రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

11, జనవరి 2022, మంగళవారం

1115 : స్క్రీన్ ప్లే సంగతులు


            తెలుగు సినిమా ప్రేక్షకుల్లో కోవిడ్ వల్ల కన్పిస్తున్న మార్పేమిటంటే, రెగ్యులర్ ఫార్ములా కథలకి తోడు భిన్న కథా శైలుల్ని ఆదరించే ఆధునికత్వాన్నికూడా అలవర్చుకోవడం. కోవిడ్ ఓటీటీని వెంట బెట్టుకొచ్చి ఇంటింటా అంటించింది. దాంతో ప్రపంచంలో ఎక్కడి ఏ భాషా సినిమాల్నైనా చూసే అవకాశంతో సినిమా చూసే దృక్పథాన్నే మార్చేసుకున్నారు. అన్ని సినిమాలూ మెయిన్ స్ట్రీమ్ సినిమాలే అనే లౌకికతత్వాన్ని ప్రదర్శించడం మొదలెట్టారు. ఓటీటీకి పూర్వం వరల్డ్ సినిమాలున్నాయి. కానీ వాటికి అలవాటు పడలేదు, వాటిని మన టేస్టుకి సరిపడని పరాయి సినిమాలన్నట్టుగానే చూశారు. ఇప్పుడలా కాదు, తెలుగు సినిమాల్ని సైతం ఎలాటి కథా శైలులతో నైనా  చూసేందుకు ముందుకొస్తున్నారు.


        సింప్లీకరించి చెప్పుకోవాలంటే త్రీ యాక్ట్ స్ట్రక్చరే ఇక సినిమాల కుండనవసరం లేదు. ప్రేక్షకులిస్తున్న అనుమతితో కథ ఎలా చెప్పుకుంటూ పోవాలన్నా పోవచ్చు. ప్రేక్షకులు అనుమతి నివ్వని కాలంలో ఇలా తీసిన సినిమాలే ఎక్కువున్నాయి. అవి ఫ్లాపవడం చూసి స్ట్రక్చర్ లేక ఫ్లాపవుతున్నాయని అనేసుకున్నాం. స్ట్రక్చర్ లేకుండా చేసి, మేకర్లు మరి తామనుకుంటున్న క్రియేటివిటీ ఏమిటో చెప్పడం లేదు, దానికైనా గ్యారంటీ ఇవ్వడం లేదు. ఆ క్రియేటివిటీ ఏమిటో తెలిస్తే గ్యారంటీ నివ్వగలరు. తెలియక పోవడం వల్లే గల్లా పెట్టెలు గల్లంతవుతున్నాయి.

        ఈ వ్యాసం రాస్తున్నప్పుడే ఒక కథ డెవలప్ అవుతోంది. మేకర్ తెచ్చిన కథ కొత్తగా వుంది. అందులో కాన్ఫ్లిక్ట్ వుంది కానీ ప్రత్యర్ధి పాత్ర చివరి వరకూ అదృశ్యంగా వుండడంతో, కథనం బోలుగా వుంది. కాసేపు రెగ్యులర్ స్ట్రక్చర్ ని పక్కన పెట్టి, పాత్రకి సబ్ ప్లాట్ గా ఇన్నర్ కాన్ఫ్లిక్ట్ ని కల్పిస్తూ ప్రత్యర్థి లేని లోటుని పూడ్చాలనుకుంటే, అది మేకర్ కిష్టం లేదు. ఎందుకంటే ఆ ఇన్నర్ కాన్ఫ్లిక్ట్ కోసం సృష్టించే  సమస్య పాత్ర మర్యాదని దెబ్బతీస్తుందని మేకర్ అభ్యంతరం. సమస్య లేకుండా సంఘర్షణ లేదు. ఏ సమస్య తీసుకున్నా అది పాత్ర మర్యాదనే దెబ్బతీస్తోంది. మర్యాద దెబ్బతినకుండా సమస్య ఎలా? సమస్య లేకుండా సంఘర్షణ ఎలా? ఎక్కడుంది దీనికి కిటుకు? కథ పెండింగులో పడింది.    

జెమీ గోల్డ్ 
ఒక రోజు కథల్లో సమస్యల గురించి సెర్చి చేస్తూంటే, 'కాసాబ్లాంకా', 'ఇండియానా జోన్స్', 'పల్ప్ ఫిక్షన్', 'మ్యాట్రిక్స్' లలో ప్రయోగించిన ప్లాట్ డివైసులున్నాయి. దీన్ని మెక్ గఫిన్ ప్లాట్ డివైస్ అంటారు. ఆల్ ఫ్రెడ్ హిచ్ కాక్ కనిపెట్టాడు. ఒక సమస్య చుట్టూ సంఘర్షిస్తూంటాయి పాత్రలు. ఆ సమస్య పాత్రలకే తెలుసు, ప్రేక్షకులకి చెప్పరు. చెప్తే తేలిపోతుంది. 'కాసాబ్లాంకా' లో లెటర్స్ అనే ప్లాట్ డివైస్ వుంటుంది. ఆ లెటర్స్ లో ఏముందో చెప్పరు. 'పల్ప్ ఫిక్షన్'లో బ్రీఫ్ కేసు ప్లాట్ డివైసుగా వుంటుంది. ఆ బ్రీఫ్ కేసులో ఏముందో చెప్పరు.

