రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

15, డిసెంబర్ 2015, మంగళవారం

స్ట్రక్చర్- 8








స్క్రీన్ ప్లే  స్ట్రక్చర్ లో మిడిల్ ని ఒక కథగా చూసినప్పుడు అది  ఏర్పడే విధం వేరు, అదే మిడిల్ ని మనిషి (ప్రేక్షకుల) మానసిక లోకం గా అర్ధంజేసుకుని దృష్టి సారించినప్పుడు జరిగే సృష్టి వేరు. మహోజ్వల భక్తి  సినిమా దగ్గర్నుంచీ నీచమైన బూతు సినిమా వరకూ దేనికైనా బేషరతుగా ఇది వర్తిస్తుంది. సర్వసాధారణంగా మొదటి పద్ధతిలోనే ఈ రోజుల్లో సినిమా కథల్ని చూడడం వల్ల 90 శాతం ఫ్లాపులు ఎదురవుతున్నాయని చెప్పవచ్చు. హిట్ కీ ఫ్లాపుకీ మధ్య ఏవరేజి అనే గౌరవం లేకుండా పోవడానికిదే కారణం. చిన్న సినిమాలే ఎక్కువగా నిర్మిస్తారు. ఈ నిర్మాణాలు కూడా ఇప్పుడు శాటిలైట్ హక్కులు రాకపోవడంతో సంక్షోభంలో పడ్డాయి. బాక్సాఫీసు దగ్గర ‘ఏవరేజీ’ అనే కాస్తయినా డబ్బులు మిగిలే అవకాశం వుంటే మళ్ళీ చిన్న సినిమాల నిర్మాణాలు వూపందుకోవచ్చు. అయితే చిన్నదైనా పెద్దదైనా ముందు వాటి కథల్ని చూసే దృక్కోణం లో మార్పు రావాల్సి వుంటుంది.
థగా చూస్తే మిడిల్ లో ఏమేముంటాయో చూద్దాం. మిడిల్లో వుండే ఎలిమెంట్స్, టూల్స్ ఏవైనా కావొచ్చు అవి ఇవీ :  చెరో పక్క ప్లాట్ పాయింట్ -1, ప్లాట్ పాయింట్-2, అనే రెండు మూల స్థంభాలు, ఈ మూల స్థంభాలని ఆశ్రయించి పించ్ -1, పించ్- 2 అనే రెండు ఉత్ప్రేరక కేంద్రాలు, మధ్యలో మిడ్ పాయింట్ (ఇంటర్వెల్) అనే లంగరు, మొత్తం మిడిల్ అంతా వ్యాపించి ప్రధాన పాత్ర ( కథని బట్టి హీరో/ హీరోయిన్) కుండే లక్ష్యం, ఈ పాత్ర ఉత్థాన పతనాల చాపం ( క్యారక్టర్ ఆర్క్), టైం అండ్ టెన్షన్ గ్రాఫ్, సంఘర్షణ, యాక్షన్ –రియాక్షన్ ల ఇంటర్ ప్లే, ఫోకస్, ట్విస్టులు, పాత్రకి రిస్క్, పాత్రకి అంతర్గత- బహిర్గత సంఘర్షణలు, ఎమోషన్, సస్పెన్స్, థ్రిల్, స్పీడు, సబ్ ప్లాట్స్, పాటలు, కామెడీ, ఫీల్, షుగర్ కోటింగ్ వగైరా వుంటాయి. ఉండేట్టు చూసుకోవాలి. ఎందుకంటే,  ఇవన్నీ ఇంకా కొత్తగా ఏవైనా కలిస్తే అవీ,  మిడిల్ బలిమికి విటమిన్లని  సరఫరా చేస్తాయి. ఈ విటమిన్లతో  మిడిల్ అనే దేహాన్ని నిర్మించాలి—నిర్మించాలి- నిర్మిస్తూనే  వుండాలి- నిర్మించడం పైనే దృష్టి పెట్టాలి. నిర్మిస్తూ పోవడమంటే, ఈ అప్రతిహత నిర్మాణం ఎక్కడికి దారితీస్తుందోనన్న ఆతృతని పెంచడమే ప్రేక్షకులకి. మిడిల్ కథకి  గుండె కాయ లాంటిది. దీనికి పౌష్టికాహారం అందించడం గురించే ఆలోచించాలి. కథకి ఎదుగుదల కన్పించాలి.
మిడిల్ అంటే ప్రధాన పాత్ర ప్రయాణం కూడా. అంటే ఎప్పుడూ చలనం లో వుండేది.  స్తబ్దుగా పడుకుని బోరు కొట్టించడం మిడిల్ లక్షణం కాదు. గుండె నుంచి ప్రవాహంలా రక్త ప్రసరణ జరిగినట్టు, కథలో వుండే పై ఎలిమెంట్స్/ టూల్స్ అన్నీ కలిసి మిడిల్ ని చలనంలో ఉంచుతాయి.  ప్రయాణంలో మన కెన్నో అనుభవాలు ఎందుకు ఎదురవుతాయి?  ప్రయాణిస్తున్నాం గనుక. కనుక మిడిల్ లో ఒక ప్రయాణమంటూ మొదలయ్యాక అందులో అడుగడుగునా సంభ్రమాశ్చర్యాలకి గురి చేసే అనుభవాలే  ఎదురవుతాయి. మిడిల్  కన్నూ మిన్నూ కానని రొడ్డకొట్టుడు ప్రయాణం కూడా కాదు. మొదలెట్టింది లగాయత్తూ క్లయిమాక్స్ మీదే దృష్టి పెట్టుకుని ఒకటే పరుగుదీసే మారథాన్ కాదు. ప్రయాణమంటే పరుగుపందెం కాదు. మొత్తం క్లయిమాక్స్ దాకా  మిడిల్ నంతా  మీదేసుకుని రాయడం మొదలెట్టడం పరుగుపందెం లాంటిది. ఇక్కడ ప్రయాణమే వర్తిస్తుంది, పరుగెత్తడం కాదు. ఒక బస్సు  డ్రైవర్ హైదరాబాద్ నుంచి బస్సుని బయల్దేరదీసి, విజయవాడ వెళ్ళాలంటే, ఇంకేదీ పట్టించుకోకుండా,  ఐదు గంటల్లో చేరుకోవాల్సిన  గమ్యస్థానం విజయవాడని దృష్టిలో పెట్టుకుని అదేపనిగా జామ్మని దూసుకుపోడు. ముందు ఓ రెండున్నర  అరగంటల్లో సూర్యాపేట చేరతామా లేదా దాని మీద దృష్టి పెడతాడు. అక్కడ నుంచి  కోదాడ టైమింగ్ మీద దృష్టి పెడతాడు. కోదాడ నుంచి ఫైనల్ గా విజయవాడ టైమింగ్ ని టార్గెట్ చేస్తాడు. దూసుకుపోవడం ధూర్తుల లక్షణం. మిడిల్ నంతా ధ్వంసం చేసేస్తారు. వాళ్ళు క్లయిమాక్స్ కి షార్ట్ కట్స్ వెతుకుతారు. రచయిత అవడానికో, దర్శకుడు అవడానికో షార్ట్ కట్స్ ఉండొచ్చునేమో గానీ, స్క్రీన్ ప్లే కి అలాటి షార్ట్ కట్స్ ని ప్రకృతి ఏర్పాటు చేయలేదింకా. 
    ***

