రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

11, ఫిబ్రవరి 2022, శుక్రవారం

1129 : రివ్యూ!


 రచన- దర్శకత్వం : రమేష్ వర్మ

తారాగణం - రవితేజ, డింపుల్ హయతి, మీనాక్షి చౌదరి, అర్జున్, అనసూయ, వెన్నెల కిషోర్ తదితరులు
సంగీతం - దేవి శ్రీ ప్రసాద్, ఛాయాగ్రహణం : సుజిత్ వాసుదేవ్
బ్యానర్ - హవీష్ ప్రొడక్షన్
నిర్మాత - సత్యనారాయణ కోనేరు
విడుదల : ఫిబ్రవరి11, 2022
***

          డిస్కోరాజా’, క్రాక్ ల తర్వాత మాస్ మహా రాజా రవితేజ చాన్నాళ్లు వూరిస్తూ ఖిలాడీ గా విచ్చేశాడు. తన మార్కు కామెడీతో, యాక్షన్ తో ఫ్యాన్స్ ని వూరడించే ప్రయత్నం చేశాడు. మీనాక్షీ చౌదరి, డింపుల్ హయతి హీరోయిన్లతో కలిసి మాస్- మ్యూజికల్ హంగామా సృష్టించేందుకు విజృంభించాడు. దీనికి దర్శకుడు రమేష్ వర్మ. 2011 లో రవితేజతో వీర తీసిన వర్మ పదేళ్ళ తర్వాత రవితేజతో ఈ రెండో మూవీ తీశాడు. వీర ఫ్లాపయ్యింది. మరిప్పుడు ఖిలాడీ ఎలా వుంది? ఈసారి ఇద్దరూ కలిసి ఏమైనా విజయం సాధించారా, లేక విజయానికి వెయ్యి మైళ్ళ దూరంలో వుండిపోయారా? తెలుసుకుందాం...

కథ

    మోహన్ గాంధీ (రవితేజ) కుటుంబాన్ని చంపుకున్న కేసులో శిక్షపడి జైల్లో వుంటాడు. పూజ (మీనాక్షీ చౌదరి) సైకాలజీ కోర్సు చేస్తూంటుంది. అందులో భాగంగా జైల్లో మోహన్ గాంధీని ఇంటర్వ్యూ చేస్తుంది. అప్పుడు మోహన్ గాంధీ తన కథ చెప్పుకొస్తాడు. అతను రాజశేఖర్ (రావు రమేష్) ఛైర్మన్ గా నడిపే ఆడిటింగ్ కంపెనీకి జనరల్ మేనేజర్ గా వుంటాడు. చిత్ర (డింపుల్ హయతి) ని ప్రేమించి పెళ్ళి చేసుకుంటాడు. చిత్రకి తల్లి చంద్రకళ (అనసూయా భరద్వాజ్), తండ్రి పుట్టపర్తీ (మురళీ శర్మ) వుంటారు. ఇలా వుండగా, రాష్ట్రంలో సీఎం ని దింపేసి తన తండ్రి హోమ్ మంత్రి గురు సింగం (ముఖేష్ రిషి) ని సీఎం చేయాలన్న కుట్రలో భాగంగా ఇటలీ నుంచి పదివేల కోట్లు పంపిస్తాడు గురు సింగం కొడుకు బాలసింగం (నికితిన్ ధీర్). ఆ డబ్బు మిస్ అవుతుంది. ఈ వ్యవహారంలో సీబీఐ ఆఫీసర్ అర్జున్ భరద్వాజ్ (అర్జున్) ఆడిటర్ రాజశేఖర్ ని పట్టుకుంటే, గురుసింగం రాజశేఖర్ ని చంపించేసి, మోహన్ గాందీని పట్టుకుని, డబ్బెక్కడుందో చెప్పాలంటూ బెదిరిస్తాడు. చెప్పక పోవడంతో మోహన్ గాంధీ కుటుంబాన్ని చంపించేసి  ఆ నేరం మోహన్ గాంధీ మీదేసి  జైలుకి పంపించేస్తాడు.

