రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

8, జులై 2019, సోమవారం

846 : స్క్రీన్ ప్లే సంగతులు -2మిడిల్ - 1 కథనం :
         
రాహుల్, రాకీ, రాంబోలు మిత్రని కిడ్నాప్ చేసి ఆమె తండ్రి ఆర్కేని బెదిరిస్తారు. ఎనిమిది లక్షలు డిమాండ్ చేస్తారు. పోలీసులకి చెప్తే మిత్రని చంపేస్తామంటారు. ఆర్కే ఎనిమిది లక్షలు అందించి మిత్రని విడిపించుకుంటాడు. మిత్రుడైన పోలీసు అధికారి  (సత్యకృష్ణ) కి చెప్తాడు.  పోలీసు అధికారి కామెడీగా ఎంక్వైరీ చేస్తాడు. 

          ఇప్పుడు డబ్బుతో హైదరాబాద్ వెళ్లిపోయేందుకు సిద్ధమవుతుంది మిత్ర. ఆమెని బస్సెక్కించేస్తాడు రాహుల్.  వాళ్ళ వాటా మూడు లక్షలు తీసుకొమ్మంటే హైదరాబాద్ వచ్చి తీసుకుంటామంటాడు. అనుమానం రాకుండా ఒకరోజు ఆగి వస్తామంటాడు. ఆర్కే ఇంటికి వెళ్లి చూస్తే మిత్ర వుండదు. మళ్ళీ  పోలీసు అధికారికి కంప్లెయింట్ చేస్తాడు. మిత్ర ట్యూషన్ మాస్టార్ని ముగ్గురు కొడుతూండగా చూశానని ఒకడు అంటాడు. ఆ ముగ్గురి గురించి కామెడీగా ప్రశ్నించి  కొట్టి పారేస్తాడు పోలీసు అధికారి. 

          మిత్ర హైదరాబాద్ చేరుకుంటుంది. రాహుల్ కూడా రాకీ, రాంబోలతో చేరుకుంటాడు. మిత్రకి కాల్ చేస్తాడు. కలుద్దామనుకుంటారు. ఇంతలో మిత్ర కిడ్నాప్ అవుతుంది.  ఎనిమిది లక్షలున్న బ్యాగుతో సహా బందీ అవుతుంది.  ప్రొఫెషనల్ కిడ్నాపర్ ఆమె ఇచ్చిన నంబర్ తీసుకుని రాత్రికల్లా పది లక్షలు ఇవ్వాలని రాహుల్ ని బెదిరిస్తాడు. ఇవ్వకపోతే మిత్రని అమ్మేస్తానంటాడు. రాహుల్ షాక్ తింటాడు...

          ఇంతవరకు కథ చెప్పి,  సెల్ రింగ్ అవుతూంటే ఆగుతాడు విశాల్. కాల్ కట్ చేసి హీరోయిన్ షాలినికి సారీ చెప్తాడు. మళ్ళీ సెల్ రింగవుతుంది. మళ్ళీ సారీ చెప్తాడు. ఫర్వాలేదు రిసీవ్ చేసుకోమంటుంది. ఆ కాల్ అతడి తల్లి చేస్తుంది. ఫాదర్ కి యాక్సిడెంట్ అయిందని, ఆపరేషన్ కి ఎనిమిది లక్షలు కావాలనీ. ఇది తెలుసుకుని షాలిని డబ్బు ఏర్పాటు చేస్తానంటుంది. ఇద్దరూ బయల్దేరతారు. 

          ఇంకోవైపు కిడ్నాపర్ డిమాండ్ చేసిన పది లక్షలు సంపాదించడం కోసం తిరుగుతూంటారు రాహుల్, అతడి ఫ్రెండ్స్. ఏటీఎం మీద కూడా కన్నేస్తారు. డబ్బు కోసం బయల్దేరిన మేనేజర్ కి కాల్ చేసి డబ్బు ఏర్పాటు చేయమంటుంది. హాస్పిటల్ కి దారిలో మేనేజర్ వచ్చి డబ్బు అందిస్తాడు. ఆ డబ్బుతో వెళ్తూండగా కారు ఒక్కసారి యాక్సిడెంట్ కి గురవుతుంది. కారుమీద పడి ఆ డబ్బు దోచుకుని పారిపోతారు రాహుల్ అండ్ ఫ్రెండ్స్
(ఇంటర్వెల్)