మిడిల్ అంటే ఒక ప్రయాణమని అర్ధం జేసుకున్నప్పుడు, ముందు ఆ మిడిల్ ప్రారంభమయ్యే ప్లాట్ పాయింట్ -1 దగ్గర్నుంచీ మిడ్ పాయింట్ ( ఇంటర్వెల్) వరకే దృష్టి పెట్టి కథని ఆలోచించాలి. ఇది ట్రీట్ మెంట్ అప్పుడో, డైలాగ్ వెర్షన్ అప్పుడో కాదు, సినాప్సిస్  రాసుకున్న తర్వాత మొదలెట్టే వన్ లైన్ ఆర్డర్ రాస్తున్నప్పుడే జరగాలి.  ఇక్కడ జరక్కుండా ఇంకెప్పుడో ట్రీట్ మెంట్ అప్పుడో, డైలాగులు రాసుకుంటున్న న్నప్పుడో చూద్దాం లే అనుకుంటే గందరగోళమే. అసలు పెన్ను ముందుకు కదలదు. ఎందుకంటే మొత్తం కథ నంతా ఒకే సారి మీదేసుకుంటారు కాబట్టి. ప్రారంభంలో పాత్రల పరిచయ సీన్లు రాస్తూంటే ఎప్పుడో వచ్చే ఇంటర్వెల్ మీదికో, సెకండాఫ్  మీదికో దృష్టిపోతుంది. మిడిల్ మొదలెట్టగానే ఎండ్ పైపు మనసు పరుగు దీస్తుంది. ఇలా మైండ్ నిలకడగా ఉండక, పనిజరక్కుండా చేస్తుంది. పనిని క్రమపద్దతిలో జరక్కుండా చేస్తుంది.

