రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

21, ఏప్రిల్ 2017, శుక్రవారం

రివ్యూ!









దర్శకత్వం : జోషి 

తారాగణం : మోహన్ లాల్, అమలా పౌల్, సాయికుమార్, బిజూ మోహన్, సిద్దీఖ్, అమీర్ నియాజ్ తదితరులు
రచన :  సాచీ, మాటలు : శశాంక్ వెన్నెలకంటి, సంగీతం : రతీష్ వేగా, ఛాయాగ్రహణం : ఆర్డీ రాజశేఖర్
బ్యానర్ : మ్యాజీన్ మూవీ మేకర్స్
నిర్మాత : సయ్యద్ నిజాముద్దీన్
విడుదల : ఏప్రిల్ 21, 2017

         ***
         మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ తెలుగు ప్రేక్షకుల దృష్టిలో పడి బాక్సాఫీసుకి ఇంకో చేరిక అయ్యాక అడపదపా ఆయన డబ్బింగులు విడుదలవుతున్నాయి. ‘మన్యం పులి’, ‘కనుపాప’ లని కూడా తెలుగులో బాగానే చూశారు. ఇప్పుడు తాజాగా పాత మలయాళం ఒకటి దులిపి తీసి తెలుగు ప్రేక్షకుల ముందుంచారు. 2012 లో మలయాళంలో ఘన విజయం సాధించిన ‘రన్ బేబీ రన్’ అనే సస్పెన్స్ థ్రిల్లర్ ని  తెలుగులో ‘బ్లాక్ మనీ- అన్నీ కొత్త నోట్లే’ గా విడుదల చేశారు. ఈ వారం మొత్తం 6 చిన్నాచితకా సినిమాలు విడుదలయ్యాయి తెలుగులో : లంక, దడపుట్టిస్తా, ఇద్దరి మధ్య 18, బాయ్ ఫ్రెండ్, ఒక పరిచయం, రిజర్వేషన్. ఇవికాక ‘బ్లాక్ మనీ’ తో కలుపుకుని పిశాచి -2, మాచిదేవ అనే మూడు డబ్బింగులు విడుదలయ్యాయి. ఈ మొత్తం తొమ్మిది సినిమాల్లో ఒక్క ‘బ్లాక్ మనీ’ కే  ప్రేక్షకులున్నారు. ఆరుకి ఆరూ తెలుగు సినిమాలన్నీ ప్రేక్షకుల్లేక యధావిధిగా ఇబ్బంది పడుతున్నాయి. 

          వే పేలవమైన ప్రేమలు, అవే రొటీన్ హార్రర్ లు తీయడం తప్ప ఇంకో  పనే లేకుండా పోయింది తెలుగు నిర్మాతలకీ దర్శకులకీ.  సస్పెన్స్ థ్రిల్లర్స్ తీసే పరిజ్ఞానం ఇప్పటి దర్శకులకి శూన్యం అవడంచేత అవే అర్ధం లేని ప్రేమలు కొందరు, టెంప్లెట్ హార్రర్ లు కొందరూ ఇంకా తీసుకుంటూ కాలం గడుపుతున్నారు. ఇవైనా పద్ధతిగా తీస్తే ఏ సమస్యా వుండదు. పద్ధతేమిటో కూడా తెలీక  ప్రేక్షకుల్ని దూరం చేసుకుంటున్నారు. తెలుగులో ఓపెన్ గా వున్న సస్పెన్స్ థ్రిల్లర్స్, డార్క్ మూవీస్ మార్కెట్ ని తమిళ మలయాళ సినిమాలు ఇలా  వచ్చేసి భర్తీ చేస్తూ సొమ్ములు చేసుకుంటున్నా కూడా  ఈ దిశగా స్పృహ తెచ్చుకోవడం లేదు.

