రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

26, మే 2019, ఆదివారం

831 : స్క్రీన్ ప్లే సంగతులు


     
  “థ మొదలయ్యాక పూర్తి అవ్వాలి.  పూర్తయ్యే వరకూ వుండేదే కథ.  అది చూడకుండా క్యాలిక్యులేటర్‌ పట్టుకుని అది బావుంది, ఇది బాలేదు అని కూర్చుని లెక్కలు వేస్తే ఎలా? కామన్‌ ఆడియన్‌ మాత్రం సినిమా బావుండాలని ఆలోచనతో మాత్రమే వెళ్తాడు. మనం (రివ్యూ రైటర్స్ నుద్దేశిస్తూ) మాత్రం చెక్‌ చేయడానికి మాత్రమే వెళ్తాం. ఏది బాలేదో చూసి దర్శకుడి కంటే మనం గొప్ప అని నిరూపించుకోవడానికి సినిమా చూస్తాం. సినిమాని ఆస్వాదించాలి. సినిమానే కాదు జీవితాన్ని కూడా. పోలికలు ఆపేయాలి. ఆడు ఇది చేశాడు, ఈడు ఇది చేశాడని పోలికలు పెట్టుకుంటే కష్టం. అందుకే రివ్యూల కంటే ఆడియన్స్‌ ఏం చెబుతారన్నదే ముఖ్యం” ―దర్శకుడు తేజ

           
(అంటే కథ రాయడానికి క్యాలిక్యులేటర్ ఉపయోగించడం లేదా? క్యాలిక్యులేటర్ లేకుండానే  ఏదో మొదలెట్టామా ముగించామా అన్నట్టు రాసేస్తున్నారా? కథ మొదలుకీ, ముగింపుకీ మధ్య ప్రేక్షకులకి వుండే యమ చిత్ర హింసని తప్పించడానికే క్యాలిక్యులేటర్ అవసరం. దర్శకుడి కంటే మనం గొప్ప అని నిరూపించే పనిపెట్టుకుని రివ్యూలెవరు రాస్తారు - ప్రేక్షకులే స్పాట్  ట్విట్టర్ రివ్యూలు రాసేసి వైరల్ చేస్తున్నారు. బొమ్మ పడ్డ అరగంటకే లైవ్ అప్డేట్స్ ఇచ్చి తేల్చేస్తున్నారు. క్యాలిక్యులేటర్ ఒకరి చేతిలో కాకుండా అందరి చేతుల్లోకి వెళ్ళిపోయిందిప్పుడు).

          తేజ దర్శకత్వం వహించే సినిమాల స్క్రీన్ ప్లేల్లో మిగతా విషయాలెలా వున్నా, ఇతరులు తీసే సినిమాల్లాగా కాకుండా, చప్పున అరగంటలో బిగినింగ్ ముగిసిపోయి కథేదో ప్రారంభమై పోతుంది. ఇంతవరకూ బాగానే వుంది. అయితే కథంటూ ప్రారంభమయ్యాక ఇక హీరో హీరోయిన్లు పారిపోవడమే జరుగుతుంది చాలా సార్లు. నువ్వు నేను, జయం, నీకూ నాకూ డాష్ డాష్, తర్వాత ఇప్పుడు ‘సీత’... పదేళ్ళ క్రితం ఒక రచయిత రాసుకున్నకథ హీరో హీరోయిన్లు పారిపోవడం గురించి లేదు. కానీ తేజ దగ్గరికి తీసికెళ్తే పారిపోయేలా మార్చేస్తారని భయపడ్డాడు. ఆఫ్ కోర్స్, అప్పట్లో తేజ ఇంకొకరి కథలు తీసుకునే మూడ్ లో లేరన్నది వేరే సంగతి. మళ్ళీ ఇన్నేళ్ళ తర్వాత ‘సీత’ కథని పారిపోయే పురాణంగానే మార్చేశారు. ఈ మార్చడంలో సినిమాటిక్ గా విలువైనవి చాలా కోల్పోయారు. 

          ముందుగా బిగినింగ్ కథనం చూద్దాం : భాగ్యరాజ్ ఒక ఐదేళ్ళ అబ్బాయిని చైల్డ్ స్పెషలిస్టుకి చూపించడంతో ప్రారంభమవుతుంది. టార్చర్ పెట్టడం వల్ల పిల్లాడు మానసికంగా దెబ్బతిన్నాడనీ, మళ్ళీ అలాటి వాతావరణంలో వుంచకూడదనీ, దూరంగా వుంచమనీ స్పెషలిస్టు సలహా ఇస్తాడు. దీంతో భాగ్యరాజ్ పిల్లవాణ్ణి  భూటాన్ దేశం తీసికెళ్ళి బౌద్ధుల మఠంలో చేర్పిస్తాడు. డాక్టర్ రాసిన మందుల లిస్టు ఇచ్చి,  పిల్లవాడికి నయం చేయమంటాడు. పిల్లవాడి పేరు రామ్ అని చెప్తాడు. రామ్ సీత ఏదని అడుగుతాడు. పెద్దయ్యాక సీత వస్తుందనీ, వచ్చి తీసికెళ్తుందనీ నచ్చ జెప్పి, బాధగా వెళ్ళిపోతాడు భాగ్యరాజ్. 