స్పష్టమైన బ్లూ ప్రింట్ లా సినాప్సిస్ రాసుకుని వుంటే అందులో బిగినింగ్ కథ, మిడిల్ కథ, ఎండ్ కథ చక్కగా రూట్ మ్యాప్ చూపిస్తూంటాయి. అప్పుడు క్లుప్తంగా రాసుకున్న ఆ సినాప్సిస్ లోని కథలో మొదట బిగినింగ్ భాగం వరకే  లైన్ ఆర్డర్ వేయడానికి తీసుకుని, అంతవరకే సీన్లు  ఆలోచించడం మొదలెట్టాలి. అంతకి మించి ఎలాటి ఆలోచనా రానివ్వద్దు. ‘హౌ టు స్టాప్ వర్రీయింగ్ అండ్ స్టార్ట్ లివింగ్’ అన్న ప్రసిద్ధ గ్రంధంలో డేల్ కార్నెగీ ఆనందం గా జీవించడం గురించి ఒక చోట ఒక చిట్కా ఇలా చెప్తాడు : గతం- వర్తమానం- భవిష్యత్తు అనేవి మూడు కంపార్ట్ మెంటు లనుకుంటే, ఇటు గతం తలుపు మూసేయండి, అటు  భవిష్యత్తు తలుపు కూడా మూసేయండి- మధ్య వర్తమానం కంపార్ట్ మెంటులో కూర్చుని ప్రస్తుతం, ఈ క్షణంలో  చేయాలో అది చెయ్యండి.. అని.  ఇదే వన్ లైన్ ఆర్డర్ వేయడం దగ్గర కూడా వర్తిస్తుంది. బిగినింగ్ ఆర్డర్ వేస్తున్నప్పుడు మిడిల్, ఎండ్ అనే కంపార్ట్ మెంటుల తలుపులు మూసేయండి. అప్పుడు బిగినింగ్ కంపార్ట్ మెంటులో కూర్చుని, రాసుకున్న  సినాప్సిస్ లో బిగినింగ్ విభాగం వరకే మార్క్ చేసి, దాని తాలూకు సీన్లు మాత్రమే ఆలోచించండి...అలాగే మిడిల్ ఆర్డర్ మొదలెట్టినప్పుడు  ఇటు బిగినింగ్, అటు ఎండ్ లకి తలుపులు గట్టిగా బిగించెయ్యండి. బేఫికరుగా మిడిల్ కంపార్ట్ మెంట్ లో బాసింపట్టు వేసుక్కూర్చుని,  సినాప్సిస్ లో మిడిల్ కి సర్కిల్ గీసి, ఆ ముగ్గులోనే మిడిల్ సీన్లు విస్తరించడం గురించి మల్లగుల్లాలు పడండి. ఈ కష్టం చూసి డ్రింక్ కొడుతూ రాద్దామనుకుంటే అంతా గల్లంతవుతుంది. డ్రింక్ కొడుతూ డైలాగులు రాయొచ్చేమోగానీ, లైనార్డర్, ట్రీట్ మెంట్ లు సవ్యంగా రాయలేరు. తెల్లారి చూసుకుంటే అసభ్యంగా కన్పిస్తాయి. ఆ రోజుకి కష్టపడ్డ తర్వాత హాయిగా రిలాక్స్ అవుతూ డ్రింక్ కొట్టొచ్చు. అప్పుడుండే ఆనందమే వేరు.

