రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

18, ఫిబ్రవరి 2021, గురువారం

1014 : స్క్రీన్ ప్లే సంగతులు


       గాథలో ప్రధాన పాత్ర పేరు డేనియల్ డే ప్లేన్ వ్యూ. సులభంగా వుంటుందని తెలుగులో డానీ అందాం. డానీ జానీ శీను టెంప్లెట్ పేర్లు అలవాటే మనం తెలుగు ప్రేక్షకులై విజయవంతంగా జీవిస్తున్నందుకు. ప్రత్యర్ధి పాత్రపేరు ఇలై సండే. ఇలై కూడా తెలుగులో అనుకూలంగానే వుంది ఇళయరాజా లాగా. ఒక్క పిల్లవాడి పేరే హెచ్ డబ్ల్యీవ్ అని తెలుగుని సవాలు చేస్తూ వుంది. దీన్ని జూనియర్ డానీ అనేద్దాం.

        జూనియర్ డానీని తీసుకుని లిటిల్ బోస్టన్ ప్రయాణమవుతాడు డానీ. అక్కడ ఎడారిలా వున్న ప్రాంతంలో ఏబెల్ కి చెందిన సండే రాంచ్ చేరుకుంటాడు. డానీకి భూముల ఆఫర్ ఇచ్చిన పాల్ సండే, ఏబెల్ కొడుకుల్లో ఒకడు. రెండో కొడుకు ఇలై సండే. వీళ్ళిద్దరూ కవలలు. ఇలై చర్చి పాస్టర్. ఏబెల్ కి ఇంకా భార్య, రూత్ అనే పన్నెండేళ్ళ కూతురు, మేరీ అనే ఇంకో పదేళ్ళ కూతురూ వుంటారు. ఇలా ఇక్కడికొచ్చిన డానీ ఈ ప్రాంతంలో వేట కోసం వచ్చాననీ, డాక్టరు కూడా కొడుకు జూనియర్ డానీకి మంచి గాలి అవసరమని చెప్పాడనీ అబద్ధం చెప్తాడు. రాంచ్ లో బస ఏర్పాటు చేస్తారు సండే కుటుంబీకులు.

        ఇక జూనియర్ ని తీసుకుని డానీ వేటకి బయల్దేరతాడు. తండ్రీ కొడుకులు వూరికే తుపాకులు పేలుస్తూ రికామీగా తిరుగుతారు, వచ్చిన పని ఇది కాదు కాబట్టి. ఇంతలో జూనియర్ డానీ బూట్లకి ఏదో అంటుకుంటుంది. అది చూసి, భూకంపంతో ఉబికి వచ్చిన చమురు అని చెప్తాడు డానీ. అంటే ఈ ప్రాంతంలో చమురు వున్న విషయం నిజమేనన్న మాట. అక్కడే తండ్రీ కొడుకులు ఆయిల్ వ్యాపారం గురించి మాట్లాడుకుంటారు. పదేళ్ళ కొడుకుని బిజినెస్ భాగస్వామిగా ఎప్పుడో ప్రకటించాడు డానీ. ఆయిల్ ని యూనియన్ ఆయిల్ కంపెనీకి అమ్మాలంటే పైపు లైను వేయాలంటాడు.  

        రాత్రి డిన్నర్ దగ్గర వేట కోసం భూముల్ని కొనేస్తానని ఏబెల్ తో అంటాడు డానీ. ఇలై అనుమానంగా చూస్తాడు. ఎకరానికి ఆరు డాలర్లు ఇస్తానంటాడు డానీ. పోనీ ఆరువందల ఏకరాలకి 3,700 డాలర్లు ఇస్తానంటాడు. ఇవి ఆయిల్ భూములని గుర్తు చేస్తాడు ఇలై. ఇక తన వేట నాటకం లాభం లేదనుకుని, ఆయిల్ భూములైతే మాత్రం ఆయిల్ తీయాలంటే ఎంత డ్రిల్లింగ్ చేయాలో తెలుసా - అంటాడు డానీ. వూరికే గునపం వేస్తే ఆయిల్ పడుతుందంటాడు ఇలై.  

        చివరికి 10 వేల డాలర్లకి బేరం కుదురుతుంది. ఇదికాక ఇంకో పదివేల డాలర్లు చర్చి కోసం ఇవ్వాలని డిమాండ్ చేస్తాడు ఇలై. ఇది కూడా ఒప్పుకుని ఇలైకి అయిదు వేలు అడ్వాన్సు ఇస్తాడు. అయితే రియల్ ఎస్టేట్ ఏజెంట్ దగ్గర వివరాలు తీయిస్తే, మధ్యలో విలియం బాండీ అనే అతడి భూములున్నాయని తేలుతుంది. ఇవి అమ్మడానికి బాండీ ఒప్పుకోడు.

  డానీ ఇక వర్కర్లని నియమించుకుని పనులు ప్రారంభిస్తాడు. ఇటు మేరీతో ఆడుకుంటున్న జూనియర్, మేరీ ని ఆమె తండ్రి ఏబెల్ ప్రార్థన చేయట్లేదని కొడుతున్నాడని వచ్చి చెప్తాడు డానీకి.

      డ్రిల్లింగ్ ప్లాంట్ సిద్ధమవుతుంది. అప్పుడు ఇలై వచ్చి, ప్రారంభోత్సవానికి ప్రార్ధన చేయించాలంటాడు. అతడి విన్నపం ఓపిగ్గా విని, సరేనంటాడు డానీ. పాస్టర్ ఇలై నిర్ణయించిన ముహూర్తానికి ప్రారంభోత్సవ ఏర్పాట్లు చేస్తాడు. కానీ ఇలైని లోపలికి రానివ్వకుండా అడ్డుగా నిలబడి, వర్కర్లకి లెక్చరిస్తాడు డానీ : కలిసి పని చేద్దామని, ఫలితాన్ని కలిసి పంచుకుందామనీ. ఇటు పక్క జూనియర్ ని నిలబెట్టుకుని, అటు పక్క మేరీని నిలబెట్టుకుని, మేం ఫ్యామిలీ అన్న లుక్ ఇస్తాడు. ప్రార్ధన పేరుతో మేరీని ఆమె తండ్రి బాధిస్తే, పరిణామాలు అంత బావుండవని చెప్తాడు. ఇలై డానీ పోకడ అంతా మౌనంగా గమనిస్తాడు.

        జూనియర్ చేతే ప్రారంభోత్సవం చేయిస్తాడు డానీ. ఆ రాత్రే ప్రమాదం జరిగి ఒక వర్కర్ చనిపోతాడు. ఇది ప్రార్ధన చేయించని ఫలితమని ఇలై అంటాడు. పట్టించుకోడు డానీ. మహా కార్యం తలపెట్టినప్పుడు కొన్ని బలులు తప్పవనుకుంటాడు. ఇలా ప్రారంభోత్సవ ఘట్టం ముగిశాక, డానీ ఇచ్చిన అడ్వాన్సుతో ఇలై చర్చి విస్తరించి కడతాడు. చర్చికి పొలోమని వర్కర్లంతా వెళ్తారు ప్రార్ధనలకి. డానీ కూడా వెళ్ళి చూస్తాడు. పాస్టర్ ఇలై సువార్త -స్వస్థతా ప్రార్ధనలు జరుపుతూ, ఒకావిడ సైతాను వదిలించడానికి వెళ్లిపో వెళ్లిపో అంటూ పూనకం పూని భయంకర గర్జనలు చేస్తాడు. డానీ చూస్తూ వుంటాడు.