          ‘బ్లాక్ మనీ’ దర్శకుడు జోషీ చాలా సీనియర్ దర్శకుడు. 1978 లో మలయాళంలో  రంగప్రవేశం చేసిన ఆయన నాటి నుంచి నేటి వరకూ 81 సినిమాలు తీశారు. 1988 లో కృష్ణంరాజు తో ‘అంతిమ తీర్పు’ అనే సూపర్  హిట్ తీశారు. తాజాగా 2015 లో  ఆయన తీసిన ఒక మలయాళం మోహన్ లాల్- సత్యరాజ్ లతో ‘ఇద్దరూ ఇద్దరే’ గా తెలుగులో డబ్ అయింది. ఇది ఆడలేదు. ఈ సినిమాతో ఆయన పూర్వపు టచ్, నైపుణ్యం కోల్పోయారు. కానీ 2012 లోనే తీసిన ‘బ్లాక్ మనీ’ తో అత్యంత ప్రతిభని చాటుకుంటూ ఆశ్చర్య పర్చారు. ఇప్పటి టెక్నిక్, టెక్నాలజీ తెలిసిన సమర్ధుడైన ఏ కొత్త దర్శకుడో తీసినట్టు పకడ్బందీగా తీశారు!

       ‘బ్లాక్ మనీ’  ఒక మీడియా థ్రిల్లర్. ఒక నేరం చేస్తూ మీడియా సంస్థకి  దొరికిపోయి  భవిష్యత్తు కోల్పోయిన రాజకీయ నాయకుడు,  అదే మీడియా సంస్థని  ఇంకో స్టింగ్ ఆపరేషన్ కి ఎరవేసి  అల్లరిపాలు చేసి – మొదట తను చేసిన నేరం ఇదే మీడియా సంస్థ సృష్టిగా చిత్రీకరిచడం, తిరిగి రాజకీయ భవిష్యత్తుని పొందడమనే కాన్సెప్ట్ తో తయారయ్యిందీ  థ్రిల్లర్. 

        మీడియా సంస్థలు కూడా అమాయకంగా రాజకీయనాయకులు పన్నే వలలో చిక్కుకుని ఫేక్ న్యూస్ తో అల్లరవగలవన్న ఆసక్తికరమైన సబ్జెక్టుని ఇందులో చూపించారు.

        ఈ జానర్ ఏమిటో అర్ధం జేసుకోకుండా కొందరు ఇందులో ఎంటర్ టైన్మెంట్ లేదనీ, కామెడీ లేదనీ రాసేస్తున్నారు. కామెడీ కోసం, ఎంటర్ టైన్మెంట్ కోసం  ‘కాటమరాయుడు’,  ‘మిస్టర్’ లాంటివి మరోసారి ఎంజాయ్ చేసేసి వెబ్సైట్ల నిండా రాసేసుకోవచ్చు. కామెడీ, ఎంటర్ టైన్మెంట్ లు అవసరం లేని ‘బ్లాక్ మనీ’ లో  అవి లేవని అనాలోచితంగా రాసేస్తే, ప్రేక్షకులకి ఎలాటి సంకేతాలు వెళతాయో ఆలోచించాలి. అయినా ఇంకే భాషలో లేని ఈ కామెడీ, ఎంటర్ టైన్మెంట్ ల పిచ్చేమిటసలు? ఇవి లేని కనుపాప, 16-డి, నగరం, మెట్రో మొదలైనవి శుభ్రంగా చూసేశారుగా  తెలుగు ప్రేక్షకులు!

          ఇందులో కొత్తతరహా పాత్ర మోహన్ లాల్ ది. సుప్రసిద్ధ అంతర్జాతీయ వార్తా సంస్థ ‘రాయిటర్’ కి టీవీ విభాగపు  స్ట్రింగర్ (ఫ్రీలాన్స్) కెమెరా మాన్ అతను. పేరు వేణు. ఢిల్లీలో వుంటాడు. హై ప్రొఫైల్ న్యూస్ కెమెరా మాన్ అతను. ఫిలిం ఇనిస్టిట్యూట్ లో సినిమాటోగ్రఫీలో  గ్రాడ్యుయేషన్ చేసినా, సినిమాల్లో కల్పిత దృశ్యాలు తీస్తారని ఏవగించుకుని, నిజ దృశ్యాలు తీసే టీవీ మీడియాలో  కొచ్చాడు. ఛానెల్స్ కోసం తను తీసే ఫుటేజీల్ని ఎడిట్ చేసినా ఒప్పుకోని తత్త్వం అతడిది. ఎడిట్ చేస్తే చెడామడా తిడతాడు. జరిగిన సంఘటనల్ని జరిగినట్టు చూపించాలే తప్ప, ఛానెల్ కి ఇష్టమైనవే చూపించి అక్రమాలు చేస్తే వూరుకోడు. 