          దీని తర్వాత టైటిల్స్ పూర్తయ్యాక హైదరాబాద్ బంజారా హిల్స్ ప్రాంతంలో ఆక్రమణలు తొలగిస్తూంటారు పోలీసులు. ఆందోళన చేస్తున్న ప్రజల దగ్గరికి సీత (కాజల్ అగర్వాల్) వస్తుంది. బాగా రిచ్ గా, తలపొగరుతో వున్న ఈమె ఆ స్థలం తనదనీ, ఖాళీ చేయాల్సిందేననీ పట్టుబట్టి ఖాళీ చేయించేస్తుంది. ఆ తర్వాత పబ్ కెళ్ళి ఎంజాయ్ చేస్తుంది. అక్కడికి ఎమ్మెల్యే బసవరాజు (సోనూసూద్) వచ్చి
అగ్రిమెంట్ విషయం మర్చిపోయావా అని తనతో పదమంటాడు. 

          ఆ అగ్రిమెంట్ ఏమిటనేది వీడియో క్లిప్పింగ్స్ లో చూపిస్తాడు. బంజారా హిల్స్ లో సీత పదికోట్లకి స్థలం కొన్నది. అందులో ఐదు కోట్లు చందూలాల్ దగ్గర అప్పు తెచ్చింది. తీరా ఇప్పుడు చూస్తే ఆ స్థలంలో జనం ఇళ్ళేసుకుని వుంటున్నారు. వాళ్ళని ఎమ్మెల్యే ఖాళీ చేయిస్తే పర్సెంటేజీ ఇస్తుంది. ఇది వింటూ సీతనే అదోలా చూస్తున్న బసవరాజు ఆమెని కామిస్తాడు. తనని పెళ్లి చేసుకుంటే ఇళ్ళు ఖాళీ చేయిస్తానంటాడు. పెళ్లి గిళ్ళీ తనకి పడవని అంటుంది.  అయితే సహజీవనానికి ఒప్పుకోమంటాడు. నెల రోజులకి ఒప్పుకుంటుంది. ఆ మేరకు అగ్రిమెంట్ మీద సంతకం చేస్తుంది. 

          వీడియో క్లిప్పింగ్స్ లో ఇదీ విషయం. ఇప్పుడు సీత అడ్డం తిరుగుతుంది. మేనిఫెస్టోలో ప్రజలకిచ్చిన హామీలనే పట్టించుకోని నువ్వు, నాతో అగ్రిమెంటుని ప్రశ్నించలేవని వెళ్ళిపోతుంది. బసవరాజు రెచ్చిపోయి అధికారులతో సమావేశం పెట్టి, సీతని అన్ని విధాలా ఇబ్బందులు పెట్టి, తనతో శోభనం జరిపించాలని పట్టుబడతాడు. ఆమె ఆర్ధిక లావాదేవీలు కట్ చేయిస్తాడు. సీఐకి చెప్పి తిరిగి ఆ ప్రజలు స్థలాన్ని అక్రమించుకునేలా చేస్తాడు. అప్పిచ్చిన చందూలాల్ ని కూడా ఎగదోస్తాడు. 

        ఇరుకున పడ్డ సీత చందూలాల్ అప్పు ఐదు కోట్లు, ఇంకా ఇతర కమిట్ మెంట్స్ అయిదు కోట్లూ మొత్తం పది కోట్లు ఎక్కడ్నించి తేవాలా అని ఆందోళన పడుతోంటే, వైజాగ్ లో తండ్రి చనిపోయాడని వార్త వస్తుంది. ఐతే తండ్రికున్న ఐదువేల కోట్ల ఆస్తి తనకే వస్తుందని బయల్దేరుతుంది. అంత్యక్రియలు పూర్తయ్యాక, లాయర్ తండ్రి రాసిన వీలునామా చదివి,  సీతకి ఆమె తల్లి ఇచ్చిన మంగళ సూత్రం అందిస్తాడు. సీతకి ఇంతే రాశాడనీ, ఆస్తంతా భూటాన్ లో ఒకడికి  రాశాడనీ అంటాడు. షాక్ తిన్న సీత భూటాన్ బయల్దేరుతుంది. 

     ఇదీ బిగినింగ్ లో వుండే కథనం : 25 నిమిషాల పాటు సాగే ఈ బిగినింగ్ కథనంలో ప్రధాన పాత్రగా సీత పరిచయమవుతుంది. ఆమె ప్రత్యర్ధి పాత్రగా ఎమ్మెల్యే బసవరాజు పరిచయమవుతాడు. ఇక ప్రారంభంలో మఠంలో చేరిన పిల్లాడు రామ్ హీరో పాత్ర అని తెలిసిపోతూ వుంటుంది. ఈ మూడు కీలక పాత్రల పరిచయంతో బాటు, కథకి నేపధ్యం ఏర్పాటయ్యింది. ఈ నేపధ్యం రెండు పొరలుగా వుంది. మొదటి పొర సుమారు ఇరవై ఏళ్ల  క్రిందట మఠంలో చేరిన రామ్ తో వుంది.  రెండో పొర ఇప్పుడు స్థలం కొని ఇరుక్కున్న సీత వ్యవహారాలతో వుంది. చిన్నప్పటి రామ్ తో మొదటి పొర ఒక మిస్టీరియస్ వాతావరణాన్ని సృష్టిస్తూ సినిమాకి ప్రారంభంగా వుంది. ఇది కొన్ని ప్రశ్నల్ని రేకెత్తిస్తోంది. రామ్ కి భాగ్యరాజ్ తండ్రి అన్నట్టు వుంటుంది. మరి రామ్ ని వాతలు పెట్టి కాల్చిందెవరు? సవతి తల్లా? మఠం లో రామ్ ని చేర్పించి వెళ్తూ సీత పెద్దయాక వస్తుందని అంటాడు భాగ్యరాజ్. ఈ సీతెవరు? భాగ్యరాజ్ కేమవుతుంది? ఈ ప్రశ్నలతో మిస్టీరియస్ గా మొదటి పొర వుంటుంది. అసలు మఠంలో చేరడమే ఏదో ఆధ్యాత్మిక, అతీత, విపరీత మానసిక శక్తుల మిస్టీరియస్ కోణం ఈ కథ ఓపెనింగ్ ఇమేజిగా వుంది. మరి ఈ అర్ధంలో ఓపెనింగ్ ఇమేజి రామ్ పాత్రకి బదలాయింపు జరిగిందా? ఇది కూడా చూద్దాం. 

