రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Tuesday, August 29, 2017

504 : డార్క్ మూవీస్ స్క్రీన్ ప్లే సంగతులు - 14

     సీన్ అంటే బిగినింగ్ - మిడిల్ - ఎండ్ అని తెలిసిందే. కథంటే బిగినింగ్ - మిడిల్ - ఎండ్ అని కూడా తెలిసిందే. కథకి స్ట్రక్చర్ అంటే బిగినింగ్ - మిడిల్ - ఎండ్ అనీ, ఆ స్ట్రక్చర్ లో బిగినింగ్ అంటే బిగినింగ్ - మిడిల్ - ఎండ్ అనీ, మిడిల్ అంటే బిగినింగ్ - మిడిల్ – ఎండ్ అనీ, మళ్ళీ ఎండ్ అంటే కూడా బిగినింగ్ - మిడిల్ – ఎండ్ అనీ తెలిసిందే. అలాగే సీక్వెన్స్ అన్నా బిగినింగ్ - మిడిల్ – ఎండే. పాత్ర అన్నాకూడా బిగినింగ్ - మిడిల్ – ఎండే. ఇలా సీను కూడా బిగినింగ్ - మిడిల్ – ఎండ్ అయిందని తెలుసు. అన్నిటా ఈ నిర్మాణమే వుంటుంది. ఐడియా తీసుకున్నా, సినాప్సిస్  తీసుకున్నా కూడా. సృష్టికి సూక్ష్మ రూపం కథా ప్రపంచం, కథా ప్రపంచంలోని ప్రతీ ఒక్కటీ.  ప్రతీ సీనూ బిగినింగ్ తో ప్రారంభమై, మిడిల్ తో విషయం నలిగి, ఎండ్ తో ఆ విషయాన్ని కొలిక్కి తెస్తుంది. ఉదాహరణకి గత వ్యాసంలో చెప్పుకున్న ‘బ్లడ్ సింపుల్’  మిడిల్ - 2 మొదటి సీనులో- అందమైన ఇల్లు కన్పిస్తుంది, రే ఆలోచిస్తూ వుంటాడు. ఇది బిగినింగ్. ఈ బిగినింగ్ లో అతడి భవిష్యత్తు ఎంత అందంగా, అద్భుతంగా  కనపడుతోందో ఎస్టాబ్లిష్ అయింది (ఇది వివరంగా గత వ్యాసంలో చూడండి). తర్వాత అతను కారు స్టార్ట్ చేస్తాడు. కొంత సేపు కారు స్టార్ట్ కాదు.  ఇది మిడిల్.  ఇందులో మిడిల్ బిజినెస్ ప్రకారం కారు స్టార్ట్ కాకపోవడమనే సంఘర్షణ.  ఈ సంఘర్షణకి బిగినింగ్ విషయంతో సంబంధం వుంటుంది. బిగినింగ్ విషయంతోనే సంఘర్షిస్తున్నాడు. చివరికి స్టార్ట్ అయి సమాధి మీంచి వెళ్ళిపోయాడు. సంఘర్షణ కొలిక్కి రావడంతో ఎండ్ పూర్తయ్యింది.

సెట్ లో కోయెన్ బ్రదర్స్ 
     దీంతో సీను పని పూర్తయ్యింది. అంటే ఈ సీనుతో ఇక పనిలేదా?  సీన్లు ఎక్కడికక్కడ పని ముగించుకుని వెళ్లి పోయే స్వయం ప్రతిపత్తితో వుంటాయా? ఉండవు. రాష్ట్రాలన్నీ కలిస్తే దేశమైనట్టు, సీన్లన్నీ కలిసి కథవుతాయి.  రాష్ట్రాలు పరస్పరం సహకరించుకున్నట్టు, సీన్లు పరస్పరం ఇచ్చిపుచ్చుకోవడాలు చేస్తాయి. అందుకే ప్రతీ సీను ముగింపూ ఇంకో సీనుకి ప్రారంభం కావాలన్నది. లేకపోతే ఇచ్చిపుచ్చుకోవడాలుండవు. ఇచ్చిపుచ్చుకోవడాలుండకపోతే సీన్లు పుచ్చిపోతాయి. సీన్లు పుచ్చిపోయాక కథని అడ్డంగా కుప్పకూలుస్తాయి. 

