రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

29, జూన్ 2021, మంగళవారం

1049 : రివ్యూ


 

(సారీ రీడర్స్, పూర్తి కాలం ఒక పని మీద వుండడంతో బ్లాగుకి కొంత విరామమివ్వక తప్పలేదు)

రచన – దర్శకత్వం : విజే గోపీనాథ్
తారాగణం : వెట్రి, మోనికా చిన్నకొట్ల, కరుణాకరన్, రోహిణి, మైమ్ గోపీ తదితరులు
కథ : బాబూ తమిళ, సంగీతం : కె ఎస్ సుందరమూర్తి, ఛాయాగ్రహణం : ప్రవీణ్ కుమార్
బ్యానర్ : వెట్రి వేల్ శరవణ సినిమాస్, బిగ్ ప్రింట్ ప్రొడక్షన్
నిర్మాతలు : ఎం. వేలా పాండియన్, ఎస్, వేలా పాండియన్, సుబ్రహ్మణ్యన్ వేలా పాండియన్
విడుదల : జూన్ 28, 2019,  ఆహా విడుదల : జూన్ 25, 2021

        మిళంలో 2019 లో విడుదలైన జీవి (మేధావి) తెలుగు డబ్బింగ్ ఆహా లో విడుదలయింది. వెట్రి హీరో. విజే గోపీనాథ్ కొత్త దర్శకుడు. ఇతను కొత్త తరహా కథతో సినిమా తీసుకొచ్చాడు. సారూప్యతా సిద్ధాంతమని చెప్పి దాని ఆధారంగా సస్పెన్స్ థ్రిల్లర్ తీశాడు. సారూప్యతా సిద్ధాంతమంటే ఏమిటి? దీన్నెలా తీశాడు? ప్రేక్షకులకి అర్ధమయ్యేట్టు తీశాడా? మేధో ప్రదర్శన చేశాడా? ఒకసారి చూద్దాం...

కథ


        ఎనిమిదో తరగతితో చదువాపేసిన శ్రీనివాస్ (వెట్రి) వూళ్ళో  ఆవారాగా వుంటాడు. దౌర్జన్యాలు చేస్తూంటాడు. తల్లి తిడుతుంది, తండ్రి వెనకేసుకొస్తాడు. ఓ చెల్లెలు వుంటుంది. అతను చదువాపేసినా, వివిధ విషయాలు తెలుసుకోవాలన్న కుతూహలంతో వుంటాడు. దాంతో పుస్తకాలెక్కువ చదువుతాడు. ఇంతలో తండ్రి ఆరోగ్యం పాడవడంతో ఇంట్లో వొత్తిడికి పని చేసుకోక తప్పని పరిస్థితి వస్తుంది. హైదారాబాద్ వచ్చి జ్యూస్ షాపులో చేరతాడు. అదే షాపులో మణి (కరుణాకరన్) టీ అమ్ముతూంటాడు. ఇద్దరూ మిత్రులవుతారు ఒకే ఇంట్లో అద్దెకుంటారు. ఆ ఇంటి యజమానురాలు లక్ష్మి (రోహిణి). ఈమె భర్త మంచాన పడి వుంటాడు, కూతురు అంధురాలు.

ఇలా వుండగా, జ్యూస్ షాపు ఎదురుగా మొబైల్ షాపులో ఆనంది (మోనికా చిన్నకొట్ల) పని చేస్తూంటుంది. ఈమెతో ప్రేమలో పడతాడు. ఈమెకి వేరే పెళ్ళి నిశ్చయమవడంతో అటు మొగ్గుతుంది. సంపాదన ఏమీ లేని ఇతడికంటే ఆ సంబంధమే ఆమెకి నచ్చి వెళ్ళిపోతుంది. దీంతో తీవ్ర బాధకి లోనై, డబ్బు సంపాదన గురించి ఆలోచిస్తాడు. ఇంటి యజమానురాలు లక్ష్మి, కూతురి పెళ్ళికి దాచిన నగలు కొట్టేయాలని మిత్రుడు మణితో కలిసి పథకమేస్తాడు. ఆ నగలు కొట్టేస్తాడు. దీంతో కొన్ని సంఘటనలు జరగడం ప్రారంభమవుతాయి. గతంలో లక్ష్మి జీవితంలో జరిగిన సంఘటనలే ఇప్పుడు తన జీవితంలో జరుగుతూంటాయి. కంగారు పడతాడు. ఎందుకిలా జరుగుతోంది? ఈమె జీ వితానికీ, తన జీవితానికీ ఏమిటి సంబంధం? ఈ రహస్యం తెలుసుకోవడానికి పూను కుంటాడు...

