రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Saturday, November 25, 2023

1383 : రివ్యూ


రచన- దర్శకత్వం శ్రీకాంత్ రెడ్డి ఎన్.
తారాగణం : పంజా వైష్ణవ్ తేజ్, శ్రీ లీల, అపర్ణా దాస్, సదా, రాధికా శరత్ కుమార్, జోజు జార్జి, సుమన్, జయప్రకాష్, తనికెళ్ళ భరణి తదితరులు  
సంగీతం: జి.వి.ప్రకాష్ ,ఛాయాగ్రహణం: డడ్లీ 
సమర్పణ: శ్రీకర స్టూడియోస్
బ్యానర్స్ : సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్
నిర్మాతలు: సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య
విడుదల : నవంబర్ 24, 2023  
***

        సూపర్ హిట్  'ఉప్పెన' తో హీరోగా పరిచయమైన మెగా మేనల్లుడు పంజా వైష్ణవ్ తేజ్ ఆ తర్వాత నటించిన కొండ పొలం’, రంగ రంగ వైభవంగా రెండూ హిట్ కాలేదు. ఇప్పుడు మూడో ప్రయత్నంగా ఆదికేశవ తో పూర్తి మాస్ లుక్ తో మెప్పించే ప్రయత్నం చేస్తూ ముందు కొచ్చాడు. ఈ ప్రయత్నానికి ట్రెండింగ్ లో వున్న హీరోయిన్ శ్రీలీతోడయ్యింది. ఇంకా ప్రముఖ నిర్మాణ సంస్థ సితారా ఎంటర్ టైన్మెంట్స్ భరోసా లభించింది. దీనికి శ్రీకాంత్ రెడ్డి కొత్త దర్శకుడుగా పరిచయమవుతున్నాడు. మరి ఇన్ని ఆకర్షణలున్న ఆదికేశవ అంతే ఆకర్షణీయంగా, కొత్తగా వుందా? ఈ సినిమా చూస్తే లభించే వినోదం ఎలా టిది? ఈ విషయాలు పరిశీలిద్దాం.

కథ

హైదరాబాద్ లో బాలు (వైష్ణవ్ తేజ్) ఆవారాగా తిరుగుతూంటాడు. ఎక్కడైనా అన్యాయం జరిగితే సహించడు. తీవ్రంగా కొడతాడు. తండ్రి (జయప్రకాష్)  తిడితే ఉద్యోగం కోసం ఇంటర్వ్యూకి  వెళ్తాడు. అక్కడ చిత్ర (శ్రీ లీల) ఆ మల్టీ నేషనల్ కంపెనీకి సీఈవో గా వుంటుంది. అక్కడ సెలెక్ట్ అవుతాడు. చిత్రకి  బాలు బాగా నచ్చుతాడు. ఇద్దరూ ప్రేమలో పడతారు. ఇది ఇష్టం లేని ఆమె తండ్రి వేరే సంబంధం చూస్తున్నట్టు ప్రకటిస్తాడు. ఇంతలో రాయలసీమ నుంచి ఎమ్మెల్యే మహా కాళేశ్వర్ రెడ్డి (సుమన్), అతడి అన్న (తనికెళ్ళ భరణి) వచ్చి, బాలు తల్లిదండ్రులు (రాధిక శరత్ కుమార్, జయప్రకాష్) వీళ్ళు కాదని,  బాలు అసలు పేరు రుద్ర కాళేళ్వర రెడ్డి అనీ చెప్తారు. అతడి తండ్రి మహాకేశ్వర రెడ్డి ఓ ప్రమాదంలో చనిపోయాడనీ, ఇప్పుడు అతడి అక్క (అపర్ణా దాస్) ప్రమాదంలో వుంనీ చెప్తారు. దీంతో బాలు రాయలసీమకి ప్రయాణం కడతాడు.
       
ఇంతకీ బాలు గతం ఏమిటి
? అతడి అసలు తల్లిదండ్రులు ఎందుకు దూరం చేసుకున్నారు? ప్రమాదంలో తండ్రి ఎలా చనిపోయాడు? అక్క ఎవరితో ప్రమాదంలో వుంది? బాలు రాయలసీమ వెళ్ళి ఈ సమస్యల్ని ఎలా పరిష్కరించుకున్నాడు? ఇదీ మిగతా కథ.

ఎలావుంది కథ

ఇంకా ఈ రోజుల్లో ఇలాటి సీఫ్యాక్షన్ సినిమా తీయడం సాహసమే. ఇటీవల మాస్ మసాలా సినిమాలు హిట్టవుతున్నాయనీ, అందుకే తీశామనీ అనుభవమున్న నిర్మాతలు చెప్పారు. వాళ్ళ అంచనా ఎంత నిజమో బి, సి సెంటర్లలో ప్రేక్షకులే చెప్తారు. మాస్ మసాలా తీయొచ్చు. కానీ ఏనాడో వర్కౌట్ అయిన ఫ్యాక్షన్ సినిమాని ఇప్పటి మాస్ సినిమాగా తీస్తే ఎలా? అవే పాత్రలు, అవే చుట్టరికాలు, అదే కథ, అవే దృశ్యాలు, అదే టెంప్లెట్ కథనం, అవే కాలం చెల్లిన పౌరుషాలు, పోరాటాలు, నటనలు- దీన్ని బీసీ సెంటర్లలో ప్రేక్షకులైనా ఆదరిస్తారా? మాస్ మసాలా తీయడానికి ఇంకా వేరే కథలు లేవా? కొత్త దర్శకుడు వచ్చి పాత చింతకాయ అందిస్తాడా ప్రేక్షకులకి? టీజర్ రిలీజయినప్పుడే వైష్ణవ్ తేజ్ ఫ్యాన్స్, నెటిజన్స్ ఇదెలాటి సినిమానో తెలిసిపోయి ట్రోలింగ్ చేసి విలువ తీశారు కదా?
       
