రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Sunday, November 24, 2019

891 : స్క్రీన్ ప్లే సంగతులు


      తెలుగులో ఇంకో ‘బయోపిక్’ ఈసారి జార్జి రెడ్డి జీవితంతో వచ్చింది. 1966 - 72  మధ్యకాలంలో ఉస్మానియా విశ్వవిద్యాలయం ఫిజిక్స్ రీసెర్చి స్టూడెంట్ గా జార్జిరెడ్డి క్యాంపస్ రాజకీయాలు ఆధారంగా ఇప్పుడు ‘జార్జి రెడ్డి’ అనే ‘బయోపిక్’ నిర్మించారు. నిర్మించినప్పుడు చాలా ఆషామాషీగా నిర్మించారు కనీస సినిమా లక్షణాలని పక్కన పెట్టేసి.  జార్జిరెడ్డి జీవిత సమాచారాన్ని కూడా ఇష్టానుసారమిస్తూ బయోపిక్ కి అర్ధం లేకుండా చేశారు. ఇలా చేయాలనుకున్నప్పుడు ‘జార్జిరెడ్డి’ అనే టైటిల్ పెట్టకుండా, జార్జిరెడ్డి స్ఫూర్తితో అని ఏదో ఫిక్షన్ తీసేస్తే సరిపోయేది. ఒక నిజజీవిత వ్యక్తి గురించి తప్పుడు, అసమగ్ర  సమాచారమిస్తూ, జార్జిరెడ్డి పేరుని క్యాష్ చేసుకావాలన్న ధోరణిలో బయోపిక్ తీసే అధికారం దర్శకుడికి వుండదు. అది ఆ నిజ జీవిత వ్యక్తికి అన్యాయమే అవుతుంది. ఇలా బయోపిక్ జానర్ మర్యాదనే తీసి అవతలపెట్టి, తమ చేతికి చిక్కిన ఒక అరుదైన మంచి అవకాశాన్నే జారవిడుచుకున్నారు. ఆ నాటి క్యాంపస్ రాజకీయాలే నేడు కూడా కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో ప్రతిబింబిస్తున్న వైనాన్ని నేటి తరానికి ఎత్తి చూపగలిగే అరుదైన అవకాశమిది. దర్శకుడి బాధ్యత కూడా. తులనాత్మకంగా ఈ తరం ప్రేక్షకులకి జార్జి రెడ్డిని బాగా కనెక్ట్ చేయగలిగే సువర్ణావకాశం. దీన్ని నేలపాలు చేసుకున్నారు. అసలీ బయోపిక్ కాని బయోపిక్ ని తలపెట్టినప్పుడు  ఓ మార్కెట్ యాస్పెక్ట్ ని గానీ, క్రియేటివ్ యాస్పెక్ట్ ని  గానీ నిర్ణయించుకోలేదు. భారీగా ఎనిమిది కోట్లు ధారబోసి తక్షణం ఫ్లాపయ్యే ‘బయోపిక్’ ని ఇంకా ఈ సమాచార విప్లవ కాలంలో కూడా ఎలా తీస్తారో అర్ధంగాని విషయం. క్రియేటివ్ యాస్పెక్ట్ అలా వుంచి, అసలు మార్కెట్ యాస్పెక్ట్  ఏ ఒక్క సీనులో కూడా కన్పించదు ఈ ‘బయోపిక్’ లో. అంత ఔట్ డేటెడ్ గా వుంది.