         ఒక కేసు నిమిత్తం ఢిల్లీ నుంచి వస్తే, ఇక్కడ మిత్రుడు రిషి ( బిజూ మోహన్) నడిపే న్యూస్ బ్యూరో ఆఫ్ ఇండియా (ఎన్ బీ ఐ) అనే కొత్త ఛానెల్లో జీతాలు చెల్లించడానికి స్టింగ్ ఆపరేషన్లతో  బ్లాక్ మెయిల్స్ చేస్తూంటాడు. 

          భారత్ విజన్ అనే ఇంకో పెద్ద ఛానెల్ వుంటుంది. ఇక్కడ రేణుక (అమలా పౌల్) రిపోర్టర్ గా పని చేస్తూంటుంది. ఢిల్లీ నుంచి వచ్చిన వేణుకి ఈమెతో పాత శత్రుత్వం మళ్ళీ రగుల్కొంటుంది. శత్రుత్వానికి ముందు ఇద్దరూ ప్రేమికులు. ఐదేళ్ళక్రితం ఆరోజు రేపుదయం పెళ్లి చేసుకోబోతున్నారనగా రాత్రికి రాత్రి  బద్ధ శత్రువులైపోతారు. ఒక వ్యాపారవేత్తకి రాజ్యసభ సీటు ఇప్పించడానికి పార్టీ లీడర్ భవానీ ప్రసాద్ (సాయికుమార్) భారీ మొత్తంలో లంచం తీసుకుంటున్న దృశ్యాన్ని రేణుకతో కలిసి వేణు చిత్ర్రీకరిస్తాడు. ఆ వీడియోతో రేణుక మోసం చేస్తుంది. దాంతో వేణు ఆమెతో తెగతెంపులు చేసుకుని ఆజన్మ శత్రువులా చూస్తూంటాడు. 

          ఇప్పుడు ఐదేళ్ళ తర్వాత ఇదే రేణుకతో వేణుకి ఇంకో ఆపరేషన్ చేయాల్సి వస్తుంది మిత్రుడు రిషి ఛానెల్ని  బతికించడానికి. ఈసారి పార్టీ లీడర్ భవానీ ప్రసాద్ ఒకణ్ణి మర్డర్ చేయడానికి ప్లానేశాడు. ఐదేళ్ళ క్రితం రాజ్యసభ సీటుకి లంచం తీసుకుంటూ దొరికిపోయిన సందర్భంలో, పార్టీపరంగా పతనమయ్యాడు. ఇప్పుడేదో చేసి పోయిన ప్రతిష్ట తిరిగి సంపాదించుకుని  పార్టీలో ఎదగాలనుకుంటున్నాడు సీఎం స్థాయికి. లంచం అప్పుడు ఛానెల్ కి ఉప్పందించిన అనుచరుణ్ణి ఇప్పుడు చంపేస్తే తప్ప పోయిన ప్రతిష్ట తిరిగిరాదని నిర్ణయించుకున్నాడు. 

