రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

15, ఏప్రిల్ 2016, శుక్రవారం

షార్ట్ రివ్యూ!


రచన - దర్శకత్వం : అట్లీ
తారాగణం : విజయ్, సమంత, బేబీ నైనిక, అమీ జాక్సన్,
ప్రభు, రాధికా శరత్ కుమార్, మహేంద్రన్, అళగం పెరుమాళ్,
కళ్యాణీ నటరాజన్, కాళీ వెంకట్ తదితరులు
సంగీతం : జివి ప్రకాష్ కుమార్,  ఛా
యాగ్రహణం : జార్జి సి. విలియమ్స్
నిర్మాతలు : దిల్ రాజు, ఎస్ థాను
విడుదల : 15 ఏప్రెల్, 2016
 
***

          తెలుగులో కూడా బాగానే అభిమానుల్ని సంపాదించుకున్న ‘ఇళయదళపతి’ అలియాస్  మాస్ హీరో విజయ్ తమిళంలో  నటించిన ‘తేరి’ (స్పార్క్) తెలుగులో ‘పోలీసోడు’ గా విడుదల కాబోయి, ఈ టైటిల్ పట్ల పోలీసుల అభ్యంతరంతో  ‘పోలీస్’ గా విడుదలయ్యింది. గతంలో ఆర్య- నయన తారలతో ‘రాజా రాణి’ తీసిన మెగా డైరెక్టర్ శంకర్ అసిస్టెంట్ ‘అట్లీ’ అలియాస్ అరుణ్ కుమార్,  ఓ మంచి టెక్నీషియన్ గా పేరు తెచ్చుకున్నాడు. తిరిగి తన రెండో సినిమా ‘తేరి’ (పోలీస్) కి దర్శకత్వం వహిస్తూ ప్రేక్షకుల్లో మళ్ళీ ఆసక్తిని రేపాడు. ఒకవైపు విజయ్- మరో వైపు అట్లీ, ఈ ఇద్దరు మార్కెట్ వేల్యూ వున్న ప్రముఖులతో ఈ భారీ బడ్జెట్ యాక్షన్- కమర్షియల్ లో ఆశించినంత విషయముందా? ఎందుకంటే విషయం లేకపోతే ఊరుకోవడం లేదు ప్రేక్షకులు. సినిమా అంటే పకోడీ పొట్లం చుట్టేయడం కాదంటున్నారు కాబట్టి,  విషయం ఏముందో ఓ సారి చూద్దాం. 

కథ 
         కేరళలో ఒక బేకరీలో పని చేస్తూంటాడు జోసెఫ్ ( విజయ్). అతడికి నివేదిత ( నైనిక) అనే ఆరేళ్ళ కూతురుంటుంది. ఇద్దరూ జీవితం జల్సాగా గడిపేస్తూంటారు. ఎవరితోనూ  గొడవలు పెట్టుకోకుండా, గొడవలు పెట్టుకోవడానికి ఎవరైనా వచ్చినా ఆవేశపడకుండా సాధు  జీవితం గడుపుతూంటాడు జోసెఫ్. నివేదిత చదివే స్కూల్లో ఏన్ ( అమీ జాక్సన్) అనే టీచర్ వుంటుంది. ఈ తండ్రీ కూతుళ్ళ అనుబంధం చూసి ఆమె ముచ్చట పడుతుంది. నివేదిత ద్వారా జోసెఫ్ కి దగ్గరవుతుంది. ఒకరోజు నివేదితని ఏన్  స్కూలుకి తీసుకు పోతూంటే  స్కూటీ యాక్సిడెంట్ అవుతుంది. పోలీస్ కంప్లెయింట్ ఇస్తుంది. ఆ యాక్సిడెంట్ చేసింది చేటా  అనే బ్యాడ్ క్యారక్టర్ ముఠా.

          జోసెఫ్  వెంటనే ఆ కంప్లెయింట్ వెనక్కి తీసుకోమని ఏన్  మీద ఒత్తిడి తెస్తాడు. ఆమె కంప్లెయింట్ వెనక్కి తీసుకున్నా అసలలా కంప్లెయింట్ ఇచ్చే ధైర్యం చేసినందుకు  ఆ ముఠా జోసెఫ్ మీద దాడి చేస్తుంది. ఈలోగా అసలీ జోసఫ్ ఒక మాజీ పోలీస్ డిసిపి అనీ, పేరు విజయ్  కుమార్ అనీ తెలుసుకున్న ఏన్,  ముఠాతో జోసెఫ్ చేస్తున్న పోరాటాన్ని దిగ్భ్రాంతితో చూస్తుంది.

