రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Monday, October 22, 2018

696 : స్క్రీన్ ప్లే సంగతులు


4
          దొంగరాముడులో నేటి అట్టర్ ఫ్లాప్ స్క్రిప్టుల్లో  రిపీటవుతున్నతప్పుల్లో ఓ మూడు తప్పులకి తరుణోపాయముంది. మిడ్ ఫ్రాక్చర్లు, సెకండాఫ్ సిండ్రోములు, స్టార్ట్ అండ్ స్టాప్ టెక్నిక్ లనే మూడు చీడపురుగులు మాంచి మాంచి స్టార్ కాస్ట్ వున్న సినిమాలని సైతం ఎలా దొలిచేసి డొల్లగా మారుస్తున్నాయో ఆయా సినిమాలు విడుదలైనప్పుడల్లా చెప్పుకుంటూ వచ్చాం. కానీ విరుగుడుకి స్ట్రక్చర్ నే ఆశ్రయించాం. ఇలాటి చీడ పట్టిన స్క్రిప్టుల్లో స్ట్రక్చర్ ప్రకారం కథ ఏకశిలా సదృశంగా వుండాల్సిందేనని నివారణ చెప్పుకున్నాం. ఐతే ప్రతీ చీడకీ స్ట్రక్చర్ తోనే చికిత్స వుండక్కర్లేదని దొంగరాముడు చెప్తోంది. శాశ్వతమైన స్ట్రక్చర్ లోపల చలనశీలమైన కథనంతో పాల్పడే క్రియేటివిటీలు అనేకం. ఈ క్రియేటివిటీలు వికటించడం వల్లే చీడలు పట్టి పల్లారుస్తున్నాయి. క్రియేటివిటీలు వికటించకుండా వుండాలంటే ముందు స్ట్రక్చర్ తెలిసి వుండాలి. దురదృష్టవశాత్తూ ఈ శతాబ్దం అరంభంనుంచీ - అంటే 2000 నుంచీ వస్తున్నఅత్యధిక శాతం మంది దర్శకులు / రచయితలు స్ట్రక్చరాశ్యులు కాలేకపోతున్నారు. అందువల్ల వాళ్ళ కేవల క్రియేటివిటీలు వికటాట్ట హాసం చేస్తూ ఫ్లాపుల బాట పడుతున్నాయి. దొంగరాముడు స్ట్రక్చర్ లో వుంటూనే  క్రియేటివ్ విన్యాసాలు విభిన్నంగా చేస్తోంది. అందువల్ల స్ట్రక్చర్ సహిత క్రియేటివ్ విన్యాసాల్లో కూడా చీడపీడలకి నివారణోపాయాలు కన్పిస్తున్నాయి. ఇవేమిటో తర్వాత చూద్దాం. ముందు మిడిల్ - 2 ఎలా వుందో పరిశీలిద్దాం...

         
 వ్యాసంలో వివరించుకున్న  మిడిల్ -1 ముగింపులో,  మళ్ళీ దొంగరాముడు చట్టానికి దొరికిపోయే విషాదాన్ని చూశాం. ఇప్పుడు మిడిల్ – 2, అంటే ఇంటర్వెల్ తర్వాత కథ కొస్తే, ఈ విషాదాన్ని ఏకరువు పెట్టే పాటతో మొదలవుతుంది. దొంగరాముడు జైల్లో వుంటాడు, చెల్లెలు లక్ష్మి అనాధాశ్రమం నుంచి సర్దుకుని వెళ్ళిపోతుంది. ఉద్యోగ ప్రయత్నం చేసి విఫలమవుతుంది. వాహనం కోసం రోడ్డు మీద నిలబడి ఎదురు చూస్తూంటే, వేశ్య అనుకుని ఒకడు బేరమాడబోతాడు. పరుగెత్తుకుని పోయి వర్షంలో షెడ్డు కింద నిలబడితే, వీధి రౌడీ బాబుల్ గాడు కన్నేస్తాడు.

          బాబుల్ గాడు బలవంతం చేస్తూంటే, సీత వచ్చి కాపాడి లక్ష్మిని తనింటికి తీసి కెళ్తుంది. లక్ష్మికి జ్వరం పట్టుకుంటే వెళ్లి డాక్టర్ మోహన్రావుని (జగ్గయ్య ఎంట్రీ) తీసుకొచ్చి చూపిస్తుంది. అటు జైల్లో వున్న రాముడుకి లక్ష్మి ఆత్మహత్య చేసుకున్నట్టు కలొచ్చి వణికిపోతాడు. ఇటు సీత, లక్ష్మీ వెళ్లి డాక్టర్ మోహన్రావుని కలుస్తారు. మోహన్రావుకి జబ్బుతో తీసుకుంటున్న తల్లి వుంటుంది, భార్య చనిపోయిన లాయర్ అన్న వుంటాడు, అతడి చిన్న పిల్ల లిద్దరుంటారు. మోహన్రావు తల్లికి చికిత్స చేస్తూంటే, లక్ష్మి చొరవ తీసుకుని సపర్యలు చేస్తూంటుంది. అమ్మకి తగ్గేదాకా ఇక్కడే వుంటానని మోహన్రావుకి  చెప్తుంది. 

         వంటింట్లో తిన్నది అరక్క వంటవాడు, డ్రైవర్ కొట్టుకు చస్తూంటే మోహన్రావు అన్న వాళ్లిద్దర్నీ వెళ్లగొట్టేస్తాడు. దీంతో వంట బాధ్యత లక్ష్మి తీసుకుంటుంది. పిల్లల్ని తయారు చేసి స్కూలుకి పంపుతుంది. ఇలా రోజులు గడుస్తూండగా, ఒక రోజు మోహన్రావు ఫోటో ముందు లక్ష్మి పూలు పెడుతూంటే, వచ్చి చూసి సరస సంభాషణ చేస్తాడు మోహన్రావు. ఆమె తలలో పువ్వు పెడతాడు. 