        ఇలా తన కథ చెప్పుకొచ్చిన మోహన్ గాంధీని బెయిల్ మీద విడిపిస్తుంది పూజా. అప్పుడు తెలుస్తుంది ఈ మోహన్ గాంధీ డూప్ చేశాడనీ, ఇతను వేరే నేరాల్లో అరెస్టయిన ఇంటర్నేషనల్ ఖిలాడీ అనీ తెలుసుకుని షాక్ తింటుంది. ఈ ఖిలాడీ ఎవరు, ఇతడి కథ ఏమిటి, జైల్లోంచి బయటపడి ఆ పదివేల కోట్ల కోసం ఏం ఎత్తులేశాడన్నది మిగతా కథ.  

ఎలావుంది కథ

    ఈ కథ చెప్తూంటేనే సిల్లీ కథ అని తెలిసిపోతుంది. రమేష్ వర్మ ఈ కథ చెప్పడం, రవితేజ వెంటనే ఓకే చేయడం ఎలా జరిగిందో అర్ధం గాదు. ఈ కథ మీద నిర్మాత కోనేరు సత్యనారాయణ భారీగా పెట్టుబడి పెట్టడమేమిటో అసలే అర్ధం గాదు- ఇది 1.5 రేటింగ్ కి మించని కథ. కట్టుకథ!

        కట్టుకథ ఎందుకంటే, ఫస్టాఫ్ లో ఇంటర్వెల్ వరకూ  రవితేజ చెప్పే మోహన్ గాందీ కథంతా ఒట్టిదే. నిజంగా జరగలేదు, కట్టు కథ చెప్పాడు. కట్టు కథ చెప్పాడని ఇంటర్వెల్లో తెలుస్తుంది. కాబట్టి ఫస్టాఫ్ లో ఆ సీన్లూ, పాత్రలూ ప్రతీదీ హంబక్కే. ప్రేక్షకులు ఫూల్స్ అయ్యామని, చీటింగ్ కి గురయ్యామనీ ఫీలవ్వడమే.

        ఇదొక ఎత్తైతే, ఇక సెకండాఫ్ లో ఖిలాడీగా రవితేజ ఇచ్చే ట్విస్టు మీద ట్విస్టులు ఫాలో అవలేక కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడం ఒకెత్తూ! సెకండాఫ్ కథ దర్శకుడికైనా అర్ధమైందో లేదో?

        మొత్తానికి రవితేజ- రమేష్ వర్మలు కలిసి విజయానికి వెయ్యి మైళ్ళు కాదు, కొన్ని కాంతి సంవత్సరాలు దూరంగా వుండిపోయే కథ పట్టుకొచ్చి క్లాస్- మాస్ నెత్తిన కొట్టేశారు!

నటనలు- సాంకేతికాలు

కాసేపు ఫస్టాఫ్ కట్టు కథన్నది పక్కన బెట్టి చూస్తే, చూపించిన ఆ కామెడీ కథనమంతా కూడా ఎక్కడా వర్కౌట్ కాలేదు. వెన్నెల కిషోర్ కామెడీతో రవితేజ జనరల్ మేనేజర్ పాత్ర కూడా వర్కౌట్ కాలేదు. ఇక డింపుల్ హయతీతో లవ్ ట్రాక్, ఆమె పేరెంట్స్ అనసూయా మురళీ శర్మలతో కామెడీ, ఏదీ పుట్టించాల్సిన నవ్వు పుట్టించ లేకపోవడం ట్రాజడీ. పాటలు, ఆ పాటల్లో డింపుల్ హయతీ ఎక్స్ పోజింగ్, సెకండాఫ్ లో ఆమె బికినీ షో, ఇవే మాస్ కి నచ్చేలా వున్నాయి రవితేజ ఫైట్స్ సహా.

