రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

Friday, April 15, 2016

షార్ట్ రివ్యూ!


రచన - దర్శకత్వం : అట్లీ
తారాగణం : విజయ్, సమంత, బేబీ నైనిక, అమీ జాక్సన్,
ప్రభు, రాధికా శరత్ కుమార్, మహేంద్రన్, అళగం పెరుమాళ్,
కళ్యాణీ నటరాజన్, కాళీ వెంకట్ తదితరులు
సంగీతం : జివి ప్రకాష్ కుమార్,  ఛా
యాగ్రహణం : జార్జి సి. విలియమ్స్
నిర్మాతలు : దిల్ రాజు, ఎస్ థాను
విడుదల : 15 ఏప్రెల్, 2016
 
***

          తెలుగులో కూడా బాగానే అభిమానుల్ని సంపాదించుకున్న ‘ఇళయదళపతి’ అలియాస్  మాస్ హీరో విజయ్ తమిళంలో  నటించిన ‘తేరి’ (స్పార్క్) తెలుగులో ‘పోలీసోడు’ గా విడుదల కాబోయి, ఈ టైటిల్ పట్ల పోలీసుల అభ్యంతరంతో  ‘పోలీస్’ గా విడుదలయ్యింది. గతంలో ఆర్య- నయన తారలతో ‘రాజా రాణి’ తీసిన మెగా డైరెక్టర్ శంకర్ అసిస్టెంట్ ‘అట్లీ’ అలియాస్ అరుణ్ కుమార్,  ఓ మంచి టెక్నీషియన్ గా పేరు తెచ్చుకున్నాడు. తిరిగి తన రెండో సినిమా ‘తేరి’ (పోలీస్) కి దర్శకత్వం వహిస్తూ ప్రేక్షకుల్లో మళ్ళీ ఆసక్తిని రేపాడు. ఒకవైపు విజయ్- మరో వైపు అట్లీ, ఈ ఇద్దరు మార్కెట్ వేల్యూ వున్న ప్రముఖులతో ఈ భారీ బడ్జెట్ యాక్షన్- కమర్షియల్ లో ఆశించినంత విషయముందా? ఎందుకంటే విషయం లేకపోతే ఊరుకోవడం లేదు ప్రేక్షకులు. సినిమా అంటే పకోడీ పొట్లం చుట్టేయడం కాదంటున్నారు కాబట్టి,  విషయం ఏముందో ఓ సారి చూద్దాం. 

కథ 
         కేరళలో ఒక బేకరీలో పని చేస్తూంటాడు జోసెఫ్ ( విజయ్). అతడికి నివేదిత ( నైనిక) అనే ఆరేళ్ళ కూతురుంటుంది. ఇద్దరూ జీవితం జల్సాగా గడిపేస్తూంటారు. ఎవరితోనూ  గొడవలు పెట్టుకోకుండా, గొడవలు పెట్టుకోవడానికి ఎవరైనా వచ్చినా ఆవేశపడకుండా సాధు  జీవితం గడుపుతూంటాడు జోసెఫ్. నివేదిత చదివే స్కూల్లో ఏన్ ( అమీ జాక్సన్) అనే టీచర్ వుంటుంది. ఈ తండ్రీ కూతుళ్ళ అనుబంధం చూసి ఆమె ముచ్చట పడుతుంది. నివేదిత ద్వారా జోసెఫ్ కి దగ్గరవుతుంది. ఒకరోజు నివేదితని ఏన్  స్కూలుకి తీసుకు పోతూంటే  స్కూటీ యాక్సిడెంట్ అవుతుంది. పోలీస్ కంప్లెయింట్ ఇస్తుంది. ఆ యాక్సిడెంట్ చేసింది చేటా  అనే బ్యాడ్ క్యారక్టర్ ముఠా.

          జోసెఫ్  వెంటనే ఆ కంప్లెయింట్ వెనక్కి తీసుకోమని ఏన్  మీద ఒత్తిడి తెస్తాడు. ఆమె కంప్లెయింట్ వెనక్కి తీసుకున్నా అసలలా కంప్లెయింట్ ఇచ్చే ధైర్యం చేసినందుకు  ఆ ముఠా జోసెఫ్ మీద దాడి చేస్తుంది. ఈలోగా అసలీ జోసఫ్ ఒక మాజీ పోలీస్ డిసిపి అనీ, పేరు విజయ్  కుమార్ అనీ తెలుసుకున్న ఏన్,  ముఠాతో జోసెఫ్ చేస్తున్న పోరాటాన్ని దిగ్భ్రాంతితో చూస్తుంది.

