రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

29, జనవరి 2019, మంగళవారం

732 : రివ్యూ

దర్శకత్వం : అభిజిత్ పన్సే
నవాజుద్దీన్ సిద్ధిఖీ, అమృతారావ్ తదితరులు
స్క్రీన్ ప్లే : అభిజిత్ పన్సే, రచన : అరవింద్ జగ్తాప్, మాటలు : మనోజ్ యాదవ్
సంగీతం : రోహన్ రోహన్, సందీప్ శిరోద్కర్, ఛాయాగ్రహణం : సుదీప్ ఛటర్జీ
బ్యానర్స్ : వయాకాం మోషన్ పిక్చర్స్, రాయిటర్స్ ఎంటర్ టైన్మెంట్, కార్నివాల్ మోషన్ పిక్చర్స్
విడుదల : జనవరి 25, 2019
***
          సారి శివసేన పార్టీ దివంగత అధ్యక్షుడు బాలా సాహెబ్ ఠాకరే బయోపిక్ ప్రేక్షకుల ముందుకొచ్చింది. దీంతో బాటే ఝాన్సీ లక్ష్మీ బాయి ‘మణికర్ణిక’ కూడా ప్రేక్షకుల్ని పలకరించింది. ఇద్దరి భావజాలాలు వేర్వేరు. ఆమెది ప్రధాన స్రవంతి భావజాలం, ఈయనది సమాంతర అతివాద భావజాలం. జాతీయంగా ప్రధాన స్రవంతి భావజాలాన్ని పక్కన బెడితే, ఈ ఎన్నికల సమయంలో అతివాద భావజాలాన్ని ప్రాంతీయంగా ఉపయోగించుకోవాలని ఎక్కుబెట్టారు. ఇలాటి భావజాలాన్ని మహారాష్ట్ర కిచ్చిన వాడు ఠాకరే. కాబట్టి ఈ ఎన్నికల సమయంలో ప్రచార చిత్రంగా బయోపిక్ ని తయారుచేసి వదిలారు. ఈ భావజాలంతో సాధించిందేమిటనే ప్రశ్న మద్దతుదార్లకి తట్టకపోవచ్చు గానీ, పరస్పర విరుద్ధ భావజాలాలైన మరాఠా మణూస్ సాకారమైందా? హిందూత్వ లక్ష్యాలు పూర్తయ్యాయా? అన్న ప్రశ్నలుంటాయి. ఇదెలాగో చూద్దాం...

కథ 
     1950 లలో బాలా సాహెబ్ ఠాకరే ఒక పత్రికలో కార్టూనిస్టుగా పనిచేస్తూంటాడు. తండ్రీ కళారంగంలో పని చేసిన వాడే. తమ్ముడికీ కళలంటే ఆసక్తి వుంది. పత్రికలో వేస్తున్న కార్టూన్లతో తమిళ ఎడిటర్ కి ఇబ్బందులొచ్చి రాజీ పడమంటారు. రాజీనామా ఇచ్చేసి వెళ్ళిపోతాడు ఠాకరే. ఈ సమయంలో బయట తిరుగుతూ మరాఠీలకి ఎదురవుతున్న అవమానాలు గమనిస్తాడు. సౌత్ ఇండియన్సు, గుజరాతీలు, పార్సీలూ అన్నిరంగాల్లో బొంబాయిని ఆక్రమిస్తూ మరాఠీలకి భుక్తి లేకుండా చేస్తున్నారని ఆగ్రహం పెంచుకుంటాడు. తమ్ముడితో కలిసి ‘మార్మిక్’ అనే పత్రిక ప్రారంభించి మరాఠా మణూస్ నినాదాన్ని వ్యాప్తి చేస్తాడు. దీంతో బాధిత మరాఠీలు ఠాకరేని  ఆశ్రయించడం మొదలెడతారు. తన నినాదానికి ప్రజల నుంచి వస్తున్న విశేష  స్పందన చూసి, 1966 లో ఛత్రపతి శివాజీ పేరు ధ్వనించేలా శివ సేన పార్టీ స్థాపిస్తాడు. 

          తనకి ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేదనీ, అరాచకమే తన మార్గమనీ ప్రకటిస్తాడు. హక్కుల కోసం బిచ్చ మెత్తుకునే కంటే గూండాల్లాగా మారి హక్కుల్నిలాక్కోవాలని రెచ్చగొడతాడు. దీంతో ప్రాంతీయేతరుల మీద దాడులు మొదలైపోతాయి. ఉడిపి హోటళ్ళు పటాపంచలవుతాయి. గుజరాతీ, పార్సీ వ్యాపారాలు ధ్వంసమవుతాయి. బొంబాయి కార్పొరేట్ కంపెనీల్లో పనిచేస్తున్న ఉత్తర, దక్షిణ రాష్ట్రాల అధికారుల, ఉద్యోగుల జాబితాలు  తయారు చేసి విడుదల చేస్తాడు. ఏర్ ఇండియా కార్యాలయం మీదికి దండెత్తి, మరాఠీ ఉద్యోగుల లెక్క చెప్పమంటాడు. మరాఠీ సినిమా విడుదల ఆపి, హిందీ సినిమా విడుదల చేస్తున్న థియేటర్ల మీద దాడులు జరిపిస్తాడు. దేశానికి సినిమా తీయడం నేర్పిందే మరాఠీ వాడైతే, మరాఠీ సినిమాలకే థియేటర్లు దొరకవా అని చావగొడతాడు. పారిశ్రామికంగా యూనియన్లలో పాగా వేసిన లాల్ బందర్లని (ఎర్రకోతుల్ని) చంపెయ్యాలని ప్రకటించడంతో, ఒక కమ్యూనిస్టు ఎమ్మెల్యేని చంపేస్తారు...

