార్క్ మూవీ నిర్వచనానికి సరిపోయి, చిత్రీకరణకి సరిపోకపోతే అది పాక్షిక డార్క్ మూవీయే అవుతుంది. 

          హిందీలో వచ్చిన పింక్ తప్ప షైతాన్, మనోరమ-  సిక్స్ ఫీట్ అండర్, జానీ గద్దార్, పాంచ్, కహానీ, కహానీ -2 ఇవన్నీ రచనా పరంగానూ చిత్రీకరణపరంగానూ డార్క్ మూవీస్ నిర్వచనానికి దగ్గరగా వుంటాయి. 

          సమస్య ఎక్కడ వచ్చిందంటే,  ఇప్పుడు విజువల్ ప్రపంచంలో జీవిస్తున్నాం. ప్రతీదీ చూసేసి తెలుకున్న జ్ఞానంతో వ్యవహరిస్తున్నాం. పూర్వంలాగా చదివి అర్ధం చేసుకున్న శాస్త్రీయ అవగాహనతో పనిచేయలేకపోతున్నాం. నాల్గు నోయర్ సినిమాలు చూసేసి ఓహో ఇంతేకదా అని తీసేస్తున్నారు. కానీ నోయర్ సినిమాల గురించి చదివితే వీటికి పాత్రలే కాదు, కెమెరా కూడా ఫలానా ఫలానా అర్ధాలతో యాంగిల్స్ పెడుతుందనీ, లైటింగ్ చూపిస్తుందనీ, నీడల్ని సృష్టిస్తుందనీ వీటికున్న ప్రత్యేక శాస్త్రాన్ని అర్ధం జేసుకోగల్గుతారు. అప్పుడు నిర్దుష్టమైన నోయర్ మూవీని తీయగల్గుతారు.   హాలీవుడ్ ని నమ్మి చెడిన వాడు లేడు. ఇంకా యూరోపియన్ మూవీస్ ని, కొరియన్ మూవీస్ నీ కాపీ చేసి చెడిపోయిన వాళ్ళున్నారు. ఏ జానర్ నైనా హాలీవుడ్ ప్రధాన స్రవంతి వ్యాపార సినిమా కింద  మార్చుకుని ప్రపంచం మీదికి వదుల్తుంది. హాలీవుడ్ అంటేనే పక్కా వ్యాపారస్తుల అడ్డా. కాబట్టి హాలీవుడ్ నుంచి ఏవో అర్ధంకాని ఫిలిం నోయర్, నియో నోయర్ పదాల్ని చూసి ఇదేదో మన జాతి వ్యవహారం కాదని, వ్యాపారం కూడా కాదని  భయపడి పారిపోనవసరం లేదు. ముఖ్యంగా నిర్మాతలు. నిర్మాతలు సరీగ్గా సినిమా వ్యాపారం గురించి తెలుసుకుంటే మేకర్ల ఆటలు సాగకుండా వుంటాయి. అమ్మో నోయర్ వద్దని నిర్మాతలు ఎంతగా భయపడుతూ కూర్చుంటే,  అంతగా మేకర్లు ప్రేమల్ని, దెయ్యాల్నీ తెచ్చి అంటగట్టి పోతూంటారు. అప్పుడు అంతే జోరుగా పక్క రాష్ట్రాల సినిమాల వాళ్ళూ తెలుగు రాష్ట్రాల్లో ఈస్టిండియా కంపెనీ లైపోతారు.

        ముందుగా ఈ జానర్ కి రచనా పరమైన హంగులేమిటో చూద్దాం : ఈ హంగులని హాలీవుడ్ నుంచి యధాతధంగా కాపీ కొట్టి ఇక్కడ చెప్పడంలేదు. ఇది హాలీవుడ్ టెంప్లెట్ కాదు. హాలీవుడ్  టెంప్లెట్ ని తెలుగు నేటివిటీకి  ఎలా మల్చుకోవచ్చో  కస్టమైజ్ చేసి చూపిస్తున్నాం, అంతే. 

          1. కాలనేపధ్యం :  దేశీయ సినిమా మార్కెట్ లో ఇవాళ్ళ బీదల పాట్ల కథలకి చోటు లేదు. బస్తీ ప్రజలు కూడా నిరంతర  గ్లోబలైజేషన్ ఫలాలు ఆరగిస్తూ  బీదలపాట్లు, ఆకలి పోరాటాలు, ఈతిబాధలు మర్చిపోయారు. స్మార్ట్ ఫోన్, డిష్ యాంటెన్నా, ఏర్ కూలర్ సుఖాలు మరుగుతున్నాక, మళ్ళీ వాళ్ళ కథలే వెండి తెర మీద చూడ్డానికి ఇష్ట పడ్డం లేదు. 

