రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Wednesday, September 24, 2014

ఆనాటి ఇంటర్వూ / సాంకేతికం

          గ్రాఫిక్స్ తో మూవ్ మెంట్స్ ని వివరంగా చూపిస్తున్నాం!
రామ్-లక్ష్మణ్, యాక్షన్ కోరియోగ్రాఫర్స్
          చాలా అన్యాయమైన దృశ్యం...
          ఒక పెద్ద మనిషి రోడ్డు మీద వెళ్తూంటాడు. ఎదురుగా వచ్చిన ఓ యువకుడు కాలోచెయ్యో తగిలిందని ఆ పెద్ద మనిషిని పట్టుకుని కొట్టేస్తూంటాడు. ఇది చూసి బస్టాపు దగ్గర నిల్చున్న ఇంకో వ్యక్తికి పట్టరాని కోపం వచ్చేస్తుంది. పెద్దాయన అని కూడా చూడకుండా ఇంత నీచంగా ప్రవర్తిస్తున్న వీణ్ణి పట్టుకు తన్నెయ్యాలన్పించింది. కానీ అప్పుడే బస్సు వచ్చేస్తోంది. తను వెళ్లిపోవాలి. కళ్ళ ముందు జరుగుతున్న ఆ అన్యాయాన్ని చూస్తూ కూడా ఏమీ చేయలేని పరిస్థితి. ఇంతలో ఇంకెవరో వచ్చి ఆ యువకుణ్ణి పట్టుకు తన్నేస్తున్నాడు. ఇది చూసి అప్పుడు నెమ్మదించాడు బస్టాపు దగ్గర వ్యక్తి. చెత్త యువకుడు చిత్తుగా తన్నులు తింటూంటే కసి అంతా తీరి, ఆ పెద్ద మనిషికి జరిగిన అవమానానికి తగిన న్యాయం జరిగిందన్న సంతృప్తితో ప్రశాంతంగా బస్సెక్కి వెళ్ళిపోయాడు.
          “ సినిమాచూస్తున్న ప్రేక్షకుల మానసిక స్థితి కూడా ఇదే. ఆ బస్టాపు దగ్గరున్న వ్యక్తికి లాంటి స్థితి” - అంటారు ప్రఖ్యాత స్టంట్ మాస్టర్లు రామ్ – లక్ష్మణ్ లు.
          “ సరీగ్గా ఈ టెక్నిక్కే మాదీ. ఒక అన్యాయాన్ని చూపిస్తూ ప్రేక్షకుల్లో కసి పుట్టించి, ఆ కసిని తీర్చడమే మా పని. అన్యాయం...ఆ అన్యాయం లోంచి ఎమోషన్...ఆ ఎమోషన్ లోంచి న్యాయం! అన్యాయం జరుగుతున్నప్పుడు మనకి తెలీకుండా మనలో ఎనర్జీ పుడుతుంది. దీన్నిలక్ష్యం వైపు మళ్ళించాలి” అని వివరించారు.
          మీ యాక్షన్ సీన్స్ కి బేసిక్స్ ఏమిటనే మొట్ట మొదటి ప్రశ్నకి ఈ జంట మాస్టర్ల ప్రతిస్పందన ఇది. ఈ మధ్య ఖలేజా, బృందావనం, సింహా, ప్రేమ కావాలి, మిరపకాయ్, వీర –వంటి బిగ్ స్టార్ల భారీ సినిమాల్లో తమదైన యాక్షన్ కోరియోగ్రఫీతో దుమ్మురేపిన స్టార్ యాక్షన్ డైరెక్టర్లు వీళ్ళు. ఎప్పుడు చూసినా అదే చిరునవ్వుతో, ఎక్కడ చూసినా ఒకే డ్రెస్సులో కన్పించే కవల సోదరులు. ఇప్పుడీ సమయంలోనూ ఇంట్లో కూడా నైట్ డ్రెస్ లో డిటోనే!
          “ఫైట్ మాస్టర్లు రఫ్ గా, యమ సీరియస్ గా ఉంటారని సాధారణంగా అనుకుంటాం. ఇందుకు వ్యతిరేకంగా మీరు చిరునవ్వులు చిందిస్తూ ఇంత సున్నితంగా వుంటారే-“ అని అంటే, సమాధానం చెప్పడానికి ఇబ్బంది పడ్డారు. సమాధానాన్ని దాటవేశారు. కానీ ఇంతర్వూ పూర్తయ్యకగానీ అర్ధంగాలేదు, ఈ సున్నితత్వానికి వీరిలో బయటిప్రపంచానికి తెలియకుండా దాగి వున్న  తాత్విక- ఆధ్యాత్మిక కోణమే కారణమని. (ఈ వివరాలు ఇక్కడ ఇవ్వడం లేదు).
          సినిమాల్లోని ఇతర దృశ్యాల్లోలాగే ఫైట్స్ లోకూడా ఇప్పుడు మెలోడ్రామా తగ్గిందంటారు రామ్ – లక్ష్మణ్ లు. ముందుగా హీరో బాగా దెబ్బలు తిని పడిపోవడం అప్పుడు లేచి తిరగబడి కొట్టడం ఎప్పుడూ ఉండేదే. గతంలో హీరో దెబ్బలు తింటున్నప్పుడు బాగా రక్త స్రావం చూపించే వాళ్ళు. ఇప్పుడది నామ మాత్రం చేశారు.
