రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

3, ఫిబ్రవరి 2016, బుధవారం

రైటర్స్ కార్నర్

రచయిత్రి షగుఫ్తా రఫీఖ్
బాలీవుడ్ లో సక్సెస్ ఫుల్  స్క్రీన్ రైటర్ గా పేరుతెచ్చుకున్న షగుఫ్తా రఫీఖ్ గురించి చెప్పుకోవాలంటే, ముంబాయి డాన్స్  బార్ ల కెళ్ళాలి, దుబాయి వ్యభిచార గృహల కెళ్ళాలి. ఇంకా చాలా చోట్ల కెళ్ళాలి. చాలా చిన్న వయసులో- పదకొండేళ్ళప్పుడు  చున్నీ నడుంకి బిగించి, ముంబాయి డాన్స్ బార్లలో బాలీవుడ్ పాటలకి డాన్సులేసి తాగుబోతుల్ని రంజింప జేసింది. తన్మయత్వంతో వాళ్ళ  వహ్వాలు విన్నాక, తనపైకి డబ్బులు విసరడం చూశాక, ఆడదాని జీవితం ఆమెకి బాగా అర్ధమయింది. ఏది గౌరవప్రదం, ఏది కాదు అనేది డబ్బెలా నిర్ణయిస్తుందో అర్ధంజేసుకుంది. షగుఫ్తా అంటే ఉర్దూలో వికసించినది అని అర్ధం. తను ఇలా వికసిస్తుందనుకోలేదు. ఇంట్లో పేదరికపు బాధలు, బయట లైంగిక వేధింపులు..అలా అలా దుబాయికి ప్రమోట్ అయి వెళ్ళాకా అక్కడా  పూర్తి  వ్యభిచారం...అక్కడ ఇంకా పెద్ద ప్రపంచాన్నే చూసింది. చైనీస్, రష్యన్ అమ్మాయిలతో కలిసి ఖరీదైన ఫ్లాట్స్ కి వేశ్యలా వెళ్ళేది. అక్కడ ఖరీదైన విటుల కుళ్ళు అంతా చూసింది. ఒక్కో అనుభం ఒక్కో పేజీలో తనమనసులో రికర్దావుతోంది. ఓ నాటికి ఇదంతా చూశాకా- ఇలా వుండకూడదు తన జీవితమని నిర్ణయానికి వచ్చేసింది. నిర్ణయానికి వచ్చిందే ఆలస్యం ఆ జీవితాన్ని వదిలించుకుని బయట పడింది. జీవితాన్ని తిరగరాసుకుని, తనని వెంటాడుతున్న అనుభవాలే అర్హతగా  బాలీవుడ్ లో పేరున్న రచయిత్రిగా ఎదిగింది. ఎక్కువగా మహేష్ భట్ సినిమాలకే పనిచేసింది.


         2006 లో ‘వోహ్ లమ్హే’ (ఆ క్షణాలు) తో ప్రారంభించి, 2015 లో  ‘హమారీ అధూరీ కహానీ’  (మా అసంపూర్ణ గాథ) వరకూ 17 సినిమాలకి స్క్రీన్ ప్లే, డైలాగుల రచయిత్రి తనే. రాజ్-2 , మర్డర్ -2, జన్నత్ -2, జిస్మ్ -2, ఆషిఖీ -2, మిస్టర్ ఎక్స్ వంటి విలక్షణ సినిమాలు కూడా తను రాసినవే.

        రచయిత్రిగా తను  సాధిస్తున్న విజయాలకి జీవితంలో తను  ఎదుర్కొన్న దుర్భర అనుభవాలే స్పూర్తి అని మహేష్ భట్ అంటారు. ఆమె సహజ రచయిత్రి అని కూడా అంటారు.  ఆమె రచనలు ఆమె జీవితానికీ, వ్యక్తిత్వానికీ ప్రతిబింబాలనీ,  అందువల్లే ఆమె స్క్రిప్టులు అంత  ఇంటరెస్టింగ్ గా ఉంటాయనీ భట్ నమ్మకం. సినిమా రచయిత  కావాలంటే ఎలాటి శిక్షణా అవసరం లేదని, రచయిత నవ్వాలన్న కాంక్ష బలంగా వుంటే అదే అన్ని ద్వారాలూ తెరుస్తుందని, ఇందుకు ఈవిడే నిదర్శనమనీ భట్ వ్యాఖ్య.