          పైగా మునుపెన్నడూ కనీ వినీ ఎరుగనంత  వందల వేల  కోట్లు వెనకేసుకుంటున్న  నయా సంపన్నుల సమాజం పట్ల కుతూహలాన్ని పెంచుకుంటున్నారు. ఇదివరకు సంపన్నులని  చూసి వొళ్ళు మండి  యాంగ్రీ యంగ్ మేన్లు  పుట్టుకొచ్చే వాళ్ళు. గ్లోబలైజేషన్ పుణ్యమా అని ఇప్పుడు షెర్లాక్ హోమ్స్ లవుతున్నారు. ఇంతేసి సంపాదించుకుంటున్న నయా  సంపన్నులు ఎలా జీవిస్తూంటారన్న కుతూహలంతో వాళ్ళ జీవితాల్లోకి తొంగి చూడా లనుకుంటున్నారు. ఇక్కడ గమ్మత్తేమిటంటే,  ఇదివరకు కామన్ మాన్ యాంగ్రీ యంగ్ మాన్ అయ్యే వాడు, ఇప్పుడు నయా సంపన్నులే యాంగ్రీ యంగ్ మాన్ లవుతున్నారు, కామన్ మాన్ ప్రశాంతంగా వుంటున్నాడు. ఒక ఎంపీ కొడుకు డబ్బు మదంతో టోల్ గేట్ ని ధ్వంసం చేస్తాడు, ఇంకో మంత్రి కొడుకు డబ్బు మదంతో ఒకమ్మాయితో స్టాకింగ్ కి పాల్పడతాడు. ఇంకో ఎంపీయే అధికార మదంతో విమాన  సిబ్బందిని చెప్పుతో కొడతాడు. కామన్ మాన్ తగినంత ఆర్ధిక భద్రతతో రిగ్రెసివ్ గా వుంటే, సంపన్నుడు అవసరానికి మించిన డబ్బుతో ఎగ్రెసివ్ అవుతున్నాడు. ఇలా రివర్స్ రోల్స్  పోషిస్తున్న కొత్త కాలం నడుస్తోంది.

       నియో నోయర్ సినిమా కథకి  ఈ కాలనేపధ్యాన్ని బాగా గుర్తు పెట్టుకోవాలి. ఎగ్రెసివ్ సంపన్నుడి జీవన శైలుల్ని రిగ్రెసివ్ కామన్ మాన్ చూడాలని కుతూహల పడుతున్నాడు. నైట్ లైఫ్ పేరుతో నయా సంపన్నులు పాల్పడే విశృంఖలత్వాన్ని చూసే భాగ్యం తనకి కలగాలనుకుంటున్నాడు. ఆ విశృంఖలత్వంతో వాళ్ళు లేనిపోని కేసుల్లో ఇరుక్కుని గింజుకుంటూంటే చూసి ఆనందించాలనుకుంటున్నాడు. షైతాన్, కహానీ-2, పింక్, 16- డి ల విజయ రహస్యమిదే. ఇవి సంపన్నేతరుల కుతూహలాన్ని తీరుస్తూ సంపన్నుల పట్ల వాళ్ళ కచ్చి ని కూడా తీర్చాయి. 1930 లలో అమెరికా ఆర్ధిక సంక్షోభ కాలనేపధ్యంలో పుట్టిన తొలితరం ఫిలిం నోయర్ సినిమాల విజయ రహస్యం కూడా ఇదే : సంపన్నుల డొల్లతనాన్ని రట్టు చెయ్యడం. ఇదే ఇప్పుడు దేశీయంగా ఆర్ధిక పురోభివృద్ధి నేపధ్యంలో మన దగ్గర పునరావృతమవుతోందని గుర్తించాలి.

          కాబట్టి డార్క్ మూవీస్ సినిమాలు తెరమీద సంపన్నుల పాట్లు వర్సెస్ తెరముందు సామాన్యుడి వినోదం ఫ్రేం వర్క్ లో వుండి  తీరాల్సిందే. డార్క్ మూవీస్ కదా అని, మర్డర్స్ కదా అని,  బస్తీ హత్యలు, గుడిసె ఖూనీలూ చూపిస్తే కాలనేపధ్యాన్ని కాల రాసినట్టే. గ్లామరస్ గా కళ్ళు చెదిరేట్టు సంపన్నుల నేర మనస్తత్వాల్ని  చూపడం మినహా డార్క్ మూవీస్ తో ఇంకెలాటి  గిమ్మిక్కులు పనిచెయ్యవు. గ్లోబలైజేషన్ దెబ్బకి రకరకాల సామాజిక, అస్తిత్వ వాదాలన్నీ వెనక్కెళ్ళి పోయాయి. ఆ వాదాలు ఏలిన కాలంలో కూడా రిక్షా వాడి మీద కవిత్వం రాస్తే రిక్షా వాడే చదవలేదు. ఆ రాసిన కవుల ప్రతిభాపాటవాల మీద  చర్చలు పెట్టుకోవడానికే అవి పనికొచ్చాయి. కవికి సామాజిక స్పృహ వుండేది గానీ, రాసిన కవితలే సమాజానికి ఉపయోగ పడేవి కావు. ఇలాకాక డిటెక్టివ్ సాహిత్యం రిక్షావాణ్ణి  పఠితని చేసి ఏంతో  కొంత సామాజిక ప్రయోజనం సాధించింది. ఆ డిటెక్టివ్ సాహిత్యపు వినోదమే ఇప్పుడు డార్క్ మూవీస్ లో సామాన్యుడికి కావాలి. తెలుగు డిటెక్టివ్ సాహిత్యాన్ని చూసినా వాటిలో బాధితులుగా సంపన్నులే వుండడాన్ని గమనించగలం. 