          ఇంతలో ఠాకరే ఒక సంఘటనని పట్టుకుని దీర్ఘాలోచనలో గార్డెన్ లో పూల మొక్కని ట్రిమ్మింగ్ చేస్తూంటాడు. బ్లాక్ అండ్ వైట్ లో వుండే ఈ దృశ్యంలో ఆ చామంతి పువ్వు కాస్తా కాషాయ వర్ణంలోకి మారుతూంటుంది... విశ్రాంతి.  

ఎలావుంది కథ 
     కథ కాదు, అందుకని సినిమాలా లేదు. ఎన్నికల ప్రచార డాక్యు డ్రామాలాగా వుంది. నిర్మాతలు పార్టీ నాయకులే, దర్శకుడూ ఠాకరే కుటుంబ సన్నిహితుడే. కాబట్టి ఠాకరే కీర్తనలతో ఎన్నికల ప్రచారాస్త్రంగా తీశారు. ఠాకరే జీవితంలోని ఒక్కో ప్రధాన ఘట్టం తేదీలు వేస్తూ డాక్యుమెంటరీ కథనం చేశారు. సినిమా కళ గురించి అస్సలు పట్టించుకోలేదు. సినిమాలాగా తీయకూడదన్న ఒక స్పష్టతతో ఎన్నికల డాక్యూడ్రామాగానే తీశారు కాబట్టి, దీన్ని సినిమా రచనని వెతికే దృష్టితో చూడకూడదు. తెలుగులో ‘ఎన్టీఆర్’ బయోపిక్ కి ఏం రచన చేస్తున్నారో ఒక స్పష్టత లేకపోవడంతో, అది డాక్యుమెంటరీ కాలేదు, సినిమా కాలేదు సరికదా, రెండో భాగానికి ఉపోద్ఘాతమై కూర్చుంది. 

          ఐతే ఠాకరే రాజకీయ జీవితాన్ని తేదీలు వేసి క్రొనలాజికల్ ఆర్డర్ లో చూపిస్తున్నప్పుడు, ఇంటర్వెల్ కి ముందంతా మణూస్ గురించి, ఇంటర్వెల్ తర్వాతంతా మణూస్ ని వదిలేసి హిందూత్వ గురించీ చూపించారు. 40 ఏళ్ళు  మణూస్ గురించి పోరాడినా, ఎందరో నమ్మి పోరాడిన మరాఠీలు ప్రాణాలు పోగొట్టుకున్నా, ఆ లక్ష్యం సాధించలేదు. ఉన్నట్టుండి హిందూత్వ వాదాన్ని ఎత్తుకుని, హింసాగ్ని రగిలించి, ఇదీ ఏమీ సాధించకుండానే పోరాటం సాగుతూ వుంటుందని చెప్పి ముగించారు. 

          అతి వాదం ఏదీ సాధించదనీ, సాగదీస్తూనే వుంటుంది మళ్ళీ మళ్ళీ ఎన్నికల కోసమనీ అన్నట్టు చూపించారు. మణూస్ తో మరాఠీయేతరులు వుండరాదని చెప్పి అన్నేళ్ళు  పోరాడేక, హిందువులందరూ ఒక్కటే, హిందువులందరూ మతాన్ని కాపాడుకోవడానికి ఏకం కావాలనీ హింసాత్మక హిందూత్వ వాదాన్ని ఎత్తుకున్నప్పుడు, మణూస్ కి అర్ధమేలేకుండా పోయింది. హిందువులందరూ ఒకటే అన్నప్పుడు మరాఠీయేతరులు కూడా మహారాష్ట్రలో వుండొచ్చు. ఇది సెల్ఫ్ గోల్ కొట్టుకోవడమే. దీని గురించి ఓ మరాఠీ మిత్రుణ్ణి అడిగితే, అక్కడి జనం మణూస్, హిందూత్వా ఒకటేనని అనుకుంటున్నారని చెప్పాడు. 