         
మొట్ట మొదట ఈ స్క్రీన్ ప్లేకి కాన్సెప్ట్ ని నిర్ధారించేటప్పుడు నాడూ నేడూ కామన్ గా వుంటున్న లెఫ్ట్ వింగ్, రైట్ వింగ్ క్యాంపస్ రాజకీయాల్ని హైలైట్ చేస్తూ నేపథ్యం ఏర్పాటు చేసుకోలేదు. చేసి వుంటే ఆ నేపథ్యంలో నేపథ్యం తాలూకు క్యారక్టరైజేషన్ తో, లక్ష్యంతో, జార్జి రెడ్డి పాత్ర ఐడెంటిఫై అయ్యేది. బయోపిక్ పాత్రకి ఐడెంటిటీ అంటూ లేకపోతే బయోపిక్ కి అర్ధమే లేదు. ఐడెంటిటీ లేని పాత్రని ప్రేక్షకులు ఓన్ చేసుకోలేరు, ఫీలవలేరు. ఈ రెండూ జరక్కపోతే  సిడ్ ఫీల్డ్ మాటల్లో ఆ పాత్ర – “ too internal, too reactive, seems to disappear off the page” అవుతుంది. “ disappear off the page” అంటే స్క్రీన్ ప్లే పేజీల్లోంచి ఆ పాత్ర అదృశ్యమై పోవడమన్న మాట. నిజమే, రెండున్నర గంటల ఈ ‘బయోపిక్’ లో జార్జి రెడ్డి ఎక్కడున్నాడా అని పదేపదే వెతుక్కోవాల్సి రావడం ఇందుకే. ఇది చాలా విషాదం!

          జార్జి రెడ్డి లెఫ్ట్ వింగ్ ప్రతినిధి. అతను రైట్ వింగ్ తో సంఘర్షించాడు. లెఫ్ట్ వింగ్, రైట్ వింగ్ సంఘర్షణలు నేడూ కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో చూస్తున్నవే. ఈ నేపథ్యంలో జార్జి రెడ్డి ఆనాడు ఎలా సంఘర్షించాడు, ఏం తప్పులు చేశాడు, అతన్నుంచి ఈ తరం ఏం నేర్చుకోవచ్చన్నవి సహజాతి సహజంగా ఈ ‘బయోపిక్’ కి దానికదే కాన్సెప్ట్ అయిపోతుంది. ప్రాథమికంగా సినిమాకి కావాల్సిన కాన్సెప్ట్ ఏమిటో తెలియకపోతే  సినిమా ఎలా తీస్తారెవరైనా.

          మరికొన్ని స్క్రీన్ ప్లే ఓనమాలు కూడా తెలిసినట్టు లేదు : పాత్రకి ఒక గోల్, కాన్ఫ్లిక్ట్ లతో కూడిన స్ట్రక్చర్, సస్పెన్స్, థ్రిల్ అనే ఎలిమెంట్స్, యాక్టివ్ పాత్ర! ...హీన పక్షం యాక్టివ్ పాత్రతో కథ రాసుకోవాలని కూడా అనుకో లేదు. పనిలేని పాసివ్ పాత్ర రాసుకున్నారు. గత రెండు దశాబ్దాలుగా వందల సినిమాలు పాసివ్ పాత్రలతో అట్టర్ ఫ్లాపవుతూ వస్తున్నాయని ఇంకా తెలుసుకోక పోతే ఎలా? ఇదంతా చూస్తే దర్శకుడు ఆర్ట్ సినిమాల ధోరణితో వున్నట్టు అన్పిస్తుంది.
     

  
ఒకసారి క్లుప్తంగా కథ చూద్దాం :
         ముస్కాన్ అనే రిసెర్చర్ అమెరికా నుంచి వచ్చి, జార్జి రెడ్డి మీద తీయాలనుకుంటున్న డాక్యుమెంటరీ గురించి అతడి జీవితాన్ని శోధించడం మొదలెడుతుంది. ఇందులో భాగంగా మల్టిపుల్ ఫ్లాష్ బ్యాకులుగా జార్జిరెడ్డి కథ వస్తూంటుంది. అతను కేరళలో జన్మించాడు. తల్లి వుంటుంది. చిన్నపుడే కర్రసాము, కత్తి సాము నేర్చుకున్నాడు. బ్లేడుతో గాయపర్చడం నేర్చుకున్నాడు. చదువులో ముందుంటాడు. ఇలా పెద్దవాడై, హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో చేరతాడు.