విశ్లేషణ : 
మిడిల్ అంటే హీరో సంకల్పించుకున్న గోల్ కోసం సంఘర్షణ. గోల్ సాధనలో ఈ సంఘర్షణతో హీరో పాత్ర ఉక్కిరిబిక్కిరవుతుంది. తను ఒక యాక్షన్ తీసుకుంటే,  దానికి రియాక్షన్ గా ఇంకోటి జరుగుతుంది. ఆ రియాక్షన్ కి ఇంకో యాక్షన్ తీసుకుంటే, దానికి మళ్ళీ రియాక్షన్ గా ఇంకోటి జరుగుతుంది. ఈ వలయం అంతకంతకూ తీవ్ర స్థాయికి చేరుకుంటూ, ఇందులోంచి బయటపడే మార్గం ఒక చోట కన్పిస్తుంది : అదే ప్లాట్ పాయింట్ టూ అనే కీలక ఘట్టం. ఇది సెకండాఫ్ క్లయిమాక్స్ దగ్గర వస్తుంది. అక్కడ్నించీ ముగింపుకి దౌడు తీస్తుంది కథనం. 

          ఈ మిడిల్
, ఫస్టాఫ్ లో ప్లాట్ పాయింట్ వన్ కీ, ఇంటర్వెల్ కీ మధ్య మిడిల్ వన్ గానూ, ఇంటర్వెల్ తర్వాత  సెకండాఫ్ లో ప్లాట్ పాయింట్ టూ వరకూ మిడిల్ టూ గానూ రెండు భాగాలుగా వుంటుంది. ఈ రెండు భాగాల మిడిల్ విభాగంలో వుండేదే కథ. మిడిల్ కి ప్లాట్ పాయింట్ వన్ కవతల, బిగినింగ్ లో వుండేది కథ కాదు. కేవలం మిడిల్లో వుండే కథకి అది ఉపోద్ఘాతం. అలాగే మిడిల్ కి ఇవతల, ప్లాట్ పాయింట్ టూ తర్వాత మొదలయ్యే ఎండ్ విభాగంలో వుండేది కూడా కథ కాదు. కేవలం మిడిల్ విభాగంలో వున్న కథకి ముగింపు. ఈ మొత్తం మిడిల్లో ప్లాట్ పాయింట్ వన్ దగ్గర హీరో కేర్పడిన గోల్ ఎలిమెంట్స్ నాల్గూ అమలవుతాయి. పై మిడిల్ వన్ కథనం చూద్దాం.  

          గత వ్యాసం ప్లాట్ పాయింట్ వన్ దగ్గర మిత్రని కిడ్నాప్ చేశాక, ఇప్పుడు మిడిల్ వన్ లో పడింది కథనం. అంటే కథ ప్రారంభమయ్యింది. ఇక్కడ మిత్రని హైదరాబాద్ కి చేరవేసే గోల్ కోసం రాహుల్ ఆమె తండ్రిని బెదిరించి ఎనిమిది లక్షలు లాగి మిత్ర కిచ్చేశాడు. ఇది గోల్ కోసం హీరో తీసుకున్న యాక్షన్. వెంటనే దీనికి రియాక్షన్ మొదలై పోయింది –మిత్ర  ఫాదర్ ఆర్కే పోలీస్ కంప్లెయింట్ ఇవ్వడంతో. రాహుల్ ని అనుమానించేందుకు ఒక సాక్షి దొరకడంతో. ఆర్కే ఈ కిడ్నాప్ కేసులో దోషుల్ని పట్టుకోవడానికి పట్టుదల తోనే వున్నాడు. కానీ పోలీసు అధికారియే వెర్రి థియరీలు చెప్తూ కేసుని నీరు గారుస్తున్నాడు. 

       ఇలా రిలీఫ్ దొరికిన రాహుల్ ఇంకో యాక్షన్ తీసుకుని, మిత్రని హైదరాబాద్ పంపేశాడు డబ్బుతో. ఇప్పుడే తాము కూడా వస్తే అనుమానిస్తారని, తర్వాత వస్తామని ఆమెని పంపేశాడు. కిడ్నాపైన రెండో రోజే కూతురు మాయమైందంటే, కిడ్నాప్ వ్యవహారం ఆమే నడిపించి వుంటుందని అనుమానం రావాలి ఆమె తండ్రి ఆర్కే కి. ఈ యాంగిల్లో రాహుల్ ఆలోచించలేదు. ఆలోచన తక్కువ యూత్ ఎలాటి పనులు చేస్తూంటారనేదే ఈ కథ. చేస్తున్నవి పెద్ద నేరాలని కూడా తెలుసుకోవడం లేదు. అయితే దీనికి మూల్యం చెల్లించుకునే నైతిక ఆవరణ కూడా ఈ కథకి లేదు. ఇది పాత్ర చిత్రణల పరంగా కొట్టొచ్చినట్టుండే లోపం. హాలీవుడ్ ‘బేబీ డ్రైవర్’ లో టీనేజీ హీరో, ఆ వయసులో తెలియక నేరాలు చేసినా, తర్వాత అతడి అడుగులు శిక్ష అనుభవించే సంఘటనల దిశగానే తెలియకుండానే పడతాయి. దీంతో ఆ కథ నైతికావరణ (మోరల్ ప్రెమీజ్) పరిపూర్ణంగా కన్పిస్తుంది. ఇది ఆస్కార్ అవార్డు పొందిన మూవీ అనేది వేరే సంగతి, ఇందులో నేరాలకి తగిన చట్టం అమలవడమనే జస్టిఫికేషన్ వుంటుంది. ‘బ్రోచేవారెవరురా’ లో ఈ జస్టిఫికేషన్ లేకుండానే హీరోయిన్ సహా హీరోనీ, అతడి ఫ్రెండ్స్ నీ తగిన గుణపాఠం లేకుండానే హేపీ ఎండింగ్ ఇచ్చారు.  దీంతో ఇలాటి యూత్ కి రాంగ్ మెసేజి వెళ్లేట్టు చేశారు. 

