రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

4, మార్చి 2019, సోమవారం

794 : రివ్యూకథ, దర్శకత్వం : ఇంద్ర కుమార్
తారాగణం : అజయ్ దేవణ్, అనిల్ కపూర్, మాధురీ దీక్షిత్, అర్షద్ వార్సీ, రీతేష్ దేశ్ ముఖ్, జావేద్ జాఫ్రీ, సంజయ్ మిశ్రా, జానీ లివర్, అలీ తదితరులు
రచన : వేద్ ప్రకాష్, పరితోష్ పెయింటర్, బంటీ రాథోడ్, గౌరవ్ – రోషిన్, ఛాయాగ్రహణం : కికో నకహారా
***
          1990 లో ‘దిల్’ తో దర్శకుడైన ఇంద్రకుమార్ ఇంకా సినిమాలు తీస్తూ కొత్త తరం ప్రేక్షకుల్ని ఆకర్షించాలని కూడా ప్రయత్నిస్తున్నాడు. ఈ ప్రయత్నంలో 2007 లో ‘ఢమాల్’,  2013 లో ‘గ్రాండ్ మస్తీ’ అనే కామెడీలు తీసి సక్సెస్ అయ్యాడు. ఈ రెండు సక్సెస్ లు పట్టుకుని వాటి సీక్వెల్స్ తీస్తూ పోయాడు. యాక్షన్ కామెడీ ‘ఢమాల్’ కి సీక్వెల్ గా ‘డబుల్ ఢమాల్’ తీసి తిరిగి ఇప్పుడు మరో సీక్వెల్ గా ‘టోటల్ ఢమాల్’ తీశాడు. ఈ మూడు ఢమాల్స్ హిట్టవడం ఒక సంచలనం. ప్రస్తుత ఢమాల్ మూడు రోజుల్లోనే వందకోట్లు రాబట్టి, వారం తిరిగే సరికల్లా ఇంకో వంద కోట్లతో పెద్ద హిట్ కొట్టింది. ఇంత అర్ధం పర్ధం లేని పాత తరహా మైండ్ లెస్ కామెడీకి ఇంత సక్సెస్ ఏమిటబ్బా అని తలలు పట్టుకుంటున్నారు బాలీవుడ్ ప్రముఖులు. ఇంద్ర కుమార్ తీరిగ్గా కూర్చుని ఇంటర్వ్యూ లిస్తున్నాడు. ఇంతకీ ఈ మల్టీ స్టారర్ మైండ్ లెస్ కామెడీలో ఏముంది?  ఇది తెలుసుకోవడానికి ఈ పిచ్చి వాళ్ళ ప్రపంచంలోకి వెళ్దాం... 

కథ 
     గుడ్డూ (అజయ్ దేవగణ్), జానీ (సంజయ్ మిశ్రా) ఇద్దరూ తోడు దొంగలు. పోలీస్ కమీషనర్ మల్లిక్ (బొమన్ ఇరానీ) రద్దయిన నోట్ల దందా చేస్తూంటే యాభై కోట్లు కొత్త నోట్లు కొట్టేసి పారిపోతారు. డ్రైవర్ పింటూ (మనోజ్ పహ్వా) వీళ్ళని దెబ్బ కొట్టి ఆ డబ్బుతో తను పారిపోతాడు. 

          అవినాష్ (అనిల్ కపూర్), బిందూ (మాధురీ దీక్షిత్) లు విడాకుల కేసులో కోర్టులో వుంటారు. కీచులాడుకుని విడాకులు పొందుతారు. విడాకులు మంజూరు చేసి కొడుకు ఎవరి దగ్గర వుండాలో  అతన్నడిగి తేల్చుకోవాలని తీర్పు ఇస్తాడు జడ్జి. కీచులాడుకుంటూనే కొడుకు దగ్గరికి బయల్దేరతారు ఇద్దరూ. 

          లల్లన్ (రీతేష్ దేశ్ ముఖ్), ఝింగుర్ (పితోబాష్ త్రిపాఠీ) లు ఫైర్ డిపార్ట్ మెంట్ ఉద్యోగులు. పైన బిల్డింగ్ తగులబడుతూంటే కింద వల పట్టుకుని ఎవరు ఎక్కువ డబ్బులిస్తే వాళ్ళు ముందు దూకాలని కండిషన్ పెడతారు. లక్ష ఇచ్చిన వాడు దూకగానే ఆఫీసర్లు వచ్చి పట్టుకోబోతారు. ఇద్దరూ పరారవుతారు. 