        అన్నట్టు షగుఫ్తా రఫీఖ్  సినిమాలతో సంబంధమున్న కుటుంబంలోనే పుట్టింది. కానీ సినిమాల్లో ఆ కుటుంబ సభ్యులకే ఠికానా లేకుండాపోయింది. తను కాలు పెట్టే పరిస్థితులు అప్పట్లో లేవు. అక్కడ్నించీ చూసుకుంటే ఆమె జీవితం బాలీవుడ్ సినిమాలాగే వుంటుంది. ఆమె అక్కని తాగుబోతయిన బావ కాల్చి చంపాడు, తర్వాత తనూ కాల్చుకుని చచ్చిపోయాడు. ఆమె తల్లి ఒక కొలకత్తా వ్యాపార వేత్తకి భార్య కాని భార్యగా వెళ్ళింది. ఆ వ్యాపారి ఈమె కోసం తన కుటుంబాన్ని బికారుల్ని చేశాడు. ఇక షగుఫ్తా కూడా ఆ తల్లికి పుట్టిన కూతురు  కాదు. దత్త పుత్రిక. తల్లి కూడా వీధిన పడ్డాక, ఆ తల్లిని పోషించుకోవడానికి పదకొండేళ్ళ వయసులో బార్ డాన్సర్ అయింది తను. తను డాన్సర్ నయి ఉండకపోతే దొంగనై వుండే దాన్నని అంటుందామె.  తన తల్లి కుటుంబ పోషణకు గాజులమ్ము కోవడం, వంట సామగ్రి అమ్ముకోవడం చూడలేకే బార్ డాన్సర్ అయ్యింది.

       తల్లికోసం అలా కమిట్ అయ్యాక, ఆమె ప్రోద్బలంతో శాస్త్రీయ నృత్యం – కథక్ నేర్చుకుంది భవిష్యత్తులో సినిమా హీరోయిన్ అవచ్చని. బార్ లో డాన్స్ చేస్తే ఒక్క రాత్రికి 700 రూపాయలు వచ్చేవి. ఆ మొత్తం చాలా ఎక్కువ అన్పించేది. ఎందుకంటే, నెల మొత్తం అయిదువందల రూపాయలతో గడిపిన జీవితాలు తమవి. అప్పట్లో బోన్ సూప్ మాత్రమే పుచ్చుకునే తను, తన తల్లి ఇప్పుడు చికెన్ బిర్యానీలు, మటన్ బిర్యానీలు తినే అదృష్టాన్ని సంపాదించుకున్నారు. తను సినిమా హీరోయిన్ అయ్యే కల  నిజం కాలేదు గానీ, 17 వ ఏట  ఒక ధనికుడికి ఉంపుడు గత్తెగా వెళ్ళాల్సి వచ్చింది.

        అక్కడ బందికానాలా వుండేది. స్వేచ్చకి సంకెళ్ళు పడ్డాయి. అక్కడ్నించి విముక్తి  పొందడానికి ఫుల్ టైం వేశ్యగా మారడానికి సిద్ధపడింది. ఒక చక్రబంధంలో ఇరుక్కుపోయింది. వేశ్యగా ఖరీదైన వ్యక్తుల దగ్గరికి వెళ్ళేది. వాళ్ళలో పారిశ్రామిక వేత్తలు, రాజకీయవేత్తలు, ఉన్నత ప్రభుత్వాధికారులూ వుండే వాళ్ళు. ఇక్కడి కంటే ఇంకా దుబాయిలో బాగా డబ్బుందనే సరికి  దుబాయ్ చేరుకుంది...

        దుబాయిలోనే  జ్ఞానోదయమయింది. ఈ చక్రబంధం లోంచి బయట పడాలంటే తన అనుభవసారంతో తానో  రచయిత్రిగా మారాలని నిశ్చయించుకుంది.  అది కూడా కొద్దో గొప్పో తెలిసిన బాలీవుడ్ లోనే. కానీ ఆ సినిమా ఆఫీసుల కెళ్ళి రైటర్ గా పనిమ్మంటే ఎవరూ ఇచ్చే వాళ్ళు కాదు. టీవీ సీరియల్స్ తీసే ఆఫీసుల్లో కూడా ఇదే పరిస్థితి. రాయడంలో ఏ అనుభవమూ లేకపోవడంతో ఎవరూ ఆసక్తి కనబర్చే వాళ్ళు కాదు. పరిస్థితి ఇలా వుంటే తనకు తానూ రాసుకోవడం మొదలెట్టింది. తన జీవితానుభావాల్లోంచి వచ్చే కథలు. ఒకవైపు జీవించడానికి డాన్స్ బార్లలో మళ్ళీ డాన్సులు చేస్తూనే.  