          అంటే కాల నేపధ్యం కోసం, వాస్తవికత కోసం, హై సొసైటీలో జరిగే సంఘటనల మీద ఓ కన్నేసి వుంచాలి ఈ జానర్ రచయితనే వాడు. అంతేగానీ ఫారిన్ డివిడిలు చూసి ఆ కథలు రాస్తే కాదు. హాలీవుడ్ నియమం ఏమిటంటే, నోయర్ సినిమాలకి రచయిత ఎంత వాస్తవిక కథైనా రాయకూడదు, డిటెక్టివ్ నవలే ఆధారం కావాలి.


(రేపు రెండో సూత్రం : పాత్రల తీరుతెన్నులు)
-సికిందర్

         



 



          

21, ఏప్రిల్ 2017, శుక్రవారం

రివ్యూ!









దర్శకత్వం : జోషి 

తారాగణం : మోహన్ లాల్, అమలా పౌల్, సాయికుమార్, బిజూ మోహన్, సిద్దీఖ్, అమీర్ నియాజ్ తదితరులు
రచన :  సాచీ, మాటలు : శశాంక్ వెన్నెలకంటి, సంగీతం : రతీష్ వేగా, ఛాయాగ్రహణం : ఆర్డీ రాజశేఖర్
బ్యానర్ : మ్యాజీన్ మూవీ మేకర్స్
నిర్మాత : సయ్యద్ నిజాముద్దీన్
విడుదల : ఏప్రిల్ 21, 2017

         ***
         మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ తెలుగు ప్రేక్షకుల దృష్టిలో పడి బాక్సాఫీసుకి ఇంకో చేరిక అయ్యాక అడపదపా ఆయన డబ్బింగులు విడుదలవుతున్నాయి. ‘మన్యం పులి’, ‘కనుపాప’ లని కూడా తెలుగులో బాగానే చూశారు. ఇప్పుడు తాజాగా పాత మలయాళం ఒకటి దులిపి తీసి తెలుగు ప్రేక్షకుల ముందుంచారు. 2012 లో మలయాళంలో ఘన విజయం సాధించిన ‘రన్ బేబీ రన్’ అనే సస్పెన్స్ థ్రిల్లర్ ని  తెలుగులో ‘బ్లాక్ మనీ- అన్నీ కొత్త నోట్లే’ గా విడుదల చేశారు. ఈ వారం మొత్తం 6 చిన్నాచితకా సినిమాలు విడుదలయ్యాయి తెలుగులో : లంక, దడపుట్టిస్తా, ఇద్దరి మధ్య 18, బాయ్ ఫ్రెండ్, ఒక పరిచయం, రిజర్వేషన్. ఇవికాక ‘బ్లాక్ మనీ’ తో కలుపుకుని పిశాచి -2, మాచిదేవ అనే మూడు డబ్బింగులు విడుదలయ్యాయి. ఈ మొత్తం తొమ్మిది సినిమాల్లో ఒక్క ‘బ్లాక్ మనీ’ కే  ప్రేక్షకులున్నారు. ఆరుకి ఆరూ తెలుగు సినిమాలన్నీ ప్రేక్షకుల్లేక యధావిధిగా ఇబ్బంది పడుతున్నాయి. 

          వే పేలవమైన ప్రేమలు, అవే రొటీన్ హార్రర్ లు తీయడం తప్ప ఇంకో  పనే లేకుండా పోయింది తెలుగు నిర్మాతలకీ దర్శకులకీ.  సస్పెన్స్ థ్రిల్లర్స్ తీసే పరిజ్ఞానం ఇప్పటి దర్శకులకి శూన్యం అవడంచేత అవే అర్ధం లేని ప్రేమలు కొందరు, టెంప్లెట్ హార్రర్ లు కొందరూ ఇంకా తీసుకుంటూ కాలం గడుపుతున్నారు. ఇవైనా పద్ధతిగా తీస్తే ఏ సమస్యా వుండదు. పద్ధతేమిటో కూడా తెలీక  ప్రేక్షకుల్ని దూరం చేసుకుంటున్నారు. తెలుగులో ఓపెన్ గా వున్న సస్పెన్స్ థ్రిల్లర్స్, డార్క్ మూవీస్ మార్కెట్ ని తమిళ మలయాళ సినిమాలు ఇలా  వచ్చేసి భర్తీ చేస్తూ సొమ్ములు చేసుకుంటున్నా కూడా  ఈ దిశగా స్పృహ తెచ్చుకోవడం లేదు.