        ట్రైలర్ చూస్తే డబుల్ షేడ్స్ టో రవితేజ హై వోల్టేజ్ యాక్షన్ డ్రామాగా అద్భుతంగా వుంటుంది. సినిమా చూస్తే లోగ్రేడ్ క్వాలిటీ. అంత హై వోల్టేజ్ యాక్షన్ కూడా లేదు.

        హీరోయిన్లిద్దరూ స్కిన్ షోకి వొకరూ, సింప్లిసిటీకి ఒకరూ అన్నట్టుగా మాత్రం బాగా కుదిరారు. ఈ ఖిలాడీ ఆటలో ఇద్దరికీ బోలెడు పని వున్న పాత్రలే దక్కాయి. ఆట ఎంత గందరగోళంగా వుందన్నది వేరే విషయం. ఇక సీబీఐ ఆఫీసర్ గా అర్జున్ అయోమయ పాత్ర. ఖిలాడీని ఎన్నిసార్లు అరెస్టు చేసే అవకాశమొచ్చినా చేయలేక పోతాడు- ఈమాత్రపు కథ అక్కడితో అరెస్టయి పోతుందన్నట్టుగా. అరెస్ట్ చేయకుండా రమేష్ వర్మ అడ్డు తగుల్తూ అర్జున్ ని అరెస్ట్ చేస్తూ పోయాడు- ఖిలాడీని మీరు అరెస్ట్ చేసేస్తే నా అద్భుత కథ ఏం కావాలని!

        రమేష్ వర్మ అద్భుత కథ అంతా- అంత  అద్భుత పోస్ట్ ప్రొడక్షన్ తో కూడా వుంది. పబ్లిసిటీ డిజైనర్ అయిన తను- కనీసం డీఐ క్వాలిటీ అయినా చూసుకోకూడదా? ఇక ఆరు మాస్ పాటలిచ్చిన దేవీశ్రీ ప్రసాద్, ఈ పాటలన్నీ అరగంటలో చేసేశానన్నాడు కాబట్టి- ఇవెంత అరకొర మ్యూజిక్ తోవున్నా, అర్ధంగాని ట్విస్టుల మధ్య ఈ పాటలే కాస్త ప్రాణవాయువులు అనుకుని అరకేజీ తృప్తి పడాలి. అన్నట్టు థియేటర్లో మార్నింగ్ షోకి చాలా పొదుపుగా ప్రేక్షకులున్నారు- దూరం దూరంగా కూర్చుని...144 సెక్షన్ విధించినట్టు.    

—సికిందర్ 

1128 : రివ్యూ!


 

రచన- దర్శకత్వం : కార్తీక్ సుబ్బరాజ్
తారాగణం : విక్రమ్
, ధృవ్ విక్రమ్, సిమ్రాన్, సనంత్, బాబీ సింహా, వెట్టాయ్ ముత్తుకుమార్, ఆడుకాలం నరేన్ తదితరులు
సంగీతం :  సంతోష్ నారాయణ్
, ఛాయాగ్రహణం : శ్రేయాస్ కృష్ణ
బ్యానర్ : సెవెన్ స్క్రీన్ స్టూడియో
నిర్మాత : ఎస్ ఎస్ లలిత్ కుమార్
విడుదల : 10 ఫిబ్రవరి 2022 (అమెజాన్ ప్రైమ్)
***

        చియాన్ విక్రమ్ 2019 లో మిస్టర్ కేకే’, ఆదిత్య వర్మ ల తర్వాత మూడేళ్ళు విరామం తీసుకుని మహాన్ తో వచ్చాడు. ఆదిత్య వర్మ (అర్జున్ రెడ్డి) లో కొడుకు ధృవ్ విక్రమ్ ని హీరోగా పరిచయం చేస్తూ తను కూడా నటించాడు. ఇది ఫ్లాపయ్యాక తిరిగి ఇప్పుడు కొడుకుతో మహాన్ నటించాడు. తండ్రీ కొడుకుల కాంబినేషన్ ఫ్యాన్స్ కి హుషారు పుట్టించింది. దీనికి కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం కూడా ఆకర్షణ తీసుకు వచ్చింది. 8 సినిమాల దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్, 2021 లో జగమే తందిరం తీసి ఫ్లాపయ్యాడు. జగమే తందిరం’, దీనికి ముందు జిగర్తాండా లలాగే మహాన్ తో కూడా ఇప్పుడు గ్యాంగ్ స్టర్ మూవీనే ప్రయత్నించాడు.