          అయితే పిల్లాణ్ణి ఎక్కడో భూటన్ లో బౌద్ధుల మఠంలో చేర్పించడం లోని ఔచిత్యం అర్ధంగాదు. డాక్టర్ రాసిన ఇంగ్లీషు మందుల చీటీ వాళ్ళెందుకు తీసుకుంటారో తెలియదు. మఠం అంటేనే ఆధ్యాత్మిక కేంద్రం. కొన్ని సినిమాల్లో కేరళలో ఆయుర్వేద చికిత్సా కేంద్రాల్ని చూపిస్తూంటారు. అక్కడ పేషెంట్లు వుంటారు. ఈ మఠంలో  అలాటి పేషంట్ల వాతావరణ మేమీ వుండదు. పిల్లవాడు రామ్ ఒక్కడ్నే మానసికారోగ్యం బాగు చేయడానికి తీసుకోవడం వింతగా వుంటుంది. సన్యాసుల మఠంలో చేరడమంటే సన్యాసిగా మారిపోవడం కాదా? 

       ఇక రెండో పొరలో పరిచయమయ్యే సీత పాత్ర తీరుతెన్నులు ఎస్టాబ్లిష్ అయ్యాయి. మానవత్వం కంటే డబ్బు సంపాదనే ఎక్కువన్న తత్వం ఆమెదనీ, తలపొగరుతో ఎవర్నీ లెక్క చెయ్యదనీ తెలుస్తుంది. ఇప్పటి సినిమాల్లో హీరోయిన్ పాత్రలు నేటి యువ ప్రేక్షకుల్లో  యువతులకి కనెక్ట్ కాని వెనకటి తరం పోకడలతోనే ఇంకా వుంటున్నాయి. సీత కూడా అలాటి వాస్తవ దూరమైన ఫార్ములా పాత్రే. ఆమె అడ్డ మార్గాల్లో ఆర్ధికంగా ఎదిగి పోవాలనుకుంటోంది మంచిదే. సాటి మనుషులతో సెంటిమెంట్లు పక్కన బెట్టి తన ఎదుగుదల మాత్రమే చూసుకోవడం. ఇది చాలామందిలో వుండే పోకడే. అయితే ఈ నెగెటివ్ పోకడతో ఇప్పటి కాలపు అమ్మాయిలా ప్రొఫెషనల్ గా లేక పోవడమే పాత్రని నిర్ణయించడంలో జరిగిన ప్రధాన లోపం. ఒకప్పుడు తేజ టీనేజి లవ్ సినిమాలు తీస్తున్నపుడు, టీనేజర్లతో కనెక్ట్ అయ్యే మనస్తత్వాలతో పాత్రలుండేవి. ఇప్పుడు మారిన కాలంలో సీతని అలా నేటి యూత్ కి కనెక్ట్ చేయలేకపోయారు. 

          సీత పాత్ర ఎంట్రీ మిర్రర్ ఎఫెక్ట్ తో వుండడం ఇక్కడ విశేషం. సీత పెద్దయాక వస్తుందని భాగ్యరాజ్ మఠంలో రామ్ కి చెప్పాక, బస్తీ వాతావరణంతో తర్వాతి సీను ఓపెనవుతుంది. ఈ సీనులో తల్లి పిలుస్తూంటే ఒక పేద బాలిక ఖాళీగా వున్న డ్రైనేజీ గొట్టం లోంచి వస్తూంటుంది. ఆమె గొట్టం దాటిందో లేదో, భళ్ళున అది పగిలిపోతుంది. ఒక్కసారిగా ఈ షాకింగ్ దృశ్యాన్నిపరికిస్తే, ఈ గొట్టాన్ని ఒక క్రేన్ పగుల గొట్టడం కన్పిస్తుంది. ఇక వైడ్ షాట్ లో మొత్తం బస్తీలో ఇళ్ళు కూల్చే కార్యక్రమం మొదలై పోతుంది. అయితే మొదట గొట్టంలోంచి బాలిక బయటికి వస్తున్నప్పుడు - డైనమిక్స్ ప్రశ్నార్థకంగా వుంటాయి. భాగ్యరాజ్ చెప్పిన సీత ఇంత పేద పిల్లగా వుందేమిటి? ఇంత పేద పిల్ల భాగ్యరాజ్ కేమవుతుంది? ఏమీ కాదా? పేద పిల్ల సీతతో, గొప్పింటి రామ్ స్నేహమే అతణ్ణి టార్చర్ పెట్టడానికి కారణమయ్యిందా? లవ్ స్టోరీ ఇలా ఎస్టాబ్లిష్ అవుతోందా?... లాటి ప్రశ్నలతో మిస్టీరియస్ వాతావరణం కొనసాగడం.