          ఆదిత్య (అర్షద్ వార్సీ), మానవ్ (జావేద్ జాఫ్రీ) అన్నదమ్ములు. ఒక పురాతన వస్తుశాలలో ఉద్యోగాలున్నాయంటే వస్తారు. ఓనర్ పన్లోకి తీసుకుని, గ్యాలరీ క్లీన్ చేయమంటే మొత్తం పగులగొట్టి క్లీన్ చేశామంటారు. ఓనర్ పట్టుకోవడానికి వెంటబడితే అతడి ఆటోమేటిక్ కారెక్కి పారిపోతారు. 

          డబ్బు కొట్టేసిన పింటూ విమానమెక్కి,  విమానం నడుపుతున్నవాడు ఎవరో మెంటల్ కావడంతో విమానం కూలి కిందపడతాడు. కొడుకు దగ్గరికి ప్రయాణిస్తున్న అవినాష్ - బిందూలు ఇది చూసి ఆగుతారు. తమ పరిస్థితుల వల్ల పరారవుతున్న లల్లన్ – ఝింగుర్, ఆదిత్య – మానవ్ లు కూడా ఇక్కడికే వచ్చి ఆగుతారు. కొన ప్రాణాలతో వాళ్లకి డబ్బు రహస్యం చెప్పేస్తాడు పింటూ. ఇంతలో గుడ్డూ, జానీలు కూడా వచ్చి వినేస్తారు. పోలీస్ కమిషనర్ మల్లిక్ కూడా వచ్చి వినేస్తాడు. పింటూ చచ్చిపోతాడు. జనక్ పూర్ జూలో దాచి పెట్టిన ఆ యాభై  కోట్లు అందరూ కలిసి పంచుకోవడం దగ్గర వాటాలు కుదరక  పోటీ పెట్టుకుంటారు. పోటీలో ఎవరు ముందు జూకెళ్తే వాళ్ళదే డబ్బు. 

          ఈ పోటీలు ఎలా పడ్డారు? ఏమేం కష్టాలు అనుభవించారు? జూకి ఎవరు ముందు చేరుకున్నారు? లేక అందరూ ఒకేసారి వెళ్లి పడ్డారా? జూలో ఎదురైన ఇంకో పరిస్థితేమిటి? చిన్నప్ప స్వామి (మహేష్ మంజ్రేకర్) తన గ్యాంగుతో జంతువుల మీద ఏం కుట్ర చేశాడు? ఈ మిగతా కథ తెలియాలంటే వెండి తెర మీద చూడాల్సిందే.

ఎలావుంది కథ 
       మైండ్ లెస్ కామెడీ జానర్. హిందీలో స్టార్ ఎట్రాక్షన్ వుంటే మైండ్ లెస్ కామెడీలు హిట్టవుతున్నాయి. ‘గోల్ మాల్’ సిరీస్ కూడా ఇలాగే హిట్టయ్యాయి. 2007 లో ‘ఢమాల్’ తీసినప్పుడది 1963 నాటి ‘ఇట్సే మ్యాడ్ మ్యాడ్ మ్యాడ్ మ్యాడ్ వరల్డ్’ కి కాపీ. తెలుగులో ‘కిష్కింధ కాండ’ గా తీశారు. ‘ఢమాల్’ కథని పొడిగిస్తూ 2011 లో ‘డబుల్ ఢమాల్’ తీశారు. ఇప్పుడు తీసిన ‘టోటల్ ఢమాల్’ ని ‘ఇట్సే మ్యాడ్ మ్యాడ్ మ్యాడ్ మ్యాడ్ వరల్డ్’ కే ఇంకో వెర్షన్ గా సీక్వెల్ చేశారు. కాబట్టి రిపీటయిన కథే కథనం మార్చిన సీన్లతో కన్పిస్తుంది. ఐతే ఇది ఫ్యామిలీ ఎంటర్టయినర్ గా కూడా పనిచేస్తోంది చివర్లో జూలో జంతువులతో కామెడీలతో కలుపుకుని. 