        ఇందులో హీరోయిన్ లేకపోవడం ఒక ప్రత్యేకత. కొడుక్కి హీరోయిన్ లేకపోతే ఫ్యాన్స్ ఎలా ఫీలవుతారనే ఆలోచనకి దూరంగా, తండ్రీ కొడుకుల సెటిల్ మెంట్ కథని హీరోయిన్ తో డిస్టర్బ్ చేయకూడదన్న ఉద్దేశంతో నాన్ హీరోయిన్ మూవీగానే ఫ్యాన్స్ మీద ప్రయోగించాడు విక్రమ్. అలాగే ఈ గ్యాంగ్ స్టర్ మూవీతో ఫ్యాన్స్ కి  థియేటర్ అనుభవాన్ని కూడా దూరం చేస్తూ ఓటీటీ విడుదలకి సిద్ధపడ్డాడు. ఫ్యాన్స్ తో కోరి ఇన్ని రిస్కులు  తీసుకున్న విక్రమ్- ధృవ్- సుబ్బరాజ్ త్రయం చివరికి సాధించిందేమిటి? ఏమైనా చెప్పుకోదగ్గ ఘనత సాధించారా? లేక చతికిలబడి మావల్ల కాదన్నారా? ఈ అమూల్య విషయాలు తెలుసుకుందాం... 

కథ

1968 లో గాంధీ మహాన్ (విక్రమ్) చిన్నపిల్లాడు. తండ్రి మోహన్ దాస్ (ఆడుకాలం నరేన్) స్వాతంత్ర్య పోరాటం చేసిన వాడు, తాత కూడా స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్న గాంధీ భక్తుడు. అందుకని కొడుక్కి గాంధీ మహాన్ అని పేరు పెట్టుకుని గాంధీ ఆదర్శాలతో పెంచే ప్రయత్నం చేస్తాడు మోహన్ దాస్. కానీ కొడుకు సారాబట్టీ నడిపే వాడి కొడుకుతో స్నేహం చేసి, జూదం మద్యం అలవాటు చేసుకుంటాడు. మద్య నిషేధ పోరాటం చేస్తున్న మోహన్ దాస్ దృష్టికి ఇది వచ్చి కొడుకుని కొడతాడు. ఇక అలాటి పనులు చెయ్యనని మాటిస్తాడు కొడుకు గాంధీ మహాన్.

        అలా నలభై ఏళ్ళ వయాసొచ్చేదాకా గాంధేయ మార్గంలో వున్న గాంధీ మహాన్ అలియాస్ మహాన్, లెక్చరర్ గా వుంటాడు. నాచి (అంటే తమిళంలో నిప్పు- నటి   సిమ్రాన్) ని పెళ్ళి చేసుకుని కొడుకుతో వుంటాడు. అయితే తనకి గాంధీ పేరుండడం వల్ల ఆదర్శాలతో గాంధీ భారాన్ని ఇక మోయలేక పోతాడు. 41 వ పుట్టిన్రోజుకి ఏమైనా సరే ఆదర్శాల్ని తెంపి పారేసి ఎంజాయ్ చేయాలని బార్ కెళ్ళి తాగేస్తాడు, పేకాట ఆడేస్తాడు. తీరా చూస్తే ఆ బార్ కమ్ పేకాట డెన్ ఓనర్ చిన్నప్పుడు సారాబట్టీ ఓనర్ కొడుకు సత్యమే (బాబీ సింహా). తన ఫ్రెండే.