          ఇంతలో ఇదంతా రివర్స్ అయిపోతుంది. ఇదే సీన్లో  ఒక ఖరీదైన కారు ఎంటరై,  రిచ్ గా కాజల్ అగర్వాల్ దిగడంతో షాకింగ్ గా పై ప్రశ్నలన్నీ పటాపంచలైపోతాయి. ఐతే ఆ పేద పిల్ల చిన్నప్పటి సీత కాదన్నమాట. రామ్ తో మొదలైన చిన్నప్పటి కథనం ఇంకా కంటిన్యూ కావడం లేదన్న మాట. కథనం వర్తమానంలో కొచ్చి ఏకంగా ఎదిగిన రిచ్ సీతనే  చూస్తున్నామన్నమాట. కాసేపు పజిల్ గా  వుండే ఇలాటి డైనమిక్స్, మిర్రర్ ఎఫెక్ట్ గా అమెరికన్ ఫిలిం నోయర్ లో,  దాని ఆధునిక రూపమైన నియో నోయర్ సినిమాల్లో వుంటాయి. అవసరాన్ని బట్టి ఒక సీను ముగిసి, ఇంకో సీను ప్రారంభమయ్యే సంధికాలంలో ఈ ఎఫెక్ట్ వేసి కాసేపు ప్రేక్షకుల మెదళ్ళని అటూ ఇటూ మెలికలు తిప్పి వదుల్తారు చావండని. నోయర్ సినిమాల్లో విధిగా వుండాల్సిన తొమ్మిది ఎలిమెంట్స్ లో మిర్రర్ ఎఫెక్ట్ ఒకటి. స్పెషలైజుడు జానర్ అయిన నోయర్ ఎలిమెంటు ఇక్కడ ఎందుకొచ్చిందంటే, రెగ్యులర్ కమర్షియల్స్ దేన్నైనా లాగేసుకుని సొంతం చేసుకుంటాయి మరి. రెగ్యులర్ కమర్షియల్స్ కి జానర్ మర్యాదలేముంటాయి. కొన్ని కమర్షియల్స్ కి మానమర్యాదలు కూడా వుండవు. 

          ఐతే ఇలా సీత పాత్ర ఎంట్రీతో ఈ రెండో పొర కథా నేపధ్యంతో,  ఇది హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీ అని ఇంకా స్పష్టం కావడం లేదు. ‘సీత’ అని టైటిల్ వున్నంత మాత్రాన అలా భావించుకోలేం. హీరో పాత్ర పెద్ద వాడై కథలోకి వస్తేనే అతణ్ణి బట్టి ఏ విషయం తెలుస్తుంది. హీరో పాత్ర పోషిస్తున్నది కూడా ఎవరో చిన్న హీరో కాదు. ప్రేక్షకులకి బాగా తెలిసి వున్న యాక్షన్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్. కాబట్టి అతడిది కూడా మంచి రేంజి వున్న పాత్రే అయి వుంటుందని ఎదురు చూస్తూంటారు ప్రేక్షకులు ఈ 25 నిమిషాల కథనంతో. మరి చిన్నప్పటి రామ్ తో ఆ ఆసక్తికర ‘సెటప్’,  పెద్దయ్యాక ప్రేక్షకులేసుకునే అంచనాల మేరకు ‘పే ఆఫ్’ అయ్యే క్యారెక్టర్ గానే ఎంట్రీ ఇస్తాడా లేదా చూడాలి. 25 నిమిషాలు గడుస్తున్నా హీరో ఎంట్రీ ఇవ్వలేదంటే, ఇచ్చినప్పుడు థ్రిల్ చేస్తూ ఎంట్రీ ఇవ్వాల్సి వుంటుంది. సీత ఒక్కతే మిర్రర్ ఎఫెక్ట్ వేసుకుని ధూంధాం చేస్తే చాలదు. ఆమె మిర్రర్స్ ని బద్దలు కొట్టుకుంటూ హీరో రావాలి. 

          మార్కెట్ యాస్పెక్ట్ - ఎకనమిక్స్ :  బిగినింగ్ విభాగంలో సీత పాత్రతో ఈ రెండో పొర కథా నేపధ్యంతో, ఈ సినిమా మార్కెట్ యాస్పెక్ట్ వచ్చేసి ఎకనమిక్స్ అని తెలుస్తోంది. నేటి ఎంటర్ టైనర్స్ యూత్ అప్పీల్ తో వుండాలంటే రెండే రెండు మార్కెట్ యాస్పెక్ట్స్ వున్నాయి - ఎకనమిక్స్ (మనీ), రోమాంటిక్స్ (లవ్). ఈ రెండూ కథాంశాలుగా నాడిని పట్టుకున్నఎంటర్ టైనర్స్ కి మార్కెట్ వుంటోంది. ఈ మధ్య ఎకనమిక్స్ తో వచ్చిన  ‘హుషారు’ స్లీపర్ హిట్టయిన విషయం తెలిసిందే. ఎకనమిక్స్ లేదా రోమాంటిక్స్  మార్కెట్ యాస్పెక్ట్ ని పట్టుకున్న సినిమాలు -  అవి కూడా నేటి యువతీ యువకులకి సరీగ్గా రీసెర్చి సహిత దర్పణం పట్టేవైతేనే హిట్టవుతున్నాయి. డబ్బుగురించిన ఆరాటంతో ‘సీత’ ఇలా ఎకనమిక్స్ బ్రాకెట్లో చేరింది. అయితే ఈ ఎకనమిక్స్ యాస్పెక్ట్ తో,  క్రియేటివ్ యాస్పెక్ట్ వచ్చేసి యూత్ అప్పీల్ ని తీర్చే విధంగా లేదని, ఈ బిగినింగ్ విభాగంలోనే మూస ఫార్ములా పోకడలతో తెలిసిపోతోంది.    
              