          ఇక ఆమెకి తన గతం చెప్పుకోక తప్పదు విజయ్ కి. హైదరాబాద్ లో తను డిసిపిగా వుండగా మిత్రా (సమంత ) అనే  హౌస్ సర్జన్ ని ప్రేమించాడు. కొన్ని ఇబ్బందుల తర్వాత పెళ్లి జరిగింది. అయితే అవతల ఒక రేప్ కేసుని చేపట్టినప్పుడు ఆ నిందితుడు మంత్రి వెంకట్ రెడ్డి (మహేంద్రన్) కొడుకని తెలుసుకున్న విజయ్, వాణ్ణి చిత్ర హింసలు పెట్టి చంపి, మంత్రికి బహుమతిగా ఇచ్చి సవాలు విసిరాడు. అప్పుడా పగబట్టిన మంత్రి విజయ్ కుటుంబం మీద దాడి జరిపినప్పుడు విజయ్ తల్లీ, భార్యా మరణించారు. దాంతో ఏడాది కూతుర్ని కాపాడుకోవడానికి  కేరళ వచ్చి అజ్ఞాత వాసం చేస్తున్నాడు విజయ్.


          ఈ నేపధ్యంలో తిరిగి మంత్రికీ, విజయ్ కీ సంఘర్షణ ఎలా మొదలయ్యిందీ, చివరికి మంత్రిని విజయ్ ఎలా అంతమొందించిందీ మిగతా కథ.

ఎలావుంది కథ
       రొటీన్  రివెంజి కథ. అయితే ఇందులో ఒక బలమైన కొత్త పాయింటు వుంది. ఆవారాలు, క్రిమినల్సు, కిల్లర్సు, రేపిస్టులు, తాగుబోతులు, తిరుగుబోతులూ వంటి  సకల సంఘ విద్రోహక శక్తులూ తయారు కావడానికి వాళ్ళ తండ్రుల  పెంపకమే కారణమనీ, శిక్షించాల్సింది అలాటి  తండ్రుల్నే ననీ పలికిస్తారు ఈ కథలో. 

          సరీగ్గా ‘ఊపిరి’ లో కూడా జయసుధ పాత్ర సంతానం అలా తయారవ్వడానికి ఆమె ఒక్కతే కారణమని మనకి సన్నివేశాల ప్రకారం ఎంత బలంగా తోస్తున్నా, ఆ పాత్రని మహాతల్లిలాగా చిత్రించారు.

          ప్రసుత ‘పోలీస్’ కథలో దర్శకుడు ఈ సమస్యకి మూల కారణం ఎలాటి మొహమాటమూ  లేకుండా తండ్రులేనని  చెప్పేశాడు. వాళ్ళనే శిక్షించాలన్నాడు. ఇంతవరకూ బాగానే వుంది. అయితే ఇది ఎప్పుడో చిట్ట చివర్లో చెప్పే మాట, నడిపించిన  కథంతా మాత్రం ఇందుకు విరుద్ధంగా. మంత్రి కొడుకు రేప్ చేస్తే ఆ తండ్రి అయిన మంత్రినే  చంపేసి, అప్పుడే అలాటి తండ్రులకి హెచ్చరిక పంపాల్సింది హీరో. తర్వాత పరిణామాలేవైనా వుంటే,  పగబట్టిన ఆ మంత్రి కొడుకుతో ఎదుర్కొనే కథగా కొనసాగించ  వచ్చు. ఇది అర్ధ వంతంగా కూడా వుండేది. ఒకసారి అసాధారణ పాయింటు అంటూ ఎత్తుకున్నాక, బేషరతుగా ఆ పాయింటుని మాటల్లో కాదు, చేతల్లో అమలుపర్చాల్సిందే. ‘భారతీయుడు’ లో కమల్ హసన్ లంచావతారాల్ని పొడిచి చంపెయ్యాల్సిందే అనుకున్నాడు- పొడిచి చంపేసుకుంటూ పోయాడు. కమర్షియల్ కథకి పాయింటు వెజిటేరియన్ గా వుండదు, నాన్ వెజ్ గా వుంటుంది. అప్పుడే మజా. నేటి కాలమాన పరిస్థితులకి అవసరమైన ఒకమంచి, కొత్త పాయింటు దర్శకుడి మిస్ మేనేజ్ మెంట్ వల్ల  వృధా పోయింది. అసలే రొటీన్ రివెంజి కథ- ఈ రొటీన్ కి బలాన్నిచ్చే  విటమిన్ లాంటి పాయింటు కూడా నీరుగారిపోతే, ఇక ఎందుకోసం ఈ కథతో సినిమా చూడాలి?