          ఇందులో చట్ట పాలన చూపించకుండా కర్మ సిద్ధాంతాన్ని అమలు చేశారు. అయితే చివరికి కర్మ సిద్ధాంతం ప్రకారమయినా వాళ్ళకి గుణపాఠం లేదు. టౌన్లో ఆడిన ఉత్తుత్తి కిడ్నాప్ డ్రామాకి రియాక్షన్ గా, హైదరాబాద్ లో రియల్ కిడ్నాప్ జరగడం కర్మ ఫలమే అనుకుంటే, ఇంకా రాంగ్ నిర్ణయం తీసుకుని రాహుల్, విశాల్- షాలినిలకి ప్రమాదం జరిపించి వాళ్ళ దగ్గర డబ్బు కొట్టేశాడు. ఆమె ప్రాణాపాయ స్థితిలో కెళ్ళిపోయింది. ఇది హత్యాయత్నం అంతటి తీవ్ర నేరమే. 

          ఐతే స్టోరీ డైనమిక్స్ కోసం హీరో ఇలాటి చర్యలకి పాల్పడం పాత్ర చిత్రణకి మంచిదే. పోనూ పోనూ అధఃపాతాళంలోకి జారుకోవడం... అయితే ఈ చర్యలకి చివర్లో అనుభవించాలి, ఇదే జరగలేదు. లైటర్ వీన్ క్రైం కామెడీ కైనా ఇది సూటవదు. కథనంలో ఇంకా చాలా వాటిని దాటవేశారు. మిత్రకి  ఎనిమిది లక్షలున్న బ్యాగు నిచ్చి హైదరాబాద్ పంపడం కన్విన్సింగ్ గా వుండదు. అందులో మూడు లక్షలు  తమ వాటా కూడా రాహుల్ తీసేసుకుండా, హైదరాబాద్ వచ్చి తీసుకుంటాననడం పాత్ర చిత్రణని బలిపెడుతూ కథా సౌలభ్యం చూసుకోవడమే. ఇక అంత డబ్బుతో ఆమె హైదరాబాద్ వెళ్లి రియల్ కిడ్నాపై నప్పుడు ఆ డబ్బు ఇచ్చేసి బయట పడొచ్చు. ఆమె బ్యాగుని చెక్ చేసిన కిడ్నాపర్ అనుచరుడు అందులో ఏమీ లేదంటాడు. కానీ అడుగునే డబ్బులున్నాయి. కథా సౌలభ్యం కోసం ఇవన్నీ దాటవేయడం క్రైం కథకి తగదు. క్రైం కథ లాజికల్ గా వుండాలి. 

     కథా సౌలభ్యం చూసుకునే పనిలో లాజిక్ ని దాటవేయడం దర్శకుడు విశాల్ - హీరోయిన్ షాలినల మధ్య బిగినింగ్ విభాగంలో చూశాం. సగం కథతో అతను కథ విన్పించడానికి వెళ్లడమేమిటి? ఇలాగే వీళ్ళిద్దరి మధ్య ఇప్పుడు మిడిల్ వన్ లో కూడా  కథా సౌలభ్యం కోసం సభా మర్యాదని బలిపెట్టారు. దీని గురించి తర్వాత చెప్పుకుందాం. కథా సౌలభ్యం చూసుకుంటూ కథనంలో మంచి డైనమిక్స్ ని మిస్ చేసుకున్న ఈ ఘట్టం గురించి చెప్పుకుందాం : ఎనిమిది లక్షలున్న బ్యాగుతో మిత్ర హైదరాబాద్ వెళ్లి కిడ్నాప్ అయినప్పుడు, ఆ డబ్బు విషయం దాటవేసి కథ నడిపినప్పుడు, చివరికి ఆ డబ్బేమైందో కూడా తేల్చలేనప్పుడు, ఒక్కటే చేసి వుండాల్సింది – ఆ డబ్బున్న బ్యాగు ఆమె పోగొట్టుకోవాలి, పోగొట్టుకున్నాక రియల్ కిడ్నాప్ అవ్వాలి. ఇది పదహారణాల కర్మ ఫలం. 