          జైలు నుంచి రాముడు విడుదలవుతాడు. అతను అనాధాశ్రమానికి వెళ్తే ఉత్తరం రాసిపెట్టి ఎక్కడికో వెళ్ళిపోయిందని చెప్తాడు వాచ్ మన్. ఇక చచ్చి పోయిందని నమ్మేసి సీత ఇంటికెళ్తాడు. పోపో, నీతో మాట్లాడను - అనేస్తుంది సీత. చేసిన తప్పులకి క్షమాపణ చెప్పుకోవడానికి వచ్చానని అంటాడు. తన తప్పుల ఫలితంగా లక్ష్మి ఆత్మహత్య చేసుకుందనీ, తనే పొట్టనబెట్టుకున్నాననీ అంటాడు – నన్ను నమ్ముకున్నోళ్ళందరి గొంతులు కోయమని దేవుడు నా మొహాన రాసి పెట్టాడు, ఈ పాపిష్టి వాడి నీడ తగిల్తే పచ్చి గడ్డి కూడా భగ్గుమంటుంది – అని వాపోతాడు. చెల్లెలి కోసం ఏ పరిస్థితుల్లో ఆనాడు రాంబాబులా నటించి మోసం చేయాల్సి
వచ్చిందో చెప్పేసి వెళ్లిపోతూంటాడు. సీత ఆపుతుంది. 

         
ఇటు వడ్డీ వ్యాపారి భద్రయ్యకి డాక్టర్ మోహన్రావుని అల్లుడిగా చేసుకోవాలనుంటుంది. ఈ విషయమే వచ్చి మోహన్రావు అన్న దగ్గర కదుపుతాడు. లక్ష కట్నం అడుగుతాడు మోహన్రావు అన్న. కళ్ళు తేలేస్తాడు భద్రయ్య. రాముడు రోడ్డు మీద నడుచుకుంటూ పోతూంటే, కారు పంక్చరై నిలబడి వుంటాడు మోహన్రావు. రాముడు టైరు మార్చేసి మోహన్రావుని  కార్లో కూర్చోబెట్టుకుని నడుపుకుంటూ ఇంటికి చేరేస్తాడు. అక్కడే కారు డ్రైవర్ గా జాయినై పోతాడు.

          మోహన్రావు అన్న భద్రయ్య తెచ్చిన సంబంధం గురించి మోహన్రావుకి చెప్తాడు. మోహన్రావు లక్ష్మినే  చేసుకుంటానంటాడు. దాంతో అన్నతో తేడా వస్తుంది. తల్లి వచ్చి లక్ష్మి మంచిదని మోహన్రావునే సమర్ధిస్తుంది. లక్ష్మి పిల్లల్ని స్కూలుకి తయారుచేస్తూ పాట పాడుతూంటే, బయట రాముడు విని గొంతు గుర్తు పడతాడు. లక్ష్మి చనిపోలేదనీ, ఇక్కడే వుందనీ తెలుసుకుని ఆనందిస్తాడు. 

      ఇంతలో పిల్లాడు సోఫా ఎక్కితే సోఫా మీదున్న వాచీ జారి అటు కింద పడిపోతుంది. లక్ష్మి పిల్లలతో బయటికి వచ్చి కారు దగ్గరున్న రాముణ్ణి చూసి మాటరాక నిలబడి పోతుంది. ఆమెనీ పిల్లల్నీ తీసుకుని కారులో స్కూలుకి బయల్దేరతాడు. స్కూలు దగ్గర ఆమెకి చెప్తాడు – తాము అన్నా చెల్లెళ్ళన్న సంగతి ఇంట్లో తెలియ నివ్వద్దని, ఇప్పుడే తను వెళ్లిపోతాననీ. మోహన్రావు దగ్గరి కెళ్ళి ఉద్యోగం మానేస్తానంటాడు. ఇంతలో వాచీ కనపడక మోహన్రావు అన్న కంగారుపడుతూంటాడు. అప్పుడే భద్రయ్య వచ్చి రాముణ్ణి చూసి చిందులేస్తాడు. తనింట్లో దొంగతనం చేసి జైలు కెళ్ళింది వీడేనని చెప్పేస్తాడు. వాచీ దొంగతనం రాముడి మీద పడుతుంది. మోహన్రావు అన్న పోలీసుల్ని పిలవమంటాడు. మోహన్రావు ఆపి, ఇందుకేనా ఉద్యోగం మానేస్తానన్నావని రాముణ్ణి వెళ్ళగొట్టేస్తాడు. లక్ష్మి ఏమీ చేయలేక తల్లడిల్లుతుంది. 

          రాముడు వెళ్ళిపోయి బాబుల్ గాడి గానా బజానాలో కూర్చుంటాడు. సరైన చోటుకే వచ్చావనీ, తన ముఠాలో చేరిపొమ్మనీ అంటాడు బాబుల్ గాడు. ఇది సీత చూస్తుంది. అవతల లక్ష్మితో మోహన్రావు పెళ్లి ముహూర్తాలు పెట్టుకుంటారు. లక్ష్మికి మంచి నగ కొనివ్వాలనుకుంటాడు రాముడు. సీతతో షాపు కెళ్తాడు. వంద రూపాయల నగ కొనాలంటే చాలా కష్టపడాలని, రకరకాల పనులు చేసి ఆ వందా సంపాదించి నగ కొంటాడు. 

