రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Sunday, July 9, 2023

1345 : రివ్యూ!


 

 రచన - దర్శకత్వం : అజయ్ సామ్రాట్ 
తారాగణం : జగపతి బాబు, ఆశీష్ గాంధీ, గానవీ లక్ష్మణ్, మమతా మోహన్‌దాస్, విమలా రామన్, కాలకేయ ప్రభాకర్ తదితరులు
సంగీతం :  ఐస్ నావల్ రాజా, ఛాయాగ్రహణం : సంతోష్ శనమోనీ
నిర్మాత : రసమయి బాలకిషన్

విడుదల : జులై 7, 2023
***

***

        బాహుబలి మాటల రచయితల్లో ఒకరైన అజయ్ సామ్రాట్ దర్శకుడుగా మారి తీసిన రుద్రంగి 1940 లనాటి తెలంగాణ దొరల కథ. దీనికి రసమయి బాలకిషన్ నిర్మాత. నిజాం కాలంలో తెలంగాణా దొరల సినిమా అంటే ఒకే తరహా కథలతో తీసిన సినిమాలు మెదులుతాయి. మరి రుద్రంగి కూడా మరో ఆ తరహా కథేనా, లేక ఏమైనా తేడా గల కథా? జగపతి బాబు ప్రధాన పాత్ర పోషించిన ఈ పీరియెడ్ తెలంగాణా మూవీ చరిత్రలోంచి నేటి కాలానికి చెబుతున్న నీతి ఏమిటి? ఇవి తెలుసుకుందాం...

కథ  

దొర భీంరావు దేశ్ ముఖ్ (జగపతి బాబు) చుట్టు పక్కల ప్రజలకి టెర్రర్ లా వుంటాడు. అణిచివేసి, ప్రాణాలు తీసి, దొరతనం చెలాయిస్తూంటాడు. స్త్రీ వ్యామోహమెక్కువ. భార్య మీరాబాయి (విమలా రామన్) వుండగా, జ్వాలాబాయి (మమతా మోహన్ దాస్) అనే ఇంకో సంపన్నురాలిని పెళ్ళి చేసుకుని తెచ్చుకుంటాడు. ఆమె ఆడదానిగా కంటే మగవాడి ప్రతాపం చూపించే దానిలా వుండడంతో, నువ్వు ఆడదానివి కావని పక్కన పెట్టేస్తాడు. దీంతో ఆమె జీతగాడు మల్లేష్ (ఆశీష్ గాంధీ) మీద కన్నేస్తుంది. దొర మల్లేష్ మరదలి మీద కన్నేస్తాడు. ఎలాగైనా మల్లేష్ మరదలు రుద్రంగి (గానవీ లక్ష్మణ్) ని పడకలోకి తెచ్చుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభిస్తాడు. మల్లేష్ తిరగబడి దీన్ని అడ్డుకోవడం మొదలెడతాడు. ఇప్పుడేం జరిగిందన్నది మిగతా కథ.

ఎలావుంది కథ

అదే అప్పటి తెలంగాణా దొరల టెంప్లెట్ కథ. ఏ 1940ల నాటి తెలంగాణా కథతో  సినిమా ఎప్పుడు తీసినా ఓ దొర, అతడి దౌర్జన్యాలు, చివరికి ప్రజల చేతిలో చావు- అనే మూసలోనే వుంటాయి. టైటిల్సే తేడా తప్ప, సినిమాలన్నీ ఒకటే. నేటి తరం ప్రేక్షకులకి సమీప చరిత్ర అయిన నక్సలిజం మీద తీసే సినిమాలే కనెక్ట్ కావడంలేదు, ఇక సుదూర చరిత్ర అయిన తెలంగాణా దొరల మీద సినిమాలు కనెక్ట్ అయ్యే అవకాశమే లేదు. ఈ సినిమాల్లో ఏం యూత్ అప్పీల్, మార్కెట్ యాస్పెక్ట్ వుంటాయని యువ ప్రేక్షకులు చూస్తారు?