          ఇక ఆమెకి తన గతం చెప్పుకోక తప్పదు విజయ్ కి. హైదరాబాద్ లో తను డిసిపిగా వుండగా మిత్రా (సమంత ) అనే  హౌస్ సర్జన్ ని ప్రేమించాడు. కొన్ని ఇబ్బందుల తర్వాత పెళ్లి జరిగింది. అయితే అవతల ఒక రేప్ కేసుని చేపట్టినప్పుడు ఆ నిందితుడు మంత్రి వెంకట్ రెడ్డి (మహేంద్రన్) కొడుకని తెలుసుకున్న విజయ్, వాణ్ణి చిత్ర హింసలు పెట్టి చంపి, మంత్రికి బహుమతిగా ఇచ్చి సవాలు విసిరాడు. అప్పుడా పగబట్టిన మంత్రి విజయ్ కుటుంబం మీద దాడి జరిపినప్పుడు విజయ్ తల్లీ, భార్యా మరణించారు. దాంతో ఏడాది కూతుర్ని కాపాడుకోవడానికి  కేరళ వచ్చి అజ్ఞాత వాసం చేస్తున్నాడు విజయ్.


          ఈ నేపధ్యంలో తిరిగి మంత్రికీ, విజయ్ కీ సంఘర్షణ ఎలా మొదలయ్యిందీ, చివరికి మంత్రిని విజయ్ ఎలా అంతమొందించిందీ మిగతా కథ.

ఎలావుంది కథ
       రొటీన్  రివెంజి కథ. అయితే ఇందులో ఒక బలమైన కొత్త పాయింటు వుంది. ఆవారాలు, క్రిమినల్సు, కిల్లర్సు, రేపిస్టులు, తాగుబోతులు, తిరుగుబోతులూ వంటి  సకల సంఘ విద్రోహక శక్తులూ తయారు కావడానికి వాళ్ళ తండ్రుల  పెంపకమే కారణమనీ, శిక్షించాల్సింది అలాటి  తండ్రుల్నే ననీ పలికిస్తారు ఈ కథలో. 

          సరీగ్గా ‘ఊపిరి’ లో కూడా జయసుధ పాత్ర సంతానం అలా తయారవ్వడానికి ఆమె ఒక్కతే కారణమని మనకి సన్నివేశాల ప్రకారం ఎంత బలంగా తోస్తున్నా, ఆ పాత్రని మహాతల్లిలాగా చిత్రించారు.

          ప్రసుత ‘పోలీస్’ కథలో దర్శకుడు ఈ సమస్యకి మూల కారణం ఎలాటి మొహమాటమూ  లేకుండా తండ్రులేనని  చెప్పేశాడు. వాళ్ళనే శిక్షించాలన్నాడు. ఇంతవరకూ బాగానే వుంది. అయితే ఇది ఎప్పుడో చిట్ట చివర్లో చెప్పే మాట, నడిపించిన  కథంతా మాత్రం ఇందుకు విరుద్ధంగా. మంత్రి కొడుకు రేప్ చేస్తే ఆ తండ్రి అయిన మంత్రినే  చంపేసి, అప్పుడే అలాటి తండ్రులకి హెచ్చరిక పంపాల్సింది హీరో. తర్వాత పరిణామాలేవైనా వుంటే,  పగబట్టిన ఆ మంత్రి కొడుకుతో ఎదుర్కొనే కథగా కొనసాగించ  వచ్చు. ఇది అర్ధ వంతంగా కూడా వుండేది. ఒకసారి అసాధారణ పాయింటు అంటూ ఎత్తుకున్నాక, బేషరతుగా ఆ పాయింటుని మాటల్లో కాదు, చేతల్లో అమలుపర్చాల్సిందే. ‘భారతీయుడు’ లో కమల్ హసన్ లంచావతారాల్ని పొడిచి చంపెయ్యాల్సిందే అనుకున్నాడు- పొడిచి చంపేసుకుంటూ పోయాడు. కమర్షియల్ కథకి పాయింటు వెజిటేరియన్ గా వుండదు, నాన్ వెజ్ గా వుంటుంది. అప్పుడే మజా. నేటి కాలమాన పరిస్థితులకి అవసరమైన ఒకమంచి, కొత్త పాయింటు దర్శకుడి మిస్ మేనేజ్ మెంట్ వల్ల  వృధా పోయింది. అసలే రొటీన్ రివెంజి కథ- ఈ రొటీన్ కి బలాన్నిచ్చే  విటమిన్ లాంటి పాయింటు కూడా నీరుగారిపోతే, ఇక ఎందుకోసం ఈ కథతో సినిమా చూడాలి?

ఎవరెలా చేశారు 

       విజయ్ నటన, ఫైట్లు, డాన్సులు, సున్నిత కామెడీ వగైరా సందేహించ నక్కర్లేకుండా ఎంజాయ్ చేయవచ్చు. ఇందులో రెండో మాటకి తావేలేదు. పైగా దర్శకుడు అతన్ని స్టయిలిష్ గా చూపిస్తూ కొత్త పుంతలు తొక్కించాడు. కలర్ఫుల్ గా అల్ట్రా మోడరన్ విజువల్స్ ఇచ్చాడు. అయితే  లుక్స్ పరంగా  అతడి గ్రాఫ్ పైపైకి ఎంత పోతుందో,  పాత్ర పరంగా అంత కిందికి దిగివస్తూ కన్పిస్తుంది. పాత్ర లుక్స్ కి సహకరించడం మానేస్తుంది. సెకండాఫ్ లో  ఫ్లాష్ బ్యాక్ పూర్తయయాక మరీ దయనీయంగా కన్పిస్తుంది పాత్ర. దీనికి ఒక్కటే కారణం : పాత్రచిత్రణలో వైఫల్యం. 