          గుడి దగ్గర భద్రయ్య సీతతో రాముడి చెల్లెలు లక్ష్మిని చూసి అర్ధమైపోయి, ఈ పెళ్లి ఎలా జరుగుతుందో చూస్తానని ఒంటి కాలిమీద లేస్తాడు. సీత వచ్చి రాముడికి ఈ సంగతి చెప్తుంది. రాముడు కత్తి తీసుకుని బయల్దేరుతాడు. లక్ష్మి గురించి నోరు విప్పితే పొడిచి పారేస్తానని భద్రయ్యని హెచ్చరిస్తాడు. చెల్లెలి పెళ్ళయేదాకా యిల్లు కదలకుండా ఇక్కడే కాపలా వుంటానంటాడు. భద్రయ్య కిక్కురుమనకుండా పడుంటాడు. 

          రాత్రి వరకూ కాపలా కాసిన రాముడికి, లక్ష్మికి నగ ఇవ్వాలన్న విషయం గుర్తుకొస్తుంది. భద్రయ్య ఇంటి ముందు తనలాగే కన్పించే దిష్టి బొమ్మ పెట్టి వెళ్తాడు. పెళ్ళిలో రహస్యంగా లక్ష్మికి నగ పెట్టి దీవిస్తాడు. భద్రయ్య వుండబట్టలేక బయటికి వచ్చి, దిష్టి బొమ్మని రాముడే అనుకుని బ్యారుమని ఇంట్లో కెళ్ళి పడుకుంటాడు. అటు పెళ్ళిలో రాముడు షేర్వానీ, చుడీదార్ వేసుకుని జడ్జిలా నటిస్తూ వచ్చి, గతంలో తనని పట్టుకున్న పోలీసు అధికారి పక్కనే కూర్చుంటాడు. పెళ్లి పీటల మీద లక్ష్మి ఇది చూసి ఆనందిస్తుంది. 

          అటు భద్రయ్య మళ్ళీ వుండబట్టలేక బయటికొచ్చి, అప్పుడది దిష్టి బొమ్మని తెలుసుకుని చీల్చి చెండాడుతూంటే, వెనుక నుంచి బాబుల్ గాడు ఇంట్లోకి దూరుతాడు. దర్జాగా ఇనప్పెట్టె ఖాళీ చేస్తూంటే వచ్చేసి మీద పడతాడు భద్రయ్య. ఆ పెనుగులాటలో భద్రయ్య వీపులో బాబుల్ గాడి కత్తి కసిక్కున దిగుతుంది. 

          ఇక కొనప్రాణాలతో వున్న భద్రయ్య తనని పొడిచింది రాముడేనని చెప్పి చనిపోతాడు. అదే సమయంలో మళ్ళీ కాపలా కొచ్చిన రాముడు, ఇది చూసి పారిపోతూంటే పోలీసులు వెంటాడి పట్టుకుంటారు. రాముడి మీద భద్రయ్య హత్య కేసు పెట్టి అరెస్టు చే స్తారు.
***
        ఇదీ మిడిల్ – 2 లో విషయం, దాని కథనం. మిడిల్ -2 ఇంటర్వెల్ తర్వాత సాగే మిడిల్ విభాగపు మలి కథనమేనని తెలిసిందే. ఇప్పుడు చూస్తే, బిగినింగ్ విభాగపు ముగింపులో  చిన్నరాముడు దొంగగా బాల నేరస్థుల కేంద్రాని కెళ్ళడాన్ని చూశాం. దీని తర్వాత మిడిల్ -1 ముగింపు చూస్తే, పెద్ద రాముడు మళ్ళీ దొంగగా జైలుకెళ్లడాన్ని చూశాం. ఇప్పుడు మిడిల్ – 2 కి ముగింపుగా కూడా రాముడు హత్య కేసులో అరెస్టవడాన్నే  చూస్తున్నాం. 

          స్ట్రక్చర్ పరంగా ఇవి మొదటిది ప్లాట్ పాయింట్ -1 గా, రెండోది మిడ్ పాయింట్ (ఇంటర్వెల్) గా, మూడోది ప్లాట్ పాయింట్ – 2 గా ఏర్పాటవడాన్ని గమనించ వచ్చు. ఒకే రకమైన మలుపులతో మూడు మూలస్థంభాలు. ఇవి రిపిటీషన్ గానే అన్పిస్తాయి. మూడు సార్లు కథ అరెస్టవడం దగ్గరే ముగింపుకొచ్చి, మళ్ళీ కొత్తగా మొదలవుతున్నట్టే వుంటుంది. దీంతో ఇవి మూడు క్లయిమాక్సులన్న పేరు కూడా వచ్చింది. మూడు కాదు, నాల్గు క్లయిమాక్సులున్నాయి, తర్వాత వచ్చే అసలు ముగింపుతో కలుపుకుంటే. ఐతే ఇవి అలాటి కథాపరమైన క్లయిమాక్సులేనా? కాదు. ఇవి నిజానికి అంకాల (యాక్ట్స్)పరమైన క్లయిమాక్సులు. మొదటి అంకం బిగినింగ్, రెండో అంకం మిడిల్, మూడో అంకం వచ్చేసి ఎండ్ గా చెప్పుకున్నప్పుడు  – ఇవి అంకాల పరమైన క్లయిమాక్సులే అవుతాయి తప్ప, కథాపరమైన క్లయిమాక్సులు కావు. కథాపరమైన క్లయిమాక్సు లెలా వుంటాయో తర్వాత చూద్దాం. అంటే మొదటి అంకానికి ప్లాట్ పాయింట్ -1 క్లయిమాక్స్ అనీ, రెండో అంకానికి ప్లాట్ పాయింట్ -2 క్లయిమాక్స్ అనీ,  అలాగే మూడో అంకానికి ముగింపు క్లయిమాక్స్ అనీ టెక్నికల్ గా చెప్తారు. వాడుకలో ప్లాట్ పాయింట్స్ అనే మాట్లాడుకుంటారు. 