            కనుక ఇచ్చి పుచ్చుకోవడాల కోసం ప్రతీ సీనూ ఈ రెండిట్లో ఒకటి చేస్తుంది, లేదా రెండూ చేస్తుంది  :  పాత్ర గురించి కొత్త సంగతి చెప్పడం, కథని ముందుకు నడిపించే ముగింపు  నివ్వడం. సందర్భాన్నిబట్టి  ఈ రెండిట్లో ఒకటే చెయ్యొచ్చు, లేదా రెండూ చెయ్యొచ్చు. పై సీనులో చూస్తే, రే భవిష్యత్తుని వూహిస్తున్నవిధంతో అతడి గురించి కొత్త సంగతి బయట పెట్టింది సీను. సమాధి మీంచి వెళ్ళే ముగింపుతో కథని ముందుకి నడిపించింది- ఒక ఆందోళనకర ప్రశ్న లేవనెత్తుతూ( గత వ్యాసం చూడండి).

స్టోరీ బోర్డుతో మ్యాచింగ్ షాట్ 
       ప్రతీ సీనుకీ ఈ స్ట్రక్చర్ ని గమనించవచ్చు.  కోయెన్ బ్రదర్స్ సీన్లకి స్టోరీ బోర్డ్ వేసుకున్నారు. సీన్లు ఎంత సూక్ష్మ దృష్టితో రాశారో  షాట్లూ అలాగే తీసినట్టు, స్టోరీ బోర్డ్ ఎలా తయారు చేశారో షాట్లూ ఆవిధంగానే తీశారు. దీనికోసం ఇక్కడ క్లిక్ చేసిఇక్కడ క్లిక్ చేసి వీడియోని చూడండి.

            ఇక మిడిల్ టూ ఒరిజినల్ స్క్రీన్ ప్లే కాపీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి ఇక్కడ క్లిక్ చేయండి.

 25. ఎడారిలా వున్న రోడ్డు మీద డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళడం
            ఇలా రాశారు : సూర్యోదయపు ఎండలో ఖాళీ  హైవే మీద రే డ్రైవ్ చేసుకుంటూ పోతూంటాడు.
            రే క్లోజ్ షాట్ : పాలిపోయిన మొహంతో రెప్ప వేయకుండా చూస్తూంటాడు.
            రే పాయింటాఫ్ వ్యూ : హైవే. దూరంగా తెల్లరంగులో ఒక పాత  స్టేషన్ వ్యాగన్ దగ్గరవుతూ వుంటుంది. దాని హెడ్ లైట్స్ ఒకసారి వెలిగి ఆరిపోతాయి.  
            రే మీదికి ఫోకస్ : దగ్గరవుతున్న ఆ కారు కేసే కళ్ళు విప్పార్చుకుని చూస్తాడు.
               రే పాయింటాఫ్ వ్యూ : కారు మరింత దగ్గరవుతుంది. హెడ్ లైట్స్ మళ్ళీ ఆన్ ఆఫ్ అవుతాయి.
            రే మీదికి ఫోకస్ : రే దవడ ఎముక బిగుసుకుంటుంది. కారుకేసి తదేకంగా చూస్తాడు. సడెన్ గా చూపులు తిప్పుకుని డాష్ బోర్డుని  చూస్తాడు.
            క్లోజ్ షాట్ లో కారు హెడ్ లైట్ స్విచ్.
            స్విచ్ ఆన్ లో వుంటుంది. రే చెయ్యి ఫ్రేములోకొచ్చి ఆఫ్ చేసేస్తుంది.
             సైడ్ యాంగిల్ లో రే : దగ్గరవుతున్న కారునే చూస్తాడు. దాటి పోతున్న ఆ కారులో  వున్నతను నవ్వుతూ  బొటన వేలు చూపిస్తాడు. 