          ఇలా సుదూరంగా క్లబ్ హౌస్ లో మర్డర్ కి ఏర్పాట్లు చేస్తాడు. వేణూ రేణూలు అక్కడ రహస్యంగా చిత్రీకరించడానికి అట్టహాసంగా రకరకాల అధునాతన రిమోట్ కెమెరాలూ, రోబో కెమెరాలూ ఏర్పాటు చేస్తారు. భవానీ ప్రసాద్ మర్డర్ చేసి శవాన్ని వేలాడదీయిస్తాడు. ఇది ఛానెల్లో ప్రసారమై సంచలనం రేగుతుంది. దీంతో ఛానెల్ ధ్వంసమై, వేణూ రేణూలు నేరస్థులై పారిపోవాల్సి వస్తుంది.

         ఇదేంటి- హత్య చేస్తూ ప్రపంచానికి దొరికిపోయిన భవానీ ప్రసాద్ క్షేమంగా వుండి, దాన్ని చిత్రీ కరించిన వేణూ రేణూలు నేరస్థులుగా పారిపోవడమేమిటి? ఇదెలా  జరిగింది? అసలేం జరిగింది? ఇందులోంచి ఈ ఇద్దరూ ఎలా బయట పడ్డారు? బయటపడకుండా భవానీ ప్రసాద్ ఇంకే వలలు బిగిస్తూ పోయాడు? ... ఇవి తెలుసుకోవాలంటే ఈ ఇంటలిజెంట్ క్రైం డ్రామాని చూడాల్సిందే.

          సస్పెన్స్ థ్రిల్లర్ ఎప్పుడూ తదనంతర పరిణామాలతో సీన్లు అల్లుకుంటూ ముందుకు పరిగెడుతుంది. ఇతర ఫార్ములా మసాలా మాస్ సినిమాలకి ఇలా వుండదు. అందుకే ఇంటర్వెల్ తర్వాత ఎటు వెళ్ళాలో అంతు పట్టక  సెకండాఫ్స్ సెండాఫ్ ఇచ్చేస్తూంటాయి. ఇంటర్వెల్ దగ్గర పాత్రకి ఏర్పాటు చేసిన సమస్య సంగతి క్లయిమాక్స్ లో  చూసుకోవచ్చన్న తేలిక భావంతో  అప్పటిదాకా కామెడీలతో పాటలతో ఫైట్లతో గడిపేస్తారు. 

          సస్పెన్స్  థ్రిల్లర్స్ తో ఇలా సాగదు. అడుగడుగునా what next? ప్రశ్నే పుట్టకపోతే అది బిగిసడలని  సస్పెన్స్  థ్రిల్లర్ అవదు, కూర్చోబెట్టదు. బిగి సడలని కథనం,  కూర్చోబెట్ట గల్గడం- ఈ రెండూ లేకపోతే సస్పన్స్ థ్రిల్లర్ కి నూకలు చెల్లిపోతాయి. ఒక సీనులో ఒక సంఘటన జరిగిందంటే,  దాని పరిణామమేమిటి తర్వాతి సీన్లలో అన్న చందాన కథనం అల్లుకుంటూ పోకపోతే ఈ జానర్ రక్తి కట్టదు. అలా ఒకదానితో ఒకటి పెనవేసుకుపోయే సీన్లలోంచి ఏ వొక్కటి తీసేసినా కథే అర్ధంగానంత గందరగోళం ఏర్పడుతుందన్న మాట. 

          ఈ సినిమాలో అల్లిన సీన్లన్నీ ఇలాంటివే. మొదటి సీను నుంచీ చివరి సీను దాకా వృధాగాఏదీలేదు సరికదా, ఏ వొకటి తీసేసినా సినిమాయే అర్ధంగాకుండా పోయే ప్రమాదముంది. 

          ఇందులో మళ్ళీ ఒక సూపర్ స్టార్ గా మోహన్ లాల్ స్థాయికి తగ్గ చిక్కు ముళ్ళతో, ఇరకాటాలతో దర్శకుడు ఆడుకోవడమే వుంది. మోహన్ లాల్ ఎలాటెలాటి వూహించని ప్రమాదాల్లో ఇరుక్కుంటాడంటే, ఇప్పుడేమిటి- ఎలా బయటపడతాడు- what next?- అన్న ఆదుర్దా కల్గిస్తాడు. అంతే వూహకందని తెలివితేటలతో వాటిలోంచి బయటపడుతూంటాడు. క్లయిమాక్స్ సీన్లో ఇంకా కఠినమైన పరిస్థితిలో ఇరుక్కుంటాడు అమలా పౌల్ తో కలిసి. 