          రేపిస్టు అయిన మంత్రి కొడుకుని చంపి- ‘నువ్వు నా వెంట్రుక కూడా పీకలేవ్’ అని అంత పెద్ద సవాలు విసిరాక, ఆ సవాలుకి తగ్గట్టు తనే లేకపోవడం. తన పెళ్లి మాటలు జరుగుతూంటే మొదటి ఎటాక్  చేయించేదీ ఆ మంత్రే. పెళ్ళయ్యాక – పిల్ల కూడా పుట్టాక ( ఇంత కాలం  ఎందుకు వెయిట్ చేశాడో మంత్రి) స్వయంగా ఇంటికొచ్చి తన తల్లినీ, భార్యనీ కాల్చి చంపి, ఏడాది పిల్లని నీటి తొట్టిలో ముంచేసి,  తన మీదికీ కాల్పులు జరిపి గ్యాస్ లీక్  చేసిపోయేదీ ఈసారి స్వయంగా మంత్రే!!

          లేచి, పిల్లని బతికించుకుని పారిపోయి, కేరళలో బేకరీ గుమాస్తాగా బతుకుతూంటాడు తనూ!! ఏమంటే పిల్ల కోసం మంత్రి తో పెట్టుకోదల్చుకోలేదని వివరణ- ఛఛఛ –చ్ఛా!!

          మళ్ళీ ఐదేళ్ళ తర్వాత మంత్రే వీడెక్క డున్నాడూ అని ఆరా తీసి, కేరళ వచ్చేసి పిల్ల పని మళ్ళీ  పట్టాల్సి వచ్చింది! ఇలా తనమీద మంత్రి దాడులు చేస్తున్నప్పుడు పారిపోవడమో, తిరగబడ్డమో చేసే ఈ పాసివ్ రియాక్టివ్  క్యారక్టరైజేషన్ మొత్తం కథనాన్నే దెబ్బతీసింది.

          తను మంత్రికి చేసిన నష్టం కన్నా, మంత్రే తనకి ఎక్కువ నష్టం చేశాడని తేలుతోంది చివరికి. మంత్రి మీద అంత సవాలు విసిరి తను సాధించిందేమిటి- తన కుటుంబ సభ్యుల హత్యలు కళ్ళారా చూడ్డమేనా? ఇంత చేతకాని  పోలీస్ డిసిపి అధికారి పాత్రని ఇంకే సినిమాలోనూ చూసి ఉండం.

          సమంతా గ్లామర్ ఒలకబోతకి బాగా పనికొచ్చింది. ఆమె పాత్ర డీసెంట్  గానే వున్నా, తను హీరోకి పరిచయమైనప్పుడు హౌస్ సర్జన్. ఆ తర్వాత అదేమయ్యిందో, డాక్టరుగా పోస్టులో ఎందుకు చేరలేదో దర్శకుడికే తెలియాలి. హీరో తల్లిగా  ఒకప్పటి  హీరోయిన్ రాధిక  సీన్లని బాగానే ఉత్తేజ పరుస్తుంది. పోలీసు అధికారిగా ప్రభు కన్పిస్తాడు. మంత్రిగా విలన్ పాత్రలో ప్రముఖ సీనియర్ దర్శకుడు మహేంద్రన్ తొలిసారిగా తెర పైన కన్పిస్తాడు. వయసుమళ్ళిన అతడి సాధారణ రూపురేఖలే  విలన్ గా  అసాధారణంగా కన్పించేట్టు చేశాయి.

          జివి ప్రకాష్ కుమార్ సంగీతం, జార్జి విలియమ్స్ కెమెరా ఈ రెండూ అతిపెద్ద ఎసెట్స్ సినిమాకి. టెక్నికల్ గా టాప్  క్లాస్ గా వున్న ఈ యాక్షన్ మూవీ, దర్శకుడి కథా- పాత్రల నిర్వహణా లోపం లేకపోతే ఇంకా చాలా చాలా బావుండేది.

చివరికేమిటి?
     ఏముంది, పిలిచిన పాయింటొకటి – జరిగిన పేరంటం ఒకటి. దర్శకుడికి ముందు తన కథ గురించి తనకి లోతుగా తెలియడం చాలా అవసరం. ఇన్ని పదుల కోట్ల బడ్జెట్ తో సినిమాకి సమకట్టి, పది రూపాయల పకోడీ ప్రేక్షకుల చేతిలో పెడితే, టికెట్ డబ్బులైనా గిట్టుబాటు అవ్వాలా వద్దా? మొదటి నుంచీ తెలిసిపోతున్న కథే తప్ప, కొత్త ట్విస్టులతో ఆశర్యపర్చిందీ లేదు. ఇంటర్వెల్ లోనే  ఆ నిలబెట్టుకోలేని సవాలు విసిరే బదులు- అక్కడే మంత్రిని చంపి- చెప్పాలనుకున్న పాయింటుకి అక్కడే శంఖు స్థాపన చేసి వుంటే- అక్కడ్నించీ బోలెడు షాక్ వేల్యూతో ఎక్కడికో వెళ్ళిపోయేది కదా సెకండాఫ్! కానీ ఈ  పక్క ఫోటో చూస్తే, విజయ్ నోటిని విజయయ్యే ఎందుకు మూస్తున్నట్టు? పాయింటు ఇంటర్వెల్లో చెప్పవద్దనా? సినిమా అంతా అయిపోయాక గొప్ప మెసేజిలా ఇద్దామనా? నడిపిన కథకి విరుద్ధంగా వున్న మెసేజ్? నిర్మాత దిల్ రాజు కాన్సెప్ట్స్ ని బేరీజు వేసి సినిమాల్ని /కథల్ని ఎంపిక చేసుకోవడంలో విఫలమవడం ఇంకా కొనసాగుతూనే వుంది...