 ఎవరెలా చేశారు 
     అనిల్ కపూర్, మాధురీ దీక్షిత్, అజయ్ దేవగణ్, రీతేష్ దేశ్ ముఖ్ లాంటి స్టార్లు సిగ్గుపడకుండా అర్ధం పర్ధంలేని  పిచ్చి కామెడీలన్నీ చేశారు. సిట్యుయేషన్స్ మైండ్ లెస్ గానే వుంటాయి, ఆ సిట్యుయేషన్స్ లో పేలే డైలాగులే నవ్విస్తూంటాయి... ‘వాళ్లకి తెలీదేమో నన్ను మించిన కుక్క లేదని’, ‘డబ్బు లాగే దాకా వదలను’, ‘డబ్బు లాగేక ఎందుకు వదులుతావ్ డబ్బు?’, ‘ఇది నీ రోప్ (తాడు) అనుకో - ఇదే నీ లాస్ట్ హోప్’, ‘స్ట్రగుల్ చేయడానికి రాలేదు - సెటిల్ అవడానికి వచ్చాం’, ‘నీకు అవినాశ్ అని పేరెవరు పెట్టారు -నువ్వు సత్తెనాశ్ వి’, ‘మేకల్ని బలిస్తారు - పులుల్ని కాదు’, ‘ఇది నీకు టార్చర్ - నాకు వామప్ అనుకో’,  ‘హైదరాబాదీలంటే బిర్యానీతోనే ఐడెంటిఫై కారు -  ఖుర్బానీలతో  (ప్రాణత్యాగాలతో) కూడా ఐడెంటిఫై అవుతారు’, ‘మూన్నాళ్ళ జీవితం ఇవ్వాళ్ళ మూడో నాడు’, ‘పరిస్థితి ఎమర్జెన్సీ గా వుంది - వాతావరణం భయానకంగా వుంది - ఈ ఛాన్సు లక్కు మార్చుకోవడానికుంది’, ‘ప్రపంచంలో రెండు రకాల మనుషులుంటారు- మన చేత తన్నులు తిన్నవాళ్ళు -  వాళ్ళ చేతిలో తన్నులు తిన్న వాళ్ళం’, ‘ప్రపంచంలో గుండె బలం లేనోళ్ళు  మన దేశంలో తండ్రులే’, ‘మిడిల్ క్లాస్ వాణ్ని ప్రావిడెంట్ ఫండ్  డబ్బులడగడం వాడి కిడ్నీ అడగడం లాంటిదే’, ‘సాధారణ వడ్డీ -  చక్రవడ్డీ ఎలా లెక్కిస్తారు?....ఇలా అంతుండదు.  

          అరవ మాయగాడుగా అలీ, విమానాలు అద్దెకిచ్చే వాడుగా జానీ లివర్ కన్పించి గోల కామెడీ చేస్తారు. సోనాక్షీ సిన్హా ఒక ఐటెం సాంగ్ లో కన్పిస్తుంది. జూ ఓనర్ గా ఈషా గుప్తా వుంటుంది. ఈమె సెక్యురిటీ గార్డుగా క్రిస్టల్ ది మంకీ అనే చింపాంజీ వుంటుంది.  

          ప్రొడక్షన్ విలువలు, మేకింగ్ రిచ్ గా వున్నాయి. ఉత్తరా ఖండ్ కొండ ప్రాంతాల ఔట్ డోర్ లొకేషన్స్ అద్భుతంగా వున్నాయి. రెండు గంటల సేపూ ఔట్ డోర్ అడ్వెంచర్ గానే సాగుతుంది సినిమా. పాటలు పెద్ద గొప్పగా లేవుగానీ, ఛాయాగ్రహణం, కళాదర్శకత్వం, వీఎఫ్ఎక్స్ ఉన్నతంగా వున్నాయి. కామెడీగా వుండే యాక్షన్ సీన్స్ చిత్రీకరణలో వేగం థ్రిల్ చేస్తుంది. 