దొరల సినిమాల్లో దొరలకి ఏ నీతీ చెప్పడం వుండదు. రుద్రంగి లో కూడా లేదు. ఆడవాళ్ళ మీద మీరు చేస్తున్న అత్యాచారాలు రేపు మీ వారసులు మిమ్మల్ని రోల్ మోడల్స్ గా తీసుకుని చేస్తే ముందు కాలంలో చాలా ఘోరాలు జరుగుతాయని- ఇప్పటి కాలంలో వాళ్ళ వారసుల్ని మాస్ రేపిస్టులుగా చూపిస్తూ దొరల కథలకి కలిపి చూపిస్తే - ఇప్పటి ప్రేక్షకులకి నాటి దొరల చరిత్ర మీద కుతూహల మేర్పడి కనెక్ట్ అయ్యే అవకాశముంటుంది కథ. లేకపోతే కుతూహలానికి అవకాశమే లేదు.
       
ఒక కామాంధుడైన దొరకి అతడి బానిస బంటు బుద్ధి చెప్పే కథ
రుద్రంగి’. తెలిసిపోయే రొటీన్ కథా కథనాలతో, పాత్ర చిత్రణలతో, పోరాటాలతో, భీకరమైన అరుపులతో  బి సి సెంటర్ల మాస్ ప్రేక్షకుల సినిమాగా, ఇది నాటుగా కూడా వుంటుంది. అలాగే తెలంగాణా పీరియెడ్ సినిమా తీస్తూ అందులో ఇటీవల వచ్చిన కొన్ని తెలుగు సినిమాల కాపీ సీన్లే పెడితే, 1940 ల నాటి తెలంగాణా చరిత్ర అనే స్వచ్ఛతని కూడా కోల్పోయింది కథ. బాహుబలి రచయిత నుంచి తెలంగాణా కథ ఇలా తెరకెక్కడం విచిత్రం.

నటనలు –సాంకేతికాలు

నెగెటివ్ పాత్రలో కామాంధుడైన దొరగా జగపతి బాబుకే ఈ సినిమాలో ప్రాధాన్యం. మిగతా పాత్రలు డమ్మీలు. జగపతి బాబు తానొక్కడై సినిమా మొత్తం వూపేస్తాడు ఓవరాక్షన్ విలనీతో. ఇది మాస్ కి నచ్చుతుందనుకోవచ్చు. కానీ క్లాస్ కి నచ్చాలంటే పాత్రచిత్రణ బావుండాలి. పెళ్ళి చేసుకుని తెచ్చుకున్న రెండో భార్య వచ్చీ రావడంతోనే, జగపతి బాబు శత్రువు పంపిన అనుచరుల్ని యాంజెలీనా జోలీలా మార్షల్ ఆర్ట్స్ టైపులో, టపటపా కొట్టి పడెయ్యడంతో బెదిరిపోతాడు జగపతి బాబు. నువ్వు ఆడదానివి కాదు, ఆడది మంచులా వుండాలి, కంచులా కాదని నీతులు చెప్పి దూరం పెట్టేస్తాడు.
       
దీంతో జగపతి బాబుది పిరికి పాత్ర అన్పిస్తుంది. చుట్టుపక్కల అంత ఉగ్రుడైన
, కామాంధుడైన దొర ఓ ఆడది కంచులా వుంటే మంచులా మార్చేసి బానిసగా చేసుకోకుండా తప్పించుకుంటాడు. పైగా వూళ్ళో బలహీనురాలైన రుద్రంగి మీద కన్నేసి ప్రతాపం చూపిస్తాడు. అసలు రెండో భార్య శత్రువు అనుచరుల్ని చంపి తన ప్రాణాలు కాపాడిందన్న విషయమే మర్చిపోతాడు. పాత్ర ఇలా ఎస్టాబ్లిష్ అయ్యాక ఇక జగపతి బాబు సినిమాని ఎంత వూపేసినా బాక్సాఫీసు వూగిపోదు.
       
రుద్రంగి పాత్రలో కన్నడ నటి గానవీ లక్ష్మణ్ పీరియెడ్ తెలంగాణా పాత్ర రూపు రేఖలకి సరిపోయింది గ్లామర్ లేకుండా. పాత్ర ఎలా వున్నా హావభావ ప్రదర్శనతో దృశ్యాల్ని నిలబెట్టిందని చెప్పొచ్చు. కానీ బానిస బంటుగా ఆశీష్ గాంధీ ఫేసులో ఎక్స్ ప్రెషన్స్ సరిపోలేదు. బానిసగా
, ఆ తర్వాత తిరగబడ్డ తెలంగాణా బిడ్డగా, అవసరానికి మించిన జగపతి బాబు మాస్ విశ్వరూపం ముందు నిలబడ లేకపోయాడు.
       