        ఇక ఆ తర్వాత, భూమిలోంచి చమురు ఒక్క పెట్టున ఉప్పొంగి, డ్రిల్లింగ్ ప్లాంట్ ఒక్క సారిగా మంట లంటుకుని బద్ధలై, చెవిటివాడై పోతాడు జూనియర్ డానీ.

***

        2. వివరణ :  35 నిమిషాలు సాగే పై మిడిల్ 1 విభాగమంతా, విశ్రాంతి ఘట్టం వరకూ వచ్చే కథనం (120 పేజీల స్క్రిప్టులో బిగినింగ్ 20 పేజీలు, మిడిల్ 1, 40 పేజీలు). ఇది మిడిల్ విభాగపు బిజినెస్ -అంటే సంఘర్షణ.  పీపీ 1 దగ్గర ఏర్పడే కాన్ఫ్లిక్ట్ పాయింటుతో సంఘర్షణ. కానీ వెనుకటి ఆర్టికల్లో రాసిందాంట్లో పీపీ 1 దగ్గర ఈ గాథలో కాన్ఫ్లిక్టే లేదే? కేవలం పాల్ సండే వచ్చి భూముల ఆఫర్ ఇచ్చి వెళ్ళినట్టు వుంది. గాథ ఇలాగే వుంటుంది. కాన్ఫ్లిక్ట్ ఏర్పడదు, ఏదైనా మలుపు వస్తుంది. పాల్ సండే వచ్చి భూముల ఆఫర్ ఇచ్చి వెళ్ళే లాంటి మలుపు. ఈ మలుపుతో డానీ భూములు కొనడానికి లిటిల్ బోస్టన్ బయల్దేరడం - క్రితం ఆర్టికల్ లో చెప్పుకున్నట్టు, బిగినింగ్ విభాగపు నేపథ్యం లోంచి ఇంకో కొత్త నేపథ్యం లోకి స్థల మార్పు, పాత్రకి స్థాన చలనం వగైరా. పురాణాల ఆధారంగా హీరోస్ జర్నీ మోనోమిత్ స్ట్రక్చర్ చెప్పిన జోసెఫ్ క్యాంప్ బెల్ ప్రకారం - పై స్థానచలన మలుపుని ది కాల్ టు అడ్వెంచర్ అంటారు.   
        (The Call to Adventure : The hero begins in a situation of normality from which some information is received that acts as a call to head off into the unknown. This region is represented by a distant land, a forest, a kingdom underground, beneath the waves, or above the sky, a secret island, lofty mountain top etc) 

        రాముడు అడవుల కెళ్ళడం కూడా ఈ మలుపే. ఎందుకంటే గాథ అనేది ముగింపు వరకూ పాత్ర దాని కర్మ ఫలాలతో మలుపులు తిరిగే నిరంతర ప్రయాణం కాబట్టి. ప్రయాణపు వృత్తాంతం కాబట్టి. అందుకని గాథ అనేది స్టేట్ మెంట్ అవుతోంది. నాకిలా జరిగితే, నేనిలా చేసుకుని, ఇలా అయ్యానని, జాలి కోసమో, నీతి కోసమో పాత్ర ఇచ్చుకునే స్టేట్ మెంట్.

        అదే కథైతే ఆర్గ్యుమెంట్ కేంద్రంగా కథనం వుంటుంది. ఆర్గ్యుమెంట్ అన్నాక కాన్ఫ్లిక్ట్ పుట్టాల్సిందే. అందుకని కథకి పీపీ 1 లో ఆర్గ్యుమెంట్ తో కాన్ఫ్లిక్ట్ పుడుతుంది. ప్రధాన పాత్ర -ప్రత్యర్ధి పరస్పరం నేరుగా నువ్వు రైటా, నేను రైటా అనే ఆర్గ్యుమెంట్ తో కూడిన కాన్ఫ్లిక్ట్. ఈ ఆర్గ్యుమెంట్ కి చివర్లో జడ్జిమెంట్ వుంటుంది. శివ లో నాగార్జున సైకిలు చెయినుతో జేడీని వీరబాదుడు బాదేక, అది నేరుగా మాఫియా భవానికి సవాలు విసిరే కాన్ఫ్లిక్ట్ అయింది. ఎవరు రైటో తేల్చుకుందాం రా అయింది. ఆర్గ్యుమెంట్ అయింది. చివర్లో భవానీ చావుతో అతను రైట్ కాదని జడ్జిమెంట్ వచ్చింది. అందుకని కథలో ఆర్గ్యుమెంట్ దృష్ట్యా జడ్జిమెంట్ కోసం ఎదురు చూస్తారు ప్రేక్షకులు. జడ్జి మెంట్ కరెక్ట్ గా లేకపోతే శాపాలు పెట్టి పోతారు.

        ప్రస్తుత గాథ కథ అవాలంటే, బిగినింగ్ విభాగంలో డానీ సదరు భూములు కొట్టేయడానికి ఎత్తుగడలు వేస్తూ వుండాలి. అప్పుడు పీపీ 1 లో పాల్ సండే వచ్చి- మా భూముల జోలికొస్తే జాగ్రత్త - అని హెచ్చరించాలి. అప్పుడది భూముల కోసం పోరాటంగా మారి, మొత్తం గాథ కోసం ఉద్దేశించిన విషయమే మారిపోతుంది.

***

     3. మరి గాథలు సినిమాకి పనికి రావని, కథలే పనికొస్తాయనీ చాలా సార్లు చెప్పుకున్నామెందుకు? నిజానికి గాథలు ఆర్ట్ సినిమాలకి తప్ప కమర్షియల్ ఎంటర్ టైనర్లుగా పనికి రావనే చెప్పుకోవాలి. అందుకని మాస్ మీడియా అయిన కమర్షియల్ ఎంటర్ టైనర్లకి కాన్ఫ్లిక్ట్ తో కూడిన కథలే తీస్తారు. ఎప్పుడో గానీ గాథ తీయరు. తీస్తే శాస్త్ర బద్ధంగా తీస్తారు. తీసినప్పుడు చరిత్రలో నిలిచి పోవచ్చు. ఈ దేర్ విల్ బి బ్లడ్  సక్సెస్ ఫుల్ గాథ గురించి ఒక దర్శకుడికి చెప్తోంటే, మన మైండ్ దొబ్బిందా వాళ్ళ మైండ్ దొబ్బిందా అన్నాడు, మన పరిస్థితికి అద్దం పడుతూ. మన మైండ్ గాథల జోలికి పోక, వాళ్ళ మైండ్ గాథలతో బాగా పోతూ.

