రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

10, డిసెంబర్ 2021, శుక్రవారం

1104 : రివ్యూ

రచన- దర్శకత్వం : జె ధీరేంద్ర సంతోష్
తారాగణం : నాగశౌర్య
, కేతికా శర్మ, జగపతి బాబు, సచిన్ ఖెడేకర్, సత్య, రవి ప్రకాష్ తదితరులు
సంగీతం : కాల భైరవ
, ఛాయాగ్రహణం : రామ్
బ్యానర్స్ : శ్రీ వెంకటేశ్వరా సినిమాస్
, నార్త్ స్టార్ ఎంటర్ టైన్మెంట్
నిర్మాతలు : నారాయణ దాస్ నారంగ్
, పుష్కర్ రామ మోహన రావు. శరత్ మరార్
విడుదల : డిసెంబర్ 10
, 2021
***


        మొన్న అక్టోబర్ చివర్లోనే తను నటించిన వరుడు కావలెను పరాజయం చూసి ఇక విలుకాడుగా లక్ష్యానికి గురి పెట్టి బాణం విసురుతూ వచ్చేశాడు నాగశౌర్య. టైటిల్ : లక్ష్య’. పూర్తి మేకోవర్ తో ఎయిట్ ప్యాక్ కి అప్డేట్ అయి, అమీతుమీ తేల్చుకోవడానికి వచ్చేశాడు. 2011 నుంచీ ఒకే ఒక్క హిట్ తో, మరో 16 అవసరమే లేని ఫ్లాప్స్ తో ముందుకు పరుగులు తీస్తున్న నాగశౌర్య, ఎయిట్ ప్యాక్ స్పోర్ట్స్ డ్రామాతో బాక్సాఫీసు ఛాంపియన్ షిప్ కి కర్చీఫ్ వేశాడు. దర్శకుడుగా సుబ్రహ్మణ్య పురం తో సక్సెస్ ఇచ్చిన ధీరేంద్ర సంతోష్ ని తీసుకున్నాడు. ప్రముఖ నిర్మాతల బ్యానర్స్ అండదండలతో, తెలుగులో ఆర్చరీ (విలువిద్య) మీద తొలి క్రీడా చలన చిత్ర్రాన్ని పరిచయం చేస్తూ చరిత్ర పుటల్లో తన పేరుని నమోదు చేసుకున్నాడు. మరి ఇన్ని సమకూర్చుకున్న తను, ఇప్పుడు ఒకటైనా హిట్ కోసం వేసిన బాణాలేమిటి? అవెక్కడెక్కడ తగిలాయి? బాక్సాఫీసుకే తగిలాయా? ఈ సందేహాలు తీర్చుకుందాం...

కథ


  పార్థు (నాగశౌర్య) కి చిన్నప్పట్నుంచీ బాణా లేయడంలో నేర్పు. ఈ విద్య తండ్రి (రవి ప్రకాష్) కుండేది. అతను చనిపోయాక అతడి కలని తీర్చగల వాడుగా మనవడు పార్ధు కన్పిస్తాడు తాత (సచిన్ ఖెడేకర్) కి. ఇక సర్వస్వం ఒడ్డి విలు విద్యలో మనవడ్ని తీర్చి దిద్దుకుంటూ వస్తాడు. మనవడు పార్ధుకి తాత ప్రోత్సాహంతో బాటు, రీతిక (కేతకీ శర్మ) ప్రేమ కూడా లభించడంతో ఆర్చరీలో రాణించి రాష్ట్ర స్థాయి టోర్నమెంట్ గెలుస్తాడు. ఇక అంతర్జాతీయ పోటీలకి సిద్ధమవుతూంటే గుండెపోటుతో తాత చనిపోతాడు. ఈ బాధ తట్టుకోలేక పార్ధు డ్రగ్స్ మరిగి బహిష్కరణకి గురవుతాడు. ఇప్పుడు ఇతడి క్రీడా జీవితం ఏమయిందన్నది మిగతా కథ.