రెండో భార్యగా మమతా మోహన్ దాస్ ది కూడా ఓవరాక్షనే. ఆమె నటన
, పలికే డైలాగులు మాస్ కోసమే. ఇక మొదటి భార్యగా విమలా రామన్ ది రెగ్యులర్ బానిస పాత్ర, నటన. బానిస బంటు ప్రేమిస్తున్న రుద్రంగి మీద కామంతో దొర, పెళ్ళి చేసుకున్న దొర దూరం పెడితే బానిస బంటు మీద కామం పెంచుకున్న రెండో భార్య- ఇలా ఇదంతా ఒక చతుర్ముఖ రంకు పురాణం.
       
దర్శకత్వం షాట్లు తీసే విషయంలో నిలబడింది. అయితే కొన్ని చోట్ల షాట్సు ఏ పాయింటాఫ్ వ్యూతో తీశారో అర్ధంగాదు. రెండో భార్య ఇంట్లోకి అడుగు పెడుతున్నప్పుడు మొదటి భార్య దిష్టి తీస్తూంటే
, మధ్యలో పై నుంచి ఏరియల్ షాట్ ఎందుకు? పై నుంచి దేవుడు చూస్తున్నాడా? ఇంకో షాట్ కిటికీ చువ్వల మధ్య నుంచి తీయడమెందుకు? కిటికీ లోంచి ఎవరు చూస్తున్నారు?
       
రసమయి బాలకిషన్ మీద ఓ పాట వుంది. తెలంగాణా సాహిత్యంతో మిగిలిన పాటలు ఓకే. కళాదర్శకత్వం
, వస్త్రాలంకరణ, సెట్స్ వగైరా పీరియెడ్ ప్రపంచంలోకి తీసికెళ్తాయి. కానీ కథ పీరియెడ్ మూడ్ లోకి తీసికెళ్ళదు. ఫస్టాఫ్ పాయింటుని ఎస్టాబ్లిష్ చేస్తూ స్పీడుగా సాగితే, ఈ మధ్య వచ్చిన చాలా సినిమాలకి లాగే సెకండాఫ్ నత్త నడక నడుస్తుంది. దొరకీ బానిసకీ తెలిసిన పోరాటమే తీరుబడిగా పోరాడుకుంటే, రెండు గంటలా 15 నిమిషాల సినిమా, 4 గంటలూ సాగుతున్నట్టు అన్పిస్తుంది.
—సికిందర్
     

1344 : రివ్యూ!


 

రచన- దర్శకత్వం : పవన్ బాసంశెట్టి  
 తారాగణం : నాగశౌర్య, యుక్తీ తరేజా, సత్య, గోపరాజు రమణ, మురళీశర్మ, షైన్ టామ్ చాకో, శరత్ కుమార్, బ్రహ్మాజీ, సప్తగిరి తదితరులు
సంగీతం : పవన్ సిహెచ్, ఛాయాగ్రహణం :  దివాకర్ మణి, వంశీ పచ్చిపులుసు
బ్యానర్ : శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరా సినిమాస్
నిర్మాత : సుధాకర్ చెరుకూరి
విడుదల : జులై 7, 2023
***

2019 లో  ఓహ్ బేబీ విజయం తర్వాత నాగశౌర్య నటించిన 5 సినిమాలూ (అశ్వత్థామ, వరుడు కావలెను, లక్ష్య, కృష్ణా వ్రిందా విహారీ, ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి) వరసగా పరాజయాల పాలయ్యాయి. రోమాంటిక్ కామెడీల మీద ఆసక్తి పెంచుకుని వాటినే నటిస్తూ పోతున్న తను వైవిధ్యానికి ఏ మాత్రం స్థానమిస్తున్నాడో తెలుసుకోవాలంటే తాజా ‘రంగబలి’ ని చూడాలి. కొత్త దర్శకుడు పవన్ బాసంశెట్టి చేతిలో నాగశౌర్య నటించిన ఈ రంగబలి ఏవిధంగా వుందో చూద్దాం...