          ఇలా బిగినింగ్ విభాగంలో 1. ముఖ్య పాత్రల పరిచయాలు, 2. కథా నేపథ్యాలనే మొదటి రెండు స్క్రిప్టింగ్ టూల్స్ ఏర్పాటయ్యాక, ఇక మూడో టూల్ అయిన ‘సమస్యకి దారి తీసే పరిస్థితుల కల్పన’ ఎలా వుందో చూద్దాం. 

          సమస్యకి దారితీసే పరిస్థితుల కల్పన సీత ఎంట్రీ తోనే వుంది ఇళ్ళు పడగొట్టిస్తూ. అయితే చూస్తే ఎలా వుంటుందంటే, ఈ ఇళ్ళు పడగొట్టించడం సీత క్యారెక్టర్ ఎలాటిదో ఎస్టాబ్లిష్ చేస్తున్న ఓ శాంపిల్ సీను మాత్రమేననీ, కథకి సంబంధించి ఇంకా బిగినింగ్ కథనం మొదలవ లేదనీ అన్పించేలా వుంటుంది. కానీ కాదు. బిగినింగ్ విభాగాన్నిరొటీన్ గా,  లీనియర్ కథనంతో బలహీనంగా, బారుగా చూపించకుండా, డైనమిక్స్ తో నాన్ లీనియర్ బిగినింగ్ కథనం చేశారని, తర్వాతి సీను పబ్ సాంగ్ లో అర్ధమై ఆసక్తి రేపుతుంది. అంటే ఈ బిగినింగ్ విభాగపు కథనాన్ని, బిగినింగ్ విభాగాన్ని విభజిస్తే అందులో వుండే మిడిల్ తో ప్రారంభించి, బిగినింగ్ కొచ్చి, ఎండ్ తో ముగించారన్నమాట. 

          స్ట్రక్చర్ ఎప్పుడూ ఒక్కటే, అది మారదు. అది మెకానికల్. స్ట్రక్చర్ తో ఇలాటి చలన శీలమైన క్రియేటివిటీలే స్ట్రక్చర్ కి జీవాన్ని పోస్తాయి. స్థలం ఖాళీ చేయించి పబ్ సాంగే సుకుంటున్న సీత దగ్గరికి ఎమ్మెల్యే బసవరాజు వచ్చి, అగ్రిమెంట్ గుర్తుచేయడంతో ముందుకు పోతోందనుకుంటున్న బిగినింగ్ కథనం ఒక్కసారిగా యూ టర్న్ తీసుకుంటుంది. ఈ బిగినింగ్ కథనం ఆఫ్ స్క్రీన్ లో అసలెప్పుడో ప్రారంభమై, ఇప్పుడు మిడిల్ లో వున్నామని ఇప్పుడర్ధ మవుతుంది. మరి ఈ బిగినింగ్ విభాగంలో ఆఫ్ స్క్రీన్ లోవున్న బిగినింగ్ విభాగపు ఆ బిగినింగ్ కథనం ఏమిటి? 

          ఇది వీడియో క్లిప్పింగ్స్ లో తెలుస్తుంది. ఇప్పుడు ఈ క్లిప్పింగ్స్ లో కనపడే బిగినింగ్ సీన్స్  ఫ్లాష్ బ్యాక్ అనుకోవాలి. ఇందులో స్థల సమస్య కోసం ఎమ్మెల్యేతో సీత నెలరోజులపాటు అతడితో సహజీవనం చేసే ఒప్పందం చేసుకున్నట్టు వుంటుంది. ఇప్పుడు తిరిగి మిడిల్ కంటిన్యూ అవుతుంది. ఇప్పడు ఆ ఒప్పందాన్ని తిప్పికొట్టి అడ్డం తిరుగుతుంది. ఇది ఈ నాన్ లీనియర్ కథనానికి ఎండ్ విభాగం. ఇక ఇప్పుడు కథనం ప్రెజెంట్ టైంలో ముందుకు వెళ్తుంది. ఆమెని కామించిన బసవరాజు రెచ్చిపోయి ఆమెకి ఇబ్బందులు సృష్టించడం, ఆ ఇబ్బందుల్లో చందూలాల్ అప్పు తీర్చే ఇబ్బంది ప్రధాన మైనది కావడం వంటి కథనం వుంటుంది. ఇలా సమస్యకి దారి తీసే పరిస్థితుల కల్పనలో ఒక పార్టు  చేసుకొచ్చారు. అయితే ఇది తూతూ మంత్రంగా వుంటే సరిపోతుందా? ఇది ఈ బిగినింగ్ విభాగపు ముగింపులో వచ్చే ప్లాట్ పాయింట్ వన్ దగ్గర్ సీతకి సరైన గోల్ ని ఏర్పాటు చేస్తుందా? చూద్దాం...

