రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

9, జులై 2024, మంగళవారం

1445 : స్క్రీన్ ప్లే సంగతులు!

 

 

  టిఫానీ యేట్స్ మార్టిన్ అనే రచయిత్రి మల్టీపుల్ ఫ్లాష్ బ్యాకుల గురించి ఇచ్చిన వివరణలో కొత్త దృక్కోణం వెలుగులో కొస్తోంది. అదేమిటంటే, కథనమంటే రియల్ టైమ్ యాక్షన్ గా నడిచే కథకి సంబంధించిందై వుండాలి గానీ, ఆ రియల్ టైమ్ యాక్షన్ కథకి దారితీసే కథనంగా వుండకూడదు (రియల్ టైమ్ యాక్షన్ కథకి దారితీసే కథనమంటే అది ఫ్లాష్ బ్యాకుగా వచ్చే కథనమే. ఫ్లాష్ బ్యాకుని డ్రీమ్ టైమ్ అని కూడా అంటారు). రియల్ టైమ్ యాక్షన్ కథనాన్ని చెప్పడానికి ఫ్లాష్‌బ్యాకులపై ఎక్కువగా ఆధారపడితే అది ప్రేక్షకుల్ని గందరగోళానికి గురిచేసే, లేదా మొత్తం రియల్ టైమ్ యాక్షన్ కథపై దృష్టిని పలుచన చేసే ప్రమాదంగా కూడా పరిణమిస్తుంది.


        యినా సరే మనకు ఓకే. ఎందుకు ఓకే అంటే ఫ్లాష్ బ్యాకులు లేకుండా మనం ఇండియన్లం జీవించలేని పరిస్థితుల్లో వున్నాం. సినిమాని ఎంజాయ్ చేయడానికి ఇడ్లీలో సాంబారులాగా ఫ్లాష్ బ్యాకులు పడాల్సిందే. సినిమా కళ అసలేం చెప్తోందనేది మనకనవసరం. ఇంకా మల్టీపుల్ ఫ్లాష్ బ్యాకులు వేసినా ఓకే. అయితే మల్టీపుల్ ఫ్లాష్ బ్యాకులేసినప్పుడు అత్యుత్సాహానికి పోయి ఇంకేం చేస్తే ఇడ్లీ సాంబారు కాస్తా నీళ్ళ చారు అవుతుందో - రచయిత్రి చెప్తోంది. అదేమిటంటే, రియల్ టైమ్ యాక్షన్ కథ చెప్పడానికి వేసే మల్టీపుల్ ఫ్లాష్ బ్యాకుల్లో, మల్టీపుల్ టైమ్ లైన్ ఫ్లాష్ బ్యాకులు వున్నాయేమో తెలుసుకోవడమే. వుంటే ఆ రియల్ టైమ్ యాక్షన్ కథ కాస్తా ఇంకా గందరగోళమై పోతుంది!
       
మల్టీపుల్ టైమ్ లైన్ ఫ్లాష్ బ్యాకులంటే ఒక కాలానికి సంబంధించినవి కాకుండా
, వివిధ కాలాలకి సంబంధించినవి. అంటే, ఆదివారం జరుగుతున్న రియల్ టైమ్ యాక్షన్ కథ చూపిస్తూ, మధ్యమధ్యలో వెనక్కి వెళ్ళి దాని తాలూకు శుక్రవారం జరిగిన ఫ్లాష్ బ్యాకొకటి, తర్వాత ఇంకా వెనక్కి వెళ్ళి మంగళవారం  జరిగిన ఫ్లాష్ బ్యాకొకటి, ఆ తర్వాత మళ్ళీ ముందుకెళ్ళి శనివారం జరిగిన ఫ్లాష్ బ్యాకొకటి, మళ్ళీ తర్వాత వెనక్కొచ్చి బుధవారం జరిగిన... ఇలా ఒక వరుస క్రమం లేకుండా ముందుకీ వెనక్కీ ఉయ్యాలలూపుతూ, వివిధ కాలాల ఫ్లాష్ బ్యాకులేస్తూ పోతే రియల్ టైమ్ యాక్షన్ కథ గందరగోళం కాక ఏమౌతుంది.
       
అప్పుడు ప్రేక్షకులు ముందు మంగళవారం జరిగిన ఫ్లాష్ బ్యాకుకి కంటిన్యూటీగా బుధవారం జరిగిన  ఫ్లాష్ బ్యాకు ఏరుకుని
, దీనికి కంటిన్యూటీగా శుక్రవారం జరిగిన ఫ్లాష్ బ్యాకు జోడించుకుని, మళ్ళీ దీనికి కంటిన్యూటీగా శనివారం జరిగిన ఫ్లాష్ బ్యాకూ... ఇలా ఒక వరస క్రమంలో పేర్చుకుని, అప్పుడు ఆదివారం జరుగుతున్న రియల్ టైమ్ యాక్షన్ కథకి కనెక్ట్ చేస్తేగానీ అసలు కథ పూర్తిగా అర్ధం గాదన్న మాట!
       
ఈ పని చేయగలరా ప్రేక్షకులు
? సినిమా కొచ్చింది ఎంజాయ్ చేయడానికా, పరీక్ష రాయడానికా? ఇదే జరిగింది హిట్టయిన మహారాజా స్క్రీన్ ప్లేతో. మరి ఇంత గందరగోళంగా వున్నా ఎలా హిట్టయ్యింది? దీనికి ఒకే కారణముంది, అది చివర్లో చెప్పుకుందాం.

(రేపు రెండవ భాగం)

—సికిందర్