కథ

రాజవరం అనే వూళ్ళో శౌర్య (నాగశౌర్య) పనీపాటా లేకుండా తిరుగుతూ తండ్రికి సమస్యగా మారతాడు. శౌర్య పుట్టి పెరిగిన వూరే బలమని నమ్ముతాడు. ఈ బలమే తనకి గుర్తింపు నిస్తుందనుకుంటాడు. ఇలాటి అవగాహనతో ఇతను పాల్పడే చేష్టలు భరించలేకపోతాడు తండ్రి. దీంతో మెడికల్ షాపు నడిపే తండ్రి విశ్వం (గోపరాజు రమణ), ఫార్మసీ కోర్సు చేసి వచ్చి షాపు చూసుకోమని శౌర్యని వైజాగ్ పంపేస్తాడు. వైజాగ్ లో కోర్సులో చేరిన శౌర్య అక్కడ సహజ (యుక్తీ తరేజా) తో ప్రేమలో పడతాడు. ఈ ప్రేమని సహజ తండ్రి (మురళీ శర్మ) అంగీకరిస్తాడు. అయితే శౌర్య వూరి పేరు తెలుసుకున్న అతను శౌర్య ప్రేమని వ్యతిరేకిస్తాడు. రాజవరంలో రంగబలి సెంటర్ అంటే అతడికి పడదు. అందుకని ఆ వూరు వదిలి వైజాగ్ వచ్చేస్తే ప్రేమని అంగీకరిస్తానంటాడు.
       
రంగబలి సెంటర్ తో సహజ తండ్రికున్న సంబంధమేమిటి
? ఎందుకు ఆ పేరు విని శౌర్యని తిరస్కరిస్తున్నాడు? సొంత వూరు వదిలి రాలేని శౌర్య తన ప్రేమకి అడ్డుగా వున్న రంగబలి సెంటర్ విషయంలో ఏం చర్యలు తీసుకున్నాడు? ఆ వూళ్ళో వుంటున్న ఎమ్మెల్యే పరశురామ్ (షైన్ టామ్ చాకో) కీ, సహజ తండ్రికీ మధ్య వున్న సంబంధమేమిటి? ఇవి తెలుసుకోవాలంటే మిగతా కథ చూడాలి.

ఎలావుంది కథ  

ప్రేమ కోసం వూరి సెంటర్ పేరు మార్చేందుకు హీరో చేసే ప్రయత్నాలతో ఎదురయ్యే ప్రతిఘటనల గురించి ఈ కథ. ఈ కథని ప్రేక్షకులకి వినోదాత్మకంగా చెప్పాలా, లేక సీరియస్ గా చెప్పాలా - ఎలా చెప్తే ఆకట్టుకుంటుందన్నది మొదటి పాయింటు. కథ కోసం తీసుకున్న విషయంలో తగినంత సంఘర్షణ వున్నదా, లేదా అన్నది రెండో పాయింటు. ఈ రెండు పాయింట్లతో స్పష్టత, దాంతో నిర్వహణా సరిగ్గా లేకపోతే ఏం జరుగుతుందన్నది మూడో పాయింటు.
       
కొత్త దర్శకుడు వినోదాత్మకంగానే కథని మొదలుపెట్టి దాన్ని సీరియస్ గా మార్చేయడంతో
, సీరియస్ గా మార్చివేశాక సంఘర్షణని  బలంగా తీర్చిదిద్దక పోవడంతో- మొత్తానికే ఎసరు వచ్చింది. నాగశౌర్య ఖాతాలో మరో ఫ్లాప్ జమ పడింది. రిలీజ్ చేసిన ట్రైలరే చప్పగా వున్నప్పుడు, సినిమా గొప్పగా వుండే అవకాశం లేదు. కనీసం ముగింపయినా అర్ధవంతంగా లేదు, ఇంటర్వెల్ మలుపు సహా. ఫస్టాఫ్ ని కామెడీతో లాక్కొచ్చినా, హీరోకి రంగబలి సమస్య ఎదురయ్యాకా, కథ ఎలా నడపాలో అర్ధంగాక, గజిబిజి చేసేయడంతో సెకండాఫ్ బోల్తా పడింది.
       
