రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

31, డిసెంబర్ 2021, శుక్రవారం

1110 : రివ్యూ!


 రచన- దర్శకత్వం : తేజ మార్ని

తారాగణం : శ్రీవిష్ణు, అమృతా అయ్యర్, మహేశ్ ఆచంట, గౌరవ్ పరీక్, రాజ్ కుమార్ కసి రెడ్డి, దేవీ ప్రసాద్, నరేష్, శివాజీ రాజా, సుబ్బరాజు తదితరులు
సంగీ
తం : ప్రియదర్శన్ బాల సుబ్రహ్మణ్యన్, ఛాయాగ్రహణం : చీకటి జగదీష్
బ్యానర్ : మ్యాట్నీ ఎంటర్టయిన్మెంట్స్
నిర్మాతలు :, అన్వేష్ రెడ్డి, నిరంజన్ రెడ్డి
విడుదల : డిసెంబర్ 31
, 2021
***

        2021 కి వీడ్కోలు చెబుతూ శ్రీవిష్ణు ఈ ఏడాది ముచ్చటగా మూడో సినిమా నటించాడు. గాలి సంపత్’, రాజరాజ చోర ల తర్వాత అర్జున ఫల్గుణ అనే ఇంకో దొంగోడి పాత్రని రిపీట్ చేస్తూ పల్లెటూరి నేపథ్యానికి తెర తీశాడు. ఇది వరకు జోహార్ తీసిన తేజ మార్ని దర్శకత్వంలో, అమృతా అయ్యర్ ని హీరోయిన్ గా తీసుకుని, ఇంకో ముగ్గురు సహ నటులతో కలిసి ఈ తాజా నజరానా ప్రేక్షక లోకానికి సమర్పించాడు. హైదరాబాద్ లో మల్టీప్లెక్స్ టికెట్ రేట్లు నూట యాభై నుంచి ఏకంగా 295/- కి పెంచేసిన ముహూర్తానే రిలీజు పెట్టుకున్న తను, ప్రమోషన్స్ లో ప్రామీజ్ చేసినట్టు ఈ సినిమా వుందో లేదో ఓసారి చూద్దాం...

కథ

గోదావరి జిల్లా గ్రామంలో అర్జున్ (శ్రీవిష్ణు) రాంబాబు, తాడోడు, ఆస్కార్, శ్రావణి అనే  నల్గురు ఫ్రెండ్స్ తో అల్లరి చేసుకుంటూ వుంటాడు. ఫ్రెండ్స్ కి ఏ సమస్య వచ్చినా ఆదు కోవడంలో ముందుంటాడు. ప్రయోజకుడివి కమ్మని ఇంటి దగ్గర పోరే తండ్రి (శివాజీ రాజా), గారం చేసే తల్లీ వుంటారు. తాడోడు (మహేష్ ఆచంట) కి తండ్రి (దేవీ ప్రసాద్) నుంచి వొత్తిడి పెరగడంతో జాబ్ సాంపాదించుకోవడానికి హైదరాబాద్ బయల్దేరుతూంటే, వూరు కాని  వూళ్ళో పాతిక వేలు సంపాదించి ఒంటరిగా అవస్థలు పడేకన్నా,ఇక్కడే వుండి పదివేలు సంపాదించుకుంటూ తల్లిదండ్రుల్ని చూసుకోవడం మేలని అర్జున్ ఆపేస్తాడు.   

ఇటు శ్రావణికి వూళ్ళోనే గ్రామ వలంటీరుగా ఉద్యోగం వస్తుంది. ఇక అర్జున్ మిగిలిన ముగ్గురు ఫ్రెండ్స్ తో కలిసి సోడా ప్లాంటు పెడదామని బ్యాంకు లోను కోసం ప్రయత్నిస్తాడు. లోన్లు ఇప్పించే కరణం (నరేష్) సహాయం చేస్తాడు. లోను శాంక్షన్ అవ్వాలంటే యాభై వేలు లంచం కట్టాల్సి రావడంతో ఆ డబ్బుల కోసం ప్రయత్నిస్తూంటారు. ఇంతలో తాడోడి తండ్రి తీసుకున్న వ్యవసాయ రుణం తీర్చక పోవడంతో ఇల్లు జప్తు చేయడానికి బ్యాంకు వాళ్ళు వస్తారు. అర్జున్ వాళ్ళని ఆపి కొంత గడువు తీసుకుంటాడు. ఇక డబ్బు సంపాదించడానికి గంజాయి స్మగ్లింగ్ ఒక్కటే మార్గమని అరకు వెళ్ళి గంజాయి తీసుకొస్తూ, సీఐ (సుబ్బరాజు) కి దొరికిపోతారు. సీఐ దగ్గర్నుంచి పారిపోయి వూళ్ళోకొచ్చేస్తారు మూటతో. మూట కోసం ఆ సీఐ వెంటపడి వూళ్ళో కొచ్చేస్తాడు. ఇప్పుడేం జరిగిందన్నదే మిగతా కథ.