చివరికేమిటి 
      ఇప్పుడు కూడా పాత ఇంద్రకుమార్ కొత్త దర్శకులకి తీసిపోని విధంగా మేకింగ్ చేయడం ఒక గొప్ప విషయం. ఎక్కడా చీప్ లుక్, లూజ్ మేకింగ్ రానివ్వలేదు. కామెడీలో పంచ్ ని ఏ షాట్స్ పెట్టి తీయాలో అలా తీసి కెమెరాతో కూడా నవ్వించాడు. ఔట్ డోర్ లొకేషన్స్ లో హీమాన్ క్యారెక్టర్లతో వెస్టర్న్ ఫీల్ తీసుకొచ్చాడు. కామెడీకి లాజిక్ అవసరం లేదు. కానీ ఆ కామెడీ పుట్టడానికి కారణమైన బేస్ లాజికల్ గా వుండి తీరాలి. పోలీస్ కమీషనర్  దగ్గర యాభై కోట్లు కొట్టేయడం లాజికల్ బేసే. దీన్నాధారంగా చేసుకుని ఎంత పిచ్చి కామెడీ అయినా చేసుకోవచ్చు. అందుకని విమానాలు అద్దె కిచ్చే సీను, హెలీ కాప్టర్ కి గాలి చక్రం లేకపోతే  ఫ్యాను తగిలించి ఎగరేసే సీను లాంటివెన్నో చెల్లిపోయాయి. ఊబిలో కూరుకు పోతున్న వాణ్ణి  తాడు అనుకుని పాముని విసితే, ఆ పాముని పట్టుకుని పైకి ఎగబ్రాకే (వాడి బరువుకి పాము మధ్యకి తెగిపోదా అనే ప్రశ్న అనవసరం) సీను, జూ నైట్ సీన్ క్లయిమాక్స్ లో ఏనుగు, దాని పిల్ల, చింపాంజీ, దాని పిల్ల, సింహం, దాని పిల్లలతో ప్రమాదంలో పడి - మదర్ సెంటి మెంట్లు రెచ్చగొట్టి బయటపడే కామెడీ సీన్లూ....ఇలా ప్రతీ చోటా పిచ్చి పిచ్చి కామెడీలు చేయిస్తూ పోయాడు స్టార్లతో.  సిట్యుయేషన్స్ సిల్లీనే, వాటికి పేల్చుకునే డైలాగులే పిచ్చ కామెడీ. 

          ఇంకోటేమిటంటే, అందరు నటుల్నీ కలిపి ఎక్కడా గుంపు కామెడీ చేయలేదు. డబ్బు కోసం అందరూ పోటీ పడి ఒకే గుంపుగా వెళ్లి వుంటే, ఆ గుంపు సీన్లు కాసేపటికి బోరు కొట్టి విషయం అయిపోయేది. ముందుగా ఎలా ఇద్దరిద్దరు కలిసి పారిపోయి వచ్చారో, డబ్బు రహస్యం తెలిశాక అలాగే  ఇద్దరిద్దరు చొప్పున విడివిడిగా ప్రయాణాలు సాగిస్తారు. అప్పుడు అనిల్ కపూర్ - మాధురీ దీక్షిత్, అజయ్ దేవగణ్ - సంజయ్ మిశ్రా, రీతేష్ దేశ్ ముఖ్ - పితోబాష్ త్రిపాఠీ, అర్షద్ వార్సీ - జావేద్ జాఫ్రీ, బోమన్ ఇరానీ - విజయ్ పాట్కర్ ఐదు జంటలూ విడివిడి ప్రయాణాలు చేస్తూ, ఐదు ఎపిసోడ్లుగా ఏ జంటకా జంట విడివిడి కామెడీలు చేసుకుంటూ పోతారు. జూతో సహా ఇలా విడివిడి కష్టాల కామెడీలు చూపించడం వల్ల మొనాటనీకీ, బోరుకీ వీల్లేకుండా బయటపడిందీ రెండు గంటల మైండ్ లెస్ కామెడీ. కథని  ఈ విధంగా వ్యూహాత్మకంగా ప్లాన్ చేయడంతో వ్యాపారాత్మకంగా చెల్లుబాటైందీ మల్టీ స్టారర్ ఎంటర్ టైనర్.

సికిందర్
Watched at Inox Gvk One, B. hills
At 7.30 pm, Feb 25, 2019