            పాసివ్ రియాక్టివ్ క్యారక్టర్ తో అదొక కమర్షియల్ సినిమా ఎలా  అవుతుందన్నది బేసిక్ క్వశ్చన్.
            చేయాల్సింది చేయాల్సినప్పుడే చేయకుండా ఎప్పుడో  అంతా చల్లారి పోయాక చేసి మెసేజి ఇవ్వడంలో అర్ధమేమిటన్నది రెండో ప్రశ్న! 

         

 -సికిందర్ 
http://www.cinemabazaar.in








తెలుగు సినిమా స్క్రీన్ ప్లే స్ట్రక్చర్- 12







          సినిమా అనగానే దాంతో పాటు సోల్ (soul)  అనే మాట కూడా తరచూ విన్పిస్తూ వుంటుంది. సినిమాలో ‘సోల్’ లేదురా అంటూంటారు. అంటే ఏమిటి? ఆత్మే, కథాత్మ లేదనడం వాళ్ళ భాషలో.  దీన్నే ‘ఫీల్’ అని కూడా అంటూంటారు. కానీ ఫీల్ వేరు- సోల్ వేరు. సోల్ ఉంటేనే ఫీల్ వుంటుంది. సోల్ ని ఎలా ఫీలవ్వాలి? ఒక కిషోర్ కుమార్ పాట వుంది- అమ్మకానికి పూలు వుంటాయి కానీ  వాటి పరిమళం అమ్మకానికి ఉండదని. అలాగే ఇడ్లీలు అమ్ముతారేగానీ, ఇడ్లీల నుంచి వచ్చే నోరూరించే – ఘుమఘుమలాడే ఆవిరిని అమ్మరు, అమ్మలేరు. మరలాగే సినిమాలో సోల్ ని అమ్మగలరుగానీ, సోల్ లేకుండా ఫీల్ ని అమ్మలేరు. పూలూ పరిమళం ఒక ప్యాకేజీ, ఇడ్లీ ఆవిరీ  ఒక పొట్లం, సోల్ - ఫీల్ కూడా ఒక పార్సిల్ గానే వస్తాయి.  సోల్ ని ఫీలవ్వాలంటే ఆత్మిక దాహాన్ని తీర్చే ‘కథనం’ వుండాలి. ఒక భక్తి  సినిమా చూస్తున్నప్పుడు ఆత్మిక దాహం బాగా తీరవచ్చు. కానీ ఇతర సినిమాలు చూపిస్తున్నప్పుడు కూడా ఈ దాహాన్ని తీర్చెయ్యాలి. ఎందుకంటే ప్రపంచంలో ఎక్కడి  ఏ కథలయినా అక్కడి జానపద, పౌరాణిక కథలకి దిగుమతులే. అంటే ఫారిన్ డీవీడీ ల నుంచి దిగుమతి చేసుకుంటున్నప్పుడు కన్పించే, కాపీ కొట్టుకోవడానికి ఊరించే  కథే  కాకుండా,   ఆ కథ వెనుక కార్ఖానా ఏమిటో కూడా తెలుసుకోవాలన్నమాట.

          ప్రేక్షకులు మాత్రం సినిమాల్లో సోల్, ఫీల్ వగైరా ఉంటాయని ఎప్పుడో గుర్తించేశారు. వాటి గురించి చర్చలు కూడా పెట్టుకుంటారు. మరి ఇప్పుడు సినిమాలు తీసేవాళ్లో? చాలా తక్కువ. భక్తి  సినిమాల్లో తప్ప (బాలకృష్ణ నటించిన ‘పాండురంగ మహాత్మ్యం’ మినహాయింపు)  ఇతర సినిమాల్లో ఇప్పుడు సోల్ లేకుండా  ఫీల్ ని అమ్మడానికి ప్రయత్నిస్తున్నారు. సోల్ లేకుండా మంచి ఫీల్ తో సినిమాలు తీయాలని చూస్తున్నారు. పువ్వు లేకుండా దాని వాసన చూపించాలని కష్టపడుతున్నారు. సోల్ అంటే అదేదో కళాత్మక – మహోజ్వల చిత్రరాజాల వ్యవహారమని, దానిజోలికి పోతే మునిగిపోతామని భయపడుతున్నారు.
 