        భర్త బార్ కెళ్ళి తాగాడని తెలుసుకున్న నాచి, కొడుకుని తీసుకుని గుడ్ బై కొట్టేసి తండ్రి దగ్గరి కెళ్ళిపోతుంది. ఇక రాదు. మహాన్ సత్యంతో చేయి కలిపి ఇక మద్యం సామ్రాజ్యాన్ని స్థాపిస్తాడు. గ్యాంబ్లింగ్ కేసినో ప్రారంభిస్తాడు. సత్యం కొడుకు రాకేష్ (సనంత్), ని సొంత కొడుకులా చూసుకుంటాడు. బాగా డబ్బు సంపాదించి ఎక్కడో పెరుగుతున్న సొంత కొడుకు దాదా భాయ్ నౌరోజీ (ధృవ్ విక్రమ్) కి ఆ డబ్బంతా ఇవ్వాలని నిర్ణయించుకుంటాడు. కానీ కొడుకు దాదాభాయ్ నౌరోజీ అలియాస్ దాదా, పోలీస్ అధికారిగా వచ్చి మద్యం సిండికేట్ పనిబట్టడం మొదలెడతాడు. దీంతో తండ్రీ కొడుకుల మధ్య ఘర్షణ మొదలైపోతుంది. ఒకానొక క్లిష్ట సమయంలో తను సొంత కొడుకు దాదా వైపుండాలా, లేక పెంపుడు కొడుకు రాకేష్ వైపు వుండాలా తేల్చుకోలేక పోతాడు మహాన్. ఏ నిర్ణయం తీసుకున్నా తీవ్ర పరిణామాలే పొంచి వుంటాయి. ఇలా మహాన్ ఏ నిర్ణయం తీసుకుంటే ఏం జరిగిందన్నది మిగతా కథ.  

ఎలావుంది కథ

తప్పు చేయడానిక్కూడా స్వాతంత్ర్యం లేకపోతే అది స్వాతంత్ర్యమే కాదన్న మహాత్మా గాంధీ వాక్కు ఆధారంగా సిద్ధం చేసుకున్న కథ. వాక్కు ఎటో పోయింది, కథ ఎటో పోయింది. మధ్య మనం ఎటూ కాకుండా ఆలోచిస్తూ. వాక్కు సంగతెలా వున్నా, ఈ రెండు గంటలా 48 నిమిషాల అతి భారమైన నిడివిలో మనం దేవులాడుకునేది కనీసం గాంధీయిజమైనా ఎక్కడైనా వుందాని.

        తండ్రి గాంధీయిజాన్ని తుంగలో తొక్కి లిక్కర్ గ్యాంగ్ స్టర్ అయ్యాడు. తల్లీ తాతా కలిసి గాంధీ ఆదర్శాలతోనే పెంచిన కొడుకూ పోలీసాఫీసర్ గా అడ్డగోలు ఎన్ కౌంటర్లు చేసే స్తూ హింసావాదిగా తేలాడు. ఇక తండ్రీ కొడుకుల మధ్య ఆదర్శాల సంఘర్షణైనా ఎక్కడుంది. ఇద్దరి ఆదర్శాలొకటే. హింసతో ఇద్దరూ దారితప్పిన వాళ్ళే. ఇలాటి కథకి గాంధీయిజపు పూత ఎందుకు.

        ఇద్దరూ దారి తప్పిన వాళ్ళయినప్పుడు కనీసం గాంధీయిజం కోసం తపించే తల్లి పాత్రయినా తండ్రీ కొడుకుల్ని దారికి తెచ్చే కేటలిస్ట్ పాత్రగా వుండుంటే ఆ గాంధీయిజమంతా కథకి ఓ కేంద్ర స్థానం వహిస్తూ కాన్సెప్ట్ క్యారీ అయ్యేది. ఇది కూడా జరగలేదు. తల్లి పాత్రకి ప్రాధాన్యమే లేదు. చివరికి తేలేదేమంటే, ఇగోలతో శత్రువులు గా మారిన తండ్రీ కొడుకుల మధ్య సెంటిమెంటల్ సెటిల్మెంటే. దీనికి  కూడా పగదీర్చుకునే ముగింపే. చెడుని నిర్మూలించడానికి ఆయుధాలు చేపడితే జరిగేది రెండు దుష్ట శక్తుల మధ్య యుద్ధమే- అన్న గాంధీ సూక్తి లాగా తేలింది కథ. ఈ సూక్తి ప్రకారమైతే ఇద్దరూ చావాలి. ఇది కూడా జరగలేదు.