      ఈ సీను అర్ధం :  కారు పోతున్నప్పుడు రే పాయింటఫ్ వ్యూలో నిర్జన హైవే చూపించిన విధానం చూస్తే, రోడ్డు తారు రోడ్డే అయినా నల్లగా నిగనిగ లాడుతూ వుండదు. మాసిపోయి వుంటుంది మట్టితో. మలుపులు తిరిగి వుండదు. సూటిగా వుంటుంది. రేపటి జీవితంలోకి అతడి సూటి ప్రయాణం.  ఎడారి ప్రయాణం. దూరంనుంచి తెల్ల రంగు కారు రావడం ఇంకో  రూపకాలంకారం : తెలుపు స్వచ్ఛతకి, పవిత్రతకి, భద్రతకి గుర్తు. కానీ ఇవి పాతబడిన కారు రూపంలో వున్నాయి. అంటే ఆ స్వచ్ఛత, పవిత్రత, భద్రత ఇవన్నీ మసకబారాయి. ఇది రే ఎబ్బీలు అంగీకరించాల్సిన వాస్తవం. ఈ వస్తున్న పాత కారు హెడ్ లైట్స్ ఆన్- ఆఫ్ కావడమంటే, ఆ మసకబారిన స్వచ్ఛత, పవిత్రత, భద్రత -  జాగ్రత్తా  అని హెచ్చరించడం. ఆ హెడ్ లైట్స్ ని  చూసి రే తన కారు హెడ్ లైట్స్  ఆఫ్ చేయడమంటే, ఆ మసకబారిన స్వచ్ఛత, పవిత్రత, భద్రత చేస్తున్న హెచ్చరికకి - తెలియకుండానే  లొంగుబాటు ప్రకటించడం. ఆ కారులో అతను  నవ్వుతూ బొటన వేలు చూపించడమంటే, అదీ నువ్వలా వుండాలి - అని వెన్నుతట్టడం. 

            ఇక్కడ కూడా సబ్ కాన్షస్ కథ చెప్తోంది. ఈ రూపకాలంకారాలు, ఈ గుర్తులు, ఈ చర్యలూ ఇవన్నీ సబ్ కాన్షస్ కథనమే. మన చుట్టూ ఇలాటివే జరుగుతూంటాయి మనకి సంబంధమున్నవీ, లేనివీ; అప్పుడే అర్ధమయ్యేవీ, తదుపరి కాలంలో అర్ధమయ్యేవీ. దీన్ని సబ్ కాన్షస్ – లేదా దేవుడు – లేదా విధి లీలలని పిలవ్వొచ్చు. ఒక సీనులో పాత్రలు కాన్షస్ కథ చెప్పొచ్చు. నేపధ్యంలో ఎలిమెంట్స్ సబ్ కాన్షస్ కథ చెప్తూంటాయి. ఇలా కాన్షస్ – సబ్ కాన్షస్ ల కలయికతో అంతర్ – బాహిర్ కథనాల వల్ల  మొత్తం కథ ఓటి కుండలా మిగిలిపోక, నిండు కుండలా తొణికిసలాడుతూంటుంది. ఇలాటి చిత్రణే నీలకంఠ తీసిన ‘షో’ లో కూడా కన్పిస్తుంది.  

     ఈరోజు (ఆగస్టు 30) జేనీనా గోమ్స్ ఆసక్తికర వ్యాసం రాశారు.  సుఖ సంతోషాలు బాహ్యంగా మనం సృష్టించుకునే పరిస్థితుల్లో లేవని, అంతర్గతంగా మూడో కంటికి తెలిసేవాటిని స్వీకరించడంలో వున్నాయని. రే మార్టీ ని చంపి తప్పించుకుందామనే బాహ్య పరిస్థితిని సృష్టించుకున్నాడు. ఇందులో సుఖముందా? ఎంత కాలం తప్పించుకుంటాడు? అన్నాళ్ళూ భయం భయంగా గడపాల్సిందేగా? ఇలాకాకుండా, ఎదురొచ్చిన  కారు రూపంలో ప్రకృతి అందిస్తున్న సందేశాన్ని, చేస్తున్న హెచ్చరికని అర్ధంజేసుకుంటే, చట్టానికి లొంగిపోయి ప్రాయశ్చిత్తం చేసుకుని,  తిరుగులేని మానసిక శాంతిని పొందుతాడుగా?