          ‘బ్లాక్ మనీ’ దర్శకుడు జోషీ చాలా సీనియర్ దర్శకుడు. 1978 లో మలయాళంలో  రంగప్రవేశం చేసిన ఆయన నాటి నుంచి నేటి వరకూ 81 సినిమాలు తీశారు. 1988 లో కృష్ణంరాజు తో ‘అంతిమ తీర్పు’ అనే సూపర్  హిట్ తీశారు. తాజాగా 2015 లో  ఆయన తీసిన ఒక మలయాళం మోహన్ లాల్- సత్యరాజ్ లతో ‘ఇద్దరూ ఇద్దరే’ గా తెలుగులో డబ్ అయింది. ఇది ఆడలేదు. ఈ సినిమాతో ఆయన పూర్వపు టచ్, నైపుణ్యం కోల్పోయారు. కానీ 2012 లోనే తీసిన ‘బ్లాక్ మనీ’ తో అత్యంత ప్రతిభని చాటుకుంటూ ఆశ్చర్య పర్చారు. ఇప్పటి టెక్నిక్, టెక్నాలజీ తెలిసిన సమర్ధుడైన ఏ కొత్త దర్శకుడో తీసినట్టు పకడ్బందీగా తీశారు!

       ‘బ్లాక్ మనీ’  ఒక మీడియా థ్రిల్లర్. ఒక నేరం చేస్తూ మీడియా సంస్థకి  దొరికిపోయి  భవిష్యత్తు కోల్పోయిన రాజకీయ నాయకుడు,  అదే మీడియా సంస్థని  ఇంకో స్టింగ్ ఆపరేషన్ కి ఎరవేసి  అల్లరిపాలు చేసి – మొదట తను చేసిన నేరం ఇదే మీడియా సంస్థ సృష్టిగా చిత్రీకరిచడం, తిరిగి రాజకీయ భవిష్యత్తుని పొందడమనే కాన్సెప్ట్ తో తయారయ్యిందీ  థ్రిల్లర్. 

        మీడియా సంస్థలు కూడా అమాయకంగా రాజకీయనాయకులు పన్నే వలలో చిక్కుకుని ఫేక్ న్యూస్ తో అల్లరవగలవన్న ఆసక్తికరమైన సబ్జెక్టుని ఇందులో చూపించారు.

        ఈ జానర్ ఏమిటో అర్ధం జేసుకోకుండా కొందరు ఇందులో ఎంటర్ టైన్మెంట్ లేదనీ, కామెడీ లేదనీ రాసేస్తున్నారు. కామెడీ కోసం, ఎంటర్ టైన్మెంట్ కోసం  ‘కాటమరాయుడు’,  ‘మిస్టర్’ లాంటివి మరోసారి ఎంజాయ్ చేసేసి వెబ్సైట్ల నిండా రాసేసుకోవచ్చు. కామెడీ, ఎంటర్ టైన్మెంట్ లు అవసరం లేని ‘బ్లాక్ మనీ’ లో  అవి లేవని అనాలోచితంగా రాసేస్తే, ప్రేక్షకులకి ఎలాటి సంకేతాలు వెళతాయో ఆలోచించాలి. అయినా ఇంకే భాషలో లేని ఈ కామెడీ, ఎంటర్ టైన్మెంట్ ల పిచ్చేమిటసలు? ఇవి లేని కనుపాప, 16-డి, నగరం, మెట్రో మొదలైనవి శుభ్రంగా చూసేశారుగా  తెలుగు ప్రేక్షకులు!

          ఇందులో కొత్తతరహా పాత్ర మోహన్ లాల్ ది. సుప్రసిద్ధ అంతర్జాతీయ వార్తా సంస్థ ‘రాయిటర్’ కి టీవీ విభాగపు  స్ట్రింగర్ (ఫ్రీలాన్స్) కెమెరా మాన్ అతను. పేరు వేణు. ఢిల్లీలో వుంటాడు. హై ప్రొఫైల్ న్యూస్ కెమెరా మాన్ అతను. ఫిలిం ఇనిస్టిట్యూట్ లో సినిమాటోగ్రఫీలో  గ్రాడ్యుయేషన్ చేసినా, సినిమాల్లో కల్పిత దృశ్యాలు తీస్తారని ఏవగించుకుని, నిజ దృశ్యాలు తీసే టీవీ మీడియాలో  కొచ్చాడు. ఛానెల్స్ కోసం తను తీసే ఫుటేజీల్ని ఎడిట్ చేసినా ఒప్పుకోని తత్త్వం అతడిది. ఎడిట్ చేస్తే చెడామడా తిడతాడు. జరిగిన సంఘటనల్ని జరిగినట్టు చూపించాలే తప్ప, ఛానెల్ కి ఇష్టమైనవే చూపించి అక్రమాలు చేస్తే వూరుకోడు. 