ఎలావుంది కథ

      మల్టీపుల్ టైమ్ లైన్ తరహాకి చెందిన సస్పెన్స్ థ్రిల్లర్ జానర్ కథ. అయితే వేర్వేరు కాలాల్లో జరిగే మల్టీపుల్ టైమ్ లైన్లో కథలు హైపర్ లింక్ కథల్లాగా ఈ ప్రక్రియలో ఎక్కడా కనెక్ట్ కావు. కానీ సంఘటనలు, భావోద్వేగాలు, అంతరార్ధాలూ ఒకేలా వుంటాయి. దీంతో ప్రేక్షకులు ఈ ప్రపంచంలో మనుషులంతా తెలియకుండానే కనెక్ట్ అయివుంటారని ఫీలవుతారు. ఐతే కర్మ సిద్ధాంతం పని చేసినప్పుడు ఆ జీవితాలూ సంఘటనలూ ఒక బిందువు దగ్గర కనెక్ట్ అయి, తెలియని రహస్యం బయటపెట్టి, పెండింగులో వున్న నిష్కృతిని కోరుతాయి. ఇది గ్రహించి నిష్కృతి చేసుకోక పోతే, సంఘటనల చట్రాన్ని ఆపెయ్యక పోతే, పరిణామాలు మరింత సంక్షోభానికి దారితీస్తాయి. దీన్ని సారూప్యతా సిద్ధాంతమన్నాడు దర్శకుడు.

        ఈ కథలో ఇంటి యజమానురాలు లక్ష్మి తో బాటు, ఆమె తమ్ముడి జీవితంలో సంఘటనల్లాంటివి శ్రీనివాస్ జీవితంలో ప్రారంభమవుతాయి. లక్ష్మి ఇంట్లో తను చేసిన దొంగతనం లాగే, గతంలో కిరణ్ చేసిన ఒక దొంగతనం వుంటుంది. ఈ గతాన్ని పూర్తిగా తెలుసుకుంటే తప్ప పరిష్కార మార్గం కన్పించేలా లేదు. ఇంకోటేమిటంటే, గతంలో లక్ష్మి జీవితంలో జరిగిన విషాద సంఘటలు, ఇప్పుడు శ్రీనివాస్ చెల్లెలికీ జరుగుతూండడంతో- దీన్నాపడానికి- చట్రాన్ని త్రుంచెయ్యడానికి - చదువు మానేసిన ఒక జీవి (జీనియస్) గా ఏం చేశాడన్నదే ఈ విధితో పోరాట కథ.

        విద్యార్హతల్లేక పోయినా బ్రతుకు పోరాటంతో బాటు, కాస్త లౌకిక జ్ఞానాన్ని పెంచుకునే పఠనాసక్తిని కలిగి వుంటే, మూఢ నమ్మకాలతో బాబాల చుట్టూ తిరగకుండా, తార్కిక శక్తితో సమస్యల్ని పరిష్కరించుకో గలరన్న సందేశం - ఈ కథ ద్వారా ప్రేక్షకుల్లోకి వెళ్ళింది. 

నటనలు- సాంకేతికాలు

         వెట్రి (అంటే విజయమని అర్ధం) ఈ మేధావి పాత్రని మేధావిలా ఫోజు కొట్టకుండా, ఓవరాక్షన్ లేకుండా, సామాన్య ప్రేక్షకులకి దగ్గరయ్యేలా అణిగిమణిగి పాత్రలో లీనమై నటించాడు. సారూప్యతా సిద్ధాంతాన్ని కూడా సామాన్య భాషలో సులభంగా అర్ధమయ్యేలా - ఒకే రకమైన సంఘటనలు వేర్వేరు కుటుంబాల్లో వేర్వేరు కాలాల్లో జరుగుతూంటాయి. అవెన్ని తరాలపాటు కొనసాగుతాయో ఎవరూ చెప్పలేరు. అవి కొనసాగకుండా ఆపడానికి ఏదో వొక పాయింటులో ఆ చైన్ ని బ్రేక్ చేయాలి అని వివరిస్తాడు.