ఎలావుంది కథ

క్రైమ్ కామెడీ జానర్లో చేద్దామనుకున్న కథ. చేజారి గోదార్లో పడింది. భారతంలో అర్జునుడు లాంటి వాణ్ణి చూపించాలనుకున్నారు. అర్జునుడు తనకున్న పది పేర్లు పలికితే భయం పోతుందని బోధించినట్టు -పిడుగు పడితే అర్జునా ఫల్గుణా అని  తల్చుకోవడం వాడకంలో కొచ్చినట్టు- ఆపదల్లో అలాంటి అర్జునుడులాంటి వాడు మన శ్రీవిష్ణు పోషించిన అర్జున్ హీరో పాత్ర. ఛేజింగ్ లో ప్రయాణిస్తున్న గుర్రపు బండి అర్జునుడి రధమై, యుద్ధంలో రధ చక్రం శూల విరిగి పడడమనే భారతంలోంచి సింబాలిజంగా కూడా వాడేశారు. పురాణంలో ఆ శూలే పిడుగు అయినట్టు, శ్రీవిష్ణు పిడుగుని పట్టుకుని లొంగదీసు కోవడాన్ని కూడా గ్రాఫిక్స్ లో చూపించేశారు సినిమా ప్రారంభంలోనే. ఐతే పిడుగునే పిడికిట బంధించగల్గిన శక్తిగల హీరో శ్రీ విష్ణు అర్జున్ పాత్ర - ఒక విధంగా చెప్పాలంటే, పురాణ సంబంధంతో ప్రేక్షకుల ఆత్మిక దాహాన్ని  తీర్చగలిగే మిథికల్ క్యారక్టర్- పొలో మని విలన్లకి భయపడి పారిపోవడమే తప్ప పోరాటం చేయని బాక్సాఫీసు సూపర్ హిట్ కథగా మాత్రం తీర్చిదిద్దారు.

        చేసేదే గంజాయి స్మగ్లింగ్ అనే అధర్మ - నీచ  కార్యం చేస్తున్న పాత్రయినప్పుడు, దానికి అర్జునుడితో పోలిక పెట్టి అర్జునా ఫల్గుణా అని చూపించడం. చివరికి దోచుకొచ్చిన మూట కాస్తా గడ్డి మేటులో తగలబడి బూడిదై పోవడం. పిడుగునే పట్టుకో గల్గే వాడికి గడ్డిమేటు మంట భయానకంగా కనిపించింది! మూట దాచింది కుడివైపు ఐనప్పుడు, గడ్డి ఎడమ వైపు నుంచి అంటుకుంటూ వస్తూంటే, మూట లాగెయ్యకుండా, మంటమీద నీళ్ళు పోస్తూ వీర ఎమోషన్స్ పలికించడం. క్రైమ్ కామెడీ అంటే ఇలాటి కామెడీలన్న మాట.  

        ఇలా కాన్సెప్ట్ పరంగా పురాణంతో మిథికల్ జర్నీకి విఘ్నాలేర్పడగా, దీనాధారంగా కథా కథనాలు కూడా పిడుగు పాటుకి గురయ్యాయి థియేటర్ ఏసీ చలిలో చలిమంట పెడుతూ. నిరుద్యోగులు డబ్బు సంపాదించడానికి నేరం చేసే ఈ కథకి కారణం కూడా రెండుగా  చీలిపోయింది. సోడా ప్లాంటు పెడదామని ప్రారంభమయిన కథ, ఆ లక్ష్యం వెనక్కి వెళ్ళిపోయి, స్నేహితుడి ఇల్లు జప్తుని ఆపే కథగా మారిపోయింది. రెండూ బ్యాంకులతో ముడిపడి వున్న సమస్యలే. చిన్న గ్రామంలో ఒక బ్యాంకులో మొండి బకాయి వుండగా, ఇంకో బ్యాంకు ఆ సంబంధీకులకే ఇంకో లోను ఎలా ఇస్తుందో తెలీదు. కథలో సమస్యా స్థాపనలో ఏకత్వం లేని ఈ గజిబిజి వల్ల కథనమూ గజిబిజిగా, దారీ తెన్నూ తెలీని ప్రయాణమై, గలగల పారే గోదాట్లో గోల గోలగా సంగమించింది. పాపం గోదావరి జిల్లా కథ!