ఎవరెలా చేశారు
    ఠాకరే పాత్రలో నవాజుద్దీన్ ఠాకరే సాబ్ ఒడ్డూ పొడవూ లేకపోయినా, బాడీ లాంగ్వేజినీ,  ఫేషల్ ఎక్స్ ప్రెషన్స్ నీ అనుకరించడంలో ప్రతిభ కనబర్చాడు. తెరమీద మెస్మరైజ్ చేసే ఈ ఫైనల్ ఫ్రేములు ఎన్ని టేకులు తీసుకుంటే వచ్చాయోగానీ, వీటిని రాబట్టిన దర్శకుడికి కూడా క్రెడిట్ ఇవ్వాల్సి వుంటుంది. 

          వాయిస్ అనుకరుణని లైట్ తీసుకున్నారు. నవాజుద్దీన్ ఠాకరే లోని శాంతం, క్రోధం, ఆవేశం, అక్కస్సు, ప్రేమ (ఇంట్లో) మొదలైన ఎమోషన్స్ ని చాలా రియలిస్టిక్ గా ప్రదర్శించాడు. నవ్వడం దాదాపూ వుండదు. సంతోషం సంతోషకరమైన ఘట్టాల్లోనూ వుండదు. నిలువెత్తు ఠాకరే ఎలా వుండే వాడో నవాజుద్దీన్ ని చూస్తే తెలిసిపోతుంది. ఠాకరే స్మోకర్, డ్రీంకర్. ఈ దృశ్యాలు విపరీతంగా వుంటాయి. ఇంకే సినిమాల్లోనూ చూడనన్ని చట్ట బద్ధమైన హెచ్చరికలు వరసగా స్క్రోల్ అవుతూనే వుంటాయి.

          ఇక మొరార్జీ దేశాయి, మనోహర్ జోషి, రజనీ పటేల్, జార్జి ఫెర్నాండెజ్, యశ్వంత రావ్ చౌహాన్, ఠాకరే సతీమణి మీనా తాయి, ఇందిరా గాంధీ మొదలైన ఇతర పాత్రలు ఆయా సందర్భాల్లో కన్పిస్తాయి. ఇందిరా గాంధీ పాత్ర వేసిన థియేటర్ ఆర్టిస్టు, ఎన్నారై  అవంతికా అక్రేకర్ అందరిలోకి బెస్ట్. 1970 ల నాటి ఇందిర పోలికలతో ఆశ్చర్య పరుస్తుంది. దర్శకుడు కూడా ఇందిర తల అలా పైకెత్తి వినే బాడీలాంగ్వేజినే ఎష్టాబ్లిష్ చేస్తూ మిడ్ షాట్స్ తీయడం గొప్ప జస్టిఫికేషన్. ఠాకరే సతీమణి పాత్రలో అమృతా రావ్ ఆమె సున్నిత మనస్తత్వాన్ని ప్రదర్శిస్తూ చెరిగిపోని ముద్ర వేస్తుంది. 


         హిందీ, మరాఠీ భాషల్లో విడుదల చేసిన ఈ బయోపిక్ మేకింగ్ క్వాలిటీ చాలా ఉన్నతంగా వుంది. ఫస్టాఫ్ పొడవునా ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే బ్లాక్ అండ్ వైట్ దృశ్యాలు కళాత్మకంగా వున్నాయి - కలర్ సినిమాల కంటే బ్లాక్ అండ్ వైటే బెటర్ అన్పించేలా. ఒకప్పటి ‘ఇండియా టుడే’ ప్రఖ్యాత సీనియర్ ఫోటోగ్రాఫర్ రఘురాయ్ నైపుణ్యపు తెలుపు నలుపు భావ చిత్రాల్లా.1950 లనుంచీ కాలక్రమేణా ముంబాయి అభివృద్ధి చెందుతూ వస్తున్న వివిధ దశల తెలుపు నలుపు దృశ్యాలు కళ్ళకి కట్టినట్టున్నాయి. సెకండాఫ్ లో కలర్ దృశ్యాలు వస్తాయి. సెట్స్, భవనాలు, ఔట్ డోర్ లొకేషన్స్, బీచి, ప్రాపర్టీస్, కాస్ట్యూమ్స్, మేకప్, నాటి పాతకాలపు మనుషుల్ని పోలిన మనుషులు, వాళ్ళ నాటి బాడీ లాంగ్వేజీలు, భాష, తమిళ తంబిల ఇడ్లీ సాంబార్ సేల్స్, పోటీగా ఠాకరే వడ పావ్ సూపర్ సేల్స్...చెప్పుకుంటే బొంబాయి – ముంబాయిలని కూడా బయోపిక్ చేసి చూపించారు. సినిమాగా ఏ కళ లేకపోయినా, డాక్యు డ్రామాతో చాలా కళాప్రదర్శన చేశారు. రాజకీయ పార్టీ తీసే రాజకీయ సినిమా  - లేదా డాక్యు డ్రామా - ఇంత కళాఖండంలా  తీయడం అరుదు.  

( చివరికేమిటి - రేపు)        
సికిందర్
Watched at PVR, Irrum manzil
11pm, 28.1.19