రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Wednesday, April 10, 2024

1419 : స్పెషల్ ఆర్టికల్

 

          2019 లో ప్రారంభమయిన  విజయ్ దేవరకొండ వరస ఫ్లాపుల పరంపర ఐదవ ఫ్లాపుతో ఫ్యామిలీ స్టార్ దగ్గర ఆగింది. ఇవ్వాళ షడ్రుచుల ఉగాది పచ్చడి ఆరగించి ఆనందించాల్సింది, కెరీర్ లో అతి పెద్ద అట్టర్ ఫ్లాపు గరళాన్ని దిగమింగాల్సి వచ్చింది. తను దర్శకుల్ని, ఆ దర్శకులు మోసుకొచ్చే ఇంతింత లావు బౌండెడ్ స్క్రిప్టుల్నీ దారుణంగా జడ్జ్ చేస్తున్నట్టు దీన్ని బట్టి అర్ధమవుతోంది. ఐదులో ఒకటి రెండు ఫ్లాపైతే అతడి జడ్జిమెంటుని పూర్తిగా శంకించే పరిస్థితి వుండదు. ఐదుకి ఐదూ ఫ్లాపే అయితే రూఢీ అయిపోతుంది కండిషన్. తను ఇప్పటి వరకు బ్యాక్ టు బ్యాక్ హిట్ కొట్టింది లేదు. ఓ హిట్ కొట్టిన వెంటనే ఫ్లాపు పలకరిచరించడం టైమ్ టేబుల్ ప్రకారంగా సాగుతోంది.
        
2016 లో పెళ్ళి చూపులు అనే హిట్ తో గుర్తింపులోకొచ్చిన తను ఆ తర్వాత ద్వారక తో ఫ్లాపయ్యాడు. దాంతో అప్పట్లో అతడ్ని ఒన్ ఫిలిమ్ వండర్ అని కూడా విమర్శించారు. అయితే వెంటనే టాలీవుడ్‌లో సంచలనాత్మక విజయంగా నిలిచిన అర్జున్ రెడ్డి తో బలంగా తిరిగి వచ్చాడు. దీని తర్వాత మళ్ళీ ఇంకో అట్టర్  ఫ్లాప్ ఏ మంత్రం వేశావే తో షాకిచ్చాడు. ఆ తర్వాత మహానటి అనే సూపర్ హిట్ లో నటించినా ఆ నటించింది కేవలం అతిధి పాత్ర. దీని తర్వాత గీత గోవిందం తో హిట్టయి తిరిగి అర్జున్ రెడ్డి దగ్గర ఆగిన స్టార్ డమ్ ని నిలబెట్టుకున్నాడు.  
        
దీని తర్వాత మళ్ళీ నోటా అనే మరో ఫ్లాప్. నోటా ఫ్లాపయ్యాక టాక్సీవాలా హిట్. ఇలా ఒక హిట్ తర్వాత ఒకటీ ఆరా మాత్రమే ఫ్లాప్ ఇస్తూంటే ప్రేక్షకుల అభిమానం  కోల్పోతాడన్నట్టు, ఇక వరుస బెట్టి ఫ్లాపులివ్వడం మొదలెట్టాడు. ఐదు వరస ఫ్లాపులు- డియర్ కామ్రేడ్, వరల్డ్ ఫేమస్ లవర్, లైగర్, ఖుషీ, ఫ్యామిలీ స్టార్...ఇంతకంటే  ఏం కావాలి ప్రేక్షకులకి. కట్టలు కట్టలుగా ఫ్లాప్ గ్యారంటీ ఇచ్చే పాసిఫ్ హీరో క్యారక్టర్లతో 8 బౌండెడ్ స్క్రిప్టులే తన ఆస్తిగా మిగిలాయి. కమర్షియల్ సినిమా అన్నాక అది ఆడాలంటే యాక్టివ్ హీరో క్యారక్టర్ తప్పనిసరిగా వుండాలని పదుల కోట్లు బడ్జెట్లు పెట్టించే ఈ దర్శకులకే తెలీదు, ఇక హీరో కేం తెలుస్తుంది!
        
ఈ ఉగాది శ్రీ క్రోధి నామ సంవత్సరం. అంటే దీనర్థం క్రోధాన్ని కలిగించేది. ఈ కాలంలో ప్రజలు కోపంతో, ఆవేశంతో వ్యవహరించే అవకాశం వుందని పండితులు చెబుతున్నారు. కాబట్టి ప్రేక్షకులతో ఇలా జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత తనకే వుంది. ఐదు బ్యాక్ టు బ్యాక్ దెబ్బలు పడ్డాక ప్రేక్షకుల క్రోధం ఏ రేంజిలో వుంటుందో వూహించుకోవచ్చు.  ఫ్యామిలీ స్టార్ అనేది హీరో నాగచైతన్య నుంచి, నిర్మాత అల్లు అరవింద్ నుంఛీ దర్శకుడు పరశురామ్ హైజాక్ చేసి విజయ్ దేవరకొండ దగ్గరికి, నిర్మాత దిల్ రాజు దగ్గరికీ తీసుకెళ్ళి పోయి తీసిన సినిమా. అప్పట్లో పెద్ద వివాదం కూడా రగుల్కొన్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఇలా అట్టర్ ఫ్లాపవడంతో ఇది పోయేటిక్ జస్టిస్ ళా అనిపించి నాగచైతన్య, అల్లు అరవింద్ ఆనందిస్తున్నట్టు తెలుస్తోంది.
        
మొదటి రోజు ఓపెనింగ్స్ దగ్గర్నుంచి తొలి వారాంతం కలెక్షన్స్ ఎందుకో విజయ్ గత సినిమాల రేంజిలో లేవు. ఎంత ఫ్లాపయినా తొలి మూడు రోజులు అతడి సినిమాలకి బలంగానే వసూళ్ళు వుండేవి. ఇప్పుడు బాక్సాఫీసు ట్రాకర్ సాచ్నిక్ ప్రకారం శుక్ర -శని- ఆది వారాల్లో ఇండియా నెట్ రూ. 12.30 కోట్లు మాత్రమే. నాల్గవ రోజు నిన్న సోమవారం ఇండియా నెట్ రూ. 1.30 కోట్లు మాత్రమే! ఏపీ - తెలంగాణాల్లో శుక్రవారం రూ. 5.4 కోట్లు, శనివారం రూ. 2.7 కోట్లు, ఆదివారం రూ. 2.4 కోట్లు, నిన్న సోమవారం రూ. 1.12 కోట్లు -మొత్తం రూ 11.62 కోట్లు మాత్రమే. నిన్నటి కనిష్ట డ్రాప్ తో సినిమా మీద ఆశలు వదులుకున్నారు. రూ. 50 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తే నాల్గో వంతు కూడా వసూలు చేయలేకపోయింది ఫ్యామిలీ స్టార్.
        
తన స్టార్ డమ్ ఇంత అట్టడుక్కి చేరాక విజయ్ కిది ప్రమాద ఘంటికలు మోగుతున్న వేళ... అర్జెంటుగా కొత్త బౌండెడ్ స్క్రిప్టుల్ని కొత్త బాక్సాఫీసు కళ్ళతో చూడాల్సిన అవసరాన్ని నొక్కిజెప్తున్న సందర్భం. చూసే కళ్ళు మారితే వచ్చే  వసూళ్ళు  మారతాయి.
—సికిందర్