         ఒక కేసు నిమిత్తం ఢిల్లీ నుంచి వస్తే, ఇక్కడ మిత్రుడు రిషి ( బిజూ మోహన్) నడిపే న్యూస్ బ్యూరో ఆఫ్ ఇండియా (ఎన్ బీ ఐ) అనే కొత్త ఛానెల్లో జీతాలు చెల్లించడానికి స్టింగ్ ఆపరేషన్లతో  బ్లాక్ మెయిల్స్ చేస్తూంటాడు. 

          భారత్ విజన్ అనే ఇంకో పెద్ద ఛానెల్ వుంటుంది. ఇక్కడ రేణుక (అమలా పౌల్) రిపోర్టర్ గా పని చేస్తూంటుంది. ఢిల్లీ నుంచి వచ్చిన వేణుకి ఈమెతో పాత శత్రుత్వం మళ్ళీ రగుల్కొంటుంది. శత్రుత్వానికి ముందు ఇద్దరూ ప్రేమికులు. ఐదేళ్ళక్రితం ఆరోజు రేపుదయం పెళ్లి చేసుకోబోతున్నారనగా రాత్రికి రాత్రి  బద్ధ శత్రువులైపోతారు. ఒక వ్యాపారవేత్తకి రాజ్యసభ సీటు ఇప్పించడానికి పార్టీ లీడర్ భవానీ ప్రసాద్ (సాయికుమార్) భారీ మొత్తంలో లంచం తీసుకుంటున్న దృశ్యాన్ని రేణుకతో కలిసి వేణు చిత్ర్రీకరిస్తాడు. ఆ వీడియోతో రేణుక మోసం చేస్తుంది. దాంతో వేణు ఆమెతో తెగతెంపులు చేసుకుని ఆజన్మ శత్రువులా చూస్తూంటాడు. 

          ఇప్పుడు ఐదేళ్ళ తర్వాత ఇదే రేణుకతో వేణుకి ఇంకో ఆపరేషన్ చేయాల్సి వస్తుంది మిత్రుడు రిషి ఛానెల్ని  బతికించడానికి. ఈసారి పార్టీ లీడర్ భవానీ ప్రసాద్ ఒకణ్ణి మర్డర్ చేయడానికి ప్లానేశాడు. ఐదేళ్ళ క్రితం రాజ్యసభ సీటుకి లంచం తీసుకుంటూ దొరికిపోయిన సందర్భంలో, పార్టీపరంగా పతనమయ్యాడు. ఇప్పుడేదో చేసి పోయిన ప్రతిష్ట తిరిగి సంపాదించుకుని  పార్టీలో ఎదగాలనుకుంటున్నాడు సీఎం స్థాయికి. లంచం అప్పుడు ఛానెల్ కి ఉప్పందించిన అనుచరుణ్ణి ఇప్పుడు చంపేస్తే తప్ప పోయిన ప్రతిష్ట తిరిగిరాదని నిర్ణయించుకున్నాడు. 

          ఇలా సుదూరంగా క్లబ్ హౌస్ లో మర్డర్ కి ఏర్పాట్లు చేస్తాడు. వేణూ రేణూలు అక్కడ రహస్యంగా చిత్రీకరించడానికి అట్టహాసంగా రకరకాల అధునాతన రిమోట్ కెమెరాలూ, రోబో కెమెరాలూ ఏర్పాటు చేస్తారు. భవానీ ప్రసాద్ మర్డర్ చేసి శవాన్ని వేలాడదీయిస్తాడు. ఇది ఛానెల్లో ప్రసారమై సంచలనం రేగుతుంది. దీంతో ఛానెల్ ధ్వంసమై, వేణూ రేణూలు నేరస్థులై పారిపోవాల్సి వస్తుంది.

         ఇదేంటి- హత్య చేస్తూ ప్రపంచానికి దొరికిపోయిన భవానీ ప్రసాద్ క్షేమంగా వుండి, దాన్ని చిత్రీ కరించిన వేణూ రేణూలు నేరస్థులుగా పారిపోవడమేమిటి? ఇదెలా  జరిగింది? అసలేం జరిగింది? ఇందులోంచి ఈ ఇద్దరూ ఎలా బయట పడ్డారు? బయటపడకుండా భవానీ ప్రసాద్ ఇంకే వలలు బిగిస్తూ పోయాడు? ... ఇవి తెలుసుకోవాలంటే ఈ ఇంటలిజెంట్ క్రైం డ్రామాని చూడాల్సిందే.