        అప్పటికే యూనివర్సిటీలో రెండు విద్యార్ధి సంఘాలుంటాయి. వాటిలో ఒకటి ఎబిసిడి (ఎబివిపి పేరు మార్చారు. అప్పట్లో ఎబివిపి లేదు, ఆరెస్సెస్ అనుబంధ సంస్థ వుండేది). ఈ రెండు సంఘాలూ కొట్టుకోవడమే పని. హాస్టల్లో భోజనాల దగ్గర్నుంచీ ప్రతీదానికీ కొట్లాటలే. ర్యాగింగ్, ఈవ్ టీజింగులు, కుల వివక్ష, ఆర్ధిక అసమానతల అశాంతీ, ఇవన్నీ చూసి తిరగబడతాడు జార్జిరెడ్డి. విద్యార్థి రాజకీయాల్లోకి ప్రవేశిస్తాడు. ఇంకో పక్క ఇతనంటే ప్రేమ పెంచుకున్న మాయా అనే నార్త్ అమ్మాయి వుంటుంది. ప్రత్యర్ధుల హింసకి హింసే సమాధానంగా చేసుకున్న జార్జి రెడ్డి పీడీఎస్ (అతడి మరణానంతరం పీడీఎస్ యూ - ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ స్టూడెంట్స్ యూనియన్ గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమంతటా వెలిసి, జాతీయంగా విస్తరించి ఇప్పుడూ క్రియాశీలంగా వుంది) అనే విద్యార్ధి సంఘాన్ని స్థాపించి, ఎన్నికల్లో గెలుస్తాడు. దీంతో సదరు రెండు సంఘాలు కక్ష గడతాయి. అతణ్ణి చంపేందుకు ఒకసారి విఫలయత్నం చేసి, రెండో సారి చంపేస్తారు. ఇదీ కథ.

కథ - గాథల కన్ఫ్యూజన్ 
        ఇలా ఈ పై కథ తలపెట్టిన బయోపిక్ కి  కథలా లేదు, గాథలా వుంది. ఈ విశ్లేషణ వచ్చే వ్యాసంలో చేద్దాం. ఐతే వాస్తవంగా జార్జిరెడ్డి జీవితం సినిమాగా గాథ అయ్యే అవకాశం లేదు. చివరికి చనిపోయి ట్రాజడీ అయినా నిజజీవితంలో ఒరిజినల్ గా అతడి కున్న లక్ష్యంతో, దాన్ని సాధించలేకపోయిన పోరాటంతో అది కథే అవుతుంది నిజానికి. లక్ష్యం లేకుండా ఏదో బలహీన పోరాటంగా  చూపిస్తే గాథ అయిపోతుంది. ఇదే జరిగింది. ఇది కమర్షియల్ సినిమాకి వ్యతిరేకం. ఈ స్క్రిప్టు రాయడానికి ఇది ముందు గుర్తించుకోవాల్సిన విషయం. ఒక ఐడియా అనుకున్నాక ఆ ఐడియాలో కథే వుందా లేక గాథ  ఏమైనా వుందా ముందు పరిశీలించుకుంటారు. ఇది కామన్ సెన్సు. గాథ గనుక వుంటే అది కమర్షియల్ సినిమాకి వ్యతిరేకం గనుక పక్కన పెట్టేస్తారు అమీబాలు కాని బుద్ధి జీవులు. అమీబాలు రాసుకున్న కథలన్నీ కథలే అనుకుని తమ అమీబియాసిస్ ని గాథలుగా కథంతా ప్రాకిస్తారు. సమ్మగా ఫ్లాపుని అనుభవిస్తారు. అదో తృప్తి. కథంటే ఏమిటి, గాథంటే ఏమిటి ఈ బ్లాగులోనే అనేక సార్లు చెప్పుకున్నాం గనుక మళ్ళీ అవసరం లేదు.

