రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Monday, November 22, 2021

1091 : రైటర్స్ కార్నర్


 

       ప్రతి వృత్తికీ సాధనాలు అవసరం. ప్రాథమికంగా పారా పలుగూ లేకుండా మీరు ఇల్లు నిర్మించలేరు. బ్రోకర్ లేకుండా షేర్స్ వ్యాపారం చేయలేరు. బాస్కెట్‌ బాల్ ఆటగాళ్ళు   హూప్స్, బాల్ లేకుండా బాస్కెట్ బాల్ ఆడలేరు. చిత్రకారులకి కుంచెలు, రంగులు అవసరం...మీరు సినిమా రచయితైతే  మీకో టూల్ బాక్స్ అవసరం! ఆ టూల్ బాక్స్ లో ఏఏ సాధనాలు అవసరం? ఓ పెన్నూ కాగితమా? ఓ కంప్యూటరా? ఇవి సరే, ఇంకేం అవసరం? వృత్తిపరంగానో, అభిరుచిగానో  స్క్రీన్‌ప్లేలు రాయాలనుకుంటే, మీరు మీ సొంత టూల్ బాక్స్ ని అనుభవాల సారంగా నిర్మించుకోవడం, అనుకూలీకరించు కోవడమూ ప్రారంభించాల్సిందే!

        సినిమా రచన భౌతికమైనది కాబట్టి మీకు టైప్‌రైటర్ లేదా రైటింగ్ సాఫ్ట్ వేర్ తో బాటు చాలా రిఫరెన్స్ పుస్తకాలతో కూడిన కంప్యూటర్ అవసరం. స్క్రీన్ రైటింగ్ అనేది ఒక క్రాఫ్ట్ కాబట్టి మీకు విద్య, శిక్షణ, అభ్యాసం చాలా అవసరం. స్క్రీన్ రైటింగ్ అనేది ఒక కళ కాబట్టి కూడా మీరు అనుభవించిన ప్రతి అనుభవం, మీరు ఎప్పుడైనా చూసిన లేదా చదివిన ప్రతి కథ, మీరు ఎప్పుడైనా విన్న ప్రతి విషయం మీరు ఉద్వేగభరితంగా భావించే ప్రతిదానికీ  అవసరం. ఈ వ్యక్తిగత అనుభవాలన్నీ మీ టూల్‌ బాక్స్ లోకి వెళ్ళడానికి అవసరం.

అదృశ్య సాధనాలు :
         నేను ఐదేళ్ళ వయసులో నా మొదటి స్క్రీన్‌ప్లే రాసేశా, పన్నెండు సంవత్సరాల వయసులో నా మొదటి ఆస్కార్‌ గెలిచేశా, నా రెండవ ఆస్కార్ పదిహేనవ యేట వచ్చేసింది...” చెప్పాడు యమ బిజీగా వున్న పిల్లవాడు. వయస్సులో మీరు దేని గురించి రాశారండీ?” అడిగాడు అనామకుడు. "జీవితం గురించి రాసేశా!” చెప్పాడు బుడ్డోడు. కానీ మీరు తగినంత జీవితాన్ని అనుభవించలేదు కదండీ?” అన్నాడు అనామకుడు. "ఓహ్, అనుభవించేశా!” అరిచాడు బుడతడు,“తెలీదేమో మీకూ, నా గత జన్మల విశేషాలన్నీనాకు బాగా గుర్తుంటాయి మరి! అన్నాడు మళ్ళీ ముక్కు తుడుచుకుంటూ.

        ఇలా మీ వ్యక్తిగత అనుభవాలే, పరిశీలనలే మీ అదృశ్య సాధనాలు. ఇదేం మీరు భౌతికంగా బయట కొనుగోలు చేసి మీ ఊహాత్మక టూల్‌ బాక్స్ లో వుంచగలిగేది కాదు. కానీ ఇది అన్ని రచనా వ్యాసంగాలకీ ముఖ్యావసరమే. మీరు ఎంత ఎక్కువ తెలుసుకుంటే, చూస్తే, అనుభూతిస్తే, అంత ఎక్కువ రాసేటప్పుడు సారం మీ రచనల్లో  ప్రవహిస్తుంది. ఈ రకమైన సాధనాలని సేకరించడానికి సంవత్సరాలు పట్టొచ్చు.

        ఈ రకమైన సాధనాలని మరింత అభివృద్ధి చేయడానికి ఉత్తమ మార్గం ప్రతిదీ వినడం, గ్రహించడం, ప్రాసెస్ చేయడమే. ప్రపంచంలో అత్యంత చెడ్డ లేదా నీచమైన వ్యక్తికి కూడా ఒక దృక్కోణం వుంటుంది. రచయితగా మీ విలువలకి,మ్మకాలకి విరుద్ధంగా వుండే విభిన్న దృక్కోణాలని మీరు అర్థం చేసుకోవాలి. ఇతర వ్యక్తుల్ని అర్థం చేసుకోవడానికి మీరు ఎంత ఓపెన్‌గా వుంటే, మీ పాత్రలు అంత లోతుగా వుంటాయి. క్యారెక్టర్ డెవలప్‌మెంట్‌లో తప్పు, ఒప్పు అన్నవి వుండవు - కేవలం దృక్కోణాలే వుంటాయి. అందుకే చాలా మంది రచయితలు విశ్లేషకులుగా పుట్టుకొచ్చారు.