          ఉదాహరణ చెప్పుకుంటే ‘శివ’ బిగినింగ్ కథనం సాగి సాగి, నాగార్జున సైకిల్ చైనుతో జేడీని కొట్టడంతో క్లయిమాక్స్ కి వస్తుంది. ఇది బిగినింగ్ కి క్లయిమాక్స్, అంటే ప్లాట్ పాయింట్ -1. అదన్న మాట. ఇలాగే దొంగరాముడులో చిన్న రాముడు రెండ్రూపాయలు కొట్టేసి బాలనేరస్థుల కేంద్రంలో పడ్డం ఆ బిగినింగ్ విభాగపు క్లయిమాక్స్. తర్వాత పెద్ద రాముడు చెల్లెలి కోసం దొంగతనం చేసి జైలుకెళ్ళడం మిడిల్ -1 క్లయిమాక్స్, అలాగే చేయని హత్యకి రాముడు అరెస్టవడం మిడిల్ – 2 క్లయిమాక్స్ అయ్యాయి. కాబట్టి ఇవి విడివిడి కథలు, వాటి విడివిడి క్లయిమాక్సులూ కావు. కథ ఒక్కటే వుంది, చెల్లెలి కోసం తాపత్రయం గురించి. ఇదే పాయింటు అంకాల్లో ఎడతెగకుండా ప్రవహిస్తోంది. ఎత్తుకున్న పాయింటు అంకాల్లో ఎడతెగకుండా ప్రవహిస్తూంటే అది కథాపరమైన పాయింటు అవుతుంది. ఈ కథాపరమైన పాయింటు అంకాల పరంగా చిన్నచిన్న క్లయిమాక్సులు ఏర్పాటు చేసుకుంటూ సాగుతుంది. చిట్టచివరికి మొత్తం కాన్సెప్ట్ కీ ముగింపుగా గ్రాండ్ షోడవున్ గా శుభం వేస్తుంది. ఈ శుభంకల్లా కాన్సెప్ట్ లో వుండే కథనపరమైనవే గాక, పాత్ర చిత్రణ పరమైన అన్ని సెటప్స్ కొలిక్కి వస్తూ పేఆఫ్ అయిపోతాయి. ఇదీ అంకాల పరమైన, కథాపరమైన క్లయిమాక్సుల సంగతి. 

         అయితే  దొంగరాముడు కథలో అంకాల పరమైన మూడు క్లయిమాక్సులు ఒకేలా వున్నా, అవి తీవ్రత పెంచుకుంటూ వున్నాయి. ముందు చిన్న రాముడుగా చిన్న దొంగతనం చేసి బాల కేంద్రానికే వెళ్ళాడు, తర్వాత పెద్ద దొంగతనంతో నేరం పెరిగి జైలుకెళ్ళాడు, ఆతర్వాత చేయని హత్య కేసులో నేరం ఇంకా పెరిగి అరెస్టయాడు. ఈ తీవ్రతల స్థాయులు క్యారెక్టర్ ఆర్క్ (పాత్రోచిత చాపం) ని ఏర్పరుస్తున్నాయి. అంటే ఈ క్లయిమాక్సులు పాత్ర చిత్రణకీ పనికొచ్చాయి. అలాటిలాటి పాత్ర చిత్రణా కాదు, పరివర్తనే ధ్యేయంగా సాగే పాత్రచిత్రణ. ఇలాకాక, జడప్రాయమైన పాత్రగా వుండిపోతే, ఎన్ని అంకాల క్లయిమా క్సులున్నా పాత్రలో మార్పు రాదు. క్యారెక్టర్ ఆర్క్ ని ఏర్పర్చదు. ఇప్పటి సినిమాల్లో లాగా, ఆవారా హీరో పాత్ర వుందనుకుందాం. ఈ పాత్ర నేరాలు చేసి పదేపదే అరెస్టయ్యే మలుపులెన్ని వస్తున్నా, ఏ మలుపూ ఆ పాత్ర ఉన్నతీకరణకి దోహదం చేయకపోతే సినిమా ఎలా వుంటుందో, ఈ ఉత్తుత్తి క్లయిమాక్సులు చూస్తూ కూర్చున్న ప్రేక్షకుల మానసికారోగ్య మెలా వుంటుందో వూహించుకోవచ్చు. ఇవి పాత్రని వదిలేసిన క్లయిమాక్సులు. ఎలాగూ మన హీరోల పాత్రలు ఆవారా అనాధ పాత్రలే కదా. 
***
       ఇలాకాక దొంగరాముడులో పాత్రని అంటి పెట్టుకునే అంక క్లయిమాక్సులు కన్పిస్తాయి. ఇందుకే ప్రతీ క్లయిమాక్సూ అక్కడితో కథని తెంపెయ్యకుండా కొత్తాసక్తిని రేపుతోంది. ఇదంతా చేయి తిరిగిన క్రియేటివ్ స్పర్శ. స్ట్రక్చర్ తోనే. ఈ స్ట్రక్చర్ సహిత క్రియేటివ్ అభివ్యక్తితో ఇప్పుడే జానర్ కథైనా చేసుకోవచ్చు. స్ట్రక్చర్ ని పట్టించుకుంటేనే. స్ట్రక్చర్ మాత్రమే  సినిమాకి వ్యాపారాన్నిస్తుంది, మిగతా క్రియేటివిటీలన్నీ స్ట్రక్చర్ కి చేసే షోకులే.

       ఇప్పుడు ఈ వ్యాసం మొదట్లో చెప్పుకున్న స్క్రీన్ ప్లేకి పట్టే చీడల విషయానికొద్దాం. ఇవి చీడలని తెలియక సినిమాలు తీస్తే ఫ్లాపవుతున్నాయి. 2000 నుంచీ ముందు ఓ మూడు చీడలు పుట్టుకొచ్చాయి – మిడిల్ మటాషులు, ఎండ్ సస్పెన్సులు, పాసివ్ పాత్రలూ. తర్వాత ఇంకొన్ని కొత్త చీడలు వచ్చి చేరాయి : మిడ్ ఫ్రాక్చర్లు, సెకెండాఫ్ సిండ్రోములు, స్టార్ట్ అండ్ స్టాప్ టెక్నిక్కులు. ఉన్న వైరస్ లకి తోడు ఎబోలా, హంటా, జికా అంటూ కొత్తకొత్త వైరసులు సెలబ్రిటీలైనట్టు.