          జార్జి రెడ్డి జీవితమనేది కథా లక్షణాలతో కమర్షియల్ సినిమా తీయడానికి రెడీమేడ్ గా వున్నదే. ఇంకా దీన్ని టైలరింగ్ చేయాల్సిన అవసరం లేదు. ఈ కథకి ‘మహానటి’ ఫేం తాపడం చేశారు రిసెర్చర్ ముస్కాన్ పాత్రతో, జార్జిరెడ్డి జీవితాన్ని ఆమె తెలుసుకుంటున్న కథనంతో.  ‘మహానటి’ లో సావిత్రి గారి జీవితం గాథ. గాథని కమర్షియల్ గా నిలబెట్టి సక్సెస్ చేయాలంటే జర్నలిస్టు పాత్రలతో వాళ్ళ ‘కథ’ తో  ఆ గాథకి తాపడం చేయాలి. అదే చేశారు. ఆ జర్నలిస్టులు సావిత్రి గారి జీవితంలో ‘శంకరయ్య ఎవరు?’ అన్న డ్రమెటిక్ క్వశ్చన్ తో - అన్వేషణతో కొనసాగుతారు. వాళ్ళది కథ కాబట్టి వాళ్ళకి శంకరయ్య ఎవరో తెలుసుకునే గోల్, ఆ గోల్ కోసం సంఘర్షణా వగైరా కథా లక్షణాలు సమకూరాయి. ఈ కథ లోపల ప్యాక్ అయివున్న సావిత్రి గారి గాథకి సంఘర్షణ వుంటుంది గానీ లక్ష్యం లేదు. అందుకని గాథ అయింది. ఇలా స్క్రిప్టు రాయడానికి బయోపిక్ గాథగా దొరికినప్పుడు, ఆ గాథని ఇంకో కథ ఆధారంగా  చెప్పి నిలబెట్టడం అమల్లో వున్న విధానం.

          ఇలాకాక బయోపిక్కే కథగా లభించినప్పుడు ఆ కథ చెప్పడానికి ఆధారంగా ఇంకో కథ అవసరం లేదు. కథగా లభించిన  బయోపిక్ లోనే లక్ష్యమూ సంఘర్షణా ఇమిడి వుంటాయి గనుక అది దానికదే ఓ సినిమా ఐపోతుంది, ఇంకా వేరే సినిమా చూపించి కన్ఫ్యూజ్ చేయనవసరం లేదు. కథగా వున్న బయోపిక్ తో వచ్చిన ఏ సినిమా అయినా ఈ సూత్రంతోనే వుంది. ఎందుకని?

          ఎందుకంటే, బయోపిక్ లో వున్న కథని ఇంకో కథ ఆధారంగా చెప్తే రెండు కథలు దాడి చేస్తాయి. ఒక సినిమాలో ఒకే కథని రిసీవ్ చేసుకుంటుంది మైండ్. మళ్ళీ రెండో కథలో వుండే ఇంకో లక్ష్యమూ దాని తాలూకు సంఘర్షణా భరించలేదు. అది డిస్టర్బెన్స్ కూడా ఫోకస్ చెదర గొడుతూ. ఇందుకే రెండు మూడు కథలు, నాల్గైదు కథలుగా కథా సంపుటాలుగా వుండే సినిమాలు ఫ్లాపవుతాయి. మనం ఇడ్లీ అడిగితే  హోటలతను ఇడ్లీకి జతచేసి చక్కగా చట్నీ పెడతాడు. ఇడ్లీకి ఇంకో ఇడ్లీయే చట్నీగా మన మొహాన పడెయ్యడు. పడేస్తే అవేపెట్టి అతడి మొహాన ఫటీమని కొట్టి వచ్చేస్తాం. హోటల్ అట్టర్ ఫ్లాప్. కథ అనే ఇడ్లీకి ఇంకో ఇడ్లీయే చట్నీగా పెట్టినా ఇంతే. ఇవి క్రియేటివ్ యాస్పెక్ట్ ముచ్చట్లు. హోటలతనికి ఈ క్రియేటివ్ యాస్పెక్ట్ బాగా తెలుసు. అందుకని కలెక్షన్స్ బాగా వుంటాయి.