          ఇక దర్శకుడు విశాల్ షాలినికి రియల్ కిడ్నాప్ వరకూ కథ చెప్తున్నప్పుడు,  అతడి సెల్ మోగుతుంది. కట్ చేస్తాడు మళ్ళీ మోగుతుంది. మళ్ళీ కట్ చేస్తాడు. కథ చెప్పడానికి వెళ్ళిన కొత్త దర్శకుడు సెల్ స్విచాఫ్ చేయకుండా, లేదా సైలెంట్ లో పెట్టకుండా టేబుల్ మీద పడేసి ఇంత కేర్లెస్ గా వుంటాడా? అది మర్యాదేనా? అతను దర్శకుడేమో గానీ ముందు కల్చర్ నేర్చుకోవాలి. సినిమా కల్చర్ ఇలా వుండదు. ఆ హీరోయిన్ కూడా ఇరిటేట్ అవకుండా ప్రోత్సహిస్తుంది. పైగా ఆ సమయంలో అతడికి తండ్రికి యాక్సిడెంట్ అయితే వెంటనే ఎనిమిది లక్షలు ఇచ్చేయడానికి బయల్దేరుతుంది... ఈ రెండు పాత్రలూ ఏమిటోగా వున్నాయి. 

          ఇప్పుడు వీళ్ళకి యాక్సిడెంట్ జరిపించి రాహుల్ డబ్బు కొట్టేయడం ఇంటర్వెల్ కి ట్విస్టు విప్పడం. అదేమిటంటే,  ఇంతవరకూ ఫస్టాఫ్ లో విశాల్ చెప్తున్న కథ రాహుల్ - మిత్ర – అండ్ ఫ్రెండ్స్ రూపంలో కల్పిత కథగా వస్తోందన్న అభిప్రాయం ఇక్కడ తప్పవడం. అతను చెప్తూన కథే బయట కాకతాళీయంగా రాహుల్ - మిత్ర – అండ్ ఫ్రెండ్స్ తో నిజంగా జరుగుతున్నదని రివీలవడం. ఇందువల్లే ఇది విశాల్ కి తెలియకుండా అతడి ప్రోఫెటిక్ (భవిష్యవాణి) నేరేషన్ అయింది. చివరికి తనూహిస్తున్న పాత్రలే నిజంగా వుండి, అతడిమీద ఎటాక్ చేసి డబ్బెత్తు కెళ్ళి పోయాయి. గమ్మతయిన కథ ఇది.

(మిడిల్ టూ రేపు)
సికిందర్

845 : స్క్రీన్ ప్లే సంగతులు


        లైటర్ వీన్ ప్రేమ కథలు వారం వారం వచ్చి పోతూంటాయి, లైటర్ వీన్ క్రైం కథ అరుదైన సంగతి. ‘బ్రోచేవారెవరురా’ అలాటి వొక అరుదైన ప్రయత్నం. పెద్దగా కథ జోలికి పోకుండా, కథనాన్నే పట్టుకుని రెండున్నర గంటలు కూర్చోబెట్టగల రైటింగ్ మీద ఆధారపడి చేసిన మేకింగ్. ఈ మేకింగ్ కి ఇవాళ్టి యూత్ సినిమా డిమాండ్ చేస్తున్న మార్కెట్ యాస్పెక్ట్స్ అయిన ఎకనమిక్స్ లేదా రోమాంటిక్స్ యాస్పెక్ట్స్ లో, డబ్బు కోసం కిడ్నాప్స్ అనే ఎకనమిక్స్ ని కథాంశంగా తీసుకుని, అందులో రోమాంటిక్స్ ని నిర్మొహమాటంగా, పూర్తిగా పక్కన బెట్టి, లైటర్ వీన్ క్రైం కామెడీగా తీశారు. యూత్ ప్రేమలతో తీసే రోమాంటిక్ కామెడీలు మధ్యకి  వచ్చేసరికి  పెద్ద వయసు పాత్రల జోక్యంతో, అవి చూపించే పరిష్కారాలతో, యూత్ ని స్వశక్తి విహీనులుగా చేసే సుత్తి రోమాంటిక్ డ్రామాలుగా మార్చెయ్యడాన్ని చూస్తున్నాం. ఇలా కాకుండా ఈ లైటర్ వీన్ క్రైం కామెడీకి  అచ్చమైన రోమాంటిక్ కామెడీ జానర్ మర్యాదని పాటిస్తూ,  మార్కెట్ యాస్పెక్ట్ కి తగిన క్రియేటివ్ యాస్పెక్ట్ ని కూడా జత చేశారు. అంటే యూత్ ని స్వశక్తీ కరణ చేసి చూపించడం. ఒక అవసరం కోసం వాళ్ళ ఆలోచనా ప్రక్రియతో సమస్యలు సృష్టించుకుని, వాటిలోంచి వాళ్ళే తగిన పరిష్కారాలు కనుగొని బయట పడేలా చేయడం. 