        తప్పు చేయడానిక్కూడా స్వాతంత్ర్యం లేకపోతే అది స్వాతంత్ర్యమే కాదన్న కొటేషన్ తండ్రి పాత్రకే వర్తిస్తుంది. తండ్రే చెప్తాడీ మాట చివరికి. అయితే ఇందులోంచి కూడా నేర్చుకున్నదేమీ లేదు, మార్చుకున్నదేమీ లేదు. పరిపూర్ణతని సాధించలేదు కథ.

        ఇక మద్య నిషేధం సంగతి. 1968 పూర్వ కథలో మద్య నిషేధమంటే కన్విన్సింగ్ గానే గానే వుంటుంది ఆ కాలాన్ని బట్టి. ఇప్పుడు ఈ కాలంలో మధ్య నిషేధ మేమిటి? మద్యమనేది స్టూడెంట్స్ దగ్గర్నుంచీ ఎందరికో తాగి పారేసే వేల కోట్ల రూపాయల ప్రభుత్వాదాయ వనరుగా, నిత్యావసర వస్తువుగా మారేకా? గృహిణుల కాడ్నించీ అందరూ కామన్ గా తీసుకుంటున్నాక? ఒక వీడియో అనుకోకుండా చూడడమైంది. ప్రఖ్యాత హిందీ గీత రచయిత ఆనంద్ బక్షీ విదేశంలో ఇండియన్స్ కిచ్చిన ప్రోగ్రాంలో ఒక గ్లాసులో మద్యం, నోట్లో సిగరెట్ పెట్టుకుని పాటలు పాడుతూ కన్పించాడు. ఎవరూ అభ్యంతరం చెప్పలేదు. లేడీస్ కూడా కామన్ గా తీసుకున్నారు. ఇది 1980 ల నాటి సంగతి.

        ఇది మద్య నిషేధపు కథ కాక, మాదక ద్రవ్యాల నిషేధ కథైవుంటే సరిపోయేది. కానీ ఇలా ఇటు మద్యానికి కాకుండా, అటు గాంధీకీ కాకుండా పోయింది కథ.

నటనలు – సాంకేతికాలు

చియాన్ విక్రమ్ మహాన్ గా ఎలాటి ఓవరాక్షన్ లేకుండా రియలిస్టిక్ నటన కనబర్చాడు. సరదాగా ప్రారంభమై సీరియస్ గా మారి, యమ సీరియస్ గా సాగే పాత్ర పరిణామ క్రమాన్ని బాగా రికార్డు చేశాడు. అతడికి పదే పదే వేర్వేరు నైతిక ప్రశ్నలు- వాటి తాలూకు సంఘర్షణలూ ఎదురవుతూంటాయి. తనకీ కొడుక్కీ మధ్య, తనకీ పెంపుడు కొడుక్కీ మధ్య, తనకీ స్నేహితుడు సత్యం కీ మధ్య, తనకీ భార్యకీ మధ్య, చివరికి తనకీ ఇంకో చిన్ననాటి స్నేహితుడే మంత్రికీ మధ్య ...ఒకదాని తర్వాతొకటి ఈ నాల్గు  డోలాయమాన స్థితుల మధ్య వూగిసలాటే ఈ పాత్రకి. ఇవన్నీ బాగా పోషించాడు బాధాతప్త హృదయం గల పాత్రగా.