నటనలు - సాంకేతికాలు

ఇది కాస్త  అతిశయోక్తి అనిపించొచ్చు గానీ, పుష్ప లో అల్లు అర్జున్ని కాకుండా పదహారణాల కూలీ వాణ్ణే చూసినట్టు,ఇప్పుడు శ్రీవిష్ణులో గోదావరి జిల్లా వాణ్ణి చూస్తాం. ముత్యాల ముగ్గు లో రావు గోపాల రావుకి పోటీ తను. ఈ టాలెంట్ ని ఒప్పుకు తీరాలి. పాత్ర చిత్రణ, కథా కథనాలెలా వున్నా; నటన, గోదావరి భాష, పల్లె కల్చర్ అద్భుతంగా నటించాడు తెరమీద. దర్శకుడు తను చేయాల్సింది పేపర్ మీద సరిగా చేసివుంటే విష్ణు పడిన కష్టానికి ఫలితముండేది.

        రూరల్ లుక్స్ తో హీరోయిన్ అమృత తెర మీద గ్లామర్ కోసమే వుంది తప్ప నటించడానికి పాత్రేమీ లేదు. తనకి ప్రభుత్వ ఉద్యోగం వుంటే క్రిమినల్ లా స్మగ్లింగ్ కి వెళ్ళడ మేమిటో అర్ధంగాదు. శ్రీవిష్ణు కూడా ఎందుకు తీసికెళ్తాడో దర్శకుడికే తెలియాలి. సెకండాఫ్ సీన్లలో హీరోయిన్ కనిపించకపోతే బావుండదని తీసికెళ్ళి నట్టుంది. ఫ్రెండ్స్ పాత్రల్లో ఇల్లు జప్తు సమస్యలో వున్న తాడోడి పాత్రలో మహేష్ ఆచంటకి నటన చూపించుకోవడానికి తగిన భావోద్వేగాలున్న పాత్ర. తండ్రి పాత్రలో అప్పుల్లో పడ్డ పేద రైతుగా దేవీ ప్రసాద్ ఫర్వాలేదు. నెగెటివ్ పాత్రలో నరేష్, విష్ణు తండ్రిగా వ్యంగ్య పాత్రలో శివాజీ రాజా, మిగిలిన ఇద్దరు ఫ్రెండ్స్ పాత్రల్లో నటనతో మార్కులు కొట్టేసే రాజ్ కుమార్ కసిరెడ్డి కన్పిస్తారు. కసిరెడ్డి మళ్ళీ రాజావారు రాణీ గారు తర్వాత గోదావరి పాత్రతో ముద్రేస్తాడు నవ్విస్తూ. రైల్వే స్టేషన్లో కళ్ళు లేని కబోదిగా, అరకులో గంజాయి మత్తులో వున్న నేరస్థుడిగా గుర్తుండే సీన్లు చేశాడు నవ్విస్తూనే.

        సాంకేతిక విలువల విషయానికొస్తే కెమెరా మాన్ జగదీష్ పల్లెటూరు, అరకు విజువల్స్ బావున్నాయి. కొన్ని ఔట్ డోర్ సీన్స్ కి డీఐ గాఢత యూనిఫాంగా లేదు. కానీ గాఢత ఎక్కువున్న ఈ సీన్సే బావున్నాయి. ఈ కలర్ మేనేజి మెంట్ తోనే పూర్తి మూవీ వుండాల్సింది. ఇక ప్రియదర్శన్ బాణీల్లో పాటలు, నేపథ్య సంగీతం కూడా బావున్నాయి. రామ్ సుంకర అరకు యాక్షన్ సీన్స్ కూడా బావున్నాయి. రెండు గంటల 5 నిమిషాలకి కుదిస్తూ విప్లవ్ ఎడిటింగ్ కూడా బావుంది. దర్శకుడి స్క్రిప్టులో నేటివిటీ తెలిసినట్టుగా రాసిన గోదావరి డైలాగులు మాత్రమే బావున్నాయి.

చివరికేమిటి

అన్నీ బావున్న ఈ క్రైమ్ కామెడీలో చాలా బాధాకరంగా వున్నవి కథా కథనాలే. ఇవే మొత్తం వ్రతాన్ని చెడగొట్టాయి. ప్రధాన పాత్రకి కనీసం సరైన లక్ష్యం, ప్రత్యర్ది పాత్ర లేకపోవడం ఎలా కథవుతుందని భావించారో తెలీదు. ఇలా సినిమాలు తీస్తే థియేటర్ రిలీజుకి ఎవరూ రారు. ఓటీటీలో వీలుంటే చూద్దాం లే అనుకుంటారు, మర్చిపోతారు. ప్రధాన మల్టీ ప్లెక్సులో ఈ సినిమాకి పట్టుమని పదిమంది లేరు. పది మంది మౌత్ టాక్ తోనైనా పుంజుకోవాలంటే ముందు సినిమాలో విషయమంటూ వుండాలి.

