రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

27, నవంబర్ 2018, మంగళవారం

709 : స్క్రీన్ ప్లే సంగతులు


    సినిమాల్ని దెబ్బతీసే ఇతర వినోద సాధనాలెప్పుడూ పుట్టుకొస్తూనే వుంటాయి. 1990 ద్వితీయార్ధంలో టీవీ సీరియల్స్ అనే కొత్త వినోద సాధనం కుటుంబ కథల సినిమాలకి చెల్లు చెప్పింది. తర్వాత కుటుంబ కథలు ఫ్యాక్షన్ యాక్షన్, మాఫియా యాక్షన్లు జోడించుకుని కోలుకున్నా, వీటికీ కాలం తీరి ఒక శూన్యం ఏర్పడింది. ఈ శూన్యంలోంచి ఎన్నారై కుటుంబాల కథలు వచ్చాయి. ఇవి ’80 ల నాటి ఉమ్మడి కుటుంబ కథల టెంప్లెట్ మూసలోనే  పడి ఆచరణ సాధ్యంకాని తిరోగమనాన్ని ప్రకటించాయి. గ్లోబల్ యుగంలో అవకాశాలు పెరిగి వలస వెళ్ళిన కుటుంబ సభ్యులు మళ్ళీ కలిసి వుండాలనే మొండి భా వజలాన్ని ప్రదర్శించాయి. కుటుంబ కథ అనగానే ఇంకా ఉమ్మడి కుటుంబాల్నే ఎత్తుకోవడం, పెళ్లి కథ అనగానే బోలెడు కుటుంబాల్నే చూపించడం –అనే ఆడియెన్స్ కనెక్ట్ లేని, మార్కెట్ యాస్పెక్ట్ లేని, సమకాలీనం కాని పాత టెంప్లెట్లతో కృత్రిమ వాతావరణాన్ని సృష్టిస్తున్నాయి. ఇప్పటి కుటుంబాలకి ప్రతీకగా ఒక చిన్న కుటుంబాన్ని యూనిట్ గా తీసుకుని, నేటి పరిస్థితుల్లో దాని సాధక బాధకాల్ని వాస్తవికంగా చూపించే వైవిధ్యానికి దూరంగా వుండిపోతున్నాయి. కుటుంబ కథలకి హింసాత్మకంగా యాక్షన్ జోడిస్తే తప్ప ప్రేక్షకులు చూడరనే దురభిప్రాయంతో కూడా ఇవి వుంటున్నాయి.

        కానీ ఇవ్వాళ యూట్యూబ్ లో పాత తెలుగు సినిమాలు -  బ్లాక్ అండ్ వైట్ సహా - చూసి యూత్ పెడుతున్నకామెంట్లు చూస్తే, ఇప్పుడొస్తున్న సినిమాల పట్ల వాళ్ళకెంత విరక్తి వుందో తెలిసిపోతుంది. పాత సినిమాల్లోని కథలు, నటనలు, విలువలు, డ్రామా – పాటలు సహా- చూసి వాళ్ళు ఫిదా అయిపోతున్నారు. ఇవన్నీ యూత్ ఇప్పటి సినిమాల్లో  మిస్సవుతున్నారు. ఈ రోజుల్లో బాగా ఎబ్యూజ్ అవుతున్న పదం ఎమోషన్. ఎవరి నోట విన్నాఎమోషన్ అన్న మాటతో ఫ్యాషనబుల్ గా, ట్రెండీగా కన్పించాలన్న ఆదుర్దాయే.  ఏంటా ఎమోషన్? అదెలా పుడుతుంది? నూటికి వంద శాతం సినిమాల్లో ఇంతేసి ఎమోషన్ని ఉత్పత్తి చేస్తూంటే కూడా, 90 శాతానికి పైగా సినిమాలెందుకు అట్టర్ ఫ్లాపవుతున్నాయి? ఈ ఎమోషన్లకి మొహం చాటేసి, యూత్ యూట్యూబ్ లో పాత సినిమాలెందుకు చూసుకుని ఎంజాయ్ చేస్తున్నారు? ఎమోషన్లంటే ఏమిటి? గురుదత్ ‘ప్యాసా’ లో నటీనటులు ఏం ఎమోషన్స్ ప్రదర్శిస్తారని? దాసరి నారాయణ రావు ‘మేఘ సందేశంలో’? కెవి రెడ్డి  ‘దొంగరాముడు’ లో?  చిత్రీకరణలో ‘మ్యాటరాఫ్ ఫ్యాక్ట్’ శైలి అనేదొకటుంది. ఇందులో సిట్యుయేషన్సే ఎమోషన్స్ పలుకుతాయి, నటీనటులు సున్నిత భావప్రదర్శన చేస్తారు, అంతే. ఒకటి రెండు సెకన్ల సున్నిత భావప్రకటనతో కట్ అయిపోతుంది సీను. ఇది ఉత్తమ దర్శకత్వం. గత రాత్రి ‘పల్టడచో మునిస్’ (వంతెన అవతల మనిషి) అనే కొంకణి వాస్తవిక సినిమా చూస్తే, అది అడవిలో ఒక ఫారెస్ట్ ఉద్యోగికి ఓ పిచ్చిదానితో ప్రేమ కథ. అంతర్జాతీయ అవార్డులు పొందిన ఇందులో వున్నది మ్యాటరాఫ్ ఫ్యాక్ట్ శైలి చిత్రీకరణే. సిట్యుయేషన్స్ సృష్టిలో కథాపరమైన సరైన భావోద్వేగాలుండాలే గానీ, ఇది వదిలేసి పేలవమైన సన్నివేశాల్లో నటీనటులు ఎమోషన్స్ తో ఎంత ఊదరగొట్టుకున్నా ఒరిగేదేమిటి. 