ప్లాట్ డివైస్ గా గన్ 
        అందుకని జార్జిరెడ్డి జీవితమే లక్ష్యంతో కూడిన కథగా స్క్రిప్టు రాసుకోవడానికి దొరికి నప్పుడు- ఈ కథ చెప్పడానికి ఆధారంగా మళ్ళీ ముస్కాన్ అనే రిసెర్చర్ తో ఇంకో కథ అల్లనవసరం లేదు. అల్లితే అది కథగా అల్లుకోదు. కలుపుగా పంట చెడగొడుతుంది. అందుకనే జార్జిరెడ్డి జీవితం తెలుసుకుంటున్న ముస్కాన్ కి ఏ లక్ష్యమూ సంఘర్షణా లేక, ఏవో హడావిడి దృశ్యాలు వచ్చి పోవడాన్ని చూస్తాం. అంటే జార్జిరెడ్డి కథ అనే బయోపిక్ కి ఈ తాపడం గాథలా తయారయ్యింది. కథ చెప్పడానికి ఆధారంగా గాథ అనేది తాపడంగా ఎలా వుంటుంది? ఒక కథ చెప్పడానికి ఆధారంగా ఇంకో కథగానీ, గాథ గానీ అవసరమే లేదు. కథ అంటేనే వొక స్వయంప్రతిపత్తి గల కళా రూపం. ఆ కథగా వున్న కథని ఫ్లాష్ బ్యాక్ గా మార్చి (స్వయంప్రతిపత్తిని తీసేసి) గాథ ఆధారంగా చెప్పలేరు.

          ఇప్పుడిక్కడ గమనించాల్సిన ముఖ్య విషయమేమిటంటే, ఫ్లాష్ బ్యాక్ ఎప్పుడూ కథ కాదు, ప్రెజెంట్ టైంలో చెప్తున్న విషయమే కథవుతుంది. ఈ కథ చెప్పడానికి కావాల్సిన సమాచారాన్ని ఫ్లాష్ బ్యాక్స్ లోంచి తీసుకుంటూంటుంది కథ. అందుకని ఫ్లాష్ బ్యాక్స్ ఎప్పుడూ సమాచార వనరుగానో, గాథలుగానో వుంటాయి. కథలుగా వుండవు. కథ అనేది ప్రెజెంట్ టైంలోనే నడవాలి. అందుకని  ‘మహానటి’ లో జర్నలిస్టుల ప్రెజెంట్ టైం కథకి, ఫ్లాష్ బ్యాక్స్ లో సావిత్రి గారి గాథ సమాచార వనరుగా తోడ్పడింది. జార్జి రెడ్డి బయోపిక్ లో ప్రెజెంట్ టైంలో రిసెర్చర్ జర్నీ చూపిస్తూ,  ఫ్లాష్ బ్యాక్స్ లో జార్జిరెడ్డి ‘కథ’ చెప్పారు. ఇది టోటల్ రాంగ్ అయింది టెక్నిక్ పరంగా, థియరీ పరంగానూ.

          అంటే ఫ్లాష్ బ్యాకులుగా చెప్పిన జార్జిరెడ్డి ‘కథ’ ని ప్రెజెంట్ టైంలో స్వయంప్రతిపత్తి గల కథ కిందికి తెచ్చి, ప్రెజెంట్ టైంలో అక్రమంగా తిష్ట వేసిన, గాథ మాత్రంగా అనాలోచిత కల్పనగా వున్న, ముస్కాన్ రిసెర్చి జర్నీని ఎత్తివేయాలి. ఆమె చేసిందేమీ లేదుగానీ చివర్లో జార్జిరెడ్డి గన్ ని హుస్సేన్ సాగర్ లో విసిరేసి ముగిస్తుంది. 47 ఏళ్ల తర్వాత ఆ గన్ ఆమె కెక్కడిది? ఈ సినిమాలోనే చూపించినట్టు, జార్జిరెడ్డి హత్య జరిగినప్పుడు అతడి దగ్గరే వుంది. అది పోలీసులకి దొరికి కోర్టు ప్రాపర్టీగా వుండి పోవాలి. అక్కడితో దాని కథ సమాప్తం కావాలి. కథే బ్యాలెన్సుగా లేనప్పుడు ఆమె ఎక్కడో గన్ ని దొరికించుకుని (కోర్టు భోషాణంలోంచి అపహరించిందా?) ముగించడానికి ఇంకా కథెక్కడుంది? హత్య కేసులో సాక్ష్యాధారాన్ని ఆమె ఎలా ఎత్తుకొచ్చి మాయం చేస్తుంది?