          సస్పెన్స్ థ్రిల్లర్ ఎప్పుడూ తదనంతర పరిణామాలతో సీన్లు అల్లుకుంటూ ముందుకు పరిగెడుతుంది. ఇతర ఫార్ములా మసాలా మాస్ సినిమాలకి ఇలా వుండదు. అందుకే ఇంటర్వెల్ తర్వాత ఎటు వెళ్ళాలో అంతు పట్టక  సెకండాఫ్స్ సెండాఫ్ ఇచ్చేస్తూంటాయి. ఇంటర్వెల్ దగ్గర పాత్రకి ఏర్పాటు చేసిన సమస్య సంగతి క్లయిమాక్స్ లో  చూసుకోవచ్చన్న తేలిక భావంతో  అప్పటిదాకా కామెడీలతో పాటలతో ఫైట్లతో గడిపేస్తారు. 

          సస్పెన్స్  థ్రిల్లర్స్ తో ఇలా సాగదు. అడుగడుగునా what next? ప్రశ్నే పుట్టకపోతే అది బిగిసడలని  సస్పెన్స్  థ్రిల్లర్ అవదు, కూర్చోబెట్టదు. బిగి సడలని కథనం,  కూర్చోబెట్ట గల్గడం- ఈ రెండూ లేకపోతే సస్పన్స్ థ్రిల్లర్ కి నూకలు చెల్లిపోతాయి. ఒక సీనులో ఒక సంఘటన జరిగిందంటే,  దాని పరిణామమేమిటి తర్వాతి సీన్లలో అన్న చందాన కథనం అల్లుకుంటూ పోకపోతే ఈ జానర్ రక్తి కట్టదు. అలా ఒకదానితో ఒకటి పెనవేసుకుపోయే సీన్లలోంచి ఏ వొక్కటి తీసేసినా కథే అర్ధంగానంత గందరగోళం ఏర్పడుతుందన్న మాట. 

          ఈ సినిమాలో అల్లిన సీన్లన్నీ ఇలాంటివే. మొదటి సీను నుంచీ చివరి సీను దాకా వృధాగాఏదీలేదు సరికదా, ఏ వొకటి తీసేసినా సినిమాయే అర్ధంగాకుండా పోయే ప్రమాదముంది. 

          ఇందులో మళ్ళీ ఒక సూపర్ స్టార్ గా మోహన్ లాల్ స్థాయికి తగ్గ చిక్కు ముళ్ళతో, ఇరకాటాలతో దర్శకుడు ఆడుకోవడమే వుంది. మోహన్ లాల్ ఎలాటెలాటి వూహించని ప్రమాదాల్లో ఇరుక్కుంటాడంటే, ఇప్పుడేమిటి- ఎలా బయటపడతాడు- what next?- అన్న ఆదుర్దా కల్గిస్తాడు. అంతే వూహకందని తెలివితేటలతో వాటిలోంచి బయటపడుతూంటాడు. క్లయిమాక్స్ సీన్లో ఇంకా కఠినమైన పరిస్థితిలో ఇరుక్కుంటాడు అమలా పౌల్ తో కలిసి. 

         ఇంటర్వెల్ సీన్ లీడర్ మీద మోహన్ లాల్ పైచేయే అయినా,  ఆ వెంటనే లీడర్ దే పై చేయి అయి క్లయిమాక్స్ దాకా లీడర్ పన్నే వలల్లో దొరక్కుండా తప్పించుకునే యుక్తులే పన్నుతూంటాడు తను. క్లయిమాక్స్ లో లీడర్ మరో మర్డర్ చేయబోతున్నట్టు సమాచారం వదిలి మోహన్ లాల్ ని ట్రాప్ చేసినప్పుడు,  ఆ  మర్డర్ అవబోయేది తనూ అమలా అని గ్రహించి మోహన్ లాల్ ఎలా లీడర్ ని దెబ్బ తీశాడన్నది  అత్యంత బలమైన ముగింపు. 

          ఇందులో మొదటి అరగంట లోపే  మోహన్ లాల్- అమలాల ప్రేమ ఫ్లాష్ బ్యాక్ వస్తుంది. ఇక్కడే లీడర్ లంచం వ్యవహారం పట్టుకున్నప్పుడు అమల మోసం చేసిందని మోహన్ లాల్ విడిపోతాడు. ఇలా ఈ ఫ్లాష్ బ్యాక్  ప్రేమ కథలో వాళ్ళ బ్రేకప్ ని మాత్రమే చూపించదు- ఇందులోని ఆ లీడర్ లంచం ఎపిసోడ్  లోంచే ప్రస్తుత ప్రధాన కథ ప్రారంభం కూడా చూపిస్తుంది. ఇదొక గమ్మత్తయిన క్రియేటివిటీ. కొత్తగా బాగా కుదిరింది. ఎందుకంటే సస్పెన్స్ థ్రిల్లర్ తదనంతర పరిణామాల దొంతరే. ఏదీ వృధాగా వుండదు. ఫ్లాష్ బ్యాక్ లో ఆ లంచం ఎపిసోడ్ మచ్చ రూపు మాపుకోవడానికే లీడర్ ఈ మర్డర్ ఎపిసోడ్ కి తెర తీస్తాడు. ఇది  ప్లాట్ పాయింట్ వన్ ఘట్టం. 