ఎలావుంది కథ

వెండితెర మీద ఆర్చరీతో స్పోర్ట్స్ మూవీ అనేది కాన్సెప్టుగా కొత్తదే. కథ  చూస్తే అదే కొత్త సీసాలో పాత సారా. కాకపోతే సారా బదులు డ్రగ్స్ చూపించారంతే. రొటీన్ టెంప్లెట్ స్పోర్ట్స్ డ్రామా. 1. ఒక గురువు, 2. ఒక శిష్యుడు, 3.శిక్షణ, 4. సమస్యలు, 5. ఒక ప్రత్యర్థి, 6. ప్రత్యర్ధితో ఓటమి, 7. తాజా శిక్షణ, 8. ప్రత్యర్ధి మీద గెలుపు! ...ఈ ఎనిమిది స్టోరీ బీట్స్ ని టెంప్లెట్లో వరుసగా వేసుకుంటూ పోతే స్పోర్ట్స్ మూవీ తయార్. చాలా ఈజీ స్క్రిప్టు తయారీ. ఇంత ఈజీగా దర్శకులు తీసి తీసి విసుగు చెందరేమో గానీ, ప్రేక్షకులకి అంత ఓపిక లేదు. లక్ష్య తో అసలే ఓపిక లేనట్టు ఇంటర్వెల్ కి బయటి కెళ్ళిన ప్రేక్షకులు చాలా మంది వెనక్కి రాక పోవడం ఆందోళన కల్గించే విషయం కాదేమో.

        ఆర్చరీ మీద తొలి సినిమా అన్నాక దీనికి మార్కెట్ యాస్పెక్ట్ పట్టింపు కూడా లేదు. కథా ప్రయోజనం అసలే లేదు. కనీసం కథగా సోల్ కూడా లేని నిర్జీవ నమూనాగా మిగిలింది. వరల్డ్ నంబర్ వన్ ప్రొఫెషనల్ ఆర్చర్ దీపికా కుమారి మీద తీసిన లేడీస్ ఫస్ట్ అనే అద్భుత అవార్డు విన్నింగ్ డాక్యుమెంటరీ తప్ప ఆర్చరీ మీద సినిమా రాలేదు. ఇప్పుడు తెలుగులోనే వచ్చింది. ఆర్చరీ లాంటి ప్రజాకర్షణ లేని పాసివ్ స్పోర్ట్స్ ని ప్రేక్షకుల్లో ప్రమోట్ చేసే ఒక మంచి అవకాశాన్నీ, ఇంకా మాట్లాడితే జాతీయ అవార్డునీ పొంద వచ్చన్న స్పృహ  గానీ లేకుండా కాన్సెప్ట్ ని వృధా చేశారు.

        ఈ సినిమాకి కావాల్సింది కథ కవసరం లేని నాగశౌర్య ఎయిట్ ప్యాక్ కాదు. ఎయిట్ ప్యాక్ లాంటి ప్యాకేజీ వుండాల్సింది ఈ విలు విద్య కథకి. నాగశౌర్య పాత్రకి పార్ధు అనే పేరు పెట్టి వదిలేస్తే కాదు. పురాణాల్లో విలువిద్యతో పార్ధు (అర్జునుడు) కీ, ఏకలవ్యుడుకీ వున్న సంబంధమేమిటో గుర్తు చేస్తూ- ఆర్చరీ పట్ల భావి క్రీడాకారులకి స్ఫూర్తిని, క్రేజ్ నీ రగిలించే ఒక కథా ప్రయోజనం, ఒక మార్కెట్ యాస్పెక్ట్ అవసరం.