26. ఫోన్ బూత్ నుంచి ఎబ్బీకి కాల్ చేసి కుశలమడగడం
            ఇలా రాశారు : హై యాంగిల్. పెట్రోల్ బంకు మూసి వుంటుంది. ఓ పక్క రే కారు ఆపి వుంటుంది. కారులో రే వుండడు. చెట్లు గుట్టలు లేని విశాలమైన  పచ్చగడ్డి మైదానం దిగంతాల్ని తాకుతూ వుంటుంది. ఫ్రేములో ఎలాంటి కదలికా వుండదు. 

            హై యాంగిల్లో క్రేన్ షాట్ టిల్ట్ డౌన్ అవుతూంటే, గొంతుకలు విన్పిస్తూంటాయి. ఎబ్బీ, నువ్వు ఓకేనా? - అని రే గొంతు. ఇలా టిల్ట్ డౌన్ కంటిన్యూ అయి  ఫోన్ బూత్ లో రే రివీలవుతాడు. ఫోన్ లో మాట్లాడుతూంటాడు. ఇప్పుడు టైమెంత – అని  ఎబ్బీ అడుగుతుంది.  తెలీదనీ, కానీ తెల్లారిందనీ చెప్పి,  ఐలవ్యూ అంటాడు. నువ్వు ఓకేనా -  అంటుంది.  తెలీదంటాడు. ఇప్పుడు తను  జంప్ అయితే బెటర్ – అంటాడు. ఓకే సీయూ, థాంక్స్ - అని చెప్పి కట్ చేసేస్తుంది. సీను ముగుస్తుంది.

            సీను ప్రారంభ దృశ్యం ఎలా తోస్తుందంటే, రే జంప్ అయ్యాడన్నట్టే వుంటుంది. కోయెన్ బ్రదర్స్ చాలా మ్యాజిక్ లు చేస్తున్నారు పైకి అతి సాధారణంగా కన్పించే, అనవసరమన్పించే  సీన్లతో. ఏముంది, బంకు దగ్గర కారాపాడు, ఎబ్బీ తో కాల్ మాటాడాడు, జంప్ అయితే బెటరన్నాడు – ఇంతేగా అన్పించవచ్చు. ఈ కాస్త దానికి ఇంత ఖర్చుతో ఒక సీనా? ఎలాగూ  తర్వాతి సీన్లో ఎబ్బీ దగ్గరే వుంటాడు, అప్పుడు చెప్పొచ్చుగా ఈ మాట? - అని మనం ఈ సీను లేపి అవతల పారేసి డోనాల్డ్ ట్రంప్ లా చూస్తాం.

            మన అలవాటు డైలాగ్ టు డైలాగ్ కథలు  చెప్పడమే కదా? ఫీల్ కోసం సబ్ టెక్స్ట్ ని ఉంచం కదా? జంప్ అయ్యే విషయం సీరియస్ గా పరిగణించాల్సిన అంశం, నిర్ణయం. దీని పరిణామాల పట్ల మన మనసు ఉరకలు వేస్తుంది. ఇదే నేరుగా వెళ్లి ఆమెకి చెప్పేస్తే ఉరకలు వేయదు. మనల్ని ఆలోచించుకో నివ్వదు, ఫీలవ నివ్వదు. ఆమె సమాధానం మీద ఆధారపడిపోయి లేజీగా, బానిసలుగా  చూస్తాం సీన్ని. మనల్ని బానిసలుగా తయారుజేయడం కోయెన్ బ్రదర్స్ కిష్టం లేదు. 

      అందుకని ఈ సీన్లో సబ్ కాన్షస్ కథ చెపుతూ ఆలోచింపజేశారు. కించిత్ ఆందోళన పుట్టించారు. ఎలాగంటే – కారాపేసి వుంటుంది. అందులో అతనుండడు.  ఎదురుగా దిగంతాల్ని తాకే పెద్ద పచ్చగడ్డి మైదానం. కార్లో లేకుండా ఎక్కడికి పోయాడు? పచ్చగడ్డి మైదానంలో దసరాబుల్లోడిలా జంపై,  దిగంతాల్లోకి  అంతర్ధానమయ్యాడా  చట్టాన్నుంచి తప్పించుకోవాలని? పచ్చ గడ్డి మైదానం కూడా ప్రతీకే. వెనక సీన్లో ఎడారి లాంటి రహదారి. ఇప్పుడు పచ్చగడ్డి మైదానం. డెవలప్ మెంట్ కన్పిస్తోంది పరిస్థితిలో. అంటే అర్ధం సీన్లు కథని ముందుకి నడిపిస్తున్నాయి. ఇలా జంప్ ఎపిసోడ్ గురించి సబ్ కాన్షస్ కథనం ముందే చెప్పేసింది. ఇదే సీను  చివర అతడి నోట్లోంచి వచ్చింది. ఎవ్విరీ థింగ్ ఈజ్ రిలేటివ్. 