         
హీరోయన్ తోనే కథైనా ఆమెతో రోమాన్స్ జోలికి పోకుండా, ప్రేక్షకుల్ని సంతృప్తిపర్చ వచ్చని తీసి సక్సెస్  అయిన మొదటి తెలుగు సినిమా బహుశా ఇదే. విజువల్ మీడియాకి కథ బరువైనది అయినప్పుడు కథనం తేలికగా, కథ తేలికగా వున్నప్పుడు కథనం సంక్లిష్టంగా వుండాలన్న ఒక నియమం ప్రకారం, ఇక్కడ రెండోది అమలవడం కన్పిస్తుంది. ఇటీవల వచ్చిన క్రైం - సస్పెన్స్ - పోలీస్ దర్యాప్తు - థ్రిల్లర్స్ లో నాన్ లీనియర్ కథనాలతో, మల్టి పుల్ ఫ్లాష్ బ్యాకులతో, ప్రేక్షకులు గుర్తుంచుకోలేని అనేక క్లూస్ తో సినిమా కథల్ని నవలా కథనం చేసి ప్రేక్షకుల్ని అయోమయోంలో పడేసిన విధం చూశాం. ఇలా చేస్తే దర్శకుడికి గొప్ప టాలెంట్ వుందని అనుకుంటారని కాబోలు. కానీ అది సినిమా కథనాన్ని నవలా కథనంగా చేయడం. ‘బ్రోచేవారెవరురా’ ఈ ట్రాప్ లో పడకుండా చూశారు. విజువల్ మీడియాకి యాక్షన్ లో వున్న కథకి ఒక్క సంఘటన చాలు, ఆ సంఘటనలో క్లూ పట్టుకోవడం కోసం కథని పరుగులెత్తించడానికి. ఇందులో వుండే థ్రిల్ ఒక సంఘటనకి అనేక క్లూస్ తో వుండదు. క్లూస్ పెరిగి పోతూంటే దేన్ని పట్టుకుని కొనసాగాలో ప్రేక్షకులకి అర్ధంగాక ఆసక్తి నశిస్తుంది. అలాగే ఆ ఒక్క క్లూ పట్టుకుని ఎక్కువ సేపు కథ నడిపినా బోరే. ఆ సంఘటన ఇంటర్వెల్ తర్వాత జరిగి, క్లూస్ కోసం ప్రయత్నిస్తున్నప్పుడు, ప్లాట్ పాయింట్ టూ దగ్గర బ్లాస్ట్ అయితే ఆ క్లూయే స్ట్రక్చర్ అవుతుంది. బోరు కొట్టదు. 

          ‘బ్రోచేవారెవరురా’ లో దర్శకుడి పాత్ర రాసుకున్న కథే, బయట హీరో హీరోయిన్లతో జరగడమనే ప్రోఫెటిక్ (భవిష్యవాణి) నేరేషన్ గా వుంది. దీనివల్ల ఒక సాదా కిడ్నాప్స్ కథకి దర్శకుడు – హీరోయిన్ పాత్రల ఇంకో సమాంతర కథతో ఆసక్తికర లేయర్ ఏర్పడింది. ఈ రెండు కథలు స్క్రీన్ ప్లేలో ఎలా అమిరాయో చూద్దాం...

బిగినింగ్ కథనం:
          ఒక ప్రొఫెషనల్ కిడ్నాపర్ ఒకమ్మాయిని కిడ్నాప్ చేస్తాడు.
          అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న కొత్త దర్శకుడు విశాల్ (సత్యదేవ్) ఈ కిడ్నాప్ సీను పైలట్ గా చెప్తాడు నిర్మాతకి. నిర్మాత ఇంటర్వెల్ సీను కూడా బావుందని అంటాడు. ఇందులో హీరోయిన్ గా షాలినిని సజెస్ట్ చేస్తాడు విశాల్. హీరోయిన్ షాలిని(నివేదా పేతురాజ్) అపాయింట్ మెంట్ సంపాదించి, ఆమెకి కథ చెప్పడం మొదలెడతాడు.