ఇంకలాగే, ఎండ్ కొచ్చినప్పుడు, బిగినింగ్- మిడిల్ రెండిటి  ద్వారబంధాలూ బంద్ చేసుకుని, సినాప్సిస్ లో ఎండ్ మీద దృష్టి పెట్టి సీన్లు రాసుకోండి..

ఐతే ఇక్కడ మళ్ళీ ఓ తిరకాసుంది. బిగినింగ్, ఎండ్ ల కంటే మిడిల్  సుదీర్ఘంగా సాగుతుంది. రెట్టింపు సీన్లు వుంటాయి. ఇంత లెన్త్ మళ్ళీ కన్ఫ్యూజ్ చేస్తుంది. అందుకని ఈ మిడిల్ ని కూడా కంపార్ట్ మెంటలైజ్ చేయాలి. అదెలాగంటే ఇంటర్వెల్ కి ముందొకటి, ఇంటర్వెల్ తర్వాతొకటి. ప్లాట్ పాయింట్ -1  దగ్గర్నుంచీ ఇంటర్వెల్ వరకూ వుండే మిడిల్ భాగం, ఇంటర్వెల్ దగ్గర్నుంచీ ప్లాట్ పాయింట్ -2  వరకూ మిడిల్ భాగం..ఇలా రెండుగా చేసుకుంటే అప్పుడవి  ప్రీ ఇంటర్వెల్ మిడిల్, పోస్ట్ ఇంటర్వెల్  మిడిల్ గా రెండు భాగాలుగా వుండి  ఎటాక్ చేయడానికి సులభంగా వుంటాయి.
***

కథకి స్క్రీన్ ప్లే 60 సీన్లతో ఉందనుకుందాం : అప్పుడు బిగినింగ్- మిడిల్- ఎండ్ లకి సీన్ల పంపకం 15-30-15 గా వుంటుంది. కాబట్టి మిడిల్ కి దక్కే ఈ 30 సీన్లని ప్రీ ఇంటర్వెల్ కి 15 గానూ, పోస్ట్ ఇంటర్వెల్ కి 15 గానూ కేటాయించుకుంటే రెండు కంపార్ట్ మెంట్ లు ఏర్పడతాయి. మిడిల్ కి లైన్ ఆర్డర్ వేయడానికి సిద్ధ పడినప్పుడు,  15 సీన్లతో మొదటి కంపార్ట్ మెంట్ లో కూర్చుని, రెండో కంపార్ట్ మెంట్ కి తలుపు బిగించెయ్యాలి. అలాగే ఇటు బిగింగ్ కీ తలుపులేసెయ్యాలి.  అప్పుడు ఇటు బిగింగ్ కథా, అటు ఇంటర్వెల్ తర్వాత సీన్లేమిటా అనే ఆలోచనలూ  డిస్టర్బ్ చెయ్యవు. చేతిలో వున్న 15 సీన్లని పకడ్బందీగా ఇంటర్వెల్ కి చేర్చడమెలా అన్న దానిపైనే ఏకాగ్రత వుంటుంది. దీని తర్వాతే మిడిల్ పోస్ట్ ఇంటర్వెల్ ఆర్డర్ చేపట్టాలి. అప్పుడు ఇటు ఇంటర్వెల్ కీ, అటు ఎండ్ కీ తలుపులేసేసి ఆ 15 సీన్ల సంగతీ చూడాలి సినాప్సిస్ ప్రకారం. అలాగే ఎండ్ కొచ్చినప్పుడు బిగినింగ్, మిడిల్ ప్రీ ఇంటర్వెల్, పోస్ట్ ఇంటర్వెల్ అన్నిటి డోర్లు కూడా వేసేసి, చిట్ట చివరి 15 ఎండ్ సీన్లమీద దండయాత్ర చేయవచ్చు.  