          కానీ చూడగలిగితే   ‘శివ’ లాంటి  ఫక్తు యాక్షన్ ఫిలింలో,  నాగార్జున సైకిలు చైను తెంపి, జేడీ మీద ఎటాక్  చేసే ఘట్టం  సోల్ కి  అంకురార్పణ చేసేదే!  

          ‘నేనూ మనిషినే’ అనే మర్డర్- థ్రిల్లర్ లో, జడ్జి పాత్రధారి అయిన  గుమ్మడి, హత్య చేసెయ్యాలని బయల్దేరడం కథాత్మకి బీజం వేయడమే!

          ‘సోగ్గాడే చిన్ని నాయనా’ లో ప్రారంభంలోనే నాగార్జున- లావణ్యలు విడాకుల కోసం పల్లెటూళ్ళో వున్న తమ ఇంటికి వచ్చే సీను సెంట్ పర్సెంట్ సోల్ సెట్టింగే!

          ‘క్షణం’ లో తప్పిపోయిన తన పాపని వెతికి పెట్టమని అదా శర్మ, అడివి శేష్ ని కోరే సందర్భం  సోల్ కి బోణీ చేయడమే!

          ఇలా కాకుండా ‘శివ’ లో నాగార్జున సైకిలు చెయిన్ తో  జేడీ మీద ఎటాక్ చేయకుండా,  అసలెవరి జోలికీ పోకుండా, పిడికిలికి చైన్ చుట్టుకుని, అదేదో ఫ్యాషన్ ఐన్నట్టు, సినిమా అంతా వూరికే తిరుగుతూంటే ఎలా వుండేది  ఫీల్?

          ‘నేనూ మనిషినే’ లో చంపడానికి రైలెక్కిన గుమ్మడి, చంపకుండా రైల్లో కూర్చుని గుండెపోటు గురించి ఆలోచిస్తూ వుంటే  ఎలావుండేది ఫీల్?

          కనుక సోల్ లేనిదే ఫీల్ ఉండదని స్పష్టమవుతోంది. కానీ అక్కడక్కడా కొన్ని కదలించే సీన్లు పెడితే ఫీల్ వచ్చేసినట్టే అనుకుంటున్నట్టు ఉంటున్నాయి ఫ్లాపవుతున్న సినిమాలన్నీ. అది సోల్ ని పుట్టించకుండా చేసే పైపై సింగారమే - మృతదేహానికి అలంకారం చేయడం లాంటిది. 

          ఆద్యంతం ఒక ధారలా కథాత్మ ప్రవహిస్తూంటేనే  ఆ కథాత్మ- అంటే సోల్,  ఎడతెగని ఫీల్ ని సంతరించుకుంటుంది. పుట్టాల్సిన చోట సోల్ ని పుట్టించకుండా, అక్కడో ముక్కా ఇక్కడో ముక్కా ఏవేవో  సెంటి మెంట్ సీన్లేసి, అందులోంచే ఫీల్ రాబట్టాలనుకుంటే, అది నది లేకుండా కాలువలు తవ్వే ప్రయత్నం లాంటిది. డామ్ కట్టకుండా కాలువలు తవ్వేసి కాంట్రాక్టర్లు సొమ్ములు జేబుల్లో వేసుకోవచ్చు గానీ, కథాత్మ లేకుండా పిల్ల ‘ఫీల్’ కాల్వలు పుట్టించి టికెట్లు అమ్ముకోవాలంటే మాత్రం చాలా తిప్పలు. 

          ‘ఊపిరి’లో, ‘కల్యాణ వైభోగమే’ లో ఎన్ని పిల్లకాల్వల్లాంటి బెల్ట్ షాపులు సృష్టించారో తెలిసిందే.

          ‘సర్దార్ గబ్బర్ సింగ్’ లో కేవలం దాని ఫక్తు ఎంటర్ టైన్మెంట్  ప్రధానమైన లక్షణం సినిమాకి సోల్ కాదు. హీరో విలన్ల మధ్య సమస్య పుట్టడం సోల్ కి అంకురార్పణ. విలన్ దందాలకి హీరో అడ్డుతగలడంతో  సోల్ కి అంకురార్పణ జరిగింది. కానీ తర్వాత దీని కొనసాగింపుగా ఆ దందాలు వదిలేసి, ఇద్దరి మధ్యా హీరోయిన్ ప్రేమకోసం పోరాటంగా మార్చడంతో  కథాత్మ తెగిపోయింది. ఏర్పాటయిన దందాల గురించిన కథాత్మా ఝరికి, ప్రేమ పిల్లకాల్వలు తవ్వడంతో సోల్ చెదిరి, ఫీల్ కూడా గల్లంతయ్యింది. 

          అంటే సోల్ ని పుట్టించకుండా పిల్లకాల్వలని తవ్వినా, సోల్ ని పుట్టించీ కూడా పిల్ల కాల్వల్ని తవ్వినా రెండూ ఒకటేననీ, రెండూ రిస్కే నని అర్ధమవుతోంది. ఇలా సోల్ తో- ఆత్మ తో చెలగాటమంటే, సబ్ కాన్షస్ ని కుళ్ళబొడుచుకోవడమే. 