          ఒక టౌన్లో మిత్ర (నివేదా థామస్) తండ్రితో కారులో పోతూంటుంది. ఆమె ముభావంగా వుంటుంది. ఒక నాట్య ప్రదర్శన తాలూకు హోర్డింగ్ కన్పిస్తే దానికేసే చూస్తుంది.     అదే టౌన్లో ముగ్గురుంటారు : రాహుల్ (శ్రీ విష్ణు), అతడి ఇద్దరు ఫ్రెండ్స్ (ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ). ఐదేళ్లుగా ఇంటర్ చదువుతున్న వీళ్ళు రాహుల్ పోగొట్టుకున్న సెల్ ఫోన్  వెతుకుతూంటారు. వీళ్ళు చాలా ఆవారా గాళ్ళు. రాహుల్ కి తండ్రి (శివాజీ రాజా) వుంటాడు.

          మిత్ర కాలేజీలో చేరుతుంది. అదే కాలేజీకి ఆమె తండ్రి ప్రిన్సిపాల్ గా వుంటాడు. చదువు తప్ప ఇంకే ఆలోచనలు పెట్టుకున్నా సహించనని సీరియస్ గా చెప్పేస్తాడు. కాలేజీలో మిత్ర, రాహుల్ బృందం ఫ్రెండ్స్ అవుతారు. ఒక రోజు  మిత్ర ఇంటికాలస్యంగా వచ్చి ట్యూషన్ కెళ్లానని  అబద్ధం చెప్తుంది. ఆమె మార్కులు చూసి అతను తిట్టడంతో, ట్యూషన్ మాస్టర్ మిస్ బిహేవ్ చేశాడనీ, ఇక ట్యూషన్ కెళ్లననీ చెప్పేస్తుంది. కొడతాడు. 

          దర్శకుడు విశాల్ ఇంతవరకు కథ చెప్పి ఆపుతాడు. నిజానికి తన దగ్గర పూర్తి కథ లేదనీ, రెండ్రోజుల్లో అప్డేట్స్ తో వస్తాననీ అంటాడు. సరేనంటుంది షాలిని.
          రాహుల్ మిఅత్ర ఫ్రెండ్స్ ఇంకా క్లోజ్ అవుతారు.
          విశాల్ కి మదర్ నుంచి కాల్ వస్తుంది, ఫాదర్ టూర్ కెళ్లాడని చెప్తుంది. విశాల్ కి నిర్మాత కాల్ చేస్తాడు. కథ ఎంతవరకు వచ్చిందంటాడు. విశాల్ స్క్రిప్టు లోకి చూస్తాడు...

          మిత్ర ట్యూషన్ మాస్టర్ తనతో మిస్ బిహేవ్ చేస్తున్నాడని రాహుల్ కి చెప్పి ఏడుస్తుంది. రాహుల్ ఫ్రెండ్స్ తో వెళ్లి ట్యూషన్ మాస్టర్ ని కొట్టి వస్తాడు. మిత్ర తనిక్కడ వుండలేననీ, ఎక్కడికైనా వెళ్లి పోవాలనుందనీ అంటుంది. హైదరాబాద్ వెళ్ళాలని నిర్ణయ  మవుతుంది. డబ్బు  సమస్య వస్తుంది. మిత్ర తనని కిడ్నాప్ చేసి ఫాదర్ని డబ్బు డిమాండ్ చేయమంటుంది.
          కిడ్నాప్ ప్లాన్ చేసి మిత్రని కిడ్నాప్ చేస్తాడు రాహుల్ ఫ్రెండ్స్ తో కలిసి (ప్లాట్ పాయింట్ వన్).

విశ్లేషణ : 
        పై బిగినింగ్ కథనంలో కథా నేపథ్యం, పాత్రల పరిచయాలు, సమస్యకి దారితీసే పరిస్థితుల కల్పన, సమస్య ఏర్పాటూ అనే నాల్గు పరికరాలతో కూడిన బిగినింగ్ బిజినెస్ ఎలా వుందో చూద్దాం. 

          ఈ కథకి ఓపెనింగ్ ఇమేజిగా ప్రారంభంలో వేసిన కిడ్నాప్ సీను ఏం కథ చూడబోతున్నామో నేపథ్యాన్ని తెలుపుతోంది. కిడ్నాప్ సీనులో విలన్ కామెడీగా వుండడంతో ఇది క్రైం కామెడీ కావచ్చన్న అంచనాని అందిస్తోంది. రెండో సీన్లోనే ఈ కిడ్నాప్ సీను నిజం కాదని, దర్శకుడు విశాల్ తన కథకి నిర్మాతకి చూపిస్తున్న పైలట్ అనీ అర్ధమవుతుంది. దీంతో ఈ కథకి బ్యాక్ డ్రాప్ ఎత్తుగదతోనే ఆసక్తి రేపుతోంది. 