        కొడుకు పాత్రలో ధృవ్ విక్రమ్ కూడా పకడ్బందీ పాత్రపోషణ, డైలాగ్ డెలివరీ చేశాడు. అయితే ఈ పోలీసు పాత్ర ఎన్ కౌంటర్లతో హింసకి పాల్పడే పాత్ర కావడంతో- తల్లీ తాతల గాంధేయవాద పెంపకం అర్ధం లేకుండా పోయింది. ఎంతసేపూ తండ్రి గ్యాంగునీ, తండ్రి పెంచుకున్న కొడుకునీ చంపుతూ, పగ సాధించేందుకు తండ్రిని వేటాడుతూ వుండే అర్ధం లేని పాత్ర చిత్రణొకటి పంటి కింద రాయిలా వుంటుంది. ఎంత పోలీసైనా అహింసకి కట్టుబడి తండ్రిని మార్చే కాంట్రాస్ట్ పాత్రగా వుంటే -  తండ్రీ కొడుకుల హింస- అహింసల పోరాటంగా కథకి స్పష్టత వచ్చేది. గాంధీయిజం ప్లే అయ్యేది.

        మెంటల్ కొడుకు పాత్రకి 1825-1917 మధ్య కాలపు  పార్శీ మతానికి  చెందిన విద్యావేత్త, మేధావి, పత్తి వ్యాపారి, తొలితరం రాజకీయ, సామాజిక నాయకుడైన, మహనీయుడైన దాదాభాయ్ నౌరోజీ పేరెందుకో అర్ధంగాదు!

        తల్లి పాత్రలో సిమ్రాన్ కన్పించేది కాసేపే. ఈ పాత్ర చిత్రణ కూడా కుదర్లేదు. భర్త ఒకసారి తాగాడని కొడుకుని తీసుకుని నీకూ నాకూ రామ్ రామ్ అనేసి వెళ్ళిపోవడం కన్విన్సింగ్ గా వుండదు. నలభై ఏళ్ళూ ఓపిక బట్టుకుని, తను పుట్టిన ఘన కార్యానికి నలభై ఒకటో పుట్టిన్రోజున ఏదో కాస్త తాగితే సంసారం వదిలేసి వెళ్ళి పోవడమేనా? ఈమె ఇలా వెళ్ళిపోయిందన్న కసితోనే  కావచ్చు- అతను ఏకంగా మద్యం సామ్రాజ్యమే  ఏర్పాటు చేసుకుని కూర్చున్నాడు!  

        స్నేహితుడు సత్యంగా బాబీ సింహా పాత్ర చిత్రణ మాత్రం కుదిరింది. బాగానే నటించాడు. ఇంకో స్నేహితుడు మంత్రి జ్ఞానోదయం పాత్రలో వెట్టాయ్ ముత్తుకుమార్ ఫైనల్ విలన్ గా వుంటాడు. బలహీన విలన్.

        సంతోష్ నారాయణ్ సంగీతంలో ఏడు పాటలున్నాయి. ఏడూ బ్యాక్ గ్రౌండ్ లో వచ్చే థీమ్ సాంగ్సే. ఈ సాంగ్స్ మారుతున్న కథాకాలంతో శైలి మార్చుకుంటూ సాగుతూంటాయి. ఈ డార్క్ మూవీకి శ్రేయాస్ కృష్ణ ఛాయాగ్రహణం ఎఫెక్ట్స్ వరకూ బావుంది గానీ, కెమెరా కథా కథనాల్లో పాలు పంచుకోలేదు. దీన్ని కథ అనకూడదు, గాథ అనాలి. గాథ అయినప్పుడు కెమెరాతో గాథ చెప్పలేదు. కలంతో చెప్పుకుంటూ పోయారు. దీంతో యాక్షన్ తక్కువ, డైలాగులు ఎక్కువగా- డైలాగ్స్ సీన్సే సోది చెప్తున్నట్టు సాగుతూంటాయి సుదీర్ఘంగా.  

చివరి కేమిటి?