        ఇంటర్వెల్ ముందు అరకు స్మగ్లింగ్ కెళ్ళేవరకూ పల్లెటూళ్ళో కామెడీలే వుంటాయి. పైగా ఫ్రెండ్స్ గురించి వాళ్ళ చిన్నప్పటి దగ్గర్నుంచీ కథెత్తు కున్నారు అవసరం లేకపోయినా. పల్లెటూరి కామెడీ సీన్లు ఒక్కటీ నవ్వించే స్థితిలో లేవు, డైలాగులు చమత్కారంగా వుండడం తప్ప. కాసేపు సోడా ప్లాంటు అని, మరి కాసేపు ఇల్లు జప్తు అనీ సరైన పాయింటుకి కూడా రాకుండా, ఇంటర్వెల్లో పోలీస్ ఛేజింగ్స్ ప్రారంభించేశారు.

        ఇక సెకాండఫ్ ఛేజింగ్స్ సాగిసాగి తిరిగి పల్లెటూరుకి వస్తుంది కథ. ఈ ఛేజింగ్స్ లో సంఘటనలు లాజిక్ లేకుండా, లాజిక్ లేని సీన్స్ లో ఎమోషన్లు వర్కౌట్ కాకుండా, రోమాన్సులు పని చేయకుండా ఇష్టారాజ్యంగా సాగిపోతూంటుంది. చాలా పాత కాలంలో ఇలాటి బి గ్రేడ్ సినిమాలు చూశాం. మధ్య మధ్యలో - తనది కాని పోరాటంలో, తనది కాని కురుక్షేత్రంలో హీరో వున్నట్టూ, కానీ అభిమన్యుడిలా బలి కాదల్చు కోనట్టూ- వాయిసోవర్ వస్తూంటుంది. తనది కాని పోరాటమనీ, కురుక్షేత్రమనీ హీరో ఇప్పుడెలా అనుకుంటాడు? ఫ్రెండ్స్ ని ఆదుకోవడమే కదా హీరో ఇంట్రడక్షన్? ఇలా వుంటే ఎమోషన్లు, ఫీలింగులు, థ్రిల్లింగులు ఎలా పలుకుతాయి?

        చివరికి పల్లెటూరికి తిరిగొస్తుంది కథ. ఇక్కడ ఇంకో విలన్ తో ఇంకో రకంగా ముగుస్తుంది. స్ట్రక్చర్ లేదు, సరైన గోల్ లేదు, గోల్ కి తగ్గ స్ట్రగుల్ లేదు, ఒక ప్రత్యర్ధి లేడు. దీంతో కథే లేదు, సినిమా లేదు. 2021 కి వీడ్కోలూ అందంగా లేదు. 

సికిందర్ 

26, డిసెంబర్ 2021, ఆదివారం

1109 : రివ్యూ!


 దర్శకత్వం : కబీర్ ఖాన్

తారాగణం :  రణవీర్ సింగ్, బొమన్ ఇరానీ, పంకజ్ త్రిపాఠీ, తాహిర్ భాసిన్, జీవా, సాఖీబ్ సలీమ్, జతిన్ సర్నా, చిరాగ్ పాటిల్, దినకర్ శర్మ, నిశాంత్ ధనియా, హార్డీ సంధు, సాహిల్ ఖట్టర్, అమీ విర్క్, ఆదినాథ్ కొఠారే, ధైర్యా కర్వా, ఆర్ బద్రి, రోమీ భాటియా తదితరులు 

రచన : కబీర్ ఖాన్
,సంజయ్ పూరణ్ సింగ్ చౌహాన్, వాసన్ బాలా; మాటలు : కబీర్ ఖాన్, సుమీత్ అరోరా; సంగీతం : ప్రీతమ్, ఛాయాగ్రహణం : అసీమ్ మిశ్రా

బ్యానర్స్ : రిలయన్స్ ఎంటర్ టైన్మెంట్
, పాంథమ్ ఫిలిమ్స్, విబ్రీ మీడియా, కేఏ ప్రొడక్షన్స్, నాడియా వాలా గ్రాండ్ సన్ ఎంటర్ టైన్మెంట్, కబీర్ ఖాన్ ఫిలిమ్స్