          కానీ దొంగరాముడులో రిపీటయ్యే అవే అంక క్లయిమాక్సులతో ఎంత కథ నడిపినా, 1. ఇంటర్వెల్లో కథ తెగి స్క్రీన్ ప్లే మిడ్ ఫ్రాక్చర్ కాలేదు, 2. ఇంటర్వెల్ కల్లా కథ ముగిసిపోయి సెకండాఫ్ సిండ్రోమ్ ఏర్పడలేదు, 3. అంకాలు వేటికవి విడివిడి మినీ కథలై స్టార్ట్ అండ్ స్టాప్ టెక్నిక్ బారిన పడలేదు. అసలీ మూడు చీడలేమిటో, ఎలా గుర్తుపట్టాలో ఈ కింద చూద్దాం...
***
       ఒక సినిమా ఏదో ఒక చీడ పట్టి వుంటుంది. రెండు మూడు చీడలు పట్టి భయపెట్టడం చాలా అరుదు. మిడ్ ఫ్రాక్చర్ కి రభస, జ్యోతి లక్ష్మి, కొరియర్ బాయ్ కళ్యాణ్ లాంటి కొన్నిటిని, సెకెండాఫ్ సిండ్రోమ్ కి ఊసరవెల్లి, అశోక్, బ్రహ్మోత్సవం లాంటి కొన్నిటిని, స్టార్ట్ అండ్ స్టాప్ టెక్నిక్ కి ఆటోనగర్ సూర్య, టైగర్ హరిశ్చంద్ర ప్రసాద్, సిటిజన్ లాంటి కొన్నిటినీ చెప్పుకోవచ్చు. అయితే రికార్డులన్నీ బద్దలు కొడుతూ ఈ మూడు చీడలూ పట్టింది ఒకటుంది – అదే ‘సైజ్ జీరో’ అనే కొవ్వెక్కిన స్క్రీన్ ప్లే. 

          స్పెషల్ బాడీతో అనూష్కా నటించిన ‘సైజ్ జీరో’ చీడ పీడలకి మంచి నిలవనీడ. దీని సృష్టికర్తలకి చేతులెత్తి నమస్కరించాలి. ఇందులో హీరోయిన్ అనూష్కా సమస్య లావు తగ్గాలని. ఎలా తగ్గుతుంది, మిడ్ ఫ్రాక్చర్, సెకెండాఫ్ సిండ్రోమ్, స్టార్ట్ అండ్ స్టాప్ టెక్నిక్కుటమారాలతో స్క్రిప్టే కొవ్వెక్కిపోతే? కొవ్వెక్కిన స్క్రిప్టు బాక్సీఫీసు దివ్వెల్ని వెలిగిస్తుందా? మార్నింగ్ షోకే కొవ్వు చూసి కెవ్వుమన్నారు ప్రేక్షకులు. ఆఖరికి సినిమా ముగింపులో అనూష్కా కూడా కొవ్వు తగ్గని అదే సైజుతో పహిల్వాన్ లా మిగిలింది!  చీడలంటించుకున్నాక స్క్రిప్టుకి చీరలు బావుండవు. 

          ఇందులో మిడ్ ఫ్రాక్చర్ ఇలా వుంటుంది :
లావు తగ్గాలని ఇంటర్వెల్ దగ్గర ప్లాట్ పాయింట్ -1 తో వేసే గోల్ అక్కడితోనే ఆగిపోతుంది. సెకండాఫ్ ప్రారంభం కాగానే వేరే కథ మొదలెడతారు. అంటే ఫస్టాఫ్ లో ఎత్తుకున్న కథా దాని పాయింటూ సఫా. ఇక రెండో సినిమా షురూ. 

         
సెకెండాఫ్ సిండ్రోమ్ ఇలా వుంటుంది : ఇంటర్వెల్లో ప్లాట్ పాయింట్ -1 వేసి లావు తగ్గే పాయింటు వేశాక, దాన్నెలా కొనసాగించాలో తెలీనట్టు, ఇంటర్వెల్ తర్వాత దాన్నొదిలేసి,  క్లినిక్ అక్రమాల పాయింటు నెత్తుకుంటారు. ఇంటి దగ్గర తల్లిగారు పెళ్లి కోసం లావు తగ్గమంటే, ఆ తల్లీనీ పెళ్ళీనీ వదిలేసి క్లినిక్ అక్రమాలంటూ వూరు మీద పడేశారు. ఉన్న పాయింటుతో సెకెండాఫ్ ఏం చేయాలో తెలీక, వేరే పాయింటుతో ప్లేటు ఫిరాయిస్తే, ఇలా సెకెండాఫ్ సిండ్రోమ్ లో- సుడిగుండంలో పడుతుంది సినిమా. 