స్క్రిప్టు రాయడానికి ఆచరణకి సులభతరమైన ప్లానింగ్ వుంటే ‘అఖిల్’, ‘సైజ్ జీరో’ ల్లాంటి ఆశాభంగాలు ఎదురుకావు.  మిడిల్లో పడ్డాక అసలు మిడిల్ ఎందుకు మొదలైందో మర్చిపోయి రాసుకుంటూ పోతే ఎలా? కాబట్టి ఇలా మనకి మనమే మిస్ లీడ్ అవకుండా ఉండాలంటే, ఎదురుగా గోడకి అసలు ముందు రాసుకున్న ఐడియా ఏమిటో, దాని సినాప్సిస్ ఏమిటో అంటించి పెట్టుకుంటే - నువ్వు మాకిచ్చిన మాట తప్పుతున్నావ్ రోయ్ - అని అవి ఎప్పటికప్పుడు హెచ్చరిక చేస్తూంటాయి.

నిజంగా మిడిల్ ఒక కీకారణ్యం. ఎటు వైపు ప్రయాణించాలో తెలీదు. ఎప్పుడు? రూట్ మ్యాప్ లేనప్పుడు. దాంతో కంపార్ట్ మెంటలైజ్ చేసుకోనప్పుడు. ప్లాట్  పాయింట్- 1 ని గుర్తించకపోతే, లేదా ప్లాట్ పాయింట్ -1 ఎప్పుడో ఏర్పడిందన్న స్పృహ లేకపోతే, మిడిల్ నిజంగా కీకారణ్యంలాగే కన్పించి ఎటు వైపు వెళ్ళాలో తెలియకుండా చేస్తుంది. ‘బెంగాల్ టైగర్’ లో సినిమా ప్రారంభమైన పదినిమిషాల్లోనే చక్కగా బిగినింగ్ ముగుస్తూ ప్లాట్ పాయింట్ -1 ఏర్పాటయితే, పెళ్లి చూపులప్పుడు ఆ అమ్మాయి నువ్వు ఫేమస్ కాదని హీరోని తిరస్కరించడంతో హీరోకి గోల్ ఏర్పడి మిడిల్ సంఘర్షణ ప్రారంభమైతే, ఇది గుర్తించకుండా ఇంటర్వెల్లో వచ్చిన టర్నింగే  కథకి మలుపు అనుకుని, వేరే పగాప్రతీకారాల కథ ఎత్తుకున్నారు. ‘సైజ్ జీరో’ ఇంటర్వెల్ దగ్గర ఆలస్యంగా ప్లాట్ పాయింట్ -1 ఏర్పడి బరువు తగ్గాలని నిశ్చయించుకున్న హీరోయిన్ ని,  ఇంటర్వెల్ తర్వాత ఆ సమస్యతో సంఘర్షించక, బోగస్ హెల్త్ సెంటర్ మీద పోరాటానికి ఒడిగట్టే హీరోయిన్ గా మార్చేశారు. మిడిల్ తో ఇంత కన్ఫ్యూజన్ అన్నమాట!  అదీ పెద్ద బడ్జెట్ సినిమాలకి!
***