       సినిమాల్ని దెబ్బతీసే ఇతర వినోద సాధనాలెప్పుడూ పుట్టుకొస్తూనే వుంటాయి. యూత్ ఇక క్వాలిటీ వినోదం కోసం నయా వినోద సాధనం యూట్యూబ్ వైపు మళ్లిపోతే, కుటుంబ సినిమాలే కాదు, యాక్షన్ సినిమాలూ ప్రమాదంలో పడతాయి. యూట్యూబ్ లో పాత సినిమాలు చూస్తున్న  యూత్  ఏమని కామెంట్లు పెడుతున్నారో ఒకసారి చూద్దాం: 

        I am 24 and I love to watch only old films. There is something in them.
        The lines speak. In this generation ru intersted really great nd inspirin. I 2 like 2 watch old -sorry - gold films. By the way i am 24 yrs.”
            జీవితంలో చచ్చిపోతున్నాం ఇప్పుడొచ్చే సినిమాలు చూడలేక. ఏవో ఒకటో రెండో తప్ప.”
            Almost old movies are meaning ful  and we learn new things from those films.”
            “ఇలా వుండాలి సినిమాలు అంటే...అందరి యాక్షన్స్, ఎక్స్ ప్రెషన్స్ ఒరిజినల్ గా వున్నాయి”
            “అప్పట్లోనే ఆడపిల్లల్ని ఏం తక్కువ కాకుండా చూశారు. ఇప్పుడు అసలు కనడమే బాధ పడుతున్నారు.
            “అప్పట్లోనే బాగా ప్రోగ్రెసివ్ గా వుండేవారు, ఇప్పుడు రిగ్రెసివ్ గా వుంటున్నారు.
             Old is gold - sorry old is diamond.”
           Now a days we are missing soul in movies which is there here, not in present movies.”
           
“By seeing this movie, a person knows what life is.”

          ఇదీ పరిస్థితి. 2000 నుంచి యూత్ సినిమాలంటూ ప్రారంభమైన నయా ట్రెండ్ తో మధ్య వయస్కులు సినిమాలు చూడ్డం మానేశారనీ, సినిమాలకిక యువ ప్రేక్షకులే మిగిలారనీ బ్రాండింగ్ ఒకటి ఏర్పడింది. ఇది అప్పట్లో నిజం కూడా. ఇప్పుడిది మిథ్య అనుకోవాలి. యూత్ ని దృష్టిలో పెట్టుకుని తీస్తున్న ఏ సినిమాల్లోనూ ఏమీ వుండడం లేదని యూత్ కే అర్ధమైపోయి  ప్రత్యాన్మాయాలు వెతుక్కుంటున్నారు. యూట్యూబే కాక ఇంకే మాధ్యమాల్లో తమకి కావాల్సిన పాత సినిమాలు వెతుక్కుంటున్నారో. యూట్యూబ్ లో పాత సినిమాలకి లక్షల్లో వ్యూస్ వుంటున్నాయి. ఈ లక్షల మంది యూతే అని కాదు, నడి  వయస్కులు, సీనియర్ సిటిజన్లు అందరూ వుండొచ్చు. కానీ కామెంట్ల వెల్లువ మాత్రం యూత్ దే. ఐదు లక్షల వ్యూస్ తో వున్న ‘మాంగల్య బలం’ కి ఒక యూత్ పది సార్లు చూశానని కామెంట్ పెట్టాడు. ఎందుకిన్ని సార్లు చూస్తున్నాడతను? 