        విద్యార్హతలు లేకపోయినా వివిధ విషయాలు తెలుసుకోవాలన్న కుతూహలమనే డైనమిక్స్, దాంతో పుస్తక పఠనం, రొటీన్ ఆవారా పాత్ర టెంప్లెట్ ని విరిచేసి, ఈ పాత్రని విజిబుల్ గా మార్చాయి. పుస్తకాలు చదివే అలవాటుంటే సమూహంలో విలువ పెరుగుతుంది -గ్రాడ్యుయేషన్ చేశారా, నిరక్షర కుక్షిగా రిక్షా తోలుతున్నారా నిమిత్తం లేకుండా. వెట్రి పుస్తక జ్ఞానంతోనే పోలీసులకి దొరక్కుండా దొంగతనమెలా చేయాలో పకడ్బందీగా చేస్తాడు. చేశాక పోలీసు విచారణని తప్పుదోవ పట్టించే చిట్కాలు కూడా ప్రయోగిస్తాడు. ఒక పెద్ద మనిషిలా కన్పించే పోలీసు ఇన్ఫార్మర్  దగ్గర గుట్టుగా కూపీ లాగుతూ.

        ఐతే వూళ్ళో వున్నపుడు విద్యాభ్యాసం గురించి చులకనగా మాట్లాడి, కొత్త పరికరాలు కనుగొనడానికి చదువక్కర్లేదంటాడు. కానీ నగరానికి వచ్చి జీవితంలో పైకి రావడానికి కొత్త పరికరమేదో కనిపెట్టకుండా దొంగతనానికి దిగజారతాడు. అంత పుస్తక జ్ఞానమున్న వాడు ప్రేమించే అమ్మాయిని పోగొట్టుకుని డిస్టర్బ్ అయిపోతాడు. జ్ఞానాన్ని సమస్యలు ఓడిస్తాయా? ఇలా కథనం కోసం పాత్ర చిత్రణని బలి చేశారు. పుస్తకాభిలాషి నేరాలెందుకు చేస్తాడనేదీ ప్రశ్నే. క్రైమ్ ఫిక్షన్ చదివే వాడైతే అర్ధం జేసుకోవచ్చు. ఆర్గానిక్ గా వున్న ఈ ఇంటలిజెంట్ కథకి ఇంటలిజెంట్ రైటింగ్ వుంటే బావుంటుంది. సింథటిక్ రైటింగ్ మూస ఫార్ములాకి చెల్లిపోవచ్చు-ఏదోలే పోనీ అని మనం సర్దుకుని చూడ్డానికి.  

        వెట్రి నటించిన అతి టెర్రిఫిక్ సీను, పట్టపగలు లక్ష్మి ఇంట్లోకి వెళ్ళి బీరువాలో నగలు దొంగిలించే సీను. ముత్యాల ముగ్గు లో నూతన్ ప్రసాద్ సంగీత గదిలోకి దూరి కుట్రకి పునాది వేసే టెర్రిఫిక్ సీనుని గుర్తుకి తెస్తుంది. ఒక విషయం గమనిస్తే, మాస్టర్ ప్లానుతో క్రైమ్ ఎలిమెంటు వున్న కుటుంబ కథలు నిలబడ్డాయి. ఈ విషయం బ్లాగులో ఒకటి రెండు సార్లు చెప్పుకున్నాం.

        ఆనంది జస్ట్ కరివేపాకు పాత్ర పోషించింది. ఈ పాత్ర వెట్రి డబ్బు సంపాదన పైపు, తద్వారా దొంగతనం వైపూ మళ్ళేందుకు కారణమయ్యే ఉత్ప్రేరక పాత్రగా పనిచేసి కథలోంచి తప్పుకుంది. మణిగా నటించిన కరుణాకరన్, ప్రేక్షకులకొచ్చే సందేహాలడిగే ఎక్స్ ప్లోరర్ పాత్రగా యాక్టివ్ గా వుంటాడు. ఇంటి యజమానురాలు లక్ష్మిగా రోహిణికి మంచి పాత్ర లభించింది. అద్దెకున్నవాళ్ళని బంధువులుగా నమ్మి ఆదరించే హూందా పాత్ర, కీలక పాత్ర.           

     మూడు మాంటేజ్ సాంగ్స్ వున్నాయి. ఒకటి రోమాంటిక్, రెండు థీమ్ సాంగ్స్. ఇవి మామూలుగా వున్నాయి. బిజీఎమ్ కూడా సాధారణమే. కెమెరావర్క్ తో లోబడ్జెట్ అన్పించకుండా కవరైంది. అయితే హీరో అద్దెకున్న ఫ్లాట్, లక్ష్మి ఫ్లాట్ అపార్ట్ మెంట్ కి తగ్గట్టు ఇంటీరియర్స్ వుండవు. ఈ ఇంటీరియర్స్ ని వేరే ఎక్కడో పాత ఇంట్లో చీట్ చేసినట్టు వుంటాయి. ఇక తమిళ ఒరిజినల్లోని చెన్నై డబ్బింగు వెర్షన్లో హైదారాబాద్ అయింది. ఆటోవాలా మణికొండ అని అరవడం బాగానే వుంది. కానీ ఇంకో ఆటోవాడు అలకాపురి అని అరవడం నవ్వు తెప్పిస్తుంది. హైదారాబాద్ లో మణికొండ ఏ మూలవుంది, అలాకాపురి ఏ మూల వుంది? 30 కిలో మీటర్ల దూరం!