        "మీకు తెలిసింది రాయండి" అన్నారు. మీ వ్యక్తిగత అనుభవాలతో నాలెడ్జ్ బేస్ పెరిగేకొద్దీ (దురదృష్టవశాత్తూ, వయస్సుతో పాటూ), మీరు మీ అదృశ్య సాధనాలని విస్తరించడమూ, ఉన్నతస్థాయి రచనలల్నిచేయడమూ ప్రారంభిస్తారు. నా సలహా, నోట్ ప్యాడ్ దగ్గరుంచుకుని బయటకి వెళ్ళండి. బయట ఏం తెలుసుకుంటున్నారో రాసుకోండి. తిరిగి వచ్చాక విశ్లేషించుకోండి. మీరు లోతైన రచనలు చేయడానికి ఇది అవసరం.

క్రాఫ్టింగ్ సాధనాలు :
        నేను ఆ సినిమా కంటే బ్రహ్మాండమైన సినిమా కథ రాయగలను. వందల కొద్దీ సినిమాలు చూశా, నాకు చాలా ఈజీ!” చెప్పాడు బిజీ ప్రేక్షకుడు. “సరే రాయ్ మరి” చెప్పాడు అనామకుడు. నెలరోజుల తర్వాత,ఏం సార్, పూర్తయిందా మీ బ్రహ్మాండమైన సినిమా కథ?” అడిగాడు అనామకుడు. “ఫస్ట్ పేజీ మీద హెవీ వర్క్ చేస్తున్నానబ్బా ఆగు!” అన్నాడు హెవీ ప్రేక్షకుడు.

        మీ క్రాఫ్టింగ్ సాధనాలు మీ సినిమా రచన విద్యా, శిక్షణా, అభ్యాసాల ద్వారా మాత్రమే అభివృద్ది చెందుతాయని గుర్తు పెట్టుకోండి. సినిమాలు చూస్తున్నంత మాత్రాన ఏమీ వొరగదు. మీకు సినిమా రచనలో డిగ్రీ లేకుంటే (చాలా మందికి వుండదు కూడా), వర్క్ షాపులు, స్క్రీన్ రైటింగ్ పుస్తకాలతో స్వబోధనా మీకు తోడ్పడతాయి. కొత్తగా వచ్చేవాళ్ళు కనీసం రెండు వర్క్ షాపులు హాజరవాలని నేను సిఫార్సు చేస్తున్నాను. ఇక్కడ మీకు ఇతరులు ఎలా రాస్తున్నారో చదవడానికీ, చర్చించడానికీ అవకాశముంటుంది. దీంతో అపారమైన అంశాల మీద మీకు పట్టు లభిస్తుంది. తరులు చేస్తున్న తప్పులు కూడా తెలుసుకుని మిమ్మల్ని దిద్దుకోగల్గుతారు.

       సినిమా రచన ప్రాథమికాలని నేర్చుకోవడంలో సార్వత్రిక కథా నిర్మాణం (యూనివర్సల్ స్టోరీ స్ట్రక్చర్) తెలుసుకోవడం అతి ముఖ్యమైన భాగం. మౌలిక థా నిర్మాణం జానపద కథల నుంచి, పురాణాల నుంచీ లభిస్తోంది. ఈ విషయాలని బోధించే తరగతులకి మీరు హాజరైతే వృత్తిలో మీరు ముందుంటారు.

        ఈ విద్య మీకు స్క్రీన్ రైటింగ్ పుస్తకాల్లోంచి కూడా లభిస్తుంది. మరొక క్రాఫ్టింగ్ సాధనం తిరగ రాయడం. రాసింది దిద్దుకుంటూ తిరగ రాయడం. ఎన్నిసార్లయినా తిరగ రాయండి. ఎంత ఎక్కువ సాధన చేస్తే అంత మంచి రచయితవుతారు. సినిమా రచననేది ఒక క్రాఫ్టు. ఎంత సాధన చేస్తే అంత మేలైన రచయితవుతారు.

భౌతిక సాధనాలు:
        ఇక్కడ కొన్ని రిఫరెన్సు పుస్తకాలని సూచిస్తున్నాను. అసంఖ్యాకంగా లభిస్తున్న స్క్రీన్ రైటింగ్ పుస్తకాల్లో ఏవి తీసుకోవాలన్న తికమక లేకుండా మీకు సూచిస్తున్నాను. పాత్ర, కథ ఎల్లప్పుడూ ఒకదానితో ఒకటి ముడిపడి వుంటాయి. ఏ పుస్తకం దేని కవసరమో ఈ కింద జాబితాలో బ్రాకెట్లలో సూచిస్తున్నాను.