          ఈ ప్రారంభ దృశ్యాల్లో దర్శకత్వం కోసం ప్రయత్నిస్తున్న, విశాల్, అతడి కథ వింటున్న హీరోయిన్ షాలిని పరిచయమయ్యారు. విశాల్ కి తల్లిదండ్రులున్నారని మదర్ చేసిన ఫోన్ కాల్ ద్వారా తెలిసింది. ఫాదర్ టూర్ వెళ్లినట్టు కూడా తెలిసింది. అతను షాలినికి కథ చెప్పడం ప్రారంభించినప్పుడు అతడి కథలో హీరోయిన్ గా మిత్ర ప్రవేశిస్తుంది ఫాదర్ ఆర్కేతో కారులో ప్రయాణిస్తూ. ఇప్పుడీ రెండు పాత్రలు కూడా పైలట్ కిడ్నాప్ సీన్లో లాగా, కథ చెప్తున్న విశాల్ కల్పిత పాత్రల్లా అన్పిస్తాయి, అదే సమయంలో విశాల్ కథతో సంబంధం లేని, వేరే నిజ పాత్రలతో నిజ కథ కావచ్చన్న అభిప్రాయం కూడా కలుగుతుంది. 

          ఇలా పాత్రలతో, వీటి కథనంతో బిగినింగ్ లోనే సస్పెన్స్ వుంది. మిత్ర ఫాదర్ తో కార్లో పోతూ నాట్యం హోర్డింగ్ చూసినప్పుడు, ఆమెకి నాట్యం పట్ల ఆసక్తి వుందని తెలుస్తుంది. పాత్ర పరిచయం కాగానే దానికో కథకి కీలకమైన అంశం ఆసక్తిగా వుందని వెంటనే ఎస్టాబ్లిష్ చేయడం మంచి కథనం అన్పించుకుంటుంది. సర్వ సాధారణంగా ఇలా జరగదు. పాత్రకి డాన్స్ అంటే ఇష్టమని సాగదీసి సాగదీసి ఎక్కడో చెప్పిస్తారు నోటి మాట ద్వారా. అప్పటి దాకా పాత్ర సమయం తినేస్తూ ఖాళీగా వుంటుంది. ఒక పాత్ర పరిచయ సీన్లో ప్రవేశించిందంటే దానికో మానసిక స్థితితో ప్రవేశిస్తుంది. ఈ మానసిక స్థితిని వెంటనే తెలిపితే పాత్ర ప్రారంభంలోనే ఆసక్తిగా మారుతుంది. పాత్రని ఇలా హాఫ్ వేలో పరిచయం చేసినప్పుడే ఆసక్తి రేపుతుంది. మిత్ర ఈ హాఫ్ వే పరిచయ సీన్లో చదువంటే ఇష్టం లేని, నాట్యమంటే ఇష్టమున్న మానసిక స్థితితో వుంది. ఇదే ఆమె నాట్యం హోర్డింగ్ కేసి చూడ్డానికి కారణమైంది. 

         ఆమె ఫాదర్ ప్రిన్సిపాల్ గా,ఆమె అదే కాలేజీలో చేరిన ఇంటర్ విద్యార్థినిగా పరిచయం పూర్తయ్యక, ఆమె కిష్టం లేని చదువు ఫాదర్ నిర్బంధంగా చదివిస్తున్నాడని అర్ధమవుతుంది. 

          ఇక ఆకతాయి ఆవారా ఐదేళ్ళ ఇంటర్ బ్యాచిగా రాహుల్, రాకీ, రాంబో మిత్రత్రయం పరిచయమవుతారు. రాహుల్ ని తిట్టే తండ్రిగా శివాజీ రాజా పాత్ర పరిచయమవుతుంది. ఇలా మున్ముందు కథకి అవసరమున్న పాత్రల పరిచయాలయ్యాక, సమస్యకి దారి తీసే పరిస్థితుల కల్పన ప్రారంభమవుతుంది...

          ఇంట్లో తండ్రితో నిర్బంధాల్ని ఎదుర్కొంటున్న మిత్ర, మిత్రత్రయానికి క్లోజ్ కావడం మొదటి ఘట్టం; రెండో ఘట్టం,  ట్యూషన్ మాస్టర్ మిస్ బిహేవ్ చేసినా తండ్రి పట్టించుకోకుండా తననే కొట్టడం; మూడో ఘట్టం,  ఇది రాహుల్ కి చెప్పి ఇంట్లోంచి వెళ్లిపోతానానడం; నాల్గో ఘట్టం,  ఇంట్లోంచి వెళ్ళిపోవాలంటే  డబ్బు కావాలనుకోవడం, డబ్బుకోసం మిత్ర సెల్ఫ్ కిడ్నాప్ చేయించుకుని తండ్రి నుంచి దగ్గర్నుంచి డబ్బు లాగాలనుకోవడం...