        తెలుగులో జరుగుతున్నదేమిటంటే, కథకీ గాథకీ తేడా తెలియక, కథ అనుకుని తీసుకుంటూ పోతే అవి గాథ లైపోతున్నాయి. పూర్తి గాథలు కూడా కాదు. గాథలు గాని గాథలు, కథలు కాని కథలు. కృష్ణవంశీ గురి చూసి బ్యాక్ టు బ్యాక్ మొగుడు’, పైసా అనే ఇలాటివి రెండు తీసి, అంతే బ్యాక్ టు బ్యాకుగా ఫ్లాపులిచ్చి అవతల పడ్డారు. ఇంకెందరో ఇలాటివి చేశారు- బ్రహ్మోత్సవం సహా. హోటలతను ఇడ్లీతో చట్నీ, సాంబారు విడివిడిగా పెడతాడే గానీ, రెండూ కలిపేసి జానర్ మర్యాదలు చెడగొట్టడు. ఒక రెస్టారెంట్ లో ఫారినర్ టీ, కాఫీ రెండూ తెప్పించుకుని, అది కొంచెం ఇది కొంచెం తాగుతూ కూర్చున్నాడు. రెండిటి జానర్ మర్యాదలు విడివిడిగా అనుభవిస్తున్నాడన్న మాట. తెలుగు సినిమాల కంటే ఇదే బెటర్ అనుకున్నాడేమో.  

***

        4. గాథ తీయాలనుకుంటే దాని కోసం మానసికంగా సిద్ధపడి గాథే తీయాలి. అదెలా తీయాలో ఈ స్క్రీన్ ప్లే సంగతుల్లో దేర్ విల్ బి బ్లడ్ ఆధారంగా చేతనైనంత వరకు చెప్పుకుంటున్నాం. రచయిత, దర్శకుడు పాల్ ఆండర్సన్ 526 పేజీల నవల్లో, 150 పేజీలే తీసుకుని ఈ గాథ చేశాడు. భారీ నవల్లోని ఎన్నో పాత్రల్ని, ఉప కథల్ని, కాన్సెప్ట్ నుంచి పక్కకెళ్ళే విషయాల్నీ పక్కన పెట్టేశాడు. తెలుగులో కూడా గాథ తీయాలంటే పురాణాల ప్రభావానికి లోనై భారీ సంఖ్యలో తారాగణంతో, వాటి రకరకాల సంబంధాలతో, ఉప కథలతో మొత్తం విషయాన్ని తడిసి మోపెడు చేయాల్సిన అవసరం లేదు.

        గౌతమీ పుత్ర శాతకర్ణి’, బాజీరావ్ మస్తానీ భారీ చారిత్రకాలే గానీ గాథలు కావు, అవి కథలే. వీటిలో మొదటి దానిలో బాలకృష్ణ, శ్రియ, హేమమాలినీ పాత్రల మధ్యే కుటుంబ కథ వుంటుంది. రెండో దానిలో రణవీర్ సింగ్, దీపికా పడుకొనే, ప్రియాంకా చోప్రాల మధ్యే ఇతర పాత్రల ప్రమేయంలేని సూటి ప్రేమ కథ వుంటుంది. ఫోకస్ చేసిన ఈ పాత్రల మధ్య కథలతోనే ఇవి నిలడ్డాయి.

        ఇంత భారీ ఎత్తున తీసిన గాథలో దర్శకుడు పాల్ ఆండర్సన్ - డానీ, ఇలై పాత్రల మధ్యే ఫోకస్ చేసి, సింగిల్  లైనులో సింపుల్ గాథ నడిపాడు. 21వ శతాబ్దపు గొప్ప సినిమాల్లో ఒకటిగా, ఎపిక్ - క్లాసిక్ గా ప్రశంసలు పొందిన దీనికి తలపండిన ఏ ఐదారు పదుల వయసు దర్శకుడో మేకర్ కాదు. 2007 లో ఆండర్సన్ వయసు 37 సంవత్సరాలే. వయసు కాదు గొప్ప, వయసు ఏ గ్యారంటీ ఇవ్వదు. ఏ వయస్సులో వున్నా ఆ వయసులో వుండే మనస్సుని చూడాలి. మనసే మందిరం కాబట్టి. మిగిలినదంతా డంప్ యార్డు.

        ఆండర్సన్ కృషికి ఎనిమిది ఆస్కార్ నామినేషన్లు పొంది, రెండు ఆస్కార్లు లభించాయి యీ గాథకి.

***

       5. దీని బ్యాక్ డ్రాప్ భారీ తనంతోనే వుంటుంది- 1920 ల నాటి కథాకాలపు పీరియెడ్ బిజినెస్ జానర్ మూవీగా. కానీ విషయం సింపుల్ గా వుంటుంది. భారీ బ్యాక్ డ్రాప్ కి భారీ కథ కూడా పెడితే కథని ఫీలవ లేరు ప్రేక్షకులు. కథని భారీ బ్యాక్ డ్రాపే మింగేస్తూంటుంది. ఇక టెక్నికల్ హంగామా కూడా రుద్దితే చెప్పనవసరం లేదు. హాలీవుడ్ మంత్రం ఏమిటంటే, బిగ్ యాక్షన్ బ్యాక్ డ్రాప్ మూవీస్ కి కథ సింపుల్ గా వుండాలి; దీనికి రివర్స్ లో బిగ్ యాక్షన్ బ్యాక్ డ్రాప్ కాని వాటికి కథ బరువుగా వుండాలి. ఇలా బ్యాక్ డ్రాప్ తో, కథనంతో విజువల్ కాంట్రాస్ట్ పాటిస్తారు. మార్కెట్ లో సరైన క్రియేటివ్ యాస్పెక్ట్ తో సినిమాని ప్రవేశ పెడుతున్నామా లేదానేది మొదటి ప్రశ్నవుతుంది. అన్నిటికీ స్టడీస్ వున్నాయక్కడ.

        ఇంకోటేమిటంటే, ఈ బిగ్ బ్యాక్ డ్రాప్ పీరియెడ్ మూవీలో డైలాగులు కూడా భారీగా వుండవు. అరుచుకోవడా లుండవు. భారీ బ్యాక్ డ్రాప్ కి కాంట్రాస్టుగా, డానీ - ఇలై రెండు పాత్రల మధ్య సింపుల్ గా అర్ధమయ్యే కథనంతో డ్రామా రక్తి కడుతూంటుంది. మరొకటేమిటంటే, క్యాస్టింగ్ వ్యూహం. డానీ, ఇలై పాత్ర ధారులుగా సమానులైన నటుల్ని తీసుకో లేదు. డానీ - ఇలైల వయసు తారతమ్యం కూడా ఎక్కువే. డానీ ముందు లేత పిండంలా వుంటాడు యువకుడుగా ఇలై. మెచ్యూర్డ్ ప్రధాన పాత్రకి, ప్రత్యర్ధి పాత్ర ఇంత యంగ్ యాక్టర్ ఏమిటా అన్పిస్తుంది. డానీ పెట్టుబడికి ప్రతినిధి, ఇలై మతానికి ప్రతినిధి. మొదట్నుంచీ తానే రారాజు అన్నట్టు డానీ డామినేషన్ తో సాగుతున్నఈ గాథలో, ప్రత్యర్ధిగా ఇలై ఎదురయ్యేసరికి, అందునా అతను మతానికి ప్రతినిధి కూడా అయ్యేసరికి - పెట్టిబడి ముందు మతం సైతం సున్నా అన్న అహంతో ఇలైని గనుక చూస్తే, డానీకి కుందేలు పిల్లలానే కన్పిస్తూండాలి. అందుకని డానీ పాయింటాఫ్ వ్యూలో ప్రత్యర్ధి పాత్ర పోషకుడితో ఈ క్యాస్టింగ్ వ్యూహం కావచ్చని మన వూహ.