        ఆర్చరీ అనే పాయింటుని ఒక క్యారక్టర్ గా తీర్చిదిద్దే హిస్టరీతో, బాక్సాఫీసు అప్పీలుతో, ఆర్చరీయే దైవమన్న భక్తితో - దాని ఎమోషనల్ కంటెంట్ కోసం, సోల్ కోసం  ప్రయత్నించకుండా - అర్ధం లేని చిత్రణలు నాగశౌర్య పాత్రకి ఆపాదించారు. ఆర్చరీతో నాగశౌర్యకి ఏ ఎటాచ్ మెంటూ కనబడదు. అలాటి ఒక్క సీను కూడా లేదు. తాత తోనే ఎటాచ్ మెంట్, పిల్లలతోనే ఎటాచ్ మెంట్, హీరోయిన్ తోనే ఎటాచ్ మెంట్. తాత చనిపోతే ఆ బాధ మరుపుకి డ్రగ్స్ తో మత్తు బానిసవడం, విలన్ తో హింసఏం చెప్తున్నారు ఈ కథతో? ఆర్చరీ క్రీడ చంఢాలమైనదనీ, దాని జోలికి పోకూడదనా? స్ఫూర్తిమంతంగా, ఉత్సాహజనకంగా వుండాల్సిన కథలో ఈ డ్రగ్స్ తో రిపల్సివ్ మూడేంటి?

నటనలు- సాంకేతికలు
నాగశౌర్యది పూర్తిగా పాసివ్ పాత్ర. తాత ఎదురుగా లేకపోతే బాణం వేయలేని పాసివ్ పాత్ర. తాత చనిపోతే డ్రగ్స్ మరిగి పతనమయ్యే విషాద పాసివ్ పాత్ర. సెకండాఫ్ లో జగపతి బాబు వచ్చి లేపి చెప్తేగానీ లక్ష్యం తెలియని పాసివ్ పాత్ర. ఈ కథ నాగశౌర్య క్యారక్టర్ గ్రాఫ్, క్యారక్టర్ గ్రోత్, క్యారక్టర్ స్టడీ గురించైనట్టు. ఈ ప్లాట్ టూల్స్ అన్నీ ప్రధానంగా వుండాల్సింది ఆర్చరీ స్పోర్ట్స్ కి కాదన్నట్టు. ఆర్చరీ కథే కానట్టు, నాగశౌర్య పాత్ర కథే అన్నట్టు! అద్భుత పాత్ర చిత్రణ...

        తాతగా సచిన్ ఖెడేకర్ కూడా కథకుడి చేతిలో కీలుబొమ్మ పాత్ర. నాగశౌర్య పాత్ర డ్రగ్స్ ని మరగాలంటే తాత సడెన్ గా చావాలి. ఈ చావుతో పాపం ఆస్తులమ్మి మనవణ్ణి తీర్చిదిద్దుతున్న తాత మనవణ్ణి వీధిన పడేశాడు. ఈ చావు సానుభూతి నిచ్చేదేనా?

మొదట్లో తండ్రి పాత్ర కూడా, ఆర్చరీ గెలిచొస్తానని తాతకి చెప్పి వెళ్ళే సీను కట్ చేస్తే, నెక్స్ట్ సీన్లో యాక్సిడెంట్లో చనిపోయాడని కబురు! కథ నడపాలంటే సడెన్ చావులు తప్పవన్నమాట!

        ఇక జగపతి బాబు పాత్ర ఎక్కడ్నించి వస్తుందో, ఎందుకొస్తుందో సిల్లీగా వుంటుంది. తను రెండో కృష్ణుడన్నట్టు గురువు నెంబర్ టూ. హీరోయిన్ కేతికా శర్మ పాత్ర కూడా ఎందుకుంటుందో, ఏం చేస్తూంటుందో తెలియదు. గ్యాలరీలో కూర్చుని చప్పట్లు మాత్రం కొడుతుంది. చచ్చిపోతూ తాత హీరోని ఒప్పజెప్పాడని, రెండో కృష్ణుడు వచ్చే వరకూ హీరోకి గార్డియన్ లా వుంటుంది. లేకపోతే వుండదేమో. కానీ హీరో డ్రగ్స్ ఆరగిస్తూంటే తెలియని గార్డుగా సరదాగా వుంటుంది, పారితోషికం ఇస్తున్నందుకు.