        1. ది ఆర్ట్ ఆఫ్ డ్రమటిక్ రైటింగ్, లాజోస్ ఎగ్రి - ఈ పుస్తకం 1946 లో వెలువడింది. ప్రత్యేకంగా ప్లే రైటింగ్ (నాటకాల) కోసం. స్క్రీన్ రైటింగ్ కోసం దీన్ని సిఫార్సు చేస్తాను. ఇందులో వున్న లోతైన సమాచారంతో బలమైన రచనలు చేయగల్గుతారు (క్యారెక్టర్ డెవలప్‌మెంట్, స్టోరీ స్ట్రక్చర్)

      2. పోయెటిక్స్, అరిస్టాటిల్ మాస్టర్ - కథా నిర్మాణాన్ని పరిశోధించి విశ్లేషించిన మొదటి పండితుడు. ఆయన చెప్పిన బేసిక్స్ ఇంకా మారలేదు (స్టోరీ స్ట్రక్చర్)

        3. ది హీరో విత్ ఏ థౌజండ్ ఫేసెస్, జోసెఫ్ కాంప్‌బెల్ - ఈ పుస్తకం చదవడం అంత తేలికైనది కాదు. అయితే క్లాసిక్ మిథ్ స్ట్రక్చర్‌ (మోనో మిథ్) ని ఉపయోగించి కథానాయకుడి కథా ప్రయాణాన్ని వివరిస్తుంది (క్యారెక్టర్ డెవలప్‌మెంట్, స్టోరీ స్ట్రక్చర్)

        4. ది రైటర్స్ జర్నీ, క్రిస్టఫర్ వోగ్లర్ - ఇది ది హీరో విత్ థౌజండ్ ఫేసెస్ కి గైడ్ లాంటిది. దీని కంటెంట్ ని నేరుగా దాని నుంచి తీసుకున్నారు. ఫిల్టర్ చేసి విషయం చెప్పారు. పురాణాల నిర్మాణంపై దృష్టి పెట్టి రాశారు (స్టోరీ స్ట్రక్చర్)

       5. స్టీలింగ్ ఫైర్ ఫ్రమ్ ది గాడ్స్, జేమ్స్ బానెట్  - ఇది కూడా పురాణాల నిర్మాణాన్ని పరిశోధించి రాసిన పుస్తకం. కల్పిత కథలకి మీకు కొత్త అంతర్దృష్టిని కల్పిస్తుంది (క్యారెక్టర్ డెవలప్‌మెంట్, స్టోరీ స్ట్రక్చర్)

        6. స్క్రీన్ రైటింగ్ ఫ్రమ్ ది హార్ట్, జేమ్స్ ర్యాన్  - పాత్ర చోదిత కథా కథనాలకి  సహాయపడే ప్రత్యేకతలున్న పుస్తకం (క్యారెక్టర్ డెవలప్‌మెంట్)

     7. స్క్రీన్‌ప్లే, సిడ్ ఫీల్డ్ - ప్లాట్ పాయింట్‌లని పేజీ నంబర్‌లుగా మార్చి చూపిన ప్రసిద్ధ పుస్తకం. స్క్రీన్‌ప్లే నిర్మాణాన్ని నేర్చుకోవడం ప్రారంభించడానికి ఇది మంచి పుస్తకం. ఐతే ఒక హెచ్చరిక - అలాగని పేజీ నంబర్లు ముందే అనుకుని ప్లాట్ పాయిట్స్ రాయకండి. అంకాల నిడివిని బట్టి పేజీ నంబర్లు మారవచ్చు.  

—గినీ వాన్ నేమ్ (రచయిత్రి, నిర్మాత)

        గమనిక : పై పుస్తకాల్లో మొదటి ఐదిటి గురించి బ్లాగులో అప్పుడప్పుడు ప్రస్తావిస్తున్నదే. అలాగే ముందుగానే ఈ పుస్తకాలు చదివే ప్రయత్నం చేయవద్దని కూడా చెప్పాం. ఇవి హయ్యర్ స్టడీస్. ప్రాథమికంగా బేసిక్స్ తెలియకపోతే ఈ పుస్తకాలు అర్ధం గావు. బేసిక్స్ నేర్చుకున్నాకే, ఎంతో అనుభవం పొందిన తర్వాతే వాటి జోలికెళ్ళాలంటూ, బేసిక్స్ కోసం సిడ్ ఫీల్డ్  - స్క్రీన్‌ప్లే పుస్తకాన్ని సూచిస్తూ వచ్చాం. కనుక పై జాబితాలో చివర సూచించిన సిడ్ ఫీల్డ్  - స్క్రీన్‌ప్లే మాత్రమే మొదట అభ్యసించాలి. ఏ పుస్తకం పడితే ఆ పుస్తకం కొనేసుకుంటే అయోమయ జీవిగా మిగిలిపోవడం ఖాయం – సికిందర్