నిర్మాతలు : దీపికా పడుకొనే
, కబీర్ ఖాన్, శీతల్ వినోద్ తల్వార్, విష్ణు వర్ధన్ ఇందూరి, సాజిద్ నాడియా వాలా, రిలయన్స్ ఎంటర్ టైన్మెంట్, 83 ఫిల్మ్ లిమిటెడ్

విడుదల : డిసెంబర్ 24
, 2021
***
        త రెండేళ్ళుగా కోవిడ్ బహు రూపాలతో పోరాడుతున్న మూడు తరాలలో, రేడియో చుట్టూ తిరుగుతూ క్రికెట్ కామెంటరీ వింటున్నఒక తరం వుంది. పోతూ పోతూ దారిలో పాన్ షాపు దగ్గరాగి స్కోరెంత? అని అడుగుతాడొకడు. ముంబైలోని బ్రబౌర్న్ స్టేడియంలో క్రీడాభిమన్యులకి స్వాగతం పలికే కార్యక్రమంలో లతా మంగేష్కర్ 'భారత్ వరల్డ్ చాంప్...' పాడినప్పుడు, దాని క్యాసెట్ కొని అదే పనిగా వింటూ వుంటూ వుంటాడింకొకడు.అప్పటి యుక్త వయస్సులో వున్న తరానికి  మొబైల్, సోషల్ మీడియా, ఇంటర్నెట్, న్యూస్ ఛానెల్స్ ఏవీ లేని కాలం అది. అప్పుడు వార్తలంటే ఆలిండియా రేడియో, దిన పత్రిక, దూరదర్శన్ మాత్రమే. నాన్ లోకల్ ఫోన్ కాల్స్ అంటే ల్యాండ్ లైన్ కి ట్రంక్ కాల్‌ ని బుక్ చేసుకుని వెయిట్ చేయడమే. ఈ పూర్వ రంగంలో రాష్ట్రపతిగా జ్ఞానీ జైల్ సింగ్, ప్రధానిగా ఇందిరా గాంధీ వుంటే, వీరి మధ్య మెరుపులా బంగారు కలశంతో వచ్చి నిలబడతాడొక క్రీడాభిమన్యుడు. కెమెరాలు క్లిక్కు మంటూంటే చరిత్రలో అపూర్వఘట్టం లిఖించిన 1983 జూన్ 25వ తేదీ అది... ప్రతి పౌరుడూ భావోద్వేగాలు పట్టలేక కళ్ళు చెమర్చిన, ఆనంద బాష్పాలు రాల్చిన క్షణం. ఎందుకూ పనికిరారని లండన్లో హేళనకి గురైన టీమిండియా వెస్టిండీస్ ని 43 రన్స్ తో చిత్తుగా ఓడించి అపూర్వంగా, దేశం కోసం తొలి వరల్డ్ కప్ ని హస్తగతం చేసుకున్న కరతాళ ధ్వనుల ప్రతిధ్వనులవి ఎటు చూసినా ...  

        1980 ల్లో క్రికెట్ అంటే కపిల్ దేవే. లండన్‌లోని లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్‌లో జరిగిన ఈ మ్యాచ్‌కి కెప్టెన్సీని  భుజస్కందాలపై మోసుకుంటూ సవాలుగా వెళ్ళిన ఫాస్ట్ బౌలర్ కపిల్ దేవ్, కప్పు చేతబట్టుకుని యమ ఫాస్టుగా ఇట్టే వచ్చేశాడు. 1983లో దేశంలో చాలా జరిగాయి. కత్రినా కైఫ్ అదే సంవత్సరంలో ముద్దుగా బొద్దుగా పుట్టింది. జ్యూనియర్ ఎన్టీఆర్ అదే సంవత్సరం ఎగిరెగిరి పడుతూ పుట్టాడు. టీడీపీ పార్టీ పెట్టిన ఎన్టీఆర్ అదే సంవత్సరం సింహ గర్జన చేస్తూ ముఖ్యమంత్రి అయ్యారు. బందిపోటు రాణి ఫూలన్ దేవి పోనీలే పాపమని అదే సంవత్సరం లొంగిపోయింది. 2000 మంది ప్రాణాల్ని బలిగొన్న వికృత రాక్షస కృత్య నెల్లి ఊచ కోత అదే  సంవత్సరం సంభవించింది.....వీటితో బాటు ఇండియాకి చారిత్రాత్మక తొలి వరల్డ్ కప్ అదే సంవత్సరం తనివిదీరా సొంతమైంది. ఆ విజయాన్ని ప్రధాని ఇందిర తన విజయంగా ఖాతాలో వేసుకుని పార్టీ ఈవెంట్ గా జాతి సంబరాలు మాత్రం జరుపుకోలేదు పుణ్యాత్మురాలు.