       సీతకి ఆ స్థలం ఖాళీ చేయించడం కావాలి : ఎమ్మెల్యేకి బదులుగా ఆమెతో సహజీవనం కావాలి. అప్పుడా ఎమ్మెల్యే ఏమనాలి? ముందు సహజీవనం చెయ్, అప్పుడు ఖాళీ చేయిస్తాననాలి. సింపుల్. అంతేగానీ ఖాళీ చేయించి పడుకోబోతే తంతుంది. ఇప్పుడా పనే చేసింది. ముందు పడుకో, తర్వాత అడుక్కో అనాలి. సింపుల్. అయితే తను రాస్తున్న కథకి కథా సౌలభ్యం కోసం కథకుడు కామన్ సెన్సు నీ, పాత్రల్నీ కిల్ చేస్తున్నాడు. సరే ఎమ్మెల్యే ఏదో అనుకున్నాడు. మళ్ళీ దీనికి రిటెన్ అగ్రిమెంటు ఆమె సంతకంతో సహా దేనికి? తనే ఇరుక్కోవడానికా ఆమె కంప్లెయింట్ చేస్తే? ఆ వీడియో క్లిప్పింగ్స్ ఏమిటి తన వెధవాయి తనానికి సాక్ష్యంగా?  

          ఇక సీత వైపు చూస్తే, ఆ కబ్జా చేసి వున్న స్థలాన్ని ఎలా కొంది పదికోట్లు పెట్టి? ఆ స్థలం ఎప్పుడో పాతికేళ్ళ క్రితం దేశాంతరం వెళ్ళిపోయిన ఎన్నారై దన్నారు. ఇంకెవరో దొంగ పత్రాలతో అమ్మితే కొనేయడమేమిటి? ఇక్కడ షాపింగ్ కాంప్లెక్స్ కట్టాలని ఆలోచన. అందుకు లోను తీసుకోవాలన్నా ఒరిజినల్ పత్రాలుండాలిగా? 

          సీత కథకి ఒక ఫ్లాష్ బ్యాక్ వుంటుంది. ఇది మిడిల్ విభాగంలో వస్తుంది. అందులో సీత ఈ స్థలం ఎలా ఎందుకు కొన్నదో తెలుస్తుంది. ఆమె రిచ్ గా ఎదగడానికి తండ్రిని యాభై కోట్లు అడిగితే, అతను కష్టంగా ఏడు కోట్లు ఇస్తాడు. ఆ డబ్బుతో సంవత్సరంలో వంద కోట్లు సంపాదించి చూపిస్తానని వచ్చేస్తుంది. ఆ ఏడు కోట్లకి ఇంకో ఐదు కోట్లు చందూలాల్ దగ్గర ఆప్పు చేసి,  పది కోట్లతో ఈ స్థలం కొందన్నమాట.

          అసలే ఎన్నారై స్థలం, దాన్ని ఇంకెవరో అమ్మాడు, ఆ స్థలంలో ఇళ్ళేసుకుని జనాలు. ఐనా కొనేయడమేమిటి? కాపాడమని ఎమ్మెల్యేని ఆశ్రయించడ మేమిటి? ఎమ్మెల్యే తో సహజీవన ఒప్పందం చేసుకోవడమేమిటి? సరే, తర్వాత అడ్డం తిరగడం కోసమే ఎమ్మెల్యేని బురిడీ కొట్టించిందనుకుందాం - పాత్ర తత్వం ఇదే కాబట్టి - కానీ అడ్డం తిరిగినప్పుడు, అతను  మేనిఫెస్టోనే పట్టించుకోలేదు, కాబట్టి తనెందుకు అగ్రిమెంట్ ని కేర్ చేస్తానని  సిల్లీగా అనడమేమిటి?  నేనే అగ్రిమెంటు బయట పెడతాను, నిన్ను ‘మీటూ’ బకరాని చేస్తా - అని స్ట్రాంగ్ డోసు ఇవ్వక? 

          సమస్యకి దారితీసే పరిస్థితుల కల్పనని ఇలాటి బలమైన మలుపుకి తీసుకురాకుండా,  ఇద్దరి  వైపు నుంచీ  కూడా పైపై పాత్ర చిత్రణ, కథనం చేశారు. ఇదిలా వుంటే,  ఇక చందూలాల్ అప్పుతీర్చే కీలక పాయింటు. ఈ పాయింటు మీదే మొత్తం సినిమా అంతా నడుస్తుంది. ఇది సినిమా స్థాయికి చాలని పాయింటుగా కన్పించడమే గాక, ఇది కూడా పైపైన తేలిపోయే మలుపు.  

          ఆరు నెలలు గడువు పెట్టి అప్పు తీసుకుంది. ఇప్పుడు ఎమ్మెల్యేతో గొడవల కారణంగా మూడు నెలలకే తీర్చమని బెదిరింపులు వస్తున్నాయి. తీర్చనవసరం లేదు. గడువు తీరినపపుడే తీర్చవచ్చు. ఎక్కడ పంచాయితీ పెట్టినా ఇదే తీర్పు. కోర్టు కెళ్ళినా ఇదే మందలింపు  వస్తుంది - అప్పు పత్రాలుంటే. లేకుండా నోటిమాటగా అనామతు ఖాతా అయితే చందూలాలే శుభ్రంగా మట్టి కొట్టుకు పోతాడు. ఆమె ఇచ్చినప్పుడు తీసుకోవాల్సిందే.  ఇది తెలుసుకోకుండా, అప్పుతీర్చడం కోసం సినిమా అంతా పరుగులు తీస్తూనే వుంటుంది సీత! అయినా క్యాలిక్యులేటర్ అవసరం లేదనుకుంటే ఏమనలేం. 