          సబ్ కాన్షస్ మైండ్
(అంతరాత్మ- మిడిల్ )  అనేది కుళ్ళ బొడుచుకోవడానికి లేదు, దాన్ని బాధించుకుని ఆత్మహత్యలు (ఫ్లాపులు) చేసుకోవడానికీ  లేదు. మధించి అమృతం (కలెక్షన్స్) పొందడానికే వుంది. క్షీరసాగర మధనం ఇదే చెప్తుంది. క్షీర సాగరం సబ్ కాన్షస్ మైండ్- అంటే మనుషుల అంతరాత్మకి ప్రతీకే.  క్షీర సాగర మధనంలో అమృతాన్ని పుట్టించడానికి జరిగే కార్యకలాపమంతా  స్క్రీన్ ప్లే మిడిల్ విభాగంలో హీరోకి జరిగే బిజినెస్సే. 1949 లో ప్రపంచ పురాణాల పరిశోధకుడు జోసెఫ్ క్యాంప్ బెల్ ప్రచురించిన The Hero with a Thousand Faces అన్న సుప్రసిద్ధ గ్రంథం  ప్రతిపాదించిన,  కథల్లో  హీరో చేసే ప్రయాణపు మజిలీలు అన్నీ కూడా క్షీర సాగర మధనంలో కన్పించే మజిలీలే. ప్రతి ప్రపంచ పురాణంలోనూ పురాణ పురుషుడు చేసే ప్రయాణంలో ( పోరాటంలో) ఇవే మజిలీలున్నాయని  తేల్చాడు క్యాంప్ బెల్. ఈ పురాణ పురుషుడు లేదా హీరో మన ఇగోనే. ఇది హాలీవుడ్ దర్శకులకి, రచయితలకీ బైబిల్ లా దొరికింది.  మన దర్శకుడు దేవ కట్టాకి కూడా. ఆయన సినిమాలు తీయడానికి ముందే ఈ గ్రంధాన్ని ఔపోసన పట్టారు. ఆచరణలో సాధ్యం కావడం లేదు, అది వేరే విషయం. ఇక  దీన్నుంచే ‘స్టార్ వార్స్’ ని సృష్టించాడు జార్జి లూకాస్. ఈ గ్రంధాన్ని దగ్గర పెట్టుకుని తెలుగులో కూడా గొప్ప సినిమాలు తీయాలనుకుంటే దెబ్బ తినిపోతారు. ఆస్కార్ కలలు హాలీవుడ్ కి ఉండొచ్చు గానీ, టాలీవుడ్ కేముంటాయి? తెలుగులో ఇప్పుడు గొప్ప కళాఖండాలు తీయరని ఇదివరకే చెప్పుకున్నాం. బాక్సాఫీసు దగ్గర వర్కౌటయ్యే ఓ మంచి కమర్షియల్ అయితే చాలు. ఈ దృష్టికి ఆలోచనల్ని కుదించుకుని,  ఈ గ్రంథంలోంచి కావలసిన, స్థానికంగా ఆచరణలో సాధ్యమయ్యే,   ఓ నాలుగు మూల సూత్రాలనే తీసుకుంటే ఏ గందరగోళానికీ తావుండదు. 


          ఈ హీరో జర్నీ కూడా స్క్రీన్ ప్లేకి సైకలాజికల్ లాక్ వేయడంలో భాగమే. అయితే ముందు వెలుపలి మనసుకీ, అంతరాత్మకీ
( బిగినింగ్ కీ, మిడిల్ కీ)  కలిపి లాక్ వేసింతర్వాత దీని అధ్యాయంలోకి పోవచ్చు. ఇదంతా  కాంప్లికేటెడ్ వ్యవహారంగా పరిణమిస్తోందని ఆందోళన పడనక్కర్లేదు. ఎలాగైతే లాకింగ్ కి ‘జేమ్స్ బానెట్’ నుంచి కేవలం  ఇరవై శాతమే తీసుకుందామని గత వ్యాసంలో చెప్పుకున్నామో, అలా హీరో జర్నీకి  ‘జోసెఫ్ క్యాంప్ బెల్’ నుంచీ ఓ పది శాతమే  తీసుకుంటే మహా ఎక్కువ - వినోదమే ప్రధానమైన నేటి తెలుగు కమర్షియల్స్ కి. కాబట్టి డోంట్ వర్రీ. 

          సింపుల్ గా కథ పూర్తిగా చెడకుండా, ఓ మంచి కథ అన్పించుకోవాంటే గొప్ప సినిమాలకి వేసినట్టు కాన్షస్- సబ్ కాన్షస్ మైండ్స్ ని కలిపి ముడి వేయడమే మార్గం. స్క్రీన్ ప్లే అంటే  బేసిగ్గా కాన్షస్- సబ్ కాన్షస్ మైండ్స్ ల ఇంటర్ ప్లే అని ఇదివరకే  చెప్పుకున్నాం.