         
ఇక స్టార్ట్ అండ్ స్టాప్ టెక్నిక్ ఇలా వుంటుంది : సెకెండాఫ్ లో క్లినిక్ మీద పోరాటంతో మొదలెట్టి,  ఫ్రెండ్ కోసం ఫండ్ రైజింగ్ ఎపిసోడుగా, ప్రజలకి అవగాహన కోసం స్పోర్ట్స్ ఈవెంట్ ఎపిసోడుగా ... ఇలా తోచిన పాయింటల్లా ఎత్తుకుంటూ ఎపిసోడ్లమయంగా చెప్పుకుంటూ పోయి, డాక్యుమెంటరీలకి పనికొచ్చే స్టార్ట్ అండ్ స్టాప్ టెక్నిక్ బారిన పడేశారు. ఒకటేదో సమస్యని  ఎత్తుకోవడం, దాన్ని పరిష్కరించడం, ముగించడం; మళ్ళీ ఇంకో సమస్యేదో ఎత్తుకోవడం, దాన్ని పరిష్కరించడం, ముగించడం... ఇలా కొన్ని ఎపిసోడ్లుగా చూపించడానికి - సినిమా మినీ కథల సంపుటి కాదు. ఒకే పెద్ద కథ. దానికొకటే పాయింటు. దాంతోనే సంఘర్షణా, దానికే పరిష్కారమూ.
  ***
           దొంగరాముడు ఒకే తానుగా వున్న కథ మళ్ళీ మళ్ళీ అక్కడికే వస్తున్నా, ఎపిసోడిక్ కథనం బారిన పడలేదు. ఇంటర్వెల్లో కథ తెగి మిడ్ ఫ్రాక్చర్ అవలేదు. ఇంటర్వెల్ తర్వాత ఉన్న పాయింటుని వదిలేసి ఇంకో పాయింటునెత్తుకుని సెకండాఫ్ సిండ్రోంలోకి జారుకోలేదు.  ఏమిటి కారణం? కారణమేమిటంటే ఒకే కథ, ఆ కథ చివరంటా అన్ని అంకాల్లో అంతర్లీనంగా కొనసాగుతున్న ఒకే పాయింటు - చెల్లెలి కోసం తాపత్రయం. పాయింటు తెగకపోతే ఏదీ తెగదు. ఇంతకంటే మూలసూత్రం లేదు దొంగ రాముడులో. ఇదొక్కటి గుర్తుపెట్టుకుంటే చాలు, ఈ మూడు చీడలకి అతీతంగా వుంటాయి రాసుకునే కథలు.  
                                                   
             ఇక దొంగరాముడు మిడిల్ - 2 ని పరిశీలిస్తే,  మిడిల్ - 1 లో చూసిన యాక్షన్ రియాక్షన్లతో కూడిన డైనమిక్సే కొనసాగుతాయి. ఈసారి డైనమిక్స్ సంక్షోభాన్ని- సంఘర్షణనీ పెంచుతూ ప్లాట్ పాయింట్ - 2 కేసి సాగుతాయి. ఇదంతా ఈ వ్యాస ప్రారంభంలో రెండో పేరా నుంచీ వున్న కథా సంగ్రహంలో స్టెప్ బై స్టెప్ కనిపెట్టొచ్చు. డైనమిక్స్ ఎలా వుంటాయో గత వ్యాసంలో మిడిల్ -1 కథా సంగ్రహం ఆధారంగా చెప్పుకున్నాం. ఆ విధానాన్నే ఇక్కడ అప్లయి చేసి చూస్తే అర్ధమైపోతుంది. పాత్రగా దొంగరాముడి డైనమిక్స్ కి పరాకాష్ఠ - పెళ్ళిలో జడ్జి వేషంలో రావడం! దొంగ పోలీసుగా కాదు, జడ్జిగా రావడం! జడ్జిగా వచ్చి గతంలో తనని పట్టుకున్న పోలీసు పక్కనే కూర్చోవడం! ఇలాటి ఎక్స్ ట్రీం ద్వంద్వాలే సీన్లని హుషారెక్కిస్తాయి. ఎలా వచ్చాడు? పెళ్ళికి జడ్జిని పిలిచివుంటే, ఆ జడ్జిని పిలిచిన మోహన్రావు అన్న, ఒక లాయర్ గా ఇతను జడ్జి కాదే అనుకోడా? ఇలాటి  ప్రశ్నలు అబ్సర్డ్  కామెడీకి చెల్లవు. అబ్సర్డ్ – అసంబద్ధ కామెడీ ఇలాగే వుంటుంది. అయితే దీనికి మూలంలో లాజిక్ వుండాలి. లేకపోతే అబ్సర్డ్ కామెడీ విఫలమవుతుంది. రాముడుకి దొంగోడనే ముద్ర లాజికల్ గా వుంది. ఈ మూలంలోంచి అతను ఎక్స్ ట్రీం కెళ్ళి జడ్జిగా సీనుని ఆపరేట్ చేశాడు. దొంగోడు కాకుండా మంచోడై వుంటే సీనుకి అర్ధముండదు. మూలంలో లాజిక్ వుంటే ఎంత అసంబద్ధ కామెడీనైనా లాగించెయ్యొచ్చని అరిస్టాటిల్ చెప్పాడు. అప్పుడు  ‘పట్నంలో జడ్జి ఎవరో ఎవరికీ తెలీదా’ అన్న లాజిక్ ని వదిలేస్తారు ప్రేక్షకులు. ఒకటి వదిలేయాలంటే ఇంకోదాంతో కాంపెన్సేట్ చేయాలి. 

       కొన్ని సినిమాల్లో అకస్మాత్తుగా పాత్రలు మాయమవుతూంటాయి. ఆ మధ్య ఒక సినిమాలోంచి హీరోయిన్ వెళ్ళిపోతే డూప్ ని పెట్టి అన్నీ వెనుకనుంచి షాట్లే తీశారు. మరి సూర్యకాంతంతో ఏమయ్యిందో ఆమె ధరించిన భద్రయ్య భార్య పాత్ర సడెన్ గా అదృశ్యమైపోతుంది. రాముడు కత్తితో భద్రయ్యని హెచ్చరిస్తున్నప్పుడు లోపలినుంచి ఆమె వాయిస్ విన్పిస్తుంది. ఏదో సర్ది చెప్పేస్తాడు భద్రయ్య, ఆ తర్వాత బాబుల్ గాడొచ్చి దాడి చేస్తున్నప్పుడూ, భద్రయ్య చనిపోయి పోలీసులొచ్చినప్పుడూ, ఇంకా తర్వాతెక్కడా ఆమె కన్పించదు కూతురూ కొడుకు సహా! ఇది లాజిక్ కి అడ్డం పడేదే. 