మిడిల్ అంటే  ప్రధాన పాత్ర ప్రయాణమని చెప్పుకున్నాం గనుక- ఈ ప్రయాణంలో ప్రధాన పాత్ర చేసేపని తప్పని సరిగా తనకి ఏర్పడ్డ సమస్యతో పోరాటమే. ఈ పోరాటం ఎలాటిదైనా స్ట్రాంగ్ గా వుండాలి. కామెడీగా వుంటే,  ప్రధాన పాత్రకి ఆ ఎదురుదెబ్బలు కామెడీగానే అంత స్ట్రాంగ్ గా వుండాలి. ఆ పోరాటం యాక్షన్ గా వుంటే, ఆ యాక్షన్ తో ఎదురుదెబ్బలు  అంత స్ట్రాంగ్ గానే  వుండాలి. ఆ పోరాటం హార్రర్ గా వుంటే, హార్రర్ గా ఆ ఎదురు దెబ్బలూ అంత స్ట్రాంగ్ గానే వుండాలి. ఆ పోరాటం ప్రేమ కోసమైతే, ఆ ప్రేమలో ఎదురుదెబ్బలు అంత స్ట్రాంగ్ గానూ వుండాలి. సంఘర్షణలో ఎదురు దెబ్బ లెలాటివైనా అవి స్ట్రాంగ్ గా ఉంటేనే అది మిడిల్ అన్పించుకుంటుంది. అలనాటి ప్రసిద్ధ హాలీవుడ్ దర్శకుడు బిల్లీ వైల్డరే  అంటాడు- స్ట్రక్చర్ అంటే హీరోని చెట్టెక్కించి (బిగినింగ్) - రాళ్ళతో కొట్టి (మిడిల్) – కిందికి దించెయ్యడం (ఎండ్) అని!
రాళ్ళతో కొట్టడమనే కటువైన పదాన్ని వాడడంలోనే మిడిల్ లో ప్రధాన పాత్రని ఎంత నిర్దాక్షిణ్యంగా అణిచెయ్యాలో తెలుస్తోంది. మిడిల్లో ఏమాత్రం ప్రధానపాత్ర మీద దయ చూపినా, ప్రేక్షకులకి జాలి పుట్టదు. అయ్యో ఇదన్యాయమని  ప్రధాన పాత్ర పక్షాన చేరరు. దీని అంతరార్ధం ఇంకొకటుంది. దాని గురించి మానసిక లోకంగా మిడిల్ ని చూసే తర్వాతి సెక్షన్లో చెప్పుకుందాం.

మిడిల్లో ఎదురు దెబ్బలు తింటూ వాటిని జయిస్తూ వెళ్ళకపోతే ప్రధాన పాత్ర శభాష్ అనిపించుకోదు, క్యారక్టర్ ఆర్క్ కూడా ఏర్పడదు. ప్లాట్ పాయింట్ -1, మిడ్ పాయింట్, ప్లాట్ పాయింట్ - 2, ముగింపూ- ఈ మూడిటి దగ్గరా క్యారక్టర్ ఆర్క్ ఎలా ఏర్పడుతోందో, ఏర్పడకపోతే మార్పులేం చేయాలో చూసుకోవాలి. క్యారక్టర్ ఆర్క్ ఏర్పడుతోందంటే పాత్ర చిత్రణ సవ్యం గా ఉన్నట్టే. అంతే గాక టైం అండ్ టెన్షన్ గ్రాఫ్ మెయింటెయిన్ అవుతున్నట్టే.