      ఇక సమస్యకి దారితీసే పరిస్థితుల కల్పనలో  రెండో పార్టు చూస్తే :  చందూలాల్ అప్పు చెల్లించే వర్రీతో వున్న సీతకి తండ్రి పోయాడని తెలిసి ఐడియా వస్తుంది. తండ్రి కున్న ఆస్తి ఐదువేల కోట్లు తనదే అనుకుని బయల్దేరుతుంది. అంటే పాత్రకి తండ్రికి చేసిన చాలెంజి ప్రకారం, తానుగా వందకోట్లు సంపాదించి  చూపాలన్న ధ్యేయం కూడా ఇప్పుడు లేదన్న మాట. చనిపోయిన తండ్రి ఆస్తి కొట్టేయాలని బయల్దేరుతుంది. తను నెగెటివ్ పాత్రే, కానీ అర్ధం పర్ధం లేని నెగెటివ్ పాత్ర. ఇలా ఎందుకు జరిగిందంటే ట్విస్టుల మీద ట్విస్టులతో కథనం నడపడం వల్ల. 2007 లో ఇలాగే ‘క్యాష్’ అనే హిందీ మల్టీ స్టారర్ వచ్చింది. ఇది ట్విస్టుల మీద ట్విస్టులకి పరాకాష్టగా అట్టర్ ఫ్లాపయింది. 

          ఈ పాతిక నిమిషాల కేవలం ఉపోద్ఘాతంగా వుండాల్సిన  బిగినింగ్ విభాగంలోనే సీతకి ఎన్ని ట్విస్టులు. ఇంకా కథే ప్రారంభం కాలేదు, అప్పుడే ఎన్ని ట్విస్టులు, ఎన్నికష్టాలు. బిగినింగ్ బిజినెస్ ధర్మానికే విరుద్ధంగా ఈ కష్టాలు, ట్విస్టులు. ఈ బిగినింగ్ విభాగం చూస్తూంటే ల్యాండ్ కొన్నది, ఇరుక్కుంది. ఎమ్మెల్యేని అడిగింది, అక్కడా ఇరుక్కుంది. ఎమ్మెల్యే అగ్రిమెంటుని తిప్పి కొట్టింది, ఇరుక్కుంది. ఎమ్మెల్యే వెంటాడేడు - ఆమె క్రెడిట్ కార్డులని బ్లాక్ చేయించాడు (ఎలా చేయిస్తాడు), మళ్ళీ ఇరుక్కుంది, ఖాళీ చేయించిన ఆమె స్థలంలో మళ్ళీ జనాల్ని ఎగదోశాడు, ఇరుక్కుంది, చందూలాల్ ని ఎగదోశాడు, ఇరుక్కుంది...ఇన్ని ట్విస్టుల్లోంచి ఫాదర్ చనిపోయాడన్న ట్విస్టు, ఇందులోంచి ఫాదర్ ఆస్తి కొట్టేయాలన్న ట్విస్టూ... 

          సమస్యకి దారి తీసే పరిస్థితుల కల్పనకి ఇన్ని ట్విస్టులా? ఇన్ని కష్టాలా? ల్యాండ్ కొన్నాక, ఎమ్మెల్యేతో అగ్రిమెంట్ తో అలాగే కథ చేయాలనుకుంటే - పూర్తిగా సింప్లీఫై చేసేయ వచ్చు కథనాన్ని. చందూలాల్ లేకుండా సొంత డబ్బుతోనే స్థలం కొనుక్కోవచ్చు. అదీ అడ్వాన్సు మాత్రమే ఇచ్చి వుండొచ్చు. తర్వాత జనాల్ని ఖాళీ చేయించేందుకు అలాగే ఎమ్మెల్యేతో సహజీవన అగ్రిమెంట్ (ఇది కామన్ సెన్సు కాకపోయినా వదిలేద్దాం మాట వరసకి) చేసుకున్నాక, ఎమ్మెల్యే సహజీవనానికి వొత్తిడి చేస్తున్నప్పుడు, ఆమె తండ్రి చనిపోయిన వార్త వస్తే సరిపోవచ్చు. ఇంటికి వెళ్లి వచ్చి అగ్రిమెంట్ పూర్తి చేస్తానని ఆమె అంటే ఎంతటి మదన కామరాజూ ఈ పరిస్థితిలో కాదనక పోవచ్చు. అప్పుడు ఆమెకి తండ్రి ఆస్తి కొట్టేయాలన్న ఐడియాలే వచ్చి వుండకపోవచ్చు. ఎమ్మెల్యేతో  ట్విస్టులూ కష్టాలూ లేవు కాబట్టి - ఒక్క అగ్రిమెంట్ తప్ప. అప్పుడు వంద కోట్లు సంపాదిస్తానని తండ్రికి చేసిన ఛాలెంజి కే కట్టుబడే వుండొచ్చు తను. తను నెగెటివే. ఆ నెగెటివిజం తండ్రితో చాలెంజి చేయడం వరకే. తండ్రి చనిపోయింది చూసి ఆస్తి కొట్టేయడానికి కాదు- నెగెటివిజానికి కూడా ఇగో వుంటుంది. ఆ ఇగోతో చాలెంజిని పూర్తి చేయాలనే ప్రయత్నిస్తుంది తప్ప, సందు దొరికింది కదాని తండ్రి ఆస్తిని కొట్టేసే నీచానికి పాల్పడదు. అన్ని ట్విస్టులూ కష్టాలూ పెట్టారు కాబట్టే పాత్రకి తండ్రి ఆస్తిని  కొట్టేసే అయిడియా తప్పని సరయింది పరమ తప్పుడుగా. 