ఎవరెలా చేశారు 

       విజయ్ నటన, ఫైట్లు, డాన్సులు, సున్నిత కామెడీ వగైరా సందేహించ నక్కర్లేకుండా ఎంజాయ్ చేయవచ్చు. ఇందులో రెండో మాటకి తావేలేదు. పైగా దర్శకుడు అతన్ని స్టయిలిష్ గా చూపిస్తూ కొత్త పుంతలు తొక్కించాడు. కలర్ఫుల్ గా అల్ట్రా మోడరన్ విజువల్స్ ఇచ్చాడు. అయితే  లుక్స్ పరంగా  అతడి గ్రాఫ్ పైపైకి ఎంత పోతుందో,  పాత్ర పరంగా అంత కిందికి దిగివస్తూ కన్పిస్తుంది. పాత్ర లుక్స్ కి సహకరించడం మానేస్తుంది. సెకండాఫ్ లో  ఫ్లాష్ బ్యాక్ పూర్తయయాక మరీ దయనీయంగా కన్పిస్తుంది పాత్ర. దీనికి ఒక్కటే కారణం : పాత్రచిత్రణలో వైఫల్యం. 

          రేపిస్టు అయిన మంత్రి కొడుకుని చంపి- ‘నువ్వు నా వెంట్రుక కూడా పీకలేవ్’ అని అంత పెద్ద సవాలు విసిరాక, ఆ సవాలుకి తగ్గట్టు తనే లేకపోవడం. తన పెళ్లి మాటలు జరుగుతూంటే మొదటి ఎటాక్  చేయించేదీ ఆ మంత్రే. పెళ్ళయ్యాక – పిల్ల కూడా పుట్టాక ( ఇంత కాలం  ఎందుకు వెయిట్ చేశాడో మంత్రి) స్వయంగా ఇంటికొచ్చి తన తల్లినీ, భార్యనీ కాల్చి చంపి, ఏడాది పిల్లని నీటి తొట్టిలో ముంచేసి,  తన మీదికీ కాల్పులు జరిపి గ్యాస్ లీక్  చేసిపోయేదీ ఈసారి స్వయంగా మంత్రే!!

          లేచి, పిల్లని బతికించుకుని పారిపోయి, కేరళలో బేకరీ గుమాస్తాగా బతుకుతూంటాడు తనూ!! ఏమంటే పిల్ల కోసం మంత్రి తో పెట్టుకోదల్చుకోలేదని వివరణ- ఛఛఛ –చ్ఛా!!

          మళ్ళీ ఐదేళ్ళ తర్వాత మంత్రే వీడెక్క డున్నాడూ అని ఆరా తీసి, కేరళ వచ్చేసి పిల్ల పని మళ్ళీ  పట్టాల్సి వచ్చింది! ఇలా తనమీద మంత్రి దాడులు చేస్తున్నప్పుడు పారిపోవడమో, తిరగబడ్డమో చేసే ఈ పాసివ్ రియాక్టివ్  క్యారక్టరైజేషన్ మొత్తం కథనాన్నే దెబ్బతీసింది.

          తను మంత్రికి చేసిన నష్టం కన్నా, మంత్రే తనకి ఎక్కువ నష్టం చేశాడని తేలుతోంది చివరికి. మంత్రి మీద అంత సవాలు విసిరి తను సాధించిందేమిటి- తన కుటుంబ సభ్యుల హత్యలు కళ్ళారా చూడ్డమేనా? ఇంత చేతకాని  పోలీస్ డిసిపి అధికారి పాత్రని ఇంకే సినిమాలోనూ చూసి ఉండం.