         ఇంటర్వెల్ సీన్ లీడర్ మీద మోహన్ లాల్ పైచేయే అయినా,  ఆ వెంటనే లీడర్ దే పై చేయి అయి క్లయిమాక్స్ దాకా లీడర్ పన్నే వలల్లో దొరక్కుండా తప్పించుకునే యుక్తులే పన్నుతూంటాడు తను. క్లయిమాక్స్ లో లీడర్ మరో మర్డర్ చేయబోతున్నట్టు సమాచారం వదిలి మోహన్ లాల్ ని ట్రాప్ చేసినప్పుడు,  ఆ  మర్డర్ అవబోయేది తనూ అమలా అని గ్రహించి మోహన్ లాల్ ఎలా లీడర్ ని దెబ్బ తీశాడన్నది  అత్యంత బలమైన ముగింపు. 

          ఇందులో మొదటి అరగంట లోపే  మోహన్ లాల్- అమలాల ప్రేమ ఫ్లాష్ బ్యాక్ వస్తుంది. ఇక్కడే లీడర్ లంచం వ్యవహారం పట్టుకున్నప్పుడు అమల మోసం చేసిందని మోహన్ లాల్ విడిపోతాడు. ఇలా ఈ ఫ్లాష్ బ్యాక్  ప్రేమ కథలో వాళ్ళ బ్రేకప్ ని మాత్రమే చూపించదు- ఇందులోని ఆ లీడర్ లంచం ఎపిసోడ్  లోంచే ప్రస్తుత ప్రధాన కథ ప్రారంభం కూడా చూపిస్తుంది. ఇదొక గమ్మత్తయిన క్రియేటివిటీ. కొత్తగా బాగా కుదిరింది. ఎందుకంటే సస్పెన్స్ థ్రిల్లర్ తదనంతర పరిణామాల దొంతరే. ఏదీ వృధాగా వుండదు. ఫ్లాష్ బ్యాక్ లో ఆ లంచం ఎపిసోడ్ మచ్చ రూపు మాపుకోవడానికే లీడర్ ఈ మర్డర్ ఎపిసోడ్ కి తెర తీస్తాడు. ఇది  ప్లాట్ పాయింట్ వన్ ఘట్టం. 

          ప్లాట్ పాయింట్ వన్ ఘట్టంలో  సినిమాల్లో అరుదుగా కన్పించే అన్ని ఎలిమెంట్స్ ఇక్కడ కనిపిస్తాయి : 1. కోరిక, 2. పణం, 3. పరిణామాల హెచ్చరిక, 4. ఎమోషన్ అన్నవి.  నిజానికి  ఒక మనిషిని హత్య చేస్తోంటే ఆపాలిగానీ, దాన్ని కెమెరాతో షూట్ చేసి ఛానెల్ పాపులారిటీ పెంచుకోవడం నీతి కాదని వ్యతిరేకిస్తాడు మోహన్ లాల్. అయితే ఆ పవర్ఫుల్ లీడర్ చేతిలో ఈ హత్యని ఆపడం ఎవరితరం కాదని తెలుస్తుంది. హత్యని ఆపలేనప్పుడు హంతకుణ్ణి పట్టుకోవడమే నీతి అన్న వాదం ఎదురవుతుంది. 