        మరి ఈ మిడిల్ 1 యాక్షన్ - రియాక్షన్లతో కూడిన సంఘర్షణా విభాగంలో ప్రత్యర్ధి ఇలై ఇలా పాసివ్ గా వుండి పోతే, ఇద్దరి మధ్య అంతర్విరోధ మెలా? పాసివ్ గా ఏమీ వుండి పోడు బిక్కుబిక్కు మంటూ. చర్చి ప్రారంభోత్సవంలో అతను ఒకావిడ సైతానుని వదిలిస్తూ, వెళ్లిపో వెళ్లిపో అని గర్జిస్తున్నప్పుడు, అది డానీ కి ఎక్కుపెట్టి చూపిస్తున్న విశ్వరూపమే. ప్లాంట్ ప్రారంభోత్సవానికి తన మాట పక్కన బెట్టి, డానీ చేసిన అవమానానికి, ఇలా రియాక్షన్ తో బదులు తీర్చుకుంటున్నాడు.

        చాలా విచారకరమిది. మత బోధకుడికి మాత్సర్య ముండకూడదు. పగబట్ట కూడదు. ఇలై ఇలా మారిపోయి, డానీని ఎదుర్కొంటూ యాక్టివ్ అయిపోయాడు. ఒక మతబోధకుడిగా ఈ స్థితికి ఇలై వచ్చాడంటే, తన పతనాన్ని తను రాసుకుంటున్నట్టే. పెట్టుబడిదారుగా డానీ కూడా మతాన్ని అవమానిస్తూ తన పతనాన్ని తను రాసుకుంటున్నాడు. పెట్టుబడికి, మతానికీ తంపులు పెట్టుకుని రెంటినీ మంట గలిపే దిశగా గాథని నడిపిస్తున్నారు. వీళ్ళ కర్మలే కాజ్ అండ్ ఎఫెక్ట్ హోల్ సేల్ దుకాణాన్ని బట్టబయలుగా బార్లా తెరుస్తున్నాయి.

***

        6. ఈ గాథ సంఘర్షణలో ముఖ్యంగా గమనించాల్సిం దింకొకటేమిటంటే, భౌతిక దాడులతో ఘర్షణ జరగడం లేదు. ప్లాంట్ ప్రారంభోత్సవం తర్వాత జరిగిన రెండు ప్రమాదాలూ ప్రత్యర్ధి ఇలై జరిపినవి కావు. ప్రమాదంలో జూనియర్ డానీ చెవిటి వాడయ్యాడంటే ఇలై కారకుడు కాదు. ఇలై కేవలం ప్రారంభోత్సవానికి ప్రార్ధన జరిపించాలన్నాడు. డానీ విన్పించుకోని ఫలితంగా ప్రమాదాలు జరిగాయని అర్ధం.

        ఈ గాథ దైవం వర్సెస్ డబ్బు పాయింటుతో నడుస్తోంది. దీన్ని బట్టి ఈ ప్రమాదాల్ని అర్ధం జేసుకోవాలి. విధి అని కూడా అనుకోవచ్చు. విధి ఎక్కడ్నుంచి వస్తుంది. చేతల్లోంచే వస్తుంది. డానీ ఇలై మాట వినలేదు, అనుభవించాడు. సృష్టి సమస్తం దాని సమతూకం కోసం యాక్షన్ - రియాక్షన్ల బ్రహ్మాండమైన ఫ్యాక్టరీయే. పై నుంచి విధి పేరు పెట్టుకుని ఎవడో అదృష్ట దురదృష్టాల్ని రుద్దడం లేదు. అంతా భూమ్మీదే ప్రకృతి సూత్రాలనుసారమే జరుగుతుంది. ప్రతీ చర్యకీ సమానమైన వ్యతిరేక ప్రతి చర్య వుంటుందని న్యూటన్ అననే అన్నాడు. లా ఆఫ్ కంపెన్సేషన్ అంటూ ఎమర్సన్ ఏమన్నాడో చూస్తే- ప్రకృతి దాని సమతూకం కోసం హెచ్చు తగ్గుల్నిసరి చేస్తూంటుంది. ఒక అన్యాయం జరిగిందంటే, ఏదో రూపంలో తగిన న్యాయం జరిగి తీరాల్సిందే. జరిగేలా ప్రకృతి చూసుకుంటుంది. ఇలై ప్రార్ధన జరిపించమని తన మాటతో ఇచ్చిన పాజిటివ్ వైబ్రేషన్ కి, డానీ కాదని నెగెటివ్ వైబ్రేషన్ ఇచ్చాడు. దీంతో ప్రకృతి డానీకి నష్టం చేసి, ఇలై పాజిటివ్ వైబ్రేషన్ కి కంపెన్సేషన్ ఇప్పించింది. ఇలై మాట పాజిటివ్ వైబ్రేషన్ కాకపోతే, కంపెన్సేషన్ (నష్టపరిహారం) ఇప్పించేది కాదు ప్రకృతి. ఏది పాజిటివో, ఏది నెగెటివో ప్రకృతి గుర్తిస్తుంది. ఇలా దైవం, విధి, ప్రకృతి - ఏదనుకున్నా ఫలితమొక్కటే. సింపుల్ గా కర్మ ఫలం.

        ఇదేదో బావుందనుకుని ఎమోషనల్ రైటర్ గారు హాయిగా కథలో వాడుకుంటే నవ్విపోతారు ప్రేక్షకులు. కథ అనేది ప్రత్యర్ధుల ఆర్గ్యుమెంట్ తో కూడిన భౌతిక కాన్ఫ్లిక్ట్. ప్రమాదాల్ని విలన్ జరపకుండా విధి వశాత్తూ జరిగిందంటే, వీధినపడి తెగ నవ్వుతారు ప్రేక్షకులు. విలన్ జరపడం కూడా పైన చెప్పుకున్న ఫిలాసఫీయే. కానీ కథకి ఫిలాసఫీ చెప్పకుండా, పాత్రల విజిబుల్ యాక్షన్ గా షుగర్ కోటింగ్ వేసి చూపించాలి. ఇవన్నీ జానర్ మర్యాదల సంగతులు.