        1983 వరల్డ్ కప్ ఇండియా గెలవడం చూశాక  అప్పుడు పదేళ్ళున్న మాస్టర్  బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కి క్రికెట్ మీద పెరిగిన ఆపేక్ష- 2011 లో స్వయంగా వరల్డ్ కప్ గెలిచే దాకా ఎలా ఒక దీక్షగా మారి చరిత్ర సృష్టించిందో తెలిపింది అతడి బయోపిక్ గా తీసిన డాక్యూ డ్రామా సచిన్ -ఏ బిలియన్ డ్రీమ్స్ అనేది.

యోధులు- పథగాములు

సచిన్ ని అలా కార్యోన్ముఖుడ్ని చేసిన  1983 వరల్డ్ కప్ యోధులిదుగో...కపిల్ దేవ్, మోహిందర్ అమర్నాథ్, కీర్తీ ఆజాద్, రోజర్ బిన్నీ, సునీల్ గవాస్కర్, సయ్యద్ కిర్మానీ, మదన్ లాల్, సందీప్ పాటిల్, బల్వీందర్ సంధు, యశ్పాల్ శర్మ, రవి శాస్త్రి, కృష్ణమాచారి శ్రీకాంత్, సునీల్ వాల్సన్, దిలీప్ వెంగ్సర్కార్...మరి వీళ్ళ ఘన కీర్తిని కూడా వెండితెర కెక్కించాలా వద్దా? దేశానికి తొలి వరల్డ్ కప్ విజేతలు వెండితెర కెక్కకపోతే ఎలా? వెండి తెర తీవ్ర అపరాధం చేసినట్టే. అందుకని రణవీర్ సింగ్, దీపికా పడుకొనేలు నడుం కట్టి ఈ ఎపిక్ స్పోర్ట్స్ డ్రామాని తెరకెక్కించేందుకు ముందు కొచ్చారు. రిలయెన్స్ ఎంటర్ టైన్ మెంట్, సాజిద్ నాడియా వాలా, కబీర్ ఖాన్ చేయి కలిపారు. కబీర్ ఖాన్ దర్శకత్వం చేపట్టాడు. భజరంగీ భాయి జాన్ సూపర్ హిట్ తర్వాత రెండు ఫ్లాపులు ఎదుర్కొన్న తను, 83 తో ఇంకో సాహసం చేశాడు.


హోరాహోరీ పోరు
83 ని కపిల్ దేవ్ బయోపిక్ అనొచ్చు. కానీ కాదు. మొత్తం టీంకి చెందిన డాక్యూ డ్రామా ఇది. టీం మేనేజర్ మాన్ సింగ్ (పంకజ్ త్రిపాఠీ) పాయింటాఫ్ వ్యూలో కథగా వుంటుంది. ప్రపంచ కప్ ఆడేందుకు క్రికెట్ కంట్రోల్ బోర్డుకి  ఆహ్వానం అందిన చోట నుంచి ఈ స్పోర్ట్స్ డ్రామా ప్రారంభమవుతుంది. నేరుగా లండన్లో టీం మ్యాచ్ కి సిద్ధమయ్యే దృశ్యాలతో కథ అందుకుంటుంది. అక్కడ ఇండియన్ టీంని చిన్న చూపు చూసి అవహేళనా అవమానమూ చేసే దృశ్యాలుంటాయి. దీనికి తోడూ ఇండియాలో ఇళ్ళ దగ్గర్నుంచి పచ్చళ్ళ బాటిల్సు టోకున రావడం ఇంకా నామోషీ అయిపోతుంది ఇంగ్లీషు దొరల ముందు. పచ్చళ్ళు తినే బచ్చాగాళ్ళయి అయిపోయారు. ఇళ్ళదగ్గర అమ్మలు, అక్క చెల్లెళ్ళు, భార్యలూ ఇంకేం పంపిస్తారు ఇండియా నుంచి. ప్రపంచ కప్‌ గెలవాలని ఇంగ్లండ్‌ కి చేరుకున్నాని తొలి రోజు నుంచే నిశ్చయించుకున్న టీంని జోకర్లుగా చూసి ఆత్మస్థైర్యాన్ని దెబ్బ తీస్తుంటారు ఇంగ్లీషోళ్ళు. 35 ఏళ్ళ క్రితం మనం స్వాతంత్ర్యాన్ని గెలుచుకున్నాం, ఇప్పుడు గౌరవాన్ని గెలుచుకోవడం మిగిలుంది కెప్టెన్ అని మేనేజర్ ఆత్మవిశ్వాసాన్ని నింపుతూంటాడు.