            సీన్లో సంభాషణ గమనిద్దాం : ఎబ్బీ,  నువ్వు ఓకేనా – అంటాడు. దీనికి సమాధానం చెప్పకుండా - టైమెంత? – అని అడుగుతుంది. ఎందుకిలా అడగాలి? ఎందుకీ డైలాగు రాయాలి? ఎందుకంటే పోలిక కోసం. అటుపక్క ఆమె సుఖంగా వుంటే, ఇటు పక్క ఇతను సుఖంగా లేడని తెలియజేసి, సీనులో ఆర్తిని ఎలివేట్ చేయడం కోసం. ఆమె టైమెంత అని అడుగుతోందంటే, రాత్రంతా వొళ్ళు తెలీని నిద్రపోయిందన్నమాట, ఇక్కడ ఇతను నిద్రలేక నరకయాతన పడుతున్నాడు. ప్రేమలో ఇదొక పరిస్థితి. మూడ్ సృష్టించే పరిస్థితి.  కొన్ని సార్లు ప్రేమలో ఎదుటి ప్రేమిక / ప్రేమికుడి మూడ్ ఉద్రిక్తతల్ని సృష్టిస్తుంది. ఎబ్బీ మూడ్  ఇంకా దేనికి దారితీస్తుందో చూద్దాం.  

            ఆమె అడిగిన ప్రశ్నకి టైమెంతో తెలీదన్నాడు. అంటే ఈ లోకంలో లేడు తను పరిస్థితుల నేపథ్యంలో. తెల్లారిందన్నాడు - అంటే ఈ లోకంలో కొచ్చి తెల్లవారి వెలుగు చూస్తున్నట్టా? కాదు.  మొదటి మాట – టైమెంతో తెలీదు - కాన్షస్ మాట. రెండో మాట - తెల్లారిందని – సబ్ కాన్షస్ మాట.  తెల్లారిందీ  అంటే ఇక్కడ అర్ధం – తను తెప్పరిల్లాడని.  వెనకసీన్లో తీవ్రమైన ఆలోచనలతో చేసిన ప్రయాణం, ఈ సీన్లోకి వచ్చేటప్పటికి ఒక నిర్ణయానికొచ్చి తెప్పరిల్లాడన్న మాట. సీన్లు భౌతికంగా ముందుకి కదలడమే గాక,  మానసికంగానూ పాత్రలో పురోగతిని సాధిస్తున్నాయి. 

            ఇక ఐలవ్యూ అంటాడు. ఇలాటి పరిస్థితిలో కూడా, ఆమె పూర్తి చేయలేకపో
యిందని అనుకుంటున్న హత్య తను చేసినా కూడా, ఈ విషయంగా ఒక్క ముక్కా అడగకుండా, కమిటైన ప్రేమకి కట్టుబడ్డాడు. ఇది పాత్రని ప్రేక్షకులతో మరింత కనెక్ట్ చేసే బలమైన డైలాగు. నేపధ్య బలముంటే  మామూలు రొటీన్ ఐలవ్యూ అనే డైలాగు కూడా ఎంత కదిలిస్తుందో, ఆలోచింపజేస్తుందో ఇక్కడ గమనించవచ్చు. నేపధ్య బలమున్నప్పుడు సాధారణ మాటలే  వండర్స్ చేస్తాయని ఇందులోంచి నేర్చుకోవచ్చు. 