        సింపుల్ గా స్థలం కొన్నది, ఎమ్మెల్యేతో అగ్రిమెంటు చేసుకుంది, తీరా అగ్రిమెంటు పైకి తీసేసరికి తండ్రి చనిపోయి అగ్రిమెంటు పెండింగులో పడిపోయింది - ఇలా కేవలం మూడే మూడు కీలక సన్నివేశాల ఆధారంగా బిగినింగ్ లో కథని సింపుల్ గా  సెటప్ చేయవచ్చు. తర్వాత మిడిల్లో నడపబోయే కథని మాత్రమే బిగినింగ్ అందుకవసరమైన అంశాలతో సెటప్ చేస్తారు. అంతే గానీ బిగినింగ్ లోనే సెటప్ చేసి,  బిగినింగ్ లోనే కథ నడపరు. క్యాలిక్యులేటర్ పగిలిపోతుంది. 

          మరి కేవలం ఇంతే వుంటే పాతిక నిమిషాల కథనం ఏముంటుంది? ఈ విషయానికే వద్దాం. ఇది ఎకనమిక్స్ మార్కెట్ యాస్పెక్ట్ తో వున్న కథ కాబట్టి,  ఇందులో రోమాంటిక్స్ వుండకూడదా? ఎందుకుండ కూడదు - రోమాంటిక్స్ లో ఎకనమిక్స్ లేకున్నా చెల్లుతుందేమో గానీ, ఎకనమిక్స్ లో రోమాంటిక్స్ లేకపోతే  చెల్లుబాటు కాదు.  ‘సీత’ అనే ఈ స్టార్స్ వున్న కమర్షియల్, బొత్తిగా రోమాంటిక్స్ లేని ఎకనమిక్స్ గా, ఎడారిలా డ్రైగా వుండిపోయింది. విలన్ కోరికలతో హీరోయిన్ తో ఎరోటిక్ ప్లే లేకుండా, హీరో హీరోయిన్ల మధ్య రోమాన్సు కూడా లేకుండా, భూటాన్ సన్యాసుల మఠం లాగే వుంది. ఎకనమిక్స్ గ్రౌండ్స్ మీద ఎరోటిక్ - రోమాంటికల్ థ్రిల్లర్ గా వుండాల్సిన ఈ కమర్షియల్, క్యాలిక్యులేటర్ లేక జ్వరానపడి ధర్మామీటర్ ని డిమాండ్ చేస్తోంది. 

          అందుకని దీనికి వాత్సాయన చికిత్స ఏమిటంటే, ఇంకా హీరో ఎంట్రీ ఇవ్వలేదు, విలన్ కామాకలిని వాడు కూడా మనిషే అని గుర్తించి, ఆ పరమైన ఎరోటిక్ ప్లే హీరోయిన్ తో చేసుకునే అవకాశం కల్పించాలి. ఇది ముందు కథ కవసరమైన సెటప్. ఇది బిగినింగ్ విభాగాన్ని భర్తీ చేస్తూ ఎంటర్ టైన్ కూడా చేస్తుంది. 

          ఇప్పుడిక సీత తండ్రి అంత్యక్రియలకి వెళ్ళడం ప్లాట్ పాయింట్ వన్ ఘట్టం. అంటే సమస్యకి దారితీసే పరిస్థితుల కల్పన చేసుకొచ్చిన ఫలితంగా, ఇక బిగినింగ్ ని ముగిస్తూ సమస్యని - అంటే ప్లాట్ పాయింట్ వన్ ని ఏర్పరచడం. ఈ సమస్య లోంచి పాత్రకి గోల్ ని పుట్టించడం. ఈ గోల్ తో మిడిల్ ని ప్రారంభిస్తూ కథ నడపడం. ఏ క్యాలిక్యులేటర్ దీన్ని కాదంటుంది. పాతకి తాతల్లాంటి తెలుగు సినిమాల్లో చూసినా ఇదే క్యాలిక్యులేటర్ నేతుల వాసనతో వుంటుంది. క్యాలిక్యులేటర్ కి తాతలు తాగిన నేతుల వాసనే వుంటుంది. తాతల దగ్గర పుట్టి ప్రవహించకుండా ఏ సినిమా కథా లేదు. 

          ఇక తండ్రి రాసిన వీలునామాలో తల్లికి చెందిన మంగళ సూత్రం  మాత్రమే తనకి దక్కి,  మిగతా అయిదు వేల కోట్ల ఆస్తీ ఎక్కడో భూటాన్ వాడికి దక్కడం ప్లాట్ పాయింట్ వన్ సీను. షాకయిన సీత,  భూటాన్ బయల్దేరడం మిడిల్ ప్రారంభం. అంటే ఈ సినిమాకి కథా ప్రారంభం.

(మిడిల్ రేపు)
సికిందర్
telugurajyam.com