       ఇప్పుడు తీస్తున్న సినిమాలతో సినిమాలంటే ఇవే, ఎమోషన్స్ అంటే ఇవే అని యూత్ ని మభ్య పెట్టడం ఇక కష్టం. ‘దొంగ రాముడు’ చూసిన ఒక యూత్, ఇప్పటి దర్శకులు దీన్ని వంద సార్లు చూసి సినిమాలెలా తీయాలో నేర్చుకోవాలని కామెంట్ పెట్టాడు. ఎందుకిలా అన్నాడు? 

          సినిమాలు తీసి క్యూబ్ ద్వారా విడుదల చేయాలనుకున్నప్పుడు, అవతల యూట్యూబ్ మోగిస్తున్న ప్రమాద ఘంటికలు కూడా వినాలి. లేకపోతే యూట్యూబు గాలితీసిన ట్యూబు చేసేస్తుంది బాక్సాఫీసుల్ని. యూత్ తల్చుకుంటే ఏమైనా చేసి పడెయ్యగలరు.

          తీస్తే కథలే తీయాలి, తీయకపోతే గాథలే తీయాలి. రెండూ కలిపి అదీ ఇదీ కాని ఇంకేదో చేస్తే, దీంతో ఎమోషన్ బాగా వచ్చేసిందనుకుంటే, వీటి బండారం యూట్యూబ్ లో తెలిసిపోయిన యూత్, టెస్ట్ ట్యూబుల్లో పరీక్షించి చూసి -  బీకరులో పడేసి యాసిడ్ పోసే స్తారు.

          కథంటే ఏమిటో తెలియకుండానే సినిమాలు తీసేస్తున్నారు. కనీసం కథని గాథలా తీయకుండా వుండేందుకు గాథంటే ఏమిటో, ఎలా వుంటుందో తెలుసుకునే ప్రయత్నం చేయాలి. పనిలోపనిగా, ఎమోషన్లే గాథల్ని ఎలా నిలబెడతాయో తెలుసుకునేందుకు ఆసక్తి చూపాలి. సినిమాలకి లాజిక్ ఏమిటని అనుకుంటారు. ప్రేక్షకులకి నిత్యానుభవం కాని కథలతో లాజిక్ అవసరం లేకపోవచ్చు. ఒక పోలీస్ అధికారి లాజిక్ లేకుండా అడ్డదిడ్డంగా కేసు పరిశోధించి నమ్మించవచ్చు. వ్యవస్థల పనితీరు తాలూకు పరిజ్ఞానం వుండని ప్రేక్షకులు ఇది చూసేస్తారు. పరిజ్ఞానమున్న ప్రేక్షకులు కొద్ది మందే వున్నా నవ్విపోతారు, నష్టం లేదు. కానీ వ్యక్తిగత జీవితాల్లో నిత్యానుభవమయ్యే మానవ సంబంధాల్ని లాజిక్ లేకుండా చూపిస్తే అందరు ప్రేక్షకులూ ఛీ పొమ్మంటారు. కుటుంబ కథల్లో కుటుంబ సంబంధాల్ని, నిత్య వ్యవహారాల్నిలాజికల్ గా చూపించకపోతే ఒప్పుకోరు. పదహారేళ్ళ కూతుర్ని చదివించకుండా పెళ్లి చేస్తే లాజిక్కే అడ్డొస్తుంది చూసే ప్రేక్షకులకి. ‘24 కిసెస్’ లో 24 ముద్దులు పెట్టుకుంటే ఆ ప్రేమ బలంగా వుండిపోతుందని నమ్మిన హీరోయిన్, మధ్యలో సెక్స్ కి పాల్పడితే, లాజిక్కే లాగి కొడుతుంది ప్రేక్షకులకి. కళా హృదయముంటే దానికి లాజికల్ మెదడు పహారా కూడా అవసరం. మెదడు లేని హృదయం సోది. 