          ప్లాట్ పాయింట్ వన్ ఘట్టంలో  సినిమాల్లో అరుదుగా కన్పించే అన్ని ఎలిమెంట్స్ ఇక్కడ కనిపిస్తాయి : 1. కోరిక, 2. పణం, 3. పరిణామాల హెచ్చరిక, 4. ఎమోషన్ అన్నవి.  నిజానికి  ఒక మనిషిని హత్య చేస్తోంటే ఆపాలిగానీ, దాన్ని కెమెరాతో షూట్ చేసి ఛానెల్ పాపులారిటీ పెంచుకోవడం నీతి కాదని వ్యతిరేకిస్తాడు మోహన్ లాల్. అయితే ఆ పవర్ఫుల్ లీడర్ చేతిలో ఈ హత్యని ఆపడం ఎవరితరం కాదని తెలుస్తుంది. హత్యని ఆపలేనప్పుడు హంతకుణ్ణి పట్టుకోవడమే నీతి అన్న వాదం ఎదురవుతుంది. 

       1. కోరిక : మిత్రుడి ఛానెల్ ని బతికించడానికి ఈ ఆపరేషన్ని  చేపట్టాలన్న కోరిక వుంది  మోహన్ లాల్ కి, 2. పణం : దీనికి తన నీతినే  పణంగా పెట్టాల్సి వస్తోంది, 3. పరిణామాల హెచ్చరిక : ఆ పవర్ఫుల్ లీడర్ మీద రెండో సారి ఆపరేషన్ ఏ కొంచెం అటు ఇటైనా తన పేరుమోసిన స్ట్రింగర్ కెమెరామాన్ వృత్తినే కోల్పోతాడు, 4. ఎమోషన్ : ఒక హత్యని  ఆపలేకపోతున్న నిస్సహాయత, వృత్తిరీత్యా విశ్వనీయత కోల్పోతానన్న ఆందోళనా కలిసి సంక్షుభిత ఎమోషన్ ని క్రియేట్ చేశాయి. అతడి మోరల్ కంపాస్ ని ఛిన్నాభిన్నం చేశాయి. 

          దీంతో ఈ పాత్రని  మనం పట్టించుకు తీరాల్సిన అనివార్య పరిస్థితి ఏర్పడింది :
 get your audiences to root for your  character  అనే నియమపాలన ఇక్కడ ఇంత బలంగా ఖచ్చితంగా జరిగింది. వృత్తిలో విలువలకోసం తగాదాలు పెట్టుకునే మోహన్ లాల్ ఆ విలువలకే తిలోదకాలిచ్చే  మోరల్ డైలెమాలో పడేకన్నా బలమైన ప్లాట్ పాయింట్ వన్ ఏముంటుంది? 

          అక్కడికీ హత్య జరిగిపోతూంటే ఆపాలనుకుని వెళ్లిపోబోతూంటే అమల వెనక్కి లాగి పడేస్తుంది. ఈ ప్లాట్ పాయింట్ వన్ ఘట్టంలో చాలా డ్రామా వుంటుంది- మానసిక సంఘర్షణల్లోంచి పుట్టుకొచ్చే సహజ, ప్యూర్ డ్రామా. అనుకున్నట్టే ఈ ప్లాట్ పాయింట్ వన్ ఘట్టం పూర్తయి దానికదే ఎదురు తన్నుతుంది!  ఎదురు తన్నక పోతే అది విలన్ పాత్రచిత్రణే కాదు. లంచం ఎపిసోడ్ అప్పుడు తెలీక దొరికిపోయిన లీడర్ తెలిసీ మళ్ళీ దొరికిపోవాలనుకోడు- హీరోనే  ఇరికించి తప్పించుకోవాలనుకుంటాడు.  

          ఇదే జరిగి మోహన్ లాల్ అమలతోపాటు  అజ్ఞాతంలోకి పారిపోవాల్సి వస్తుంది. మార్కెట్ లో  విశ్వసనీయత కోల్పోయి, రాయిటర్స్ తో  కాంట్రాక్ట్ కోల్పోయి, మిత్రుడి ఛానెల్ ముక్కచెక్కలై, కేసులు మీద పడి  పక్కా నేరస్థుడి స్థితికి దిగజారి పోతాడు. 