        ఇక ఏర్పాటవుతాయి ఇంగ్లాండ్, ఇండియా, ఆస్ట్రేలియా, పాకిస్తాన్, వెస్ట్ ఇండీస్, న్యూజీలాండ్, శ్రీలంక, జింబాబ్వేలతో కూడిన ఎనిమిది టీములు... వీటితో రెండు గ్రూపులు ఏర్పాటవుతాయి. బి గ్రూపులో వెస్టిండీస్, ఆస్ట్రేలియా, జోంబాబ్వేలతో ఇండియా వుంటుంది. ఇండియా వెస్టిండీస్ ని, ఆస్ట్రేలియానీ, జింబాబ్వేనీ ఓడించి సెమీ ఫైనల్స్ కి చేరుకుంటుంది. సెమీ ఫైనల్స్ లో ఎగతాళి చేసిన ఆతిథ్య దేశం ఇంగ్లాండ్ ని వెటకారంగా ఓడించేస్తుంది. ఫైనల్స్ కొచ్చేసరికి పవర్ఫుల్ వెస్టిండీస్ నీ ఓడించేసి విశ్వ విజేతగా నిలుస్తుంది కపిల్ దేవ్ టీం. సగౌరవంగా వరల్డ్ కప్ ని కైవసం చేసుకుంటుంది.

ముగింపు తెలిసిందే...

1983 వరల్డ్ కప్ మ్యాచ్ ప్రారంభ ముగింపులు ప్రేక్షకులకి తెలిసే వుంటాయి. ముగింపు తెలిసి పోయాక ఇంకా చూసేందుకు ఏమీ వుండదు. అయితే చూసేలా చేసే డ్రామా ఏ మ్యాచ్ కా మ్యాచ్ లో సృష్టించాడు దర్శకుడు. కళ్ళు చెమర్చే అనేక భావోద్వేగపూరిత మలుపులు, ఎత్తుపల్లాలు సృష్టించాడు. అదే సమయంలో అల్లరి టీముతో చిరునవ్వు తెప్పించే అనేక తేలిక పాటి సరదా సన్నివేశాలూ సృష్టించాడు. సినిమాకి బలం రీసెర్చ్. ప్రతీ మ్యాచ్‌నీ పదే పదే చూశారనీ, ప్రతీ సన్నివేశాన్నీ చిత్రీకరించే ముందు మ్యాచ్ వీడియోల్ని తెగ చూశారనీ అన్పించే రీసెర్చి. ఆ ప్రత్యక్ష ప్రసార వీడియోల్లోంచి ఆయా భావోద్వేగాలతో కూడిన సన్నివేశాలని పట్టుకున్నారన్పించే కూలంకష రీసెర్చి.

        అదే సమయంలో ప్రతీ పాత్రలో ప్లేయర్స్ గా నటుల్ని మౌల్డ్ చేసిన విధానాన్ని బట్టి, క్రియేటివ్ టీమ్ అద్భుత హోమ్‌వర్క్ చేసిందనేది కూడా స్పష్టమవుతుంది. మొత్తం 11 మంది ప్లేయర్స్ కీ ప్రాముఖ్యాన్నిస్తూ సన్నివేశాల రూపకల్పన చేశారు. దర్శకుడితో బాటు రీసెర్చి- క్రియేటివ్ టీములో రచయితలు సంజయ్ పూరణ్ సింగ్ చౌహాన్, వాసన్ బాలా వున్నారు.

        రెగ్యులర్ టెంప్లెట్ అయిన క్రికెట్ కి దేశభక్తిని జోడించి భావోద్వేగాల్ని రెచ్చగొట్టే పనిని  కూడా దిగ్విజయంగా పూర్తి చేశారు. ప్రపంచకప్ ఫైనల్‌లో ఇండియా పవర్ఫుల్ వెస్టిండీస్‌ని ఓడించినప్పుడు డేరింగ్ కెప్టెన్ కపిల్ దేవ్ సృష్టించిన చరిత్ర ఎలాటిదో వెండితెర మీద ఇలా పునర్దర్శనం చేసుకోవచ్చు.