ఫస్టాఫ్ లో వూళ్ళో నాగ శౌర్య ఆవారా తనం
, తండ్రితో చీవాట్లు వందల సినిమాల్లో వచ్చేసిన అరిగిపోయిన విషయమే. అలాగే వైజాగ్ లో హీరోయిన్ యుక్తితో లవ్ ట్రాక్ లోనూ కొత్తదనం లేదు. నాగశౌర్యతో ఫస్టాఫ్ లాగలేక పోతున్నప్పుడు, కమెడియన్ సత్యని ప్రవేశపెట్టి ఫస్టాఫ్ కి అతడ్ని హీరోగా చేశాడు దర్శకుడు. ఈ సినిమా గురించి ఏదైనా చెప్పుకుంటే సత్య చేసిన కామెడీ గురించే చెప్పుకుంటారు ప్రేక్షకులు- ఇది అద్భుతమైన కామెడీ ఏమీ కాదు- చీప్ కామెడీయే బూతుతో కలిసి.
       
హీరోయిన్ తండ్రితో హీరోకి సమస్య ఎదురయ్యాక సెకండాఫ్ లో పడుతుంది కథ. ఇక్కడ్నించే రంగబలి పేర్చు మార్చే కథనం సీరియస్ యాక్షన్ సినిమాలాగా మారిపోయి- అర్ధం పర్ధం లేకుండా దారితప్పి పోయింది కథ. రంగబలి కాదు
, ప్రేక్షకులు బలి అన్నట్టు తయారయ్యింది. ఈ తయారీలో విలన్ గా నటించిన షైన్ టామ్ చాకో- ఇటీవలి దసరా లో తను చేసిన విలనీ లాగా, మరోసారి హాస్యాస్పదంగా తయారయ్యాడు.
       
వూళ్ళో ఒక సెంటరు పేరు మార్చే కథనే రాజకీయ విలన్ పాత్రతో రాజకీయ సెటైర్లతో
, చురకలతో కొత్త కథగా చేసి నడపొచ్చు. స్థలాల పేర్లు రాజకీయ అవసరాల కోసం వివాదాస్పదమవుతున్న వైనాన్ని చిత్రించి- ఒక మెసేజితో ఈ బలహీన రోమాంటిక్ కామెడీని బలంగా నిలబెట్టి, బాక్సాఫీసు ప్రయోజనాలు పొంది వుండొచ్చు.

నటనలు- సాంకేతికాలు

నాగశౌర్యకి నటన వచ్చనడంలో ఎలాటి సందేహం లేదు. ఆ టాలెంట్ ఇలాటి సినిమాలతో వృధా అయిపోతోంది. ఆరు వరస ఫ్లాపులివ్వడానికి సరిపోతోంది. ఫస్టాఫ్ లో తండ్రి పాత్ర గోపరాజు రమణతో కామెడీ బాగా చేశాడు. అయితే ఏ సీనుకా సీనే. విషయంలేని ఫస్టాఫ్ లో ఈ కామెడీలతో తనేమీ నిలబెట్టలేదు. సత్య నిలబెట్టాడు. ఇక సెకండాఫ్ లో ఎటుపోతోందో అర్ధంగాని గజిబిజి సీరియస్ కథతో, చిన్నప్పటి ఫ్లాష్ బ్యాకుతో, తను పూర్తిగా చేతులెత్తేశాడు. రంగబలి స్థల పురాణం గురించి చెప్పే చిన్నప్పటి ఫ్లాష్ బ్యాక్ ఏం చెప్పారో అర్ధంగాదు. హీరోయిన్ తో లవర్ బాయ్ నటన అంతంత మాత్రమే.
       
కమెడియన్ సత్య మాత్రం ఎవరైనా సంతోషంగా వుంటే ఓర్వలేని పాత్రలో చేసిన కామెడీతో సినిమాకి తనవంతు న్యాయం చేశాడు. హీరోయిన్ యుక్తి రొటీనే. చెప్పుకోదగ్గ పాత్ర కాదు. తండ్రుల పాత్రల్లో గోపరాజు రమణ
, మురళీ శర్మ ప్యాడింగ్ కి నిండుదనం తెచ్చారు. విలన్ ఎమ్మెల్యేగా మలయాళ నటుడు షైన్ చాకో ఆటలో అరటిపండు.
       
అరడజను ఫ్లాపుల తర్వాత
దసరా తీసి హిట్ అన్పించుకున్న అగ్ర నిర్మాత చెరుకూరి సుధాకర్ ఈ సినిమా ప్రొడక్షన్ విలువలకి బాగా ఖర్చు పెట్టారు. అయితే కొత్త దర్శకుడు పవన్ బాసంశెట్టి తన క్రాఫ్టుకి ఇంకా చాలా సానబెట్టు కోవాల్సిన అవసరం వుంది.
—సికిందర్