***

        7. క్రితం ఆర్టికల్ బిగినింగ్ విభాగంలో చెప్పుకున్నట్టు, పాజిటివ్ పాత్రగా కన్పించిన డానీ, ఇప్పుడు ఈ మిడిల్ 1 కొచ్చేసరికి నెగెటివ్ క్యారక్టర్ గా మారాడని అడుగడుగునా తెలిసిపోతోంది. ఇలా డానీ పాత్రోచిత చాపం (క్యారక్టర్ ఆర్క్) చప్పగా పడుండక, డైనమిక్స్ తో ఒక రేంజికి పైకెళ్లి, ఫ్ర్రెష్ ఆసక్తిని కల్గిస్తోంది. కథనం రీఫ్రెష్ అవుతోంది మొదట చూపించిందే కథకుడు లేజీగా ఇంకా లాగుతూ పోకుండా.
        మతబోధకుల భూములు కొనాలను కోవడం తప్పు కాదు. వెంటనే విషయం చెప్పి వాళ్ళ అంగీకారంతో కొనొచ్చు. కానీ వేట అంటూ వేటగాడి వేషంలో వచ్చి వేట కోసం కొనాలనడంలో వ్యాపార బుద్ధిని దుర్బుద్ధితో ప్రదర్శించాడు. ఈ పాత తరం కాలాన్ని చూపిస్తున్న గాథలో డానీ ఇలా తయారయ్యాడు. ఆ కాలపు రాక్ ఫెల్లర్, హెన్రీ ఫోర్డ్, ఆండ్రూ కార్నెగీ వంటి ప్రసిద్ధ పారిశ్రామిక వేత్తలు ఇలా కాకుండా పారదర్శకంగా వ్యాపారాలు చేశారు. ఇదీ వీళ్ళకి కాంట్రాస్ట్ గా డానీని నిలబెడుతూ, మన అటెన్షన్ డ్రా చేస్తున్న ఇంట్రెస్టింగ్ క్యారక్టర్ ఆర్క్. ఇక దీని ఫలితం తర్వాత అనుభవిస్తాడు. నెగెటివ్ పాత్రకి ఈ ధోరణి అవసరం.

        ఇలా వేట బహానాతో మిడిల్ 1 సంఘర్షణకి వెంటనే బీజాలు వేయడం స్క్రిప్టులో అవసరం. ప్రత్యర్ధి ఇలై పాత్రని ప్రవేశ పెడుతూ ఈ బీజాలెలా వేశారో, పైన ఇచ్చిన మిడిల్ 1 కథనం ఆధారంగా చివరగా చూసి ముగిద్దాం...
        ఈ క్రింది విశ్లేషణలో పాత్రల మధ్య యాక్షన్ రియాక్షన్ల సిరీస్ ని గమనించాలి. ఈ సీరీస్ లో పై చేయి కోసం జరుగుతున్న ప్రచ్ఛన్న యుద్ధం గమనించాలి. ఒక ప్రయత్నంతో ఒక పాత్ర పైనుంటే (ఉత్థానం), రెండో పాత్ర కిందికి జారడం(పతనం)... మళ్ళీ కిందికి జారిన పాత్ర దాని ప్రయత్నంతో పైకొస్తే (ఉత్థానం), పైనున్న పాత్ర కిందికి దిగజారడం (పతనం)...ఇలా రిపీట్ అవుతూ పోవడం సంఘర్షణలో జరిగే యాక్షన్ రియాక్షన్ల సిరీస్. మిడిల్ 1 ముగిసే సరికి ఉత్థాన పతనాలు కొలిక్కొచ్చి, ఏదో వొక పాత్ర అతి పెద్ద గండంలో పడి ఫస్టాఫ్ ముగియడం...

        రాగానే వేట కోసం వచ్చినట్టు ఏబెల్ తో అబద్ధం చెప్పిన డానీ, ఇక్కడ కొద్ది రోజుల క్రితం భూకంపం వచ్చినట్టుందే అంటాడు. అవునంటాడు ఇలై తండ్రి ఏబెల్. ఈ మిడిల్ 1 ప్రారంభానికి ఈ డైలాగు ఒక సైరన్ లా మనల్ని అప్రమత్తం జేస్తోంది. ఈ డైలాగు ఎందుకొచ్చిందో కాచుకోండి - అన్నట్టు. కథ కోసం కాకపోతే వూరికే వుండవు డైలాగులు గొప్ప సినిమాల్లో. చప్పిడి సినిమాల్లో ఎలాగైనా రాసుకోవచ్చు చట్నీ రుబ్బుతూ. పీపీ 1 అయిపోయాక, కథనం తర్వాతి సెగ్మెంట్ అయిన ఈ మిడిల్ 1 లోకి వెళ్తూ, ఇలా మిడిల్ 1 కి హుక్ వేయడం మంచి కళే కదా? డానీ నోట భూకంపం ప్రస్తావన వూరికే  రాలేదు, కుబుద్ధితో కూపీ లాగడానికే వచ్చింది. భూకంపమొస్తే వీళ్ళకి తమ భూముల్లో ఆయిలుందని తెలియ వచ్చని. తెలిసి వుంటే ఒకలా, తెలియకపోతే ఇంకోలా డీల్ చేయ వచ్చని. కానీ భూకంపం వచ్చిందన్న ఏబెల్ ఎలాటి ఎక్స్ ప్రెషన్ ఇవ్వకపోవడంతో, తేలిక పడతాడు డానీ.

        అయితే నెగెటివ్ పాత్ర డానీ నోట వచ్చిన ఈ మాట వూరికే పోదు. భూకంపం లాగే  వస్తుంది. ఏమిటది? భూమిని పగల దీసుకుంటూ అగ్ని గోళాలైన ఆయిల్ ప్లాంటుని బూడిద చేసే విస్ఫోటం -బ్యాంగ్ - బుద్ధొచ్చేలా ఇంటర్వెల్ బ్యాంగ్ బ్యాంగ్!
        డానీ నోట సైరన్ లా ఈ డైలాగు మిసైల్ లా వెళ్ళి తన ప్లాంటునే ఢమాల్మన్పించే డ్రమెటిక్ కంక్లూజన్. మిడిల్ 1 ప్రారంభంలో వేసిన హుక్, మిడిల్ 1 అంతంలో - అంటే ఇంటర్వెల్లో ఇలా పేఆఫ్ అవడం. ఎవ్విరీ థింగ్ ఈజ్ కనెక్టెడ్. విశ్వంలో ప్రతీదీ, జీవులు సహా, కంటికి కన్పించని దారాలతో కనెక్ట్ అయి వున్నాయని క్వాంటమ్ ఫిజిక్స్ చెప్తుంది. డానీ నోట డైలాగు ఎక్కడో కనెక్ట్ అయ్యే వుండక తప్పదు. కనెక్షన్ లేనిది ఏదీలేదు యూనివర్స్ లో. ఇదన్నమాట స్టోరీ రైటింగ్ అంటే. తమ కథ లోతుపాతులు తమకే తెలియని మేకర్లుంటే, కథంటే పైపైన సున్నాలేయడమే అనుకుంటే, సినిమాలు నిజంగా సున్నాలేగా అవుతాయి.

***

        8. కొడుకుని తీసుకుని వేట కెళ్ళినప్పుడు, అక్కడ కొడుకు బూటుకి ఆయిల్ తగిలితే, అది చూసి భూకంపం వల్ల ఉబికిన చమురు అనీ, అయితే ఇక్కడ చమురు నిల్వలున్నాయన్న మాట నిజమేనని రుజువయ్యిందనీ, కొడుకుతో అంటాడు డానీ (డానీ ఉత్థానం). ఇందులో అదృష్టమే కన్పించిందతడికి- అంతే గానీ, ఇక్కడ ఈ పగులు, పగులులోంచి చమురూ, రేపు బద్ధలవబోయే తన ప్లాంటుకి ముందస్తు హెచ్చరిక అని గమనించలేకపోయాడు. అలా వచ్చే ఇంటర్వెల్లో  ప్లాంట్ బద్ధలై అపార నష్టం జరుగుతోందని ఆందోళన పడే అసిస్టెంట్ కి - మన కాళ్ళ కింద చమురు సముద్రాలున్నాయని ఇలా తెలిసినందుకు సంతోషించవయ్యా మగడా, ఎందుకేడుస్తావ్ - అని మందలిస్తాడు డానీ. దురదృష్టంలో అదృష్టాన్ని చూసే ఆప్టిమిస్టు. మంచి వ్యాపార లక్షణమే, కానీ మానవత్వం లేదు.