మిడిల్ ని  ఒక కథగా ఆలోచిస్తే ఇవన్నీ. ఇదొక విధానం. ఈ విధానం వల్ల చాలా వరకూ ఏమౌతోందంటే, ఇతర రకరకాల చేతులు పడి మిడిల్ చెదిరిపోతోంది. ఈ విధానంలో తయారైనవే ‘బెంగాల్ టైగర్’, ‘సైజ్ జీరో’, ‘అఖిల్’ మొదలైనవని అర్ధం జేసుకోవాలి. కథని కేవలం కథగా ఆలోచించడం బలహీనత. రామాయణ, మహాభారతాల్లాంటి పురాణాల్ని కేవలం కథలుగానే ఆలోచించి రాసి వుంటే అవి ఇంతకాలం నిలబడేవి కావు. దేవుళ్ళ కథలు కాబట్టి నిలబడ్డాయనుకోరాదు. ఆ దేవుళ్ళ కథలు దేన్ని బేస్ చేసుకుని, దేన్ని  టార్గెట్ గా చేసుకుని రాశారో అంతరార్ధం తెలుసుకోగల్గాలి. ఈ అంతరార్ధమే గొప్ప, ఉత్తమ కథలన్నిట్లో వుంటుంది. ఈ అంతరార్ధాన్ని, ఈ రహస్యాన్ని తెలుసుకుంటే మిడిల్, మిడిల్ తో బాటు మొత్తం కథా సురక్షితంగా వుంటాయి ఎన్ని చేతులు పడ్డా.
***

కొనే వాడికి రాసేవాడు లోకువ. ఏవో వంకలు పెడతారు. మార్చి పారేస్తారు. రాసే వాడూ కథగానే ఆలోచించాడు కాబట్టి,  ‘మేబీ నేను రాంగ్ కావచ్చులే’  అనుకుని తగ్గుతాడు. ఓ కథ కి చేసిన కథనం రైట్ అని చెప్పడానికీ, రాంగ్ అని చెప్పడానికీ బేస్ ఏమిటి,  దేన్ని బేస్ చేసుకుని  తీర్పు చెప్తున్నారు? సొంత అభిరుచులూ అభిప్రాయాలేగా? జిహ్వకో రుచి అన్నారు. పోనీలే కొనేవాడి జిహ్వచాపల్యం తీరుద్దామని రచయిత ఆ మేరకు రాజీపడి మార్చి రాసేస్తాడే అనుకుందాం- అవెంతవరకూ సక్సెస్ అవుతున్నాయో తెలిసిందే. చిరంజీవి 150 వ సినిమాకి పూరీ జగన్నాథ్ రాసిన కథ సెకండాఫ్ నచ్చలేదని చిరంజీవి తిరస్కరించారు. దీనికి బేస్ ఏమిటి? బేస్ లేకుండా ఎన్ని రకాలుగా మార్చి మార్చి రాసి చూపిస్తూ మెప్పించడానికి ప్రయత్నిస్తారు? మొట్టమొదట రచయితా/దర్శకుడు కథని- ముఖ్యంగా మిడిల్ ని కేవలం కథగానే చూసి రాయడం చేస్తే ఎదురయ్యే సంక్షోభాలివి. తప్పంతా రచయితల/ దర్శకుల దగ్గరే వుంది- హీరోలూ నిర్మాతలూ ఆల్వేస్ రైట్.

మనమిక్కడ మొత్తం స్క్రీన్ ప్లే స్ట్రక్చర్  గురించి చెప్పుకోవడం లేదు. స్ట్రక్చర్ కి వెన్నెముక వంటిదైన  మిడిల్ విభాగపు బాగోగుల గురించే మాట్లాడుకుంటున్నాం. బిగినింగ్, ఎండ్ లు ప్రారంభ ముగింపులే కాబట్టి,  వాటిని కథగానే ఆలోచిస్తే వచ్చే ప్రమాదమేమీ లేదు. మిడిలే కీలకం. మిడిల్ ని కథగా చూడక, దాని నిర్మాణపు అంతరార్ధాన్నీ, రహస్యాన్నీ కనుగొని తయారు చేస్తే, దీని నీడన బిగినింగ్, ఎండ్ లు బతికిపోయే అవకాశాలున్నాయి ఎన్ని చేతులుపడ్డా. మిడిల్ దాని ఆత్మని పోగొట్టుకోకుండా దిట్టంగా నిలబడి వుంటుంది కాబట్టి.  ఏమిటా అంతరార్ధం? ఆ రహస్యమేమిటి? ఆదివారం తెలుసుకుందాం.

—సికిందర్