          ఇంతకంటే హీరోయిజం ఏం కావాలి మోహన్ లాల్ స్టేచర్ కి. ఇవన్నీ తట్టుకుని, తేరుకుని, పైకిలేచి తన్నే వాడే కదా నిజమైన హీరో. వీటికి  తోడూ ఇంకో ఎమోషనల్ ప్రాబ్లం వుంది- తోకలా తనతో వుంటున్న పాత శత్రువు అమల. ఈమెని పోలీసులకి పట్టించి వదిలించు కోవాలనుకుంటాడు కూడా. బంకలా పట్టుకుని వుంటుంది. ఈ ఏకాంతంలో కూడా, ఈ కష్ట సమయంలో కూడా  పాత  ప్రేమలు తిరిగి పుట్టుకురావడానికి అవకాశం లేదు. బలమైన పాత్రలకి అలాంటిది వుండదు. వృత్తి విలువ దిగజార్చిన ఆమెతో ప్రేమనే తెంచుకున్నాడు. ఆమె కూడా ఐదేళ్ళ క్రితం చేసిన తప్పుకి క్షమాపణ కోరే బలహీనురాలు కాదు. అందుకే అతణ్ణి టీజ్ చేసి, కవ్వించి, నవ్వించి, డ్రీం సాంగ్స్ వేసుకుని సొంతం చేసుకునే నీచానికి పాల్పడదు. మరి వీళ్ళ మధ్య పెరిగిపోతున్న ఈ టెన్షన్ తీరేదెలా? ఇదే ‘చెలియా’ లో  మణిరత్నం చేయలేక చేతులెత్తేశాడు. జోషి 2012 లోనే,  దీన్నే రెండు హై టెన్షన్ వైర్లు గా చేసి, ఎప్పుడప్పుడు షార్ట్ సర్క్యూట్ అవుతాయా  అని చివరిదాకా వూరించాడు. 

         ఇక్కడ సస్పెన్సు కోసం ప్లాట్ పాయింట్ - టూ  ఘట్టాన్ని వివరించడం లేదు. ఈ క్రైం డ్రామాకి  క్లయిమాక్స్ ఒక సంతృప్తికరమైన ఆర్ట్ వర్క్ అనొచ్చు.

          సీనియర్ దర్శకుడు జోషి ఎక్కడా చాదస్తాలకి పోకుండా, కథనుంచి పక్క దార్లు పట్టకుండా- ఆధునిక ఎలక్ట్రానిక్ మీడియా వ్యవస్థని టెక్నాలజీ పరంగా ఇంకే సినిమాలోనూ చూపించని విధంగా- మీడియా పాత్రల్ని ఇంకే సినిమాలోనూ చూపించనంత ప్రొఫెషనల్ గా, అడుగడుగునా వాస్తవిక దృక్పథంతో థ్రిల్ చేస్తూ ఉన్నత స్థాయి చిత్రీకరణ చేశారు. కెమెరా మాన్ రాజశేఖర్ అద్భుత పనితనాన్ని కనబర్చాడు. సంగీత దర్శకుడు రతీష్ వేగా మాత్రం సెకండాఫ్ వచ్చేసరికి వేగాన్ని కంట్రోలు చేసుకోలేకపోయాడు. ఇంటర్వెల్ కే సినిమాతో దిమ్మదిరిగినట్టు, సెకండాఫ్ అంతా సౌండు పెంచేసి  హుదూద్ తూఫాను లాంటిది  సృష్టిస్తే తప్ప, ఈ సస్పెన్స్ థ్రిల్లర్ కి న్యాయం చేయలేనని తెగ ఫీలైపోయినట్టు కన్పిస్తాడు.    

          లాజికల్ గా ప్లాట్ పాయింట్ వన్ ఘట్టంలో ఏర్పాటు చేసిన రహస్య కెమెరాల పొజిష నింగుతో ప్రాబ్లం వుంది. ఆ కెమెరాల కళ్ళు గప్పి లీడర్ శవంతో కనికట్టు చేయడం సాధ్యం కాదు. కానీ దీనికి పరిష్కారం కూడా లేదు- అయితే ఇలాటి థ్రిల్లర్స్ లాజికల్ గా లోపాలు లేకుండా వుండాల్సిన అవసరముంది. 

          మళ్ళీ శుక్రవారం ‘బాహుబలి -2’ వచ్చేవరకూ ‘బ్లాక్ మనీ’ కి మార్కెట్లో పోటీ లేదు. ఒక సస్పెన్స్ థ్రిల్లర్ లో సమాంతరంగా మోహన్ లాల్- అమలా పౌల్ ల విచిత్ర బాండింగ్ కూడా చూసి ఈ వేసవిలో ఏసీ లేకుండా ఎంజాయ్ చేసేందుకు ఇదొక అవకాశం. ఎప్పుడో ఐదేళ్ళ క్రితం తీసిన సినిమాలా అన్పించక, ఇప్పుడే తీసి విడుదల చేసిన ఫ్రెష్ నెస్  అన్నిటా కన్పించడం ఈ డబ్బింగ్ ప్రత్యేకత.

- సికిందర్
http://www.cinemabazaar.in