***

      9. తిరిగి రాత్రి డిన్నర్ దగ్గర, దేవుణ్ణి నమ్ముతావా అంటాడు ఏబెల్. నమ్ముతాననని అబద్ధం చెప్తాడు డానీ. ఏ చర్చి కెళ్తావంటే ఏదో పేరు చెప్తాడు. అదెక్కడుందో చెప్పలేక దొరికి పోతాడు (ఏబెల్ ఉత్థానం). భూకంపాల గురించి నీ అభిప్రాయమేమిటని అడుగుతాడు ఏబెల్. అది దేవుడు ప్రదర్శించే శక్తి అంటాడు. కాదు - తాగుబోతులూ, అబద్ధాలకోర్లూ పెరిగి పోయినప్పుడు పరిశుద్ధాత్మ కన్నెర్ర జేసే పద్ధతి భూకంపం అంటాడు ఏబెల్ (ఏబెల్ ఉత్థానం). ఇలా డానీ అబద్ధాలకే ఇంటర్వెల్ బ్యాంగులో పరిశుద్ధాత్మ కన్నెర్ర జేసి ప్లాంటుని బద్దలు చేసిందన్న మాట.

        మిడిల్ 1 అంటే ప్రత్యర్ధితో సంఘర్షణ కాబట్టి, యాక్షన్ రియాక్షన్ల సిరీస్ కాబట్టి, అదిలా ఎదుర్కొంటున్నాడు మాటలతో డానీ. మిడిల్ 1 లో ఏది చూసినా మిడిల్ 1 బిజినెస్ గురించే జరుగుతోందని గమనించాలి. ఇక వేట కోసం భూములు కొంటానంటే, ఇప్పుడు కౌంటర్ ఇస్తాడు ప్రత్యర్ధి ఇలై. ఇవి చమురు భూములని చెప్పి (ఇలై ఉత్థానం). ఇలా ఇక్కడా దొరికి పోయి దారికొచ్చేస్తాడు డానీ (డానీ పతనం). వీళ్ళేదో హలెలూయా అని పాడుకుంటూ గడిపే అమాయక బృందమనుకున్నాడు. తీరా తన సమ ఉజ్జీలని తేలింది.
        భూముల ఆఫర్ తో వచ్చినప్పుడు పాల్ సండే, చమురు గురించి కుటుంబంలో ఎవరికీ తెలిసి వుండదని  చెప్పడంతో, ఈ ఎత్తుగడలు వేయాల్సి వచ్చింది డానీకి. కానీ ఇప్పుడు మతం ముందు పెట్టుబడి ఆటలు సాగడం లేదు. వాళ్ళు భూములకి డబ్బు కూడా ఎక్కువ గుంజారు (ఏబెల్ ఉత్థానం). చర్చి కోసం ఇలై ఇంకో పదివేలు చందా కూడా అదనంగా లాగాడు (ఇలై ఉత్థానం). చమురుచమురు అయింది డానీ పరిస్థితి ఆర్ధికంగా (డానీ పతనం).

***

        10. ఇక రియల్ ఎస్టేట్ డీలర్ దగ్గరికి పోతే, కొన్న భూముల మధ్య విలియం బాండీ అనే మొండి ఘటం భూములున్నాయని బయట పడింది. ఇప్పుడు పైపు లైను ఎలా వేస్తాడు. ఎలాటి బుద్ధికి అలాటి శుద్ధి (డానీ పతనం). ఇక ప్లాంటు ప్రారంభోత్సవంతో ఇలై మీద కక్ష తీర్చుకునే క్రమం ప్రారంభిస్తాడు. ప్రార్ధనకి ఇలైని లోపలికి రానివ్వకుండా అడ్డుగా నిలబడి, చెరో పక్క కొడుకునీ మేరీనీ నిలబెట్టుకుని, ప్లాంటుకి మేరీ అని పేరు ప్రకటిస్తూ ఝలక్కిస్తాడు (డానీ ఉత్థానం). మేరీ తన ఫ్యామిలీ అన్న లుక్కిస్తూ, ప్రార్ధన చేయట్లేదని మేరీని కొడితే వూరుకోనంటాడు (డానీ ఉత్థానం). మత వ్యతిరేకిననని పూర్తిగా బయట పడిపోతాడు. వీళ్లతో వియ్యమొందితే మతం గితం అనకుండా నోర్మూసుకు పడుంటారని మేరీని కలుపుకున్నాడు (డానీ ఉత్థానం).
         ప్రార్ధన లేకుండా చర్చి ప్రారంభోత్సవం కొడుకు చేత జరిపించేశాడు (డానీ ఉత్థానం). దీంతో ఇలై డానీ మీద పగబట్టిన్నట్టు పోరాటానికి దిగజారుతూ మత బోధకుడి ఔన్నత్యం వదిలేశాడు (పాజిటివ్ పాత్రగా ఇలై పతనం). చర్చి ప్రారంభోత్సవంలో ఒకావిడ సైతానుని వదిలిస్తూ, వెళ్లిపో వెళ్లిపో అంటూ పరోక్షంగా డానీని శపించాడు (నెగెటివ్ పాత్రగా ఇలై ఉత్థానం). మతబోధకుడైన తానే సైతానుగా మారుతూ తానూ నెగెటివ్ క్యారక్టరై పోయాడు. ఈ మిడిల్ 1 లో రెండు క్యారక్టర్లూ నెగెటివ్ గా మారే ప్రక్రియ విజయవంతంగా పూర్తయ్యింది. ఇదంతా మిడిల్ 1 లో ప్రచ్ఛన్న యుద్దం. ఇక మిడిల్ 2 కి, ఇంటర్వెల్ తర్వాత ప్రత్యక్ష యుద్ధానికి రంగం సిద్ధమైంది. ఇలా ఫస్టాఫ్ ప్రచ్ఛన్న యుద్ధం, సెకండాఫ్ ప్రత్యక్ష యుద్ధం వేర్వేరు చేసి చూపడం వల్ల, సెకండాఫ్ నెక్స్ట్ లెవెల్ కెళ్ళినట్టు రసోత్పత్తి కల్గించినట్టయ్యింది.