          స్క్రీన్ ప్లే అంటే బేసిగ్గా కాన్షస్ మైండ్
(మనిషి వెలుపలి మనసు)  కీ - సబ్ కాన్షస్ మైండ్ (మనిషి అంతరాత్మ)  కీ మధ్య జరిగే ఇంటర్ ప్లే (సంఘర్షణ) గా అర్ధంజేసుకున్నప్పుడు, ఈ సంఘర్షణ ఎక్కడ మొదలవుతుందో అక్కడే స్క్రిప్టుకి సైకలాజికల్ లాక్ పడుతుందన్న మాట. 

          సంఘర్షణ ఎక్కడ మొదలవుతోంది? ‘శివ’ లో నాగార్జున సైకిలు చైను తెంపే దగ్గర, ‘నేనూ మనిషినే’ లో గుమ్మడి  హత్య చేయాలని బయల్దేరడం దగ్గర, ‘సోగ్గాడే చిన్ని నాయనా’ లో నాగార్జున- లావణ్యలు విడాకుల కోసం రావడం దగ్గర, ‘క్షణం’ లో పాపని వెతికి పెట్టమని అదా శర్మ కోరడం దగ్గర!

          ఇంకా-
 ‘మనం’ లో గతజన్మలో పోట్లాడుకుని విడిపోయిన తల్లిదండ్రుల్ని (నాగచైతన్య- సమంత) కలపాలని నాగార్జున ఫీలవ్వడంతో,  ‘లెజెండ్’ లో  చిన్న బాలకృష్ణ సహా కుటుంబాన్ని జగపతిబాబు హతమార్చబోతున్నప్పుడు పెద్ద బాలకృష్ణ రావడంతో, ‘కంచె’ లో  ప్రేమకి కులాలు అడ్డొచ్చి ప్రేయసి దుర్మరణం పాలయినప్పుడు వైరాగ్యంతో వరుణ్ తేజ్ యుద్ధానికి  బయల్దేరడంతో, అలాగే ‘టెంపర్’  లో  పొరపాటున ప్రత్యర్ధులు తనని చేయబోయిన కిడ్నాప్ విఫలమైనప్పుడు, తనుకాకపోతే ఇంకెక్కడో ఇంకెవరో అమ్మాయి ఈ గ్యాంగ్ బారిన పడబోతోందనీ, వెళ్లి కాపాడమనీ ఎన్టీఆర్ కి కాజల్ అల్టిమేటం ఇవ్వడంతో- సఘర్షణ మొదలవుతోంది.

         
ఇవన్నీ స్ట్రక్చర్ రీత్యా ప్లాట్ పాయింట్ -1 మజిలీలే. ఇక్కడ్నించే పాత్ర ఒక లక్ష్యంతో కార్యరంగంలోకి దూకుతోంది. అంటే మిడిల్ లోకి ప్రవేశిస్తోంది. ఎప్పుడైతే లక్ష్యం కోసం మిడిల్ లో సంఘర్షణకి పాత్ర దిగుతోందో అక్కడే ‘సోల్’  ఏర్పడుతోంది, అక్కడే కథకి జీవం పోయడం జరుగుతోంది. బిగినింగ్ విభాగంలో మాత్రం  ఏ సోల్, ఏ జీవమూ- వీటితో ఏర్పడే ఈ ఫీలూ కలిగే అవకాశం లేదు. ఎందుకంటే ఇదింకా పాత్రల పరిచయ విభాగమే, సంఘర్షణ అప్పుడే మొదలవదు. బిగినింగ్ విభాగం సంఘర్షణకి కేంద్రం కాదు, అది మిడిల్ చూసుకునే బిజినెస్. 

          కనుక ప్లాట్ పాయింట్ -1 ని సోల్ ని సమీకరించే కేంద్రంగా  చూడాల్సి వుంటుంది. సాధారణంగా ఇది కథకి మొదటి మలుపు అనీ, ఇక్కడ్నించీ సంఘర్షణ ఉంటుందనీ  స్ట్రక్చరల్ భాషలో చెప్పుకోవడం జరుగుతోంది. ఈ ‘ఇంజనీరింగ్’ భాష  మాట్లాడుకుంటే సోల్ పుట్టదు. కేవలం స్క్రీన్ ప్లేకి ‘వాస్తు’ లభిస్తుంది. వాస్తు మంచిదే. కానీ వాస్తు ప్రకారం నిర్మించిన ఇంట్లో  గృహ ప్రవేశానికి వాస్తు మంత్రాల్లేవు. శాస్త్రోక్తంగా గృహప్రవేశం జరిగిన ఇంట్లో ఒక పవిత్ర భావం
(ఫీల్) పలుకుతూంటుంది.  అలాటి గృహ ప్రవేశం కారణంగా పోగుపడిన సోల్ వల్లే ఈ భావం కలుగుతూంటుంది, అవునా? 