        సాంకేతికంగా బలహీనమే. ఆర్చరీ ట్రైనింగు, ఈవెంట్స్, ఆఖరికి వరల్డ్ కాంపిటీషన్ దృశ్యాలూ అపరిపక్వంగా వున్నాయి. కనీసం ఇవైనా ప్రొఫెషనల్ గా వుండి థ్రిల్ చేస్తే ఓ యాక్షన్ మూవీ చూసినట్టయినా వుండేది. హాకీ, ఫుట్ బాల్ ఆటల్లాగా యాక్షన్ ఓరియెంటెడ్ గా వుండదు బాణాలేసే ఆర్చరీ. ప్రత్యర్ధితో నేరుగా తలబడ్డం వుండదు. ఎదురుగా బోర్డు మీద బుల్స్ ఐని నిలబడి గురిచూసి కొట్టడమే వుంటుంది. కానీ బాణాలతో జలదరింప జేసే పోరాట సినిమా లెన్నో వచ్చాయి. పద్మావత్ చూసినా, ఇందులో సింహళ రాకుమార్తె పద్మావత్ పాత్రలో దీపికా పడుకునే, బాణాలతో జింకని వేటాడే ఓపెనింగ్ విజువల్స్ ని ఎవరు మర్చిపోతారు.

చివరికేమిటి

చిన్నప్పట్నుంచీ కథ చూపించారు. తాత- తండ్రి-మనవడుల జీవితం చూపిస్తూ స్పూన్ ఫీడింగ్ చేశారు. ఇదేదో ఫ్యామిలీ కథైనట్టు జానర్ మర్యాద కలుషితం. ఈ బయోగ్రఫీ అంతా, పరిచయమంతా కూడా, స్పోర్ట్స్ జానర్ మర్యాద కింద, బాక్సాఫీసు అప్పీలు కోసం, ఆర్చరీతో వుండాల్సింది. తాతా, కోచింగ్ కి వెళ్తున్నానంటాడు హీరో. తాత దగ్గుతాడు. ఇక హీరో కోచింగ్ కి వెళ్ళే సీను లేకుండా, తాతతో సెంటిమెంటు -ఎటాచ్ మెంటు సీను వచ్చేస్తుంది. ఇలా ఆర్చరీ సీన్లకి పదేపదే తాతా మనవళ్ళ అనుబంధాల సీన్లు, హీరోయిన్ లవ్ సీన్లు, ఆర్చరీలో ప్రత్యర్ధి (విలన్) తో గొడవల సీన్లూ ఆల్టర్నేట్ గా వచ్చి అడ్డుపడుతూంటాయి. కథకుడికి దేనిమీద మక్కువ వుందో ఇలా తెలిసి పోతూంటే ఇంకేం స్పోర్ట్స్ సినిమా చూస్తాం. పైగా ప్రత్యర్ధిని ముందే చూపించడంతో కథేమిటో ఇక్కడే తెలిసిపోతోంది.

        తాత మరణం, హీరో డ్రగ్స్ సేవనం, మత్తులో వున్న హీరో ఇంటర్వెల్ సీన్లో ఈవెంట్ కెళ్ళకుండా విలన్ గ్యాంగ్ దాడి చేసి అడ్డుకోవడం లాంటి రొటీన్ కి, హీరో గాయాలతో తూలుతూ వచ్చి ఈవెంట్ లో బాణం వేసి గెలిచి పడిపోవడం లాంటి ఇంకో రొటీన్ జీవం లేనివిగా వుంటాయి. ఫస్టాఫ్ ఇలా విఫలమయ్యాక, సెకండాఫ్ కథ వదిలేసి హీరో ఎమోషనల్ డ్రామాలతో మరీ ఎక్కడికో వెళ్ళిపోయింది...ఎయిట్ ప్యాక్ ని  కేవలం ఒక రెస్టారెంట్ లో సిల్లీ గొడవకి షర్టు విప్పి చూపించడం. ఈ మైనర్ ఫైట్ కోసమే ఎయిట్ ప్యాక్. ఇలా మొత్తానికి నాగశౌర్య వేసిన బాణం ఇంకో ఫ్లాప్ ని పెంచడానికే పనికొచ్చింది....

—సికిందర్