        కామెంటేటర్ ఫరూఖ్ ఇంజనీర్ పాత్రలో బోమన్ ఇరానీ, మేనేజర్‌గా పంకజ్ త్రిపాఠీ, గవాస్కర్‌గా తాహిర్ భాసిన్, శ్రీకాంత్‌గా తమిళ హీరో జీవా, మోహిందర్ అమర్నాథ్ గా సాఖీబ్ సలీమ్, యశ్పాల్ శర్మగా జతిన్ సర్నా, సందీప్ పాటిల్ గా చిరాగ్ పాటిల్, కీర్తీ ఆజాద్ గా దినకర్ శర్మ, రోజర్ బిన్నీగా నిశాంత్ ధనియా, మదన్ లాల్ గా హార్డీ సంధు, సయ్యద్ కిర్మానీ గా సాహిల్ ఖట్టర్, బల్వీందర్ సంధుగా అమీ విర్క్, దిలీప్ వెంగ్సర్కార్ గా ఆదినాథ్ కొఠారే, రవి శాస్త్రిగా ధైర్యా కర్వా, సునీల్ వాల్సన్ గా ఆర్ బద్రి నటించారు.

ఇదుగో అసలు హీరో
ఇక అసలు హీరో కపిల్ దేవ్ గా రణవీర్ సింగ్. పుష్ప లో అల్లు అర్జున్ కాక కూలీవాడే కన్పించినట్టు, రణవీర్ సింగ్ లో రణ వీర్ సింగ్ కాక కపిల్ దేవే అచ్చు గుద్దినట్టు కన్పిస్తాడు. మెథడ్ యాక్టింగ్ తోనే ఇది సాధ్యమవుతుంది. కపిల్ దేవ్ లా శరీరచ్ఛాయ మారడం దగ్గర్నుంచీ అతడి మేకప్, హేర్ స్టయిల్, మాట్లాడే స్వరంనడిచే విధం, బౌలింగ్ చేసేటప్పుడు, నడుస్తున్నప్పుడూ రెండు చేతుల్ని కపిల్ లాగే సరిగ్గా ఒకే భంగిమలో వుంచడం ఓ అద్భుతం. కపిల్ దేవ్ లా  పళ్ళు బయటికి కన్పించే ప్రోస్థెటిక్ మేకప్ ఇంకో అద్భుతం. ఇక జట్టు మేనేజర్ మాన్ సింగ్ పాత్రలో పంకజ్ త్రిపాఠీకి  హైదరాబాదీ యాస పెట్టేశాడు హైదరాబాదీ అయిన దర్శకుడు కబీర్ ఖాన్. ఇదో ఫన్. పోతే కపిల్ దేవ్ భార్య రోమీ భాటియాగా దీపికా పడుకొనే నటించింది...  

        వనరులు లేని ఎలాటి పరిస్థితుల్లో ఇండియన్ టీము ఎవరూ వూహించని బంగారు విజయాన్ని ఎలా సాధించిందో చెప్పే ఈ సినిమా ఒక ఎమోషనల్ జర్నీ. పాటలు ఉత్సాహాన్ని నింపేలా వుంటాయి. సినిమా ఎండ్ క్రెడిట్స్ లో లెజెండ్ కపిల్ దేవ్ కన్పిస్తాడు. ప్రపంచ కప్ గెలిచిన రాత్రి ఎడాపెడా షాంపైన్‌ ని ఎలా తాగారు, ఎవరో తెలియని వ్యక్తి బిల్లు ఎలా చెల్లించాడో చెబుతూ కన్పిస్తాడు. మీరు వరల్డ్ కప్ కోసం వచ్చారా అని ఎగతాళి చేసిన ప్రసిద్ధ బ్రిటిష్ క్రీడా జర్నలిస్టు డేవిడ్ ఫ్రిత్ ఎలా తన మాటల్ని వెనక్కి తీసుకున్నాడో కూడా వుంటుంది. కపిల్ టీం ఎందుకు గెలిచారో మేనేజర్ మాన్ సింగ్ కారణం చెప్తాడు. టీంలో అందరూ అనామకులే. టీం ఇంగ్లాండ్ వెళ్తున్నప్పుడు అభిమానులూ లేరు, అంచనాలూ లేవు. వీళ్ళెక్కడ గెలుస్తార్లే అనుకున్నారు. దీంతో టీం వొత్తిడి ఫీలవలేదు. వొత్తిడి లేకుండా అనామకులమే అనుకుంటూ స్వేచ్ఛగా ఆడారు. దేశం మూర్ఛపోయేలా వరల్డ్ కప్ తో తిరిగి వచ్చారు.  

        83 తెలుగు వెర్షన్ అందరూ చూడాల్సిన ఇన్ఫోటెయిన్మెంట్. బచ్చాగాళ్ళు వండర్ కిడ్స్ అయిన హిస్టరీ. మిస్సయితే దేశ భక్తి కరువైనట్టే!

—సికిందర్