          1940 లలో ప్రారంభమైన హాలీవుడ్ ఫిలిం నోయర్ జానర్ డిటెక్టివ్ సినిమాల్లో ఒక సీనుని దాని తర్వాతి సీనుతో లింక్ చేస్తూ గమ్మతైన షాట్లేస్తారు. దీంతో అది మొదటి సీను తాలూకు ఇంకో షాట్ అనుకునే ప్రేక్షకులు కాస్తా, రెండో సీను చూసి ఫూల్స్ అవుతారు.  దొంగరాముడులో ఇలాగే ఒకచోట వుంది. డాక్టర్ మోహన్రావ్ డ్రైవర్ గా కొత్తగా చేరిన రాముడు, కారు తుడుస్తూంటే పనివాడు వచ్చి తొంగి చూస్తాడు. ఈ పనివాడు రాముణ్ణి దొంగరాముడుగా గుర్తు పట్టేశాడన్పించి - దీని పరిణామాల గురించి ఇంకెటో పోతుంది మన మైండ్. అంతలో ఈ సీను కట్ అయి ఇంకో సీను వస్తుంది. ఇక్కడ ఇంట్లో పెళ్లి మాటలు మాట్లాడుకుంటూ వుంటారు. అప్పుడు మళ్ళీ పనివాడు తొంగి చూస్తున్న షాట్ పడుతుంది. అప్పుడర్ధమవుతుంది మనమెంత ఫూలయ్యామో. పనివాడు తొంగి చూస్తోంది ఇంట్లోకన్న మాట, బయట రాముణ్ణి కాదు! ఇది ప్రేక్షకుల్నికంగారు పెట్టే డైనమిక్స్. జస్ట్ క్రియేటివ్ ఎగ్జీబరెన్స్! 



          రూపాయి రూపాయీ కూడేసి సినిమా తీస్తే ప్రేక్షకులు అచేతనంగా కూర్చుండిపోయి సినిమా చూడడం కాకుండా, క్షణంక్షణం స్పందిస్తూ బిజీగా చూసేలా చేయకపోతే – ఆ క్షణ క్షణానికీ పెట్టే ప్రతీ రూపాయీ దండగైనట్టే. పెట్టుబడికి పెట్టే ప్రతీ రూపాయీ ప్రేక్షకుల అటెన్షన్ ని వసూలు చేయాలి, ప్రేక్షకులు పైసా వసూల్ అనుకునే సంగతి తర్వాత! ఇంకో చోట – మళ్ళీ ఫిలిం నోయర్ సినిమాల్లో లాగే – నడుస్తున్నసీను దేనికి దారితీస్తుందో సూచనలిచ్చే బ్యాక్ గ్రౌండ్ విశేషముంటుంది. రాముడు చలాకీగా నడుచుకుంటూ వస్తూంటాడు. కారు టైరు పంక్చరై మోహన్రావు నిలబడి వుంటాడు. ఈ సీనులో ఏం జరుగుతుందో పైన మిడిల్ - 2 కథా సంగ్రహంలో చెప్పుకున్నాం. ఇది రాముడు, మోహన్రావు పరస్పరం పరిచయమయ్యే సీను. ఈ పరిచయం తర్వాత వీళ్ళ సంబంధం ఎలా వుండబోతోందో సంకేతాలిస్తూ వెనుక ఒక దృశ్యం కన్పిస్తుంది. ముందుగా వీళ్లిద్దరున్న ఫ్రేములో చెరో పక్క రెండు వృక్షాలుంటాయి. ఇప్పుడేగా వీళ్ళిద్దరూ పరిచయమయ్యారు, అందుకే ఇలా విడివిడిగా వృక్షాలు. ఈ ఫ్రేము నుంచి అవతలికి మన దృష్టి సారిస్తే, దూరంగా ఒకే చోట రెండు తాటి చెట్లుంటాయి : ఒకటి పొడవైనది, ఇంకోటి పొట్టిది. బ్యాక్ గ్రౌండ్ లో ఇంకేమీ వుండదు ఆకాశం తప్ప. అంటే వీళ్ళిద్దరూ యజమానీ పనివాడుగా ఒకటవుతారన్నమాట!

          కథనమంటే కార్యాకారణ (కాజ్ అండ్ ఎఫెక్ట్) సంఘటనల సమాహారమే కాబట్టీ- అందునా మిడ్ పాయింట్ సహా ప్లాట్ పాయింట్స్ రెండూ సంఘటనలతో కథని మలుపు తిప్పే థ్రిల్లింగ్ విజువల్ నేరేషన్ తో వుండాలి కాబట్టీ – దొంగరాముడు ఈ మూడు ఘట్టాలనీ థ్రిల్లింగ్ సంఘటనలతోనే చూపించారు. ప్లాట్ పాయింట్ -1 లో బాల రాముడు దొంగతనం చేసి పోలీసులకి దొరికిపోయే ఛేజింగ్ సీను, మిడ్ పాయింట్ లో రాముడు రాంబాబుగా నటించి పోలీసులకి దొరికిపోయే సస్పెన్స్ సీను, తర్వాత ఇప్పుడు ప్లాట్ పాయింట్ -2 లో, హత్యకేసులో మళ్ళీ పోలీసులతో ఛేజింగ్ సీను. ఆ మూడూ విజువల్ గా వున్నాయి. మాటలతో వెర్బల్ గా వుంటే మిగతా సీన్లకీ ఈ కీలక సీన్లకీ తేడా వుండక గంపగుత్త బేరంలా వుంటాయి. మాంచి చెత్తబుట్ట సినిమాని ఉత్పత్తి చేస్తాయి. ఈ మూడు కీలక సీన్లూ థ్రిల్లింగ్ సంఘటనలతో విజువల్ గా ప్రేక్షకుల మనస్సుల్లో ముద్రించుకోవాల్సిందే. సినిమాల్లో చూపిస్తున్నట్టు, ప్రేమికులు కేవలం మాటామాటా అనుకుని విడి పోవడం - విజువల్ మీడియా అయిన సినిమా ప్లాట్ పాయింట్ కాదు. దాన్ని నవలగా రాసుకుని అచ్చేసుకుని, పడక్కుర్చీలో మేనువాల్చి చక్కగా చదువుకుని ఆనందించ వచ్చు. భూతద్దం పెట్టి రకరకాల సైజుల్లో మళ్ళీ మళ్ళీ చదువుకోవచ్చు – సినిమాల వైపు మాత్రం రాకుండా. 