          అలాంటప్పుడు, ఇలాటిదే భావావేశం  ప్రేక్షకుల్ని పట్టి కుదిపెయ్యాలంటే ప్లాట్ పాయింట్ – 1 దగ్గర్నుంచి మిడిల్లోకి ప్రవేశాన్ని స్క్రీన్ ప్లే గృహప్రవేశంగా చూడాలి. సిడ్ ఫీల్డ్ రాస్తాడు- ప్లాట్ పాయింట్ వన్ దగ్గర వచ్చే ప్రధాన మలుపు సుడిగాలిలా ఉక్కిరిబిక్కిరి చేయాలని. కానీ  ఈ సిడ్ ఫీల్డ్  ‘ఇంజనీరింగ్’ తో  కూడా ఇంత  ప్రధానమైన మలుపుని ఎప్పుడో తప్ప ఎవరూ హైలైట్ చేయడం లేదు. 

          ఏమంటే ఇంటర్వెల్ బ్యాంగ్ గొప్పగా ఇచ్చామనుకుంటారు. ఇంటర్వెల్ బ్యాంగ్ ఎక్కడ్నించి వచ్చింది? ప్లాట్ పాయింట్-1 ఉంటేనే కదా? అంటే అది  ప్లాట్ పాయింట్-1 కి బై ప్రొడక్టు మాత్రమే తప్ప, దానికి స్వయంప్రతిపత్తి లేదు. ప్లాట్ పాయింట్  -1,  దీని ఉప ఉత్పత్తి అయిన ఇంటర్వెల్ బ్యాంగ్, మళ్ళీ దీని ఉప ఉత్పత్తి కూడా అయిన ప్లాట్ పాయింట్ -2 అనే ఈ మూడు మూలస్థంభాలూ,  సినిమా చూస్తున్న ప్రేక్షకులకి కొట్టొచ్చినట్టూ  హైలైట్ అవ్వాల్సిందే.  ఇది సరయిన ‘ఇంజనీరింగ్’. కానీ కథ లోతులు తెలీని  పాసివ్ రైటింగ్ వల్ల 
ఈ డైనమిక్స్ కొరవడి స్క్రీన్ ప్లేలకి సౌరభం చేకూరడం లేదు.

          ఇప్పటి అవసరం ఈ సీన్ రివర్సలే. అంటే  స్క్రీన్ ప్లేని ఒక స్ట్రక్చర్ లా ‘ఇంజనీరింగ్’ దృష్టితో చెక్కడంగా గాక, అదొక ప్రేక్షకుల మానసిక ప్రపంచం కూడానూ అనే  ఉదాత్త దృష్టితో  చూసి, ప్రేక్షకుల మనోభావాల్ని  మన్నించడం. ప్రేక్షకుల మానసిక ప్రపంచాన్నే టార్గెట్ చేస్తూ, వాళ్ళ ‘వెలుపలి మనసు’ ని బిగినింగ్ గానూ పెట్టి, వాళ్ళ కుండే ‘అంతరాత్మని’  మిడిల్ గానూ పెట్టుకుని, మళ్ళీ ఎండ్ కొచ్చేసి  అదే ‘వెలుపలి మనసు’  వైపుకి ప్రయాణమనే భాషలో కథని వ్యక్తీ కరీంచుకుంటే  తప్ప మంచికథ రాదు.

          ప్రేక్షకుల మానసిక ప్రపంచాన్నే ఎందుకు టార్గెట్ చేయాలంటే, కథలుగా  పుట్టినప్పుడు పురాణాలూ జానపద గాథలూ ఈ పనే చేశాయి గనుక.  మనిషి మానసిక ప్రపంచాన్ని ఎరుక పర్చి, మోటివేట్ చేయడమే వాటి లక్ష్యం గనుక. కనుక సినిమా కథ సైతమూ వెండి తెర మీద ప్రేక్షకుల మానసిక ప్రపంచాన్నే ఆవిష్కరించి దాన్నే టార్గెట్ చేసే దృష్టితో కొనసాగాలి. 

          ఒకప్పుడు కొందరు పెద్ద దర్శకులు ప్రేక్షకుల నాడీని పట్టుకోవడం ఎవరి వల్లా కాదని ఊకదంపుడుగా అనే వాళ్ళు. నిజమే కాబోలని ఈ వ్యాసకర్త కూడా నమ్మేవాడు. తర్వాత్తర్వాత ఇదేదో బాధ్యతని తప్పించుకునే మార్గం కాదుకదా అన్పించసాగింది. నిజానికి అలా  అనడం పురాణాలని కూడా అవమానించడమే. రామాయణ మాహాభారతాలు దేన్ని  టార్గెట్ చేశాయో తెలుసుకోక  పోవడమే. భక్తి  పారవశ్యంలో మునిగిపోయి అవి చెబుతున్న  మౌలిక ఫిలాసఫీని చూడ నిరాకరించడమే. మౌలిక ఫిలాసఫీ ‘నీ మనసు తెలుసుకో' అయినప్పుడు, ‘సైకో థెరఫీ’ కూడా  అయినప్పుడు, యుగాలుగా అవి ప్రజల నాడిని పట్టుకుని మనగల్గుతున్నాయి. కథంటే ప్రేక్షకుల మానసిక ప్రపంచాన్ని ఆవిష్కరించడమే నని గ్రహించక పోతే, ఇలా నాడిని పట్టుకోలేమనే పాసివ్ స్టేట్ మెంట్లే వస్తాయి.


(ఇంకా వుంది)

-సికిందర్