       1. కోరిక : మిత్రుడి ఛానెల్ ని బతికించడానికి ఈ ఆపరేషన్ని  చేపట్టాలన్న కోరిక వుంది  మోహన్ లాల్ కి, 2. పణం : దీనికి తన నీతినే  పణంగా పెట్టాల్సి వస్తోంది, 3. పరిణామాల హెచ్చరిక : ఆ పవర్ఫుల్ లీడర్ మీద రెండో సారి ఆపరేషన్ ఏ కొంచెం అటు ఇటైనా తన పేరుమోసిన స్ట్రింగర్ కెమెరామాన్ వృత్తినే కోల్పోతాడు, 4. ఎమోషన్ : ఒక హత్యని  ఆపలేకపోతున్న నిస్సహాయత, వృత్తిరీత్యా విశ్వనీయత కోల్పోతానన్న ఆందోళనా కలిసి సంక్షుభిత ఎమోషన్ ని క్రియేట్ చేశాయి. అతడి మోరల్ కంపాస్ ని ఛిన్నాభిన్నం చేశాయి. 

          దీంతో ఈ పాత్రని  మనం పట్టించుకు తీరాల్సిన అనివార్య పరిస్థితి ఏర్పడింది :
 get your audiences to root for your  character  అనే నియమపాలన ఇక్కడ ఇంత బలంగా ఖచ్చితంగా జరిగింది. వృత్తిలో విలువలకోసం తగాదాలు పెట్టుకునే మోహన్ లాల్ ఆ విలువలకే తిలోదకాలిచ్చే  మోరల్ డైలెమాలో పడేకన్నా బలమైన ప్లాట్ పాయింట్ వన్ ఏముంటుంది? 

          అక్కడికీ హత్య జరిగిపోతూంటే ఆపాలనుకుని వెళ్లిపోబోతూంటే అమల వెనక్కి లాగి పడేస్తుంది. ఈ ప్లాట్ పాయింట్ వన్ ఘట్టంలో చాలా డ్రామా వుంటుంది- మానసిక సంఘర్షణల్లోంచి పుట్టుకొచ్చే సహజ, ప్యూర్ డ్రామా. అనుకున్నట్టే ఈ ప్లాట్ పాయింట్ వన్ ఘట్టం పూర్తయి దానికదే ఎదురు తన్నుతుంది!  ఎదురు తన్నక పోతే అది విలన్ పాత్రచిత్రణే కాదు. లంచం ఎపిసోడ్ అప్పుడు తెలీక దొరికిపోయిన లీడర్ తెలిసీ మళ్ళీ దొరికిపోవాలనుకోడు- హీరోనే  ఇరికించి తప్పించుకోవాలనుకుంటాడు.  

          ఇదే జరిగి మోహన్ లాల్ అమలతోపాటు  అజ్ఞాతంలోకి పారిపోవాల్సి వస్తుంది. మార్కెట్ లో  విశ్వసనీయత కోల్పోయి, రాయిటర్స్ తో  కాంట్రాక్ట్ కోల్పోయి, మిత్రుడి ఛానెల్ ముక్కచెక్కలై, కేసులు మీద పడి  పక్కా నేరస్థుడి స్థితికి దిగజారి పోతాడు. 

          ఇంతకంటే హీరోయిజం ఏం కావాలి మోహన్ లాల్ స్టేచర్ కి. ఇవన్నీ తట్టుకుని, తేరుకుని, పైకిలేచి తన్నే వాడే కదా నిజమైన హీరో. వీటికి  తోడూ ఇంకో ఎమోషనల్ ప్రాబ్లం వుంది- తోకలా తనతో వుంటున్న పాత శత్రువు అమల. ఈమెని పోలీసులకి పట్టించి వదిలించు కోవాలనుకుంటాడు కూడా. బంకలా పట్టుకుని వుంటుంది. ఈ ఏకాంతంలో కూడా, ఈ కష్ట సమయంలో కూడా  పాత  ప్రేమలు తిరిగి పుట్టుకురావడానికి అవకాశం లేదు. బలమైన పాత్రలకి అలాంటిది వుండదు. వృత్తి విలువ దిగజార్చిన ఆమెతో ప్రేమనే తెంచుకున్నాడు. ఆమె కూడా ఐదేళ్ళ క్రితం చేసిన తప్పుకి క్షమాపణ కోరే బలహీనురాలు కాదు. అందుకే అతణ్ణి టీజ్ చేసి, కవ్వించి, నవ్వించి, డ్రీం సాంగ్స్ వేసుకుని సొంతం చేసుకునే నీచానికి పాల్పడదు. మరి వీళ్ళ మధ్య పెరిగిపోతున్న ఈ టెన్షన్ తీరేదెలా? ఇదే ‘చెలియా’ లో  మణిరత్నం చేయలేక చేతులెత్తేశాడు. జోషి 2012 లోనే,  దీన్నే రెండు హై టెన్షన్ వైర్లు గా చేసి, ఎప్పుడప్పుడు షార్ట్ సర్క్యూట్ అవుతాయా  అని చివరిదాకా వూరించాడు. 

         ఇక్కడ సస్పెన్సు కోసం ప్లాట్ పాయింట్ - టూ  ఘట్టాన్ని వివరించడం లేదు. ఈ క్రైం డ్రామాకి  క్లయిమాక్స్ ఒక సంతృప్తికరమైన ఆర్ట్ వర్క్ అనొచ్చు.

          సీనియర్ దర్శకుడు జోషి ఎక్కడా చాదస్తాలకి పోకుండా, కథనుంచి పక్క దార్లు పట్టకుండా- ఆధునిక ఎలక్ట్రానిక్ మీడియా వ్యవస్థని టెక్నాలజీ పరంగా ఇంకే సినిమాలోనూ చూపించని విధంగా- మీడియా పాత్రల్ని ఇంకే సినిమాలోనూ చూపించనంత ప్రొఫెషనల్ గా, అడుగడుగునా వాస్తవిక దృక్పథంతో థ్రిల్ చేస్తూ ఉన్నత స్థాయి చిత్రీకరణ చేశారు. కెమెరా మాన్ రాజశేఖర్ అద్భుత పనితనాన్ని కనబర్చాడు. సంగీత దర్శకుడు రతీష్ వేగా మాత్రం సెకండాఫ్ వచ్చేసరికి వేగాన్ని కంట్రోలు చేసుకోలేకపోయాడు. ఇంటర్వెల్ కే సినిమాతో దిమ్మదిరిగినట్టు, సెకండాఫ్ అంతా సౌండు పెంచేసి  హుదూద్ తూఫాను లాంటిది  సృష్టిస్తే తప్ప, ఈ సస్పెన్స్ థ్రిల్లర్ కి న్యాయం చేయలేనని తెగ ఫీలైపోయినట్టు కన్పిస్తాడు.    

          లాజికల్ గా ప్లాట్ పాయింట్ వన్ ఘట్టంలో ఏర్పాటు చేసిన రహస్య కెమెరాల పొజిష నింగుతో ప్రాబ్లం వుంది. ఆ కెమెరాల కళ్ళు గప్పి లీడర్ శవంతో కనికట్టు చేయడం సాధ్యం కాదు. కానీ దీనికి పరిష్కారం కూడా లేదు- అయితే ఇలాటి థ్రిల్లర్స్ లాజికల్ గా లోపాలు లేకుండా వుండాల్సిన అవసరముంది. 

          మళ్ళీ శుక్రవారం ‘బాహుబలి -2’ వచ్చేవరకూ ‘బ్లాక్ మనీ’ కి మార్కెట్లో పోటీ లేదు. ఒక సస్పెన్స్ థ్రిల్లర్ లో సమాంతరంగా మోహన్ లాల్- అమలా పౌల్ ల విచిత్ర బాండింగ్ కూడా చూసి ఈ వేసవిలో ఏసీ లేకుండా ఎంజాయ్ చేసేందుకు ఇదొక అవకాశం. ఎప్పుడో ఐదేళ్ళ క్రితం తీసిన సినిమాలా అన్పించక, ఇప్పుడే తీసి విడుదల చేసిన ఫ్రెష్ నెస్  అన్నిటా కన్పించడం ఈ డబ్బింగ్ ప్రత్యేకత.

- సికిందర్
http://www.cinemabazaar.in