          ఇలా సమస్యకి దారితీసే పరిస్థితుల కల్పన చేసుకొచ్చాక, మిత్రని కిడ్నాప్ చేయడంతో కథకి సమస్య ఏర్పాటవుతూ - ప్లాట్ పాయింట్ వన్ తో ఈ బిగినింగ్ విభాగంలో నాల్గు పరికరాల పాలన ముగిసింది. 

          కథలిలా సింపుల్ గా వుంటే విశ్లేషించుకోవడానికీ, దాన్ని అర్ధం జేసుకోవడానికీ తేలికగా వుంటుంది. ఇప్పుడీ బిగినింగ్ విభాగం ద్వారా ఈ కథలో ప్రధాన పాత్ర ఎవరని అర్ధమవుతోంది? రాహుల్ అని అర్ధమవుతోంది. మిత్ర సమస్య తీర్చడానికి అతను ఉద్యుక్తుడయాడు కిడ్నాప్ డ్రామాతో. ఇప్పుడామెకి ఏం జరిగినా తనే బాధ్యుడు. ఇతడి గోల్ మిత్రని కిడ్నాప్ చేసి, ఆమె తండ్రి దగ్గర ఎనిమిది లక్షలు లాగి, ఆమెని హైదరాబాద్ పంపించెయ్యడం. 

         ఈ గోల్ ఎలిమెంట్స్ ఎలా వున్నాయో చూద్దాం. 1. కోరిక : మిత్రని హైదరాబాద్ పంపించెయ్యడం, 2. పణం : బాగా జరిగితే మిత్రతో జీవితాన్ని ఎంజాయ్ చేయవచ్చు, జరక్క పోలసులకి దొరికిపోతే వెధవ ఐదేళ్ళ ఇంటర్ చదువువే పోతుంది; 3. పరిణామాల హెచ్చరిక : ఆమెతో పాటు తామూ హైదరాబాద్ కి మాయమైపోతే,  ఇంకా పెద్ద రేంజిలో పోలీసు నెట్వర్క్ లోకి తలదూరుస్తున్నట్టే, ఎన్నాళ్ళు దాక్కుని బ్రతుకుతారు, ఆమె తండ్రి వేట మొదలెడితే; 4. ఎమోషన్ : ఈ మూడిటి బలంతో పాత్రకి డూ ఆర్ డై బలమైన ఎమోషన్ ఏర్పడుతోంది.

          ఈ కథనంలో కిడ్నాప్ కిముందు, మిత్రని తండ్రి కొట్టాక, దర్శకుడు విశాల్ కథ చెప్పడం ఆపుతాడు. తన దగ్గర పూర్తి కథ లేదనీ, రెండ్రోజుల్లో అప్డేట్స్ తో వస్తాననీ షాలినితో అంటాడు. సరేనంటుంది షాలిని. ఇక్కడ ఇద్దరూ తప్పే. దర్శకత్వం అవకాశం కోసం ప్రయత్నిస్తున్న అభ్యర్ధి,  పూర్తి స్క్రిప్టు లేకుండా సగం కథ చెప్పడానికి పోతాడా?  తర్వాత చెప్తానంటాడా? అంత ధైర్యం చేస్తాడా? దానికి హీరోయిన్ రియాక్ట్ అవక సరేనంటుందా? 

          ప్రారంభంలో ఇతను నిర్మాతని కలిసినప్పుడు, ఇంటర్వెల్ అదిరిందని నిర్మాత అంటాడు. అప్పుడు ఇంటర్వెల్ దాకా వున్నకథ ఇప్పుడెందుకు లేదు? ఈ ఇబ్బందులు తొలగాలంటే, సింపుల్ గా ఆ హీరోయిన్ కేదో అర్జెంటు పనిబడి, రేపు వింటానని ఆమే ఆపితే సరిపోయేది. 

          తర్వాత నిర్మాత ఫోన్ చేసి, కథ పూర్తి చేయడం ఎంతవరకూ వచ్చిందని అడుగుతాడు. పూర్తి కథలేకుండానే కొత్త దర్శకుణ్ణి హీరోయిన్ దగ్గరికి పంపాడా? ఇలాటి సౌకర్యముంటే అరకొర కథలు రాసుకుని చాలా మంది కొత్త దర్శకులు క్యూలు కడతారు.
(రేపు మిడిల్)

సికిందర్
telugurajyam.com