          యూట్యూబ్ లో యువప్రేక్షకులు ఓటేస్తున్న ఈ లాజిక్కులు, ఎమోషన్లు, విలువలూ... వీటిని ఒక గాథగా ‘పెదరాయుడు’ ఎలా మేళవించి విజయం సాధించిందో చూద్దాం...
***
      కార్పొరేట్ దిగ్గజాలు అంబానీ సోదరులు విడిపోవాల్సి వచ్చినప్పుడు, విధిలేక అన్న మీద కోర్టుకెక్కిన తమ్ముడు అనిల్ అంబానీ,  ఒకచోట ఇలా ఫిలాసఫీ రాసుకున్నాడు –‘నమ్మకం లేకపోతే ఏదీ లేదు. అవసరమొస్తే ఏ త్యాగానికైనా సిద్ధపడాలి. ఆ త్యాగం మనకి అనుకూలంగా వుండకూడదు. పరోపకారం దృష్టితో నిజమైన పరిత్యాగం కావాలి. రఘుకుల్ కీ రీతీ సదా చలీ ఆయీ... ప్రాణ్ జాయే పర్ వచన్ న జాయే’ అని.  

          కనీసం సినిమాల్లో చూపించే ఫ్యూడల్ వ్యవస్థకో నీతి వుంటుంది. సినిమా దొరలు బయట ఏం తీర్పులు చెప్తారో, తడుముకోకుండా ఇంట్లో అలాటి తీర్పులే చెప్పేస్తారు. “తీర్పులు చెప్పే వాడి దృష్టిలో అందరూ ఒక్కటే. న్యాయం మన ఊపిరి, ధర్మం మన ప్రాణం” అంటూ ప్రాణం విడుస్తాడు ‘పెదరాయుడు’ లో రజనీ కాంత్. బావ చేతిలో వెన్నుపోటుకి గురైన పెద్ద జమీందారు రజనీకాంత్. ఇదే రజనీ కాంత్ బాధ్యతలు చేపట్టిన కొడుకు మోహన్ బాబు, తమ్ముడి మీద తను చెప్పిన తీర్పు తప్పని తేలడంతో, గుండె ఆగి మరణిస్తాడు. జీవితంలో అనిల్ అంబానీ అయినా, సినిమాలో రజనీకాంత్ అయినా, మోహన్ బాబు అయినా, ఇంటా బయటా తమ సామ్రాజ్యాలలో మాటకు ప్రాణాలిస్తారు. త్యాగంలో పరసుఖం చూస్తారు. 

          ‘పెదరాయుడు’లో ‘బొబ్బిలి బ్రహ్మన్న’ ఛాయలు కన్పిస్తాయి. కథాంశాలే వేరు. పాత్రలు అవే, హీరోల ద్విపాత్రాభినయాలూ అవే. అన్నల పొరపాటు తీర్పులు, తమ్ముళ్ళ అన్యాయపు బహిష్కరణలు. అన్నల భార్యల వేదనలు, వాళ్ళ మీదా వెలి వేటు, లేదా హెచ్చరికలు. అన్నల మీద ఎదుటి జమీందార్ల కుట్రలు కుహకాలూ, పూర్వీకుల బలిదానాలూ వైగైరా వగైరా. 

          అన్న మాటకోసం తమ్ముడి త్యాగమే కాదు, తమ్ముడికి తన వల్ల నష్టం జరిగితే ప్రాయశ్చిత్తం చేసుకుని వెళ్ళిపోవాల్సి వుంటుంది కూడా అన్న. మాట, విలువలు, చేత అనే ముక్కోణాన్ని సృష్టించుకుని అందులో తామే అమరులైపోతారు. 

          తమ్ముడు మోహన్ బాబుకి అన్న మాటే వేదం. అందుకే, “నువ్వే పాపం చేయలేదని అన్నకెందుకు చెప్పవు?” అని భార్య సౌందర్య అడిగినప్పుడు –ఆయన అడగలేదు కాబట్టి చెప్పలేదంటాడు. ఆయన అడగంది ఏదీ తను చెప్పలేదు, ఆయన చెప్పంది ఏదీ తను చేయలేదంటాడు. “ఆ రోజు రాముడు నేను అడవులకెందు కెళ్లాలని ప్రశ్నించి వుంటే, రామాయణం జరిగుండేది కాదు. తండ్రి  మాటని గౌరవించి రాముడు అడవుల కెళ్ళాడు. తండ్రి కంటే గొప్పవాడైన అన్న మాటని గౌరవించి నేనిక్కడి కొచ్చాను” అంటాడు. 