        చివరికి 2000 లో అనేక ప్రయత్నాలు చేసి ప్రసిద్ధ నిర్మాత, దర్శకుడు మహేష్ భట్ ని కలుసుకోగల్గింది. ఆయన్ని కొన్నేళ్ళపాటు కలుస్తూ ఒక చిన్న పని సంపాదించుకో గల్గింది. అప్పుడు మోహిత్ సూరి దర్శకత్వంలో తీస్తున్న ‘కలియుగ్’ కి కొన్ని సీన్లు రాసే పని. ఆ  సీన్లు భట్ కి విపరీతంగా నచ్చి, వెంటనే ‘వోహ్ లమ్హే’ రాసే పనిని పూర్తిగా ఆమెకే అప్పజెప్పారు. అప్పుడు 2006 వ సంవత్సరం. మహేష్ భట్ కి తన మీద  నమ్మకం కలగడానికి ఆరేళ్ళు పట్టింది. అప్పటికి ఆమె వయసు  37 ఏళ్ళు. ఇక వెనక్కి తిరిగి చూసుకోలేదు. అప్పటినుంచీ వరసగా 16 సినిమాల వరకూ రాస్తూనేవుంది, బాలీవుడ్ లో టాప్ టాలెంట్స్  తో కలిసి పనిచేస్తూ. రచయిత్రిగా కథల్లో తన సొంత జీవితానుభావాల్లోంచీ, ఇతరుల జీవితాల్లోంచీ విషయాల్ని  తీసి మిళితం చేయడం అనే కళ ఆమెకి బాగా అబ్బింది. విచిత్ర మేమిటంటే,  ఇంతా చేసి తను రాసే  సినిమాలన్నీ హీరో ఓరియెంటెడ్  కథలే. అయితే తను స్వయంగా దర్శకత్వం వహించాలని రాసుకున్న  కథ మాత్రం హీరోయిన్ ఓరియెంటెడే.

        అయితే విజయవంతమైన రచయిత్రిగా బాలీవుడ్ లో తనకంటూ ఒక స్థానం సంపాదించుకున్నా, ఆమెని పాత  జీవితం వెంటాడ్డం  మానడం లేదు. కొన్ని సార్లు ఓ నిర్మాతో దర్శకుడో పిలుస్తారు. అది కేవలం తనెలా వుంటుందో చూడ్డానికే. తమ ఊహల్లో ఉవ్వీళ్ళూరిన బార్ డాన్సర్ తరహాలో కన్పించక పోయేసరికి మొహం మాడ్చుకుని తిప్పి పంపించేస్తారు.

తన జీవితంగురించి బాహాటంగానే  ఆమె ఇంటర్వ్యూలు ఇస్తోంది. ఇదంతా పబ్లిసిటీ కోసమని అనుకుంటున్న వాళ్ళు లేకపోలేదు. కానీ ఏ పబ్లిసిటీ లేకుండానే అన్ని విజయవంతమైన సినిమాలు రాసింది. ఆ సినిమాలే రచయిత్రిగా తనకి పబ్లిసిటీ. అవే తనకి మరిన్ని అవకాశాల్ని తీసుకొస్తాయి. అవకాశాల కోసం తన జీవితాన్నపబ్లిసిటీ చేసుకోవాల్సిన ఖర్మ పట్టలేదని అంటోంది. తను ఇంటర్వ్యూలు ఇవ్వడంలో అర్ధం ఏమిటంటే, తన గురించి నల్గురూ చెవులు కొరుక్కుని తన కెరీర్ ని  పాడు చేయాలనీ చూడకుండా, అదేదో తనే బయటపెట్టేస్తే వాళ్ళ ఉత్సాహం చల్లబడి పోతుందని... తన కెరీర్ ణి పడు చేసే అవకాశ ఎవ్వరికీ ఇచ్చేది లేదన్న కృతనిశ్చయంతో వుంది...చాలా ప్రపంచాన్ని చూసివున్న తను. రచయిత్రి అయ్యే కంటే ముందు తను డేరింగ్ ఆడది. ఈ సంగతి మరువకూడదు!-సికిందర్