చివరికేమిటి


     ఫస్టాఫ్ హీరో హైదారాబాద్ లో గతాన్ని తల్చుకుంటూ వుంటే వూళ్ళో జీవితం ఫ్లాష్ బ్యాక్స్ లో వస్తూంటుంది. తర్వాత హైదారాబాద్ లో జ్యూస్ షాపులో పని, హీరోయిన్ తో ప్రేమ, బ్రేకప్, దొంగతనం ప్లాను, దొంగతనం, లక్ష్మి గతంతో పోలికా తెలిసి సమస్యలో పడ్డంతో గంట సమయంలో ఇంటర్వెల్ వస్తుంది. వూళ్ళో జీవితం, హీరోయిన్ తో ప్రేమా ఇవన్నీ రిపీట్ చేసిన మూస ఫార్ములా సీన్లుగా వుంటాయి. ఈ ఫస్టాఫ్ లో దొంగతనానికి దిగడం ప్లాట్ పాయింట్ వన్ గా వస్తుంది.

                  ఇంటర్వెల్ తర్వాత సెకండాఫ్ లో ఇన్స్ పెక్టర్ విచారణ, వేధింపులు, దొరక్కుండా హీరో ఎత్తుగడలూ వచ్చి, లక్ష్మి జోక్యంతో పోలీసు విచారణ ఆగిపోతుంది. సెకండాఫ్ ప్రారంభంలోనే లక్ష్మి తమ్ముడు కిరణ్ వచ్చి, హీరోని అనుమానించే దృశ్యాలూ వస్తాయి. అతడి మాటల్లో హీరోకేదో క్లూ దొరికి, నిడదవోలులో అతడి గత జీవితం తెలుసుకోవడంతో ప్లాట్ పాయింట్ టూ వస్తుంది. ఇలా సంఘటనల మర్మం తెలుసుకున్నాక తన జీవితంలో సంఘటల్ని ఆపడానికి ఉపక్రమించడంతో క్లయిమాక్స్ వస్తుంది.

        ఇందులో హీరోకి ప్రత్యర్ధి ఎవరూ లేరు, లక్ష్మి ప్రత్యర్ది కాదు, ప్రత్యర్ధిగా కన్పించే ఇన్స్ పెక్టర్ పాత్ర సమాప్త మవుతుంది. విధియే హీరో ప్రత్యర్ధి. అందుకే క్లయిమాక్స్ పరిస్థితిని చక్కదిద్దే చర్యల కారణంగా సంఘర్షణ లేక, థ్రిల్లింగ్ గా వుండక, హీరో పక్షంగా సాదాగా ముగిసిపోతుంది. ఈ ముగింపు కథా పరంగా సందేహాలు మిగలకుండా రౌండప్ అయిపోతుంది.

        ఫస్టాఫ్ లో దొంగతనాన్ని ప్లాను చేసే దగ్గర్నుంచి, కథ ముగింపు వరకూ కథనం బిగి సడలకుండా నిర్వహించాడు దర్శకుడు. కథా సౌలభ్యంకోసం ఇంటలిజెంట్ రైటింగ్ ని అక్కడక్కడా వదిలేశాడు. తెచ్చి పెట్టుకున్న కాకతాళీయాలు కల్పించాడు. హీరో దొంగతనం చేయాలనుకున్నాక అతడికి తాళం చెవి దొరికే దృశ్యాలు ఈజీగా కల్పించేశాడు. ఆమె బైక్ మీంచి పడి తాళం చెవి పోగొట్టుకోవడం, అక్కడికి నడుచుకుంటూ వస్తున్న హీరోకి ఆ తాళం చెవి దొరకడం లాంటివి.

        మూస ఆవారా పాత్ర హీరో పుస్తకాలు చదివే అలవాటుతో ఇంటలిజెంట్ గానే వున్నాడు. దర్శకుడు, రచయిత ఈ రియలిస్టిక్ జానర్ తో కుదరదనుకున్న చోటల్లా రాజీ పడి, ఫార్ములా సీన్లు- రియలిస్టిక్ సీన్లుగా ఈ స్క్రీన్ ప్లే తయారు చేశారు. సగటు ప్రేక్షకుడికి కూడా అర్ధమయ్యేలా సంఘటనలతో కాన్సెప్ట్ ని వివరించడమే కథని నిలబెట్టింది.
సికిందర్