          ఈ ముగింపుకి దర్శకుడు చెప్పిన భావం, ఆ గన్ ని హుస్సేన్ సాగర్ లో వేయించడం డైరెక్టర్స్ టచ్. జార్జిరెడ్డి  పోరాటం తర్వాత వచ్చేది నిశ్శబ్దమే...గన్ బుద్ధుడి దగ్గరికి వెళ్లి ఆగుతుంది. ప్రశాంతత, హింస రెండూ ఆయన దగ్గరే వుంటాయి. ఏది ఫైనల్ అనేది మీరు నిర్ణయించుకోండి ... అంటూ ఇంటర్వ్యూలో ఏదో కవితాత్మక ధోరణి. ఇక్కడ గన్ ఉనికిని ప్లాట్ డివైస్ గా గుర్తించి కాన్సెప్ట్ కి కనెక్ట్ చేయడంలో విఫలమయ్యారు.

          అసలు తనని చంపుతున్నప్పటికీ జార్జిరెడ్డి గన్ తీయలేదంటే అక్కడే మేసేజి ఇచ్చేసినట్టు. అసలు కథలో కల్పించిన ఈ గన్ పాత్ర లాజిక్ గురించి వచ్చే వ్యాసంలో చూద్దాం.

          చెప్పేదేమిటంటే, కమల్ హాసన్ నటించిన ‘హే రామ్’ లో మహాత్మా గాంధీ రియల్ హత్యోదంతాన్ని, కమల్ పాత్రతో గాంధీని చంపాలన్న సమాంతర ఫిక్షన్ కథతో ముగింపు నిచ్చినట్టు - ముస్కాన్ తో కూడా గన్ కోసం అలాటి  ట్రావెల్ ని చేయించి వుండాల్సింది. కమల్ పాత్ర గాంధీ ని చంపడం కోసం, స్పెషల్ గన్ తయారీతో  సమాంతర ఫిక్షన్ గా వుంటుంది. అప్పుడు ముస్కాన్ ట్రావెల్ కూడా, తన హత్యా సమయంలో గన్ వాడని జార్జిరెడ్డి గన్ కోసం అన్వేషణగా కొనసాగితే ఒక లాజికల్ ఎండ్ కి దారితీస్తుంది. ‘జార్జిరెడ్డి గన్ ఎందుకు వాడలేదు?’ – అనేది డ్రమెటిక్ క్వశ్చన్ గా వుంటుంది. ‘శంకరయ్య ఎవరు?’ అన్న ‘మహానటి’ లో డ్రమెటిక్ క్వశ్చన్ లాగా. ‘కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు?’ - అని ‘బాహుబలి’ డ్రమెటిక్ క్వశ్చన్ లాగా.

          అప్పుడు ముస్కాన్  ఫారిన్ డాక్యుమెంటరీ మేకర్ కాకుండా, నేటివిటీతో హక్కుల కార్యకర్తగా వచ్చి వుండొచ్చు. చరిత్ర దృష్టికి రాని డ్రమెటిక్ క్వశ్చన్ కి, జార్జి రెడ్డి బయోపిక్ ఆధారంగా సమాధానాన్ని అన్వేషించి – గన్ వాడని జార్జిరెడ్డి అప్రకటిత మెసేజ్ ని ప్రపంచానికి చాటవచ్చు. అప్పుడది ముస్కాన్ ట్రావెల్ కథవుతుంది. అప్పుడు ఫ్లాష్ బ్యాక్స్ తో జార్జిరెడ్డి కథని గాథగా మార్చాలి - డిటో ‘మహానటి’. అయితే ఇప్పుడు తీసిన బయోపిక్ లో జార్జిరెడ్డిది పాసివ్ పాత్రతో గాథగానే వుంది. ఈ గాథ కూడా సరిగ్గా లేదనేది వచ్చే వ్యాసంలో చూద్దాం. ఇలా జార్జి రెడ్డిది ఏదో గాథ అయి, ముస్కాన్ ది కూడా లక్ష్యం లేకుండా ఇంకేదో గాథలా అయి -  రెండూ గాథలైపోయి బాక్సాఫీసుని ఇబ్బందిలో పడేశాయి. 


(రేపు ‘జార్జి రెడ్డి జీవిత కథ సంగతులు’) 

సికిందర్