          ప్లాట్ పాయింట్ - 2 అనేది కథ నడిపే పాత్ర అధఃపాతాళంలోకి జారిపోయే ఘట్టం కాబట్టి, రాముడి జీవితం పరాకాష్ఠకెళ్ళి హత్య కేసుతో పూర్తిగా సర్వనాశనమయ్యాడు. ఇక ఇందులోంచి ఫీనిక్స్ పక్షిలా పైకి లేవడం ఎండ్ విభాగానికి బదిలీ అయ్యే బిజినెస్.

***
           ఎండ్ విభాగం బిజినెస్ – సీత గబగబా వస్తూంటే బాబుల్ గాడు పూటుగా తాగి, జోరుగా డబ్బులు ఖర్చు పెడుతూ కనపడతాడు. వీడికింత డబ్బెక్కడిదా అని చూసి, వీడి సంగతి చూడాలని తన హొయలతో ట్రాప్ చేసి వాడింటికి తీసికెళ్తుంది. రావోయి మా ఇంటికీ పాటేసుకుని, వాడికి అర కోడి కూర తినిపించకుండానే ఉతికి ఆరేస్తుంది. వాడు భద్రయ్యని చంపి దోచుకున్న సొమ్మంతా తీసి చూపించి, ఆమెని తన దాన్నిగా చేసుకుందామని ఎరేస్తాడు. ఆ సొమ్ములు లాక్కుని వాణ్ణి తన్నడంలో బిజీ అయిపోతుంది
 .
            పోలీస్ స్టేషన్లో రాముణ్ణి ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేస్తూంటారు. హత్య జరిగిన సమయంలో తను పెళ్ళిలో ఈ పోలీసు అధికారి పక్కనే జడ్జి వేషంలో వున్నానని చెప్పుకోలేని పరిస్థితి రాముడిది.

          అటు ఇంట్లో సోఫా కింద పడ్డ వాచీ దొరుకుతుంది. దీంతో మోహన్రావు, అతడి అన్న రాముడి మీద నేరం మోపినందుకు బాధపడతారు. ఇంతలో పనివాడొచ్చి రాముడు భద్రయ్యని చంపి అరెస్టయ్యాడని అంటాడు. అన్నదమ్ములకి నోట మాటరాదు. ఇక లక్ష్మి అగలేకపోతుంది. బయట పడిపోతుంది. లక్ష్మి ఎవరో తెలిసి విస్తుపోతారు వాళ్ళు. తనని  క్షమించమని కాళ్ళ మీద పడుతుంది. కానీ తన అన్నఈ హత్య చేయలేదనీ, సాక్ష్యం చెప్తాననీ ప్రాధేయపడుతుంది. 

          పోలీస్ స్టేషన్లో లక్ష్మి అన్నకి ఎలిబీ ఇచ్చేస్తుంది – హత్య జరిగిన సమయంలో అతను జడ్జి వేషంలో పెళ్ళికి వచ్చాడని. పోలీసు అధికారి ఠారెత్తిపోతాడు. ఇంతలో బాబుల్ గాణ్ణి పోలీసులకి పట్టించిన సీత ఆ దొంగ సొత్తుతో పోలీస్ స్టేషన్ కొస్తుంది...

          ఇదంతా సంఘటనలతో జరిగిందే, మాటలతో అపార్ధాలు తొలగించుకుని కాదు. అయితే హీరో పాత్రయిన రాముడు అంతవరకూ యాక్టివ్ పాత్రగా వుంటూ, తీరా అరెస్టయ్యా క ముగింపు వరకూ ఏమీ చెయ్యని పాసివ్ పాత్రగానే వుండిపోయాడు. ఈ ఉచ్చులోంచి తనని లక్ష్మీ సీతలే కాపాడారు. ఎందుకంటే ఆ రోజుల్లో యాక్టివ్ పాసివ్ తేడాల్లేవు. ఎలా వున్నా చూసే వాళ్ళు. ఈ మలి స్వర్ణ యుగం తర్వాత, వ్యాపారయుగంలో హీరోయిజాల స్వరం పెరిగి, అన్నీ హీరోగారే ఒంటి చేత్తో చేసేసే ఘనకార్యాల కథలు రావడం మొదలెట్టాయి.  

          సైకలాజికల్ గా చూస్తే, ఇక్కడ ఇగో మెచ్యూర్డ్ ఇగోగా మారని ముగింపు కొచ్చింది కథ. మిడిల్ – 2 లో మెచ్యూర్డ్ ఇగోగా మారే ప్రక్రియలోనే వుంది రాముడి పాత్ర. ఈ ప్రయత్నాన్ని ఎండ్ విభాగంలో లక్ష్మీ సీతల పాత్రలు హైజాక్ చేసి వాళ్ళే అతణ్ణి మెచ్యూర్డ్ ఇగోగా మార్చేశారు. నీతి ఏమిటంటే, చిన్నప్పటి తెలియని వయసే కావొచ్చు- ఒకసారి పోలీసు రికార్డుల కెక్కితే, చెయ్యని నేరాలు కూడా మీదపడి మర్యాద చేస్తాయి.

(సమాప్తం)

సికిందర్