            నువ్వు ఓకేనా అంటుంది. తెలీదంటాడు. ఇక జంప్ అయితే బెటర్ అంటాడు. దృశ్య ప్రారంభంలో సబ్ కాన్షస్ కథనంలోని జోస్యం ఇతడి నోట్లో నిజమైంది. ఎవ్విరీ థింగ్ ఈజ్ రిలేటివ్ జీవితంలో. సృష్టిలో ప్రతీదీ శక్తి తరంగాలతో ఒకదాన్నొకటి  పట్టుకుని వెళ్ళాడుతు న్నాయి.  ఎవ్విరీ థింగ్ ఈజ్ ఇంటర్ కనెక్టెడ్.  భౌతికమైనా, మానసికమైనా. 

      ఓకే సీయూ, థాంక్స్ – అని కట్ చేసేస్తుంది. అతడి పరిస్థితినీ, మాటల్లో మర్మాన్నీ, తీవ్రతనీ ఏమీ పట్టించుకోవడం లేదు. రాత్రంతా ఎక్కడున్నాడో, ఏం చేశాడో కూడా తెలుసుకోవాలన్పించలేదు. డిటాచ్డ్ గా వుంది. అతను ఆమెని రక్షించడానికి ఇంతా చేస్తే పట్టనట్టే వుంది. వేరే ఉద్దేశం లేకపోవచ్చు, ఒక్కోసారి మూడ్ బావుండదంతే. 

         కానీ ఆమె కట్ చేయడంతో అతడి ఫీలింగ్స్ చూస్తే, తను బకరా అవుతున్నాడా అన్నట్టే వుంటుంది. మొదట్నించీ ఆమె మాట్లాడిన పధ్ధతి దృష్ట్యా, తనని వదిలించుకుని ఇంకొకర్ని చూసుకుంటోందా అన్న శంక అతడి మొహంలో ద్యోతకమవుతుంది. రేలో అనుమానం మొదలైంది. ఫస్టాఫ్ లో ఎబ్బీ కూడా ఇలాగే ఇతణ్ణి  అనుమానించి,  సూటి పోటి మాటలని రిలేషన్ షిప్ కి ఎసరు పెట్టింది. తను అతడికి చేసింది, ఇప్పుడతను తనకి చేసే పరిస్థితిని కల్పించుకుంది కర్మ సిద్ధాంత రీత్యా తెలియకుండా మూడాఫ్ అయిన ధోరణితో.తను విసిరింది తిరిగి తనకి తగలాలిగా? 

            స్క్రిప్టులో రాయలేదుగానీ, ఇంకో రెండు విశేషాలు చిత్రీకరణలో వున్నాయి. ఫోన్ బూత్ లో నిలబడ్డ రే కుడి అరచెయ్యి చివర్లో రివీలవుతుంది అద్దానికి ఆన్చి. ఆ అరచేతికంతా మట్టి మురికి అంటుకుని వుంటుందింకా నల్లగా. ఆమె కట్ చేసినప్పుడు రివీలయ్యే ఈ చెయ్యితో, నేరమనే మరక తనకి అంటుకుని, ఆమె ఎస్కేప్ అవుతోందన్న భావం.

            ఇంకో విశేషం, ప్రారంభంలో క్రేన్  టిల్ట్ డౌన్ అవుతున్నప్పుడు ఫోన్ బూత్ పైన రంగురంగుల జెండాలు రెప రెపలాడుతూ వుంటాయి. ఇది దిగంతాల్లోకి గడ్డి మైదానం షాట్ తర్వాత. ఈ జెండాలు విజయ కేతనాలు. రే కృతనిశ్చయుడై వున్నాడిక జంప్ అవ్వాలని. ఆమెతోనే జంప్ అవ్వాలని- మెక్సికోకి. మేక్సికోకి ఎందుకు? వెనక సీన్లో ఎదురొచ్చిన కారులో అతను ప్రొసీడ్ అన్నట్టు బొటన వేలు చూపించాడు. అతను మెక్సికన్ కాబట్టి మెక్సికో ఇన్స్ పిరేషన్ రే కి.
అదంతా మాయ అని తెలీదు. 

           19 వ శతాబ్దపు విఖ్యాత నవలా రచయిత హెన్రీ జేమ్స్ ఒక సైంటిస్టులా కూర్చుని పాత్రల్ని మల్చే వాడట. కోయెన్  బ్రదర్స్  సీన్లని కూడా సైంటిస్టుల్లా మలుస్తున్నారు.

(సశేషం)
-సికిందర్