దర్శకుడికి కామెడీ తీయడంలో పట్టువున్నట్టు అన్పించే ఎంటర్టయిన్మెంట్ ఫస్టాఫ్ లో ఈ అరిగిపోయిన కథని మర్చిపోయేలా చేస్తుంది. సెకండాఫ్ లో కూడా ఈ అరుగుదలని మర్చిపోయేలా చేసే ఫన్నీ యాక్షన్ మూవీ తీస్తే బావుండేదేమో
? కానీ తానేమీ శ్రమపడ దల్చుకోక వచ్చిన ఫ్యాక్షన్ సినిమాల్లో నిల్వ సరుకునే సీన్లుగా పేర్చుకుంటూ పోయాడు. ఈ పాత వాసనని మర్చిపోయేలా చేయడానికి కాబోలు, విపరీత హింస జొప్పించి యాక్షన్ సీన్లు తీశాడు. క్లయిమాక్స్ లోనైతే మరీ బీభత్సం, జుగుప్స!
విద్యార్థితో స్కూల్ టీచర్ అసభ్యంగా ప్రవర్తిస్తే హీరో చెయ్యి నరికేస్తాడు. అక్కతో అసభ్యంగా ప్రవర్తించాడని ఇంకొకడ్ని దారుణంగా నరికి చంపుతాడు. ఇక విలన్నయితే చెప్పనవసరం లేదు. సినిమాలో హింస వర్కౌట్ కాలేదు, భావోద్వేగాలైతే తెచ్చి పెట్టుకున్నవి. ఫస్టాఫ్ లో కొన్ని కామెడీ సీన్లు తప్పిస్తే కొత్తదనం ఏమీ లేదు.

నటనలు- సాంకేతికాలు

వైష్ణవ్ తేజ్ కి ఇలాటి మాస్ మసాలా క్యారక్టర్ సూట్ కాదు. తను పెద్ద హీరోకాబట్టి ఒక మాస్ సినిమా కూడా చేయాలన్న ఆతృత తప్పితే, చేస్తే ఏమవుతుందన్న ఆలోచన లేదు. ఇంకా ఫ్యాక్షన్ కథతో నరకడమే మాస్ పాత్ర అనుకుంటే చేసేదేం లేదు. ఫస్టాఫ్ లో శ్రీలీలతో కామెడీ, సాంగ్స్ ఇంతవరకే తనకి సూటయ్యేది.
       
శ్రీలీల కూడా డాన్సులతో క్రేజ్ సంపాదించుకుందని
, సరైన పాత్రలేని సినిమాల్లో డాన్సులే చేస్తూ పోతే ఆ క్రేజ్ కూడా పోతుంది. మల్టీనేషనల్  కంపెనీ సీఈవో పేరుకేగానీ చేసిందేమీ లేదు. మధ్యమధ్యలో కొన్ని లవ్ సీన్స్, సాంగ్స్ తప్ప. ఇక ఫ్యాక్షన్ విలన్ గా నటించిన మలయాళ నటుడు జోజు జార్జి పూర్తిగా వృధా. వైష్ణవ్ తేజ్ కి తన వూర మాస్ పాత్ర లాగే, సాఫ్ట్ గా వుండే జోజు జార్జి కి క్రూర విలన్ పాత్రకూడా సూట్ కాలేదు. ఇక మిగతా తారాతోరణం
అపర్ణా దాస్, సదా, రాధికా శరత్ కుమార్, సుమన్, జయప్రకాష్, తనికెళ్ళ భరణి అందరికీ దక్కింది సినిమాలో చూపించిన జాతర ప్రసాదమే.     

ఈసారి ఎందుకో జివి ప్రకాష్ కుమార్ పాటలు బాగా కొట్టాడు. పాత ఫ్యాక్షన్ సినిమాకి అతను బాగా ఇన్స్పైర్ అయినట్టున్నాడు. ఈ మ్యూజిక్కి సినిమాని మాంచి యాక్షన్ కామెడీ ఎంటర్ టైనర్ గా తీయాల్సింది. శ్రీలీల డాన్సులకి మాత్రం ఈ మ్యూజిక్ వుండాల్సిందే.
       
డడ్లీ ఛాయాగ్రహణం
, మిగతా ప్రొడక్షన్ విలువలూ బావున్న ఈ ఆదికేశవ కొత్త దర్శకుడికి ఆదిలోనే హంసపాదు అన్నట్టు వుండకుండా వుండాల్సింది.

—సికిందర్