          ‘ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం’, ‘అమ్మా- నాన్నా- ఓ తమిళ అమ్మాయి’, సినిమాలతో పూరీ జగన్నాథ్ తమని వెలుగులోకి తెచ్చినప్పుడు, ఆ ఫైట్స్ లో మెరుపు వేగంతో పిడి గుద్దులు కురిపించి క్షణాల్లో ప్రత్యర్థిని నేలకూల్చే పద్ధతిని అవలంబించామనీ, రాన్రాను గ్రాఫిక్స్ వల్ల యాక్షన్ టైముని పెంచి, మూవ్ మెంట్స్ ని సవివరంగా చూపించడం ప్రారంభించామనీ చెప్పుకొచ్చారు.
          కానీ ‘వీరా’ లో  విశ్రాంతి ముందు ఫైటింగ్ ని అంత భారీ ఎత్తున చూపించేస్తే, అదే క్లైమాక్స్ అన్న ఫీల్ వచ్చింది కదా, కథనం టెన్షన్ గ్రాఫ్ ని బట్టే యాక్షన్ తీవ్రత పెరగాలి కదా –అంటే, దర్శకుడు కోరింది ఇవ్వడం మాత్రమే తమ బాధ్యతన్నారు. కథలోవిషయం లేకపోతే  తామేమీ చేయలేమనీ, ‘వీర’ లో జరిగిందిదేనని స్పష్టం చేశారు. పాటలు కథలోంచి కాకుండా అకస్మాత్తుగా వచ్చేస్తే ఎలా వుంటుందో, తగిన నేపధ్య బలం లేకపోతే ఫైట్స్ కి కూడా ఎమోష నూ, అర్థమూ ఉండవన్నారు.
          రామ్ – లక్ష్మణ్  పేరు తెలీని ప్రేక్షకు లుండరు. మరి ఇది ఫలానా రామ్ – లక్ష్మణ్ మార్కు ఫైట్ అని ప్రేక్షకులెలా గుర్తించాలని ఆడిగితే, ఇక్కడ అలాంటి బ్రాండింగ్ ఏదీ కుదరదన్నారు. ఐతే ఏ స్టార్ కా స్టార్ ఫిజిక్ నిబట్టి ఫైట్స్ ని సృష్టిస్తామనీ, బాగా ప్రాక్టీసు చేసి, మొత్తం ఆ కోరియోగ్రఫీ నంతా షూటింగు కి వెళ్ళే ముందే షాట్లవారీగా మైండ్ లో ముద్రించుకుంటామనీ తమ విధానం గురించి వివరించారు.
          ఇంట్లోనే ఏర్పాటు చేసుకున్న మినీ థియేటర్ గురించి అడిగితే, హాలీవుడ్ సినిమాలేసుకుని ఫైట్స్ చూస్తామని దాచుకోకుండా చెప్పేశారు. ఐతే వాటిలోంచి సీన్లు ఎత్తేస్తారా అనంటే, ఎత్తేసి తమకు తగ్గట్టుగా పాలీష్ చేసుకుంటామన్నారు. అయితే అన్ని సందర్భాల్లో ఇలా జరగదని చెప్పారు.
          ఈ పదేళ్ళలో 160 సినిమాలు పూర్తి చేసిన వీళ్ళిద్దరూ ఐదు సార్లు నంది అవార్డు గ్రహీతలయ్యారు. ఆర్య, ఆంధ్రుడు, ఢీ, నేనింతే, రైడ్ సినిమాలల్లో తాము సృష్టించిన యాక్షన్ సీన్స్ కి గాను ఈ అవార్డులు లభించాయి. ఇప్పుడీ స్థాయికి చేరిన ఈ జంట యోధులు ఒకప్పుడు మాస్టర్స్ అయ్యేందుకు జంకి, హీరోలై పోదామని ప్రయత్నించారు. తాము మాస్టర్స్ గా మారి, తోటి ఫైటర్స్ ని రకరకాల రిస్కులకి గురి చేయడం ఇష్టం లేకే మాస్టర్స్ అయ్యే ఆలోచనకి చాలా కాలం దూరం వుండిపోయారు.
          ప్రస్తుతం ఎన్టీఆర్ ‘ఊసరవెల్లి’, ఎన్టీఆర్ తోనే బోయపాటి శ్రీను కొత్త సినిమా, వెంకటేష్ ‘బాడీ గార్డ్’, ప్రభాస్  ‘రెబల్’  సినిమాలకు ప్పనిచేస్తున్న రామ్ - లక్ష్మణ్ లు తమ ఈ ఉన్నతికి హీరోలు, దర్శకులు, నిర్మాతలు, ఛాయాగ్రాహకులూ అందరూ కారకులని వినమ్రంగా చెప్పారు.
-సికిందర్
(జులై, 2011 ‘ఆంధ్రజ్యోతి’కోసం.)