***

     11. చర్చి సీను తర్వాత, ఇంటర్వెల్ ఎపిసోడ్ లో ప్లాంట్ లో రెండు ప్రమాదాలు జరుగుతాయి. వెంట వెంటనే రెండు ప్రమాదాలూ పునరుక్తి (రిపిటీషన్) అన్పించకుండా యుక్తిగా మేనేజ్ చేశాడు దర్శకుడు. ఒక ప్రమాదం తర్వాత ఇంకో ప్రమాదం వరసగా చూపిస్తే రిపిటీషన్  ఫీల్ కలిగే అవకాశముంది. అంతేగాక ఇంటర్వెల్లో కీలకమైన రెండో ప్రమాదం హై పాయింట్ అన్పించకుండా తేలిపోయే ప్రమాదముంది. దీన్ని దాటవేడానికి మొదటి ప్రమాదాన్ని మైనర్ ప్రమాదంగా చేసి, లైవ్ యాక్షన్ చూపించకుండా, డౌన్ ప్లే చేస్తూ, దాని గురించి కేవలం చెప్పిస్తూ, వెర్బల్ సీను వేశాడు.

        అంటే అర్ధరాత్రి అసిస్టెంట్ వచ్చి, డానీని లేపి, ప్రమాదం జరిగిందంటాడు. చమురు బావిలో వర్కర్ దుర్మరణం. ఇలా చెప్పించాక,  ప్రమాదం తాలూకు కొన్ని విజువల్స్ వేశాడు. ఇలా మొదటి ప్రమాదం లైవ్ యాక్షన్ గా లేకపోవడంతో, ఇంటర్వెల్లో మేజర్ ప్రమాదమైన రెండో ప్రమాదం, లైవ్ యాక్షన్లో రిపిటీషన్ బారిన పడకుండా తప్పించుకుని, హై పాయింట్ అవగల్గింది.

***

        12. ప్లాంట్ ప్రారంభోత్సవం జరిగిన రాత్రే ప్రమాదం ప్రార్ధన చేయని ఫలితమని చెప్తాడు ఇలై (ఇలై ఉత్థానం). డానీ పట్టించుకోడు. పట్టించుకుని శాంతి జరిపించడం మత వ్యతిరేకిగా ఇష్టం లేదు. రెండో ప్రమాదం అసలు ప్లాంటే ధ్వంసమవుతూ పెద్ద ఎత్తున జరుగుతుంది. ఇందులో ఎవరి ప్రాణాలూ పోవు, ఒక్క జూనియర్ డానీ బధిరుడవుతాడు.

        ఫ్యాక్టరీలు కడుతున్నప్పుడు ఎవర్నో ఒకర్ని కావాలని నిర్మాణంలో తోసేసి బలి ఇవ్వడమనే దురాచారం ప్రపంచవ్యాప్తంగా వుంది. డానీ ఇదే నమ్మాడు. పూర్వం డ్రిల్లింగ్ ప్లాంటు ప్రమాదంలో జూనియర్ డానీ తండ్రి దుర్మరణం... తర్వాత ఇంతకి ముందు ప్రమాదంలో చమురు బావిలో వర్కర్ దుర్మరణం. ఇతరుల ప్రాణాలు కాబట్టే ఇలా నమ్మాడు. దేవుణ్ణి నమ్మని డానీ బలుల్ని నమ్మడమేమిటి? వ్యాపారం కోసమే. దీన్ని తుడిచివేస్తూ, అసలు బలితో బాధ ఎలా వుంటుందో స్వయంగా అనుభవించమని, ఈ ఇంటర్వెల్ ప్రమాదంలో కొడుకునే చెవిటి వాడ్ని చేసి వదిలింది ప్రమాదం! (డానీ మహా పతనం).      

        అయినా డానీ డానీయే. కొడుకూ లేడు, బొంగూ లేదు. వాణ్ణి వ్యాపారానికి కుటుంబ హంగు కోసం పెంచుకున్నాడు. పాలల్లో సారా కలిపి తాగించిన సెంటిమెంటు. అందుకని ఇప్పుడీ సర్వం భస్మీపటలమైన ప్రమాదంలో కూడా పెద్ద వ్యాపారాన్నేచూశాడు- బాధపడుతున్న అసిస్టెంట్ తో -మన కాళ్ళ కింద చమురు సముద్రలున్నాయని ఇలా తెలిసి నందుకు సంతోషించి చావమని!

        ప్రకృతి చాలా చతురంగా చదరంగపు ఆట ఆడుతుంది. ఒక దెబ్బ కొడుతూనే ఇంకో దారి చూపిస్తుంది...దెబ్బ తప్పు తెలుసుకోవాలని, దారి ఇక మారి నడుచుకోవాలని. మారుతాడా డానీ? చూద్దాం సెకండాఫ్ లో.
        ఈ గాథ బాక్సాఫీసు పవర్ దీని ఫిలాసఫికల్ టచ్ లో వుంది. హాలీవుడ్డోళ్ళు ఫిలాసఫీ తీసినా డబ్బులు జల జలా రాల్చేట్టు ఎలా తీయాలో అలా కళ కళా తీస్తారు. అయితే విషయపరంగా చూస్తే ఈ గాథ ఇంటర్వెల్లో ముగిసినట్టే. ఏమీ మిగలకుండా డానీ మహా పతనంతో మత విజయం ఎస్టాబ్లిష్ అయిపోయింది. ఇంకేమిటి? సెకండాఫ్ లో ఇంకేం చూపిస్తాడు? గాథ ఇక్కడితో నూటికి నూరుపాళ్ళూ ముగిసిపోయినట్టే. మరెలా?

***

        13. నిన్న ఒక దర్శకుడు చెప్పిన కథతో ఇంటెర్వెల్లో ఇలాటి పరిస్థితే ఎదురయ్యింది. దీనికేంటో చెప్పమంటే ఏం చెప్పాలి. ప్లాట్ పాయింట్ 1 లో పాత్ర వదిలేసిన ఒక మోటివేషన్ వుంది. దాంతో కథనం మార్చి చూసినా ఇంటర్వెల్ కి కథ అయిపోతోంది. పాత్ర కోసం కథ పొడిగించి నడపకూడదు. అది బయటి నుంచి అతికింపు అవుతుంది. పాత్ర దాని కథ అదే నడుపుకోవాలి. ఆ నడుపుకునే మోటివేషన్ ఇంటర్వెల్ కే లక్ష్యం సాధిస్తోంది. పై గాథలో డానీ లాగా మహా పతనం కాక, విజయంతోనే. మరి ఇంటర్వెల్లో అయిపోయిన డానీ గాథని ఎలా పొడిగించాడు ఆ దర్శకుడు?

     ఇది అర్ధం గాలేదు. కానీ ప్రస్తుత దర్శకుడి కథకి ఎందుకో ఫీనిక్స్ పక్షి గుర్తుకొచ్చింది. ఐపోయిన కథ ఫీనిక్స్ లా బతికొస్తున్నట్టు ఒక విజువల్ ఫ్లాష్. ఫీనిక్స్ పక్షి కాలి భస్మమైనా, పూర్వీకుల బూడిద వాడుకుని తిరిగి బతికొస్తుందని గ్రీకు పురాణంలో కథ. ఐతే ఇంటర్వెల్లో అయిపోయిన కథలోంచి పాత్ర కూడా ఫీనిక్స్ పక్షిలా లేవచ్చా? ఏ పాయింటుతో లేవచ్చు? ఆ పాయింటు వస్తే, సమస్య తీరినట్టే.