          సమంతా గ్లామర్ ఒలకబోతకి బాగా పనికొచ్చింది. ఆమె పాత్ర డీసెంట్  గానే వున్నా, తను హీరోకి పరిచయమైనప్పుడు హౌస్ సర్జన్. ఆ తర్వాత అదేమయ్యిందో, డాక్టరుగా పోస్టులో ఎందుకు చేరలేదో దర్శకుడికే తెలియాలి. హీరో తల్లిగా  ఒకప్పటి  హీరోయిన్ రాధిక  సీన్లని బాగానే ఉత్తేజ పరుస్తుంది. పోలీసు అధికారిగా ప్రభు కన్పిస్తాడు. మంత్రిగా విలన్ పాత్రలో ప్రముఖ సీనియర్ దర్శకుడు మహేంద్రన్ తొలిసారిగా తెర పైన కన్పిస్తాడు. వయసుమళ్ళిన అతడి సాధారణ రూపురేఖలే  విలన్ గా  అసాధారణంగా కన్పించేట్టు చేశాయి.

          జివి ప్రకాష్ కుమార్ సంగీతం, జార్జి విలియమ్స్ కెమెరా ఈ రెండూ అతిపెద్ద ఎసెట్స్ సినిమాకి. టెక్నికల్ గా టాప్  క్లాస్ గా వున్న ఈ యాక్షన్ మూవీ, దర్శకుడి కథా- పాత్రల నిర్వహణా లోపం లేకపోతే ఇంకా చాలా చాలా బావుండేది.

చివరికేమిటి?
     ఏముంది, పిలిచిన పాయింటొకటి – జరిగిన పేరంటం ఒకటి. దర్శకుడికి ముందు తన కథ గురించి తనకి లోతుగా తెలియడం చాలా అవసరం. ఇన్ని పదుల కోట్ల బడ్జెట్ తో సినిమాకి సమకట్టి, పది రూపాయల పకోడీ ప్రేక్షకుల చేతిలో పెడితే, టికెట్ డబ్బులైనా గిట్టుబాటు అవ్వాలా వద్దా? మొదటి నుంచీ తెలిసిపోతున్న కథే తప్ప, కొత్త ట్విస్టులతో ఆశర్యపర్చిందీ లేదు. ఇంటర్వెల్ లోనే  ఆ నిలబెట్టుకోలేని సవాలు విసిరే బదులు- అక్కడే మంత్రిని చంపి- చెప్పాలనుకున్న పాయింటుకి అక్కడే శంఖు స్థాపన చేసి వుంటే- అక్కడ్నించీ బోలెడు షాక్ వేల్యూతో ఎక్కడికో వెళ్ళిపోయేది కదా సెకండాఫ్! కానీ ఈ  పక్క ఫోటో చూస్తే, విజయ్ నోటిని విజయయ్యే ఎందుకు మూస్తున్నట్టు? పాయింటు ఇంటర్వెల్లో చెప్పవద్దనా? సినిమా అంతా అయిపోయాక గొప్ప మెసేజిలా ఇద్దామనా? నడిపిన కథకి విరుద్ధంగా వున్న మెసేజ్? నిర్మాత దిల్ రాజు కాన్సెప్ట్స్ ని బేరీజు వేసి సినిమాల్ని /కథల్ని ఎంపిక చేసుకోవడంలో విఫలమవడం ఇంకా కొనసాగుతూనే వుంది...

            పాసివ్ రియాక్టివ్ క్యారక్టర్ తో అదొక కమర్షియల్ సినిమా ఎలా  అవుతుందన్నది బేసిక్ క్వశ్చన్.
            చేయాల్సింది చేయాల్సినప్పుడే చేయకుండా ఎప్పుడో  అంతా చల్లారి పోయాక చేసి మెసేజి ఇవ్వడంలో అర్ధమేమిటన్నది రెండో ప్రశ్న! 

         

 -సికిందర్ 
http://www.cinemabazaar.in
No comments: