రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

11, ఫిబ్రవరి 2022, శుక్రవారం

1129 : రివ్యూ!


 రచన- దర్శకత్వం : రమేష్ వర్మ

తారాగణం - రవితేజ, డింపుల్ హయతి, మీనాక్షి చౌదరి, అర్జున్, అనసూయ, వెన్నెల కిషోర్ తదితరులు
సంగీతం - దేవి శ్రీ ప్రసాద్, ఛాయాగ్రహణం : సుజిత్ వాసుదేవ్
బ్యానర్ - హవీష్ ప్రొడక్షన్
నిర్మాత - సత్యనారాయణ కోనేరు
విడుదల : ఫిబ్రవరి11, 2022
***

          డిస్కోరాజా’, క్రాక్ ల తర్వాత మాస్ మహా రాజా రవితేజ చాన్నాళ్లు వూరిస్తూ ఖిలాడీ గా విచ్చేశాడు. తన మార్కు కామెడీతో, యాక్షన్ తో ఫ్యాన్స్ ని వూరడించే ప్రయత్నం చేశాడు. మీనాక్షీ చౌదరి, డింపుల్ హయతి హీరోయిన్లతో కలిసి మాస్- మ్యూజికల్ హంగామా సృష్టించేందుకు విజృంభించాడు. దీనికి దర్శకుడు రమేష్ వర్మ. 2011 లో రవితేజతో వీర తీసిన వర్మ పదేళ్ళ తర్వాత రవితేజతో ఈ రెండో మూవీ తీశాడు. వీర ఫ్లాపయ్యింది. మరిప్పుడు ఖిలాడీ ఎలా వుంది? ఈసారి ఇద్దరూ కలిసి ఏమైనా విజయం సాధించారా, లేక విజయానికి వెయ్యి మైళ్ళ దూరంలో వుండిపోయారా? తెలుసుకుందాం...

కథ

    మోహన్ గాంధీ (రవితేజ) కుటుంబాన్ని చంపుకున్న కేసులో శిక్షపడి జైల్లో వుంటాడు. పూజ (మీనాక్షీ చౌదరి) సైకాలజీ కోర్సు చేస్తూంటుంది. అందులో భాగంగా జైల్లో మోహన్ గాంధీని ఇంటర్వ్యూ చేస్తుంది. అప్పుడు మోహన్ గాంధీ తన కథ చెప్పుకొస్తాడు. అతను రాజశేఖర్ (రావు రమేష్) ఛైర్మన్ గా నడిపే ఆడిటింగ్ కంపెనీకి జనరల్ మేనేజర్ గా వుంటాడు. చిత్ర (డింపుల్ హయతి) ని ప్రేమించి పెళ్ళి చేసుకుంటాడు. చిత్రకి తల్లి చంద్రకళ (అనసూయా భరద్వాజ్), తండ్రి పుట్టపర్తీ (మురళీ శర్మ) వుంటారు. ఇలా వుండగా, రాష్ట్రంలో సీఎం ని దింపేసి తన తండ్రి హోమ్ మంత్రి గురు సింగం (ముఖేష్ రిషి) ని సీఎం చేయాలన్న కుట్రలో భాగంగా ఇటలీ నుంచి పదివేల కోట్లు పంపిస్తాడు గురు సింగం కొడుకు బాలసింగం (నికితిన్ ధీర్). ఆ డబ్బు మిస్ అవుతుంది. ఈ వ్యవహారంలో సీబీఐ ఆఫీసర్ అర్జున్ భరద్వాజ్ (అర్జున్) ఆడిటర్ రాజశేఖర్ ని పట్టుకుంటే, గురుసింగం రాజశేఖర్ ని చంపించేసి, మోహన్ గాందీని పట్టుకుని, డబ్బెక్కడుందో చెప్పాలంటూ బెదిరిస్తాడు. చెప్పక పోవడంతో మోహన్ గాంధీ కుటుంబాన్ని చంపించేసి  ఆ నేరం మోహన్ గాంధీ మీదేసి  జైలుకి పంపించేస్తాడు.

        ఇలా తన కథ చెప్పుకొచ్చిన మోహన్ గాంధీని బెయిల్ మీద విడిపిస్తుంది పూజా. అప్పుడు తెలుస్తుంది ఈ మోహన్ గాంధీ డూప్ చేశాడనీ, ఇతను వేరే నేరాల్లో అరెస్టయిన ఇంటర్నేషనల్ ఖిలాడీ అనీ తెలుసుకుని షాక్ తింటుంది. ఈ ఖిలాడీ ఎవరు, ఇతడి కథ ఏమిటి, జైల్లోంచి బయటపడి ఆ పదివేల కోట్ల కోసం ఏం ఎత్తులేశాడన్నది మిగతా కథ.  

ఎలావుంది కథ

    ఈ కథ చెప్తూంటేనే సిల్లీ కథ అని తెలిసిపోతుంది. రమేష్ వర్మ ఈ కథ చెప్పడం, రవితేజ వెంటనే ఓకే చేయడం ఎలా జరిగిందో అర్ధం గాదు. ఈ కథ మీద నిర్మాత కోనేరు సత్యనారాయణ భారీగా పెట్టుబడి పెట్టడమేమిటో అసలే అర్ధం గాదు- ఇది 1.5 రేటింగ్ కి మించని కథ. కట్టుకథ!

        కట్టుకథ ఎందుకంటే, ఫస్టాఫ్ లో ఇంటర్వెల్ వరకూ  రవితేజ చెప్పే మోహన్ గాందీ కథంతా ఒట్టిదే. నిజంగా జరగలేదు, కట్టు కథ చెప్పాడు. కట్టు కథ చెప్పాడని ఇంటర్వెల్లో తెలుస్తుంది. కాబట్టి ఫస్టాఫ్ లో ఆ సీన్లూ, పాత్రలూ ప్రతీదీ హంబక్కే. ప్రేక్షకులు ఫూల్స్ అయ్యామని, చీటింగ్ కి గురయ్యామనీ ఫీలవ్వడమే.

        ఇదొక ఎత్తైతే, ఇక సెకండాఫ్ లో ఖిలాడీగా రవితేజ ఇచ్చే ట్విస్టు మీద ట్విస్టులు ఫాలో అవలేక కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడం ఒకెత్తూ! సెకండాఫ్ కథ దర్శకుడికైనా అర్ధమైందో లేదో?

        మొత్తానికి రవితేజ- రమేష్ వర్మలు కలిసి విజయానికి వెయ్యి మైళ్ళు కాదు, కొన్ని కాంతి సంవత్సరాలు దూరంగా వుండిపోయే కథ పట్టుకొచ్చి క్లాస్- మాస్ నెత్తిన కొట్టేశారు!

నటనలు- సాంకేతికాలు

కాసేపు ఫస్టాఫ్ కట్టు కథన్నది పక్కన బెట్టి చూస్తే, చూపించిన ఆ కామెడీ కథనమంతా కూడా ఎక్కడా వర్కౌట్ కాలేదు. వెన్నెల కిషోర్ కామెడీతో రవితేజ జనరల్ మేనేజర్ పాత్ర కూడా వర్కౌట్ కాలేదు. ఇక డింపుల్ హయతీతో లవ్ ట్రాక్, ఆమె పేరెంట్స్ అనసూయా మురళీ శర్మలతో కామెడీ, ఏదీ పుట్టించాల్సిన నవ్వు పుట్టించ లేకపోవడం ట్రాజడీ. పాటలు, ఆ పాటల్లో డింపుల్ హయతీ ఎక్స్ పోజింగ్, సెకండాఫ్ లో ఆమె బికినీ షో, ఇవే మాస్ కి నచ్చేలా వున్నాయి రవితేజ ఫైట్స్ సహా.

        ట్రైలర్ చూస్తే డబుల్ షేడ్స్ టో రవితేజ హై వోల్టేజ్ యాక్షన్ డ్రామాగా అద్భుతంగా వుంటుంది. సినిమా చూస్తే లోగ్రేడ్ క్వాలిటీ. అంత హై వోల్టేజ్ యాక్షన్ కూడా లేదు.

        హీరోయిన్లిద్దరూ స్కిన్ షోకి వొకరూ, సింప్లిసిటీకి ఒకరూ అన్నట్టుగా మాత్రం బాగా కుదిరారు. ఈ ఖిలాడీ ఆటలో ఇద్దరికీ బోలెడు పని వున్న పాత్రలే దక్కాయి. ఆట ఎంత గందరగోళంగా వుందన్నది వేరే విషయం. ఇక సీబీఐ ఆఫీసర్ గా అర్జున్ అయోమయ పాత్ర. ఖిలాడీని ఎన్నిసార్లు అరెస్టు చేసే అవకాశమొచ్చినా చేయలేక పోతాడు- ఈమాత్రపు కథ అక్కడితో అరెస్టయి పోతుందన్నట్టుగా. అరెస్ట్ చేయకుండా రమేష్ వర్మ అడ్డు తగుల్తూ అర్జున్ ని అరెస్ట్ చేస్తూ పోయాడు- ఖిలాడీని మీరు అరెస్ట్ చేసేస్తే నా అద్భుత కథ ఏం కావాలని!

        రమేష్ వర్మ అద్భుత కథ అంతా- అంత  అద్భుత పోస్ట్ ప్రొడక్షన్ తో కూడా వుంది. పబ్లిసిటీ డిజైనర్ అయిన తను- కనీసం డీఐ క్వాలిటీ అయినా చూసుకోకూడదా? ఇక ఆరు మాస్ పాటలిచ్చిన దేవీశ్రీ ప్రసాద్, ఈ పాటలన్నీ అరగంటలో చేసేశానన్నాడు కాబట్టి- ఇవెంత అరకొర మ్యూజిక్ తోవున్నా, అర్ధంగాని ట్విస్టుల మధ్య ఈ పాటలే కాస్త ప్రాణవాయువులు అనుకుని అరకేజీ తృప్తి పడాలి. అన్నట్టు థియేటర్లో మార్నింగ్ షోకి చాలా పొదుపుగా ప్రేక్షకులున్నారు- దూరం దూరంగా కూర్చుని...144 సెక్షన్ విధించినట్టు.    

—సికిందర్