        ఈ మెక్ గఫిన్ ప్లాట్ డివైసుని మన మేకర్ కథలోకి తెచ్చేస్తే సమస్య తీరిపోయింది. సమస్య దేని గురించో చెప్పకుండా, పాత్ర మర్యాద దెబ్బ తీయకుండా, సబ్ ప్లాట్ ప్రత్యర్ధితో ప్రత్యక్ష సంఘర్షణతో కథ నీటుగా వచ్చేసింది. పనిలో పనిగా అసలు అదృశ్య ప్రత్యర్ధితో ప్రచ్ఛన్న పోరాటం (కోల్డ్ వార్) కూడా తళుక్కున మెరిసి సమగ్ర కథ వచ్చేసింది...

        ఇదే సమయంలో ఇంకో కథ. ఇది రెగ్యులర్ రొటీన్ టెంప్లెట్ కథ. మనం చంద్రుడి ఒక వైపే చూస్తాం, అవతలి వైపు ఏముందో తెలియదు. టెంప్లెట్ సినిమాలు కూడా ఒకవైపే చూపిస్తూ బోరు కొట్టేస్తున్నాయి. రెండో వైపు ఎందుకు చూపించరు. ఈ కథకి ఇదే చేసి ఇంటర్వెల్లో అట్టు తిరగేసినట్టు తిరగేస్తే రెండోవైపు కొత్త కథ కన్పించింది... ఇంకో మేకర్ టెంప్లెట్ కథనే పెద్ద కంపెనీల్లో చెప్తూ సెకండాఫ్ రిజెక్ట్ అవుతున్నాడు. ఇంటర్వెల్లో రివర్స్ చెయ్, సెకండాఫ్ కొత్తగా వస్తుందన్నాం. రివర్స్ చేయడానికి ఒక ప్లాట్ డివైస్ ఇచ్చేశాం. మేకర్ స్టామినా పెరిగింది...

        మన దగ్గరే సినినాప్సిస్ లో ఒక పెద్ద కథ వుంది. సెకండాఫ్ లో కెళ్లినా 'కమర్షియల్ హీరోయిజం' కనిపించడం లేదని మేకర్ ఫిర్యాదు. దీని ఇంటర్వెల్ విజువల్ బ్యాంగ్ తో వుంది. అది కూడా హీరోయిజమే. దీనికో డైలాగు వేసి వర్బల్ బ్యాంగ్ ఇవ్వడంతో సెకండాఫ్ కూడా కొత్త కథగా మారిపోయింది ఆ డైలాగు పట్టుకుని.

        ఇదంతా ఏమిటంటే స్ట్రక్చర్ కి ప్రత్యామ్నాయ ప్రయత్నాలు. కథల్లో సమస్యా, దాంతో సంఘర్షణా వుంటాయి. వీటిని స్ట్రక్చర్ లో సరైన తీరులో వాడకపోవడం వల్ల మిడిల్ మటాష్ స్క్రీన్ ప్లేలు వచ్చి ఫ్లాపవుతున్నాయి. అసలు సంఘర్షణే లేని గాథలు కూడా తయారై ఫ్లాపవుతున్నాయి. ఇంకేవో లైటర్ వీన్ సినిమా లనుకుంటూ కూడా వచ్చి ఫ్లాపవుతున్నాయి. ఇవన్నీ సమస్య- సంఘర్షణ పరికరాల వాడకంలో బోల్తాపడుతున్నవే. ఇప్పుడు సినిమాల తీరు మారింది. వివిధ కథాకథనాల శైలులు సమస్య- సంఘర్షణ పరికరాల్ని భిన్నంగా నిర్వచిస్తున్నాయి. ఇవి ప్రేక్షకుల్ని ఆకర్షిస్తున్నాయి. ఆ శైలులేమిటో తెలుసుకుంటే స్ట్రక్చరేతర క్రియేటివ్ స్కూలు మేకర్స్ తీసే 'ఇండిపెండెంట్' కమర్షియల్ సినిమాలైనా నాణ్యత పెంచుకుంటాయి. ఈ శైలుల గురించి వివరిస్తూ రచయిత్రి జెమీ గోల్డ్ రాసిన వ్యాసం రేపు మీకందుతుంది. చదివి అర్ధం జేసుకుని పాటించగలరు.

—సికిందర్