        14. ఈ కొత్త సమస్యతో ఎట్లా అని గాథ ఇంటర్వెల్ సీను రాత్రి మళ్ళీ మళ్ళీ చూస్తూంటే, దర్శకుడి మాయ అప్పుడర్ధమైంది. మనమొక మూసలో సినిమాలు చూడ్డం అలవాటయ్యాక ఇలా మాయ చేస్తే ఏం చేస్తాం. ఇంటర్వెల్ సీన్లో హీరోకో, విలన్ కో జుట్టు చేతికంది - రారా ఇక చూసుకుందాం రా - లాంటి పంచ్ డైలాగేదో పేల్చిన షాటు మీద బ్రే...క్ అని వంకరటింకర లెటర్స్ వేస్తారు. ఇలా గాకపోయినా ఇంకెలాగైనా కథని బట్టి ముగింపు షాట్ మీదే ఏం చెప్తున్నారో, లేదా చూపించబోతున్నారో దాంతోనే ఇంటర్వెల్ వేస్తారు. దీనికి అలవాటుపడిన మనలాంటి బడుగు జీవులం, ఇంటర్వెల్ ముగింపు షాటు మీదే దృష్టి పెట్టి ఈ గాథని కూడా చూస్తూంటే- ఇంటర్వెల్ ప్రమాద ఎపిసోడ్ లో కొడుకు చెవులుపోయాయని డానీ తెలుసుకున్న బాధతో ఇది వుంటుంది.

        ఇది ఇంకా గాథ వుందని పంచ్ కాదు, బ్యాంగ్ కూడా కాదు. ఇది కూడా గాథకి ముగింపే. గాథని పొడిగించడానికి ఇక విషయం లేదు. కొడుకుని చెవిటి వాణ్ణి చేసిన ప్రమాదానికి ఇలై కారకుడు కాదు, డానీ అతడి మీద పగబట్టినట్టు చెప్పి గాథని పొడిగించడానికి. మరేం చేశాడు దర్శకుడు?

        వెనకే చేసి పెట్టేశాడు ఇదే ప్రమాద ఎపిసోడ్ లో. ప్లాంట్ సర్వం భస్మీపటలమైన ప్రమాదానికి బాధపడుతున్న అసిస్టెంట్ తో - మన కాళ్ళ కింద చమురు సముద్రలున్నాయని ఇలా తెలిసినందుకు సంతోషించమని డానీ అంటున్నప్పుడు - ఫీనిక్స్ పక్షిలా లేచిన డానీతో బాటే గాథ కూడా లేచొచ్చేసింది!!

        ఈ డైలాగుతో ఆ కాలిన బూడిదలోంచి బూడిదనే వాడుకుని ఫీనిక్స్ పక్షిలా మోటివేషన్ కొనసాగిస్తూ బతికొచ్చిన డానీతో, ఇంటర్వెల్ కి గాథ అయిపోకుండా సెకండాఫ్ కి ద్వారాలు తెరిచేసింది... అతను కాళ్ళ కింద ఇంకా చమురు సముద్రాల గురించి మాట్లాడుతూ, మత విజయాన్ని ఒప్పుకోవట్లేదు. ఇంకేంటి?

***

        15. ఈ మిడిల్ 1 ప్రారంభంలో ప్రారంభ డైలాగు అద్భుతమైన భావంతో  రాశాడు. వేటగాళ్ళుగా తండ్రీ కొడుకులు ఏబెల్ సండే రాంచ్ కి నడుచుకుంటూ వస్తున్నప్పుడు (మొదటి ఫోటో చూడండి), కొడుకుతో అంటాడు డానీ - రిమెంబర్ యువర్ సైలెన్స్ అని. నా వెనుక కాదు, పక్కన నడవమని. ఏమిటి దీని భావం? రిమెంబర్ యువర్ సైలెన్స్ అంటే? కొడుకుకి చెప్పి వుంటాడు...మనం ఆయిల్ కోసం భూములు కొనడానికి వచ్చినట్టు నువ్వు అనెయ్యకూడదు. నువ్వు సైలెంట్ గా వుండాలి. మనం వేట కోసమని భూములు కొనడానికి వచ్చినట్టే వాళ్ళకి తెలియాలి... ఇలా నేర్పి వుంటాడు. ఇది మళ్ళీ గుర్తు చేసేందుకే - రిమెంబర్ యువర్ సైలెన్స్ అన్నాడు. ఇదంతా ఈ  వేటగాళ్ళుగా రావడంలోని మర్మం తర్వాతి సీన్లలో తెలిసినప్పుడు మనకి అర్ధమవుతుంది.

        మరి - నా వెనుక కాదు, పక్కన నడవాలనడం? కొడుకుని బిజినెస్ పార్టనర్ గా చెప్పుకుంటున్నాడు కాబట్టి, పక్కన నడవకపోతే చూసిన వాళ్ళు కన్విన్స్ కారని.

        డైలాగులు కథ గురించే వుంటాయి. పాత్రలనుభవిస్తున్న కథ లోంచే డైలాగులు వస్తాయి. ఏ డైలాగు చెప్పినా అది కథే అవాలి. ఏంట్రా ఆ నడకా, రా! అంటే, టైరై పోయా నాన్నా! ఇవి డైలాగులా?

        దీనితర్వాత ఏబెల్ ఎదురవడంతో పలకరిపులయ్యాక, భూకంపం గురించి అడు గుతాడు డానీ. ఈ భూకంపం గురించిన ఒక డైలాగు, డైలాగులు డైలాగులుగా ఎలా మలుపులు తిరుగుతూ వెళ్ళివెళ్ళి - ఇంటర్వెల్లో భూకంపం లాంటి బ్లాస్ట్ తో ఎలా ఢామ్మని కనెక్ట్ అయ్యిందో పైనే చెప్పుకున్నాం. మిడిల్ 1 ఓపెనింగ్ డైలాగు మిడిల్ 1 ముగింపుకి ఫినిషింగ్ టచ్. ఎవ్విరీ థింగ్ ఈజ్ కనెక్టెడ్.

        మరి అసలు మిడిల్ 1 మొదటి డైలాగు రిమెంబర్ యువర్ సైలెన్స్ కి పైన చెప్పుకున్న భావమొకటేనా, ఇంకేదైనా కనెక్షన్ వుందా? ఇంటర్వెల్ ప్రమాదంలో కొడుకు సైలెన్స్...సైలెన్స్, సైలెన్స్... ఇక ఏమీ వినిపించని సైలెంట్ ప్రపంచమే అయ్యిందిగా చెవిటి వాడైపోయి!!

        డానీ నోటి మాట ఇలా వుంటుంది. అన్నాడంటే దరిద్రమే. ఎప్పుడైతే బుద్ధి బావుండదో, శాస్తి జరగడానికి ఇలాటి మాటలే వస్తాయి. ఏమిటిందులో నీతి? దేనికోసమో పన్నే మీ వ్యూహాల్లో అమాయక పిల్లల్ని భాగస్వాములు చేయకండి, ఆ పాపం వాళ్ళకే కొడుతుంది...ఇప్పుడు వెనుక కాదు, పక్కనా కాదు, ఇంకెక్కడా వుండలేని బధిర భాగస్వామి అయ్యాడు పసి డానీ!

సికిందర్

(కొందరి కథలు చూడాల్సి రావడం వల్ల
 ఆర్టికల్ కి ఈ ఆలస్యం)