           ‘పెదరాయుడు’ రామాయణమే. చూస్తే  రామాయణంలో రఘు వంశమంతా పాసివ్ పాత్రల మయమే, ఒక్క కైకేయి తప్ప. ఆమె ఒక యాక్టివ్ పాత్రగా లక్ష్య దృష్టితో దశరథుడి మీద కోర్కెల బాణం విసరకపోతే రామాయణమే లేదు. కథనాల్లో యాక్టివ్ పాత్రలు నిప్పు రాజెయ్యక పోతే పాసివ్ పాత్రలకి ఇలాటి గాథల్లేవు, ట్రాజడీల్లేవు. గొప్పతనం లేదు. ‘బొబ్బిలి బ్రహ్మన్న’ లో కృష్ణంరాజు రెండు పాత్రలకీ లక్ష్యం లేదు, విలన్ రావుగోపాల రావుకే వుంది. ‘పెదరాయుడు’ లోనూ మోహన్ బాబు పాత్రలు రెండూ డిటో. టార్గెట్ వున్న పాత్ర విలన్ అనంత్ రాజే. 

          ఈ అనంత్ రాజ్ మేనమామ రజనీకాంత్ హయాంలో ఓ మానభంగం చేసి, తీరా మానభంగం చేసిన అమ్మాయినే చేసుకోవాల్సి వస్తే, ఇలా తీర్పిచ్చిన మేనమామని ఇతడి తండ్రి చలపతి రావు కాల్చేస్తాడు. చనిపోతూ రజనీకాంత్ ఈ ధిక్కారానికి ఇంకో తీర్పు ఇస్తాడు - ఈ తన బావ చలపతి రావు కుటుంబానికి పద్దెనిమిదేళ్ళూ సాంఘిక  బహిష్కారమని. దీంతో ఆ పద్దెనిమిదేళ్ళూ అతి హీనంగా బతికిన అనంత రాజ్, ఇక రజనీ కాంత్ కొడుకు మోహన్ బాబు మీద ప్రతీకారం తీర్చుకోవడానికి వచ్చేస్తాడు. 

     ఈ తమిళ రీమేక్ ని దర్శకుడు రవిరాజా పినిశెట్టి సమర్ధవంతంగా తెరకెక్కించారు. ఎక్కడా క్వాలిటీ స్పృహ కోల్పోకుండా ఉన్నత విలువలతో మనోజ్ఞంగా ప్రెజంట్ చేశారు. రజనీకాంత్, మోహన్ బాబు సహా ఇతర నటీ నటులందరూ వాళ్ళ పాత్రల్లో చాలా ఆత్మీయంగా ఇమిడిపోయారు. అంతే ఆత్మీయంగా ఈ గాథంతా వచ్చేసి రవిరాజా గుప్పెట్లో ఒదిగిపోయింది. సన్నివేశాల కల్పనల్లో కృత్రిమత్వమే లేకపోగా, వాటిలో ఎక్కడ ఏ రస పోషణ జరిగినా, అంతర్వాహినిగా ఒకే నిశ్శబ్ద మెలోడీ అనుభవమవుతుంది. అది కథాత్మ. బలీయమైన అన్నదమ్ముల అనుబంధం వల్ల ఏర్పడిన సోల్. 

          నాటి దర్శకుడు డాన్ లివింగ్ స్టన్, ‘ఫిలిం అండ్ ది డైరెక్టర్’ అని రాసిన పుస్తకంలో, మూవ్ మెంట్ అన్న విభాగంలో ఇలా పేర్కొంటాడు – ‘కెమెరా మూవ్ మెంట్ ని ఇంటలిజెంట్ గా నిర్వహించడం దర్శకుడి విజువల్ టెక్నిక్స్ లో ప్రథమ స్థానం వహించాలి. అప్పుడే అతను ప్రేక్షకుల్ని ఎంతో ఈజ్ తో సినిమాలో లీనమయేట్టు చేయగలడు. పాత్రల వ్యక్తిత్వాల చిత్రణ సులువుగా అర్ధమయ్యేట్టు చేయగలడు. అంతేకాదు, ప్రేక్షకుల్ని ఫీల్ గుడ్ మూడ్ లోకి తీసికెళ్ళి కట్టిపడవేయనూ గలడు...’ అని. రవిరాజా సాధించిందిదే. గాథ నడకలో స్లో మూవ్ మెంట్స్ తో ఒక లయని స్థాపించి, కథాత్మని పోషించుకుంటూ వెళ్ళడం. 

          ఈ గాథంతా సౌభాతృత్వం గురించి, కుటుంబం గురించి, కుటుంబంలో అన్ని భావోద్వేగాల గురించీ. దీని స్క్రీన్ ప్లే వివరాల్లోకి రేపట్నుంచి వెళదాం...

సికిందర్