ఇది కథకాదు, గాథ. ఇందులో ఒక ప్రథాన కాన్ఫ్లిక్ట్ చుట్టూ కథనముండదు. పైన చెప్పుకున్నట్టు తండ్రికి ఇతరులతో చిన్న చిన్న కాన్ఫ్లిక్ట్స్ వచ్చి పోతూ వుంటాయి. పాత్ర పాసివ్ గానూ వుంటుంది, యాక్టివ్ గానూ మారుతూంటుంది. ఫస్టాఫ్ అంతా ఒక టెంప్లెట్. 1968 నుంచీ తండ్రి జీవీతం ఎలా మారుతూ వచ్చిందో చెప్పే డాక్యుమెంటరీ టెంప్లెట్. ఈ ఫస్టాఫ్ లో ప్రత్యర్ధి పాత్ర వుండదు. తండ్రి లిక్కర్ మాఫియాగా ఎలా ఎదిగాడో చెప్పే ఏకపక్ష కథనమే వుంటుంది గంటా 20 నిమిషాలూ. పుష్ప లో స్మగ్లర్ గా ఎలా ఎదిగాడో టెంప్లెట్ లో చెప్పినట్టుగా. ఇప్పుడు ఇంటర్వెల్ సీన్లో కొడుకు వస్తే గానీ ప్రత్యర్ధి ఏర్పాటు కాడు. ఫలితంగా ఈ ఫస్టాఫ్ అంతా విషయం లేక బోరు కొట్టే అవకాశముంటుంది.

        పోనీ ఇంటర్వెల్ తర్వాతైనా వెంటనే కొడుకుతో కాన్ఫ్లిక్ట్ కూడా ప్రారంభం కాదు. ఫస్టాఫ్ లో తండ్రి చిన్నప్పట్నుంచీ ఎలా సీన్లు చూపించారో, మళ్ళీ ఇప్పుడు కొడుకు చిన్నప్పట్నుంచీ తల్లి దగ్గర ఎలా పెరిగి పోలీసాఫీసర్ అయ్యాడో- ట్రైనింగు సహా స్పూన్ ఫీడింగ్ చేసే ఫ్లాష్ బ్యాక్ సీన్లు. ఇంకో ఇరవై నిమిషాలు తీసుకుని ఇది పూర్తయితే గానీ, ఫస్ట్ యాక్ట్ పూర్తయి సెకెండ్ యాక్ట్ లో పడదు గాథ. అంటే ఇంటర్వెల్ మీదుగా గంటా 40 నిమిషాల వరకూ కాన్ఫ్లిక్ట్ స్టార్ట్ అవకుండా, ఫస్ట్ యాక్టే సాగుతుందన్న మాట దీని దుంప తెగ!

        ఇక కొడుకు సహా పైన చెప్పుకున్న వివిధ పాత్రలతో వివిధ కాన్ఫ్లిక్ట్స్ వచ్చిపోతూంటాయి తండ్రికి. ఒక్కో కాన్ఫ్లిక్ట్ ఒకే బారెడు పదీ పదిహేను నిమిషాల సేపూ సాగే  డైలాగ్స్ సీన్లు. ఇలా సెకండ్ యాక్ట్ నుంచీ థర్డ్ యాక్ట్ ఎండ్ వరకూ కేవలం ఐదారు సీన్లుంటాయి - ఆస్కార్ విన్నర్ స్క్రీన్ ప్లే దేర్ విల్ బి బ్లడ్ లోలాగా. కానీ దేర్ విల్ బి బ్లడ్ గాథ స్క్రీన్ ప్లే స్ట్రక్చర్ ని చూసి అర్ధం జేసుకుని మహాన్ ని తీసివుంటే, కార్తీక్ సుబ్బరాజ్ గ్రేట్ మూవీని ఇచ్చి వుండేవాడు. సినిమాలో మంచి విషయముంది. దీన్ని సోదిలా చెప్పడంతో ఓ గ్లాసు మందు కొట్టినట్టూ, లేదా ఓ గాంధీతో  క్లాసు పీకించుకున్నట్టూ కాకుండా పోయింది!

—సికిందర్